తల్లివి నీవే తండ్రివి నీవే!-21

0
3

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

నవ నామమాలిక

నారద తు – తదర్పిత అఖిలాచరత

తద్విస్మరణే పరమ వ్యాకులతేతి (నారద భక్తి సూత్రాలు – 19).

[dropcap]ప్ర[/dropcap]తి అడుగూ, ఆలోచన, కర్మ, నీకే, నీ కొరకే అని ఆ శ్రీహరిని ఆశ్రయించగలగటం, శ్రీమన్నారాయణుని విస్మరణే బాధలన్నిటికీ కారణం అని తెలుసుకొనగలగటం నిజమైన భక్తి.

జీవితంలో ఏ రకమైన మార్పూ, ఆనంద విషాదాలు లేకుండా సమయం గడిచిపోతోంది. నాకు ఊహ తెలిసింది. నేను కూడా మా తల్లికి (ఆ జన్మలో) సహాయముగా ఉండేవాడిని. ఇతరత్రా కార్యములు నా వయసుకు తగినట్లు అప్పగిస్తే చేతనైనంత బాగుగా చేయుటయే తెలుసు.

ఆ ఒకానొక సందర్భంలో, నన్ను చాతుర్మాస్యాలలో పర్జన్యుడు విజృంభించే వర్షాకాలం మొదలు నాలుగు నెలలూ ఒకే స్థానంలో నివాసం ఏర్పరచుకొనిన కొందరు యోగిజనుల సేవనిమిత్తమై ఆ కుటుంబీకులు నియమించారు.

ఆ పెద్దల ఆనతి శిరసా వహిస్తూ నేను వారికి సేవ చేస్తూ ఉండేవాణ్ణి. ఆ మహానుభావులకు పరిచర్యలు చేసేవాణ్ణి. ఓర్పుతో, నేర్పుతో, భయభక్తులతో ప్రవర్తించేవాణ్ణి. తోటిపిల్లలతో ఆటపాటలకు పోకుండా, ఎటువంటి ఇతర సంబంధాలూ పెట్టుకోకుండా శ్రద్ధాభక్తులతో ఆ మహాత్ముల్ని కొలిచేవాణ్ణి. వారికి ఉపయోగ పడటానికి సదా జాగరూకుడనై వారికి దగ్గరలో అందుబాటులో ఉండేవాడిని.

నేనా యోగిజనులు భుజించిన అనంతరం వారి భిక్షాపాత్రలలో మిగిలి ఉన్న ఉచ్ఛిష్ఠాన్ని స్వీకరించే వాడిని. ఎండ అని, వాన అనీ లేకుండా వారి ముందు నిలబడి, ఎంతో జాగ్రత్తగా మారు మాట్లాడకుండా వారి ఆజ్ఞలు పాలించేవాడిని. ఈ ప్రకారంగా వర్షాకాలం, శరత్కాలం గడచిపోయాయి. నా పద్ధతి చూసిన ఆ మహానుభావులకు నా మీద అనుగ్రహం కలిగింది.

వారికి సేవ చేసిన ఆ నాలుగు నెలల కాలంలో నాకు ప్రాజ్ఞులైన ఆ బ్రహ్మజ్ఞులు శ్రీ కృష్ణుని కథలు చదువుతూ, హరి లీలలు వర్ణిస్తూ హరినామ సంకీర్తనం చేస్తూ ఉండటం వల్ల, అనుక్షణం ఆ పుణ్యాత్ముల నోటినుండి వచ్చే ఆ పలుకులు అమృత రసప్రవాహాలై నా నరనరానా ఇంకిపోయినాయి. నా హృదయం ఆనందంతో నిండిపోయేది. క్రమక్రమంగా నేను ఇతర విషయాలన్నింటికి స్వస్తి చెప్పి భగవానుడైన శీహరిని ఆరాధించటం ఆరంభించాను నాకు తెలియకుండానే.

మహాత్ములైన ఆ యోగీంద్రుల అనుగ్రహంవల్ల రజస్తమోగుణాలను రూపుమాపే అచంచల భక్తి నాకు సంప్రాప్తించింది. చాతుర్మాస్య వ్రతం అనంతరం ఆ మహాత్ములు వేరే ప్రదేశాలకి వెళ్లటానికి ఉద్యుక్తులైనారు.

ఈ విధంగా ఎట్టి ఒడిదుడుకులు రాకుండా, బాలక సహజమైన చిత్త చాంచల్యాలు లేకుండా ముప్పూటలా భక్తితో వారిని ఆరాధించినందుకు ఆ సాధుపుంగవులు సంప్రీతులైనారు.

<<<ఇదంతా భాగవతారాధన యొక్క గొప్పతనం తెలిపే రమణీయమైన గాధ. భాగవతుల అనుగ్రహం భగవదనుగ్రహంకన్నా మిన్న అని పెద్దలు నుడివినారు. అందుకే ఆ బాలకునికి ఆ కాలానికి తగిన విధంగా, అత్యంత వేగంగా శ్రీహరి కృప లభించింది.>>>

ఎంతో సంతోష కారుణ్య వాత్సల్యాలతో అతిరహస్యము, అమోఘము అయిన ఈశ్వరవిజ్ఞానాన్ని ఆ మహాత్ములు నాకు ఉపదేశించారు.

<<<వారు ఉపదేశించింది, నారదముని తన పూర్వ జన్మలో గ్రహించినదీ ఈనాడు మనం భగవద్గీతలో తెలుసుకునే, కర్మ జ్ఞాన భక్తి యోగాల సారాంశమే!>>>

వాసుదేవుని మాయాప్రభావాన్ని నేను కూడా ఆ మహనీయుల మహోపదేశం వల్ల తెలుసుకున్నాను. తాపత్రయాన్ని రూపుమాపే పరమౌషధం ఈశ్వరార్పణం చేసిన కర్మమే. మన కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే ఆ కర్మల యొక్క ఫలితము మననంటదని గీతా వాక్యం కదా. అంటే కర్మబంధనాలలో చిక్కము అని.

కర్మలు భవబంధ కారణాలే అయినప్పటికీ, ఈశ్వరార్పణం చేయటం మూలాన తమ అస్తిత్వాన్ని అవి కోల్పోతాయి. పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసే కార్యం విశిష్టమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందువల్ల ఈశ్వరుడు సంతోషించి అచంచల భక్తిని అనుగ్రహిస్తాడు.

భగవంతుని ప్రబోధం వల్ల కర్మలు కావించేవారు శ్రీ కృష్ణ గుణ నామాలను కీర్తించటంలో, సంస్మరించటంలో ఆసక్తులౌతారు. ఓంకారపూర్వకంగా వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ నామాలు నాలుగింటిని భక్తితో ఉచ్చరించి నమస్కరించి చిన్మయ స్వరూపుడైన యజ్ఞేశ్వరుణ్ణి ఆరాధించే మానవుడు సమ్యగ్దర్శనుడై సమదృష్టి కలవాడౌతాడు.

అటుపైన నేను వీలైనంత మౌనాన్ని పాటిస్తూ శ్రీహరి లీలలను గూర్చి తెలుసుకొనే ప్రయత్నాలు చేస్తూ, శ్రీహరినే స్మరిస్తూ ఆ ఇంటనే ఉండిపోయినాను. నాకు ఆ దేహరూప జన్మనిచ్చిన తల్లిది జాలిగుండె. అమాయకురాలు. తల వంచుకొని యజమానుల గృహాల్లో పనులన్నీ క్రమం తప్పకుండ చేసేది. తన దాస్యాన్ని గూర్చి కించిత్తు కూడా కించపడేది కాదు. కేవలం తాను చేయవలసిన పని గూర్చి మాత్రమే ఆలోచించి దానిని సక్రమముగా పూర్తి చేయటం మీదనే దృష్టి పెట్టేది.

నేనంటే ఆమెకు పంచప్రాణాలు. నా బిడ్డ అలసిపోయాడు, ఆకలి గొన్నాడు అని భావిస్తూ ప్రతిరోజూ నన్ను ఆదరించి పెంచి పెద్దచేసింది అప్పటి వరకూ. ఈ విధంగా ఆ తల్లి ప్రేమతో పెరిగిన నేను ఆమెను విడిచి పోలేక ఇంట్లోనే ఉండిపోయాను. అయితే నేను అదృష్టవశాత్తూ ఆ భాగవతులు అనుగ్రహించిన ఙ్ఞాన సంపద వల్ల సంసారవ్యామోహంలో చిక్కుబడలేదు. జ్ఞానాన్ని విడువలేదు. అలా మౌనిగానే ఉండేవాడిని.

ఒకనాడు ఆ తల్లి ఎందుకో రాత్రివేళ కటిక చీకటిలో ఆవు పాలు పిండటం కోసం ఇల్లు వదలి బయటికి వెళ్లింది.

<<<ఇది భగవల్లీల. ఆ బాలునికి మిగిలిన కర్మ బంధనం తొలగటానికి విశ్వశక్తి కల్పించిన సంఘటన>>>

త్రోవలో ఆమె ఒక పామును త్రొక్కింది. ఆ సర్పం ఆమె పాదాన్ని కరచింది. అత్యంత భయంకరమైన ఆ త్రాచుపాము కోరలలోని విషాగ్ని జ్వాలల వల్ల నాకు ఆ జన్మనందించిన తల్లి నేల మీద పడిపోయింది.

అప్పుడు నేను ఆ విషాదదృశ్యాన్ని చూసి ఏ మాత్రం కలవరపడకుండా, నా చిత్తం శోకాన్నిపొందకుండా, నిబ్బరించుకొని నిలబడ్డాను. “బంధం తెగిపోయింది,” అనుకొన్నాను. ఇక నాకు హరిచరణస్మరణమే అవశ్యకర్తవ్యమని నిర్ణయించుకొన్నాను. యజమానులతో నాకు సంబంధం లేదు. అయినా, అనుమతి పొంది..

నేను ఉత్తర దిక్కుగా బయలుదేరి జనపదాలు, పురాలు, పట్టణాలు, గ్రామాలు, పల్లెలు, వ్రేపల్లెలు, భిల్లవాటికలు, అడవులు దాటుకొంటూ ఖనిజాలతో చిత్రమైన రంగులద్దుకున్న పర్వతాలూ మొదలైనవి దాటుకుంటూ ముందుకు సాగాను. అప్పుడు నాకు ఆకలీ దప్పికా ఎక్కువయ్యాయి. ఒక ఏటి మడుగులో శుభ్రంగా స్నానం చేసి నీరు త్రాగి నా మార్గాయాసాన్ని తగ్గించుకొన్నాను.

అంతట..

తోడేళ్ళు, కోతులు, ఎలుగుబంట్లు, అడవివరాహాలు, ఏనుగులు, దున్నపోతులు, ముళ్ళపందులు, గుడ్లగూబలు, శరభమృగాలు, శార్దూలాలు, కుందేళ్లు, మనుబోతులు, ఖడ్గమృగాలు, క్రూరసర్పాలు, కొండచిలవలు నిండిన భయంకరారణ్యాల గుండా మళ్లీ ప్రయాణించాను.

<<<చూడండి. ఇంత దుర్భరమైన పరిస్థితులలో పెరిగి, నా అన్న వారు లేక, కేవలం ఒక దాసి అయిన తల్లి మాత్రమే తనకు దిక్కుగా ఉండి పెంచి పెద్దజేసి, ఈడు రాకమునుపే దర్మరణం పాలైతే, భాగవతుల కృపవల్ల కలిగిన జ్ఞాన సంపద మాత్రమే తోడు రాగా ఆ నారద పూర్వ రూప బాలకుడు ఈ కఠోర ప్రయాణం చేశాడు. అందుకే ఆయన ధృవుని వంటి పసి పిల్లల కష్టాలకు కరిగిపోయాడేమో! అందుకే ఆ బాలకుని ఉద్ధరించేందుకు తన వంతు సహాయమందించాడేమో!>>>

దాట శక్యం కాని నీలితుప్పలు, వెదురు పొదరిండ్లు దగ్గరగా గల ఒక రావిచెట్టు (గుర్తుంచుకోండి. తెలుసు కదా) కింద కూర్చున్నాను. నేను విన్న విధంగా నా హృదయంలో పదిలం చేసుకున్న పరమాత్మ స్వరూపుడైన శ్రీహరిని ధ్యానం చేశాను.

నా కళ్ళల్లో ఆనందబాష్పాలు పొంగిపొర్లాయి. నా శరీరమంతా పులకించింది. ఆ భక్తి పారవశ్యంలో భగవంతుని చరణాలు ధ్యానిస్తున్న నా చిత్తంలో ఆ దేవదేవుడు సాక్షాత్కరించాడు. నేను కన్నులు తెరచి చూచేసరికి భక్తుల దుఃఖాలను పటాపంచలు చేసే పరమేశ్వరుని స్వరూపం అదృశ్యమైపోయింది. ఆ దృశ్యం ఈ చక్షువులకు అందదు.

నేను విచారంతో లేచి నిల్చున్నాను. మళ్లీ ఆ దేవదేవుని దివ్యస్వరూపాన్ని దర్శించాలనే ఉత్కంఠతో నిర్మానుష్యమైన ఆ అరణ్యంలో అటూ ఇటూ తిరుగసాగాను. కాని నాకు తిరిగి ఈశ్వర సాక్షాత్కారం కలుగలేదు. అంతలో మాటలలో వివరించ సాధ్యం కాని వాడు అయిన శ్రీహరి మధుర గంభీర వచనాలు నా శోకాన్ని ఉపశమింపజేస్తూ నన్ను ఓదారుస్తూ ఈ విధంగా వినవచ్చాయి.

All this more or less parallels to Chaturmukha Brahma’s search for SriHari (before Chatuh Sloki Bhagavata narration).

శ్రీహరి ఉపదేశము.

॥గురుర్గురుతమో ధామ॥

209) గురుః – ఆత్మవిద్యను బోధించువాడు.

210) గురుతమః – గురువులకు గురువైనవాడు. (గురుత్తమః). నారదునికీ గురువే.

211) ధామః – జీవులు చేరవలసిన పరమోత్కృష్ణ స్థానము అయిన వాడు. ఇంకెవరున్నారు కనుక గమ్యం?

నాయనా! ఎందుకా వృథా ప్రయాస? నీవు ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నన్ను దర్శించలేవు. కామక్రోధాది అరిషడ్వర్గాలను జయించి నిర్మూలితకర్ములైన ముని ముఖ్యులే నన్ను చూడ గల్గుతారు. అంతే కాని జితేంద్రియులు కానివారు నన్ను దర్శించలేరు. (భాగవతుల ద్వారా ఉపదేశం అయినా కూడా, ఈశ్వరార్పణ పూరితమైన కర్మ చేయటం తెలసినా కూడా, ఆ బాలుడు తల్లితో బంధం కొరకు ఆగాడు. తల్లిని కూడా తనతో తీసుకొని వెడలవచ్చుగా? ఆ మాతృమూర్తికి తనకు పంచబడిన జ్ఞానాన్ని పంచవచ్చుగా? – భవదీయుడి అజ్ఞానంతో కూడిన మాటలు మాత్రమే!) అయినా నీ మనసులోని కోరికను కొనసాగించటం కోసం క్షణ కాలం నా స్వరూపాన్ని నీకు స్ఫురింపజేశాను.

వత్సా! నా యందు లగ్నమైన నీ కోరిక వ్యర్థం కాదు. నీ సమస్త దోషాలూ దూరమౌతాయి. నన్ను సేవించటం వల్ల నా యందు భక్తి అచిరకాలంలోనే నీమదిలో పదిలమౌతుంది. నా యందు లగ్నమైన నీ హృదయం వచ్చే జన్మలో కూడా నన్ను అంటిపెట్టుకొని ఉంటుంది. నీవు ఈ దేహాన్ని వదలిన అనంతరం నా అనుజ్ఞతో మరు జన్మలో నా భక్తుడివై జన్మిస్తావు.

ఈ సృష్టి యావత్తూ లయమైపోయిన పిమ్మట వేయి యుగాలు చీకటి రాత్రిగా గడిచిపోతుంది. ఆపైన తిరిగి సృష్టి ఏర్పడుతుంది. తగిన సమయమున నీవు మళ్లీ జన్మిస్తావు. నీకు పూర్వస్మృతి ఉంటుంది. నా అనుగ్రహం వల్ల నీ దోషాలన్నీ నశించి సత్వ గుణసంపన్నులైన హరిభక్తులలో అగ్రగణ్యుడవై ప్రసిద్ధుడవు అవుతావు.

నారద జన్మము – బ్రహ్మ మానసత్వం

ఈ విధంగా చెప్పి విరమించిన సర్వవ్యాపి, సర్వనియంత, వేదమయమూ అయిన ఆ శ్రీమహావిష్ణువుకు నేను శిరసు వంచి ప్రణమిల్లాను. మ్రొక్కాను. ఆ వాసుదేవుని కరుణానుగ్రహానికి ఆనందించాను.

మదాన్ని వీడాను.

మాత్సర్యాన్ని దిగనాడాను.

కామాన్ని అణచిపెట్టాను (వదలలేము కనుక అణచి ఆ శ్రీహరినే కోరాలి. అలా మన ఇంద్రియాలను నిర్దేశించాలి).

క్రోధాన్ని త్యజించాను. జితక్రోధః

లోభాన్ని, మోహాన్ని వదలివేసాను.

సంకోచం లేకుండా గొంతెత్తి ఆ అనంతుని అనంతనామాలు ఉచ్చరిస్తూ, పరమపవిత్రాలయిన హరి చరిత్రలను స్మరిస్తూ, నిత్యసంతుష్టుడనై వాసుదేవుని హృదయంలో పదిలపరచుకొన్నాను.

<<<అంటే ఎన్నో కల్పాల కాలం నుంచీ శ్రీవిష్ణు సహస్రనామాలు ఉంటూనే ఉన్నాయి.>>>

ప్రశాంతమైన అంతఃకరణంతో వైరాగ్యాన్ని అవలంబించి కాలాన్ని నిరీక్షిస్తూ తిరుగసాగాను. కొన్నాళ్లకు మెరుపు మెరిసినట్లుగా మృత్యుదేవత నా ముందు ప్రత్యక్షమయింది. అప్పుడు నేను పంచభూతాత్మకమైన పూర్వదేహాన్ని పరిత్యజించి భగవంతుని దయవల్ల సత్త్వగుణాత్మకమైన భాగవతదేహంలో ప్రవేశించాను.

తర్వాత కల్పాంతకాలంలో ఏకార్ణవమైన జలమధ్యంలో శ్రీమన్నారాయణుడు శయనించి ఉన్న సమయాన, బ్రహ్మదేవుని నిశ్వాసంతో పాటు నేనూ భగవానుని ఉదరంలో ప్రవేశించాను. వెయ్యి యుగాలు గడిచిపోయిన తర్వాత లేచి లోకాలు సృష్టించ తలచెడి బ్రహ్మదేవుని నిశ్వాసం నుంచి మరీచి మొదలైన మునులు, నేను జన్మించాము.

ఈ విధంగా బ్రహ్మ మానస పుత్రులుగా జన్మించిన వారిలో అగ్రగణ్యుడు నారదముని. మౌనిగా ఉన్నాడు కదా ఆయన ప్రాచీన జన్మలో! అందుకే ముని.

గత జన్మలోనే శ్రీహరి అనంత నామాలనూ సంకీర్తన చేసిన అదృష్టవంతుడాయన. ఇక నారదుడిగా జన్మ! ఏమి భాగ్యము!

ఆ నారద ముని ప్రాచీన జన్మలో హృదయంలో దర్శనమిచ్చాడు శ్రీహరి. తరువాత జన్మములో కూడా అదే సత్యమైనది. నారద హృదయ విహారి.

ఇప్పుడు చూద్దాము!

– జీవులు పుట్టి పెరుగుటకు కారణమైన వాడు ఎలా ఉంటాడు?

సర్వ జీవ కోటి యందు అంతర్యామిగా!

– సర్వ జీవ కోటి యందు అంతర్యామిగా ఉండేవాడు ఎవరు?

సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు.

– సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు ఏమి చేస్తాడు?

జీవులందరిని పోషిస్తాడు.

– జీవులందరినీ పోషించువాడు అలా ఎంతకాలం చేయగలడు?

అనాది నుంచీ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు, ఈ క్షణాన చేస్తున్నాడు. భవిష్యత్‌లో కూడా చేస్తూనే ఉంటాడు.

నారదముని మూడు జన్మలు చూశాము కదా!

ఆయన ఓజస్సు సహస్సుతో నారదమునిని పోషించుచున్నాడు కనుక వషట్కారః.

నారద మునితో సహా అందరిలో, అన్నిటిలో వ్యాపించి ఉన్నాడు కనుక విష్ణువు.

ఆ వ్యాపకుని అసలు రూపం, నిరూపం.. విశ్వమ్!

ఇక్కడికి ఇదంతా n = నారద (m) వద్ద నిరూపితమైనది.

ఇక మిగిలింది n = m+1, or n = m-1 as we’re going through descending order here.

ఇప్పుడు మనకు చాల దగ్గర చరిత్రలో ఉన్న వ్యాస మహర్షినే చూద్దాము. ఎంత విష్ణ్వంశ అయినా, నారదముని ఉపదేశము అవసర పడింది కనుక

n = m-1 = వ్యాస మహర్షి (అనుకుందాము).

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే।

నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః॥

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే అనేది సర్వులూ అంగీకరించినది కనుక…

వ్యాస = విష్ణువు అనుకుంటే..

ఆయన కూడా ఒక స్థాయిలో

భూతకృత్

భూతభృత్

భావో

భూతాత్మా

భూతభావనః

ఆ పైన వషట్కారః కూడా.

ఎందుకంటే ఓజస్సు సహస్సు లేకపోతే యజ్ఞాది కర్మలకు తగిన విధంగా అపౌరుషేయములైన వేదములను విభజించగలిగేవాడు కాదు. పురాణములను సంకలనం చేసి, మహాభారతాన్ని రచియించగలిగేవాడు కాదు.

పిమ్మట విష్ణుః (తన కృషి ద్వారా అందించిన గ్రంథాల ద్వారా వ్యాపిస్తూనే ఉన్నాడు కనుక). అందులో భాగం అయినందుకు విశ్వం కూడా.

కనుక n = 1, n= m, n= m-1 దగ్గర

శ్రీవిష్ణు సహస్రనామములలో మొదటి తొమ్మిది నామములు ఒక మాల లాగా నిరూపితమయ్యాయి.

విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః।

భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః॥

Through mathematical induction.

ఈ జన్మలో అస్ఖలిత బ్రహ్మచారియై, భగవంతుని అనుగ్రహం వల్ల త్రిలోక సంచారియై, పరబ్రహ్మముచేత సృష్టింపబడిన సప్తస్వరాలు తమంతతామే మ్రోగే మహతి అనే వీణమీద శ్రీహరి కథా గానం చేస్తూ విహరిస్తూ, శ్రీహరి భక్తులు ఆయనను చేరుటలో సమయ సందర్భాలను బట్టీ సహకరిస్తూనే ఉన్నాడు కరుణాసముద్రుడైన నారద ముని.

ఇక ఇతర నామముల గురించి చూద్దాము.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here