[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[ఆసుపత్రిలో జ్యోతి గదికి బయట కూర్చుని మాట్లాడుకుంటుంటారు జో, సుందర్. ‘జబ్బులన్నీ కేవలం శారీరికం, మానసికం అని వైద్య విజ్ఞానం చెబుతుంది కానీ మనకు కనిపించనివి, వినిపించనివి చాలా ఉంటాయ’ని అంటాడు జో. ఎంత వైద్యం చేసినా కొన్ని జబ్బులు తగ్గవని జో అంటే, ఎన్ని పరీక్షలు చేసినా రిపోర్టులు నార్మల్‍గా ఉంటాయని జబ్బేమిటో తెలియది సుందర్ అంటాడు. జ్యోతిని తాను పూచే పూలతో నయం చేయగలనని అంటాడు జో. కాసేపటికి అతనికి వీడ్కోలు చెప్పి, సుందర్ రిసార్ట్స్ లోని తన గదికి వచ్చేస్తాడు. జ్యోతి విషయంలో ఏం చేయాలో సుందర్‍కి అర్థం కాదు. ఈ గొడవనంతా వదిలేసి వెళ్ళిపోదామా అని అనుకుంటాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగితే వెళ్ళి తలుపు తీస్తాడు. చిత్ర లోపలికి వస్తుంది. కాసేపు ఏం మాట్లాడకుండా తల పట్టుకుని కూర్చుంటుంది. గోవా వదిలి వెళ్ళిపోతున్నారా అని అడుగుతుంది. జ్యోతి తాలూకు బంధువుల నెంబర్లు అడిగి తీసుకుంటాడు సుందర్. సరిగ్గా పేరు తెలియని నాలుగు ఎస్‍లున్న నెంబర్‍కి ఫోన్ చేస్తాడు. తాను గోవా నుంచి మాట్లాడుతున్నానని చెప్పగానే అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేస్తాడు. చిత్ర గట్టిగా నవ్వుతుంది. జ్యోతికి ఉన్న సమస్య గురించి వాళ్ళింట్లో అందరికీ తెలిసే ఉంటుందని, అందుకే ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదేమోనని అంటాడు సుందర్. ఇంతకీ సుందర్ వెళ్ళిపోతాడో లేదో చెబితే తాను తన ప్రోగ్రామ్ వేసుకుంటానంటుంది చిత్ర. జ్యోతితో తనకి చాల పని ఉందని ఆమెని వదలలేనని అంటుంది. వైద్యానికి డబ్బు సంగతేంటని సుందర్ అడిగితే, జ్యోతి తన ఎటిఎం కార్డు ఇచ్చి, పిన్ నంబర్ చెప్పిందని చెబుతుంది చిత్ర. జ్యోతికి తాను నయం చేయగలనని జో చెప్పిన మాటని చిత్రకి చెప్తాడు. కొంత సేపు ఆగి, ‘పోలీసులొచ్చి జో ని తీసుకెళ్ళార’ని చెప్తుంది. – ఇక చదవండి.]
[dropcap]చి[/dropcap]త్ర చేతులు కట్టుకుని దాదాపు బేలగా చూసింది. ఈమెకు ఓ చిత్రమైన అలవాటుంది. ప్రధానమైన అంశాన్ని కొద్ది దూరం నెట్టి, ఏవేవో మాట్లాడి చివరకు మెల్లగా దాన్ని తెరమీదకి వస్తుంది.
“జ్యోతి సంగతి ప్రక్కన పెట్టండి” చెప్పింది.
నిజమే. ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. జోవాక్విమ్‌ని పోలీసులు పట్టుకెళ్లారంటే, నా దగ్గరికి కూడా బయలుదేరుంటారు.
“నిన్ను పోలీసులు ఏమీ అడగలేదా?”
“అడిగారు. ‘ఇక్కడ నీకేంటి పని? అతను నీకెలా పరిచయం?’ అని అడిగారు”
“ఏం చెప్పావు?”
“డాక్యుమెంటరీ చేస్తున్నాను, జ్యోతి నాతో పని చేస్తోంది అన్నాను. పిచ్చి పిచ్చి పనులు చేసే వారందరూ మీడియా ముసుగులోనే చేస్తారన్నాడు ఆ సి.ఐ. ఏమంటారు?”
ఇదేంటీ? వాళ్లేదో అడిగిన దానికి నన్ను ప్రశ్నిస్తుందేంటి?
“పోలీసులు కావాలని రెచ్చగొడతారు.”
“కానీ నిజం అది కాదా?”
నన్ను సెల్‌లో వేసి బాదుతున్నట్లుంది.
“నిజాన్ని లాక్కొచ్చేందుకు ఎన్నో అంశాలను నిజాలుగా చూపడం వాళ్లకలవాటు”
“అది నిజమా?”
“నేను ఎంతో బాధపడ్డాను..” చిత్ర దుఃఖంతో చెబుతోంది. “..జో ని మాట్లాడనీయ లేదు. ఆడిటోరియమ్ నుండి నేరుగా ఇంటికెందుకెళ్ల లేదన్నాడు. అతను ఏదో చూపించటానికి తీసుకుని వెళ్తుంటే దారిలో ఇలా జరిగిందన్నాను. ఆస్పత్రిలో వాళ్లందరూ నన్ను అదోలా చూసారు. మీ గురించి అడిగారు..”
ఎదురుగా వచ్చి కూర్చొన్నాను.
“మీ ఫోన్ నంబరు తీసుకున్నాడు. కొద్దిగా దూరంగా వెళ్లి ఏదో మాట్లాడుకున్నారు. జో ఫోన్ లాక్కున్నారు. ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు.”
“భయపడవద్దు”, అన్నాను.
“ఇలాంటివి చాలా చూసాను..”, చిత్ర చెప్పింది, “..వెదురుతో చేసిన మంచెల మీద ఒక రాత్రంతా అస్సాంలో గడిపాను. ఎప్పుడు బోడోలు – వచ్చి మంచెలను కూల్చేస్తారో తెలియదు. భయం కాదు. బాధతో చెబుతున్నాను.”
“జీవితం రోలర్ స్కేటింగ్ లాంటిది. కాళ్లకి స్కేట్స్ కట్టుకున్నాక ఇలా వెళ్లాలనుకుంటే ఎటో లాక్కుని పోతుంది. అనుకోనివి జరిగినప్పుడు ఏమీ అనుకోకుండా ముందరికి సాగిపోవటమే ఆట అనుకోవాలి.”
“జో వైద్యం చేయగలడన్నారు. నిజమా?”
“అతను చెప్పిన విషయాలను బట్టి చిన్నప్పుడు సాయాజీ అనే గొప్ప వైద్యుని దగ్గర చాలా నేర్చుకున్నాడు. కాకపోతే జ్యోతికి ఉన్నది జబ్బు కాదంటాడు. ఒక మానసిక పరిస్థితీ కాదంటాడు. అలౌకికమా అనే ఆలోచన కూడా కలుగుతోంది.”
“జ్యోతితో నాకు చాలా పనుంది. మామాలుగా ఈ లోకం లోకి వచ్చి నాతో మాట్లాడే వరకు నేను ఎక్కడికీ వెళ్ళను. మీ సంగతి నాకు తెలియదు.”
ఫోన్ మ్రోగింది. గవడె అని కనిపిస్తోంది.
“హలో”
“ఎక్కడున్నారు?”
“రిసార్ట్స్‌లో”
“సమీర్ గురించి ఏమైనా తెలిసిందా?”
“లేదు. మీ ప్రక్కన ఎవరన్నా ఉన్నారా?”
ఆయన నవ్వారు.
“లేదు. అతను ఏమైనా కాంటాక్ట్ లోకి వచ్చాడా?”
“లేదు. పోలీసులు అతన్ని వెతుకుతున్నట్లు తెలుసు. ఏం జరిగింది?”
“మీ ప్రక్కన ఎవరైనా ఉన్నారా?”
చిత్రను ఓ చూపు చూసాను.
“లేరు.”
“జోవాక్విమ్ అనే అతని ఆప్తమిత్రుని పోలీసులు ఒక ఆస్పత్రి నుంచి కస్టడీలోకి తీసుకున్నారు.”
“ఓ.”
“బహుశా సమీర్ కోసం అయివుండచ్చు. ఈ మనిషితో మీకేమైనా పనుందా?”
“అతని ఆడిటోరియమ్‍కి వెళ్లాను. అంతకంటే ఏమీ లేదు. గోవాలో అందరికి అతని గురించి ఏమి తెలుసో, నాకు అంతే తెలుసు!”
“రేపు పేపర్లో ఏదో వ్రాస్తారు. ఏమీ పట్టించుకోకండి.”
“అంటే?”
“ఈ మనిషి చాలా పాపులర్. అలాంటి వాళ్లు అరెస్ట్ అయినప్పుడు రకరకాల స్పందనలుంటాయి.”
“కరెక్ట్. మీ దాకా ఎలా వచ్చింది?”
“ఓ పెద్దమనిషి నాకు ఫోన్ చేసాడు.”
“ఓకే. నాకేదైనా అవసరమైతే మీ సహాయం కోరుతాను.”
“తప్పకుండా, జ్యోతి ఎలా ఉంది?”
“జ్యోతి మీకు తెలుసా?”
“తెలీదు. పన్‍జిమ్ లోని ఆస్పత్రిలో ఆ అమ్మాయి ట్రీట్‌మెంట్ కోసం అక్కడ ఉన్నవాళ్లల్లో జోవాక్విమ్‌తో పాటు మరో మహిళ, మీరూ ఉన్నట్లు భోగట్టా”.. గట్టిగా నవ్వాడు గవడె.
గట్టిగా నవ్వాడు గవడె.
“భోగట్టా బాగానే ఉంది. జ్యోతి అనే అమ్మాయి ఇప్పుడప్పుడే డిశ్చార్జ్ అవుతుందనుకోను. తీవ్రమైన మానసిక సమస్యలో ఉంది.”
“ఓకె. ఉంటాను. బై.”
ఫోన్ టీపాయ్ మీద పెట్టాను. చిత్ర బాల్కనీ లోకి వెళ్లి నిలబడి ఉంది. సముద్రం అర్థం కావటం లేదు. ఈ ఒడ్డున కూర్చుని అంత పెద్ద సముద్రం మా వద్దకే వచ్చి విశ్రాంతి తీసుకుంటోందనుకుంటారందరూ! అసలు దాని దారి ఎటో ఎవరికి తెలుసు?
“ప్రయాణం ఎప్పుడు?” చిత్ర అడిగింది.
“ఎక్కడికి?”
“హైదరాబాదు”
నిజానికి నాకే అర్థం కావటం లేదు. ఈ గోలంతా నాకెందుకని నేను ఇంటికి వచ్చేస్తే హాయిగా కథలు వ్రాసుకోవచ్చు. ఇక్కడ ఈ పోలీసులు, ఈ పురావస్తు శాఖ గోలలు.. అవునూ, పోలీసు వ్యవహారం వచ్చినప్పుల్లా గవడె లైన్లోకి వస్తాడు.. ఇదేంటి?
ఇక్కడేదో తిరకాసుంది.
“ఇంకా అనుకోలేదు.”
“అనుకోండి తొందరగానే, పరిస్థితులు అంత గొప్పగా ఏమీ లేవు.”
ఈమెకు ఇదో అలవాటు. చిన్నప్పటి నుంచీ ఎవరో ఒకరిని ఎత్తిపొడవటం కొందరికి పసితనం నుంచీ అలవాటు. ఉయ్యాలలోంచి ఊడి పడాలని కాళ్లూ చేతులూ తెగ ఆడిస్తూ ఏడ్చే పిల్లలుంటారు..
“నేను ఎన్నడు జీవితం నుండి నుంచి పారిపోలేదు చిత్రా. నేను భయపడే మనుషులలోకి రాను. భయపెట్టే వాళ్ల వర్గానికి చెందిన వాడిని.”
కళ్లు ఎగరేసింది చిత్ర. అంతకు మించి ప్రతిక్రియ చూపించలేదు. చాలా సార్లు ఇలాంటివి విన్నాంలే అన్నట్లుంటుంది.
“అసలు గోవా ఎందుకు వచ్చారు?” అడిగింది.
“ఒకసారి పోలీసులని చూడగానే అందరూ పోలీసుల్లాగే ప్రవర్తిస్తారు! మేరా భారత్ మహాన్!”
చిత్ర నవ్వింది. హమ్మయ్య అనుకున్నాను.
“దాపరికాలేవీ లేవు. భారతీయ పురావస్తు శాఖ వారి ప్రణాళికలో సాంస్కృతిక పరమైన కొన్ని పుస్తకాలు ప్రతి ప్రాంతంలో పరిశోధించి వ్రాయిస్తున్నారు. అందులో భాగాంగా నన్ను ఇక్కడికి పంపారు.”
“పుస్తకం పూర్తయిందా?”
“పరిశోధన సాగుతోంది.”
“సమీర్ పరిశోధనలో భాగమా? లేక అవకాశం దొరికింది కదా అని..”
చెయ్యి అడ్డు పెట్టాను.
“నువ్వెందుకొచ్చావు గోవాకి?”
“ఒక్కసారి సినీహీరోతో మాట్లాడితే చాలు ప్రతి వ్యక్తి తనను తాను ఒక సెలెబ్రిటి హీరో అనేసుకుంటారట. మేరా భారత్ అద్భుత్!”
“నీలో ఏదో గట్టిదే ఉంది చిత్రా!”
“వద్దు. ఇంతకీ నేనిక్కడకి వచ్చింది. ఒకటి కాదు రెండు మూడు డాక్యుమెంటరీల కోసం. వింత ప్రక్రియలు నా స్పెషాలిటీ.”
“డాక్యుమెంటరీ పూర్తయిందా?”
“లేదు. జ్యోతి ఇలా తయారయి ఆపేసింది.”
“పాపం.”
“మీరు ఇందాక ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నాకు ఫోన్ వచ్చి బాల్కనీ లోకి వచ్చాను.”
“ఎక్కడి నుండి?”
“ఆస్పత్రి నుండి.”
“ఏమంటారు?”
“వీలైనంత త్వరగా జ్యోతిని తీసుకెళ్లమన్నారు. ఈ పోలీసులు, కేసులు, వ్యవహారాలు వాళ్లకి మంచిని కావు..ట!”
(ఇంకా ఉంది)