తందనాలు-24

0
3

[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]

231
మర్రి మహా వృక్ష మౌతుంది
మరి దాని విత్తు యెంత చిన్నది గోడల
నెర్రెలలో దాని విత్తనం పక్షులు విసర్జించు
పెరిగి గోడనే పగలగొట్టు

232
విత్తనం యెంత చిన్నదో మర్రిది, మహా వృక్షమౌ
యెంత చిన్న వాడైనా మహాత్ముడౌ
కొంత నిబ్బరంగా ఆలోచించు
కాస్త చిన్నదైనా చిన్న చూపు వద్దని

233
ప్రస్తుతం ప్రజాస్వామ్యమే లేదు
నత్త నడకన అభివృద్ధి కార్యక్రమాలు
మతతత్వ పార్టీలు రాజ్యమేలుతున్నాయి
శత విధాలా రాజరిక పాలనే

234
కల్తీలతో దేశం మునిగి పోతుంది
కల్తీ లేని ఆహార పదార్థాలు లేవు
కల్తీలతో మానవుడు ఏమైపోవాలి?
కల్తీలతోనే కాలం గడపాల్సిందేగా

235
సాగరునికి విహార యాత్ర చేయాలని కోరిక
గగన విహారం ఎంచుకుని
తగినంత మేఘ రూపంలో
నింగిలో సూర్యుని సహాయంతో విహరించె

236
యుగాది ప్రాంతాన్ని బట్టే తేడాలు
యుగం ఎప్పుడు పుట్టింది తెలిస్తేగా
యుగాలెన్నైనా భ్రమణంలో మార్పు వుండదు
యుగాంతం ఎప్పుడో ప్రకృతికే ఎరుక

237
మానవుడు చేసిన బొమ్మ దేవుడని
కనపడని శక్తి అందులో వుందని
వన దేవతలు వనాల్లో
కాన దేవతలు కానల్లో వున్నారనే భ్రమ

238
గుడ్డు ‘x’ ఫాలోఫిన్ ట్యూబ్ చేరినప్పుడు
ఆడా మగా సంభోగిస్తే
విడుదలైన వీర్యంలో ‘x’ ‘y’ లు
గుడ్డుతో ‘x’ చేరితే ఆడ ‘y’ చేరితే మగౌతాయి

239
గుప్పెడంత గుండె, చప్పుడుతో జీవితం ఆరంభం
అప్పుడప్పుడు పరీక్షలు అవసరం
ఎప్పుడు ఏమౌనో తెలియదు
చప్పుడాగితే జీవితమే అంతం

240
గుళ్ల వల్ల ఉపాధి కొంతమందికి
కళ్ళకద్దుకొని పూజించే వారికి
ఏళ్ళ తరబడి చేసినా ఫలితమెంత?
కళ్ళ ముందు కనబడునా ఫలితం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here