మా మధ్య ప్రదేశ్ పర్యటన-8

0
4

[ఇటీవల మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]తి[/dropcap]రిగి మహాద్వారం వైపు నడవసాగాము. ఆ దారి ఒక అద్భుత కళాఖండ సమన్వితం. ఒక వైపంతా రెడ్ స్టోన్‌తో నిర్మించిన కుడ్యం. దాని మీద లతలు, పద్మాలు, ఆర్చ్‌లు, డిజైన్లు, కనులపండువ! రెండవ వైపు, ముఫై అడుగుల సజీవ విగ్రహ సముదాయాలు. రావణుడు కైలాసాన్ని తన పది తలలతో ఎత్తడం, మార్కండేయుని కొరకు, శివుడు యముని చంపబోవడం, క్షీరసాగర మథనం, శివుని హలాహల భక్షణం, లాంటివి మనోహరంగా శిల్పాలుగా చెక్కారు.

మహాకాలేశ్వరుని మందిరం

ప్రధానద్వారం ఆర్చి చాలా కళాత్మకంగా ఉంది. ఇరువైపులా పెద్ద నంది ప్రతిమలు, ద్వారపాలికల శిల్పాలు, ద్వారం ఎదుట పెద్ద వినాయకుడు ఒక మంటపంలో కొలువు దీరి ఉన్నాడు.

ఉజ్జయినీ నగరం చాలా పెద్దది. మహాకాలేశ్వరుని మందిరం ఉన్నప్రాంతాన్ని ‘బై శింగపుర’ అంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. ఉజ్జయిని, క్షిప్రానదీ తీరాన వెలసిన క్షేత్రం. దానిని ‘సిటీ ఆఫ్ టెంపుల్స్’ అని అంటారు స్వామివారు స్వయంభువు. శివలింగం దక్షిణముఖంగా ఉంటుంది. శివలింగం ఉపరితలంపై త్రినేత్రం ఉండడం విశేషం. గర్భాలయం లోని మూడు దిక్కులా గణేశుడు, పార్వతీ దేవి, కార్తికేయుడు కొలువై ఉన్నారు.

మహాకాలేశ్వరుని మందిర ప్రాంగణంలోని దత్తాత్రేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, నరసింహ స్వామి విగ్రహాలు

దక్షిణాన నందీశ్వరుడు. పైన నాగచండీశ్వరుడున్నాడట. కేవలం నాగపంచమి రోజునే ఆయన దర్శనం భక్తులకు లభిస్తుంది. గుడి ఐదు అంతస్తులుగా ఉంది. ఒకటి భూమి దిగువన ఉంది. గోపురం శిల్పకళాశోభితం – స్వామి వారి ప్రసాదము, ఇతర ఆలయాలలో వలె కాకుండా, ఇక్కడ పునర్నివేదనము చేయవచ్చు.

భద్రకాళి ఉపాలయం

దేవాలయాన్ని అనుకుని ‘రుద్రసాగరం’ అనే సరస్సు ఉంది. స్వామివారిని ‘దక్షిణామూర్తి’ అని కూడా అంటారు. ‘తాంత్రిక శివ నేత్రం’ ఈ జ్యోతిర్లింగ ప్రత్యేకత.

మొత్తం మూడు శివలింగాలు, మూడంతస్తులలో ఉంటాయి. అన్నిటికన్నా క్రింద మహా కాలేశ్వరుడు, మధ్యలో ఓంకారేశ్వరుడు, పై భాగాన నాగేంద్రస్వామి.

ఉజ్జయినిలో ఒక ‘మిరకిల్’ ప్రతి సంవత్సరం జరుగుతుంది. వర్షాకాలానికి ముందు ‘పర్జన్యానుష్ఠానం’ అని ఒక క్రతువు నిర్వహిస్తారు. అది పూర్తికాగానే ఆకాశంలో మబ్బులు కమ్ముకుని, భారీ వర్షం పడుతుంది.

మహాకాలేశ్వరుని మందిర ప్రాంగణంలోని దీపస్తంభం

స్వామి వారి అధోభాగాన శంఖు యంత్రం ఉందని అంటారు. ఈశ్వరారాధనలో ఈ శంఖనాదం ప్రధానమైనది. ఉపాలయాలలో పార్వతీ దేవి, విఘ్నేశ్వరుడు, కార్తికేయుడు, సాక్షి గోపాల స్వామి, శనైశ్చరుడు, ఇంకా ప్ర్రాంగణమంతా అనేక శివలింగాలు ఉన్నాయి.

అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. అవి అఖండ దీపాలు. ఒక చిత్రమైన మందిరం ఉంది. దాని పేరు భస్మమందిరం. ఆవుపేడతో పిడకలు చేసి, పిడకలను కుమ్ములో కాల్చి, విభూతిని తయారుచేస్తున్నారు. ఆ విభూతి స్వామివారికి భస్మాభిషేకం చేస్తారు. ఒక పల్చని చట్టలో విభూతిని కట్టి, మరోమూటతో దానిని తాటించినపుడు భస్మం స్వామి వారి మీద పడుతుంది. ఆ సమయంలో శంఖ, భేరీ, మృదంగ ధ్వానాలు మిన్నంటుతాయి.

మహాకాలేశ్వరుని మందిర ప్రాంగణంలోని నరసింహ స్వామి విగ్రహం

రెండవ రకం అభిషేకం మనలను ఆశ్చర్యచకితులను చేస్తుంది. పురుషులు కొందరు సాంప్రదాయిక వస్త్రాలు ధరించి స్వామి వారి చుట్టూ కూర్చుంటారు, శ్మశానంలో శవాలు కాలిన చితాభస్మాన్ని పాత్రలలో వారికి ఇస్తారు. ఆ చితాభస్మంతో మహాకాలేశ్వరునికి అభిషేకం చేస్తారు.

“శ్మశానే వసంతం, మనోజం దహంతం” అని స్తుతించారు కదా స్వామిని! స్వామి పిశాచగణసేవితుడు. కపాలధారి. మహామృత్యు స్వరూపుడు. ఎటర్నిటీ ఐన మహాకాలమునకు అధిపతి. ‘కాళేశ్వర’ అనకూడదంటారు. ‘కాలేశ్వర’ అనాలి. ఈ క్షేత్రాన్ని మహాస్మశానం అని పిలుస్తారు. 12 సంవత్సరాలకి ఒకసారి ఇక్కడ కుంభమేళా జరుగుతుంది.

‘భస్మహారతి’ ని 10 మంది నాగ సాధువులు నిర్వహిస్తారు. ఉజ్జయినీ నగరాన్ని పూర్వం ‘అవంతిక’ అని పిలిచేవారు.

క్రీ.శ. 1234-35లో సుల్తాన్ షాస్-ఉద్-దీన్ (ఇల్తుమిష్) అనే ముస్లిం రాజు ఉజ్జయిని పై దాడి చేసి దానిని ధ్వంసం చేశాడు. 1736లో శ్రీమంత్ రానోజీరావు షిండే గారి సేనానులు శ్రీమంత్ పీష్వా బాజీ రావు, ఛత్రపతి షాన్ మహారాజులు ఆలయాన్ని పునర్నిర్మించారు.

దేవాలయం ప్రాంగణంలోంచి కారు పార్కింగ్ దగ్గరికి చేరుకొని, కుశాగ్ర్ జోషీకి ఫోన్ చేశాము. అప్పుడు సమయం మూడు గంటలు.

యోగాగాడన్నాడు “శర్మా, చక్కగా అభిషేకం చేయించావు. భోజనం మానేద్దాం. కార్తీకమాసంలో ఉపవాసం ఉన్నట్లు అయితుంది.”

యల్లమంద, నేను, వాడితో ఏకభవించాము.

మా తర్వాతి మజిలీ మహర్షి సాందీపని ఆశ్రమం. అక్కడి సుదాముడు (కుచేలుడు), శ్రీకృష్ణుడు, బలరాముడు బాల్యంలో విద్యనభ్యసించారు. ఆశ్రమం ప్రశాంతంగా ఉంది. పెద్ద పెద్ద పచ్చని చెట్లతో, పూలమొక్కలతో అలరారుతుంది. ప్రధాన మందిరంలో సహధ్యాయులు మువ్వురి పాలరాతి విగ్రహాలు శోభాయమానంగా ఉన్నాయి.

మహర్షి సాందీపని ఆశ్రమం

దాని ఎదురుగా కుండేశ్వర్ మహాదేవ్ మందిర్ ఉంది. శివాలయం. దాని ఎదుట నిల్చుని ఉన్న నందీశ్వర విగ్రహం ఉంది.

కుండేశ్వర్ మహాదేవ్ మందిర్

పూజారి మాతో చెప్పారు “ఖడీ హాయే నందీశ్వర్‌జీ కీ ప్రతిమా, ఆర్యావర్త్ మే, యే ఏక్ హీ హై!”

నేను ఆశ్చర్యపోయాను. నిజమే! నిలబడి ఉన్న భంగిమలో నందిని ఎక్కడా చూడలేదు। ఆ విషయాన్ని మిత్రులకు వివరిస్తే, వారు కూడా ఆశ్చర్యపోయారు.

తర్వాత ‘మహర్షి సాందీపని తపస్థలి’ని దర్శించాము. ఆయన తపస్సు చేసిన పవిత్ర స్థలమది.

పక్కనే సర్వేశ్వర మహదేవ్ మందిరం ఉంది. సాందీప మహర్షి బిల్వదళముల నుండి శివలింగాన్ని ఉద్భవింపజేశాడట. అక్కడ ఒక విశేషముందని గుడి ముందు బోర్డులో రాశారు. జలాధారి (పానవట్టం) నుండి నీరు వెళ్ళే చోట శేషనాగ్ సర్పం ఉందట. శిలారూపంలో అది కేవలం ఇక్కడే ఉందట, భారతదేశంలో. శేషనాగ్‌ని దర్శిస్తే, కాలసర్పదోషం, పితృదోషం నుండి విముక్తి కలుగుతుందట.

గురుదక్షిణగా ఏమి సమర్పించుకోవాలని గురువుగారిని అడిగితే, ప్రభాస తీర్థం (సముద్రం) వద్ద కోల్పోయిన తన కుమారుని తనకు అప్పగించమని ఋషి కోరతాడు. బలరామ కృష్ణులు ఆ పిల్ల వాటిని వెతుకుతూవెళతారు. శంఖాసురుడు అనే రాక్షసుడు అతనిని బందీగా ఉంచాడని వారికి తెలిసి, వాడి చెర నుంచి అతన్నివిడిపించి, ఆ శంఖాన్ని తీసుకుని వెళ్లారు. అదే శ్రీకృష్ణుడు ధరించే పాంచజన్యం. ఇది ఇతిహాసం!

మధ్యప్రదేశ్ ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్యర్యంలో MSR VVP (మహార్షి సాందీపని రాష్ట్రీయ వేద విద్యా ప్రతిష్ఠాన్), వేద పాఠశాలలను భారతదేశం అంతటా నెలకొల్పింది. అది ఏడేండ్ల కోర్సు. వేదాధ్యయనంతో పాటు, సంస్కృతం, గణితం, ఆంగ్లం, సామాజిక శాస్త్రం వంటి విషయాలను పిల్లలకు బోధిస్తారట. సంస్కృతశిక్షా బోర్డు ప్రత్యేకంగా ఉంది. ఇందులో వేద భూషణ్, వేద విభూషన్ సర్టిఫికెట్లు ఇస్తారు. ఇది AICTU (All India Council of Technical Education) కు అనుబంధ సంస్థ.

అన్ని చోట్ల విపరీతంగా యాత్రీకులున్నారు. అక్కడ నుంచి మహామంగళనాథ్ మందిర్ వెళ్లాము.

మహామంగళనాథ్ మందిర్

దారిలో పెద్ద పెద్ద గంపల్లో, స్త్రీలు అప్పడాలు (కాల్చునవి) అమ్ముతున్నారు. అవి ఎంత పెద్దవంటే, ఏనుగు చెవులంత ఉన్నాయి. వాటి మీద ఏదో మసాలా పొడి చల్లి ఇస్తున్నారు. ఒక్కోటి పది రూపాయలు. ఎప్పుడో మన హైదరాబాదు లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలాంటి అప్పడాలు తిన్నాను. అద్రక్ చాయ్ తాగాము.

“ఉపవాసం ఉందామని, అప్పడాలు తినేశామే?” అన్నాడు యోగా.. మమ్మల్ని గిల్టీగా ఫీల్ అయ్యేలా చేయాలని.

“అప్పడాల వరకు, టీ వరకు ఓ.కె. నేను పూచీ” అన్నా నవ్వుతూ. “రాత్రి కూడా టిఫిన్ చేద్దాం. ఈ ప్రక్రియను ‘నక్తము’ అంటారు”

మహామంగళనాథ్ మందిరం నుంచి క్షిప్రానది కనబడుతుంది. మత్స్యపురాణం ప్రకారం ఇది మార్స్ (అంగారకుని) జన్మస్థలం. మంగళుడని కూడా ఆయనకు పేరు. అక్కడ ఖగోళశాస్త్ర ప్రయోగశాల ఉంది.

జాతకంలో అంగారక దోషం ఉన్నవారు ఇక్కడ శివునికి పూజ చేయిస్తే దాని నుండి విముక్తులవుతారు.

తర్వాత ‘కాల్ భైరవ్’ మందిర్‌ను సందర్శించాము. ప్రతిచోట లాంగ్ క్యూలు. కాలభైరవుడు క్షేత్రపాలకుడు. ఈయనకు మద్యాన్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. భద్రసేనుడు అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడని, స్కాంద పురాణంలోని అవంతీ ఖండంలో పృస్తావించబడింది. శిల్పరీతి మరాఠా నిర్మాణశైలిలో ఉంది. భైరవారాధన కాపాలిక, అఘోరా సంప్రదాయాలలో ఉంది. స్వామి కుంకుమ రంగులోని రాతి పొరలలో, పగ్రీ ధరించి ఉన్నాడు.

అక్కడి నుంచి ఇండోర్‌కు బయలుదేరాము. ఉజ్జయినిలో మాకు హోటల్ రూం ఇవ్వలేదు. బాగా అలసిపోయము అందరం. దారిలో చింతామణి గణేశ్ మందిరం దర్శించాము. అది చాలా పెద్దది.

చింతామణి గణేశ్ మందిరం
చింతామణి గణేశ్ మందిరంలో

వినాయకుడు కపిలమహర్షికి చింతామణి అన్న మణిని బహూకరించిన చోటు ఇది. మందిరం ఉన్న గ్రామాన్ని థ్యార్ (Theur) అంటారు. దాన్ని తెలుగులో ఎలా పలకాలో మరి! పీష్వా వంశీయుడు మొదటి మాధవరావు ఈ శిధిలమవుతున్న ఆలయాన్ని పునరుద్ధరించాడు (1745-1772). అష్ట వినాయక మందిరాలలో ఇదీ ఒకటి అంటారు. స్థావర అన్నపదం (నిశ్చల) నుండి థ్యార్ వచ్చిందంటారు. బ్రహ్మదేవుని చింతలను సైతం తీర్చినవాడట ఈ గణాధిపుడు.

సభామంటపం కలపతో చేయబడి ఉండటం విశేషం. మూలవిరాట్టు గాక ఎన్నో ఉపాలయాలున్నాయి. స్వామి స్వయంభువు. ఏనుగు ముఖం తప్ప విగ్రహానికి ఏ శరీర భాగాలు లేవు. స్వామి పెడకాళ్ళు (cross legged) వేసుకోని కూర్చుని ఉన్నాడు.

అక్కడనుంచి ఇండోర్ 50 కిలోమీటర్లు. చలి మొదలయింది. దారిలో ఒక చోట వేడి కాఫీ తాగాము. ఎనిమిది గంటలకు హోటల్ ‘మేరీ టేల్ గ్రాండ్’ చేరుకున్నాము. చెకిన్ అయింతర్వాత వేడి నీటితో స్నానం చేసి, రిఫ్రెష్ అయ్యాము. వారి హోటల్‌లో రెస్టారెంట్ లేదని, తాను డిన్నర్‌కు తొమ్మిదికి తీసుకు వెళతానని, కుశాగ్ర్ చెప్పాడు.

‘మేరీ టేల్ గ్రాండ్’ త్రీ స్టార్ హోటల్. రూము చాలా పాష్‌గా ఉంది. లాబీ కళాత్మకంగా, ఖరీదైన సోషాలతో, షాండిలియర్స్‌తో, గ్రాండ్‌గా ఉంది.

మేరీ టేల్ గ్రాండ్

తొమ్మిదికి లుంగీల లోనే కారులో బయలుదేరి ‘రాజారామ్ వెజ్ ధాబా’ కు వెళ్లాము. పుల్కా, పాలక్ దాల్, గోబీ టమోటా మటర్ ఆర్డర్ చేశాము. మసాలా మజ్జిగ తాగాము. రేట్లు చాలా చౌక, భోపాల్‌తో పోలిస్తే!

హోటల్‌కు వెళ్లి హాయిగా పడుకోన్నాం.

***

మర్నాడు ఉదయం 7.45 కు హోటల్ చెక్ ఔట్ చేశాము. మా తర్వాతి మజిలీ ‘మాండు’, ‘మాండవి’ అని కూడా అంటారు.

అది ఒక హిల్ స్టేషన్. పైగా ఎన్నో చారిత్రిక కట్టడాలున్నాయట. అది ఇండోర్ నుంచి 110 కి.మీ. దూరంలో ఉంది.

మాకు హొటల్‌ను ‘మాండు’లో బుక్ చేయకుండా, ‘ధార్’ అన్న పట్టణంలో చేశారు. అది ఒక జిల్లా కేంద్రం – మాండుకు 40 కి.మీ. ఉంటుంది. మాండులో సరైన చోటు ఉండవనీ, ధార్ నుంచి ఐతే, ఓంకారేశ్వర్‌కు వెళ్లి రావడం సులువనీ, మా ‘కుశాగ్రబుద్ధి’ చెప్పాడు.

మేము ‘మాండు’ లోని ప్రదేశాలన్నీ తిరిగింతర్వాతే ధార్‌లో హోటల్ చెకిన్ అవుదామని, ఎందుకంటే మళ్లీ రిలాక్స్ కావాలనిపిస్తుందని, టైం చాలదని మిత్రులతో చెప్పాను.

మా యల్లమంద అన్నాడు, “కేవలం టూర్ మేనేజర్లు చెప్పినట్లు కాకుండా, మిత్రమా! నీవు కూడ ప్లానింగ్ బాగా చేస్తావే?” అని.

“ఒక్కోసారి వాళ్లకే ఫోన్ చేసి, ప్లాన్ మారుస్తాడు కూడా!” అన్నాడు యోగా.

“మనకు కూడా టూర్ పట్ల పూర్తి అవగాహన ఉండాలి. లేకపోతే కొన్ని ప్లేసెస్‌ను స్కిప్ చేస్తారు డ్రయివర్లు. టూర్ ప్యాకేజీ నిర్వాహకులుండేది కేరళలోని ఎర్నాకుళంలో! వాళ్లు ఆర్గనైజ్ చేసేది ఫోన్ల మీద! మధ్య ప్రదేశ్ లోని పరిస్థితి అంతా వారికి తెలియాలని ఏముంది? అందుకే నేను ఇంటర్‌నెట్ ఎప్పటికప్పడు చూసి మన కనుకూలంగా టూర్‌ను ప్లాన్ చేస్తాను.” అన్నాను

“యు ఆర్ ఎ జీనియస్” అన్నాడు యల్లమంద.

“అంత జీనియస్ కాదులే మావాడు. కాని ఐనట్లు బిల్డప్ ఇస్తుంటాడు!” అన్నాడు యోగాగాడు! దొంగ వెధవ.

“కారు ఆగినపుడు నీ సంగతి చెబుతాను, మిత్రద్రోహి!” అన్నాను నవ్వుతూ. నేను ముందు సీట్లో వాళ్లిద్దరు వెనకసీట్లో కూర్చుని ఉన్నారు.

“ఏం చేస్తావ్? ఇప్పుడు యల్లమంద సార్ ఉన్నాడు. నీకు దొరకను రోయ్!” అన్నాడు వాడు.

అందరం నవ్వుకున్నాం.

కుశాగ్ర అన్నాడు “ఆప్ లోగోంకీ దోస్తానా బహుత్ అచ్ఛా హై సాబ్! ఇస్ ఉమర్ మే ఆప్ బచ్చోం కీ తరహ్ ఝగడా కర్తే! బహుత్ మజా ఆ రహా హై!”

“అమ్మో! వీడు సందర్భాన్ని బట్టి మన సంభాషణలను లీలగా అర్థం చేసుకుంటున్నాడు!” అన్నా.

“ఏమంటున్నాడు?” అని అడిగాడు యల్లమంద.

“మన స్నేహం చాలా బాగుందట. ఈ వయస్సులో కూడా చిన్నపిల్లల్లాగా పోట్లాడుకుంటుంటే చూడటానికి వాడికి చాలా బాగుందట” అన్నాను.

కుశాగ్ర థాంక్స్ చెప్పాము.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here