సమత్వం-ఈశ్వరత్వం

0
3

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘సమత్వం-ఈశ్వరత్వం’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]స[/dropcap]ర్వ హృదయాలను దైవ నిలయాలుగా భావించడం, అందరి హృదయాలలో కొలువై వున్న ఆ సర్వేశ్వరుడిని దర్శించగలిగితే సమాజంలో సమత్వ బుద్ధి అలవడి విద్వేషాలు తొలిగిపోతాయి. అట్లే మనకు ప్రసాదించిన సర్వ కర్మలను సేవా కైంకర్యములుగా భావించి చిత్తశుద్ధితో చేస్తే అనుపలభ్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది.

జీవితంలో ఇతరత్రా ఎంత ధనం పోగు చేసినా, ఎన్ని కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించినా, ఎన్ని విధములైన భోగ భాగ్యాలను అనుభవిస్తున్నా ఇది లభించదు. ఈ ప్రపంచాన్ని మనం భిన్నంగా చూడకూడదు. ఒకే ఈశ్వర కుటుంబంగా భావించాలి. దుర్గుణాలు, దురలోచనలు, దుర్భుద్ధులను దూరం చేసుకొని ఈశ్వరత్వాన్ని అనుభవించాలి. ఈ సృష్టిలోని ప్రతి ప్రాణీ సుఖంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఏ దుఃఖాలూ లేకుండా ఉండాలని ఆకాంక్షించే వేద సంస్కృతి మనది. నిస్వార్థంగా, అందరి మంచినీ కోరుకొనే వాని చిత్తం దేవాలయమే. అందులో నిశ్చయంగా కొలువుండేది ఆ పరమేశ్వరుడే.

సర్వ జీవ సమత్వం, సర్వ జీవ హితం మరియు సమానత్వం ఆకాంక్షించడమే ఈశ్వరత్వం అంటే.  తనయందు సకల ప్రాణికోటినీ, సకల ప్రాణులలో తనను చూడగల్గినవాడే సమదర్శి. సమత్వ బుద్ధి కలవాడు పుణ్యపాపములు రెండింటిని ఈ జన్మయందే తొలగించుకొనుచున్నాడు తద్వారా మోక్షానికి మార్గం సుగమనం చేసుకుంటున్నాడు. సమత్వ బుద్ధి నిశ్చల స్థితిని ప్రసాదిస్తుంది మరియు సమిష్టి చింతన కలుగుజేస్తుంది.

శ్రీకృష్ణభగవానుడు  “అర్జునా! సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా ఒకే విధంగానే ఉండు. లాభం కలిగినా, నష్టం కలిగినా రెంటినీ సమభావనతో చూడు. జయమైనా, అపజయమైనా సమబుద్ధితోనే స్వీకరించు, ద్వందాలకు దూరంగా వుండు. ఇట్లా చేసినప్పుడు నీకు ఏ పాపమూ అంటదు” అని ప్రబోధించాడు. జీవితంలో సమత్వ బుద్ధి వలనే మనం నిష్పాక్షికంగా ధర్మ నిర్వహణకు సిద్ధపడతాము. ప్రతి ఒక్కరూ సుఖదుఃఖాలు, జయాపజయాల పట్ల సమత్వభావనను అలవర్చుకోవాలి.

ఈశ్వరత్వం అనేది ఎక్కడో ప్రత్యేకంగా లేదు. ఈశ్వరత్వం అంటే ఈ ప్రపంచమం అంతా కూడా ఒకే దైవం చేత సృష్టించబడింది. మనందరం ఆయనచే సృష్టించబడినవారమే కనుక మనలో మనం కలహించుకొనక, సమిష్టిగా కలిసి మెలసి వుండడం అనేదే ఈశ్వరత్వం అంటే. మనుషులతో ఉన్న కష్టం ఏమిటంటే, మనం సంస్కృతి, మతం, కులం, జాతీయత, జాతి మరియు మరెన్నో ఆధారంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కృత్రిమ విభజనలతో గుర్తించడం. ఈ విభజనలను అధిగమించి ఇద్దరు వేర్వేరు వ్యక్తులను సమానంగా చూడగల సామర్థ్యం అలవరచుకోవడం సమత్వానికి మొదటి అడుగు.

ఈ అత్యున్నత సమత్వ రూపాన్ని సాధించడంలో అడ్డంకి మన మనస్సు, ఇది విభజించడానికి శిక్షణ పొందింది. దానిని ఆధిపత్యం చేయడానికి అనుమతించే బదులు, మనం దానిని లొంగదీసుకోగలగాలి. పని అనేది ఒక పవిత్రమైన పూజ. పూజించడం మన ధర్మం. ఫలితం ఇవ్వడం  భగవదిచ్ఛ. ఫలితాన్ని ముందే ఆశించొద్దు అని భగవానుడు భగవద్గీత ద్వారా మానవాళిని హెచ్చరిస్తున్నాడు. ఆ విధంగా ఉండాలంటే కర్మను ఆచరించే వ్యక్తి ధర్మబద్ధుడై, నిష్కామ భావనతో సమత్వబుద్ధితో ప్రవర్తించడం అవసరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here