[శ్రీమతి దాసరి శివకుమారి రాసిన ‘లోకం పోకడ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]“వ[/dropcap]చ్చే నెలలో అమ్మాయి పెళ్లి వున్నది చందర్రావ్. నాకు డబ్బు అవసరం. నువ్వు మీ వాళ్ళతో చెప్పి ఈ నెల పాట నాకు వచ్చేటట్లు చూడాలి.”
“అలాగే బావా. నీకు చేతికి నాలుగు లక్షల దాకా రావచ్చు. ఈ నెల నువ్వే పాట పాడుకుని తీసుకుందువుగాని. నీకు డబ్బు వచ్చేటట్లు నేను చూస్తాగా.”
“చందర్రావ్! నా కొడుకులు వున్న స్ధలం కాస్తా అమ్మేసుకుని నా వాటాగా 10 లక్షలు ఇచ్చారు. నాకీ డబ్బే ఆధారం. ఉండటానికి చిన్న కొంప వున్నదిగా. ఈ డబ్బును మీ ఫైనాన్సులో పెడతాను. రెండు రూపాయల వడ్డీ చొప్పున నాకు ప్రతి నెలా పది లక్షలకు వచ్చే డబ్బులు తెచ్చి ఇస్తావుగా. దాంతో నా ఖర్చులు వెళ్ళ మార్చుకుంటాను.”
“అలాగే పిన్నీ. బ్యాంకులో తక్కువ వడ్డీకి దాచే బదులు మా దగ్గర అయితే నీకు బోలెడు డబ్బు కళ్లబడుతుంది. డబ్బుకు డబ్బు భద్రంగా వుంటుంది.”
“ఇదిగో చందర్రావ్! మా తమ్ముళ్ళు, చెల్లెళ్లు, నేనూ ఐదుగురం కలిపి 50 లక్షలు మీ నిర్మలా ఫైనాన్సులో పెడదామనుకుంటున్నాం. సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టి అసలు మొత్తంలో కలుపుతానంటే, పైగా ఆ డబ్బుకు నువ్వు హామీగా వుంటానంటే 50 లక్షలు ఇచ్చేస్తాం.”
“నేను ఈ విషయాన్ని శేషాచలం గారితో మాట్లాడతాను. ఆయన అన్న కొడుకే కదా ఇక్కడుండి జమాపద్దులన్నీ చూసేది. శేషాచలం గారేమో స్థలాలు కొని అమ్మించటం, బిల్డింగులు కాంట్రాక్టుకు కట్టి ఇవ్వటం లాంటి పనులకు కూడా తన బంధువుల్నే పెట్టుకుని అటూఇటూ తిరుగుతూ వున్న విషయం మీకందరకూ తెలిసిందే కదండీ.”
“మా కళ్ళకు కనపడేదీ, డబ్బు ఇవ్వడాలు, తీసుకోవడాలు అంతా చేసేది నువ్వే. కాకపోతే శేషాచలం మన ఊరి వాడు, తెలిసినవాడు అన్న ధైర్యం కూడావున్నదిలే. మాట్లాడి ఏ సంగతీ చెప్పు .”
ఇలా చుట్టుపక్కల ఊళ్ళలో కూడా నమ్మకానికి మారుపేరుగా నిర్మలా ఫైనాన్స్, శేషాచలం, చందర్రావుల పేర్లు జనాల నోళ్ళలో నానుతున్నవి.
ఆ రోజు నిర్మలా ఫైనాన్స్ ఆఫీసులో చందర్రావు ఒక్కడే కూర్చుని వున్నాడు. ‘ఈ నెల నాకు జీతం ఇంకా ఇవ్వలేదు’ అనుకుంటుండగానే ఆఫీసును అద్దెకిచ్చిన తను వచ్చాడు.
“15వ తారీఖు దాటుతున్నా ఈ నెల అద్దె ఇంకా ఇవ్వలేదేమిటి చందర్రావ్!”
“శేషాచలం గారి అన్న కొడుకే కదండీ మనకు నెలనెలా డబ్బు లిచ్చేది? అతను పది రోజుల నుండి ఆఫీసుకు రావటం లేదు. నాగ్గూడా ఈ నెల జీతం ఇవ్వలేదు. ఊళ్లో లేడేమో అనుకుంటున్నాను. ఇంత చిన్న విషయానికి శేషాచలం గారికి ఫోన్ చేయటం ఎందుకని చేయలేదండీ.”
“ఆహారం దగ్గరా, వ్యవహారం దగ్గరా మొహమాటం పనికిరాదు. నేను ఫోన్ చేశాను. కానీ ఎత్తటం లేదు. నీ చేత చేయిద్దామని ఇలా వచ్చాను.” అంటూ ఫోన్ చేయించాడు.
చెక్ ద నంబర్, చెక్ ద నంబర్ అన్న సమాధానమే వచ్చింది.
“సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటానండీ. నేను తర్వాత మళ్లీ ఫోన్ చేస్తాను. మీ అద్దె ఎక్కడకూ పోదులెండి.” అంటూండగానే మరో ఇద్దరు ఆఫీసుకు వచ్చి కూర్చున్నారు.
“జనాలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు చందర్రావ్! శేషాచలం పారిపోయాడనీ, త్వరలో ఐపి పెట్టేస్తాడని ఏమిటేమిటో పుకార్లు వచ్చాయి. అవి విని మాకు దడ పుడుతున్నది” అన్నారు.
ఆ మాటలన్నీ విన్న చందర్రావు అయోమయ స్థితిలో పడిపోయాడు. ఎప్పటిలాగా ఈ నెల మొదటి వారంలోనే అందరి దగ్గరా డబ్బులు వసూలు చేసి తను శేషాచలం గారి అన్న కొడుక్కు ఇచ్చాడు. ఏరోజుకా రోజు అతను జమ చేసుకునేవాడు. అతను పది రోజుల నుంచి తన కంటికి కనపడలేదు. ఒక్కొక్కరూ ఆఫీసుకు వచ్చి చందర్రావును నిలదీయ సాగారు.
***
“చూడండి మేడం! ఈ నెలకు జీతం తీసుకోండి. రేపటినుండి మీరు నా స్కూలుకు రావద్దు. నిర్మలా ఫైనాన్స్ ఆఫీసుకు తాళాలు వేసి మీవారిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లినప్పుడే, అవమానంతో మీరే స్కూల్‌కు రావటం మానేస్తారనుకున్నాను. దొంగ, మోసగాడి భార్యగానే స్కూలు పిల్లలు మిమ్మల్ని తేలిగ్గా చూస్తారు. మీ మాట లెఖ్ఖ చెయ్యరు. నా స్కూల్ డిసిప్లిన్ దెబ్బతింటుంది.”
“అలా అనకండి మేడం. శేషాచలం గారికీ, ఆయన అన్న కొడుక్కే విషయం తెలుసు. మా వారికి ఏ పాపం తెలియదు. అన్యాయంగా ఆయన బలైపోయారు. రేపైనా నిజం తెలుస్తుంది. కొంచమైనా మనశ్శాంతిగా వుంటుందని నేను స్కూలు మానలేదు. ప్లీజ్! అర్థం చేసుకోండి.”
“మీ పెద్దబ్బాయి, కోడలు ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్యోగాలకు వెళుతున్నారుగా. ఇల్లు గడుస్తుంది. ఫర్వాలేదు. వెళ్ళి రండి.” అంటూ స్కూలు వాళ్లు సుహాసినిని ఇంటికి సాగనంపారు.
సుహాసిని అవమానభారంతో ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందర గొడవ జరుగుతున్నది. తన రెండో కొడుకు కూడా గట్టిగానే అరుస్తున్నాడు. జనం శాంతించడం లేదు.
“రోజూ పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం. చందర్రావు చేతికే డబ్బంతా ఇచ్చాం. అతను తెచ్చి ఇంట్లో దాచి పెట్టాడేమో ఎవరికి తెలుసు? మాకు సమాధానం కావాలి. మాకు న్యాయం జరగాలి. అంటూ ఎవరిష్టం వచ్చినట్లు వారు అరవ సాగారు.
“మాకేం తెలియదు. మమ్మల్ని నమ్మండి. ఆ ఫైనాన్స్ విషయాలు కూడా మాకు ఎప్పుడూ చెప్పలేదు.” అంటూ సుహాసిని రెండు చేతులెత్తి వాళ్లకు నమస్కరిస్తూ సమాధాన పరచాలని చూసింది. అయినా కాసేపు అలాగే అరిచి వెళ్లారు.
“చిన్నా! మన గురించి బాగా తెలిసిన వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. అన్నయ్యా, వదినా ఈ మధ్యనే ఉద్యోగాల్లో చేరారు. పైగా వదిన కొత్తగా కాపురానికి వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలవుతాయేమోనని నాకు భయంగావున్నది.” అంటూ సుహాసిని బెంగగా రోజులు గడప సాగింది. మధ్య మధ్యలో కొడుకుతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్త సంగతి అడిగి వస్తున్నది.
“అమ్మా! నాన్నగారిని ఇప్పుడప్పుడే విడిచి పెట్టేటట్లు లేరు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో ఇప్పుడు మేము పనిచేసే కాలేజీయే నంబర్ వన్ స్థానంలోవున్నది. విద్యార్థుల సంఖ్య, సిబ్బంది సంఖ్య కూడా బాగా ఎక్కువ. దానివలన కాలేజీలో పెట్టిన కాంటీన్ ఎప్పుడు చూసినా రద్దీగావుంటుంది. కాంటీన్ పెట్టుకున్నతను బాగా లాభాలు చూస్తున్నాడు. కానీ అతనికి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగమొచ్చింది. దాంతో ఇది అమ్మేసుకుని వెళదామనుకుంటున్నానని నాతో అన్నాడు. దీని కోసమే అతను స్థలం కొని పక్క షెడ్డు కూడా వేయించాడు. మన చిన్నాకు ఇప్పటివరకు ఏ ఉద్యోగమూ రాలేదు. వాడికా ధ్యాస కూడా లేదు. వాడికి సొంతంగా ఏదైనా చేసుకోవాలని వున్నది. మన మెలాగైనా తంటాలు పడి ఈ కాంటీన్‌ను కొనుక్కోగలిగితే చిన్నాకు ఓ దారి దొరుకుతుంది. ఆలోచించమ్మా.”
“నీ ఆలోచన బాగానేవున్నది కృష్ణా! మనకిప్పుడు సలహా ఇవ్వటానికి నాన్నగారు కూడా అందుబాటులో లేరు. మనది కనీసం సొంత ఇల్లు కూడా కాదు. ఇప్పటివరకు మేమిద్దరం ప్రైవేటు ఉద్యోగాలు చేసి ఆ వచ్చే జీతాలతో ఎలాగో ఇల్లు నెట్టుకొచ్చాం. ఇప్పుడు మన చేతిలో రూపాయి లేదు. నెత్తిన అవమాన భారం మాత్రం వున్నది.” అన్నది సుహాసిని కళ్ళు తుడుచుకుంటూ.
“అమ్మమ్మ నీకు ఇచ్చిన పొలమున్నదిగా. వెళ్లి దాన్ని అమ్ముకుని డబ్బు తీసుకొని రా అమ్మా. ఆ డబ్బుతో కాంటీన్ కొందాం. నాన్నగారిని నిన్నూ మేం చూసుకోమా” అంటూ తల్లికి ఎన్నో విధాల నచ్చచెప్పి ఒప్పించి పంపాడు కృష్ణ.
“కొండా! చిన్నప్పటినుండి తండ్రి లేకుండా పెరిగావు. నిన్నూ, మీ అన్ననూ కళ్ళలో ఒత్తులేసుకుని కంటికి రెప్పలా మీ ఇద్దరినీ కాపాడుకుని పెంచి పెద్ద చేశాను. చందర్రావు మంచివాడని, చదువుకున్నవాడని ఆశపడి నిన్ను ఇచ్చి పెళ్లి చేశాను. మీ అన్నను బతిమాలి బామాలి నీ పొలాన్ని కూడా, సాగు చేయించి ఏటా నీకు పంట డబ్బులు ఇప్పిస్తున్నాను. ఇంతలో పొలం అమ్ముకోవటం ఎందుకు కొండా? నా మాటిను. ఉన్న ఒక్క ఆధారం కూడా పోగొట్టుకోవటం మంచిది కాదు. కట్టు గుడ్డలతో నిలబడతావే అమ్మా, ఎందుకు చెప్తున్నా నో అర్థం చేసుకో తల్లీ!”అంటూ ఎన్నో విధాల నచ్చ చెప్పటానికి ప్రయత్నించింది సుహాసిని తల్లి.
“కాదులే అమ్మా! ఇది అమ్మితే వచ్చిన డబ్బుతో కొంత చిన్నాకు కాంటీన్ కోసం ఇస్తే మిగతా దాంతో ఆయన్ను కేసు నుంచి బయటకు తీసుకురావటానికి వాడుకుంటాను. నా పరిస్థితి కూడా గమనించు అమ్మా!” అంటూ తల్లి చేతులు పట్టుకుని కళ్ళ నీళ్ల పర్యంతమయింది సుహాసిని.
హడావిడిగా అమ్మకం పెట్టటం వలన సుహాసిని అన్నయ్య తక్కువ రేటుకే పొలాన్ని అమ్మి 30 లక్షలు చెల్లెలు చేతిలో పెట్టి పంపాడు.
“భద్రం కొండా! చందర్రావు కోసం కూడా అన్నావని పొలం అమ్మడానికి ఒప్పుకున్నాను. నాకు కూడా వయసై పోతున్నది. వున్న కాస్త పొలాన్ని కూడా తెగ నమ్ముకున్నావు. ముందు ముందు ఎట్టా బతుకుతా వోనే అమ్మా”, అంటూ ఆ ముసలి తల్లి మరోసారి బావురుమన్నది. సుహాసిని తను కూడా కళ్ళు తుడుచుకుంటూ అమ్మ గట్టిగా పట్టుకున్న చేతుల్ని విడిపించుకోలేక, అమ్మను వదల్లేక చివరకు భారమైన మనసుతో డబ్బు తీసుకుని తమ ఊరికి వచ్చేసింది.
***
శేషాచలం, అతని అన్న కొడుకు కూడా పోలీసులకు లొంగిపోయారు. నా వ్యాపారాల్లో బంధువులను నమ్మి పెట్టుబడి వారి చేతుల్లో పెడితే ఎవరికందినంత వాళ్లు కాజేశారు. నిర్మలా ఫైనాన్స్‌కు డబ్బు చాలా వసూలు అయ్యేది. వసూలు చేసిన డబ్బు చందర్రావు సరిగ్గా మాకు జమ చెయ్యలేదు. మేం అతన్ని నమ్మాం. అతను మమ్మల్ని ముంచేశాడు. ఖాతాదారులు అతనికే ఇచ్చేవాళ్ళు. అతనే సంతకం పెట్టి వారికి రసీదులు ఇచ్చేవాడు. అతను వసూలు చేసిన మొత్తానికి, మాకు జమ అయిన మొత్తానికి అసలు లెఖ్ఖ అందకుండా పోతున్నది. మేం వెంటనే జమాపద్దులు చూసుకోక పోవటం మా పొరపాటే. దాన్ని అలుసుగా తీసుకుని అతను డబ్బు దాట వేసుకున్నాడని అభియోగం చేశారు. మా అన్న కొడుకు ఆఫీసులోనే ఉండేవాడు. కానీ అతను కూడా మోసాన్ని పసికట్ట లేకపోయాడన్నాడు. ఆ అన్న కొడుకూ అదే సమాధానం చెప్పాడు. శేషాచలం మీద రకరకాల కేసులు పెట్టబడ్డాయి. ఇప్పుడు అతను రాజమండ్రి జైల్లో వుంటే చందర్రావు, శేషాచలం అన్న కొడుకుా మరోచోట జైళ్ళలోవున్నారు. కోర్టులో కేసులు నడుస్తూవున్నాయి. శేషాచలం బంధువులు ఎక్కువమంది డబ్బులు బాగానే కూడా కట్టుకున్నారు. శేషాచలం, అతని అన్న కొడుకులు మాత్రం ఏ విషయాలు తెలియనివ్వటం లేదు. తమ పిల్లల పేర, భార్యల పేరన ఆస్తులు ఏర్పరిచారని జనం అనుకుంటున్నారు.
కృష్ణ దంపతులు పనిచేసే ఇంజనీరింగ్ కాలేజీని పెట్టుకున్న డైరెక్టర్ గారి భార్య కాలేజీ సెక్రటరీగా వుంటూ బాధ్యతలను భర్తతో పాటు పంచుకుంటూ వుంటారు. వాళ్ళ కొడుకు అమెరికాలోనూ, కూతురు న్యూజిలాండ్ లోనూవున్నారు. ప్రతి సంవత్సరము పిల్లల దగ్గర కెళ్ళి రెండు నెలల పాటు ఇద్దరూ గడిపి వస్తూ వుంటారు. వీళ్ళిద్దరూ పరువు దేశాలకు వెళ్ళినప్పుడు కూడా కాలేజీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అన్ని బ్రాంచీల హెచ్.ఓ.డి.లు అంతా కలిసి సమర్థంగా పనిచేస్తూ కాలేజీని నంబర్ వన్ స్థానంలోనే వుంచుతున్నారు. చుట్టుపక్కల కాలేజీలు దీనితో పోటీ పడలేకపోతున్నాయి. ఒకటో తారీకు కల్లా ప్రతినెలా క్రమం తప్పకుండా సిబ్బంది కందరకూ జీతభత్యాల చెల్లింపులు జరిగిపోతాయి. ఈ కాలేజీలో మంచి క్రమశిక్షణతో కూడిన విద్య బోధన జరుగుతున్నదన్న విషయాన్ని గ్రహించిన విద్యార్థులు ఇక్కడ చేరి చదవటానికి ఉత్సాహపడుతూ చేరే వారి సంఖ్యను ఏటా పెంచుకుంటూ పోతున్నారు. దాంతో పాటు కాలేజీ కాంటీన్ రద్దీ కూడా విపరీతంగా పెరుగుతున్నది. దాన్ని అమ్మకానికి పెట్టినప్పుడు విపరీతమైన పోటీని తట్టుకోవాల్సి వచ్చింది. చివరకు 30 లక్షలు పెట్టి కృష్ణ తన తమ్ముడి కోసం కాంటీన్ కొనుగోలు చేశాడు. చందర్రావు దాటవేసిన డబ్బులతోనే కొడుకులు ఈ కొనుగోలు చేశారన్న వార్త గుప్పుమన్నది. సుహాసిని తెల్లబోయింది. కృష్ణ ఆ మాటలు విని చాలా అవమానంగా భావించాడు. ఈ పుకార్ల మధ్య చిన్నా మాత్రం నిలదొక్కుకొని కాంటీన్ పనుల్లో పడిపోయాడు. ఒక ఆరు నెలలు గడిచాయి. చిన్నాకు ఆ పనులు బాగా అలవాటయ్యాయి. నిబ్బరంగా వుండాలనుకుని సుహాసిని భర్త విడుదల కోసం దేవుణ్ణి మరింతగా వేడుకుంటున్నది.
2019 డిసెంబర్ నుండి కరోనా భయం ప్రపంచాన్ని కల్లోలపరచడం ఎక్కువైంది. ఒక ప్రక్క విద్యార్థులందరికీ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఎటు చూసినా ప్రమాదకరమైన ఒమిక్రాన్ వేవ్ చుట్టుముట్టుతూ ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. జనజీవన స్రవంతి స్తంభించిపోయే పరిస్థితిలే కనపడుతున్నాయి. 2020వ సంవత్సరం వచ్చింది. అంతటా లాక్‌డౌన్ పెడతారన్న వార్తలు వినపడుతూ వుండగానే ఆ సంవత్సరపు మార్చి నెల మూడో వారంలో లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది. ఒక్కొక్కటిగా మూతపడుతూ విద్యాసంస్థలు కూడా మూతపడ్డాయి. విద్యార్థులకు ఆన్‌లైన్ చదువులు, ఆన్‌లైన్ పరీక్షలే జరుగుతున్నాయి. గవర్నమెంట్ నుండి రావలసిన నిధులు కాలేజీలకు సరిగా అందలేదు. నిధుల కొరత ఏర్పడింది. కానీ మనసొప్పక తమ సొంత నిధుల నుండే కృష్ణా వాళ్ల కాలేజీ సిబ్బందికి యథా ప్రకారం రెండు నెలల పాటు జీతాలు చెల్లించారు. కాలేజీ డైరెక్టర్ గారు కాలేజీలో పనిచేసే ముఖ్యలను పిలిపించి కూర్చోబెట్టి చర్చించారు. జమా ఖర్చులు లెక్కలు వేయించారు. లెక్కల్లో బాగా తేడా కనపడుతున్నది. కాలేజీకి జమ పడాల్సిన జమలు సరిగా లేవు. ఖర్చులు మాత్రం విపరీతంగా వ్రాసున్నాయి. నెమ్మది నెమ్మదిగా ఒక్కో విషయమూ బయటికొస్తున్నది. మరోపక్క వచ్చే విద్యా సంవత్సరం మొదలు కానున్నది. ఈ సంవత్సరం విద్యార్థుల చేరిక ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. బయటి భయంకర వాతావరణానికి తోడు కాలేజీ లోపల కూడా అంతర్గతంగా అవకతవకలు జరిగాయని అనిపిస్తున్నది. తాము ఇండియాలో లేనప్పుడు, పొంచి వున్న పక్క ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు తమ కాలేజీ హెచ్ఓడీలను కొంతమందిని డబ్బుతో లోబరుచుకున్నారు. ఈ కాలేజీలో ప్రవేశానికి వచ్చే దరఖాస్తులను తమ కాలేజీలకు మళ్లించుకునేటట్లుగా ఏర్పాటు చేసుకున్నారు. దాంతో ఆ ప్రభావం నెమ్మదిగా కాలేజీ మీద పడుతుంది. దీనికి తోడు తమ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ క్యాంపస్ సెలక్షన్స్ కోసం వచ్చే కంపెనీలకు పెద్ద మొత్తంలో డబ్బులు లంచంగా ఇచ్చానని లక్షల్లో ఖర్చును చూపించాడు. ఇదే తంతు పిల్లల హాస్టల్స్‌లో కూడా జరిగింది. హాస్టల్స్ నుండి ఆడ మగ విద్యార్థులు చాలా మంది బయటి ప్రైవేట్ హాస్టల్స్‌కు వెళ్లిపోయారు. జరిగే విషయాలన్నీ ప్రిన్సిపాల్ గారికి కొంతవరకు తెలుసు. కానీ తనకెందుకని జోక్యం చేసుకోలేదు. డైరెక్టర్ గారికి, సెక్రటరీ గారికి తమ పరోక్షంలో కాలేజీకి అటు ఆర్థికపరంగానూ, ఇటు సంఖ్యాపరంగానూ పెద్ద నష్టం జరిగిందని అర్థమైంది. ఆ తర్వాత రెండు నెలల పాటు సిబ్బందికి సగం జీతాలు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు పెట్టించటం, విద్యా బోధన జరపటం అంతా ఆన్‌లైన్ లోనే. దాంతో కాలేజీ, హాస్టల్, కాంటీను అన్నీ మూత పడిపోయాయి. మరుసటి సంవత్సరం డెల్టావేవ్ చుట్టుముట్టింది. కాలేజీలో ప్రవేశాలు కోరిన విద్యార్థులు తగ్గారు కాబట్టి ఇంజనీరింగ్ కాలేజీలో కొత్తగా చేరిన సిబ్బందిని కొంతమందిని తీసివేయాల్సి వచ్చింది. అలా తీసివేసిన బోధన సిబ్బందిలో కృష్ణ దంపతులు కూడా వున్నారు. దాంతో సుహాసిని ప్రాణం ఉన్న కట్టేలా బిగుసుకుపోయింది. “రామయ్య తండ్రీ! ఇలా కష్టాల్ని నామీద కొండల్లాగా దొర్లిస్తున్నావు. నాకు ఊపిరాడటం లేదు. దానికి బదులు ఒకేసారి నన్ను నీ దగ్గరికి తీసుకుపో తండ్రీ”, అని కళ్ళలో నీళ్లు ఇంకిపోయే వరకు కార్చింది. ఇంట్లోవున్న నలుగురు కూడా ఎవరికి వారే మౌనంగా తిరుగుతున్నారు. ఎక్కడ చూసినా మాస్కులతో, శానిటైజర్లు పూసుకుని భయం భయంగా తిరిగే జనాలే కనపడుతున్నారు. ఈ డెల్టా వేవ్ కూడా కొంతమందిని బాగానే ఇబ్బంది పెడుతున్నది.
ఆరోజు సుహాసినికెవరో ఫోన్ చేశారు. కానీ ఆమె కాఫోను తీయాలనిపించలేదు. కృష్ణ మాట్లాడాడు. సుహాసినికి పెదనాన్న కొడుకు ఫోన్ చేశాడు. “రేయ్ కృష్ణా! ఇంట్లో ఉన్న ముగ్గురం కరోనా బారిన పడ్డాం. కాస్త తిండి వండి పెట్టే నాథుడే లేడు. నాలుగు రోజులపాటు ఇడ్లీ, కాస్త భోజనం చేయించి తెచ్చి గుమ్మంలో పెట్టి పో రా. అన్నీ డిస్పోజబుల్ గిన్నెలు వాడు. మేమే అవతల పారేసుకుంటాం. నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను.” అంటూ ప్రాధేయపడ్డాడు.
“ఆలోచించి చెప్తాను మామయ్యా” అని అతనికి చెప్పి ఆ తర్వాత ఆ మాట తల్లితో అన్నాడు. “అన్నయ్యా! నేను కాంటీన్‌లోవుండి చూశాను కదా ఫర్వాలేదు. వంట చేసి తీసుకెళ్లి ఇస్తాను.” అన్నాడు చిన్నా.
“అందరూ ఇళ్లలో వుండి జాగ్రత్తలు పడే సమయంలో మీరు బయటకెళ్ళి కరోనా బారిన పడి వస్తే ఇంకేమైనా వున్నదా? ఇంట్లో నేనూ, కోడలు కూడా పాజిటివ్ అవుతాం. అసలే మన రోజులు బాగా లేవు. ఎవరి నుంచి ఆ వైరస్ వ్యాపిస్తుందో మనకు తెలియని పరిస్థితి. నేను మాత్రం మిమ్మల్ని బయటకు పంపను. నా మాట వినండి.” అంటూ తన రెండు చేతులు చాచి కొడుకులను పొదివి పట్టుకున్నది.
“మాస్కులు, గ్లౌస్ అన్నీ వేసుకుంటాం. అవసరమైతే పిపిఇ కిట్లు కూడా కొనుక్కుని వేసుకుంటాం. మామయ్యా, అత్తయ్యా పెద్ద వాళ్ళమ్మా. వాళ్ళ అమ్మాయి కూడా పాజిటివ్ అయివుండి తల్లిదండ్రులను ఏం చూసుకోగలదు? నాలుగు రోజులపాటు వాళ్లకు వంట చేసి పంపుదాం.” అని కొడుకులు తల్లికి నాతో చెప్పారు. వాళ్లు ధైర్యం చేసి కూరగాయల లాంటివి తెచ్చుకుని అందరూ కలిసి వంట చేసి ఆ విషయం మేనమామకు ఫోన్లో చెప్పారు. తీరా వాళ్ళ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి ఇవ్వబోతే కొత్త వాళ్లను మేము లోపలికి రానివ్వమని అక్కడివారు పేచీ పెట్టుకున్నారు.
“సరే మేము వెనక్కు వెళ్ళిపోతాం. మీరు ఎవరైనా వాళ్లకు వంట చేసి ఇవ్వగలరా?” అని అడిగేసరికి వాళ్లు పక్కకు తప్పుకుని దారి ఇచ్చారు. ఈ సంగతి తెలుసుకున్న మరో రెండు కరోనా బాధిత కుటుంబాలు కూడా ప్రాధేయపడి అడిగారు. అవసరమైతే మీకు అడ్వాన్స్ కానీ, డిపాజిట్ లాంటిది కానీ ఏది కావాలంటే అది ఇస్తామని తెగ బతిమాలుకున్నారు. చిన్నా, కృష్ణలు ఆ కుటుంబాల అడ్రస్ తెలుసుకుని వారికీ అందించారు. అలా వీళ్ళ పేర్లు పదిమందికీ తెలిసాయి. కరోనా తగ్గినా కూడా విపరీతమైన నీరసంతో వంట చేసుకోలేకపోతున్నాం. మాకు కూడా పంపించండి నాయనా, అన్న వేడు కోళ్లు బాగా ఎక్కువైనాయి. కొద్ది రోజుల్లోనే 40 మంది దాకా, పంపవలసి వచ్చింది. సుహాసినికీ, కోడలికి కూడా పనితో ఊపిరాడటం లేదు. వృద్ధుల సంఖ్య, అనారోగ్యవంతుల సంఖ్య ఇబ్బందికరంగా వుండి వీళ్ళనే సంప్రదిస్తున్నారు. కరోనా ఉధృతి కాస్త తగ్గింది. ఇక వంట పనివుండదేమోలే అనుకున్నారు. కానీ ఎవరెవరో ఫోన్ చేసి మాకు కూడా పంపించండన్న కబుర్లే వినపడ్డాయి. వంట ఇంట్లో సహాయానికి ఇద్దరు ఆడవాళ్లను, కారియర్లు ఇచ్చి రావటానికి నలుగురు మగ పిల్లలకి మోటర్ సైకిళ్లు కొనిచ్చి కృష్ణ వాళ్లు తమ చేతి కింద పెట్టుకున్నారు. వంట చేసి పంపినందులకు వచ్చే ఆదాయం కూడా బాగా సంతృప్తికరంగానే వున్నది.
***
2022వ సంవత్సరం వచ్చింది. పెరిగే పెరిగే లతను సమూలంగా కోసివేసి చంపేసినట్లుగానే కొందరి స్వార్థంతో, మాయోపాయాలతో బాగా వెలుగులోకి వచ్చిన కృష్ణా వాళ్ళు పనిచేసిన ఇంజనీరింగ్ కాలేజీ మూతపడే దశకు వచ్చింది. అది తెలిసి వీళ్లు బాగా బాధపడ్డారు. కాలేజీ పరిస్థితి చూసి యాజమాన్యానికి దిగ్భ్రాంతి కలిగింది. నిరాశలో పడిపోయి దానిని పునరుద్ధరించే కోరిక కూడా వారిలో నశించింది. ఇప్పుడు అక్కడ బీటెక్ మూడో సంవత్సరం, నాలుగో సంవత్సరం చదివే పిల్లల్ని డిగ్రీ పూర్తి చేయించి బయటకు పంపించాలి. సప్లిమెంటరీ పరీక్షలు వ్రాసే వాళ్ళ చేత కూడా అవి రాయించాలి. ఈ పనులకు సరిపోయే సిబ్బందిని మాత్రం ఉంచి మిగతా వారిని తొలగించి వేశారు. కొత్తగా ఇక కాలేజీలో చేరిక లేమీ జరుపం అని ప్రకటించేశారు. కొద్దిమంది బోధనా సిబ్బందితో పాటు, ఆఫీసు సిబ్బంది, వాచ్‌మెన్, ఒకరిద్దరు పని వాళ్లు మాత్రం తప్పనిసరి అయ్యారు. వీరందరికీ అన్నమాట ప్రకారం జీతభత్యాలు సక్రమంగా చెల్లిస్తున్నారు. క్రమేణా ఖాళీ అవుతున్న తరగతి గదులను, కిక్కిరిసి పిల్లలతో కళకళలాడే కాలేజీ ఆవరణ ఇప్పుడు వెలవెల పోవటం చూస్తున్న యాజమాన్యం మనసు కలిగి నీరవుతున్నది.
విద్యా సంస్థలన్నీ ఇప్పుడు మామూలుగా పని చేస్తున్నాయి కాబట్టి కృష్ణ దంపతులు మరోచోట ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
చిన్నాకు వినియోగదారులు, దాంతో పాటు ఆదాయము బాగా పెరిగాయి. పదిమంది పని వాళ్ళకు పని ఇవ్వగలిగాడు. ఈ వంటకు అనుబంధంగా కారపుపొడులు, పిండి వంటలు లాంటివి అన్నీ తయారు చేయించి సరఫరా చేయగలుగుతున్నాడు.
ఒక మెనూ అంటూ పెట్టుకుని రోజువారీ ఆ ప్రకారం వంట చేయించి మరీ పంపేవాడు. కానీ బాగా ధీమా పెరగటంతో చెప్పిన మెనూ ప్రకారం కాకుండా తనకు తోచింది, వీలు పడింది ఏదో ఒకటి వండిస్తూ పంపసాగాడు. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అన్న చందానకొచ్చాడు. ఎవరింటికైనా బంధువులు వచ్చి కాస్త వంట అవసరం బాబు పంపించు అంటే చాలు, కాదనకుండా పంపేస్తున్నాడు. గుడిలోకి కావలసిన ప్రసాదాలతో పాటు, వేడుకలకవసరమయ్యే వంటలు కూడా పంపటానికి సిద్ధపడుతున్నాడు. రోజువారి పంపేవారికి తరచూ గోధుమ, సేమ్యా ఉప్మాలు, కట్టె పొంగలి అంటూ పంపసాగాడు. కూరలు కూడా అంతే. పచ్చి పులుసు, మజ్జిగ పులుసు, ఏదో ఒక కూర పచ్చడితో మొక్కుబడిగా పంపసాగాడు. ఫోన్ చేసి వినియోగదారులు మొత్తుకోసాగారు. వయసులో పెద్దవాళ్ళం. ఇలాంటివన్నీ మాకు సరిపడవు. ఇదివరకు పంపినట్టు కాస్త శుభ్రంగా పంపండి. కావాలంటే మరో 500 ఎక్కువ తీసుకోండి. బియ్యం కూడా మంచివి కొని వాడండని చెప్పసాగారు.
ఇదంతా క్యారేజీలు మోసే కుర్రాళ్ళు బాగా గమనించసాగారు. వారిలో ఒకడు నెలవారి వసూలైన డబ్బుతోనూ, మరొకడు మోటార్ సైకిల్ తోను పరారయ్యారు. వాళ్లకు మోటారు సైకిళ్ళు కొనిచ్చినప్పుడు ఆయిల్ జాగ్రత్తగా వాడండి. పని కాగానే బళ్ళు తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టండి అని ఎంత చెప్పినా కొంతమంది వినిపించుకునే వాళ్ళు కాదు. వాళ్ల పనుల మీద ఎక్కడెక్కడో తిరిగి సాయంకాలానికి చేరుకునేవాళ్ళు.
చిన్నాలో మార్పు వచ్చినప్పటి నుంచి సుహాసిని కొడుకును హెచ్చరిస్తూనే వున్నది.
“చిన్నా! నువ్వు చేసేది తప్పు. మనం తీసుకునే డబ్బులో కొంత మన లాభం చూసుకుందాం. అంతేకానీ భోజనం పంపిస్తున్నామన్న పేరుకు మాత్రం పంపించి వారిని అసంతృప్తికి గురికానివ్వకూడదు. ఎంతోమంది పెద్దవారు, నిజంగా ఒక రకంగా శక్తి లేని వారు కూడా. వాళ్లు మనల్ని నమ్మి నిశ్చింతగా వేళ కింత తిందామని ఆశించివుంటారు. కానీ నువ్వు చేస్తున్నది ఏమిటి? ఈమధ్య రేషన్ బియ్యం ఎందుకు బస్తాలు బస్తాలు కొంటున్నావు? నేనడిగితే దోసెల కోసం పిండి వంటలు పిండి కోసం అని మాత్రమే చెప్పావు. కానీ ఇప్పుడు మధ్య మధ్యలో వాటితోనే అన్నం కూడా వండిస్తున్నావు. నాసిరకం వంటలు పంపించి వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటమాడటం మంచిది కాదు. ఈ పని మొదలు పెట్టినప్పుడు నేను ప్రతి వేరుశనగ నూనె కిలో ప్యాకెట్‌కు 100 గ్రాములు ఆవు నెయ్యి కలిపి కూరలకు వాడేదాన్ని. ఇప్పుడు నువ్వు అచ్చంగా పామాయిలే వాడుతున్నావు. పంపే కూరలు, ఫలహారాలు తక్కువ తక్కువ పంపిస్తున్నావు. అవి కూడా రుచి పచీ లేనట్టుగా చేస్తున్నావు. మాంసాహారం రోజు మరీ దారుణం. కొద్ది మాంసం తెప్పించి కొబ్బరి గసగసాల గుజ్జు తీయించి దాంట్లో బంగాళాదుంప ముక్కలు కలిపి నానా కంగాళీ చేస్తున్నావు. మీ నాన్నగారు పని చేసిన ఫైనాన్స్ కంపెనీ, అన్నయ్య పని చేసిన కాలేజీల సంగతి ఒక్కసారి గుర్తు తెచ్చుకో. కొంతమంది అత్యాశ వలన, స్వార్థం వలన ఎన్ని కుటుంబాలు వీధిన పడ్డాయో? ఎక్కడిదాకా ఎందుకు? కాలేజీ మూతపడటం వలన కదూ? మన కాంటీన్ కూడా మూతపడింది. అమ్మమ్మ నొప్పించి మనకున్న ఏకైక ఆస్తిని అమ్మి మరీ డబ్బు తెచ్చి ఇచ్చాను. ఏదో కరోనాలో మేలు అన్నట్లుగా మనకి దారి దొరికింది. ఈ దారిని కూడా ముళ్ళు పరుచుకుని మూసుకుపోయేటట్లుగా చేసుకోవద్దు. ఇప్పుడు మనకి మంచి ఆదాయమే వస్తున్నది. ఇంకా అత్యాశకు పోతానంటే నేనొప్పుకోను. ఇలా అయితే ఈ పని మానేసి మరో దారి చూసుకో. నీ పద్ధతిలో మార్పు రాకపోతే నేనే ఫోన్ చేసి అందరికీ చెప్పేస్తాను. వాళ్ల దారి వాళ్లు చూసుకుంటారు.” అని తీవ్రంగా మందలించింది.
“చిన్నా! ఆ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి మనిద్దరం ఈ పని మొదలు పెట్టాం. కష్టపడ్డందుకు డబ్బూ, పేరు వస్తున్నాయి. వచ్చిన పేరును పది కాలాల పాటు నిలబెట్టుకోవాలి. ఒకేసారి ఎవరూ పెద్దవాళ్లు కాలేరు. ఓర్పుగా, నిజాయితీగా వుండాలి. ఇప్పటివరకు అమ్మ చెప్పింది నేను మరలా చెప్పాల్సి వస్తుంది. మనమేం చేసి పెడితే అది తినటానికి సిద్ధపడుతున్న వారిని పూర్తిగా నిరాశ పరచడం మంచిది కాదు. ఒక పక్క చేయని తప్పుకు నాన్నగారు నిందపడ్డారు. ఎప్పటికీ బయటకు వస్తారో తెలియడం లేదు. మనం కాంటీన్ కొన్నప్పుడు మనల్ని జనం ఎన్ని రకాలుగా అనుమానించారు? ఇప్పుడు నువ్విలా చేసావంటే, తండ్రీ కొడుకులు అంతా ఆ కుటుంబమంతా మోసగాళ్లే అని అంటారు. నువ్వు చేసే పనుల్ని అలుసుగా తీసుకుని మన దగ్గర పనిచేసే కుర్రాళ్ళు టోకరా యిస్తున్నారు. అందరూ ఇలా చేస్తూ పోతే లోకంలో నిజాయితీ, నమ్మకం అనేదే లేకుండా పోతుంది. నమ్మకం అనేది మనం సంపాదించుకుంటే మనకు మరో పని వెతుక్కుంటూ వస్తుంది. డబ్బులు పెడితే ఈ రోజుల్లో చాలామంది కూరలూ, ఫలహారాలు తయారు చేసి ఇళ్లకు పంపే వాళ్ళు వున్నారు. ఇంటి భోజనం లాగా ఉంటుందన్న నమ్మకంతో మనల్ని ఎక్కువమంది అడుగుతున్నారు. మనం చేయకపోతే వాళ్లు మరెక్కడైనా ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఇక్కడ మనం, మన దగ్గర పనిచేసే వాళ్లు పనిని కోల్పోయి నిరాధారంగా మిగులుతాము. వెనక ఆస్తిపాస్తులు వున్నవారికి పర్వాలేదు. ఎలాగంటే మా కాలేజీ డైరెక్టర్ గారి విషయం చూసుకుంటే ఆయన పెట్టుబడి పెట్టిన కోట్లు రేపు కాలేజీ అమ్ముకుంటే కూడా తిరిగి వస్తాయి. ఇక్కడ నష్టపోయింది అక్కడ పనిచేసే సిబ్బంది, చదువుకునే విద్యార్థులే. కాలేజీ అమ్ముడుపోయినప్పుడు కాంటీన్ కూడా అమ్ముకుందాం. పరిస్థితుల వలన మనం నష్టపోయాం. అంతేకానీ మనం నష్టపోయామని ఇతరులను నష్టపెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ చేయకూడదు. మంచికో, చెడుకో ఒక దారి అంటూ దొరికింది. ఆ దారిలో నిజాయితీగానే నడువు. నాన్నగారు ఎప్పుడొస్తారో తెలియదు కానీ అసలైతే బయటికి వస్తారని నాకు గట్టి నమ్మకం కలుగుతున్నది. మొన్న నేను వెళ్లి శేషాచలం గారిని కలిసొచ్చాను. తన ఇంట్లో ఉన్న బంగారు విగ్రహాలు, వజ్రాల నగలు అమ్మించే ప్రయత్నం చేయమని భార్యకు చెప్పానన్నారు. ఫైనాన్స్ కట్టిన వారికి వడ్డీ ఇవ్వలేకపోయినా, అసలైన ఇవ్వటానికి ప్రయత్నిస్తానన్నారు. అన్న కొడుకును కూడా ఒప్పించి కాజేసిన దాంట్లో కొంత డబ్బు నైనా వెనుకకు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. ఇంకా, తనూ, అన్న కొడుకు కూడా చందర్రావు తప్పేమీ లేదని ఈసారి కేసు వాదన జరిగేటప్పుడు తమ సాక్ష్యంలో నిజం చెప్పాలనుకుంటున్నానని చెప్తున్నారు. ఆయనలో పశ్చాత్తాపం కనపడింది. సొమ్ము పోయినా మనిషిగా నైనా బ్రతకాలని వుందనీ చెప్పారు. అలాగే మా కాలేజీలో పని చేస్తూ సంస్థకు ద్రోహం తలపెట్టిన సిబ్బంది కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. వారిలో చాలా మందికి సరైన ఉద్యోగం ఇప్పటివరకు కూడా దొరకలేదు. అదే కాలేజీ బాగా సాగిపోతుంటే ఎంత బాగుండేది? ఈ విషయాలన్నింటినీ నువ్వు బాగా గుర్తుపెట్టుకో చిన్నా. ఏ దారిలో వెళ్ళినా సరియైన దారి ఎంచుకో. నేనింతకంటే చెప్పాల్సింది లేదు.” అన్నాడు కృష్ణ.
అటు తల్లీ, ఇటు అన్నా చెప్పిన మాటలతో చిన్నా ఆలోచనలో పడిపోయాడు.