[శ్రీ బివిడి ప్రసాదరావు రాసిన ‘మనలోని ఒంటరి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]“రా[/dropcap]జు చనిపోయాడు.”
అదిరాను.
“ఎవరో చాలా దారుణంగా హత్య చేసేసారు.”
మరింత ఒణికాను.
“ఎందుకు చంపారో.”
అప్పడికే మొద్దుబాఱాను.
వెంకట్రావ్ చెప్పుతోంది వినపించుకోలేక పోతున్నాను.
కుడి చెవి వైపున్న సెల్‌ఫోన్‌ను ఎడమ చెవి వైపుకు మార్చుకున్నాను.
అంతలోనే నా భార్య రేవతి వచ్చింది. టీపాయ్ మీద టీ కప్పు పెట్టి..
“ఫోన్‌లో పడి టీ త్రాగడం ఆలస్యం చేయకండి. తిరిగి వేడి చేయలేను. మీకు భోజనం కట్టే పనిలో ఉన్నానాయే.” గొణగుకుంటూ వెళ్లిపోతోంది.
రేవతి గొంతుక నన్ను ఎప్పుడూ బెదరకొడుతూనే ఉంటుంది.
అప్పుడే, “రా.” అనేసి, వెంకట్రావ్ కాల్ కట్ చేసేసాడు.
నేను సెల్‌ఫోన్‌ను టీపాయ్ మీద పడేసాను. టీ త్రాగ బుద్ధి కాలేదు. సోఫాలో కుక్కేసినట్టు ఉండిపోయాను.
మోర్నింగ్ వాక్ నుండి వచ్చేక, రిప్రెషయ్యి, హాలు లోని సోఫాలో కూర్చున్నాను.
అప్పుడే నా సెల్‌ఫోన్ రింగవుతోంది. టీపాయ్ మీది దానిని తీసుకున్నాను. దాని స్క్రీన్ వంక చూస్తూనే..
‘ఈ వేళప్పుడు వెంకట్రావ్ ఫోనెందుకు చేస్తున్నట్టు..’ అనుకుంటూనే ఆ కాల్‌కు కనెక్టయ్యాను.
నేను ‘హలో’ అనగానే, రాజు సంగతి భళ్లున కక్కేసాడు వాడు.
రాజు పదేళ్లగా నాకు తెలుసు.
నా మూలంగానే వెంకట్రావ్‌కు రాజు పరిచయం అయ్యాడు.
రాజు నా కో-ఎంప్లాయ్.
ఇద్దరం పుస్తక ప్రియులం. తరుచూ లైబ్రరీకి కలిసే వెళ్తుంటాం. అక్కడి పుస్తకాల్లోంచి తెలుగు సాహిత్య పుస్తకాలను ఏరి ఇళ్లకు తెచ్చుకుంటాం. వాటిని చదివేక ఆ పుస్తకాలను మార్చుకుంటాం. తిరిగి కలిసే లైబ్రరీకి వెళ్తాం. మళ్లీ కొత్త పుస్తకాలు తెచ్చుకుంటాం. ఇదే ప్రతి మారు జరిగేది.
వెంకట్రావ్ తొలుత నా పక్క పోర్షనాయనగా నాకు పరిచయం. నా చేతిలో నిత్యం ఏదో ఒక పుస్తకం ఉండడం చూసి వాకబు చేపట్టాడు. నేను చెప్పింది అతడికి ఆకట్టుకున్నట్టు ఉంది. తొలుత నా నుండి పుస్తకాలు తీసుకునే వాడు. తర్వాత నాతో లైబ్రరీకి వచ్చేవాడు. అక్కడే రాజును వెంకట్రావ్‌కు పరిచయం చేయగలిగాను.
రాజు చొరవతో, వెంకట్రావ్ టు-బెడ్రూం ప్లాట్ కొనుగోలు చేసుకున్నాడు. అదీ రాజు ఉంటున్న అపార్ట్మెంట్ లోనే.
నాది సొంత ఇల్లు కావడంతో నన్ను రాజు వదిలేసాడు. లేదంటే తనకు కొద్దిగా తెలిసిన వాళ్లయ్యితే చాలు, వాళ్లచే ఇల్లు ఒకటి కొనిపించే నస చేపట్టి తీరుతాడు. వాడికి అదేమిటో సరదా.
అప్పుడే రేవతి మళ్లీ వచ్చింది.
“అదేంటి, టీ త్రాగలేదు.” అడిగింది టీపాయ్ వంకనే చూస్తూ.
తెమిలేలా కదలగలిగాను.
నా వాలకం గుర్తించినట్టుంది.
“ఏమైంది.” అడిగింది రేవతి.
నెమ్మది నెమ్మదిగా రాజు విషయం చెప్పగలిగాను.
“అలానా. ఏమైంది పాపం.” వాకబు మొదలు పెట్టింది.
“నేనేం చెప్పేది. నాకేం తెలుసు.” నసిగాను.
“అప్పుడప్పుడు మీతో ఇంటికి వచ్చేవారు. మంచాయనే. మరి ఏమైందో.” అంటుంది రేవతి.
సోఫాలోంచి లేవగలిగాను.
“నేను అక్కడికి వెళ్తాను.” చెప్పగలిగాను.
“మరి ఆఫీసో.” నొసలు ఎగరేసింది రేవతి.
“ఓ పూటకి సెలవ్ పెడతా లేదా పర్మిషన్ అడుగుతా. అక్కడికి వెళ్లి వెంకట్రావ్‌ను కలిస్తేనే ఏం చేసింది చెప్పగలను.” గింజుకుంటున్నాను.
“ఏమో. మీ భోజనం అవుతోంది. టిఫిన్ రడీ.” చెప్పింది రేవతి.
టీపాయ్ మీది టీ కప్పును తీసుకుంది.
“ఇది చల్లారి పోయింది. వేడి చేసినా బాగోదు. టిఫిన్ పెడతాను.” చెప్పింది.
“వద్దు. తిన బుద్ధి లేదు. ముందు అటు వెళ్లాలి.” చెప్పాను.
“సరే. వెళ్తే వెళ్లారు కానీ, ఏమీ నెత్తినేసుకోకండి.” టీ కప్పుతో అక్కడి నుండి వెళ్లిపోతోంది.
బాత్రూం వైపు కదిలాను.
అర గంట పిదప..
నా రాకను గమనించిన వెంకట్రావ్ నాకు ఎదురు వచ్చాడు.
ఆ ఆపార్ట్మెంట్ ముందున ఒక మూక ఉంది.
మోటర్‌బైక్ దిగాను.
నన్ను పక్కకు లాక్కుపోయి.. “రాజు ఇంటిన పోలీసులు ఉన్నారు. హంగామా అవుతోంది.” చెప్పాడు వెంకట్రావ్.
“ఇంతకీ ఏమైంది.” అడిగాను.
“రాత్రి తన బావమరిది కుటుంబం వచ్చిందట. ఉదయం ఎగస్ట్రా పాల పేకట్స్‌కై రాజు బయటికి వెళ్లి వస్తుండగా.. అదిగో ఆ దూరం మలుపు దగ్గర హత్యకు బలయ్యిపోయాడు. స్పాట్ లోనే చనిపోయాడు. బాడీని అటు నుండి అటే పోలీసులు పోస్ట్‌మార్టమ్‌కై పంపేసారు..”
చెప్పుతున్న వెంకట్రావ్‌కు అడ్డై.. “రాజు మంచోడు. పైగా బెఱుకోడు. అతడికి శత్రువులా. ఎవరై ఉంటారో. ఎవరైనా చూసారా.” అడిగాను.
“తెల్లారి సుమారు ఐదప్పుడు. పేపరు వేసే కుర్రోడు అక్కడ ఎవరో చచ్చి పడున్నాడని వాచ్‌మన్‌కు చెప్తే వాడు పోయి చూడగా, అతడు రాజు అని తెలిసిందిట. హడావిడికి నేను వెళ్లి చూసాను. దారుణం. బోర్లా పడి ఉన్నాడు. వీపు వైపు చాలా పోట్లు ఉన్నాయి. దాంతో రాజు అక్కడికక్కడే చనిపోయి ఉండొచ్చుట.” చెప్పుతున్నాడు వెంకట్రావ్.
అయోమయంలో మునిగి కొట్టిమిట్టాడుతున్నాను.
“ఆఫీస్‌కు సెలవు పెట్టేసి.” అంటున్నాడు వెంకట్రావ్.
“నేను ఉండాలా.” అడిగేసాను.
“అయ్యో. ఉండాలి. పోయింది మన రాజు.” గోలగా అనేసాడు వెంకట్రావ్.
మా ఆఫీసర్‌కు ఫోన్ చేసి.. విషయం చెప్పాను. పర్మిషన్ కోరాను.
ఆయన సానుకూలంగా స్పందించాడు.
ఆ సాయంకాలంకి పోలీసులు ద్వారా ఇలా తెలిసింది. అప్పటికే రాజు దహన క్రియ ముగిసిపోయింది.
‘సిసి కెమెరా మూలంగా రాజును ఎవడో యువకుడు చంపినట్టు తేలిందిట. అతడి హెల్మెట్ మూలాన వాడు ఎవడో తెలియడం లేదుట. బైకు మీద వచ్చి, పనిని కానిచ్చేసి, తిరిగి బైక్ మీద పోయాడుట. ఆ బైక్ నెంబర్ గుర్తించారుట.’
పోలీసులు శోధన కొనసాగుతూనే ఉంది.
మూడ్రోజులు తర్వాత..
వెంకట్రావ్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఇంటిలోనే ఉన్నాను. పది నిముషాలు ముందే మోర్నింగ్ వాక్ నుండి వచ్చాను. రిప్రెషయ్యి, సోఫాలో కూర్చొని, కాఫీ తాగుతున్నాను.
వెంకట్రావ్ ఫోన్ కాల్‌కు కనెక్ట్ ఐ.. “హలో” అన్నాను.
“రాజు..” చెప్పుతున్నాడు వెంకట్రావ్.
అడ్డై.. “ఏమైనా తెలిసిందా.” ఆత్రమయ్యాను.
“ఆఁ. అదే. కబురు వస్తే రాజు వాళ్లింటికి వెళ్లాను. వెళ్లేక తెలిసింది.. ఆ ఇంటి మెయిన్ డోర్ పక్కన ఉన్న కిటికీ గ్రిల్సుకు పాల పాకెట్టుకై ఒక ప్లాస్టిక్ బుట్ట కట్టి ఉంటుంది. నువ్వు చూసుంటావు. ఉదయం నిద్ర లేచేక.. ఆరప్పుడు పెద్దావిడ పాలు పాకెట్టుకై బయటికి వస్తే.. ఆ బుట్టలో పాలు పాకెట్టుతో పాటు.. ఒక కవర్ కూడా ఉందిట..” వెంకట్రావ్ చెప్పుతున్నాడు.
“కవరా.” ఆశ్చర్యమయ్యాను.
“అవును. నేనూ కవర్ చూసాను. ఆ కవర్ మీద రాజు పేరు మాత్రమే రాసి ఉంది. ఎప్పుడు, ఎవరు వచ్చి దానిని పెట్టారో తేలడం లేదు.” చెప్పుతున్న వెంకట్రావ్‌కు టక్కున అడ్డై..
“ముందు అసలుకు రా. ఆ కవర్ లో ఏం ఉంది.” అడిగాను.
“ఆ కవరు లోని ఉత్తరం సారాంశం బట్టి.. ఆ కవర్ రాజును చంపిన వాడిదే.. అతడు న్యూస్ పేపరులోని రాజు హత్య వార్త ఆధారంతో రాజు అడ్రస్ తెలుసుకోగలిగాడుట. రాజు స్వెటర్, మంకీ కేప్‌తో ఉండడం.. పైగా తన విరోధి నడక, పోలికలు రాజు వెనుక నుండి ఒక్క మారుగా కానరావడంతో, తమాయించుకోలేక.. తనకు అందుబాటున ఉన్న లాంగ్ స్క్రూడ్రయివర్‌తో రాజు వీపున కసికసిగా పొడిచి పొడిచి చంపేయడమయ్యిందిట. ఎకాఎకీన తప్పించుకోవాలని పారిపోవడం జరిగిపోయిందిట. ఆ తర్వాత.. ఆ విరోధి కనిపించేక తన పొరపాటును ఆ యువకుడు గుర్తించడం జరిగిందిట..”
ఒక్క మారున బెదిరాను.
వెంకట్రావ్ చెప్పుతున్నాడు.. “తన అపరాధానికి తనను క్షమించమని కోరుతూ.. తను ఒక గుడ్స్ డెలివరీ బాయ్ నని.. ఇప్పటి వరకు తన సంపాదనలో తాను పొదుపు చేసుకున్న మొత్తానికి.. తన ఉంగరం అమ్మగా వచ్చింది కలిపి.. ఒక లక్షా పది వేల ఇరవై రూపాయలు పంపుతున్నట్టు తెలుపుతూ.. ఆ మొత్తానికి సరిపడ్డ నోట్లను కట్ట కట్టి ఆ కవర్‌లో అతడు పెట్టాడు. దయచేసి దానిని స్వీకరించమని కోరుకున్నాడు.”
అప్పటికే డంగయ్యాను.
“నేను అక్కడ ఉంటుండగానే రాజు వాళ్లకు పోలీసులు నుండి ఫోన్ వచ్చింది..”
“ఏంటంటా.” గజిబిజి అయ్యాను.
“పోలీసులు ద్వారా తెలిసిన విషయం.. రాజును చంపిన వాడు.. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో స్వయంగా వచ్చి వాళ్లకు లొంగిపోయాడుట. తన నేరం ఒప్పుకున్నాడుట.. తన అపరాధానికి తనను శిక్షించమని కోరుకున్నాడుట..” వెంకట్రావ్ చెప్పతున్నాడు.
మెల్లిగా తెప్పరిల్లుతున్నాను.