మహిళ స్ఫూర్తి కాగా…

0
3

[అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘మహిళ స్ఫూర్తి కాగా…’ అనే ప్రత్యేక రచనని అందిస్తున్నారు శ్రీ రోచిష్మాన్.]

[dropcap]మ[/dropcap]హిళ గొప్పతనం గురించి ఎవ్వరూ గొప్పగా కాదు కదా తగినట్టుగా కూడా చెప్పలేదేమో? చెప్పలేరేమో?! మహిళ గొప్పతనం గురించి గొప్పవాళ్లు ఎందరో ఎంతో గొప్పగా చెప్పారు. ఆ చెప్పింది అంతా మహిళ గొప్పతనానికి ఎంతమాత్రమూ న్యాయం చెయ్యలేదు, సరితూగలేదు. సృష్టిలో ఒక గొప్ప సృష్టి మహిళ.

ఈ మహిళా దినం సందర్భంగా మహిళ మాన్యతను ‘వాక్కు’  ప్రక్రియలోని ఒక అభివ్యక్తితో ఆస్వాదనకు తెచ్చుకుందాం.

మహిపై దేవుడి మహిమ వెల్లివిరిసింది.

“మహిళ”

ఏ మనిషికైనా కాదు, కాదు ఏ జీవికైనా మహిళ అమ్మగా మొదటి చుక్క ఔతుంది. అక్కడ నుంచి జీవితమూ జీవనమూ మహిళత్వంతో  నిండిపోతుంది. మానవ మనుగడ కథకు ఇతివృత్తం మహిళ; మానవ మనుగడ కథనానికి గమనం మహిళ. మానవచరిత్రకు ఆత్మ మహిళ. అత్యుదాత్తతకు ఆకృతి మహిళ.

“మహిళ ఒకదాన్ని స్వీకరిస్తుంది ఆపై దాంతో సృజన చేస్తుంది; ఆ సృజన సూత్రం విశ్వంలోనే అత్యంత అద్భుతమైంది” అని చైనీస్ తత్త్వవేత్త, కవి జుషి వందల యేళ్ల క్రితమే చెప్పారు. తత్త్వం పరంగానూ, వ్యక్తిత్వం పరంగానూ, ప్రవర్తన పరంగానూ మహిళ ఎంతో విశిష్టమైంది. “సారంలేని ఈ లోకంలో సారాన్ని ఇచ్చేది మహిళ అని తెలుసుకునే కాబోలు శివుడు తన అర్ధశరీరాన్ని మహిళకు ఇచ్చాడు” అని ఒక పూర్వ సంస్కృత శ్లోకం ‘అసారభూతే సంసారే సారభూతా నితంబిని ఇతి సంచిత్య వై శంభుః అర్థాంగే కామినీమ్ దధౌ’ అంటూ చెబుతోంది.

వేదంలో ఒక వధువు, వరుడితో “నేను ఋక్‌ (సాహిత్యం), నువ్వు సామం (గానం)” అని అంటుంది. గానానికి సాహిత్యంలాగా మగవాడికి మహిళ ముఖ్యం. మహిళను సాహిత్యం అనడమే ఆమె గొప్పతనాన్ని చాటుతోంది. సాహిత్యం మనసుల్నీ, మస్తిష్కాల్నీ కదిలిస్తుంది. మహిళ కూడా అంతే. మన పెద్దలు మహిళకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారు; మహిళకు ప్రశస్తమైన స్థానాన్ని ఇచ్చారు.  “నేను శిరస్సును, నేను జెండాను, నేను నిప్పుల మాటలు పలుకుతాను. నా భర్త నన్ను అనుసరించనీ” అని వేదంలో ఒక మహిళ అంటుంది. ఈ మాటల్నిబట్టి వేదకాలంలో మహిళకు స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం నిండుగా ఉండేవని, మహిళకు విశేషమైన, ప్రత్యేకమైన స్థానాలు ఉండేవని తెలియవస్తోంది. “సమాజానికి, కుటుంబానికి మహిళ రక్షకురాలిగా వ్యవహరించాలి” అనీ, “మహిళలు యుద్ధంలో పాల్గొనాలి” అనీ చెప్పిన వేదం “భర్తకు సంపాదించే మార్గాలు నేర్పించు” అనీ మహిళకు చెబుతూ ఆమె ఆవశ్యకతను మనకు తెలియజేస్తోంది.

మన భారతదేశంలోని ఋషులలో రోమశ, లోపాముద్ర , అదితి,‌ విశ్వనార, స్వస్తి, శశ్వతి,‌ సూర్య, ఇంద్రాణి, శుచి, ఆపరి, ఉశన, గౌరివీతి, చైలకి, జయ, ప్రాదురాక్షి, మేధ, రమ్యాక్షి, లౌగాక్షి, వారుని, విదర్భి, విశ్వనార, వృష , సర్పరాజ్ఞి, సునీతి, హైమ ఇంకా కొందరు మహిళలు ఉండేవారు. కొన్ని మంత్రాలకు ఋషులైన మహిళలు ద్రష్టలు.

“అదిశక్తి” అంటూ శక్తి అంటే మహిళే అని మనకు తెలియచెప్పడం జరిగింది. “శివుడు శక్తితో కలిస్తేనే జగత్తును సృష్టించే శక్తి కలవాడు అవుతాడు అలా కాకపోతే దేవుడు (శివుడు) ఏ కొంచెమైనా కదలడానికి కూడా నేర్పు కలవాడు అవలేడు” అని తెలియచెబుతూ ‘శివ శ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పన్దితుమపి’ అని ఆదిశంకరులు సౌందర్యలహరిలో ప్రవచించారు. మహిళ లేకపోతే శక్తే లేదు.  తైత్తరీయ బ్రాహ్మణం “అర్షో వా ఏవ ఆత్మనః యత్పత్నీ” అని చెప్పింది. అంటే భార్య మగవాడిలో అర్ధ భాగం అని అర్థం.

“మాతృ దేవో భవ” అని ముందుగా అన్న తరువాతే “పితృ దేవో‌ భవ” అని తైత్తరీయోపనిషత్ మనకు దిశా నిర్దేశం చేసింది.

వ్యాఖ్యానించబడలేని ఔన్నత్యం ఒక మూర్తిమత్వాన్ని పొందింది; అదే మహిళ. మహిళను సరిగ్గా అర్థం చేసుకోవడం, సరిగ్గా గౌరవించడం మనం నేర్చుకోవాలి. సరైన మహిళకు సాటి సరైన మహిళ తత్త్వమే. సరైన మహిళ లేదా సరైన  మహిళ తత్త్వం ప్రేరణ, స్ఫూర్తి కాగా మనం సరైన, మేలైన మనుగడ చెయ్యాలి.

ఈ మహిళా దినంలో ఫార్శీ కవితా ప్రక్రియ గజల్ రూపంలో మహిళ మహత్తును మనం మనసారా పాడుకుందాం…

~

గజల్

అమ్మయింది, తోబుట్టువయింది, ఆలి అయింది ఆమె;
ఆడదై అడుగడుగున మనతోడై నిలిచింది ఆమె.

ఏ ఉజ్జ్వల స్ఫురణ ఆడది అయిందో చెప్పలేం మనం;
అద్భుతాలకు అసలైన రూపమై విరిసింది ఆమె.

అనురాగం ఆప్యాయతల కలబోత ఓ స్త్రీ కదా?
ఆనందానికి ఆలయం తానై వెలిసింది ఆమె.

మన ఉనికికి మూలం, మనుగడకు ఆలవాలం వనిత;
అవనిని ఆశీర్వదించడానికై వచ్చింది ఆమె.

లాలన తానై, లాలి తానై లలన మనకై ఉంది;
సృష్టిలోన ఓ మహేంద్రజాలమై తోచింది ఆమె.

మూగిన జీవన చీకటిలోన ఇంతి చెఱగని కాంతి;
జీవితంలొ మనతో పలికే మెఱుపై మెఱిసింది ఆమె.

రోచిష్మాన్, తెలుసుకో సత్యాన్ని, సాటిలేదు స్త్రీకి;
బంధాలను కలుపుతూ కదిలే కావ్యమయింది ఆమె.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here