మా మిత్రుల వియత్నాం పర్యటన-1

0
3

[శ్రీ విజయ భాస్కరరెడ్డి, తన స్నేహితుడు దయానందబాబుతో కలిసి జరిపిన వియత్నాం పర్యటన అనుభవాలను అక్షరబద్ధం చేసి అందిస్తున్నారు డా. కాళిదాసు పురుషోత్తం. నెరేషన్ విజయ భాస్కరరెడ్డి గారు.]

[dropcap]వి[/dropcap]యత్నాం ప్రజల వీరోచిత పోరాటాలను గురించి చదివినపుడు, ఆ పోరాట ఉద్యమ నేపథ్యంలో వచ్బిన ప్లటూన్, హెవెన్ అండ్ ఎర్త్, ది పోస్టు వంటి చిత్రాలు చూచినపుడు వియత్నాం దేశాన్ని చూడాలనే బలమైన కోరిక కలిగింది. ట్రావెల్ కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈజిప్టు యాత్రలో పాల్గొన్నా, నాకు తృప్తిగా అనిపించలేదు. పిరమిడ్‍ల వద్ద కన్నా సెంటు సీసాల అంగళ్ళ వద్ద ఎక్కువ సమయం తిప్పారు.

ఇంజనీరింగ్‌లో నా సహవిద్యార్థి, మిత్రులు శ్రీ దయానందబాబు కూడా వియత్నాం పర్యటనకు వస్తానన్నారు. ఇద్దరం దాదాపు మూడు నెలలు ముందే విమానం టికెట్లు, హోటళ్లు, బస్ టికెట్లు, రైల్వే రిజర్వేషన్లు, బేక్ పాకర్స్ హాస్టళ్లు అన్నీ రిజర్వు చేసుకొని సిద్ధమయ్యాము.

2023 అక్టోబర్ 30న బెంగుళూరు నుంచి వియత్నాం రాజధాని హానోయ్‍కి విమానంలో బయలుదేరాము. బ్యాంగ్‌కాక్‌లో విమానం మారి మరుసటి రోజు అంటే 31-10-23 ఉదయం 9 గంటల ప్రాంతంలో హానోయ్‌లో దిగి సిటీ హాస్టల్లో దిగాము, విమానాశ్రయంలోనే ఆ దేశాపు ఫోన్ సిమ్ కార్డు తీసుకోకపోవడం వల్ల, సమయం వృథా అయి ఇబ్బంది పడవలసి వచ్చింది.

ఎయిర్‍పోర్ట్ నుంచి హానోయ్ సిటీకి బస్‍లో

నవంబరు 1వ తారీకు

బాయ్ దినా పగోడా సందర్శనం:

ఉత్తర వియత్నాంలోని నినా బినాహ ప్రావిన్సులో బాయ్ దినా పగోడా వియత్నామీయులకు ముఖ్యమైన అధ్యాత్మిక కేంద్రమే కాక, సాంస్కృతిక కేంద్రం కూడా. బాయ్ దిన్ పర్వతం మీద అనేక పగోడాలున్నాయి.

బాయ్ దినా పగోడా

వియత్నాంలోని బాయ్ దిన్ అతి పెద్ద పగోడాను అంతస్తులుగా నిర్మించారు. పర్వతం పైకి వెళ్ళడానికి మెట్లదారిలో కాస్త శ్రమపడి వెళ్లాలి. దూరం నుంచే కొండ మీది ఆలయ సముదాయం, ఎత్తైన దీపస్తంభం, పచ్చని కొండలు నేత్రపర్వంగా కనిపిస్తాయి. బాయ్ దిన్ ఆగ్నేయ ఆసియాలోనే అతి పెద్ద పగోడా.

మూవా గుహలు:

ట్రాంగ్ ఆన్ నదిలో నౌకావిహారం;

కొండల నడుమ నావ నదిలో కొండల క్రింద గుహ మార్గంలో గుహ లోపలికి ప్రవేశించి కొంత దూరం వెళ్ళి మరొక మార్గంలో నదిలోకి తిరిగివస్తుంది. గుహా మార్గం రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించబడింది. నావను మహిళలే తెడ్లు వేస్తూ నడుపుతారు. నావ వెళ్ళే దారంతా ఎర్రని కలువ మొగ్గలు.. పైన తెల్లని మబ్బులు తేలిపోతూన్నా నీలాకాశం నదిలో ప్రతిబింబిస్తుంటుంది. చాలా అందమైన ప్రకృతి దృశాలు.

Trang on నదిలో నావ మీద విహారం
మూవా గుహలు, నిన్ బిన్

బాయ్ దిన్ పగోడాల సందర్శనం, మూవా గుహలు, ట్రాంగ్ ఆన్ నదిలో నౌకా విహారం అంతా ఒకరోజులో పూర్తి చేసుకోవచ్చు. రాత్రి హానోయ్ చేరి, ఆ రాత్రే సాపా (SAPA) కి వెళ్ళే బస్సులో సాపాకు బయలుదేరాము.

నవంబరు 2వ తారీకు

సాపా టౌన్‌కు బస్సు ప్రయాణం:

సాపా పర్యాటక కేంద్రాన్ని సన్‍ప్లాజా టూరిస్టు సంస్థ నిర్వహిస్తోంది, వినోదాలతో విశాంతిగా పిన్నలూ, పెద్దలూ శెలవులు గడపడానికి తగిన ప్రదేశం సాపా.

Cat Cat గ్రామ సందర్శనం:

రెండోరోజు రాత్రి హానోయ్ నుంచి సాపాకు బస్సు ప్రయాగానికి ఏర్పాట్లు చేసుకొన్నాము. సుమారు అయిదున్నర గంటల ప్రయాణం. బస్ సాపాకు వేకువన 4 గంటలకు చేరింది. హోం స్టే లో లగేజి పడేసి, సాపా చుట్టి రావడానికి బయల్దేరాము. సాపా టౌన్ పొలిమేరల్లో ఉన్న కేట్ కేట్ అనే హస్తకళలకు ప్రసిద్ధి చెందిన గ్రామాన్ని చూసేందుకు బయలుదేరాము. గ్రామీణులు వెదురు బుట్టలు, ఇతర వస్తువులను తయారు చేస్తారు. ఆ గ్రామంలో జానపద కళాకారుల రంగస్థలు ప్రదర్శన ఉంది గాని, మాకు చూచే అవకాశం లేకపోయింది.

క్యాట్ క్యాట్ గ్రామం మార్కెట్

ఫ్యాన్సిపాన్ పర్వతం:

ఫ్యాన్సిపాన్ పర్వత శిఖరం

గంటలో సాపాకు తిరిగి వచ్చి, ఆ టౌను సమీపంలోనే ఉన్న ఫ్యాన్సిపాన్ పర్వత శిఖరం మీదికి బయల్దేరాము. వియాత్నంలో అన్నిటికన్నా ఉన్నతమైన పర్వతం ఫ్యాన్సిపాన్. సుమారు 3143 ఎంటర్ల ఎత్తులో ఉంది. పర్వత శిఖరం మీద గొప్ప పగోడా, బౌద్ధ మఠాలు, ఇతర కట్టడాలు ఉన్నాయి, శిఖరం పైకి చేరడానికి మూడంచెల ప్రయాణం, మొదట కొంత దూరం రైల్లో, మరికొంతదూరం కేబుల్ కార్‍లో. కేబుల్ కార్ స్టేషన్ వద్ద నుంచి వించ్ ట్రైయిన్‍లో వెళ్ళాలి, వించ్ ట్రెయిన్‌కు ఊటీ కొండపైకి వెళ్ళే రైలుకున్నట్లు మధ్యలో పళ్ళ చక్రాలుంటాయి, జారిపోకుండా.

పదివేల అడుగుల ఎత్తున్న ఆ పర్వత శిఖరం మీద నుంచి చుట్టూతా విస్తరించిన పర్వతాలు, పర్వతాలపై వాలిన తెల్లటి మబ్బులు, పర్వతాల మీది ఆకుపచ్చని వృక్ష సంపద, ఆకాశాన్ని స్పృశిస్తున్నట్లున్న ప్రదేశంలో ఏ కిన్నెరలో, కింపురుషులో, గంధర్వులో సంచరిస్తున్న చందంగా మేమూ సంచరిస్తున్నమన్న భావన మనసులో మెదిలింది. FANSIPAN నుంచి తిరిగి వచ్చి SAPA వచ్చినాము.

సాపాలో రాత్రి 11 గంటలకు బస్సెక్కి తెల్లవారు ఝామున, హానోయ్ చేరాము.

నవంబరు 3వ తారీకు

హనోయ్ సిటీ టూర్:

హానోయ్ సిటీ సందర్శనకు బస్ టికెట్ తీసుకొని, సిటీ బస్‍లు ఎక్కుతూ, దిగుతూ (Hop and Hop) నగరమంతా తిరిగి చూచాము. వియత్నాం స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన హోచిమిన్‍ను – మనం మహాత్ముణ్ణి గౌరవించినట్లే – వియాత్నామీయులు గౌరవిస్తారు.

హోచిమన్ ముసోలీయం

ఆయన  పార్థివ దేహాన్ని సందర్శకులు దర్శించేందుకు వీలుగా – మాస్కోలో లెనిన్ మహాశయుల దేహాన్ని భద్రపరచినట్టే భద్రపరిచారు. ఆ రోజు కు సెలవట. ఆయన దేహాన్ని మాత్రం చూడలేకపోయాము.

ఫ్రెంచి వలస ప్రభుత్వం నిర్మించిన హానోయ్ ఓపెరా హౌస్ భవనం చాలా అందమైన భవనం. కన్ఫ్యూషియస్‍కు అంకితం చేయబడ్డ టెంపుల్ ఆఫ్ లిటరేచర్ (సాహితీ సదనం), సరస్సు తీరంలో నిర్మించిన Quoc Pagoda మాకు ఎంతో నచ్చాయి.

Quoc Pagoda

Quoc Pagoda కు వేయి సంవత్సరాల చరిత్ర ఉందట. సరస్సు తీరంలో మహావృక్షాల మధ్య అనేక అంతస్తులుగా నిర్మించబడిన పగోడా దూరం నుంచే గంభీరంగా నిలబడి ఉంటుంది. ప్రాచీన కాలం నాటి రాజుల కోట, Ngoc Son Temple వంటి చారిత్రక ప్రదేశాలన్నీ తిరిగి చూచాము. పగటి వేళ Train Street చూచాము కానీ, తృప్తి లేక, రాత్రి చీకటి పడిన తర్వాత మళ్ళీ ఒకసారి Train Street కు వెళ్ళాము.

Train Street:

హానోయ్ పాతనగరంలోని ఒక ఇరుకు మార్గంలో Train Street బజారును సాయంత్రం వెళ్ళి చూచాము. రైలు మార్గానికి రెండు వైపులా ఇరుకు ఇరుకు ఇళ్లు. పట్టాల పక్కనే ఇళ్లు, అంగళ్లు. సాయంత్రం రంగురంగుల దీపకాంతిలో అంగళ్ళు. సందర్శకులను తమ షాపులు చూచి వస్తువులను కొనమని షాపుల వాళ్ళు పిలుస్తూంటారు. టూరిస్టులు రైలు మార్గానికి ఇరువైపులా ఉన్న అంగళ్ళను పట్టాలు దాటుతూ అటూ ఇటూ తిరిగి చూస్తూంటారు. పట్టాలకు నాలుగడల దూరంలో ఇళ్ళూ, షాపులూ.. అప్పుడప్పుడూ వేగంగా వెళ్లే రైళ్లు.

Train Street

మనం కలలో కూడా అటువంటి దృశ్యాన్ని ఊహించుకోలేము, హానోయ్‌లో ఇదొక సాధారణ దృశ్యం.

‍(అత్యంత బిజీగా ఉండే ట్రెయిన్ స్ట్రీట్ – చిన్న వీడియో క్లిప్ చూడవచ్చు.)

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here