[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[చిత్ర, సుందర్ మాట్లాడుకుంటూంటారు. జో ని పోలీసులు తీసుకెళ్ళారని చెప్తుంది. తన దగ్గరకి కూడా పోలీసులు వస్తారని అనుకుంటాడు సుందర్. వాళ్ళు నిన్నేమీ అడగలేదా అని అంటాడు చిత్రతో. ఇక్కడేంటి పని, జో తో ఎలా పరిచయం అని అడిగారనీ, తాను అన్నీ వివరించాననీ చెబుతుంది. వాళ్ళ ప్రశ్నలకి తానెంతో బాధపడ్డానని చెబుతూ, మీ గురించి అడిగారనీ, మీ ఫోన్ నెంబర్ తీసుకున్నారనీ చెప్తుంది. భయపడద్దని అంటాడు సుందర్. ఇలాంటివి తానెన్నో చూశానని అంటూ, అస్సాంలో తనకెదురైన అనుభవాన్ని చెబుతుంది. జో వైద్యం చేయగలడని అన్నారు నిజమేనా అని అడుగుతుంది. జో చిన్నప్పుడు సాయాజీ అనే వైద్యుడి వద్ద వైద్యం నేర్చుకున్నాడని చెప్తాడు సుందర్. ఏది ఏమైనా తాను జ్యోతిని వదిలి వెళ్ళనని అంటుంది చిత్ర. ఇంతలో సుందర్‍కి గవడె ఫోన్ చేస్తాడు. సమీర్ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. జో ని పోలీసులు తీసుకెళ్ళారని చెప్తాడు సుందర్. అతనితో మీకేమైనా పని వుందా అని అడుగుతాడు గవడె. ప్రత్యేకించీ ఏమీ పని లేదనీ, మామూలుగానే అతని ఆడిటోరియమ్‍కి వెళ్ళాననీ అంటాడు సుందర్. రేపు పేపర్లలో జో గురించి ఏదో రాస్తారూ, అవన్నీ పట్టించుకోవద్దని చెప్తాడు గవడె. జ్యోతి ఎలా ఉందని అడుగుతాడు. జ్యోతి మీకెలా తెలుసని సుందర్ ఎదురు ప్రశ్నిస్తే హాస్పటల్‍లో జరుగుతున్న వన్నీ తనకి తెలుస్తున్నాయని చెప్తాడు. జ్యోతి ఇప్పుడే డిశ్చార్జ్ కాకపోవచ్చని చెప్తాడు సుందర్. గవడె ఫోన్ పెట్టేస్తాడు. కాసేపు ఆలోచనలో పడతాడు సుందర్. పోలీసులు వచ్చినప్పుడల్లా గవడె లైన్‍లోకి ఎలా వస్తాడో అర్థం కాదతనికి. సుందర్ గవడెతో మాట్లాడుతున్నప్పుడు హాస్పిటల్ వాళ్ళు తనకి ఫోన్ చేశారనీ, వీలైనంత త్వరగా జ్యోతిని తీసుకెళ్ళమన్నారని అంటుంది చిత్ర. – ఇక చదవండి.]
[dropcap]ఆ[/dropcap] రాత్రి చిత్ర ఎంతో దిగులుగా, కొంత విసుగ్గా, భయంగా గుడ్ నైట్ చెప్పింది. ఉదయమే లేచి కృష్ణప్రసాద్ గారి తోట వైపు నడక ప్రారంభించాను. ఎక్కడికి తీసుకుని వెళుతుంది జ్యోతిని? ఊరు కాని ఊరు. రోగం కాని రోగం. ఎవరూ ఎంత నచ్చ చెప్పినా ఓ పట్టాన ఊర్కోరు. పలు రకాల ప్రశ్నలు ఎదురవుతాయి. ఈ అమ్మాయి ఒంటరిగా ఎంత దూరం పోరాడగలదు? జ్యోతితో ఈమెకు ఎంత అవసరమున్నా ఇలా చిక్కుల్లోకి వెళ్లిపోవటం భావ్యమా?.. ఆలోచనలు అవే కాలీ కాలని టపాకాయల్లా పేలి ఊర్కుంటున్నాయి. నేను ప్రస్తుతం అన్నింటనీ ప్రక్కన పెట్టి హైదరాబాదు వెళ్లినా ఎక్కడో అందరికీ అనుమానమే. అలా అని ఇక్కడుండిపోయి ఏదో ప్రయత్నించినా కొందరికి అనుమానమే. ఇలాంటప్పుడు గవడె నాకు కాల్ చేస్తారు. ఎందుకో తటస్థంగా ఉన్నాడు.
తోటలోకి అడుగు పెట్టాను. ప్రసాద్ గారు ఏవో పూలూ, ఆకులూ కోయిస్తున్నారు.
“కోయించేస్తున్నా రెందుకు?”, అడిగాను.
“ఏవైపోయారు?” నన్ను ఎదురు ప్రశ్నించారాయన.
ఆప్తులు. కొన్ని ఫార్మాలిటీస్ ప్రక్కన పెడితేనే ఆప్తులనిపించుకుంటారు.
“బాగా తెలిసిన వారికి జబ్బు చేసింది.”
“ఓ. ఏంటి జబ్బు?”
“మానసిక పరమైనది.”
అనుమానంగా చూసారు. అది నాకు కూడా ఉందేమో అన్నట్లు ఆయన చూపులో అర్థమైంది.
“జబ్బు ఇది అని చెప్పారా?”
“పూర్తిగా చెప్పలేదు!”
ప్రక్కగా వెళ్ళి చేతులు కడుక్కున్నారు.
“రండి.”
“ఎక్కడికి?”
“పూల తోట ఒక మనసు లాంటిది.”
“కరెక్ట్.”
“కొన్ని పూచే పూలు. కొన్ని పూయనివి. కొన్ని వాడిపోయేవి. వీటితో ఊగుతూ, వేగుతూ, విహరించాలి. నడక అంటే ఏమిటి? మనసును మనతో మనుగడ చేయమని చెప్పటం.”
ఇద్దరం నడుస్తూ పోతున్నాం. ఆయన ఈ రోజు మంచి మూడ్‍లో ఉన్నట్లుంది.
“పూల వలన చికిత్స ఉందంటారా?”
“ఆకుల వలన కూడా. వ్రేళ్ల నుంచీ, బెరడు నుంచీ, వీటి గాలి నుంచీ.. ఇదో అద్భుతమైన ప్రపంచం. మీ తెలియక పోవచ్చు. మీ శరీరం కొన్ని గాలులను తీసుకోలేదు! విన్నారా ఎప్పుడైనా?”
“లేదు.”
“ఇదే తోటలో కొన్ని చెట్ల నుంచి వచ్చే గాలి కొందరి ఊపిరితిత్తులను ప్రక్షాళన చేస్తుంది, కొందరికి అది పడదు. మనకీ, ప్రకృతికి గల సంబంధం తెలుసుకోవటమే ఆత్మోద్ధరణ!”
“వానప్రస్థం!”
ప్రసాద్ గారు ఆగిపొయారు. కళ్ళజోడు పైకి తోశారు.
“ఎప్పుడో చేసేది మీరన్నది. నేను ఎప్పుడూ చేసేదాని గురించి ప్రస్తావిస్తున్నాను.”
“ఓ. బాగుంది. చెప్పండి.”
“అడుగడుగునా ఆలోచించండి. మన చుట్టూ ఉన్నవన్నీ మహావృక్షాలు. కొందరు వ్యక్తులు అటువంటి వారు. కొందరు అడ్డదిడ్డంగా ఎదుగుతున్న మొక్కలు.”
“అడ్డం తగులుతూ ఉంటారు.”
నన్ను ఎందుకు అడ్డం వచ్చావన్నట్లు చూసారు. ‘వీడు బాగుపడడు’ అని బహుశ లోపల అనుకుని ప్రసంగం సాగించారు.
“కావచ్చు. మనందరిలో వైపరీత్యాలు, విపరీత ధోరణలు ఉంటాయి.”
“చాలా.”
“అందరిలో బి.పి ఉంటుంది. అది కొద్దిగా అటూ ఇటూ అయినప్పుడు డాక్టర్ అదుగో బి.పి. అంటాడు. అంటే అది మబ్బుల చాటు నుండి ఇవతలికి వచ్చిన చంద్రుడిలా కనిపించి పోయిందని అర్థం.”
“కరెక్ట్.”
“అలాగే అందరం పిచ్చివాళ్ళమే.”
ఆగిపోయాను.
“ఎందుకు ఆగిపోయారు?”
“లేదు, వస్తున్నాను. ఆ మాట నచ్చేసింది.”
“పిచ్చి అటూ ఇటూ ఊగి కదలి బయటకు వచ్చి కనిపించగానే అదుగో పిచ్చివాడు అంటారు. అంతే.”
“అయితే మనలో ఏదో కదలటం పిచ్చి లాంటిది. అంతేనా?”
“అవును. ఏ కదలికా లేని తపస్సు మనం చెయ్యలేం కదా?”
ఆకులు కోసిన కుర్రాడు రెండు బస్తాలు తెచ్చి దగ్గర పెట్టాడు. ఆయన ఆ ఆకులని జాగ్రత్తగా పరీక్షించి, కొన్నింటిని తీసి ప్రక్కన పారేసి, “ఊఁ, తీస్కుని పో” అన్నారు.
“ఏం చేస్తారు ఈ ఆకులని?” అడిగాను.
“ఈ ఆకులని ఆప్తులు అంటారు.”
“అబ్బో. అంత గొప్పవా?”
“అంతే కాదు. సోన్ పత్తా.. అంటే బంగారు ఆకులు అనే పేరు కూడా ఉంది.”
“ఇప్పుడు ఈ కుర్రాడు అమ్ముకుంటాడా?”
“మార్కెట్‌లో పెడతాడు. వీటిని పండుగ సమయంలో ఇచ్చిపుచ్చుకోవటం సంప్రదాయం.”
“పూల సంగతి?”
“రండి”, అంటూ కొంత లోపలికి లాక్కెళ్లారు. పూపొదలను ఇంతగా ప్రేమించిన వ్యక్తిని నేను చూడలేదు. లోపలికి నడిచాను. అక్కడ పింక్ కలర్‌లో సుందరమైన పూలున్నాయి.
“ఇవి బవుహినియా రెస్‌మోసా.. ఆప్తో పువ్వులు.”
జోవాక్విమ్ మాటలు గుర్తుకొచ్చాయి. ఎందుకో ప్రసాద్ గారిని మరి కొన్ని ప్రశ్నలు అడగాలనిపించింది.
“ఈ మొక్కకు ఏదైనా విశేషం ఉందా?” అడిగాను.
కర్ణాటక సంగీత కచ్చేరీలో వయొలిన్, మృదంగ వాయిద్యాలు – పాడుతున్న వారికి చక్కని సహచర్యం చేసి స్వర ప్రస్థానాన్ని అనుసరించి సహకరిస్తున్నప్పుడు గాయకుడు ఎటువంటి తన్మయత్వాన్ని పొందుతాడో, అటువంటి రస సిద్ధి లోకి వెళ్లిపోయారు మహానుభావులు.
ఆకాశం వైపు చూసి కళ్ళు మూసి తెరచి కళ్లజోడు సర్దుకున్నారు.
“ఏదైనా అనటం సమంజసం కాదు. అడుక్కునే వాడు ఏదైనా ఉంటే ఇవ్వండి అన్నట్లుంది.. అన్నీ విశేషాలే.”
“ఓ. చెప్పండి.”
“మొదటి విచిత్రం చెబుతాను. ఈ మొక్క మట్టి జారిపోకుండా కాపాడుతుంది. అందుకొని దీనిని ఖాళీ ప్రదేశాలలో ఎక్కువగా నాటుతారు. ఎండిపోయిన ఆకుల నుంచి బీడీలు తయారు చేస్తారు.”
“ఛా.”
“అవును. ఆకుపచ్చని ఆకులను భోజనం సమయంలో ఒక ప్లేట్ ప్రక్కన పెట్టుకుని తింటారు.”
“ఇదేంటి ఒక మొక్కలో ఒకటి మాదకం, ఒకటి మోదకం?”
“కరెక్ట్. వయసు మీద పడ్డ వాళ్ల వాగుడంతా ధోరణి వాగుడులా మారుతుంది. అలాగే ఎండిపోయిన ఈ ఆకు బీడీగా మారుతుంది. నన్ను చూడండి. నాకు ఏ వ్యసనం లేదు. నేనే అందరికీ ఓ వ్యాసనంగా మారాను.”
“మీరు గొప్పవారు.”
“మూడవది చెబుతాను. దీని ఆకులు తీయగా ఉంటాయి. ఇది తలనొప్పులకీ, జ్వరాలకీ, చర్మ వ్యాధులకీ, రక్తపు సమస్యలకీ, విరేచనాలకీ వైద్యానికి పనికొస్తుంది.”
“వింతగా ఉంది.”
“దీని బెరడు నుంచి ఒక రసాయనాన్ని తీసి పుండ్లకు – చర్మం మీద, శరీరంలో లోపల, రెండింటికీ మందులా వాడతారు. అందకే దానిని ఆప్త అన్నారు.”
“బంగారం అన్నారెందుకు?”
“అదొక నమ్మకం. ఈ ఆకులు ఇచ్చిపుచ్చుకుంటే ఇంట్లో బంగారం అభివృద్ధి కాగలదని నమ్మకం.”
“ఏ నమ్మకమూ ఊరకే రాదని నేను ఊరకే నమ్ముతాను.”
ఆయన నవ్వారు. “అలా చూడండి..” అన్నారు. “ప్రతి మొక్కకీ ఒక పువ్వు. మిగతా పూల మధ్యలో నిటారుగా నిలబడుతుంది. ఎందుకంటారు?”
“వాస్తవానికి ఈ పూలన్నీ కోసి పుష్పగుచ్ఛం చేయక్కరలేదు. సహజంగానే ప్రతి మొక్కా ఒక పుష్పగుచ్ఛాన్ని మనకు అందిస్తోంది. వాటి మధ్యలో నిటారుగా పైకి కనిపిస్తున్నది వాటిలో నాయకుడు అనాలి.”
“ఇంకో మాట అనుకుందాం.”
“చెప్పండి.”
“ప్రతి వ్యక్తిలో ఏదో ఒక గుణం పైకి లేచి అలా పొంగుతూ ఉంటుంది.”
“కరెక్ట్.”
“దానినే పిచ్చి అనేస్తాం.”
“ఛా.”
“అవును. గాయకునిలో సంగీతం చిన్నప్పటి నుండీ అలా తేలిపోతూ ఉంటుంది. చిత్రకారునిలో ఆ కళ చిత్రవిచిత్రాలు చేసేస్తు ఉంటుంది. రచయితలలో ఆ గోల పిచ్చులూ, వెర్రులుగా మారుతూ ఉంటుంది.”
“పూర్తిగా.”
“అంటే అర్థం ఏమిటంటే అందరికీ ఒక రకమైన పిచ్చి ఉంటుంది.”
నా వెనుక ఎవరో నిలబడ్డారు. అటు తిరిగాను. ఎక్కడి నుండి వచ్చాడో కార్వాల్లో వచ్చాడు.
“అరె?”
“రిస్కార్ట్స్‌కి వెళ్లాను సార్. ఈ సమయంలో ఇక్కడుంటారని చెప్పారు. వెతుక్కుంటూ వచ్చాను.”
“ఏమైంది?”
“ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.”
(ఇంకా ఉంది)