పిన్నల పెద్దరికం-2

0
4

[శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ‘పిన్నల పెద్దరికం’ అనే నాటిక అందిస్తున్నాము. ఇది 2వ భాగం. మొదటి భాగం ఇక్కడ.]

(తెర తీయగానే, జగదీష్ సోఫాలో కూర్చుని ఉంటాడు)

జానకి – ‘ఎంతసేపయిందండి మీరు వచ్చి.’

జగదీష్ – ‘ఇప్పుడే; ఓ పది నిమిషాలయింది.’

జానకి – ‘ఏమండీ హనుమంతయ్యగారింటికి ఇవాళ వెళతానన్నారు. వెళ్ళేరా.’

జగదీష్ – ‘వెళ్ళేను.. జానకీ.’

జానకి – ‘అయ్యో, ఖర్మ. అంత నిస్పృహుగా మాట్లాడుతున్నారు. ఏమిటన్నాడండీ, ఆయన.’

జగదీష్ – ‘జానకీ, మన రోజులు బాగున్నట్టు లేదు. ఆయన పోలీసు అసిస్టెంటు కమిషనరును నిన్న కలిసేడట. ఇది క్రిమినల్ అఫెన్సు కాదు గనక వాడిని కస్టడీలోకి తీసుకోలేరట. వాడు డబ్బు ఇవ్వనని అనడం లేదు కనక పోలీసు రిపోర్టు వల్ల అట్టే లాభం లేదన్నాడట. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక పోలీసు అధికారి, మరో విషయం చెప్పేడట. మన ఇంట్లో దిగే ముందు, వాడు భువనేశ్వర్ కోలనీలో అద్దెకుండేవాడట. వాళ్లకి కూడా మనకు వేసిన టోపీయే వేసేడట. మనకు ఇచ్చినట్లే, ఒక నెల అద్దె అడగకుండానే ఎడ్వాంసు ఇచ్చి, ఆ తరువాత ఏడాదికి పైగా అద్దె ఇవ్వక, మనకు పెట్టిన తిప్పలే పెట్టేడట. ఇల్లు ఖాళీ చెయ్యమంటే, యాభైవేలిస్తే ఖాళీ చేస్తానన్నాడట. ఆ యజమాని పోలీసు రిపోర్ట్ ఇచ్చినా లాభం లేక వాడికో నలభైవేలు సమర్పించుకొని వదిలించుకొన్నాడట. అందులోవే ముఫైవేలు మనకు ఎడ్వాంసు ఇచ్చి, మన్ని ఉద్ధరించేడు.’

జానకి – ‘అయ్యో, ఖర్మ. మీరు దాని కోసం వర్రీ అయి, మీ హెల్తు పాడుచేసుకోకండి. పిల్లాడితో మాట్లాడుదాం. వాడు ఏమిటంటాడో చూద్దాం.’

జగదీష్ – ‘జానకీ, గాంధీ హైస్కూలు ప్రిన్సిపాల్ గారు; ఏదో మాట్లాడాలిట, వస్తానన్నారు. ఆయన వచ్చే వేళయింది. వాళ్ళకివ్వడానికి బిస్కట్లు ఉన్నాయా.’

జానకి – ‘ఉన్నాయండి. వాళ్ళు వచ్చేక, తాగుతామంటే టీ పెడతాను.’

జగదీష్ – ‘అలా చెయ్యి. చేసేక వాళ్ళు తాగమంటే వేస్ట్ అవుతుంది.’

జానకి – ‘వెళ్తానండి. వంటింట్లో పనుంది.’

(జానకి నిష్క్రమించును. జగదీష్ పేపర్ చదువుతూ ఉంటాడు. అంతలో ‘May we come in sir.’ అని వినిపిస్తుంది.)

జగదీష్ – ‘Welcome.. సర్. రండి.’ (వెళ్లి అతిథులను ఆహ్వానిస్తాడు. ముగ్గురూ సోఫాలలో ఆసీనులవుతారు.)

విశ్వనాధం – ‘సర్, నేను విశ్వనాధాన్ని. రెండు సంవత్సరాల క్రితం గాంధీ హైస్కూలులో ప్రిన్సిపాల్‌గా చేరేను.( ప్రక్కనే కూర్చుని ఉన్న వ్యక్తిని చూపిస్తూ) ఈయన ప్రహ్లాదరావుగారు. ఈ సంవత్సరమే మా స్కూల్లో మేథ్స్ టీచరుగా చేరేరు.’

జగదీష్ – ‘గాంధీ హైస్కూలు చాలా ఫేమస్ స్కూలు. మా ఇద్దరు అబ్బాయిలు మీ స్కూలులో చదువుకున్నారు.’

ప్రహ్లాదరావు – ‘మీ అబ్బాయిలు ఏమిటి చదువుకొన్నారండి.’

జగదీష్ – ‘పెద్దవాడు విక్రమ్, ఇండియాలో కాస్ట్ ఎకౌంటన్సీ చేసేక, U.S.లో M.B.A. చేసేడండి. రెండోవాడు M.Sc. ఫిజిక్స్ చేసేడండి.’

ప్రహ్లాదరావు – ‘అలాగా సర్. వాళ్లిప్పుడు ఏమిటి చేస్తున్నారండి.’

జగదీష్ – ‘పెద్దవాడు, విక్రమ్, షికాగోలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నాడండి. రెండోవాడు, రామానుజన్, I.P.S. కు సెలెక్ట్ అయ్యేడండి. ముస్సోరీలో ట్రైనింగ్ అవుతున్నాడు.’

విశ్వనాధం – ‘సార్, మీ ఇద్దరు అబ్బాయిల్ని డిఫెరెంట్ ప్రొఫెషన్సులో పెట్టేరండి.’

జగదీష్ – ‘మేము పిల్లలమీద ఫలానా ప్రొఫెషన్‌లో చేరండి, అని ప్రెషర్ పెట్టలేదండి. వాళ్లకి డిఫరెంట్ ప్రొఫెషన్ల గూర్చి మాకు తెలిసింది చెప్పేమండి. వాళ్ళ aptitude ని బట్టి వాళ్ళే నిర్ణయం తీసుకొన్నారు.’

ప్రహ్లాదరావు – ‘You are ideal సర్.’

జగదీష్ – ‘ఇందులో ideal ఏమీ లేదండి. They should enter the profession of their choice; not ours.’

నిజానికి మన పిల్లలకు సరియైన ఎడ్యుకేషన్ సిస్టం లేదండి. పది పన్నిండేళ్లకోమారు, ఏవో సిస్టంలో మార్పులు తెచ్చేమంటారు. Unfortunately, అవి old wine in the new bottle. ముఖ్యమయిన సమస్య, the system is not for the boy. The boy is for the system.. మాటల్లోబడి మరచిపోయేను. మీ కోసం టీ చెయ్యమని చెప్పి వస్తాను.’

విశ్వనాధం – ‘క్షమించండి సర్. నాకు కాఫీ, టీ, అలవాటు లేదు.’

ప్రహ్లాదరావు – ‘సర్, నేను బ్రేక్ఫాస్ట్‌తో ఓ కప్పు కాఫీ తీసుకొంటానండి. రోజంతటికి అదేనండి.’

జగదీష్ – (చిరునవ్వుతో) ‘మీరు ideal టీచర్స్.’

విశ్వనాధం – ‘మేము సరియైన ఎక్స్‌పర్ట్ వద్దకు వచ్చేమండి. సర్, మీకు తెలిసిన విషయమే. మన స్తూడెంట్స్‌లో నైన్టీ పెర్సెంట్ చిన్నప్పటినుండి ఇంజినీరు కావాలనే కలలు కంటూ ఉంటారండి.’

ప్రహ్లాదరావు – ‘మరో ప్రొఫెషన్ గూర్చి తెలీదు; ఆలోచించరు కూడా.’

విశ్వనాధం – ‘అది కేవలం వాళ్ళ తప్పు కాదు. పేరెంట్స్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది.’

జగదీష్ – ‘పేరెంట్సు కాంపిటిషన్‌లో పిల్లలు నలిగిపోతున్నారు.’

విశ్వనాధం – ‘అది దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది కొత్త ప్రోగ్రాము ఒకటి స్టార్ట్ చేసేమండి. లెక్కల్లో మంచి మార్కులు రాకపోయినా, ఇంజినీరింగే కాక ఎంచుకోదగ్గ ప్రొఫెషన్లు ఉన్నాయని పిల్లలకు తెలియజేయడానికి ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేసేమండి. ఆ ప్రొఫెషన్లలో మీవంటి సక్సెస్‌ఫుల్ పెర్సన్స్ చేత పిల్లలకు డీటైల్డ్ ఇన్ఫర్మేషన్ ఇప్పిస్తున్నామండి. పేరెంట్స్‌ని కూడా ఇన్వైట్ చేసేమండి.’

జగదీష్ – ‘కంగ్రేచులేషన్స్. వెరీ గుడ్ ఐడియా. ‘

విశ్వనాధం – (ప్రహ్లాదరావును చూపిస్తూ) ‘క్రెడిట్ గోస్ టు దిస్ జంటిల్మన్. ఇదంతా ఆయన ఐడియా. ఇప్పటికి మేము ఇద్దరు ప్రొఫెషనల్స్‌ని ఇన్వైట్ చేసేమండి. సీనియర్ ఏడ్వొకేటు శశాంక్ గారు వచ్చి, లీగల్ ప్రొఫెషన్‌లో ఉన్న పెద్ద పెద్ద ఆపర్చూనిటీస్, ముఖ్యంగా హైకోర్టు, సుప్రీం కోర్టు జడ్జీల గూర్చి వివరంగా చెప్పేరండి. సురేష్ వర్మగారొచ్చి, ఛార్టర్డ్ అకౌంటెంట్ పరీక్ష వివరాలు, ఆ ప్రొఫెషన్లో ఎంత ఫ్యూచర్ ఉందో చెప్పి పిల్లల్ని ఇంప్రెస్ చేసేరండి.’

ప్రహ్లాదరావు – ‘ఆ రెండు ప్రోగ్రాములు బాగా సక్సెస్ అయ్యేయి సార్.’

విశ్వనాధం – ‘సర్, మీరు వీలు చేసుకొని ఒక రోజు మా పిల్లలకు మీ ప్రొఫెషన్ గూర్చి తెలియబరిస్తే, we will be grateful to you.’

జగదీష్ – ‘తప్పకుండా వస్తాను. It is a pleasure. ఇందులో గ్రేట్‌ఫుల్‌గా ఉండడానికి ఏమీ లేదు. It is my duty.’

ప్రహ్లాదరావు – ‘మీకు ఏదయినా అసిస్టెన్స్ కావాలంటే చెప్పండి. సార్.’

జగదీష్ – ‘నేను పవర్ పోయింట్ ప్రెజంటేషన్ చేస్తూ పిల్లలకు ఎక్స్‌ప్లయిన్ చేస్తాను. ఆ సమయంలో కరంటు ఉంటే చాలు.’

ప్రహ్లాదరావు – ‘నో ప్రోబ్లెం సర్. మా స్కూల్లో జనరేటర్ ఉంది.’

విశ్వనాధం – ‘సర్, మీకు ఎప్పుడు వీలవుతుందో చెప్పగలరా.’

జగదీష్ – ‘నాకొక రెండు వారాలు టైము కావలి. పవర్ పోయింటుకు కొన్ని స్లైడ్సు తయారు చేసుకోవాలి. అది అయిపోగానే నేనే మీకు ఫోన్ చేస్తాను.’

ప్రహ్లాదరావు – ‘ఈ లోగా మీకు ఏ ఇన్ఫర్మేషన్ అవసరమయిన ఫోన్ చెయ్యండి సార్. నేను పెర్సనల్‌గా వచ్చి మీకు సబ్మిట్ చేస్తాను.’

జగదీష్ – ‘థేంక్స్. అవసరం లేకపోవచ్చు. అవసరమయితే తప్పక మీకు ఫోన్ చేస్తాను.’

విశ్వనాధం – ‘మీ వేల్యుబుల్ టైములో చాలా టైమిచ్చేరు. మెనీ మెనీ థేంక్స్ సర్.’

ప్రహ్లాదరావు – ‘చాలా థేంక్స్ సర్.’

(ఇద్దరూ శలవు తీసుకొంటారు. జగదీష్ పేపర్ చదువుకొంటూ ఉంటాడు. అంతలో జానకి ప్రవేశిస్తుంది.)

జానకి – ‘మళ్ళీ ఏదో లెక్చరులా ఉంది.’

జగదీష్ – ‘లెక్చరు కాదు, జానకీ. వాళ్ళ స్కూల్లో పిల్లలకు నా ప్రొఫెషన్ గూర్చి నాలుగు ముక్కలు చెప్పమన్నారు. సరే, అన్నాను.’

(అంతలో జగదీష్ కు ఫోను వచ్చింది.)

జగదీష్ – ‘ఇంట్లోనే ఉన్నానండి. రండి.’

జానకి – ‘ఎవరండీ, ఆ ఫోను.’

జగదీష్ – ‘మన అవధాని గారు.’

జానకి – ‘నాకు వంటింట్లో పని ఉంది. వెళతాను. ఆయన రాగానే నాకు చెప్పండి.’

(జానకి నిష్క్రమించును. జగదీష్ ఏదో మేగజీను చదువుకొంటూ ఉంటాడు. కొంత సేపట్లో అవధాని ప్రవేశించును.)

జగదీష్ – ‘నమస్కారం, అవధానిగారూ, రండి కూర్చోండి.’

అవధాని – ‘ఆయుష్మాన్ భవ’

జగదీష్ – (ఫోనులో) ‘ అవధానిగారొచ్చేరు.’

జానకి – (ప్రవేశిస్తూ) ‘నమస్కారం, అవధానిగారూ’

అవధాని – ‘దీర్ఘ సుమంగళీభవ.’

జగదీష్ – ‘అవధానిగారూ, ఏమిటి విశేషం.’

అవధాని – ‘మా ఆంజనేయులుకు ఉద్యోగం దొరికింది సార్. అది చెప్పడానికే వచ్చేను సార్.’

జగదీష్ – ‘కంగ్రేచులేషన్స్.’

జానకి – ‘ ఏ కంపెనీలోనండి.’

అవధాని – ‘తాజ్ హోటల్లో అమ్మగారూ. అంతా సార్ దయ. వాడికి బి కామ్ డిగ్రీతో ఎక్కడా ఉద్యోగాలు దొరక్కుండా ఉంటే, అయ్యగారే సలహా ఇచ్చేరండి; వాణ్ణి కంప్యూటర్ ట్రైనింగులో చేర్పించమని. కంప్యూటర్‌లో ఓ ఏడాది శిక్షణ తీసుకొన్నాడండి. అది పూర్తికాగానే, తాజ్ హోటల్ వాళ్ళు, వాళ్ళ ఎకౌంట్స్ డిపార్టుమెంటులో నెలకు ముఫైవేలమీద తీసుకొన్నారండి. పని నచ్చితే ఆరు నెల్ల తరువాత జీతం పెంచుతామన్నారట.’

జగదీష్ – (అవధానిగారితో) ‘ఈ రోజుల్లో ఏ ఉద్యోగానికైనా కంప్యూటర్ నాలెడ్జ్ తప్పక ఉండాలండి. మీ వాడికి ఇహ ఫరవా లేదు. తప్పక అభివృద్ధిలోకి వస్తాడు.’

అవధాని – ‘తమరి ఆశీర్వాదం.. అమ్మా, మీ అమ్మాయిగారు, అల్లుడుగారు, కుశలమా.’

జానకి – ‘ దేముడి దయ, మీ వంటి పెద్దల ఆశీర్వచనాలతో, ఇద్దరూ క్షేమంగానే ఉన్నారండి.’

అవధాని – ‘సార్, ఇక శెలవా.’

(అవధాని నిష్క్రమించును)

జానకి – ‘ అవధానిగారు కొడుకును పౌరోహిత్యంలో కాక ఉద్యోగంలో పెట్టేరు. మంచి పని చేసేరు. ప్రతీ నెలా ఇంత, అని తెలిస్తే దాని ప్రకారం ఖర్చులు పెట్టుకోవచ్చు.’

జగదీష్ – ‘ఈ రోజుల్లో సెల్ ఫోన్లు పురోహితుల పాత్ర పోషిస్తున్నాయ్, జానకీ. కొందరు పూజావిధానాలన్నీ సెల్ ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకొని వినాయకవ్రతం వంటి పూజలు స్వయంగా చేసీసుకొంటున్నారు. టెక్నాలజీలో వస్తున్న ఢెవెలప్మెంట్స్ మూలాన్న కొన్ని ప్రొఫెషన్సు ఇఫెక్ట్ అవుతున్నాయి.’

జానకి – ‘అవునండి. నిజమే.’

(అంతలో జగదీష్ ఫోను మ్రోగింది.)

జగదీష్ – ‘అవునండి. I am Jagadeesh.. ఏమిటండి మేటర్.. నాలుగు గంటలకు కదా. వస్తాను.’

జానకి – ‘ఎవరండీ, ఫోను.’

జగదీష్ – ‘Income-tax commissioner, జానకీ. ఏదో మాట్లాడాలి; నాలుగు గంటలకు రమ్మన్నారు. ఏమిటి మేటర్, అంటే రండి మాట్లాడుదాం అన్నారు. నేను చెప్పేను కదా, మన రోజులు బాగులేవు, జానకీ. కిందటివారమే టేక్స్ రిఫండ్ కూడా వచ్చింది. మరేమిటో ప్రాబ్లెమ్.’

జానకి – ‘అయ్యో, ఖర్మ. బెంగ పడకండి. మీతో నేనొచ్చీదా.’

జగదీష్ – ‘వద్దు, జానకీ. బాగుండదు. నువ్వు గాభరా పడకు. నాలుగు గంటలన్నారు. బజారులో పని చూసుకొని అటు వెళతాను.’

(తెర పడును. తెర ఎత్తగానే, స్టేజిమీద ఇన్కమ్ టేక్స్ కమిషనరు గారి ఆఫీసు రూము ఉంటుంది. టేబుల్ మీద కొన్ని ఫైల్స్ ఉంటాయి. దానికి ఒక వైపు స్వివెల్ ఛైర్‌లో ఆసీనులయిన కమిషనరు, ఆయనకు ఎదురుగా మూడు ఖాళీ కుర్చీలు, ఉంటాయి. కమిషనరు గాని ఆయన ఎదురుగా ఆసీనులయిన వారు, గాని ప్రేక్షకులకు ఎదురుగా ఉండరు. కమిషనరు ఒక ఫైలు చూస్తూ ఉంటారు. అంతలో ఆయనకు ఫోను వస్తుంది.)

కమిషనర్ – ‘జగదీష్ గారా, లోపలికి పంపించండి’

జగదీష్ – (ప్రవేశిస్తూ) ‘నమస్కారం సర్.’

కమిషనర్ – ‘నమస్కారం. I am Prabhakar. కూర్చోండి. మీరింకా కరోనా రూల్స్ పాటిస్తున్నారు. Good.”

జగదీష్ – ‘మళ్ళీ కొన్ని కేసులు వచ్చేయటగదా. అందుచేత జాగ్రత్తగా ఉంటున్నాను.’

కమిషనర్ – ‘yes. It is safe.’

జగదీష్ – ‘సర్, మీరు రమ్మన్నారు. ఎనీ ప్రాబ్లెమ్.’

కమిషనర్ – ‘Nothing with income tax. మీకు ఇంటద్దె విషయంలో ఏదో ప్రాబ్లెమ్ ఉందని తెలిసింది. అది మాట్లాడుదామని రమ్మన్నాను.’

జగదీష్ – ‘Oh! My God. ఏదో tax ప్రాబ్లెమ్ అనుకొన్నాను.’

కమిషనర్ – ‘I am sorry. మీకు ఫోన్ చేస్తున్న టైములో నా దగ్గర ఇద్దరు విజిటర్స్ ఉండేవారు. అందుచేత పర్పస్ చెప్పలేదు.’

జగదీష్ – ‘It’s okay.. సార్, నా ఇంటద్దె ప్రాబ్లెమ్ మీకెలా తెలిసందండి.’

కమిషనర్ – ‘మీ అబ్బాయి ఒకతను షికాగోలో పని చేస్తున్నాడటగా.’

జగదీష్ – ‘అవునండి.’

కమిషనర్ – ‘మా అబ్బాయి వివేక్ కూడా షికాగోలో మైక్రోసాఫ్ట్‌లో పని చేస్తున్నాడు. ఈ మధ్యనే ఇద్దరికీ పరిచయమయిందట. తరచూ కలుస్తున్నారట.’

జగదీష్ – ‘I remember. మా అబ్బాయి చెప్పేడు. ఒక తెలుగు అబ్బాయితో పరిచయమయింది; నాకు మంచి కంపెనీ దొరికింది, అని.’

కమిషనర్ – ‘అవునండి. మా వాడు కూడా అలాగే చెప్పేడు. ఇద్దరికీ బాగా ఫ్రెండ్షిప్ కుదిరినట్లుంది. రెండురోజుల క్రిందట ఇద్దరూ కలసినప్పుడు, మీ ఇంటద్దె ప్రాబ్లెమ్ మా వాడితో చెబుతూ; మీ అబ్బాయి; చూడు వివేక్, ఇండియాలో ఎటువంటి గూండాలు తయారయ్యారో, అన్నాడట.. మా వాడు ఆ విషయం నాతో చెబుతూ, డేడీ, Vikram is a good friend of mine. మీరు ఏదయినా హెల్ప్ చెయ్యగలరా, అని అడిగేడు. ఎంతవరకు చేయగలనో తెలీదు గాని, ప్రయత్నిస్తాను. డీటైల్స్ ఏమిటో నీ ఫ్రెండుని కనుక్కొని చెప్పు అన్నాను. నిన్ననే మావాడు అవి మెయిల్ చేసేడు.’

జగదీష్ – ‘నాకు తెలీదు. ఇంత కథ నడిచిందన్నమాట. నిన్న మా వాడు ఫోన్ చేసి డీటైల్స్ అడిగితే పంపించేను. దేనికని అడిగితే, తరువాత చెప్తానన్నాడు.’

కమిషనర్ – ‘డీటైల్స్ చూసేక, వీడెవడో ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ బిజినెస్ అంటున్నాడు; గవర్నమెంటునుండి లక్షలు రావాలంటున్నాడు; అదే నిజమయితే మా tax net లో ఉండాలనుకొన్నాను. మా వాళ్ళను ఛెక్ చెయ్యమన్నాను. నేననుకొన్నది కరెక్ట్ అయింది. మీ tenant రమేష్, Goodwill imports and exports కంపెనీ ఓనరు. వాడి I.T.R. లో ఎసెట్స్ డీటైల్స్ చూసేను. He is a willful defaulter. వాణ్ణి కూడా రమ్మన్నాను.’

జగదీష్ – ‘మా ఇంట్లో దిగకముందు, భువనేశ్వర్ కోలనీలో అద్దెకుండేవాడట. అక్కడ కూడా ఏడాది పైన అద్దె బాకీ పెట్టి, నలభైవేలు పుచ్చుకొని ఇల్లు ఖాళీ చేసేడట. అందులోవే ముఫైవేలు మాకిచ్చి మాకు టోపీ వేసేడు.’

కమిషనర్ – ‘ఆఁ. ఆ విషయం, పోలీసు కమిషనరుగారితో మీ విషయం నేను మాట్లాడినప్పుడు, ఆయన కూడా అది చెప్పేరు. జగదీష్ గారూ, don’t worry. మీ డబ్బు అణాపైసలతో వసూలయిపోతుంది.’

జగదీష్ – ‘Thank you very much sir.’

(కమిషనరుకు ఫోను వస్తుంది)

కమిషనర్ – ‘రమేషా, అయిదు నిమిషాల తరువాత పంపించండి ‘ (అని ఫోను పెట్టేక) జగదీషుగారూ, He is an intelligent rogue. అందుచేత జాగ్రత్తగా హేండిల్ చెయ్యాలి. మన పని అయ్యేవరకు కూల్‌గా ఉందాం.’

జగదీష్ – ‘Definitely సర్.’

(రమేష్ ప్రవేశిస్తూ, కమిషనరుకు జగదీష్‌కు నమస్కరించి, కమిషనరు చెప్పిన పిమ్మట ఆసీనుడవుతాడు.)

కమిషనర్ – ‘మిస్టర్ రమేష్, మా ఆఫీసుకు ఇదివరకెప్పుడయినా వచ్చారా.’

రమేష్ – ‘లేదు, సర్. అవసరం పడలేదు. ఇప్పుడు అంతా ఆన్‌లైనే కదా సర్.’

కమిషనర్ – ‘Yes. మీరు ఎక్కడ ఉంటున్నారండి.’

రమేష్ – ‘ నేతాజీనగర్ లో అండి. (జగదీష్‌ను చూపిస్తూ) ఈ సార్ ఇంట్లో అండి.’

కమిషనర్ – ‘ఈ సార్ మాకు బాగా కావలసినవారు. ‘

రమేష్ – ‘అలాగా సర్.’

కమిషనర్ – ‘మీతో ఇంటద్దె సమస్య ఏదో ఉందని సార్ చెప్పేరు.’

రమేష్ – ‘సమస్య ఏదీ లేదు సార్. నాకు గవర్నమెంటునుండి నియర్లీ టెన్ లేక్స్ సబ్సిడీ రావలసి ఉంది సార్. సార్ కు చెప్పేను సర్. అది అందగానే సార్ డబ్బు వెంటనే పే చేసిస్తాను సర్.’

కమిషనర్ – ‘Oh! I see. ప్రస్తుతం మీ దగ్గర ఫండ్స్ లేక పెండింగ్ లో ఉంచేరన్నమాట.’

రమేష్ – ‘అవును సార్. రావలసిన ఫండ్సు రాగానే సార్‌కు పే చేసేస్తాను సార్.’

కమిషనర్ – ‘ప్రస్తుతం మీ దగ్గర మరే ఫండ్సు లేవా.’

రమేష్ – ‘లేవు సార్.’

కమిషనర్ – ‘ఆలోచించి చెప్పండి.’

రమేష్ – ‘కొద్దిపాటి ఎమౌంట్ బ్యాంకులో ఉంది సార్. అది నా డైలీ ఎక్స్‌పెన్సెస్‌కు సరిపోతుంది సార్.’

కమిషనర్ – ‘కొద్దిపాటి, అన్నారు. అంటే ఏ మాత్రం ఉంటుంది.’

రమేష్ – ‘Exact ఎమౌంట్ జ్ఞాపకం లేదు సార్.’

కమిషనర్ – ‘Shall I help you. Last month మీరు సబ్మిట్ చేసిన ITR లో, మూడు బ్యాంకుల్లో ఆరు లక్షల వరకు బేలెన్స్ ఉంది. Do you agree.’

రమేష్ – ‘సర్. అవి నా డే టు డే ఎక్స్‌పెన్సెస్‌కు కావాలి సార్. అది కాక నెక్స్ట్ వీక్ గెస్ట్స్ వస్తున్నారు సర్. వాళ్ళని ఏదయినా టూరిస్టు ప్లేసుకు తీసుకెళదామనుకొంటున్నాను సర్.’

కమిషనర్ – ‘మీరు చెప్పింది ఎంత రీజనబుల్ గా ఉందో, బాగా ఆలోచించుకోండి. భువనేశ్వర్ కోలనీలో మీరు చేసిన వ్యవహారం, పోలీసు రికార్డులలో ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారం పోలీసులకు కంప్లైంట్ చేస్తే, పోలీస్ రికార్డులలో మీ పేరు హేబిచ్యుఅల్ అఫెండర్‌గా రికార్డ్ అవుతుంది. You are an intelligent person. అటువంటి రికార్డ్ ఎంతవరకు మీకు ప్రొఫెషన్‌లో డేమేజ్ చేయగలదో ఆలోచించుకోండి.’

రమేష్ – ‘మీరలా అంటే నేనేం చెయ్యగలను సార్.. నాకో వారం రోజులు టైం ఇవ్వండి సార్.’

కమిషనర్ – ‘సార్ మీకు ఏడాది పైన టైం ఇచ్చేరు. పోలీస్ కమిషనర్ గారికి మీ ఇంటద్దె భాగవతమంతా తెలుసు. ఆయన ఈ కేస్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఏమిటి జరిగింది ఆయనకు చెప్పాలి. నాకింకా ఆఫీస్ వర్క్ చాలా ఉంది. మీరు జగదీష్ గారికి వెంటనే ఆయనకు మీరివ్వవలసిన మొత్తం ఎమౌంట్ ఇస్తారో, లేదో; ఎస్ ఆర్ నో, వెంటనే చెప్పండి.’

రమేష్ – ‘సార్, ప్రస్తుతం నా దగ్గర ఛెక్ బుక్ లేదండి.’

జగదీష్ – ‘Sir, I am not interested in cheque.’

రమేష్ – ‘అయితే నన్నేమిటి చెయ్యమంటారండి.’

కమిషనర్ – ‘మీ దగ్గర, సార్ బ్యాంకు ఎకౌంట్ నంబరుందా.’

రమేష్ – ‘ఉన్నాది సార్.’

కమిషనర్ – ‘మీ సెల్ ఫోన్ తీసి, సార్ ఎకౌంటుకు ఇవ్వవలసిన ఫుల్ ఎమౌంట్ ట్రేన్స్ఫర్ చెయ్యండి.’

(రమేష్ మొత్తం బాకీని జగదీష్ ఎకౌంటుకు ట్రాన్స్ఫర్ చేస్తాడు.)

కమిషనర్ – ‘జగదీష్ గారూ, can you please check.’

జగదీష్ – (తన సెల్ ఫోను చూసుకొని) Thank you sir. ఫుల్ ఎమౌంట్ క్రెడిట్ అయిందండి.’

కమిషనర్ – (రమేష్ ను ఉద్దేశించి) ‘ఈ పని మీరు ఎప్పుడో చేయవలసింది. మీ ఇమేజ్ డేమేజ్ కాకపోను. Better late than never. సరే, మరో ఇంపార్టెంట్ విషయం. సార్ ఇల్లు ఎల్లుండి శుక్రవారం నాడు ఖాళీ చెయ్యాలి.’

రమేష్ – ‘సార్. మీరు పెద్దవారు. ఆలోచించండి సార్. కనీసం వన్ వీక్ టైం ఇవ్వండి సార్. వన్ వీక్‌లో డెఫినిట్ గా ఖాళీ చేసీస్తాను సార్.’

కమిషనర్ – ‘ఓకే. వన్ వీక్ లో ఖాళీ చెయ్యండి. ప్రోబ్లెం సాల్వ్ అయింది. I am happy.’

రమేష్ – ‘నమస్కారం సార్. వస్తాను. (జగదీష్‌తో) సార్. నమస్కారం. వస్తాను.’

(రమేష్ నిష్క్రమించును)

జగదీష్ – ‘సర్, మీకు థేంక్స్ ఎలా చెప్పాలో నాకు తెలీదు. నిజానికి మేము ఆ బాకీ ఎమౌంట్ మీద ఆశలు వదిలేసుకొన్నాం. వాడు ఇల్లు ఖాళీ చేస్తే చాలనుకొన్నాం. మీ దయ వల్ల సమస్య పూర్తిగా తీరింది.’

కమిషనర్ – ‘ఇందులో నా దయ ఏమీ లేదండి. భగవంతుడు నా చేత మీకు న్యాయం చేయించేడు. అంతే.’

జగదీష్ – ‘మా ఇంటద్దె భాగవతం గూర్చి చాలా టైము తీసుకొన్నారు. నమస్కారం. వస్తానండి. వీలు చూసుకొని మళ్ళీ కలుద్దాం. వస్తానండి.’

కమిషనర్ – (నిలబడి) ‘డెఫినెట్లీ. నమస్కారం.’

(జగదీష్ నిష్క్రమించును. తెర పడును.)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here