ఫస్ట్ లవ్-8

0
5

[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఫస్ట్ లవ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఎంగేజ్‍మెంట్ ఫంక్షన్ అయ్యాకా, ఇంటికి వచ్చిన గౌతమ్ తన మొబైల్‍లోని హసంతి ఫోటోని జూమ్ చేసి చూస్తుంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన అతని ఫ్రెండు సుధాకర్, హసంతిని అలా ఫోన్‍లో చూసుకునే బదులు ఎక్కడికైనా బయటకు తీసుకువెళ్ళి మనసు విప్పి మాట్లాడుకోవచ్చు కదా అని అంటాడు. ఒప్పుకుంటారా అని గౌతమ్ అంటే, మీకి ఎంగేజ్‍మెంట్ అయిందిగా, ఒప్పుకుంటారులే అంటాడు. వెంటనే హసంతికి ఫోన్ చేసి ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోమని సుధాకర్ చెప్తే, తన దగ్గర ఆమె నంబర్ లేదంటాడు గౌతమ్. విస్తుపోతాడు సుధాకర్. ఇంతలో గౌతమ్ తండ్రి రఘురామ్ ఫోన్ చేస్తే, ఆయన దగ్గర హసంతి నెంబరు తీసుకుంటాడు. తండ్రి కూడా హసంతిని బయటకి తీసుకువెళ్ళి మాట్లాడమని, ఆమె కోసం కొన్న ఫోన్‍ని ఇచ్చేయమని అంటాడు. గౌతమ్ పంపిన మెసేజ్‍ని హసంతి చెల్లెలు గీతిక చూస్తుంది. కాసేపు అక్కని ఏడిపిస్తుంది. అక్క బదులుగా ఆ మెసేజ్‍కి తానే రిప్లయి ఇచ్చేస్తుంది. ఐదు నిమిషాల్లో ఎక్కడికి రావాలో లొకేషన్ షేర్ చేసిన మెసేజ్ వస్తుంది. అక్కకి ఆ మెసేజ్ చూపించి, అక్కడ్నించి వెళ్ళిపోతుంది గీతిక. అయిష్టంగానే గౌతమ్ చెప్పిన చోటకి బయల్దేరుతుంది. అక్కడికి చేరగానే, గౌతమ్ ఎదురొచ్చి లోపలికి తీసుకువెళ్తాడు. ఇద్దరికీ కాఫీ ఆర్డర్ చేస్తాడు. ఇంతలో అతనికి ఆఫీస్ కాల్ వస్తుంది. కొద్ది సేపటి తర్వాత, అతను వచ్చేసరికి కాఫీ చల్లారిపోయి ఉంటుంది. మళ్ళీ ఆర్డర్ చేస్తానని అంటుంటే, వద్దు నేను వేరే ఫంక్షన్‍కి వెళ్ళాలని చెప్పి బయల్దేరిపోతుంది హసంతి. కొద్ది సేపటికే హసంతి మళ్ళీ వెనక్కి వస్తుంది, ఏమైందని గౌతమ్ అడిగితే, మనం కూర్చున్న చోట వేలెట్ మర్చిపోయానంటుంది. తాము కూర్చున్న చోట వెతుకుతూంటే, కౌంటర్ లోని వ్యక్తి వచ్చి దాన్ని ఇస్తాడు.  అతనికి థాంక్స్ చెఫ్ఫి, గౌతమ్‍కి బై చెప్పి వెళ్ళిపోతుంది హసంతి. తాను కానుకగా తెచ్చిన ఫోన్ ఆమెకి ఇవ్వలేకపోయినందుకు ఫీలవుతాడు గౌతమ్. ఇక చదవండి.]

[dropcap]ఇం[/dropcap]ట్లోకి వేగంగా వచ్చిన హసంతిని చూసిన తల్లి “హసంతీ! గౌతమ్‌ని కలిసావా?” అంది.

“ఆఁ..” అంటూ వేగంగా తన గదికి వెళ్లి తలుపేసుకుంది. అద్దం ముందు నిలబడి ‘కార్తీక్‌ని నేను సంవత్సరంన్నర నుండి ప్రేమిస్తున్నాను. ఆ జ్ఞాపకాలు, బాధ ఎలా తీసేయాలో అర్థం కావడం లేదు. కానీ గౌతమ్ నన్ను చూడకుండానే 15 ఏళ్ల బట్టి ప్రేమిస్తున్నాడు. అతనిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు. నా ప్రేమకంటే గౌతమ్ ప్రేమే గొప్పదని ఇన్‌డైరెక్ట్‌గా ప్లాన్ చేసి నన్ను పిలిచినట్టుంది.’ అనుకుని కన్నీళ్లు తుడుచుకుంటూ బెడ్ మీద పడుకుంది.

***

కార్తీక్ రూంలో కూర్చొని హసంతి పంపిన గిఫ్ట్ పార్సిల్ తెరిచాడు. అందమైన పేపర్లో రాప్ చేసిన డైరీ. దానికి ఎల్లో రిబ్బన్‌తో, రెండు గులాబీ పూలను డెకరేట్ చేసింది. గులాబీలు వాడిపోయి, రేకలు రాలిపోయాయి. చిన్న కార్డు మీద “టు యు.. ఫ్రం మీ” అని రాసుంది. డైరీ మీదున్న రిబ్బన్ రాపర్ కేర్‌ఫుల్‌గా తీసి పక్కన పెట్టాడు. డైరీని చేతుల్లోకి తీసుకొని పేజీలు తిప్పుతుంటే మైల్డ్ అరోమా హాయిగా వస్తుంటే.. కళ్ళు మూసుకుని డైరీ గుండెలకి హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు.

ఫోన్ రింగవుతుంటే భద్రంగా డైరీ పక్కన పెట్టి

“హలో” అన్నాడు.

“హలో! కార్తీక్! నిన్న నువ్వు పంపిన ట్యూన్ డైరెక్టర్‌కి బాగా నచ్చింది. షార్ట్ ఫిలిం రికార్డింగ్ రేపటి నుంచి మొదలు పెడదాం. అది పూర్తయ్యేలోపే ఈ సాంగ్ రికార్డు చేద్దాం. నువ్వు రెండు రోజులు ఆఫీస్‌కి లీవ్ పెడితే పూర్తి చేయొచ్చు. నీ ఆర్కెస్ట్రైజేషన్‌కి ఫిదా అయ్యాడు. లీవ్ విషయం చెప్తే రికార్డింగ్ ఏర్పాట్లు నేను చూస్తాను.” అన్నాడు ఫ్రెండ్ సిద్ధార్థ.

“ఓ.కే. ఈ రాత్రికి లీవ్ చెప్పి కన్ఫర్మ్ అయితే రేపు ఉదయం ఫోన్ చేస్తాను” అన్నాడు..

ఫోన్ పెట్టేసి బాల్కనీలోకి వెళ్లి సిగరెట్ ముట్టించాడు.. రిలాక్స్‌డ్‌గా.

***

హాల్లో సోఫాలో కూర్చుని టీ.వీ. సీరియల్ చూస్తూ, చిక్కుడుకాయలు వొలుస్తున్న తల్లి దగ్గరకొచ్చింది హసంతి.

“అమ్మా! నేను ఒకటి అడుగుతాను కరెక్ట్‌గా చెప్పు. గౌతమ్‌తో 15 ఏళ్ల క్రితమే సంబంధం మాట్లాడారని చెబుతున్నారు. మరి ఇన్నేళ్లు నన్ను ఎందుకు చూడటానికి ఒక్కసారి కూడా రాలేదు?” అంది.

“చిన్న వయసులో తల్లి అనారోగ్యం, ఆమె చనిపోతూ నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పటం, ఆమె మరణం, ఇవన్నీ గౌతమ్‌ని బాగా బాధించి ఉంటాయి. వాళ్ళ నాన్నతో సింగపూర్ వెళ్లిపోయాడు. నువ్వు తన మేనత్త కూతురివే కాబట్టి ఇన్నేళ్లు నువ్వు తనకే సొంతం అనుకుంటూ పెరిగాడు. నాలుగేళ్ల క్రితం ఓసారి వచ్చాడు. కానీ నువ్వు కాలేజీ టూర్‌కి వెళ్ళటం వల్ల నిన్ను కలవటం కుదరలేదు. నువ్వూ చదువు, ఉద్యోగాల్లో ఇన్నేళ్లు బిజీగానే ఉన్నావు. ఇప్పుడు ఇద్దరూ సెటిల్ అయ్యారు. ఈ మధ్య రఘురాం మామయ్యకి చెస్ట్ పెయిన్ వచ్చి బైపాస్ చేశారు. ఎందుకైనా మంచిదని గౌతమ్తో ఒక నెల లీవ్ పెట్టించి పెళ్లి చేద్దామని తీసుకొచ్చాడు.” అంది.

హసంతి మౌనంగా అక్కడినుంచి లేచి వెళ్ళింది.

***

హసంతి అద్దం ముందు నిలబడి మనస్సాక్షితో మాట్లాడుతోంది.

“నేను కార్తీక్‌ని సంవత్సరంన్నర నుండి ప్రేమిస్తున్నాను. ఇప్పుడు అతనిని కాదని గౌతమ్‌ని పెళ్లి చేసుకోమంటే సడన్‌గా మనసు నుండి కార్తీక్‌ని ఎలా బయటికి పంపించాలి? గౌతమ్ నన్ను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాడు. నిజమే! నేను ఇష్టపడుతున్న కార్తీక్‌ని కాదని, నన్ను ఇష్టపడుతున్న గౌతమ్‌తో తాళి కట్టించుకోవాలా? భగవంతుడా! ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకే ఎందుకీ పరీక్ష? కార్తీక్‌ని మర్చిపోతే నన్ను నేను మర్చిపోయినట్టే. నా ప్రేమకంటే గౌతమ్ ప్రేమే గొప్పదని ఒప్పుకోవాలా? నాది తొలిప్రేమ.. ఫస్ట్ లవ్.. అణువణువు ఆస్వాదించి మనసంతా నింపుకున్న ప్రేమను నా చేతితోనే నేను ఎలా తుడిచేయగలను?”.

కన్నీళ్లు తుడుచుకుంటూ ఏదో అలికిడి వినిపించడంతో మొహం తడుచుకుని టేబుల్ ముందు కూర్చొని డైరీ తీసింది.

హాల్లో కూర్చుని బట్టలు మడత పెడుతున్న హసంతి తల్లి కవిత లోపలికి వస్తున్న గౌతమ్‌ని చూసి

“రా! గౌతమ్ కూర్చో” అంది.

“ఆఁ.. ఆఁ.. అత్తయ్యా”

“కాఫీ తెస్తానుండు” అని లేవబోతుంటే

“ఇప్పుడేం వద్దత్తయ్యా! ఇవ్వాళ నాన్న నేను వెళ్లి వెడ్డింగ్ కార్డ్ మోడల్స్ తెచ్చాము” అన్నాడు.

కవర్లో ఉన్న కార్డ్స్ తీసి ఆమెకి ఇచ్చాడు.

“హసంతి ఇంట్లో లేదా?”

“పై గదిలో ఉంది “

“గీతిక ఉందా?”

“కాలేజీకి వెళ్ళింది.”

“అత్తయ్యా! అదీ.. అదీ..”

“అదీ.. లేదు, ఇదీ.. లేదు.. హసంతి పై గదిలో ఉంది వెళ్ళు”

గౌతమ్ పై గదికి వచ్చి దగ్గరగా వేసున్న తలుపు నెట్టి

“ఎక్స్‌క్యూజ్ మీ” అన్నాడు.

హసంతి తల తిప్పి చూసి “హలో” అని లేచి నిలబడ్డది.

ఆమెకి గౌతమ్‌తో మాట్లాడాలనిపించలేదు. కళ్ళ ముందు కార్తీక్ నిలబడ్డట్టనిపిస్తోంది. కార్తీక్‌ని మనసు నుంచి బయటికి పంపలేక, గౌతమ్‌ని లోపలికి రమ్మనలేక ఇబ్బందిగా మొహం పెట్టి చూస్తుంటే..

“ఏంటి! హసంతీ! డల్‌గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం” అన్నాడు.

“ఏం లేదు” అంది తెచ్చి పెట్టుకున్న నవ్వుతో.

“పెళ్లయ్యాక నిన్ను మహారాణిలా చూసుకుంటానని మా అమ్మకి మాట ఇచ్చాను. ఇవ్వటం కాదు. అదే మాట నిలబెట్టుకుంటాను” అన్నాడు.

హసంతి ముఖంలో ఎటువంటి రియాక్షన్ కనిపించకపోయేసరికి

“నా కోసం ఒక్క నిమిషం స్పేర్ చేయగలవా?” అన్నాడు.

“అయ్యో! అదేం మాట.. చెప్పు గౌతమ్” అంది.. తెచ్చి పెట్టుకున్న నవ్వుతో.

“వెడ్డింగ్ కార్డ్ మోడల్స్ తెచ్చాను. కొన్ని సెల్‌ఫోన్‌లో ఉన్నాయి. అవి నీ వాట్సప్‌కి పంపాను. వీటిలో అత్తయ్యకి, గీతికకి, నీకు ఏది నచ్చితే దాన్ని నాకు వాట్సప్ చెయ్యి. మొన్న నిన్ను బాగా డిజప్పాయింట్ చేసినట్టున్నాను ఏమీ అనుకోకు” అన్నాడు.

“అయ్యో! అదేం లేదు. ఒక్కో సారి అలానే జరుగుతుంటాయి. ఊఁ.. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, కూల్‌గా ఏమైనా?”

“పర్లేదు వచ్చేటప్పుడు టీ తాగి వచ్చాను”

“అది అప్పుడు, ఇప్పుడు నాతో కలిసి తాగు. ఉండు కిందికి వెళ్లి వస్తాను.” అని టీ.వీ రిమోట్ అతను ముందుంచింది.

అప్పటికే హసంతి వాళ్ళ అమ్మ కవిత వేడి వేడిగా ఆలు బజ్జీ, చట్నీ చేసి హసంతికి రెండు ప్లేట్లలో ఇచ్చింది.

“నువ్వు తీసుకెళ్ళు. నేను టీ తయారు చేసి తీసుకొస్తాను” అంది.

హసంతి తెచ్చిన బజ్జీలు తింటూ “ఎంతైనా ఇంటి వంట ఇంటి వంటే” అన్నాడు.

హసంతి నవ్వింది.

“ఒక మాట అడగనా?” అన్నాడు.

“దానికి పర్మిషన్ కావాలా? బావా!” అంది.

అంతే! హసంతి బావా అని పిలవడం గౌతమ్ ఇన్నాళ్లుగా కోరుకున్న పిలుపుకి ప్రాణం వచ్చినట్టు అనిపించింది.

“నా గురించి నీ అభిప్రాయం ఏమిటి?” అన్నాడు.

“ఏమని చెప్పను?”

“నువ్వేమనుకుంటున్నావో అదే చెప్పు”

“నువ్వు ఇలా అడుగుతుంటే నాకు మన బాల్యం గుర్తొస్తోంది.” అంది.

“నిజమే చిన్నప్పుడు నువ్వు ఎక్లర్స్ చాక్లెట్లు కావాలనే దానివి. ఇద్దరం కలిసి షాపుకి వెళ్లి కొని తెచ్చుకునే వాళ్ళం. నిన్న నీకు ఇద్దామని తెచ్చాను. కానీ అవకాశం రాలేదు. ఇదిగో!” అని చాక్లెట్స్ ప్యాకెట్ తీసి ఇచ్చాడు.

“థాంక్యూ! వీటిని తిని చాలా సంవత్సరాలైంది.”

అంతలో అంతలో కవిత టీ తీసుకొని పైకొచ్చి ఇద్దరికీ ఇచ్చింది.

“అమ్మా! గౌతమ్ వెడ్డింగ్ కార్డ్ మోడల్స్ తెచ్చాడు. నాకైతే ఇది బాగా నచ్చింది.” అని ఒక కార్డు తీసి చూపించింది.

“గౌతమ్ నీకు నచ్చిందా?” అంది.

“యాఁ.. వెరీ గుడ్ సెలక్షన్”

నిజానికి ఆ కార్డు కవితకు నచ్చలేదు. గౌతమ్‌కి కూడా నచ్చాక, తనకి నచ్చలేదంటే బావుండదని “చాలా బాగుంది” అంది.

“అత్తయ్యా! గీతికకి కూడా చూపించండి. తను ఓకే అంటే మనం ప్రొసీడ్ అవుదాం.”

“మరి! రఘు మామయ్యకి నచ్చొద్దా?”

“మనందరికీ నచ్చింది.. నాన్నకీ నచ్చుతుంది. అయినా అడుగుతాను.” అన్నాడు గౌతమ్.

“సరే మీరు మాట్లాడుకోండి. నేను కిందకి వెళ్తాను. వాకిలి తరపు తెరిచి ఉంది.” అని కవిత కిందికి వెళ్ళింది.

తర్వాత ఇద్దరి మధ్య మాటలు మళ్ళీ మొండికేసాయి.

“ఇక్కడ నీకు బోర్ కొడుతోందేమో గౌతమ్. ఐ మీన్ ఇండియాలో”

“నో.. నో అలాంటిది ఏమీ లేదు. అక్కడ నాన్న, నేను ఒంటరిగా ఉండే వాళ్ళం. నాన్న నేను ఇక్కడ మీ అందరితో, ఫ్రెండ్స్‌తో చాలా ఎంజాయ్ చేస్తున్నాను.”

“ఇంకేంటి సంగతులు?” అంది హసంతి.

“నథింగ్. వీలుంటే రేపు బయటికి వెళ్దాం, వస్తావా!”

“ట్రై చేస్తా” అంది.

“కాల్ చెయ్యనా?” సరిగ్గా అప్పుడు గుర్తొచ్చింది హసంతి కోసం తెచ్చిన సెల్‌ఫోన్ మళ్లీ మర్చిపోయిన సంగతి.

“ఓ.కే వెళ్తాను” అన్నాడు లేచి నిలబడి.

“బై! గౌతమ్” అంది

ఇంకాసేపు ఉండమంటుందేమో అనుకున్నాడు. హసంతి బై చెప్పేసరికి, వెళ్లాలని లేకపోయినా.. ఉండలేక వెళ్లిపోయాడు గౌతమ్.

ఇదంతా హసంతితో మాట్లాడాలని.. మేడ మీద గదికి వెళ్ళిన గౌతమ్ ఊహ మాత్రమే.

వాస్తవానికి గౌతమ్ పైకి వెళ్ళగానే హసంతి సెల్‌ఫోన్‌లో కార్తీక్ ఫోటో చూస్తూ కూర్చుంది. గౌతమ్‌ని చూడగానే ఫోన్ పక్కన పెట్టి ముభావంగా

“రా! గౌతమ్” అంది.

ఆ సమయంలో గౌతమ్‌తో మాట్లాడాలనిపించలేదు. కళ్ళ ముందు కార్తీక్ నిలబడ్డట్టు అనిపించింది. మనసు లోపల ఉన్న కార్తీక్‌ని బయటికి పంపలేక, బయట నిలబడ్డ గౌతమ్‌ని లోపలికి రమ్మనలేక ఎటువంటి ఎక్స్‌ప్రెషనూ లేకుండా చూస్తుంటే..

“ఏంటి హసంతీ! ఏదో శాడ్‌గా ఉన్నావు. ఇంట్లో ఏమైనా అన్నారా?” అన్నాడు.

“అదేం లేదు”

“కానీ ఎందుకో హ్యాపీగా లేవనిపిస్తోంది”

“అలాంటిదేమీ లేదు” అని పైకి అన్నా.. లోపల అతనితో టైమ్ స్పెండ్ చేయడానికి మనసు ఇష్టపడటం లేదు.

“హసంతి! వెడ్డింగ్ కార్డ్ మోడల్స్ తెచ్చాను. నీకు కూడా నచ్చితే పైనల్ చేద్దాం. ఇక్కడ పెడుతున్నాను”. అని టీపాయ్ మీద పెట్టాడు.

“వాట్సప్‌లో కొన్ని పంపిస్తాను. చూడు” అని వెళ్ళిపోయాడు.

***

బాల్కనీ నుండి లోపలికి వచ్చి హసంతి పంపిన డైరీ తెరిచాడు కార్తీక్.

మొదటి పేజీలో “నా నీకు.. నీ నేను.. ప్రతిరోజు నివేదించే ప్రేమ అక్షర కుసుమాలు. జీవితంలో నీ గురించి నీకు తెలియాలంటే.. ప్రతి రోజూ హృదయం అనే పలక మీద నువ్వు చేసే పనులు, నీ మాటలు, నీ నడక, నీ నడత, నీ ఆలోచనలు, నీ బలాలు, బలహీనతులు, తప్పొప్పులు అన్నీ రాసుకో. నీ కష్టసుఖాల్ని నీతో నువ్వు పంచుకోవడం నేర్చుకో! అప్పుడు నీకు నువ్వే మహారాజువనే విషయం తెలుస్తుంది.”

మరో పేజీ తిప్పి చూశాడు.

“ఎదుటివారిని పలకరించడానికి బంధుత్వం, రక్త సంబంధాలతో పనిలేదు. గుండెలో రవ్వంత ప్రేమ, గుప్పెడు మానవత్వం సరిపోతుంది.”

ఇంకో పేజీలో..

“ఇప్పుడే మెల్లమెల్లగా సూర్యోదయం అవుతోంది. చూస్తున్నావా! సరికొత్తగా, ప్రేమగా. ఈరోజు నిన్ను చూసిన నా తొలి చూపుల సాక్షిగా నీ రూపం నన్ను వెంటాడుతోంది అర్ధరాత్రిలో కూడా. నువ్వు నా వైపు చూడకపోయినా తీగలా నన్ను పెనవేసుకుంటోంది నీ రూపం. నిన్నే తడుముతున్న నా చూపుల మీద ఒట్టు. నాలో నీ రూపం పవిత్రంగా ప్రతిష్ఠించాను.”

కార్తీక్ పేజీ తిప్పాడు..

“రోజూ నీ రాక కోసం నిరీక్షిస్తున్నాను. మన మధ్య పలకరింపులు లేకపోయినా నిన్ను చూడగానే పులకరించిపోయే నా తలపులు నిన్ను దూరం నుండి చూస్తేనే చాలనిపిస్తున్నాయి. నా పిచ్చి గుండె సవ్వడి నీకు ఎప్పుడు వినిపించాలో తెలియక నిరీక్షిస్తున్నా! ఎందుకంటే మనసు నీ వశమయింది. నిన్ను దరిచేరి నీలో నేనుగా మారి, నీతో గడిపే ఏకాంతం కోసం పిచ్చిగా ఎదురుచూస్తోంది.”

చదువుతున్న కార్తీక్ మనసంతా రూపం తెలియని హసంతి ఆక్రమించుకుంది.

అతని మనసు

“చెలీ.. రావా.. వరాలీవా

నిన్నే.. కోరే.. ఓ జాబిలీ

నీ జతకై వేచేనే..

నిలువెల్లా నీవే..”

మణిరత్నం ‘మౌనరాగం’ సినిమాలో పాట పాడుకోసాగింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here