[‘పొయెట్స్ టుగెదర్’ భిన్న కవుల విభిన్న కవిత్వం – అనే సీరిస్‍లో దేశదేశాల కవుల కవితల అనువాదాన్ని అందిస్తున్నారు హిమజ. Sylvia Plath రచించిన ‘Mirror’ కవితకి స్వేచ్ఛానువాదం.]
~
[dropcap]నే[/dropcap]ను అచ్చంగా వెండిలాంటి తెల్లని తెలుపు గల దాన్ని
నాకు ఎవరి గురించయినా ఎలాంటి అంచనాలు
ముందస్తు అభిప్రాయాలు లేవు
ఉన్నది ఉన్నట్టుగా
ప్రేమ, అయిష్టాల
రాగ ద్వేషాల ముసుగులేవీ లేకుండా
నేను చూసిన ప్రతిదాన్నీ
వెంటనే నాలో నింపేసుకుంటాను
అలాగని నేనేం క్రూరురాలిని కాదు
నేనెంతో నిజాయితీ గల దాన్నే
ఎవరి పట్లా పక్షపాతం చూపని
ఆ దేవుని కన్నులా
నాల్గు మూలలతో ఉండేదాన్ని
రోజులో అధిక భాగం ఎదురుగా ఉన్న గోడపై
మౌన ధ్యానంలో నిమగ్నమై ఉంటాను నేను
గులాబీ రంగులోను, అనేక మచ్చలతోను
నిండి ఉంటాన్నేను
చాలా కాలంగా నన్నలా చూసుకొని చూసుకొని
అవి నా హృదయంలో ఓ భాగమని భావిస్తాను
అయినా మినుకు మినుకుమంటూ
మిమ్మల్ని మీకు చూపిస్తుంటాను
అనేకానేక ముఖాలు, చీకటి మనల్ని
పదే పదే వేరు చేస్తాయి
నేనిప్పుడు ఓ సరస్సుని
ఒక స్త్రీ నాపైకి వంగి
నిజంగా తానేమిటోనని
నా పరిధిని విస్తృతిని
లోతుగా తెలుసుకోవాలనుకుంటుంది
పిదప ఆమె
అబద్ధాల వైపు, కొవ్వొత్తి వెలుగుల వైపు
చందమామ వైపు మళ్ళుతుంది
నేనామెను తిరిగి మళ్ళీ చూస్తాను
ఇంకా నిజాయితీగా ప్రతిబింబిస్తాను
ప్రతిగా ఆమె
అందోళన చెందే చేతులతో
కన్నీళ్ళతో చూసే చూపుని
నాకు బహుకరిస్తుంది
నేనామెకు ఎంతో కావాల్సిన దాన్ని
నా ముందుకు ఆమె వస్తూ వెళుతూ ఉంటుంది
ప్రతి ఉదయం ఆమె పలు పలు ముఖాలే
చీకటి చిన్నెలను భర్తీ చేస్తాయి
క్రమంగా
నాలో ఆమె ఓ బాలికను
ఓ యవ్వనవతిని
ఓ వృద్ధురాలిని దాచేస్తుంది
ఆ తర్వాత –
కదిలే కాలం
ఓ భయంకరమైన చేపలా
ఆమె వైపు పెరుగుతూ ఉంటుంది!
~
మూలం: సిల్వియా ప్లాత్
తెలుగు సేత: హిమజ
Sylvia Plath (1932-1963) అమెరికన్ కవయిత్రి, నవలా రచయిత్రి, చిన్న కథల కథకురాలు. 20వ శతాబ్దంలోని ప్రఖ్యాత రచయితల్లో సిల్వియా ఒకరు. ఆమె తన యెనిమిదవ యేటనే ‘Boston Traveller’ అనే మొదటి కవిత రాసారు. కాలేజీ రోజులలో దాదాపు 50 వరకు చిన్న కథలు రాసారు. Boston లోని Massachusetts లో జన్మించి University of Cambridge నుంచి గ్రాడ్యుయేట్ అయిన Sylvia తన సహచర బ్రిటిష్ కవి అయిన Ted Hughes ని వివాహంచేసుకున్నారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోకుండానే వివాహబంధంలోకి అడుగిడడం సిల్వియా జీవితాన్నిఅతలాకుతలం చేసింది.
Confessional poetry (ఒప్పుకోలు కవిత్వాన్ని) బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన ఘనత సిల్వియాదని చెబుతారు.
The colossus and other poems, Ariel, కవితా సంకలనాలు.
The Bell Jar- semi స్వీయ జీవిత కథనం-సిల్వియా ఆత్మహత్య చేసుకోవడానికి ముందు 1963 లో ప్రచురణ అయ్యింది.
సిల్వియా మరణం తరువాత 1981లో collected poems సంకలనం వెలువడింది.ఈ సంకలనానికే మరణానంతర Pulitzer prize లభించింది. ఇలా మరణానంతరం Pulitzer prize అందుకున్నవారిలో సిల్వియా నాలుగోవారు.