[భాస్వతి ఘోష్ రచించిన కవితని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి గీతాంజలి. Telugu Translation of Bhaswati Ghosh’s poem ‘Why Don’t You Come?’ by Mrs. Geetanjali.]
~
[dropcap]మీ[/dropcap]కు తెలుసో లేదో..
కొన్ని ప్రాంతాల్లో కొంతమంది వధువులు..
కర్వా చౌథ్ అనే వధువుల పండగప్పుడు..
దినమంతా పచ్చి మంచినీళ్లు కూడా
తాగకుండా ఉపవాసం ఉండి..
తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం
జల్లెడలతో చంద్రకిరణాలను ఒడిసి పడతారు.
అయితే.. ఆ వధువు ఇల్లు వదిలి
అత్తారింటికి పోతున్నప్పుడు..
మా అమ్మమ్మ ఏం చేసిందో తెలుసా?
ఒక నదిని ఆమె కనురెప్పల్లోకి రహస్యంగా రవాణా చేసింది.
దాని పేరేంటో తెలుసా.. సుగంధ!
సు-గంధ అంటే మధురమైన సువాసన కలది అని అర్థం!
నిజానికి అమ్మమ్మ ఆ నదిని ఎక్కడి నుంచో దొంగలించింది.
ఎప్పుడైనా కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు
తన చుట్టూ ఉన్న గాలిలో సుగంధ పరిమళాలను
హాయిగా శ్వాసించవచ్చు అన్న ఆశతో .,
అంతా మరిచిపోవచ్చు అన్న నమ్మకంతో కూడా!
ఎందుకంటే.. ఆమె కొత్త ఇంటి చుట్టుపక్కల నీటి జాడే లేదు మరి!
ఆమె ఊరు జాలోఖాతి లోని పాత ఇంటి పక్కన
సుగంధ నది ఎప్పటిలానే ప్రవహిస్తూ ఉంది.
దాంట్లోంచే పిల్ల కాలువలు శాఖలు శాఖలుగా చీలిపోయి
చల్లని.. నీలపురంగులో దాహం గొన్న బాటసారులకి
దారి చూపించడానికి బయలుదేరేవి!
ఆకు పచ్చని స్వఫ్న దృశ్యంలో..
నదిలోని నీరు పారుతూ
వాలుగా ఉండే దన్నుల్లో నిలిచి మెరిసేవి.
ఏదో దృఢ నిశ్చయం తీసుకున్నట్లుగా
నది మీదుగా తేలిపోతున్న బక్కపలుచని వెదురు వంతెన,
నిరవధిక వాక్యాలుగా.. నిర్లక్ష్యంగా పరిగెడుతున్న
నీటి ప్రవాహాన్ని విడగొడుతున్నట్లుగా
పేరాగ్రాఫ్‌లను అప్పు ఇచ్చి నిలవరించడానికి చూస్తుంది!
ఇక ఆ వీధిలో చేపలు పట్టే జాలరి
ఇంటి కొసాకు.. పిల్లలు చిన్న బొమ్మల్లాంటి
పడవలను చిలిపిగా లాగుతూ ఉంటారు.
వాళ్ళ నవ్వులు నదీ అలలపై చిప్పిల్లుతాయి.
కానీ నేను వీడియోలో సుగంధ నది గురించి వెతికితే..
నది ఒడ్డున ఒక తల్లి తన కూతురి తల
సుతారంగా దువ్వుతూ ఉండటం కనిపిస్తుంది.
విచిత్రంగా.. నాకు అంతా అర్థమవడానికి ముందే..
హఠాత్తుగా ఆ కూతురు..
అచ్ఛం మా అమ్మమ్మలా మారిపోయి..
పాటగా విరిగిముక్కలవుతూ…
“నువ్వెందుకు మా ఇంటికి రావు?” అంటూ నిలదీసి అడుగుతుంది!
~
మూలం: భాస్వతి ఘోష్
అనుసృజన: గీతాంజలి
భాస్వతి ఘోష్ బంగ్లా, ఆంగ్ల భాషలలో కాల్పనిక, కాల్పనికేతర రచనలు చేస్తారు. చక్కని కవయిత్రి, అనువాదకురాలు. ఆమె మొదటి పుస్తకం ‘విక్టరీ కాలనీ 1950’ (Historical Fiction), Yoda Press వారిచే ప్రచురితమైంది.
బెంగాలీ నుండి ఆంగ్లంలోకి ఆమె చేసిన అనువాద రచన – ‘My Days with Ramkinkar Baij’ ను – నియోగి బుక్స్ ప్రచురించింది. ఈ పుస్తకానికి 2009లో అనువాదానికి చార్లెస్ వాలెస్ (ఇండియా) ట్రస్ట్ ఫెలోషిప్‌ను గెలుచుకున్నారు. ఆమె కథలు ఆడమ్స్ మీడియా ప్రచురించిన ‘లెటర్స్ టు మై మదర్’, ‘మై టీచర్ ఈజ్ మై హీరో’ అనే కథల సంకలనాల్లో చోటు చేసుకున్నాయి.
భాస్వతి రచనలు పలు జాతీయ అంతర్జాతీయ పత్రికలలో ప్రచురితమయ్యాయి. జర్నలిజంలోనూ ప్రవేశమున్న భాస్వతి – ది వైర్, డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ది స్టేట్స్‌మన్, ది పయనీర్‌లకు వంటి పత్రికలకు రాశారు.
ప్రస్తుతం భాస్వతి కెనడాలోని అంటారియోలో నివసిస్తున్నారు.