[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]
అధ్యాయం-19: కొన్ని రాగాలు – లక్షణాలు – కీర్తనల ఉదాహరణలు – 2వ భాగం
3. దేవ గాంధారి:
[dropcap]ఇ[/dropcap]ది 29వ మేళకర్త యైన ధీర శంకరాభరణములో జన్యం. ఔడవ సంపూర్ణ భాషాంగ రాగము.
ఆరోహణం: స రి మ ప ద స
అవరోహణం: స ని ద ప మ గ రి స (లేదా) స ని ద ని ద ప మ గ రి స (లేదా) స ని ద స మా గ రీ స
షడ్జ, పంచమములు కాగ చ॥రి॥; అం॥గా॥; శు॥మ॥; చ॥ధై॥; కా॥ని॥ కలవు.
కై॥ని॥ దని దప, పని ద మ ప ద ప మొదలగు ప్రయోగములలో వచ్చును.
దేవగాంధారి కర్ణాటక సంగీతములో అమిత ప్రచారము నొందిన అపూర్వ రంజక రాగములలో ఒకటి. వీర, రౌద్ర రసములను సూచించు చక్కని రాగము. త్రిస్థాయి రాగము. అన్ని వేళలా పాడదగినది. రి, మ, ద మంచి జీవస్వరములు. ఈ రాగములోని రచనలు సాధారణముగా పంచమములో ప్రారంభమగును. ‘సరిగా మపమగరి’, ‘గామప మగరి’, ‘దాని సా రి స నీ సాని’ మొ॥నవి విశేష ప్రయోగములు. ఈ రాగము విలంబ కాలములో ఆలాపించిననే బాగుండును. రి, ద లు కంపిత స్వరములు. రి, ప, ద లు న్యాస స్వరములు. గాంధారము ఒక ఛాయ ఎక్కువగా పలుకుటచే, ‘చ్యుత మధ్యమ గాంధారము’ అందురు. పంచమములో మంచి గ్రహ స్వరము. ఈ రాగములో అనేక రచనలు కలవు. ఇది ప్రాచీన రాగము.
సంచారం:
నని ధ స రీ – స రి గ స రీ స ని ధ – ద స రి స రీ, రి మ ప దా ప మ గ రి – స రి మ గ రి మ పా – ని ద ప మ దా ద ని స రి ద ని ద పా – మ గ రి మ ప దా – ద ని సా – ద స రి స రీ, రి గ మా గ రి – స రి గ స రీ స ని ద – ద ని సా రి స ని సా ని ద ని ద ప – ప ద నీ ద ప మ ప ద ప మ గ రి – స రి గా మ ప మ గ రీ – రి స ని ధ స రీ సా.
కొన్ని ముఖ్య కీర్తనలు:
- క్షీరసాగరశయనా – కృతి – ఆది – త్యాగయ్య
- వినరాద నా మనవి – శ్రీ రంగ పంచరత్న కృతి – ఆది – త్యాగయ్య
- కరుణా సముద్ర – శ్రీ రంగ పంచరత్న కృతి – ఆది – త్యాగయ్య
- నా మొరాలకింప – – శ్రీ రంగ పంచరత్న కృతి – రూపక – త్యాగయ్య
- క్షితిజ రమణా చింతయే శ్రీ రంగ పంచరత్న కృతి – ఆది – దీక్షితార్
కృతి సాహిత్యం:
పల్లవి:
క్షితిజారమణం చింతయే శ్రీరామం భవతరణం
అనుపల్లవి:
క్షితిపతి నత చరణం సేవిత విభీషణం
క్షితి భరణం శ్రితచింతామణిం అఘహరణం
చరణం:
సకలసుర మహిత సరసిజ పదయుగళం శాంతం అతికుశలం
వికసిత వదన కమలమతులితమమలం వీరనుత భుజబలం
శుకశౌనక ముని ముదిత గురుగుహ విదితం శోభన గుణ సహితం
ప్రకటిత సరోజ నయనం పాలిత భక్తం భవపాశహరణనిపుణం
ప్రతిపదార్థము:
క్షితిజ = భూదేవి పుత్రియైన సీతాదేవిని
రమణం = ఆనందింప చేయు
శ్రీరామం = శ్రీరాముని
భవతరణం = ఈ లౌకిక జగత్తు తరించుటకై
చింతయే = ధ్యానించుచున్నాను
విభీషణం = విబీషణుడు
క్షితిపతి = మహారాజైన శ్రీరాముని
చరణం = పాదములకు
నత = నమస్కరించి
సేవిత = సేవించెను
క్షితి = భూమిని
భరణం = భరించువానిని
శ్రిత = ఆశ్రయించిన వానిని
అఘ+హరణం = పాపములను హరించుటకు
చింతామణిం = చింతామణి వంటి వాడా
సకల సుర మహతి = సమస్త దేవతల చేతను కీర్తింపబడెడి
సరసిల = పద్మముల వంటి
పద యుగళం = పాదములు కలవాడు
శాంతం = శాంతమూర్తి
అతి కుశలం = మిక్కిలి నేర్పరి
వికసిత+వదన+కమలం = వికసించిన పద్మము వంటి ముఖము కలవాడా
అతులితం = సాటిలేని వాడా
అతులం = పవిత్రమైన వాడా
వీర+నుత+భుజ+బలం = వీరుల చేత స్తుతించబడు భుజ పరాక్రమము కలవాడా
శుక+సనక+ముని+ముదిత = శుకుడు, సనక సనందనాదులు మొదలైన మునులకు ఆనందం కలిగించువాడా
గురుగుహ విదితం = సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విదితం, తెలియబడిన దానిని
శోభన గుణ సహితం = మంగళప్రదమైన గుణములు కల్గినవాడా
ప్రకటిత+సరోజ+నయనం = ప్రకాశించెడి పద్మముల వంటి కన్నులు గలవాడా
పాలిత భక్తితం – భక్తులను కాపాడెడివాడా.
భవపాశహరణనిపుణం = లౌకిక జగమునకు సంబంధించిన బాధలన్నియు తొలగించుటలో నేర్పరి అయినవాడా – నీకు ప్రణామం.
4. సురటి:
ఇది 28వ మేళకర్త యగు ‘హరికాంభోజి’లో జన్యం.
ఆరోహణం: స రి మ ప ని స (లేదా) స రి మ ప ని ద ని స
అవరోహణం: స ని ద ప మ గ ప మ రి స
ఆరోహణలో గాంధారము వర్జింపబడినది. సురటి మంగళప్రదమైన రక్తి రాగము. త్రిస్థాయి. రాగము. అన్ని వేళలా పాడదగినది. ఈ రాగము పాండిత్య ప్రకర్షతో విస్తరించి పాడుటకు రసవత్తరముగా నుండు చక్కని రాగము.
రి, మ, నిలు జీవ స్వరములు, ఈ రాగములో గ, ద లు దుర్భర స్వరములుగా నుండుట గమనింప తగ్గ విషయము. ఈ రెండును దీర్ఘ స్వరములు కావు. స, రి, మ లు న్యాస స్వరములు. గ్రహస్వరములు
స, రి, మ, నిలు. ‘మా గ ప మ రి’, ‘ప ని ద ని స – రి మ రి స రి స’ రంజక ప్రయోగములు. రి, మ, స విశేష ప్రయోగము.
మన సంగీతములో కొన్ని రాగముల యొక్క ఆరోహణ, అవరోహణములను పాడిన వెంటనే ఆ రాగము యొక్క భావము స్పరించుట కవకాశం కలదు. ఉదాహరణకు హంసధ్వని, మోహన, కమలా మనోహరి మొదలగునవి. కాని మరికొన్ని రాగములు ఆయా రాగముల యొక్క భావములు స్ఫురించు విధంగా ఆరోహణ అవరోహణ క్రమములను పోషించి పాడవలసిన వున్నది. ఉదా: సురటి, అనంద భైరవి, రీతి గౌళ, ముఖరి, భైరవి, శహన మొదలగునవి. మరికొన్ని రాగములలో ఆరోరణ అవరోహణ క్రమమునకు ఆ రాగములో ప్రయోగమగుచున్న సంచారమునకు సంబంధమే వుండదు. ఈ కోవకు చెందిన రాగములలో – యదుకుల కాంభోజి, ఒక ఉదాహరణ. దీర్ఘ ధైవతము మిక్కిలి అపురూపముగా వాడబడినది. దీక్షితుల వారి కృతులలో ఒకటైన ‘అంగారక మాశ్రయామ మహం’ మరియు ‘బాలసుబ్రమణ్యం భజేహం’ కృతులతో దీర్ఘ ధైవత ప్రయోగము కన్పించును. ఇందలి నిషాదము, శ్రుతులకు చెప్పిన జాతులలో ఒకటైన దీప్తాజాతిని అన్వయించిన విధముగా పలుకుచున్నది.
ఇదే ‘రిమపని’ లో నిషాదము కంపితముగా పలుకును. ‘మనిదప’ లోని మధ్యమము – శుద్ద మధ్యమము కన్నా తీవ్రమైనది. ‘మనిద’ కొంచెము తీవ్రముగనే పలుకుచున్నది. ‘రీసా’, నీదా’ ప్రయోగములు విశేషములైనవి. ఈ ప్రయోగములలో పలుకు అనుస్వర, సూక్ష్మత అనుభవం చేత తెలుసుకోనవలసినదే కానీ లిఖిత పూర్వకముగా వివరింపలేనిది. ‘నీదా’ లోని ధైవతము అసలు ధైవతమే కాదు. అది నిషాదమే. ‘నీదా’ అను ప్రయోగం నీనీ గానే పలుకును.
‘సనిదప మగరిస’ ఒక అపురూపమైన విశేష ప్రయాగము. వీణ కుప్పయ్యర్ తన ‘ఎంతో ప్రేమతో’ అనే తాన వర్ణంలో ‘సనిదప మగరిస’ ప్రయాగము వాడెను. ఈ ప్రయోగమును కేదారగౌళ రాగచ్ఛాయ రాని విధంగా, సురటి రాగములో పాడవలెను.
పంచముము ముఖ్య న్యాసము. సురటి వంటి రాగములను (ఇంకా నీలాంబరి, శహన, యదుకుల కాంభోజి మొదలగు రాగములు) పాడునపుడు, లక్ష్యానుభవంతో కనిపించు అందచందములను వ్రాయుటకు వీలు కాదు. లక్ష్యములో చూచుకొన వలెను.
భావపూరితమైన రాగం. రక్త, రస ప్రధాన రాగం. వర్ణనకు తగిన రాగం ఈ రాగంలో తాన వర్ణం, కృతి, పదము, జావళి, దరువులు మున్నగు సంగీత రచనలు కలవు. తిల్లాన రచించుట యుక్తము కాదు.
సంచారము:
మ గ రి మ స రీ మ పా – రి మ ప ని ద పా – రి మ నీ ని ద ని స నీ ద పా – రి మ ప ని ద ని సా – ని స రి మా గ ప మ రీ – రి మ స రి స – ని రి స ని ద పా – రి మ ప ని ద ప మా – గ ప మ రీ – మ స ర స – స రి మ పా
ఈ రాగములోని ప్రసిద్ధ రచనలు:
- గీతార్థము – త్యాగరాజు – కృతి- ఆది
- రామచంద్ర నీ దయ – త్యాగరాజు – కృతి- ఆది
- భజన పరుల – త్యాగరాజు – కృతి- రూపక
- పతికి హారతీరే – త్యాగరాజు – కృతి- ఆది
- పరదేవి – వీణ కుప్పయ్యర్
- ఇంటికి రానిచ్చేనా – క్షేత్రయ్య
- మరియాద – రామ్నాడ్ శ్రీనివాసయ్యర్ – జావళి – రూపక
- వేగ నీవు వాని రమ్మనవే – రామ్నాడ్ శ్రీనివాసయ్యర్ – జావళి – రూపక
- శ్రీ వేంకట గిరిశ – దీక్షితార్ – కృతి- ఆది
- అంగారక దీక్షితార్ – కృతి- రూపక
~
పల్లవి:
అంగారక మాశ్రయామ్యహమ్
వినతాశ్రిత జన మందారం
మంగళవారం భూమి కుమారం వారం వారం
అనుపల్లవి:
శృంగారక మేష వృశ్చిక రాశ్యాధిపతిం
రక్తాంగం రక్తాంబరాది ధరం శక్తి శూలధరం
మంగళం కంబు గళం మంజులతర పద యుగళం
మంగళదాయక మేష తురంగమ్ మకరోత్తుంగం
చరణం:
దానవ సుర సేవిత మందస్మిత విలసిత వక్త్రం
ధరణి ప్రదం భ్రాతృకారకం రక్త నేత్రం
దీన రక్షకం పూజిత వైద్యనాథ క్షేత్రం
దివ్యౌషాది గురు గుహ కటాక్షానుగ్రహ పాత్రం
భాను చంద్ర గురు మిత్రం భాస మాన సుకళత్రం
జానుస్త హస్త చిత్రం చతుర్భుజ మతి విచిత్రం
~
ప్రతిపదార్థం:
పల్లవి:
అంగారక మాశ్రయామ్యహం
అహం = నేను
అంగారకం = అంగారక గ్రహమును
ఆశ్రయం = ఆశ్రయించుచున్నాను.
(వినతా శ్రిత జన మందారం)
మంగళవారము, భూమి కుమారం, వారం వారం
అనుపల్లవి:
శృంగారక+మేష+వృశ్చిక+రాశి+అధిపతిం = శృంగారక, మేష, వృశ్చిక రాశులకు అధిపతియైన వాడా
రక్తాంగం (రక్త+అంగం) =ఎర్రని శరీరము గలవాడా
రక్త+అంబర+ఆది+ధరం = ఎర్రని వస్త్రములు మొదలైన వానిని ధరించువాడా
శక్తి+శూల+ధరం= శక్తి, శూలము ధరించువాడా
మంగళం = శుభప్రదమైనవాడా
కంబు గళం = శంఖము వంటి కంఠము గలవాడా
మంజులతర పద యుగళం = మిక్కిలి సుకుతూరమైన పదములు గలవాడా
మంగళదాయకం = శుభప్రదమైన వాడా
మేష+తురంగం = మేషమునే వాహనముగా కలవాడా
మకర+ఉత్తుంగం = మకర రాశిలో ఉచ్చంగా ఉండేవాడా
చరణం:
దానవ సుర సేవిత = రాక్షసుల చేతను, దేవతల చేతను సేవించబడే వాడా
మందస్మిత విలసిత వక్త్రం =మందహాసముచే ప్రకాశించెడి ముఖము కలవాడా
ధరణీ ప్రదం భాతృకారతం = భూమిని ప్రసాదించి సోదరులకు కారకుడైన వాడా
రక్తనేత్రం = ఎర్రని కన్నులు గలవాడా
దీన రక్షకం = దీనులను కాపాడు వాడా
పూజిత+వైద్యనాథ్+క్షేత్రం = వైద్యనాథ్ క్షేత్రమునందు పూజింపబడెడి వాడా
దివ్య+ఔషధ+ఆది=దివ్యమైన మందులు మొదలైన వాటి చేత
గురు గుహ = కుమారస్వామి
కటాక్ష+అనుగ్రహ+పాత్రం = నీ దయకు పాత్రుడైన వాడు
భానుచంద్ర గురుమిత్రం = సూర్ణ చంద్ర గురు గ్రహములకు స్నేహితుడైన వాడా
భాసమాన+సుకళత్రం = ప్రకాశించెడి అందమైన భార్య కల్గిన వాడా
జానుస్త హస్త చిత్రం = పొడవైన హస్తములచే చిత్రమైన ఆకారము కలవాడా
చతుర్భుజ+అతి+విచిత్రం = నాలుగు హస్తములతో ఆశ్చర్యము కలిగించువాడా – నమస్కారం.
(ఇంకా ఉంది)