అలనాటి అపురూపాలు – 212

0
4

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

మధుర గాయని పి.లీల

శ్రీమతి పి. లీల 1934లో కేరళలోని పాలక్కాడ్‌లోని చిత్తూరులో వి.కె. కుంజన్‌మీనన్, పోరయత్ మీనాక్షి అమ్మ దంపతులకు జన్మించారు. ముగ్గురు అమ్మాయిలలో లీల అందరికంటే చిన్నవారు. శారద, భానుమతి ఆమె అక్కయ్యలు. కుంజన్‌మీనన్ ఎర్నాకుళం లోని రామవర్మ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసేవారు. ఆయనకి సంగీతం పట్ల మక్కువ ఎక్కువ, “మా కుటుంబంలో మేము ముగ్గురు ఆడపిల్లలలో, నేనే చిన్నదానిని. మేము కర్నాటక సంగీతం నేర్చుకోవాలని మా నాన్నగారు కోరుకున్నారు. మేం ముగ్గురం బాగా పాడేవాళ్ళం, నేను గాయని అవడానికి కారణం మా నాన్నగారే.” అన్నారు లీల ఓ సందర్భంలో.

13 సంవత్సరాల వయస్సు నుండి ప్రారంభించి, ఆమె అన్ని దక్షిణ భారతీయ భాషలలో – తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషలలో సుమారు 5000 సినిమా పాటలను పాడారు. ఆమె ఓ బెంగాలీ చిత్రానికి, ఓ సింహళ సినిమాకి కూడా పాడారు. ఆమె పాటలు భావోద్వేగాలు కలిగించేవిగా, శాస్త్రీయ సంగీతపు క్రమశిక్షణ లోబడి ఉండేవి. మధురమైన స్వరంలో పాడటం ద్వారా ఆమె చలనచిత్ర పరిశ్రమలోనూ, శాస్త్రీయ సంగీతంలో తనకంటూ పేరు తెచ్చుకున్నారు. కర్ణాటక సంగీతపు ముగ్గురు దిగ్గజాలైన ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, ఎం.ఎల్. వసంతకుమారి, డి.కె. పట్టమ్మాళ్ పాడిన కాలంలోనే – తానూ పాడటం ఒక గౌరవంగా ఆమె భావించారు. ఆమె అందరు గొప్ప సంగీత దర్శకుల దగ్గర పనిచేశారు, దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖ గాయకులందరితో పాటలు పాడారు. పి. లీల గారిది దైవదత్తమైన స్వరం. సంగీత విద్వాంసుడు టివి గోపాలకృష్ణన్ మామ అయిన శ్రీ తిరిబువన మణిభాగవతార్, ఆమె మొదటి గురువు. తరువాత ఆమె పత్తమడై కృష్ణయ్యర్, మరుత్తువకుడి రాజగోపాల అయ్యర్, రామ భాగవతార్ వంటి గురువుల నుండి సంగీతం నేర్చుకున్నారు. చెంబై వైద్యనాథ భాగవతార్, వి. దక్షిణామూర్తి వంటి ప్రముఖులచే కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు. వడక్కంచేరి రామభాగవధర్ – లీల తండ్రి మీనన్‌ గారికి సన్నిహిత మిత్రులు. ఆయన మద్రాసులో స్థిరపడ్డారు. ఎర్నాకుళం వెళ్ళినప్పుడల్లా – సంగీతం నేర్చుకోవడానికి మద్రాసు రమ్మని మీనన్‍కు, లీలకు చెప్పేవారట. లీల చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు – సంగీతంలో మరింత శిక్షణ కోసం లీలని మద్రాసు తీసుకెళ్లమని తండ్రికి సలహా ఇచ్చారు.

తన చిన్న కుమార్తెను నిష్ణాత గాయనిగా చేయాలనేది మీనన్ ఆశయం. మీనన్ ఎర్నాకుళంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి, లీలను 1944లో మద్రాసుకు తీసుకువెళ్లారు. వారు మైలాపూర్‌లో వడక్కంచేరి రామభాగవతార్ వద్ద ఉన్నారు. 10 ఏళ్ల లీల గురుకుల పద్ధతిలో నేర్చుకోవడం ప్రారంభించారు. మీనన్, లీలా ఉదయాన్నే సాధక (సంగీతం సాధన) చేసేవారు. మద్రాసులో, అరియక్కుడి రామానుజం, ఎస్. రామనాథన్, జి.ఎన్. బాలసుబ్రహ్మణ్యం, చెంబై మొదలైన గాయకుల సంగీత కచేరీలను వినే అవకాశం లీలకు లభించింది. ఈ ‘కెల్వి జ్ఞానం’ (వినడం ద్వారా సంగీతం నేర్చుకోవడం) తనకెంతో ఉపకరించిందనీ, తన సంగీతాన్ని చక్కగా తీర్చిదిద్దడంలో చాలా సహాయపడిందని లీల తెలిపారు. 1946లో నగరంలో జరిగిన అనేక సంగీత పోటీలలో పాడి బహుమతులు గెలుచుకున్నారు లీల. తొలి కచేరీని ఆంద్ర మహిళా సభలో చేసే అవకాశాన్ని దుర్గాబాయి దేశ్‌ముఖ్ కల్పించారు. లీల వివిధ ప్రాంతాలలో కచేరీలు చేసేవారు.

చిత్ర పరిశ్రమలోకి ప్రవేశం:

ఆ రోజుల్లో కొలంబియా రికార్డింగ్ కంపెనీ కొత్త గాయనీమణుల కోసం వెతుకుతోంది.  ఆ సంస్థ మేనేజర్ గణపతిరామ అయ్యర్ లీల పేరును సిఫార్సు చేశారు. ఆమె వారి కంపెనీ గాయనిగా నియమితులయ్యారు. ఇది ఆమె సినీరంగ ప్రవేశానికి మార్గం కల్పించింది.

తమిళంలో నేపథ్య గానాన్ని ప్రవేశపెట్టిన తొలి చిత్రం ‘నందకుమార్’. ఎ.వి. మెయ్యప్ప చెట్టియార్ – సౌండ్‌ట్రాక్‌ను వాయిస్‌తో నింపాలనే వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు, దాంతో 1938లో తమిళ సినిమాలో ప్లేబ్యాక్ సిస్టమ్ ప్రవేశపెట్టబడింది. దానికి క్రమంగా ఆమోదం లభించి, అనేక మంది గాయనీగాయకులు సినీ ప్రపంచంలోకి ప్రవేశించారు.

“నటీమణులు తమ పాటలు తామే పాడుకునే కాలంలోనే నాకు సినీరంగంతో పరిచయం ఏర్పడింది” అంటూ లీల అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

మద్రాసులో అడుగుపెట్టినప్పుడు ఆమెకు తమిళం, తెలుగు రాదు. ఆమె మలయాళంలో పాటను వ్రాసి వాటిని పరిపూర్ణంగా సాధన చేసేవారు. నేపథ్య గాయనిగా కెరీర్ ప్రారంభించిన తర్వాత ఆమె ట్యూటర్‌లను ఏర్పాటు చేసికుని ఇతర భాషలను నేర్చుకున్నారు.

1948లో ఒక తమిళ సినిమాకి పాడటానికి ఆమెకు మొదటి అవకాశం వచ్చింది. ఆమె తండ్రి మొదట్లో విముఖత చూపినప్పటికీ, తరువాత అంగీకరించారు. ‘కంగనం’ అనే సినిమాతో నేపథ్య గాయని అయ్యారు లీల. ఆమె తన 13 సంవత్సరాల వయస్సులో తన మొదటి పాట ‘శ్రీ వరలక్ష్మి..’ పాడారు. సిహెచ్ పద్మనాభశాస్త్రి ఈ చిత్రానికి సంగీత దర్శకులు. ఆ సినిమాలో హీరోయిన్ కోసం ఆమె అన్ని పాటలు పాడారు. ‘కంగనం’ సినిమాతో మొదలుపెట్టి, రెండు దశాబ్దాల కంటే ఎక్కువ కాలం పాటు ఆమె దక్షిణ భారత చలనచిత్రరంగంలో అత్యంత డిమాండ్ ఉన్న నేపథ్య గాయనిగా కొనసాగారు.

1948లో ఆమె ‘నిర్మల’ అనే మలయాళ చిత్రం కోసం ‘పాదుకా పూన్‌కుయిలే’ అనే పాట పాడారు.

అయితే 1938లోనే సౌండ్ ట్రాక్‌తో కూడిన మొదటి మలయాళ టాకీ ‘బాలన్’  రూపొందించబడింది. సేలంలోని మోడరన్ థియేటర్స్ కోసం టి.ఆర్. సుందరం ఈ సినిమాని నిర్మించారు. ఎస్. నొట్టాని దర్శకులు.

తెలుగు సినిమాలు:

మనదేశం, కీలు గుర్రం, గుణసుందరి కథ అనే మూడు సినిమాలకు పాడడం ద్వారా 1949లో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు లీల.

గాయకులు, సంగీత దర్శకులు ఘంటసాల (వీరితో అత్యధిక పాటలు పాడారు లీల) లీలని పరిచయం చేశారు. ‘గుణసుందరి కథ’ చిత్రంలో కథానాయిక కోసం అన్ని పాటలు లీల పాడారు.

ఈ సినిమాలోని – కలకలా ఆ కోకిలేమో పలుకరించే వింటివా, చల్లని దొరవోయ్ ఓ చందమామా, శ్రీతులసి ప్రియతులసి, అమ్మా మహాలక్ష్మి – వంటి పాటలు హిట్ అయ్యాయి.

1950వ దశకంలో లీల దక్షిణ భారత భాషలన్నింటిలో పాటలు పాడుతూ తీరిక లేకుండా ఉండేవారు. పాతాళ భైరవి, మిస్సమ్మ, పెళ్లి చేసి చూడు, అప్పు చేసి పప్పు కూడు, గుండమ్మ కథ వంటి చిత్రాలలో ఆమె గొప్ప మధురమైన పాటలు పాడారు, అనేక దశాబ్దాల తర్వాత నేటికీ గుర్తుంటాయి.

విజయా ప్రొడక్షన్స్‌ తొలి సినిమా షావుకారు బాక్సాఫీస్‌ వద్ద ఫర్వాలేదనిపించింది. అయితే, ఈ చిత్రానికి ఘంటసాల, లీల అద్భుతమైన యుగళగీతాలు అందించారు.

మిస్సమ్మ (తమిళంలో మిస్సియమ్మ) చిత్రంలో ఎ.ఎం.రాజా, పి.లీల, పి.సుశీల స్వరాలతో పాటు ఎస్.రాజేశ్వరరావు అందించిన సంగీతం శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తూ అజరామరమైంది.

విజయా ప్రొడక్షన్స్ 1957లో నిర్మించిన ఆరవ చిత్రం, ‘మాయాబజార్’ (కె.వి.రెడ్డి దర్శకత్వం) నిజమైన క్లాసిక్. ఈ చిత్రంలోని ‘వివాహ భోజనంబు’ (కళ్యాణ సమయల్ సాతమ్)’ పాట కాల పరీక్షని తట్టుకుని ఇప్పటికీ నిలిచింది. ఒక ఇంటర్వ్యూలో లీల – ‘మాయాబజార్’ పాటలను రికార్డ్ చేస్తున్నప్పుడు, స్వరకర్త ఒక పాటకు 28 టేకులు తీసుకున్నారని, కానీ వారు ఐదవ టేక్‌ను ఉపయోగించారని గుర్తుచేసుకున్నారు.

ఆమె 1968లో ‘చిన్నారి పాపలు’ అనే చిత్రానికి సంగీత దర్శకురాలిగా పనిచేశారు. ఈ చిత్రం కోసం అందరూ మహిళలే పనిచేశారు.

‘లవ కుశ’ (1963) చిత్రం గురించి ప్రస్తావించకుండా గాయనిగా లీలా సాధించిన విజయాల ప్రస్తావన పూర్తి కాదు. ఆమె పి.సుశీలతో కలిసి ఎనిమిది పాటలు పాడారు.

భక్తి గీతాలు:

‘నారాయణీయం’ అనేది గురువాయూరప్పన్ పై రచించిన ఉత్కృష్టమైన శ్లోకం, దీనిని మేల్పత్తూర్ నారాయణ భట్టతిరి స్వరపరిచారు.

గురువాయూర్ దేవస్వోమ్ నారాయణీయం ఆల్బమ్‌ని తీసుకురావాలని నిర్ణయించుకున్నప్పుడు, ఎం.ఎస్., ఎం.ఎల్.వి వంటి అనేక మంది సంగీతకారుల పేర్లను పరిశీలించారు, కానీ చివరకు ‘నారాయణీయం’ పాడటానికి దేవస్వోమ్ పి.లీలను ఎన్నుకుంది. “ఈ అవకాశం నాకు దక్కడం నేను ఓ గౌరవంగా భావిస్తాను..” అన్నారు లీల.

లీల యొక్క మరొక గొప్ప కృషి – ‘జ్ఞానప్పన’. జ్ఞానప్పనను మలయాళీల భగవద్గీతగా పరిగణిస్తారు. ఈ తాత్విక పద్యాన్ని ఆమె మనోహరంగా పాడిన తీరు వల్ల ఇప్పటికీ మలయాళ భక్తి సంగీతంలో అత్యుత్తమ గానంగా పరిగణించబడుతుంది.

వ్యక్తిగత జీవితం:

లీల ఒక న్యాయవాదిని వివాహం చేసుకున్నారు, కానీ ఆ వివాహం విజయవంతం కాలేదు. తరువాతి సంవత్సరాలలో, లీల శాస్త్రీయ సంగీత కచేరీలు, లైట్ మ్యూజిక్ కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపారు. ఆమె డిఫెన్స్ కాలనీ, సెయింట్ థామస్ మౌంట్ (పరంగిమలై)లో తన సోదరి పిల్లలతో కలిసి ఉండేవారు. ఆమె ప్రపంచమంతా సంగీతం, పూజ గది, ఇంకా తండ్రి జ్ఞాపకాలు మాత్రమే. గాయని లీల వెనుక ఉన్న వ్యక్తి తండ్రి వి.కె.మీనన్. చాలా ఇంటర్వ్యూలలో లీల భావోద్వేగంతో చెప్పేవారు, “నేను ఇలా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే అది మా నాన్నగారి వల్లే; నాకు ఆయనే సర్వస్వం. కీర్తి, సంపద అన్నీ ఆయనే నాకు అందించారు. ఆయన లేకుండా నేను లేను. ఆయన లేకపోతే నేను ఏమీ కాను.” తన మృదువైన స్వరంతో అభిమానులను ఉర్రూతలూగిస్తూ తన తండ్రి కలలను నెరవేర్చారు లీల.

పురస్కారాలు, గుర్తింపు:

లీల 1969లో ‘కాదల్‌పలం’ అనే మలయాళ చిత్రంలోని ‘ఉజ్జయినియిలే గాయిక’ అనే పాటకు కేరళ రాష్ట్ర ఉత్తమ నేపథ్య గాయని అవార్డును పొందారు.

1992లో అప్పటి ముఖ్యమంత్రి జె జయలలిత – లీలను ‘కలైమామణి’ బిరుదుతో సత్కరించారు. లీల గారి ఈ అవార్డు ఆలస్యంగా వచ్చినప్పటికీ, దానిని తాను ప్రదానం చేసినందుకు గర్వంగా ఉందని జయలలిత తన ప్రసంగంలో అన్నారు.

‘నారాయణీయం’, ‘జ్ఞానప్పన’, ఇంకా ‘హరినామకీర్తనం’ల వ్యాప్తిలో ఆమె చేసిన కృషికి బాలసంస్కార కేంద్రం ఏర్పాటు చేసిన జన్మాష్టమి పురస్కారాన్ని లీలకు 2003లో అందించారు.

2006లో మరణానంతరం ఆమెకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. లీలకి గానమణి, గానకోకిల, కళారత్నం, గానవర్షిణి వంటి అనేక బిరుదులు లభించాయి.

మరణం:

పి. లీల 31 అక్టోబర్ 2005న మధ్యాహ్నం 3:40 కి చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్‌లో మరణించారు.

భౌతికంగా దూరమైనా తాను పాడిన పాటల ద్వారా ఆమె శ్రోతల హృదయాలలో సజీవంగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here