పిన్నల పెద్దరికం-3

0
3

[శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ‘పిన్నల పెద్దరికం’ అనే నాటిక అందిస్తున్నాము. ఇది 3వ, చివరి భాగం. మొదటి భాగం ఇక్కడ. రెండవ భాగం ఇక్కడ.]

(తెర తీయగానే జగదీష్, జానకి సోఫాలో కూర్చొని ఉంటారు.)

జగదీష్ – ‘జానకీ, వాళ్ళు వచ్చే వేళయింది. అన్నీ తయారుగా ఉన్నాయి గదా.’

జానకి – ‘అన్నీ తయారుగా ఉన్నాయండి. వాళ్ళొచ్చేక కాఫీయో, టీ, యో, వాళ్ళు ఏదంటే అది చెయ్యొచ్చు.’

(అంతలో ప్రభాకర్ దంపతులు రావడం గమనించి, జగదీష్, జానకి, వారిని ఎదుర్కొని ఆహ్వానిస్తారు.)

ప్రభాకర్ – (భార్యను పరిచయం చేస్తూ ) ‘ఈవిడ నా మిసెస్, మాధవి.’

జగదీష్ – (తన భార్యను పరిచయం చేస్తూ ) ‘ఈవిడ జానకి, నా మిసెస్.’

(పురుషులిద్దరూ ప్రక్కప్రక్కన, స్త్రీలు ఇద్దరూ ప్రక్కప్రక్కన వేరువేరు సోఫాలలో ఆసీనులవుతారు.)

ప్రభాకర్ – ‘మీ కోలనీలో రోడ్లు బాగున్నాయండి. ఎక్కడా గతుకలు లేవు.’

మాధవి – ‘మా కోలనీలో రోడ్లు ఘోరంగా ఉన్నాయండి. అడుగడుక్కీ పెద్ద గోతులేనండి.’

జగదీష్ – ‘మా రోడ్లు కూడా అలాగే ఉండేవండి. మూడు నాలుగు నెలల క్రిందట, సైకిలు మీద వస్తున్న కాలేజీ కుర్రాడొకడు, గోతిలో పడి కాలు విరక్కొట్టుకొన్నాడు. దానితో కాలేజీ కుర్రాళ్ళు, ఓ పెద్ద గ్రూపు, మా ఏరియా కౌన్సెలర్ను ఘెరావ్ చేసి బెదిరిస్తే, వెంటనే ఈ మాత్రం బాగుచేసేరు.’

జానకి – ‘ఓ రెండు పెద్ద వానలు పడితే, మా రోడ్లు మళ్ళీ యధా స్థితికే వస్తాయండి.’

ప్రభాకర్ – ‘జగదీష్ గారూ, మీరు రిటైరయి ఎన్నాళ్ళయిందండి.’

జగదీష్ – ‘లాస్ట్ మంతుకు ఫైవ్ ఇయర్స్ అయిందండి.’

ప్రభాకర్ – ‘యు లుక్ మచ్ ఎంగర్. వాట్ ఈజ్ ద సీక్రెట్.’

జగదీష్ – ‘సీక్రెట్ ఏమీ లేదండీ. రోజూ మార్నింగ్, వన్ అవర్ యోగా, సాయంత్రం వన్ అవర్ వాకింగూ , చేస్తానండి.That’s all.’

మాధవి – (చిరునవ్వుతో ) ‘మావారు కూడా యోగాకు ఓ డ్రెస్సూ, వాకింగుకు ఓ డ్రెస్సూ, కొన్నారండి. అవి వాడుక చెయ్యడానికి ఆయనకు టైము కుదరడం లేదు.’

ప్రభాకర్ – ‘నాకు రోజూ వీలవ్వడం లేదండి. ఏవో ఆఫీసు పనులుంటాయి. అవి ఉదయాన్నే లేచి చూసుకోవాలి. సాయంత్రం ఆఫీసులో లేటయిపోతూ ఉంటుంది. వీలైనప్పుడు సిన్సియర్‌గా చేస్తూ ఉంటాను.’

జగదీష్ – ‘సర్వీస్‌లో ఉన్నప్పుడు, నాకూ రెగ్యులర్‌గా కుదిరేది కాదండి.’

ప్రభాకర్ – ‘సార్, మాటల్లోపడి అడగడం మర్చిపోయేను. వాడు మీ ఇల్లు ఖాళీ చేసేడా.’

జగదీష్ – ‘ఇంకా చెయ్యలేదండి. కాని వాడు ఆ ప్రయత్నంలోనే ఉన్నట్టుందండి. నిన్న అటు వెళ్లి చూసేను. సామాన్లు చాలావరకు పేక్ అయి ఉన్నాయి. మీరిచ్చిన వారం రోజులు గడువు రేపటితో అయిపోతుందిగదా. చూద్దాం.’

ప్రభాకర్ – ‘గుడ్ న్యూస్.’

ప్రభాకర్ – ‘జగదీష్ గారూ, రోజూ మీ కాలక్షేపమేమిటండి.’

జగదీష్ – ‘పుస్తకాలే నాకు కంపెనీ అండి. ఎక్కువగా ఇంగ్లీష్ నోవల్స్ చదువుతూ ఉండేవాణ్ణి. కొన్నాళ్లయింది; మా ఆవిడతో కలసి, పోతనగారి భాగవతం చదువుతున్నాను. (జానకిని చూపిస్తూ, తేలిక హాస్యంతో) అర్థం కాని చోట మా గురువమ్మగారు బోధపరుస్తూ ఉంటారు.’

మాధవి – (జానకితో) ‘ మీకు తెలుగు లేంగ్వేజి బాగా వచ్చన్నమాట.’

జానకి – ‘బాగా ఏమీ రాదండి. మా తాతగారు తెలుగులో పండితులండి. ఆయన దగ్గరే కొంత నేర్చుకున్నాను.’

మాధవి – (జానకితో) ‘మీ అమ్మాయి ఎక్కడ ఉన్నారండి.’

జానకి – ‘పెద్దవాళ్ళు మీరు; దాన్ని మన్నించడమేమిటి. మా అమ్మాయి సరోజిని, పిట్స్‌బర్గులో ఉన్నాదండి. అక్కడ తన డాన్సు స్కూల్ నడిపిస్తోంది.’

జగదీష్ – ‘అల్లుడు సర్జను. మాకు దగ్గర సంబంధమేనండి.’

మాధవి – ‘వాళ్లకు పిల్లలా అండి.’

జానకి – ‘లేదండి. పెళ్లయి ఏడెనిమిది నెలలే అయింది.’

మాధవి – ‘మీకు తెలిసిన విషయమే. మా అబ్బాయి వివేక్, మీ విక్రమ్, ఇద్దరూ షికాగో లోనే ఉంటున్నారు.’

జానకి – ‘అవునండీ. మా వారు చెప్పేరు. ఇద్దరూ మంచి ఫ్రెండ్సుటగదా.’

మాధవి – ‘అవునండీ. మాకు ఇద్దరు పిల్లలండి. వివేక్, వాడికన్నా రెండేళ్లు చిన్నది, సుగుణ.’

జానకి – ‘అమ్మాయి ఏమిటి చేస్తోందండి.’

మాధవి – ‘BITS – పిలానీలో కంప్యూటర్ సైన్స్ ఫైనల్ ఇయర్‌లో ఉందండి. ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నాదండి.’

జానకి – ‘ఇద్దరు పిల్లలూ సరస్వతీ కటాక్షంతో పుట్టేరన్నమాట.’

మాధవి – ‘ఆ దేవి దయ. మీవంటి పెద్దల ఆశీర్వచనాలు; వాళ్లకు జీవితంలో సరైన దారి దొరికింది.’

ప్రభాకర్ – ‘మీకు విక్రమ్ కాక మరో అబ్బాయి ఉన్నాడటగదా.’

జగదీష్ – ‘అవునండి. మా రెండోవాడు, రామానుజన్ I.P.S.కు సెలెక్ట్ అయ్యేడండి . ప్రస్తుతం ముస్సోరీలో ట్రైనింగులో ఉన్నాడు.’

ప్రభాకర్ – ‘ఇద్దరు పిల్లలకు ఫేమస్ సైన్టిస్టుల పేర్లు పెట్టేరు. ‘

జగదీష్ – ‘ఏవో రొటీనుగా కాక ఆ పేర్లు పెట్టేం.’

ప్రభాకర్ – (జానకిని ఉద్దేశించి) ‘అమ్మా , మీ విక్రమ్‌కు ఏవైనా సంబంధాలు చూస్తున్నారా.’

జానకి – ‘ చూస్తున్నామండి. ఇంకా ఏదీ కుదరలేదు. ఏవైనా సూటబుల్ ఆఫర్స్ వస్తే, మేము వెళ్లి చూసిన తరువాత, అవసరమయితే వాడు శలవు పెట్టి వస్తాడు.’

జగదీష్ – ‘మా వాడు, వచ్చిన ప్రతీ సంబంధం చూడనన్నాడు. ముందుగా మమ్మల్ని చూసి అన్ని విధాలా నచ్చిన, ఒకటి, రెండు సంబంధాలు షార్ట్ లిస్ట్ చేస్తే, తానొచ్చి ఫైనలైజ్ చేస్తానన్నాడు.’

ప్రభాకర్ – ‘That’s good. నవే డేజ్ అదో ట్రెండ్ నడుస్తోంది. It is good for both of them.’

మాధవి – (ప్రక్కనే ఉన్న జానకి అరచేతిని తన రెండు చేతులతో పట్టుకొని) ‘మీరు కన్సిడర్ చేయదలచుకొంటే, మీ విక్రమ్‌కు మా అమ్మాయిని ఆఫర్ చేద్దామనుకొంటున్నామండి.’

జానకి – ‘అయ్యో, అంతకన్నానా .’

జగదీష్ – ‘we will be too happy to consider your offer.’

ప్రభాకర్ – ‘జగదీష్ గారూ, నిజానికి మీకు ఆఫర్ ఇవ్వడానికి, మేము కొద్దిగా సంశయంలో ఉండేవాళ్లం. మీ హౌస్ రెంట్ ప్రోబ్లెంని,( చిన్న చిరునవ్వుతో) భాగవతాన్ని, మేము ఎడ్వాంటేజ్ గా తీసుకొంటున్నామా అని misunderstanding వస్తుందేమో అని సంశయించేం.’

జగదీష్ – ‘ప్రభాకర్ గారూ, మిమ్మల్ని అలా ఎప్పుడూ లో గా ఎస్టిమేట్ చెయ్యం. ఆఫర్ ఇవ్వడం, మంచి పని చేసేరు. మాకు కూడా తగిన సంబంధం కావాలిగదా.’

మాధవి – ‘నెల్లాళ్ళనుండి మావాడు చెప్తున్నాడండి; విక్రమ్ చాలా గుడ్ మేనర్డ్ పెర్సన్, తెలివైనవాడు, ఫేమిలీ కూడా మనలాగే అందరూ క్లోజుగా ఉంటారని, ఇలా మీ అబ్బాయి గురుంచి, మీ ఫేమిలీ గూర్చి, పదే పదే చెబుతూ, ఆలస్యం చెయ్యొద్దు; వెంటనే ట్రై చెయ్యండని సలహా ఇచ్చేడు. వెంటనే వచ్చి మిమ్మల్ని కలుద్దామనుకొంటే, శూన్యమాసం; అది పోయిన తరువాత కలియమని అవధానిగారు సలహా ఇచ్చేరండి. ఈ లోగా అనుకోకుండా మీ ఇంటద్దె విషయంలో కలుసుకొన్నాం. ఇవాళ కలియడానికి ముహూర్తం ఆయనే పెట్టేరండి.’

జానకి – ‘మా వాడు కూడా మీ వివేక్ గురుంచి, మీ ఫేమిలీ గురుంచి, చాలా మంచి వాళ్ళని చెప్పేడు.’

మాధవి – ‘మా సుగుణకు వంటలో అనుభవముందండి. కొన్ని నార్త్ ఇండియన్ డిషెస్ కూడా అక్కడ పిలానీలో నేర్చుకొంది.’

ప్రభాకర్ – ‘నేను తిరుపతిలో పని చేస్తున్న రోజుల్లో మా అమ్మాయి కర్ణాటక సంగీతం మూడేళ్లు నేర్చుకొందండి. తరువాత నేను విజయవాడ వచ్చేక, రెండేళ్లు కంటిన్యూ చేసి, అరంగేట్రం కూడా చేసింది.’

జగదీష్ – ‘ It’s a very good qualification.’

జానకి – ‘ పెద్ద చదువు, చదువుకొంటూ, అంత శ్రద్ధగా సంగీతం నేర్చుకోడం విశేషం.’

మాధవి – (భర్తనుద్దేశించి) ‘ఏమండీ, ఆయనకు మీ సెల్లో అమ్మాయి ఫోటో చూపించండి.’

ప్రభాకర్ – (ఫోటో చూపిస్తూ) ‘ఇది లేటేస్టుదండి. లాస్ట్ మంత్ పంపించింది.’

జగదీష్ – (భార్యకు ఫోటో అందిస్తూ) ‘లుక్స్ గుడ్. చూడు.’

జానకి – (ఫోటో చూసి) ‘బాగానే కనిపిస్తోంది. అమ్మాయి హైట్ ఎంత ఉంటుందండీ.’

ప్రభాకర్ – ‘ఎబౌట్, ఫైవ్ ఫైవ్’

జగదీష్ – ‘గుడ్. మావాడు, ఫైవ్ లెవెన్.’

మాధవి – ‘మావాడు చెప్పేడు ; విక్రమ్ బాగా పొడగరి అని.’

జగదీష్- ‘జానకీ, మాటల్లోపడి మర్చిపోయేవా. మాకు తినడానికి తాగడానికి ఏమైనా తెస్తావా.’

జానకి – ‘అయ్యో, బాగా జ్ఞాపకం చేసేరు . మీరు మాట్లాడుతూ ఉండండి. రెండు నిమిషాల్లో తెస్తాను.’

(జానకి లేవబోతూ ఉంటే, మాధవి ఆవిడ చెయ్యి పట్టుకొని)

మాధవి – ‘మీరు కూర్చోండి. ఇప్పుడవన్నీ పెట్టుకోకండి.’

జానకి – ‘అయ్యో, మొదటిసారి వచ్చేరు, మా ఇంటికి. ఏమీ తీసుకోకుండా వెళ్లడమేమిటి.’

ప్రభాకర్ – ‘మరోమారు తీరిగ్గా వచ్చి మీ ఇంట్లో భోజనం చేస్తాం. ఇప్పటికేమీ వద్దమ్మా.’

జగదీష్ – ‘ఏమైనా సెంటిమెంటా.’

ప్రభాకర్ – ‘May be.’

జగదీష్ – ‘దెన్ లీవ్ ఇట్ జానకీ.’

మాధవి – ‘మా అమ్మాయికి ఈ వారంతో ఫైనల్ ఎగ్జామ్స్ ఐపొతాయి. అది వచ్చేక మీకు చెబుతాం. వీలు చూసుకొని మీరుభయులూ దయచేసి మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని చూడమని మా రిక్వెస్ట్.’

ప్రభాకర్ – ‘సర్, మీరు వచ్చి మా అమ్మాయిని చూస్తే, we will be thankful to you.’

జగదీష్ – ‘ఇద్దరికీ కావలిసిన విషయమండి. ఇందులో thankful గా ఉండడానికేమీలేదు. మీ అమ్మాయి రాగానే చెప్పండి. మేం తప్పక వస్తాం.’

ప్రభాకర్ – ‘so nice of you. We take your leave.’

(ప్రభాకర్, మాధవి; జగదీష్ దంపతులకు నమస్కరించి, శలవు తీసుకొంటారు. జగదీష్, జానకి సోఫాలో కూర్చొంటారు.)

జానకి – ‘ఈ సంబంధం గూర్చి మీ అభిప్రాయం ఏమిటండీ.’

జగదీష్ – ‘కల్చర్డ్ గానే కనిపిస్తున్నారు, జానకీ. వాళ్ళ మాటా మంతీ కూడా ఫరవాలేదు. అమ్మాయి హైటు, మనవాడికి సూటబుల్‌గా ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్లి అమ్మాయితో మాట్లాడేక, అవసరమయితే పిల్లణ్ణి రమ్మనొచ్చు.’

జానకి – ‘అదే. ఇప్పటికి బాగానే ఉంది. అమ్మాయి ఫోటో చూసేరుగదా; ఎలా ఉందంటారు.’

జగదీష్ – ‘ఫోటోలో బాగానే కనిపిస్తోంది. వెళ్లి చూసేక తెలుస్తుంది… ఇంతకూ నీ అభిప్రాయమేమిటి.’

జానకి – ‘నాకూ, సంబంధం బాగున్నట్లే ఉందండి. మీరన్నట్లు పిల్ల చూడ్డానికి ఫోటోలో బాగానే కనిపిస్తోంది. వెళ్లి చూసేక, మీరన్నట్లు అవసరమయితే మనవాణ్ణి రమ్మందాం. ఇంతకూ,ఎవరికి ఎవరు రాసున్నారో.’

జగదీష్ – ‘విక్రమ్‌కు, అమ్మాయి ఫోటో పంపించి, వాళ్ళతో జరిగిన విషయం, చెప్పాలి.’

జానకి – ‘మన తల్లికి కూడా ఫోటో పంపించి, జరిగిన విషయం చెప్పండి.’ (ఇంకా ఏదో చెప్పబోతూంటే)

జగదీష్ – ‘ఒక్క ఘడీ ఆగు. పిల్లడు ఫోన్ చేస్తున్నాడు. ఆఁ. చెప్పు నాన్నా. …….. వెరీ గుడ్. ఎప్పటినుండి ….ఈ నెల్లోనా. ఉండు. ఫోను స్పీకర్లో పెడతాను. అమ్మ కూడా వింటుంది. ఆఁ. చెప్పు. ……..రెండువారాల శలవు, ఎప్పటినుండన్నావు. …….ఈ నెల ట్వంటీ ఫస్ట్ నుండా ……..అవును. ఎయిటీన్త్ న బయలుదేరితే, శనాదివారాలు కలిసొస్తాయ్. టైమింగ్ ఈజ్ వెరీ గుడ్….. ఎందుకో చెప్తాను; విను. గంట క్రిందట, I.T. కమిషనరుగారు, ఆయన భార్య, మన ఇంటికొచ్చేరు. వాళ్ళ అమ్మాయి, BITS పిలానీలో ఇంజినీరింగ్ సైన్సు చేస్తోందిట. ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తోందట. ఆ అమ్మాయిని నీకు ఆఫర్ చేసేరు. అమ్మాయి పరీక్షలై వచ్చేక పిల్లని చూడ్డానికి రమ్మన్నారు. నువ్వెలాగూ వస్తున్నావు గదా. నువ్వొచ్చేక ముగ్గురం వెళ్లొచ్చు. అమ్మాయి ఫోటో ఇచ్చేరు. నీకు ఫర్వార్డు చేస్తాను.’

జానకి – ‘బాబూ .. అమ్మాయి హైటు బాగుంది. ఫైవ్ ఫైవట. జుత్తు ఒత్తుగా ఉంది….. ఎందుకు నవ్వుతున్నావ్…. మరి మేము చూసినవన్నీ చెప్పాలికదా’….

జగదీష్ – ‘ఆఁ. ఇప్పుడే దానికి కూడా విషయం చెప్పి, ఫోటో పంపిస్తాను. … ఓకే నాన్నా. గుడ్ నైట్.’

జానకి – ‘గుడ్ నైట్ బాబూ.’

జానకి – ‘పిల్లడి శలవులు వేళకు కలిసొచ్చేయండి.’

జగదీష్ – ‘అవును. వాళ్ళని అట్టే రోజులు వైటింగులో పెట్టక్కర్లేదు. ఏదో ఒకటి వేగిరం తెలుస్తుంది. వాళ్లకూ, మనకూ కూడా మంచిది.’

జానకి – ‘నాకు వంటింట్లో పనుందండి. వెళ్తాను.’

జగదీష్ – ‘నేనూ, ఓ మారు హాస్పిటల్లో రామ్మూర్తిగారు ఎలా ఉన్నారో చూసి వస్తాను.’

(జగదీష్, జానకి, నిష్క్రమించడంతో తెర పడును.)

(తెర తీయగానే, సోఫాలో జగదీష్ సెల్ ఫోనులో ఏదో చూస్తూన్న సమయంలో సెల్ ఫోను మ్రోగుతుంది.)

జగదీష్ – ……. ‘ఇప్పుడే ఓ అరగంటై వచ్చేమమ్మా. ……చూసేను. రెండుసార్లు చేసేవ్. ఆ టైములో వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళమమ్మా.’

జానకి (ప్రవేశిస్తూ) – ‘ఎవరండీ ఫోను… అమ్మాయా.’

జగదీష్ – ‘అమ్మాయే, చాలా ఆతృతగా ఉంది; ఏమిటయిందో తెలుసుకోడానికి.’ …(ఫోనులో).. మీ అమ్మ కూడా వచ్చింది. ఉండమ్మా. ఫోను స్పీకరులో పెడతాను….. వాడు ఇంట్లో లేడు. వాడి ఫ్రెండ్సు కొందరు, వాడికోసం కాసుకు కూర్చొని, వాడు ఇంటికి రాగానే, గుమ్మంలో అడుగు పెట్టకుండానే వాణ్ణి పిలిచి పట్టుకుపోయేరు. వాడొచ్చేక, నీకు ఫోను చేద్దామనుకున్నాను. ఇంతలో నువ్వే చేసేవ్…. వాడు కూడా నీతో మాట్లాడదామనుకొన్నాడు. వెళుతూ, వెళుతూ, చెప్పేడు; రాగానే నీతో మాట్లాడతానని. సంబంధం బాగానే ఉన్నట్టుందమ్మా….. నాకు నచ్చింది …….కారులో వస్తున్నప్పుడు, వాణ్ణీ అడిగేను. we have many in common. I am fully satisfied. అన్నాడు. ……అమ్మకు సంబంధం బాగా నచ్చింది.’

జానకి – ……‘దూరంగా కాదు; నేనాఅమ్మాయి ప్రక్కనే కూర్చున్నానమ్మా…….. సల్వార్ కమీజ్ వేసుకొంది. చూడ్డానికి అమ్మాయి బాగానే కనిపించింది…… జుత్తు ఒత్తుగా ఉంది…’

జగదీష్ – ‘మీ అమ్మకు ఆ అమ్మాయి జుత్తు బాగా నచ్చిందమ్మా.’

జానకి – ‘తండ్రీ, కొడుకు, నన్ను వెటకారం చేసేరు గాని, నువ్వే చెప్పమ్మా, ఆడపిల్లకు జుత్తు ఒత్తుగా ఉంటే అందం ఔనో కాదో..’

జగదీష్ – …‘లేదమ్మా, అమ్మని వెటకారం చెయ్యలేదు. జోక్ చేసేను.(జానకితో) నువ్వు హర్ట్ అయితే సారీ, జానకీ. నిజమే, ఆడపిల్లకు ఒత్తైన జుత్తు అందాన్నిస్తుంది. (చిరునవ్వుతో) నీ జుత్తు చూసేకదా నిన్ను పెళ్లాడేను.’

జానకి – ‘సరి, ఇప్పుడు మరో జోకా.’

జగదీష్ – ‘మనం తరువాత జోక్సు వేసుకొందాం. ఫోను పట్టుకొని ఉంది; అమ్మాయితో మాట్లాడు.’

జానకి – ‘నేనా అమ్మాయిని అడిగేను: నువ్వు సంగీతం రోజూ ప్రేక్టీసు చేస్తూంటావా, అని. రోజూ కుదరదు, గాని, వీలయినప్పుడల్లా చేస్తూంటానంది. అక్కడ భోజన సదుపాయం బాగుంటుందా, అని అడిగితే, మొదట్లో హోస్టల్ మెస్‌లో తిన్నాదిట. కొన్నాళ్ళకు సౌత్ ఇండియన్ మెస్ ఒకటి ఓపెనయితే, అందులోకి మారిందట. ఏదైనా ఇంటి భోజనం లాగ ఉండదంది.’

జగదీష్ – ‘అమ్మాయి చాలా కాన్ఫిడెంటుగా మాట్లాడిందమ్మా. బాగా కంఫర్టబుల్‌గా, ఎంతో పరిచయమున్నవాళ్ళలాగ మాతో మాట్లాడింది. స్మార్టుగా ఉంది.’

జానకి – ‘నీకు నార్త్ ఇండియన్ డిషెస్ వండడం వచ్చు కదా; వాటిలో ఏది నీ ఫేవరేట్ డిష్ అని అడిగేను. పనీర్ బటర్ మసాలా అంది…… అవునమ్మా. మీ నాన్నగారికి అది ఫేవరేట్ డిష్….. బాగా చెప్పేవ్…. ఆ అమ్మాయి మన ఇంటి కోడలయితే, తినాలనిపించినప్పుడల్లా మీ నాన్నగారు ఆ పంజాబీ హోటల్‌కు వెళ్ళక్కర్లేదు…… ఏదో మాటవరసకు అన్నాను. లేకపోతే, పెళ్లయ్యేక ఆ పిల్ల మన ఇంట్లో ఉండిపోతుందా.’

జగదీష్ – ‘విక్రమ్ వచ్చేక వాడు నీతో అన్నీ మాట్లాడతాడు. ఆ తరువాత మనకు సంబంధం నచ్చిందని చెప్పి, వాళ్ళ అభిప్రాయం అడుగుతాను. ప్రోబబ్లీ, వాళ్ళకీ నచ్చి ఉండొచ్చు. ముహూర్తం పెట్టగానే నీకు అల్లుడికి తెలియబరుస్తాను’

జానకి – …… ‘లేదు. లేదు. నువ్వొచ్చినదాకా నేను బట్టలేవీ కొనను….. అలాగే. అమ్మాయిని మనతో తీసుకెళ్లి, తనకు నచ్చినవి కొందాం….. ఉంటానమ్మా.’

జగదీష్ – ‘బై తల్లీ.’

(తెర పడును)

(తెర తీయగానే జగదీష్, జానకి సోఫాపై కూర్చొని ఉంటారు)

జానకి – ‘ఏమండీ, వాళ్ళతో ఏవైనా మాట్లాడవలసినవి ఉన్నాయా.’

జగదీష్ – ‘మరేమిటున్నాయి జానకీ, మాట్లాడుకోడానికి. కట్నకానుకలేవీ వద్దని మొదటే చెప్పీసేమ్.’

(May we come in సర్. అని వినిపిస్తుంది) ‘రండి, రండి’ అని జగదీష్, జానకి గుమ్మం వరకు వెళ్లి, ప్రభాకర్, మాధవి దంపతులను ఆహ్వానిస్తారు. నలుగురూ సోఫాల్లో ఆసీనులవుతారు.)

జగదీష్ – ‘ప్రభాకర్ గారూ, పెళ్లిపనులు ఎక్కడిదాకా వచ్చేయి.’

ప్రభాకర్ – ‘దేముడి దయవల్ల చాలావరకు ఆర్గనైజ్ అయ్యేయండి. ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్లకు కాంట్రేక్ట్ ఇవ్వడం వలన మాకు చాలా వర్క్ లోడ్ తగ్గింది.’

జానకి – (మాధవితో) ‘ఆడపిల్ల పెళ్లి. చాలా పన్లుంటాయ్. సాయానికి మీవాళ్లెవరైనా వస్తున్నారా.’

మాధవి – ‘వారం క్రిందట మా పెద్ద ఆడబడుచు వచ్చేరండి. ఇవాళ నా చెల్లెలు, మరది వచ్చేరు.’

ప్రభాకర్ – ‘సర్, మీ గెస్టులు ఎంతమందికి accommodation ఎరేంజ్ చెయ్యవలసి ఉంటుందండి.’

జగదీష్ – ‘ప్రభాకర్ గారూ, దాని కోసం మీరు శ్రమ తీసుకోకండి. నేనప్పుడే ఎరేంజ్మెంట్స్ చేసేను. మా ఇంట్లోను, మా ఫ్రెండ్స్ ఇళ్లలోనూ, ఏర్పాట్లయ్యేయి. మీరు మా ఎరేంజ్మెంట్స్ గూర్చి వరీ అవకండి.’

జానకి – ‘ఆడపెళ్ళివారు. మీ పన్లే మీకెన్నో ఉంటాయి. వాటితోనే మీకు సరిపోతుంది.’

మాధవి -’ మీవంటి అత్తవారు దొరకడం, మా అమ్మాయి అదృష్టం.’

(ప్రభాకర్ దంపతులిద్దరూ నిలబడి, పసుపుబొట్లు పెట్టిఉన్న శుభలేఖను, జగదీష్ దంపతులకు అందిస్తూ)

‘సుగుణ, విక్రమ్‌ల వివాహానికి ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. మీ ఆశీర్వచనములే మాకు శ్రీరామరక్ష .’

జగదీష్ – (ప్రభాకర్‌ను కౌగలించుకొని) – ‘Many many thanks. ఇది కేవలం మీ ఇంట పెళ్లి గాని, మా ఇంట పెళ్లి గాని కాదు. మనఇళ్ళ పెళ్లి. కలసి సరదాగా చేసుకొందాం.’

జానకి – (మాధవిని హత్తుకొని) ‘మా వారు చెప్పినట్లు, ఇది మన ఇళ్ల పెళ్లి. మీకు ఏ అవసరమొచ్చినా నాకు చెప్పండి.’

ప్రభాకర్ – ‘చాలా థేక్సండి. వస్తాం.’

(ప్రభాకర్, మాధవి, జగదీష్ దంపతుల శలవు తీసుకొంటారు)

-శుభం-

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here