మీ మనుగడ మేమే

0
3

[మార్చి 20వ తారీఖు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం (World Sparrow Day) సందర్భంగా నెల్లుట్ల సునీత గారు రచించిన ‘మీ మనుగడ మేమే’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]నే[/dropcap]నొక బుజ్జి పిచ్చుకమ్మను
ఒకప్పుడు మీ పంట చేలల్లో
పల్లె ముంగిట్లో సందడి చేసి
ఊసులెన్నో చెప్పిన
మీ మట్టి బంధాలమే మేము

మీ మండువాల్లోకి అతిథిగా
వచ్చి జొన్నకంకుల విందును
ఆరగించే మీ ఆనవాళ్ళం
అలుపెరగని
శ్రమైక జీవన చైతన్యాన్ని
ఆదర్శ దాంపత్యానికి
ప్రేమ సమీరాలం

పర్యావరణాన్ని పరిరక్షించే
జీవ వైవిద్యాన్ని
సమతుల్యతను కాపాడే
మీ మాధ్యమాలం
దప్పిగొన్న
మీ స్వార్థపు తాకిడికి
నేలకొరిగిన మీ జీవన స్రవంతిని
మీ అనాలోచిత ఆగడాలకు
అంతరిస్తున్న చిట్టి గువ్వలం

సెల్ టవర్ల
మృత్యు కూహురాల్లోచిక్కి
విల విలలాడుతూ
శ్వాసను విడిచిన
మీ చిన్ని నేస్తాలము

మీ సాంకేతిక పరిజ్ఞానమే
మాకు మరణ శాసనాలను లిఖించింది
ఆ పునాదుల్లోన శవాల దిబ్బనైన
మీ మనుగడను
అరచేతిలో విశ్వాన్ని
ఇముడ్చుకున్న మీ అజ్ఞానమే
మా చిరునామాను తప్పించింది

మేము అంతరిస్తే మీ బతుకును
భవితను బలిదానం
చేసుకోవాల్సిందే
మా ఆస్తిత్వాన్ని నాశనం చేస్తే
మీ జీవన గమనానికే
శాపమని గుర్తు చేస్తున్నాం
మేము లేకుంటే మీ బతుకే
ప్రశ్నార్థకమని
హెచ్చరిస్తున్నాం

మా జాతిని రక్షించే
బాధ్యత మీదేనని
వేడుకుంటున్నాం
పిచ్చుకపై బ్రహ్మాస్త్రమేనా
మీ సాంకేతిక జీవన సౌలభ్యం
మీ సరికొత్త ఆలోచనకు శ్రీకారం
అంతేనా మా గతి గగనతలమేనా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here