[సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ హృషీకేశ్ సులభ్ హిందీలో రచించిన ‘దాతా పీర్’ అనే నవలని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు ‘భారత్ భాషా భూషణ్’ డా. పుట్టపర్తి నాగపద్మిని.]
[చిన్న వయసులోనే రసీదన్‍కు పెళ్ళవుతుంది. ఇరవై ఏళ్ళ దాంపత్యం గడిపాకా, భర్త నసీర్ మియ్యా చనిపోతాడు. అతను చనిపోయి ఇప్పటికి పదేళ్ళు దాటింది. యవ్వనంలో ఉండగా భర్త చనిపోవడంతో ఎన్నో కష్టాలు పడి, పశువులా శ్రమించి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. ఓ చెడ్డ ముహూర్తంలో రసీదన్ సత్తార్ మియ్యాని తన జీవితంలోకి రానిస్తుంది. పెళ్ళి కాకపోయినా, భార్యాభర్తల్లానే మసలుకుంటారు. కాని కొన్ని నెలల నుంచి సత్తార్ మియ్యా చూపులు ఎదిగిన రసీదన్ పెద్ద కూతురు అమీనాపై పడ్డాయి. ఆ అమ్మాయిని తడుముతూంటే, చూసి అరుస్తుంది. సత్తార్ అక్కడ్నించి వెళ్ళిపోతే, కూతురిని చితకబాదుతుంది. తన గతం గుర్తు చేసుకుంటూ తన తాత కాలే ఫకీర్‍ని తలచుకుంటుంది రసీదన్. ఆయన చేసిన పనులు, తిరిగిన ప్రాంతాలు, ఆయన బిడ్డలు గురించి తలచుకుంటుంది. గర్భం నిలవని ఆడవాళ్ళు కాలే ఫకీర్ దగ్గరికి వచ్చి, ప్రార్థనలు చేయించి, తాయెత్తులూ, కట్టించుకునేవారనీ, వాళ్ళ కోరికలు తీరాక ఇచ్చే డబ్బు, నగలు అమ్మమ్మకి చేరేవని గుర్తు చేసుకుంటుంది రసీదన్. తన తల్లిని, అబ్రార్ మామయ్యని, ఆయన పిల్లలని జ్ఞాపకం చేసుకుంటుంది. తన తల్లిదండ్రులను తలచుకుని, తన భర్తను, అతని చావును గుర్తు చేసుకుంటుంది రసీదన్. సత్తార్ మియ్యా ఉండే వీధిలోనే ఉండే సాబిర్ రసీదన్ కొడుకు ఫజ్లూకు స్నేహితుడు. సాబిర్ కూడా అమీనాతో సన్నిహితంగా ఉంటాడు. సత్తర్ మియ్యాకు అది నచ్చదు. రసీదన్‌కు తనంటే వల్లమాలిన అసహ్యమనీ, సాబిర్‌కు అమీనాకు పెళ్ళి చేయాలని అనుకుంటున్నదనీ సత్తార్ మియ్యాకు తెలుసు. అమీనా మనసు కరిగితే, ఆమెతో పాటూ పీర్ ముహానీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నాడతను. – ఇక చదవండి.]
అధ్యాయం-3
[dropcap]పీ[/dropcap]ర్ ముహానీ, లోహానీపుర్ – రెండింటి తీరు తెన్నులూ వేరైనా రెండూ కవల పిల్లల్లా ఉండేవి. పీర్ ముహానీ ఒక భాగం ఖాస్ మహల్ స్థలంలో ఉంది. అక్కడ కొత్త కొత్త భవనాలున్నాయి. వీటిలో బాగా చదువుకున్నవాళ్ళూ హోదాగలవాళ్ళూ ఉంటారు. రోడ్లు విశాలంగా, శుభ్రంగా ఉంటాయి. ఈ భాగం, గోరీలగడ్డ గేట్ దగ్గరికి వచ్చే కుడివైపు సందు దగ్గర ఉంది. ఎడమ వైపు ఇందాక చెప్పిన నాలుగు ఇరుకు సందులూ, వాటిలో అగ్గిపెట్టె డబ్బాల్లాగా చిన్న చిన్న ఇళ్ళు ఒకదానిమీదొకటి!!
లోహానీపుర్ చాలా కాలం కిందటే ఎప్పుడో వెలిసింది. ఎంత పాతది అంటే, దీన్ని గురించి ఇదమిత్థంగా ఇదీ అని ఎవరూ ఏమీ చెప్పలేనంత అన్నమాట! ఎక్కడైనా కొత్తగా కట్టుకోవాలనుకుంటే అంగుళం మాత్రమైనా స్థలం లేదిప్పుడు. పాత ఇళ్ళ అమ్మకాలూ, కొనుగోళ్ళూ మాత్రమే నడుస్తున్నాయిప్పుడు!! వాటినే పడగొట్టి మళ్ళీ కొత్తవి కట్టిస్తూ ఉన్నారు. పునాదులు తవ్వుతూ తవ్వుతూ గతాన్నంతా చిందర వందర చేసేయటమన్న ప్రమాదం ఎపుడూ ఉంటుంది. అర్ధరాత్రీ అపరాత్రీ పునాదులు తవ్వి తీస్తూ ఉంటారు. వాటిలో ఏమైనా దొరికినా ఎవరికీ తెలియకూడదనే ఆరాటం అలాంటిది. ఒకవేళ తెలిసిపోతే పోలీసులు పట్టుకుంటారు. ఈ స్థలాలు తవ్వకూడదని ప్రభుత్వం నిషేధించింది. దీని ఒకప్పటి పేరు నుహానీపుర్ అనీ, మారుతూ మారుతూ ఇప్పుడు లోహానీపుర్ అయ్యిందనీ కొంతమంది అంటూ ఉంటారు. నగర చరిత్ర వ్రాసేవాళ్ళ వ్యాఖ్య ప్రకారం – అజీబాబాద్, లేదా అంతకు చాలా ముందు పాటలీపుత్రం అనే రోజులనాటి ప్రాంతమిది. పదహారవ శతాబ్దం ప్రారంభంలో ఇక్కడ బహార్ ఖాన్ లోహానీ అనే ఆఫ్ఘనీయుడి పాలన ఉండేదని, యీ ప్రాంతం అతగాని బంధు వర్గీయులదనీ కొందరి వాదన. ఇక్కడి ఖిల్లాలో భాగం కూడా ఉండేదట! పంధొమ్మిదవ శతాబ్దం చివర ఎవరో దాన్ని తవ్వి చరిత్రకు సంబంధించిన చిహ్నాలు సేకరించారట కూడా!!
చరిత్రలోని యీ భాగంలోనే ఒక ఉదయం, తండ్రి బాసిత్ మియ్యాకు కళ్ళు చికిలించుకుంటూ దొరికాడు సత్తార్ మియ్యా. పచ్ కౌడీ సాహ్ సందు ముందు చెత్త కుప్పమీద భాగల్పూర్ పట్టు బట్ట మడతల్లో ఉన్నాడప్పుడు!! లాహానీపుర్ లోని ధనవంతుడు బాబూ బిచ్చీసింహ్ గుర్రబ్బండి తోలేవాడుగా ఉండేవాడు. బండీ పోయింది, గుర్రమూ పోయింది. బాబూ బిచ్చీ సింహ్ డెబ్భై ఏళ్ళ వయసులో యౌన వర్ధక ఔషధాలు ఎక్కువవటం వల్ల చనిపోయారు. ఆయన పిల్లలు తమ తండ్రి గారి సారధిని ఉద్యోగం నుంచీ పీకేయలేదు. ఇంటి వెనక ఉన్న గదిలోనే ఇదివరకటిలాగే ఉండనిచ్చారు. ఇదివరకటిలాగే రెండు పూటలా భోజనమూ దొరికేది. బాసిత్ మియ్యా కు అరవయ్యవ సంవత్సరంలో సత్తార్ లాంటి పుత్ర రత్నం దొరికాడు. పచ్ కౌడీ సాహ్ వీధి మొదట్లో పెద్ద గుంపు చేరింది. ఇటువంటి సందర్భాల్లో ఎలాంటి మాటలు ఉంటాయో, అలాంటి మాటలే వినిపిస్తున్నాయి. ఇంతకూ పిల్లాడు హిందువా? ముస్లిమా? విధవరాలికి పుట్టి ఉంటాడా లేక పెళ్ళికాని పిల్లకా? వీధిలో ఉండే వాళ్ళకేనా లేక పక్క వీధావిడెవరైనా ఇక్కడ పెట్టి వెళ్ళి ఉంటుందా?? అక్కడున్న వాళ్ళంతా యీ ప్రశ్నలతో సతమతమౌతూ ఉంటే, బాసిత్ మియ్యా పిల్లవాణ్ణి ఒళ్ళోకి తీసుకుని బెంగాలీ డాక్టర్ సమాద్దార్ దగ్గరికి వెళ్ళాలని ఆరాట పడుతున్నాడు. పోలీసులు వచ్చారు. బాబూ బిచ్చీ సింహ్ కొడుకు కూడా వచ్చాడు, ఉదయపు నడక పూర్తి చేసుకుని!! బాసిత్ మియ్యా పిల్లవాణ్ణి వదిలిపెట్టేందుకు ఒప్పుకోలేదు. బాబూ బిచ్చీ సింహ్ కొడుకు వకీలు. అతగాడు కూడా చెప్పినా ససేమిరా అన్నాడు. చివరికి వకీల్ చెప్పినట్టుగా బాసిత్ మియ్యాకే ఆ పిల్లాడిని అప్పగించటం జరిగింది. బాసిత్ మియ్యా పరుగులు పెడుతూ సమాద్దార్ డాక్టర్ దగ్గరికి చేరుకున్నాడు. బాసిత్ మియ్యాకు ఒక ఇల్లూ లేదు, సంతానమూ లేదు. ఐనా ఉత్సాహం కొద్దీ పిల్లాణ్ణి దగ్గరకు తీసుకున్నాడు!! మనసులో ఎక్కడో పిల్ల్లల కోరిక ఉందేమో, అదిప్పుడు ఉన్నట్టుండి బైట పడింది. మానవత్వం కూడా ఉన్నవాడాయన!! చిక్ పట్టీకి కబురు పెట్టాడు, తన ప్రియురాలు నూర్ కోసం!! ఆమె వితంతువు. వాళ్ళిద్దరి బంధం గురించి అందరికీ తెలుసు. ఆమె పరుగులు పెడుతూ వచ్చింది. ఇద్దరూ కలిసి మూడు రోజులు పగలూ రాత్రీ కాపలా ఉన్నారు పిల్లవాడికి!! పిల్లవాణ్ణి బతికించి, తిరిగి తీసుకుని వచ్చారు. డాక్టర్ ఒక్క పైసా తీసుకోలేదు. బాసిత్ మియ్యా అప్పుడప్పుడు, తన యజమాని బాబూ బిఛ్ఛీ సింహ్‌ను గుర్రపు బగ్గీలో డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళేవాడు. బాసిత్ మియ్యా నూర్ బీ – ఇద్దరూ కలిసి పిల్లవాణ్ణి పెంచారు. ఎవరైనా ఆక్రమిస్తారన్న భయంతో నూర్ మాత్రం, అప్పుడప్పుడూ చిక్ పట్టీకి వస్తూ పోతూ ఉండేది. పిల్ల్లవాడు వచ్చినప్పటినుండీ బాసిత్ మియ్యా, రిక్షా తొక్కటం మొదలెట్టాడు, సంపాదన కోసం!!
సత్తార్ మియ్యా పదేళ్ళవాడయ్యే సమయానికి బాసిత్ మియ్యాకు అల్లా నుంచీ పిలుపొచ్చింది. నూర్ బీ, బాబూ బిఛ్ఛీ సింహ్ ఇంటి వెనుకవైపున్న గది నుండీ తన తట్టా బుట్టా సర్దుకుని, చిక్ పట్టీ లోని తన ఇంటికి చేరుకుంది – పిల్లవాడితో!! సత్తార్ మియ్యా 15, 16 ఏళ్ళప్పుడు నూర్ బీ తనువు చాలించింది. సత్తార్ మియ్యాను నూర్ బీ ఇంటిలోనుండీ చిక్ పట్టీ వాళ్ళు వెళ్ళగొట్టేశారు. అతడు అనాథయ్యాడు. ఐనా ఏడువలేదు. బిచ్చమెత్తుకోలేదు. స్వశక్తితో ముందుకు నడిచాడు.
బీడీ, గాంజా చిలుము వీటన్నిటితో యీ వయసు నుంచే దోస్తీ ఏర్పడింది. లూలా మిస్త్రీ మోటర్ గరాజ్‌లో కొన్ని నెలలు మొదటి, అలాగే ఆఖరు ఉద్యోగం చేశాడు. గరాజ్ వెనుక టేఢ్కీ సందులో ఉండే బసమతియా పాసిన్ దగ్గర తాటి కల్లు తాగటం కోసం వెళ్ళటం, రావటం మొదలైంది. మొదటి వేట కూడా ఇక్కడే!! తనకంటే రెండింతలు వయసున్న పాసిన్ ఇంటి కల్లు మత్తుకంటే ఆమె వయ్యారాల మత్తే ఎక్కువ. అది సత్తార్ మియ్యా ట్రైనింగ్ సమయం. బసమతియా పాసిన్, సత్తార్ మియ్యా లీలలు లోహానీపుర్ సందుల్లో వ్యాపించిపోయాయి. ఈ సంగతి తెలిసి, లూలా మిస్త్రీ తన గరాజ్ నుంచీ సత్తార్ మియ్యాను తీసేశాడు. లూలా మిస్త్రీకి చిన్న చిన్న దొంగతనాల నుంచీ ప్రతి చెడు అలవాటునూ క్షమించే గుణముంది కానీ రంకుతనానికి లేదు. ఆయన ఖోటక బ్రహ్మచారి.
చనిపోయేముందు నూర్ బీ, సత్తార్ మియ్యాకు ఒక వెండి కంటె, ఒక జత కాలి పట్టీలు అప్పజెప్పింది. నూర్ బీ ఆస్తిని భద్రంగా ఉంచుకున్నాడు సత్తార్ మియ్యా. బసమతియాకు ఇచ్చేద్దామా అని చాలా సార్లు మనసు పీకింది కానీ, ఎలాగో మనసును తొక్కిపెట్టాడు. వయసు పచ్చిదే ఐనా బుర్ర కాదు. అలా ఆస్తిని కాపాడుకున్నాడు. బసమతియా మత్తు వదిలిన తరువాత యీ ఆస్తినే అమ్మి, వ్యాపారం మొదలుపెట్టాడతను!! చిక్ పట్టీ నుంచీ తోలు కొనేవాడు. కాంట్రాక్టర్ లకు అమ్మేవాడు. దీనికి తోడు చిన్న చిన్న దొంగతనాలూ, జేబుదొంగతనాలూ అలవాటేగా!! కానీ, వ్యాపారాన్నీ, విచ్చలవిడితనాన్నీ కలగలిపే అలవాటుండేది కాదు. తన దగ్గరున్న అసలును విలాసాలకు ఖర్చుపెట్టేవాడే కాదు.
నసీర్‌తో సత్తార్ మియ్యా దోస్తీ చిన్ననాటిది. మొదట్లో నసీర్ తనతో కలిసి వ్యాపారం చేయాలని సత్తార్ మియ్యా అనుకున్నాడు. కానీ నసీర్, రసీదన్ ప్రేమలో పడి, వాళ్ళ అమ్మ దగ్గర చాకిరీ మొదలుపెట్టాడు. రోజు వారీ కూలీకి వాళ్ళ గోరీలగడ్డలో శవాల కోసం గోతులు తవ్వటం మొదలెట్టాడు. రసీదన్ మీద సత్తార్ మియ్యాకూడా కన్ను వేశాడు, కానీ తన వ్యాపారం వదిలిపెట్టి అక్కడ సమాధులు తవ్వటం ఇష్టం లేదతనికి!! నసీర్ వాళ్ళ నాన్న గంగకు అటువైపు ఇస్మాయి చక్ నుండీ పాట్నాకు తరలి వచ్చేశాడు. పరమానంద్ పుర్ దగ్గరి యీ ప్రాంతంలో ఒక ఏడు వరదలకు అతని సర్వస్వమూ నదిలో కొట్టుకు పోయింది. తన పత్తి వడికే పరికరాలు తీసుకుని కొడుకు నసీర్‌ను, తన భార్యను తీసుకుని పాట్నా వచ్చేశాడు. భార్యా భర్తా ఇద్దరూ వీధుల్లో తిరుగుతూ పత్తి వడికేవాళ్ళు, రజాయీలలో దూది నింపేవాళ్ళు. చలికాలంలో పని దొరికేది. తరువాత పని ఉండదు. అందుకని బీడీలు చుట్టే పని చేసేవాళ్ళు. ఇస్మాయిల్ చక్ వదిలిపెట్టిన బాధ ఇద్దరి గుండెలనూ మెలిపెడుతూ ఉండేది. ఇలా ఉండి ఉండి, ముందు తండ్రి, మళ్ళీ తల్లి – ఇద్దరూ ఒకరి తరువాత మరొకరు చనిపోయారు. నసీర్ దగ్గర తల్లిని పూడ్చి పెట్టేందుకు కూడా డబ్బులు లేవు. రసీదన్ వాళ్ళమ్మే అన్ని ఏర్పాట్లూ చేసింది. తరువాత నసీర్ వాళ్ళ ఇంట్లో కలిసిపోయాడు. ముందు సమాధులు తవ్వే పనికి కుదిరాడు. రసీదన్‌తో పెళ్ళి తరువాత, గోరీలగడ్డలోనే స్థిరపడిపోయాడు. అప్పుడప్పుడు సత్తార్ మియ్యా అంటూ ఉంటాడు, నసీర్ తో ఉన్న యీ స్నేహ బంధం వల్లే లోహానీపుర్ నుండీ పీర్ ముహానీకి తాను వచ్చేశానని!!
(సశేషం)