మరుగునపడ్డ మాణిక్యాలు – 84: ద బ్యాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్

0
2

[సంచిక పాఠకుల కోసం ‘ద బ్యాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

[dropcap]అ[/dropcap]న్ని యుద్ధాలలో అంతర్యుద్ధమే (సివిల్ వార్) విషాదకరం. అంతర్యుద్ధం ఎందుకొస్తుంది? భేదాభిప్రాయాల వల్ల. ఒకసారి మొదలైతే రావణకాష్ఠంలా మండుతూనే ఉంటుంది. ఇదే విషయాన్ని ప్రతీకాత్మకంగా చూపించిన చిత్రం ‘ద బ్యాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్’ (2022). ఇందులో విశేషమేమిటంటే ఇద్దరు స్నేహితుల కథని ప్రతీకగా తీసుకుని ఎన్నో విషయాలను స్పృశించారు. ఒక స్నేహితుడు హఠాత్తుగా స్నేహం వదిలేస్తాడు. ఇక్కడి నుంచి అనుకోని పరిణామాలు జరుగుతాయి. ఈ కథని రచయిత, దర్శకుడు మార్టిన్ మెక్ డొనా హాస్యం జోడించి చెప్పాడు. యుద్ధానికి కారణాలు కూడా ఒక్కోసారి హాస్యాస్పదంగా ఉంటాయి. ఈ చిత్రం డిస్నీ+ హాట్ స్టార్‌లో లభ్యం. ఈ చిత్రంలో వాడిన ఆంగ్లం ఐర్లండ్ యాసతో ఉంటుంది. అర్థం కావటం కష్టం. సబ్ టైటిల్స్‌తో చూడవచ్చు.

1923వ సంవత్సరం. పాడ్రేక్, కోల్మ్ స్నేహితులు. పాడ్రేక్ తన చెల్లెలితో కలిసి ఉంటాడు. అతని వద్ద ఆవులు, గుర్రాలు, ఒక గాడిద ఉంటాయి. ఆ గాడిద పేరు జెన్నీ. అదంటే పాడ్రేక్‌కి ప్రాణం. అతను విచారంగా ఉన్నప్పుడు జెన్నీని ఇంటి లోపల తోడుగా ఉంచుకుంటాడు. ఆవు పాలు అమ్మి జీవనం సాగిస్తుంటాడు. కోల్మ్ ఒంటరివాడు. ఫిడేలు వాద్యకారుడు. పాడ్రేక్ కంటే వయసులో పెద్దవాడు. వీరు నివసించేది ఇర్లండ్‌లో భాగమైన ఇనిషెరిన్ అనే ఒక ద్వీపం మీద. ఐర్లండ్‌లో అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందాక ఐర్లండ్లో అంతర్యుద్ధం జరిగింది. ఐర్లండ్ పూర్తి స్వాతంత్ర్యం పొందలేదు. బ్రిటన్‌తో ఒప్పందం చేసుకుంది. సొంతంగా పరిపాలన చేసుకుంటారు గానీ బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా ఉంటారు. ఇది ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ (ఐఆర్ఏ) అనే వర్గానికి నచ్చలేదు. వారు ఐర్లండ్ ప్రభుత్వం మీద తిరగబడ్డారు. అదే అంతర్యుద్ధం. ఒక సందర్భం ఒక పాత్ర “అందరం కలిసి ఇంగ్లండ్ వారిని చంపినపుడే బావుండేది. ఇప్పుడు ఎవరు ఎవర్ని చంపుతున్నారో తెలియట్లేదు” అంటుంది. ఇనిషెరిన్ ప్రధాన భూభాగం నుంచి విసిరేసినట్టు ఉంటుంది కాబట్టి అక్కడ జరిగే యుద్ధం ప్రభావం ఇక్కడ ఉండదు. అక్కడి నుంచి కాల్పులు, పేలుళ్ళ చప్పుళ్ళు వినపడుతూ ఉంటాయి.

ఒకరోజు హఠాత్తుగా కోల్మ్ పాడ్రేక్‌తో మాట్లాడటం మానేస్తాడు. ఎందుకో తెలియక పాడ్రేక్ అయోమయంలో పడతాడు. వాళ్ళిద్దరూ రోజూ మధ్యాహ్నం రెండు గంటలకి బార్లో కలుసుకునేవారు. పాడ్రేక్ పిలిచినా కోల్మ్ రాకపోవటంతో పాడ్రేక్ ఒక్కడే బార్‌కి వెళితే అందరూ ఆశ్చర్యపోతారు. “మీరిద్దరూ గొడవపడ్డారా?” అని అడుగుతారు. ఇంటికొస్తే అతని చెల్లెలు షిభాన్ కూడా అదే అడుగుతుంది. “మేం గొడవపడలేదు.. గొడవపడ్డామా?” అని ఆలోచనలో పడతాడు అతను. అతను పెద్దగా ఆలోచించే రకం కాదు. బతుకు ఇలా వెళ్ళిపోతే చాలు అనుకుంటాడు. పాడ్రేక్ కోల్మ్ దగ్గరకి వెళ్ళి ఏమైందని అడుగుతాడు. “నువ్వంటే నాకిప్పుడు ఇష్టం లేదు” అంటాడతను. మర్నాడు పాడ్రేక్ మళ్ళీ కోల్మ్ దగ్గరకి వస్తే అతను “నీకు పనీ పాటా లేదు. నేను ఈరోజు ఫిడేలు మీద కొత్త బాణీ కట్టాను” అని బాణీ వినిపించి “ఈ బాణీ పూర్తి చేయాలి. నన్ను విసిగించక వెళ్ళు” అంటాడు. పాడ్రేక్ చిన్న పిల్లవాడి లాగా “వెళతాలే. ఈ బాణీ చెత్తగా ఉంది” అంటాడు. నిజానికి అతనిది సంగీతం ఆస్వాదించే మనస్తత్వం కాదు. కోల్మ్ అతనితో “ఏమీ అనుకోకు. నాకు సమయం చేజారిపోతున్నట్టు ఉంది. నీ మాటల్లో సారం తక్కువ. సమయం వృథా. నీతో మాట్లాడటానికి బదులు నేను బాణీలు కడతాను” అంటాడు. మొదట్లో నేను ఈ వివాదాన్ని  మేధావులకి, శ్రామిక వర్గానికి ఏర్పడిన అంతరానికి ప్రతీకగా భావించాను. కానీ ఇది ఐఆర్ఏకి, ఐర్లండ్ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన అంతరానికి ప్రతీక. కోల్మ్ ఐఆర్ఏకి ప్రతీక. తన ఉనికి తనకి ఉండాలి అనుకుంటాడు. పాడ్రేక్ ఉన్నదానితో సర్దుకుపోతే ప్రభుత్వానికి ప్రతీక. ప్రశాంతంగా సహజీవనం చేస్తే చాలు అనుకుంటాడు.

పాడ్రేక్ డామినిక్ అనే యువకుడితో తన గోడు చెప్పుకుంటాడు. డామినిక్ కాస్త మందమతిలాగా ఉంటాడు. ఊళ్ళో అందరూ అతన్ని పిచ్చివాడిలా చూస్తారు. అతనితో ఎవరూ పెద్దగా మాట్లాడరు. పాడ్రేక్ తనతో మాట్లాడేసరికి అతనికి ఆనందంగా ఉంటుంది. డామినిక్‌కి లోకజ్ఞానం లేకపోయినా పుస్తకజ్ఞానం ఉంటుంది. పాడ్రేక్‌కి పుస్తకజ్ఞానం తక్కువ. ఇంతకు ముందు డామినిక్ పలకరించినా పాడ్రేక్ పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడు అతనితోనే పాడ్రేక్ తన బాధ చెప్పుకుంటాడు. డామినిక్ బాధలు, ఆశలు పాడ్రేక్‌తో పంచుకోవాలని ప్రయత్నిస్తాడు. పాడ్రేక్ చెల్లెలు షిభాన్ కన్నా డామినిక్ చిన్నవాడే అయినా అతనికి ఆమె మీద మోజు ఉందని అతని మాటల్లో తెలుస్తుంది. అతను ఏం మాట్లాడినా పాడ్రేక్ కోల్మ్ గురించే మాట్లాడుతుంటాడు. డామినిక్ సామాన్య ప్రజలకి ప్రతీక. ఐఆర్ఏతో యుద్ధంలో పడి ప్రభుత్వం సామాన్య ప్రజల ఆకాంక్షలను విస్మరించింది. డామినిక్‌కి కూడా చిరాకు వస్తుంది. “నీతో స్నేహం మానేశాక కోల్మ్ ఏదో భారం దిగిపోయినట్టు ఉల్లాసంగా ఉన్నాడు” అంటాడు. అతను పైకి మందమతిలా ఉన్నా అతనికి పాడ్రేక్‌కి మించిన అవగాహన ఉంది. కానీ పాడ్రేక్ కోల్మ్తో “నీ బాణీ చెత్తగా ఉంది” అన్నట్టే డామినిక్ కూడా పాడ్రేక్ చిరాకు చూపిస్తాడు. అయితే పాడ్రేక్ అక్కసుతో తన తెలియనితనాన్ని బయటపెట్టుకున్నాడు, డామినిక్ అప్రియమైన నిజాన్ని చెప్పాడు. తర్వాత తెలిసేదేమిటంటే డామినిక్ తండ్రి డామినిక్ మీద లైంగిక దాడి చేస్తూ ఉంటాడు. అదే అతని మానసిక దౌర్బల్యానికి కారణం. డామినిక్ తండ్రి పోలీసు. ప్రజల మీద పోలీసుల దౌర్జన్యానికి ఇది ప్రతీక.

పాడ్రేక్ చెల్లెలు షిభాన్‌కి పుస్తకాలు చదవటమంటే ఇష్టం. ఆమె ఒకసారి పాడ్రేక్‌ని “నీకు ఒంటరితనం అనిపించదా?” అని అడుగుతుంది. అతను వింతగా చూసి “ఏమయ్యింది మీ అందరికీ?” అంటాడు. అతనికి జీవితంలో ఎక్కువ ఏమీ అవసరం లేదు. కాస్త తిండి, కాస్త కాలక్షేపం. అతనికి లైంగిక వాంఛలు లేవా అని ప్రేక్షకులకి అనుమానం వస్తుంది. అతని పాత్ర ఒక ప్రతీక కాబట్టి ఆ కోణాన్ని స్పృశించలేదు. షిభాన్ పుస్తకాలు చదవటం వల్ల ఏవేవో ఆశలు పెంచుకుంటుంది. ఆమె మేధావి వర్గానికి ప్రతీక. పాడ్రేక్‌కి, కోల్మ్‌కి సంధి కుదర్చటానికి ప్రయత్నిస్తుంది. కోల్మ్‌తో మాట్లాడుతుంది. కోల్మ్ “వాడికి జ్ఞానం తక్కువ” అంటాడు. “వాడికి జ్ఞానం ఎప్పుడూ తక్కువే. ఇప్పుడేం కొత్త కాదుగా?” అంటుందామె. “నేనే కొత్తగా ఆలోచిస్తున్నాను. నాకు కొంచెం శాంతి కావాలి. అంతే. అర్థం చేసుకో” అంటాడతను. ఆమె అవాక్కయి ఉండిపోతుంది. ఆమెకి కూడా అసంతృప్తి ఉంది. కోల్మ్ తన అసంతృప్తిని పోగొట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నాడని తెలిసి ఆమె మౌనంగా ఉండిపోతుంది. మేధావి వర్గాలు ఐఆర్ఏకి, ప్రభుత్వానికి మధ్య నలిగిపోయాయి.

ప్రతి ఆదివారం ఇనిషెరిన్‌లో ఉన్న చర్చికి ఫాదర్ ఇర్లండ్ ప్రధాన భూభాగం నుంచి వస్తాడు. ఆ ఫాదర్కి పోలీసు అధికారి అయిన డామినిక్ తండ్రి స్వాగతం చెబుతాడు. మతగురువులు, ప్రభుత్వం కలిసి సమాజాన్ని నియంత్రిస్తారనటానికి ఇదో నిదర్శనం. పాడ్రేక్ చర్చి ఫాదర్‌కి తన బాధ చెప్పుకుంటాడు. కోల్మ్ కన్ఫెషన్‌కి వచ్చినపుడు ఫాదర్ అతన్ని “పాడ్రేక్తో ఎందుకు మాట్లాడటం లేదు?” అని అడుగుతాడు. పాడ్రేక్ మీద లైంగికమైన కోరిక ఉందా అనే అర్థం వచ్చేటట్టు మాట్లాడతాడు. కోల్మ్‌కి చిర్రెత్తుకొస్తుంది. అతను ఫాదర్ ని “మీకలాంటి కోరికలున్నాయా?” అని అడుగుతాడు. 20వ శతాబ్దం ద్వితీయార్ధంలో చర్చి ఫాదర్లు బాలురను లైంగికంగా వేధించారు. ఆ విషయమే ఇక్కడ సూచనప్రాయంగా చెప్పారు. తర్వాత కోల్మ్ అసహనంతో పాడ్రేక్ దగ్గరకి వెళ్ళి “నువ్వు నాతో మాట్లాడటానికి ప్రయత్నించినా, నన్ను విసిగించటానికి ప్రయత్నించినా నేను నా ఎడమ చేతి వేళ్ళు ఒక్కొక్కటీ కోసేసుకుని నీకిస్తాను” అంటాడు. అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఫిడేల్ వాయించటానికి ఎడమ చేయి చాలా ముఖ్యం. పాడ్రేక్ నిర్ఘాంతపోయి ఉండిపోతాడు.

ఒకరోజు డామినిక్ తన తండ్రి తనని కొడుతున్నాడని పాడ్రేక్ ఇంటిలో ఆశ్రయం పొందుతాడు. మర్నాడు ఆ విషయం తెలిసి డామినిక్ తండ్రి బజార్లో పాలు అమ్మడానికి వచ్చిన పాడ్రేక్‌ని కొడతాడు. అక్కడే ఉన్న కోల్మ్ పాడ్రేక్‌ని అతని గుర్రపు బండి ఎక్కించి తన ఇంటి మలుపు వరకు బండి నడిపి తీసుకువస్తాడు. అక్కడ పగ్గాలు పాడ్రేక్ చేతికి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఒక్క మాట మాట్లాడడు. పాడ్రేక్ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఆ రాత్రి పాడ్రేక్ బార్‌కి వెళతాడు. బాగా తాగుతాడు. అక్కడ కోల్మ్ ఇతర సంగీతకారులతో కలిసి ఫిడేలు వాయిస్తూ ఉంటాడు. తర్వాత డామినిక్ తండ్రితో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి పాడ్రేక్‌కి చిర్రెత్తుకొస్తుంది. కోల్మ్ దగ్గరకి వెళ్ళి “నువ్వు అందరితో కలుపుగోలుగా ఉండేవాడివి. ఇప్పుడు మారిపోయావు” అంటాడు. కోల్మ్ “కలుపుగోలుతనం ఎవరు గుర్తుపెట్టుకుంటారు? కళని గుర్తు పెట్టుకుంటారు. మోజార్ట్ సంగీతం 17వ శతాబ్దం లోనిది. ఇప్పటికీ అందరికీ గుర్తుంది” అంటాడు. మంచితనం పేరుతో ఇంగ్లండ్ చెప్పుచేతల్లో ఉండొద్దని, తమ సంస్కృతి తాము కాపాడుకోవాలని ఐఆర్ఏ భావించింది. పాడ్రేక్ “మంచితనమే గొప్పది. మా అమ్మా నాన్న మంచివారు. షిభాన్ మంచిది. అది నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. నువ్వు మంచివాడివనుకున్నాను. నీలో మొదటి నుంచి మంచితనం లేదేమో” అంటాడు. ఈ గొడవ జరుగుతుంటే డామినిక్ ఏం ప్రమాదం జరుగుతుందో అని షిభాన్‌ని పిల్చుకువస్తాడు. పాడ్రేక్‌ని బయటకి పంపించి ఆమె కోల్మ్‌తో “అతను నీ జోలికి రాకుండా నేను చూస్తాను” అంటుంది. “అయ్యో! అతని మాటల్లో ఇన్నాళ్ళకి సారం కనపడింది. మళ్ళీ అతనంటే ఇష్టం కలుగుతోంది” అంటాడతను. రాజీ కుదిరినట్టే ఉంటుంది. మర్నాడు పాడ్రేక్ కోల్మ్ దగ్గరికి వెళ్ళి “రాత్రి తాగిన మత్తులో ఏదో మాట్లాడాను. ఏం గుర్తు లేదు. వదిలెయ్” అంటాడు. “నువ్వే నన్ను వదిలెయ్” అంటాడు కోల్మ్. తర్వాత పాడ్రేక్ ఇంటిలో ఉండగా కోల్మ్ తన ఎడమ చేతి చూపుడు వేలు కోసి ఇంటి తలుపు మీద విసిరేసి వెళ్ళిపోతాడు! యుద్ధసమయంలో కూడా అవతలి వారి దృక్పథం చూసి రాజీ పడదామనుకుంటారు. కానీ మళ్ళీ తమ సిద్ధాంతాలు గుర్తు వచ్చి మొండిపట్టు పడతారు. ‘మాకు నష్టం జరిగినా పర్వాలేదు. వెనక్కి తగ్గం’ అంటారు.

వివాదాలు ఒక్కోసారి అనవసరంగా పెరుగుతాయి. చిన్న చిన్న విషయాలకే అతిగా ప్రతిస్పందించటమే దీనికి కారణం. ఒక్కోసారి ఒక వర్గం వారు అతిగా ప్రవర్తించి గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెస్తారు. అలాంటపుడే జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే గొడ్డలితో తమ కాళ్ళు తామే నరుక్కున్నట్టవుతుంది. ఈ చిత్రంలో కథ అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది. హాస్యం మాత్రం అంతర్లీనంగా ఉంటుంది. బార్లో జరిగే సన్నివేశంలో కోల్మ్ “మోజార్ట్ అందరికీ తెలుసు” అంటే “నాకు తెలియదు. కాబట్టి వాదన తప్పు” అంటాడు పాడ్రేక్. తన అజ్ఞానాన్నే బయటపెట్టుకుంటాడు. అదే సన్నివేశం చివర్లో షిభాన్ కోల్మ్‌తో “మోజార్ట్ 18వ శతాబ్దం వాడు. 17వ శతాబ్దం కాదు” అంటుంది. అన్నీ తెలుసు అనుకున్నవాళ్ళు ఎప్పుడో ఒకసారి పప్పులో కాలు వేస్తూ ఉంటారు.

ఈ చిత్రంలో ప్రకృతి దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. ఇనిషెరిన్ అనే ద్వీపం వాస్తవంగా లేకపోయినా ఒక ద్వీపం మీదే చిత్రీకరణ జరిగింది. సముద్రం, సముద్రతీరం, పచ్చికబయళ్ళు ఆహ్లాదంగా ఉంటాయి. 1920 ప్రాంతాలలో ఉండే ఊరుని కూడా ప్రమాణికంగా చూపించారు. రాతి గోడలు, మట్టి దారులు కనిపిస్తాయి. చిన్న ఊళ్ళలో అప్పట్లో జీవితం ఎలా ఉండేదో చూపించారు. ప్రశాంతత ఒక పక్క, ఒకరి వ్యవహారాల్లో ఒకరు తలదూర్చటం ఒక పక్క.  ముఖ్యపాత్రల్లో నటించిన కోలిన్ ఫారెల్, బ్రెండన్ గ్లీసన్, కెరీ కాండన్, బ్యారీ కీగన్ అందరూ ఆస్కార్ నామినేషన్లు అందుకున్నారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ స్కీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ సంగీతం విభాగాల్లో కూడ నామినేషన్లు వచ్చాయి. అయితే అవార్డులేవీ దక్కలేదు. ఇంతకీ ‘బ్యాన్షీ’ అంటే ఏమిటి? జానపద కథల్లో ఉండే ఒకరకమైన మానవాతీత స్త్రీ. ఆమె రోదిస్తూ పాట పాడితే మృత్యువు వస్తుందని అర్థం. ఈ చిత్రంలో మృత్యువు ఎవరికి వస్తుంది అనే ఉత్కంఠ పేరులోనే ఉంటుంది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

కోల్మ్ తన వేలు కోసుకునే ముందే షిభాన్‌కి ప్రధాన భూభాగంలో ఒక గ్రంథాలయంలో ఉద్యోగం వచ్చినట్టు తెలుస్తుంది. ఆమె పాడ్రేక్‌కి తెలియకుండా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే పాడ్రేక్‌ని వదిలి వెళ్ళటం ఆమెకి ఇష్టం లేదు. అలాగని ఆ ద్వీపంలో జీవితం వృథా చేసుకోవటం కూడా ఆమెకి ఇష్టం లేదు. అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతుంటుంది. కోల్మ్ వేలు పాడ్రేక్ షిభాన్‌కి చూపిస్తాడు. ఆమె భయభ్రాంతురాలవుతుంది. ఆ వేలు ఒక బూట్ల పెట్టెలో పెట్టి కోల్మ్ ఇంటికి వెళుతుంది. పాడ్రేక్ తానే వెళతానంటాడు కానీ ఆమె “నీకు జ్ఞానం లేదా?” అంటుంది. పాడ్రేక్ తనతో మాట్లాడవద్దనే కదా కోల్మ్ వేలు కోసుకున్నది. షిభాన్‌తో కోల్మ్ “ఈసారి వాడు నాతో మాట్లాడితే మిగతా నాలుగు వేళ్ళూ కోసేసుకుంటాను” అంటాడు. “నీకు మతి స్థిమితంగా లేదనిపిస్తోంది” అంటుందామె. “అవును. అనివార్యమైన దాన్ని తప్పించుకోవటానికి కాలక్షేపం చేస్తున్నానేమో అనిపిస్తుంది. నీకూ అలాగే అనిపిస్తుంది కదా” అంటాడతను. ఆమె “లేదు” అంటుంది కానీ ఆమె కళ్ళలోకి చూస్తే అదే నిజమని తెలిసిపోతూనే ఉంటుంది. ఇక్కడ షిభాన్‌గా నటించిన కెరీ కాండన్ నటన గుండెల్ని తాకుతుంది. జీవిత పరమార్థం ఏమిటి, ఇలా తింటూ తిరుగుతూ మరణించటమేనా అని చాలా మంది ఆలోచిస్తారు. కోల్మ్ కళకి జీవితం అంకితం చేద్దామనుకుంటాడు. షిభాన్‌కి తనకి తగిన జోడీ కావాలి. అందుకే ఆమె ఆ ద్వీపం వదిలి వెళదామనుకుంటుంది. ఇదిలా ఉండగా ఆ ఊరిలో ఉండే ఒక వృద్ధ స్త్రీ పాడ్రేక్‌తో “త్వరలో మృత్యువు ఒకరిద్దరిని కబళించబోతోంది. ఆ కబళించేది నిన్నో, నీ చెల్లెలినో కాకూడదని ఆశిస్తున్నాను” అంటుంది. ఆ స్త్రీ అంటే ఊరిలో అందరికీ భయమే. ఆమె మంత్రగత్తె అని అనుకుంటారు. పాడ్రేక్ పెద్దగా పట్టించుకోడు.

పాడ్రేక్ కోల్మ్‌కి దూరంగా ఉంటాడు. కానీ అతనికి లోలోపల బాధగా ఉంటుంది. కోల్మ్‌తో పాటు ఫిడేలు వాయించే ఒకతన్ని చూసి అసూయ పడతాడు. అతని తండ్రికి ప్రమాదం జరిగిందని అబద్ధం చెప్పి అతను ఆ ద్వీపం నుంచి వెళ్ళిపోయేలా చేస్తాడు. డామినిక్‌తో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాదు. డామినిక్ అతనితో “ఆ రాత్రి బార్లో నువ్వు మాట్లాడింది బలే ఉంది. కోల్మ్‌కి కూడా నచ్చింది. అతను నీతో మాట్లాడకపోవటం నీలో ఆత్మస్థైర్యం పెంచటానికేమో అనిపిస్తోంది. లేకపోతే నువ్వు మందకొడిగా ఉండేవాడివి” అంటాడు. పాడ్రేక్ “నేను మందకొడిగా ఉండే రోజులు పోయాయి. కోల్మ్ స్నేహితుడిని అతని తండ్రి చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడని చెప్పి పంపించేశాను” అంటాడు. డామినిక్‌కి ఇందులో క్రూరత్వం కనపడుతుంది. “ఇంత దారుణం నేనెప్పుడూ వినలేదు. నువ్వు మంచివాడివని అనుకున్నాను” అని వెళ్ళిపోతాడు. డామినిక్ తండ్రి చేతిలో హింసకి గురవుతున్నా మరొకరి తండ్రి గురించి క్రూరమైన అబద్ధం చెప్పటం నచ్చలేదు. మనుషుల మనసులు వింతగా ఉంటాయి. తనకి మిగిలిన ఒకే ఒక్క స్నేహితుడు దూరం కావటంతో పాడ్రేక్ ఇంకా కుంగిపోతాడు. డామినిక్ చెరువు గట్టున విచారంగా ఉన్న షిభాన్ దగ్గరకి వెళ్ళి “నన్ను ప్రేమిస్తావా?” అని అడుగుతాడు. ఆమె అతడి అమాయకత్వానికి ముచ్చటపడి చిరునవ్వుతో “అది జరగదు” అంటుంది. డామినిక్ నిరాశగా వెళ్ళిపోతాడు. అతనికి తండ్రి ప్రేమ దక్కలేదు. పాడ్రేక్ కూడా క్రూరమైనవాడని తెలిసింది. ఇప్పుడు షిభాన్ కూడా అతన్ని కాదంది. ప్రేమ కోసం అతని అన్వేషణ ఎంతకీ తెగదు. యుద్ధసమయంలో సామాన్యప్రజలు ఇలాగే నిరాదరణకి గురవుతారు.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

డామినిక్ దూరమవటంతో పాడ్రేక్ నిస్పృహతో కోల్మ్ ఇంటికి వెళతాడు. అతనిలో ఒక రకమైన తెగింపు వస్తుంది. “నిన్ను కడిగేయటానికి వచ్చాను” అంటాడు. “ఇద్దరం ఎవరి మానాన వారు ప్రశాంతంగా ఉన్నాంగా” అంటాడు కోల్మ్. “నేను ప్రశాంతంగా లేను” అంటాడు పాడ్రేక్. కోల్మ్ మెత్తబడతాడు. పాడ్రేక్ అతని బాణీ గురించి అడుగుతాడు. బాణీ పూర్తి చేశానని, దానికి ‘ద బ్యాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్’ అని పేరు పెట్టానని అంటాడు. “బ్యాన్షీలు ఇంతకు ముందు మృత్యువు వస్తుందని రోదించేవారు. ఇప్పుడు మృత్యువుని చూసి ఆనందిస్తున్నారు” అంటాడు. యుద్ధం గురించి వార్తలు, పోలీసుల తీరు చూసి అతను బాధపడుతున్నాడు. మృత్యువు కరాళనృత్యం అతన్ని కుంగదీసింది. పాడ్రేక్‌కి ఇది అర్థం చేసుకునే మేధ లేదు. కోల్మ్ మళ్ళీ మాట్లాడుతుండటంతో అతను సంతోషిస్తాడు. బాణీ పూర్తి చేసినందుకు సంబరం చేసుకోవటానికి బార్లో కలుసుకుందామంటాడు. కోల్మ్ సరే అని అతన్ని ముందు వెళ్ళమంటాడు. పాడ్రేక్ బార్‌కి వెళ్ళి ఎదురుచూస్తాడు. కోల్మ్ తన నాలుగు వేళ్ళు కోసుకుని పాడ్రేక్ ఇంటికి వెళ్ళి ఆ వేళ్ళు తలుపు మీద విసిరికొట్టి వెళ్ళిపోతాడు.

షిభాన్ తాను ఇనిషెరిన్ వదిలి వెళుతున్నానని పాడ్రేక్‌కి చెబుతుంది. అతను హతాశుడవుతాడు. ఆపటానికి ప్రయత్నిస్తాడు కాని ఆమె ఆగదు. ఆరోజే పడవలో వెళ్ళిపోతుంది. ఇది మేధావుల వలసకి సంకేతం. పాడ్రేక్ దూరం నుంచి ఆమెకి వీడ్కోలు చెబుతాడు. ఆమె అతన్ని చూసి స్తిమితపడుతుంది. పాడ్రేక్ ఇంటికి వచ్చేసరికి అతని గాడిద జెన్నీ ఇంటి వెనక చచ్చిపడి ఉంటుంది. జెన్నీ నోట్లో కోల్మ్ వేలు ఒకటి ఉంటుంది. ఆ వేలుని తిందామని ప్రయత్నించి అది గొంతుకు అడ్డుపడి జెన్నీ మరణించింది. పాడ్రేక్‌లో దుఃఖం కట్టెలు తెంచుకుంటుంది. తనకి ఇక ఎవరూ లేరనే నిరాశ కమ్మేస్తుంది. ఆ నిరాశ నుంచి కోపం వస్తుంది. కోల్మ్ వల్లే అంతా జరిగిందని అతని మీద ప్రతీకారం కోరుకుంటాడు. కోల్మ్ దగ్గరకి వెళ్ళి “జెన్నీ నీ వల్లే చనిపోయింది. రేపు నేను నీ ఇల్లు తగలబెట్టేస్తాను. నువ్వు ఇంట్లో ఉన్నా లేకపోయినా” అంటాడు. కోల్మ్ నిశ్చేష్టుడై ఉండిపోతాడు. అక్కడే ఉన్న పోలీసు పాడ్రేక్ ని హెచ్చరించబోతే కోల్మ్ పోలీసు ముఖం మీద పిడిగుద్దు గుద్దుతాడు. పోలీసు స్పృహతప్పి పడిపోతాడు.

మర్నాడు కోల్మ్ చర్చికి వెళతాడు. ఫాదర్‌కి కన్ఫెషన్ ఇస్తాడు. “నా వల్ల ఒక గాడిద చనిపోయింది” అంటాడు. ఫాదర్ “దేవుడు గాడిదల గురించి పట్టించుకుంటాడా?” అంటాడు. “పట్టించుకోడనే నా భయం. అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది” అంటాడు కోల్మ్. పాడ్రేక్‌కి షిభాన్ నుంచి ఉత్తరం వస్తుంది. తన దగ్గరకి వచ్చెయ్యమని, జెన్నీని డామినిక్ చూసుకుంటాడని అంటుంది. ఉత్తరం చదివిన తర్వాత పాడ్రేక్ కోల్మ్ ఇంటికి వెళ్ళి ఇంటిపై చమరు జల్లి, కట్టెలు పెట్టి అంటించేస్తాడు. కోల్మ్ ఇంట్లోనే ఉంటాడు. ఇల్లు తగలబడుతుండగానే పాడ్రేక్ వెళ్ళిపోతాడు. కోల్మ్‌కి చెందిన కుక్కని తనతో తీసుకువెళతాడు. షిభాన్‌కి జవాబు రాస్తాడు. “నేను అక్కడికి రాను. ఇనిషెరినే నా ఇల్లు. నా మిత్రులు, నా జంతువులు ఇక్కడే ఉన్నాయి. జెన్నీ కూడా నన్ను వెళ్ళొద్దన్నట్టు చూస్తోంది. ఇంకో దుర్వార్త ఏమిటంటే డామినిక్ చెరువులో పడి మరణించాడు. జారి పడ్డాడేమో. మరి నా జంతువులను చూసుకోవటానికి ఎవరూ లేరు. ఇంతే సంగతులు” అని రాస్తాడు.

ఫాదర్ దేవుడు గాడిదల గురించి పట్టించుకోడు అన్నప్పుడు కోల్మ్ బాధపడటం మనసుని మెలివేస్తుంది. ప్రాణం ఎవరికైనా ప్రాణమే. దేవుడు కొన్ని ప్రాణులని విస్మరించాడని అనిపించి కోల్మ్ బాధపడతాడు. యుద్ధాలలో మూగజీవాలు కూడా చనిపోతాయి. వాటిని ఎవరూ పట్టించుకోరు. అదే విషాదం. నిజానికి ఇదంతా మనిషి అహంకారానికి ఫలితం. దేవుడిని నిందించకూడదు. డామినిక్ ఆత్మహత్య చేసుకున్నాడని నాకనిపించింది. అతనికి బతుకుపై ఆశ నశించింది. లోకం అతని మనసుని ముక్కలు చేసింది. విచిత్రమేమిటంటే పాడ్రేక్ జెన్నీ మరణం గురించి షిభాన్‌కి చెప్పడు. ఆమె తన గురించి బాధ పడుతుందనుకుంటాడు. కానీ డామినిక్ మరణించాడంటే షిభాన్ మనసుకి ఇంకా పెద్ద దెబ్బ తగులుతుంది. తాను కాదన్నాననే అతను ప్రాణం తీసుకున్నాడని ఆమెకి అనుమానం తప్పకుండా వస్తుంది. అది పాడ్రేక్‌కి తెలియదు. ఒక్కోసారి మనకి తెలియకుండానే మన దగ్గరి వారికి దుఃఖం కలిగిస్తాం. విధి వైచిత్రి అంతే. డామినిక్ తండ్రి పాడ్రేక్‌ని అరెస్ట్ చేద్దామనుకుంటాడు కానీ తన కొడుకు మరణించటంతో అతను కుంగిపోతాడు.

చివరికి కోల్మ్ బతికే ఉంటాడు. అతను ప్రాణం మీద తీపితో తప్పించుకున్నాడు. ఎడమ చేతి వేళ్ళన్నీ పోవటంతో ఇప్పుడు అతను ఫిడేలు కూడా వాయించలేడు. యుద్ధంలో అందరూ నష్టపోతారు. అయితే వృధ్ధ స్త్రీ జోస్యం నిజమయింది. జెన్నీ, డామినిక్ చనిపోయారు. పాడ్రేక్ కోల్మ్ కుక్కని కోల్మ్‌కి అప్పగిస్తాడు. “నా ఇల్లు తగలబెట్టావు కాబట్టి మన గొడవ ముగిసినట్టే” అంటాడు కోల్మ్. “నువ్వు ఇంట్లోనే ఉండి ఉంటే గొడవ ముగిసి ఉండేది” అంటాడు పాడ్రేక్. “నీ గాడిద చనిపోయినందుకు నాకు బాధగా ఉంది” అంటాడు కోల్మ్. “నీ బాధతో నాకు పని లేదు” అంటాడు పాడ్రేక్. కోల్మ్ రాజీ కోసం ప్రయత్నించినా ఇప్పుడు పాడ్రేక్ సిద్ధంగా లేడు. యుద్ధాలు కూడా ఇలాగే ఉంటాయి. ‘తగ్గమన్నప్పుడు తగ్గలేదు. ఇప్పుడు మీరు తగ్గితే మేం తగ్గాలా?’ అనే వాదన కొత్తదేం కాదు. “కొన్ని విషయాలని ఎప్పటికీ మర్చిపోలేం. అదే మంచిదేమో” అంటాడు పాడ్రేక్. ఇక్కడితో చిత్రం ముగుస్తుంది. కొన్ని సంఘటనలని కొన్ని వర్గాలు ఎప్పటికీ మర్చిపోలేవు. శతాబ్దాల పాటు గుర్తు పెట్టుకుంటాయి. చరిత్రలో ఇలాంటి సంఘటనలెన్నో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here