అమ్మణ్ని కథలు!-24

0
4

(సోమరాజు సుశీలగారి ‘ఇల్లేరమ్మ కథలు’ ప్రేరణతో నంద్యాల సుధామణి గారు అందిస్తున్న కథలివి)

బహు సిగ్గరి.. మా కాటుక వయ్యారి!!

[dropcap]ఓ[/dropcap] పాతికేళ్లుగా ఆ అలవాటు మూలబడింది గానీ, అప్పట్లో కాటుక పెట్టుకోకుండా ఆడవాళ్లు ఎవరూ ఉండేవారు కాదు.

ఇప్పుడు కాటుక పెట్టుకుంటున్న కొద్ది మందీ కూడా కొన్న కాటుకే పెట్టుకుంటున్నారు.

ఆ రోజుల్లో ఇంట్లోనే ఎంతో శ్రమకోర్చి మరీ కాటుకను తయారుచేసుకునేవారు.

“నీ కాటుక కన్నులలో ఏ కమ్మని కథ వుందో.. చెలియా వినిపించవా..” అని ఓ సినీకవి ప్రేయసి కాటుక కళ్లు చెప్పే కథ కోసం కొట్టుకొని పోయినాడు.

మామూలుగానే కోటి కబుర్లు చెప్పే అందాలభరిణె కళ్లకు కాటుక అందం తోడయితేనా.. ఇంక చెప్పేదేముంది?

ఇప్పుడు స్వదేశీ కాటుకలకు చెల్లుచీటీ ఇచ్చేసి.. పరదేశీలైన మస్కారా, ఐ-లైనర్, ఐబ్రో పెన్సిల్ వంటి తళుకుబెళుకు కాటుకలు మార్కెట్‌ను ఏలుతున్నాయి.

అయినా కళ్ల అందాన్ని ద్విగుణీకృతం చేసే పనిని అవి కూడా శక్తివంచన లేకుండా నిర్వహిస్తున్నాయనుకోండి! అయితే విషాదమేమంటే అవన్నీ కెమికల్స్‌తో కూడినవి కావడమే!

ఇప్పుడు కాటుక కళ్లను వర్ణించాలంటే.. ‘మస్కారా పెట్టుకున్న లస్కోరీ పిల్లా..’ అని వర్ణిస్తారేమో కవులు!

“కాటుక పెట్టుకుంటే కండ్లు విశాలమవుతాయి. కాటుక పెట్టుకోకపోతే కండ్లు చీమలు కొరికినట్టు చిన్నబోయి వుంటాయి..!” అన్నది మా పెద్దమ్మ ప్రగాఢ అభిప్రాయం!

ఒక రోజు అమ్మా, అక్కా వాళ్లు మధ్యాహ్నం మంచి నిద్రలో వున్నట్టున్నారు. మా అక్క కొడుకు సంవత్సరం వయసు వాడు నిద్ర లేచి, వాళ్లమ్మ దగ్గర నుంచి పక్కకొచ్చినాడు.

వాడికెక్కడ దొరికిందో కాటుక్కాయ దొరికింది. దాన్ని తెరిచి శుభ్రంగా గోడకు, నేలకు అలికి, తన బొజ్జకు, బుగ్గలకు కూడా పూసుకున్నాడు. వాళ్లమ్మ కాలికి కూడా కొంచెం పట్టించినాడు. తన కళ్లలో కూడా పెట్టుకున్నట్టున్నాడు. మంట పుట్టిందేమో.. కిల్లుమని ఏడుపు మొదలుపెట్టినాడు.

అందరూ లేచి చూసి, వాడు పట్టించుకున్న కాటుకను వదిలించి, స్నానం చేయించేసరికి దేవుడు దిగొచ్చినాడు మా అక్కకు.. మాకందరికీ కూడా! తలతిక్క పని చేసింది గాక పెద్ద యేడుపు ఒకటి!

ఇప్పుడు ఇంట్లో కాటుక నిండుకోవడంతో పెద్దమ్మకు కాటుక పట్టక తప్పలేదు.

కాటుక పెట్టుకోకుంటే ఎవరికీ ఒక్కరోజు కూడా నడవదు మరి! ఒక్క పూట కాటుక లేకుంటే తమ సౌందర్యపోషణ భారీగా కుంటుబడినట్టు భావించేవాళ్లు. ఇప్పుడు తలుచుకుంటే.. మరీ అప్పటి వాళ్లకు అంతంత చాదస్తాలెందుకో..! అనిపిస్తుంది నాకు!

సంవత్సరంలో రెండుసార్లు అయినా కాటుక పట్టేది మా పెద్దమ్మ. ఎందుకంటే ఇంతమంది ఆడపిల్లలం ఉన్నాము కదా.. రెండుపూటలా కాటుక పెట్టుకోవడానికి! అక్కావాళ్లు కూడా కాటుక ఇక్కడినించే తీసుకుని పోయేవాళ్లు.

ఆ పనిని ఆమె ఎంతో మడుగుతో, శుభ్రంగా చేసేది.

ముందు ఒక ఇనుపబాణలిని, లేదా ఇత్తడి బాణలిని శుభ్రంగా, ఎక్కడా చిన్న మరక కూడా లేకుండా తెల్లగా తోముకోవాల.

గంధపుచెక్కను, సానరాతిని చేతులను బాగా శుభ్రం చేసుకోవాల. గంధపుచెక్కను అరగదీసి, ఆ గంధాన్ని బాణలికి పొరలు పొరలుగా మందంగా పట్టించాల. పెద్ద సుత్తి పని అది! గంటలు గంటలు పట్టేస్తుంది.

అన్నట్టు కాటుక తయారు చేసేటప్పుడు మగవాళ్లు అటు వైపు రాకూడదు. కాటుక పార్వతీదేవి అంశ గలది. ఆవిడకు లజ్జ ఎక్కువ.

అందుకే పెద్దమ్మ మగపిల్లలను అటువైపు రానిచ్చేది కాదు. అలా మగవాళ్లు చూస్తే కాటుక సిగ్గుపడి పోయి సరిగ్గా తయారుకాదట!

ఇవన్నీ సిద్ధం చేసుకున్నాక ఒక కొత్త పెద్ద దీపెంతను బాగా కడిగి, తుడిచి, అందులో ఆముదం పోసి, జాగ్రత్తగా నలకలు లేకుండా బాగు చేసిన దూదితో లావుపాటి వొత్తి తయారుచేసి, దీపెంతలోని ఆముదంలో ముంచి, దీపం వెలిగించి, దాని పైన బాణలిని బోర్లించి వుంచుతుంది పెద్దమ్మ. దీపెంత కింద ఒక పెద్ద శుభ్రమైన పళ్లాన్ని వుంచుతుంది. కాటుక నేలపైన పడకుండా జాగ్రత్త అన్నమాట!

బాణలి కింద నుంచి గాలిపోవడానికి తగినంత సందు యేర్పాటు చేస్తుంది. దానిని కదల్చకుండా, చీకటి గదిలో ఒక ఐదారు గంటల పాటు వుంచేస్తుంది.

దీపం కొండెక్కిందనుకున్నాక అప్పుడు తీసి చూస్తుంది పెద్దమ్మ. ఆ దీపజ్వాల వేడికి గంధమంతా మసిగా మారుతుంది. అప్పుడు ఆ మసిని ఒక శుభ్రమైన పాత్రలోకి తీసుకొని, కొద్దిగా వంటాముదం, పచ్చకర్పూరం వేసి, బాగా కలిపితే కాటుక తయారవుతుంది.

దాన్ని చిన్న చిన్న భరిణెలలో నింపి ఉంచుతారు.

ఒక్కోసారి యేమవుతుందో యేమో గానీ, కాటుక సరిగా తయారు కాదు.

అప్పుడు పెద్దమ్మ అనుమానం మా అన్నదమ్ముల మీదికి పోతుంది. “మీరెవరైనా కాటుక పడుతూంటే బాణలిని తెరిచి చూసినారా?” అని వాళ్లను నిలదీస్తుంది.

ఒకవేళ నిజంగానే చూసి వున్నా కూడా మాత్రం వాళ్లు నిజం చెప్తారా..? మేమస్సలు అటు వైపే పోలేదని బుకాయిస్తారు.

ఈసారి కాటుక పడుతున్నప్పుడు మా అన్న కాటుక బాణలిని తెరిచి చూస్తుండగా నా కళ్లబడినాడు. పెద్దమ్మతో చెప్పవొద్దని బతిమాలుకున్నాడు. వేడుకున్నాడు.

“అమ్మణ్నీ! నువ్వేం పని చేయ మంటే అది చేస్తానే! నీకు కావాలంటే ఇంకొన్ని సినిమా ఫిల్ము నెగెటివ్‌లు తెచ్చిస్తా. మా ఫ్రెండు దగ్గర నెమలీకలు తెచ్చిస్తా.. నీ బొమ్మలకు రంగురంగుల బట్టలు తెచ్చిస్తా.. శోభన్ బాబు, వాణిశ్రీ ఫోటో కార్డులు తెచ్చిస్తా.. నీకేం కావాల్నో చెప్పు అన్నీ తెచ్చిస్తా. నా దగ్గర ఒక రూపాయి వుంది. కావాలంటే అది కూడా నీకిచ్చేస్తా. పెద్దమ్మకు మాత్రం చెప్పొద్దు ప్లీజ్..” అని తెగ ప్రమాణాలు చేసేశాడు.

ఆ మాటలకు నా మనసెంత శాంతించిందో మాటలతో చెప్పలేను. నా అదృష్టానికి నేనే అబ్బురపడినాను.

నేనేదో మహారాణి నయినట్టు, మా అన్న ఏదో తప్పుచేసి పట్టుబడిన సామంతుడి లాగా నన్ను బతిమిలాడుతున్నట్టూ అనిపించినాడు.

వొద్దన్న పని చేయడంలో వుండే మజా నాకూ తెలుసు కాబట్టి నేనూ జాలిపడి, ‘పోనీలే.. కాటుక పట్టడం చూడకుండా వుండలేక పోయినాడు.. నేనూ అంతే కదా..’ అనుకొని, చెప్పను లెమ్మన్నాను. అయితే, ఒక షరతు పెట్టి అభయమిచ్చినాను.

నేను ఇట్లా అభయమిచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటానన్న సంగతి మీకు కూడా తెలుసుగదా!

అందునా ఆ షరతు వెనకాల ఓ యమా సీరియస్ విషయం వుంది. అందుకే మరింత జాగ్రత్త పడాల్సి వొచ్చింది.

అసలేం జరిగిందంటే.. ఓ పది రోజుల కిందట మధ్యాన్నం వేళ .. అమ్మావాళ్లందరూ నిద్ర పోతున్నప్పుడు నేను మడుగు ఆవకాయ జాడీలో వున్న ఆవకాయ దబ్బ తీసుకొని తింటుంటే అన్న చూసినాడు. కొంపమునిగింది! సతాయింపు మొదలుపెట్టినాడు.

“అసలు ఆవకాయ ముక్క కోసం కాదు.. నేను మడుగు జాడీ ముట్టుకున్నది.. అసలు నేను ముట్టుకుంటే మడుగు జాడీ ఎట్లా మైల పడుతుందో, మైలపడడం అంటే ఏమో తెలుసుకుందామని జాడీని ముట్టుకున్నాను” అని ఎంత చెప్పినా వినకుండా అమ్మకు చెప్తానని బెదిరింపులు మొదలుపెట్టినాడు.

తప్పనిసరైపోయి నేను కాళ్ల బేరానికి వొచ్చినాను. మరి అవసరం నాది కదా!

అప్పటినించీ ఆ మాట అమ్మకు చెప్తానని బెదిరించి తన పనులన్నీ చేయించుకుంటున్నాడు.

మంచినీళ్లు తను కూర్చున్న దగ్గరికే తెచ్చివ్వాల! (ఒళ్లు మండి ఉప్పు కలిపిన నీళ్లిచ్చినాను ఓసారి! ఉప్పునీళ్లు తాగలేక ఉమ్మేసి, అమ్మ చూడకుండా గబగబా బట్టతో తుడిచినాడు నేలనంతా)

ఆటకు తన స్నేహితుడిని పిలుచుకొని రమ్మంటే.. నేనెంత ఆటలో వున్నా సరే.. పోయి పిలుచుకుని రావాల.

(నేను వాళ్లింటికి పోకుండా అక్కడా ఇక్కడా కాలక్షేపం చేసి, ‘అతను ఇంట్లో లేడు..’ అని చెప్తాను)

ఉన్నట్టుండి “పది గుంజీళ్లు తియ్యవే అమ్మణ్నీ..!” అంటాడు. చచ్చినట్టు తీయాల్సిందే!

“ఇదుగో..ఈ మూల నించి ఆ మూలకు ఇరవైసార్లు పరిగెత్తవే అమ్మణ్నీ..” అంటాడు.

ముక్కుతూ మూలుగుతూనైనా, తిట్టుకుంటూ నైనా పరిగెత్తాల్సిందే! గుంజీలు తీయాల్సిందే!

అయితే లెక్క తప్పు చెప్పి మాయ చేస్తాననుకోండి.. అప్పుడు నా లెక్క తప్పని గొడవ చేస్తాడు. దాని కోసం అమ్మ వినకుండా పెద్దగా కొట్లాడుకుంటాం.. అది వేరే విషయం!

ఈమధ్య మరీ రెచ్చిపోతున్నాడు.

“ఈ రోజు నుంచీ నేను తిన్న కంచం నువ్వే కడగాల” అని కొత్త బేరం మొదలు పెట్టినాడు ఈరోజు.

కోపంతో ఆ కంచాన్ని నేలకేసి కొట్టి, నొక్కులు పోగొట్టినాను.. వెండి కంచమనే దాక్షిణ్యం కూడా లేకుండా! వెండికంచమైతే నేమి? బంగారుకంచమైతే నేమి? నా కోపం నాది!

అన్న చెప్పిన పనులన్నీ నేను తు.చ. తప్పకుండా చేస్తుంటే..

అమ్మకు కూడా యేదో జరిగిందని అనుమానం వొచ్చినట్టుంది..

సందేహంగా మా ఇద్దరి వైపూ చూస్తూంది.. ‘యేంది కత?’ అన్నట్టు!

ఎప్పుడైనా నిజం బయటపడి పోవొచ్చని లోలోపల భయపడు తున్నాను నేను.

నేను అన్న దాష్టీకాన్ని ఇన్నాళ్లు ఎందుకు భరిస్తున్నానంటే.. మడుగు జాడీలు వంటివి ముట్టుకోవడం విషయంలో అమ్మా.. పెద్దమ్మా.. యమా సీరియస్ అయ్యే ప్రమాదం వుంది.

పెద్ద పెద్ద శిక్షలూ, రోజుల తరబడి తిట్లూ, సాధింపులూ, మాటలు మానెయ్యడాలూ, సూటిపోటీ మాటలు అనడాలూ మొదలైన తతంగం జరిగే అవకాశం చాలా ఎక్కువగా వుంది.

అమ్మ కోపం అలవాటేగానీ, పెద్దమ్మ కోపం భరించలేను.

ఆమె నిశ్శబ్దంగా సాధిస్తుంది. మాట్లాడను.. పొమ్మంటుంది. ఆమె మాట్లాడకపోతే నేను తట్టుకోలేను. నా దగ్గరికి రావొద్దంటుంది. కథ చెప్పను పొమ్మంటుంది. పెద్దమ్మ కథ చెప్పకపోతే నాకు నిద్రెట్లా వొస్తుంది? ఆమె బాధపడితే నేను చూడలేను..

అందుకే అవన్నీ పడడం కంటే అన్న చెప్పినవి చేయడమే మేలు అని ఆలోచించి, తప్పించుకునే వీలు లేక, అన్న చెప్పినవన్నీ నోరు మూసుకొని, మనసును చంపుకొని, అహాన్ని అణిచివేసుకొని చేస్తున్నాను.

ఇట్లా వారం, పది రోజుల నుంచీ కాల్చుకోని తింటున్నాడు అన్న.

ఇప్పుడు మంచి అవకాశం దొరికింది నాకు!

“నేను ఆవకాయ దబ్బ తిన్న విషయం అమ్మకు చెప్పనని మాటియ్యి. నేనూ నీ గురించి పెద్దమ్మకు చెప్పను” అని మెలిక పెట్టినాను. సరేనన్నాడు.. తప్పని సరైంది పాపం అన్నకు! దీన్నే కీలెరిగి వాత.. వీలెరిగి చేత.. అంటారనుకుంటా! మా అన్న పెడుతున్న యమయాతన లన్నీ ఆ క్షణం నించీ హుష్.. కాకీ.. అయిపోయినాయి.

తను వెళ్లిపోయినాక పనిలో పనిగా నేనూ బాణలి పైకెత్తి తొంగి చూసినాను.. కాటుక ఎట్లా పడుతుందో చూద్దామని!

యేమీ విశేషం లేదు.. దీపం సన్నగా వెలుగుతున్నదంతే! ఆ వేడికి గంధం మసిగా మారుతుంది. అంతే విషయం! దీంతో కాటుక ఎట్లా పడుతుందా.. అన్న కడుపు ఉబ్బరం కాస్తా తగ్గింది.

“వొద్దన్న పని చేసేదే ఉద్ధాలకుడి పెళ్లాం..” అన్న సామెత నాకు అచ్చుగుద్దినట్టు సరిపోతుందని నేనే అనుకుంటుంటాను.

‘మగవాళ్లు చూడంగానే కాటుక నిజంగానే తయారుకాదా..’ అనేది నాకైతే అనుమానమే! వేరే కారణాలు యేవైనా వుండొచ్చేమో!

అయినా కాటుకకు సిగ్గు ఎక్కువని అనుకోవడంలో యేదో ఒక ఆనందం, తృప్తి వుంది కదా! ఓ సంప్రదాయికమైన ఆశ్వాసన ఏదో మనసుకు దొరుకుతుంది కదా!

అప్పుడు చేసిన కాటుక.. అన్న మధ్యలో చూసినందుకు సిగ్గుపడి ముడుచుకొని పోయిందో.. నేను కూడా చూసినందుకు కించ పడిందో.. యేమోగానీ.. సరిగ్గా పట్టలేదు.

మళ్లీ మరుసటిరోజు కాటుక బట్టీ పెట్టింది పెద్దమ్మ. ఈసారి ఆ చీకటి స్టోర్ రూమ్‌లో కూర్చుని జపం చేసుకుంటూ కాసేపూ, పడుకొని కొంచెం సేపూ కాపలా కాసింది. ఎట్టకేలకు కాటుక పట్టింది.

పిల్లలెవరైనా అటుపక్కకొస్తే చెడామడా చీవాట్లు పెడుతూంది పెద్దమ్మ. మరి పిల్లలు పనులు పాడుచేస్తే కోపం రాదా చెప్పండి?

అమ్మణ్ని, అమ్మణ్ని అన్న లాంటి పిల్లలు ఇంట్లో వుంటే పెద్దవాళ్లకు ఇట్లాంటి తిప్పలు తప్పవు కదా?

ఒక్కొక్కసారి తయారైన కాటుక కళ్లలో మంట కలిగిస్తుంది. అప్పుడు ఈ ప్రక్రియనంతా మరింత జాగరూకతతో చేసి, చీకటిగదిలో పెట్టి జాగ్రత్త పడుతుంది పెద్దమ్మ. ముఖ్యంగా ఇంట్లో కాన్పు జరిగే ముందు తప్పక కాటుక తయారు చేస్తుంది ఆమె. పుట్టిన పిల్లలకూ, బాలింతరాలికీ కాటుక పెట్టడం తప్పనిసరి.

అలాగే చాదు కూడా ఇంట్లోనే తయారుచేసేది పెద్దమ్మ. అప్పట్లో ఈ తిలకాలూ అవీ వుండేవి కావు. పెళ్లి కాని పిల్లలంతా నల్లటి చాదు చుక్క పెట్టుకునేవారు. సబ్బు బియ్యాన్ని బాణట్లో మాడే దాకా వేయించేవారు. దాన్ని మెత్తగా నూరి, తగినన్ని నీళ్లు కలిపి, టెంకాయచిప్పలలో, ఇత్తడి కప్పులలో పోసి పెట్టేవారు. అది నల్లటి మెరుపుతో వుంటుంది. ఎండి గట్టిగా అట్టకట్టుతుంది. దానిలోకి కొద్దిగా నీళ్లచుక్కలు పోసి, దాన్ని బొటనవేలు, చూపుడు వేలితో గుండ్రటి చుక్కలాగా వొచ్చేట్టు చాదుకొని బొట్టుపెట్టుకునే వాళ్లం. చేతితో చాది పెట్టుకునేది కాబట్టి దాన్ని ‘చాదు బొట్టు’ అనేవారు.

ఆడపిల్లలు పెళ్లయిన తర్వాతే కుంకుమ పెట్టుకోవాల. అంతవరకూ చాదుచుక్కే! చంటిపిల్లలకు కూడా చాదుచుక్కే పెట్టేవారు. లేదంటే కాటుక బొట్టు పెట్టేవారు.

అయితే తిలకాల గొట్టాలూ, కాటుక డబ్బాలూ వొచ్చింతర్వాత ఇవి ఇళ్లలో తయారుచేయడం మానుకున్నారు.

కానీ, ఇంట్లో చేసిన కాటుక కంటికి చల్లదనాన్ని ఇచ్చేది. ఇదీ మా ఇంట్లో జరిగే కాటుక తయారీ ప్రహసనం!

ఇంతలో చూస్తుండగానే దసరా పండగ వొచ్చేసింది. ఇంట్లో పూజలూ, నైవేద్యాలూ, బొమ్మలకొలువు పెట్టడం, పేరంటాలు మొదలయినాయి.

మా ఊళ్లో దసరా పది రోజులూ, వైశాఖమాసంలో మా వూరి తిరుణాల జరిగినప్పుడూ పగటివేషాలు వేసుకొని ఇంటింటికీ వొచ్చేవాళ్లు.

ఒకరోజు పాండవులు, కృష్ణుడు, ద్రౌపది వేషాల్లో వొచ్చి పాండవోద్యోగవిజయాల్లోని పద్యాలు చెప్పేవాళ్లు.

ఒకరోజు సీతారామలక్ష్మణులు, వశిష్ఠులుగా వొచ్చి పద్యాలు, శ్లోకాలు పాడేవాళ్లు.

ఒకరోజు కృష్ణుడు, సత్యభామ, రుక్మిణి, నారదుడు వేషాల్లో వొచ్చి తులాభారం అభినయించేవాళ్లు.

ఇంకొకరోజు అర్ధనారీశ్వరుడు, నందీశ్వరుడు, వినాయకుడు అందరి వేషాల్లో వొచ్చి ఏవో నాటకం వేసేవారు.

అర్ధనారీశ్వరుడుగా వేసినప్పుడు మేలిముసుగు సగానికి కప్పుకొని, ఒకవైపు శివుడుగా, ఒక వైపు పార్వతిగా గొప్పగా అభినయించేవాడు ఆ నటుడు.

చివరగా తల పైన గంగ మాదిరిగా పెట్టుకున్న రబ్బరుపువ్వులో నించి నీళ్లు ఎగిరి ధార అర్ధచంద్రాకారంలో పడేలాగా చేసేవారు. దాన్ని చూడడానికి పిల్లలమంతా ఎగబడేవాళ్లం!

చంకలో ఏదో తిత్తిలాంటి దాంట్లో నీళ్లు పోసుకుని వొచ్చేవాడు ఆ నటుడు. దాన్ని చేతితో నొక్కినప్పుడు నీళ్లు తలపైనుంచి పడేవన్నమాట! మళ్లీ మన ఇళ్లలో నీళ్లు అడిగి ఇప్పించుకుని తిత్తిలో పోసుకునేవాడు.

ఇంక చివరి రోజు మాత్రం శూర్పణక్క, రావణుడు వంటి రాక్షసవేషాలు వేసుకునేవాళ్లు. శూర్పణక్క వేషం మహా భయంకరంగా ఉండేది.

కాస్త భారీ విగ్రహం వున్న నటుడిని ఆ పాత్రకు ఎంపిక చేసేవారు.

ఆ నటుడి మొహానికి, ఒంటికీ నల్లటి రంగు పూసేవారు. నడుము చుట్టూ బుట్టలు కట్టి, వాటి పైన ఒక నల్లటి పావడా, జరీ అంచు వున్నది కట్టేవారు. ఎర్రటి రవిక తొడిగేవారు. నోట్లో కోరలు పెట్టేవారు. పెద్దపెద్ద పూసల దండలు.. ఎద్దులకు.. ఉగాది పండగప్పుడు వేసేటటువంటివి.. వేసేవారు. చింపిరిజుట్టు, ఎర్రని పెద్ద బొట్టు, ఎర్రటి కండ్లు, కాళ్లకు పెద్ద పెద్ద కడియాలు, నోట్లోనించి జాపిన ఎర్రని నాలికతో కూడిన రాక్షసవేషంతో అది చేతిలో శూలం పట్టుకొని పిల్లలనందరినీ బెదిరించి వదిలేది.

ఆ రోజు శూర్పణక్క భయానికి చిన్నపిల్లలెవరూ వంటిల్లు వొదిలిపెట్టి, అమ్మ కొంగు విడిచి వచ్చేవారు కాదు. ఎందుకంటే, ఆ కాలంలో వంటిళ్లు ఇంటి వెనకగా, చివరగా వుండేవి. అంత లోపలికి శూర్పణక్క రాదని ధైర్యం అన్నమాట!

కొంచెం పెద్దపిల్లలం భయపడుతూనే దాని వెంట పరిగెత్తేవాళ్లం.

అది వెనక్కి తిరిగి పిల్లలను హుహుహు.. అంటూ ఒక్కపెట్టున భయపెట్టి తరిమేసేది.

ఈసారి మా వీధిలోనే వున్న ఒక పెద్దావిడ వీధి అరుగు మీద కూర్చుని ఒత్తులు చేసుకుంటుంటే.. ఈ శూర్పణక్క ఆవిడ మీదికి పోయింది.

“ఉహుహు.. ఉహూహూ అమ్మయ్యా.. నీ మీది కొస్తాంది సూడి సూర్పనక్కా! నిన్ను నమిలి మింగేస్తాది సూడీ.. నిన్ను సప్పరిస్తాది సూడీ.. నిన్ను ఇరుసుకోని తింటాది సూడీ..” అని బెదిరించింది శూర్పణక్క చేతిలోని శూలాన్ని ఊపుతూ.. నాలుక బయటపెట్టి.

ఆ అవ్వకు ఎంత ధైర్యమో.. యేమో..

“నీ తలగొట్ట! మీది మీది కొచ్చి సస్తున్నావ్ ! ఛూసినాం ఫో.. ఫే.. ద్ధ సంబడం! యే.. డ్సినట్టుందిలే!” అని తేల్చిపారేసింది.. నిష్ఠూరంగా. అది ఉట్టుట్టి కోపమని శూర్పణక్కకు తెలుసేమో..

“అమ్మయ్యా! నీ ఒత్తుల బుట్టలో ఏమన్నా దుడ్లుంటే ఇట్లా పడేయ్.. లేకపోతే నిన్ను ముట్టుకుంటా సూడి! ఉహూహూ..” అని ఆమె మీదికి పోబోతున్నట్టు బెదిరించినాడు.

“ఓరీ నీ పాసుగూలా! నీ తెంపరి తనం మీద బండపడ! ఫోరా తాగుబోతు ఎధవా! తాగి ఛావు ఫో! దూరం వుండు! మడుగుతో వున్నా.. ముట్టుకునేవు .. జాగ్రత్త!” అని గద్దిస్తూ.. ఒక రూపాయి కాసును ఒత్తుల బుట్టలో నించి తీసి, అతని వైపు తోసింది తెచ్చిపెట్టుకున్న కోపంతో, నిష్ఠూరంతో, విసుగుతో, ఒకింత అభిమానంతో కూడిన నవ్వుతో. అన్ని భావాలు ఒక్కసారి ప్రదర్శించినందుకు ఆవిడకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చేమోననిపిస్తుంది నాకు ఇప్పుడు!

శూర్పణక్క వేషంలో వున్న అతను రూపాయకే మురిసి పోయినాడు. సాయంత్రం తాగబోయే కల్లు కుండ అప్పుడే చేతిలో కొచ్చినట్టు ఆనందపడిపోయినాడు.

రూపాయిని పట్టుకొని కళ్లకద్దుకొని, “అట్లుండాల సూర్పనక్క భయమంటే.. మళ్లీ రేపొస్తా సూడి.. పది రూపాయలియ్యాల! లేకుంటే తాకుతా సూడి! రేతిరి నీ కల్లోకొస్తా సూడీ.. నిన్ను ఇరుసుకోని తింటా సూడీ.. ఉహుహు” అంటూ బెదిరించినాడు.

అతడిని చూసి రావణాసురుడు కూడా ముందుకొచ్చి,

“అమ్మయ్యా! సూర్పణక్క అన్నను రాగణాసురున్ని నన్ను మరిస్తివా? కల్లోకొచ్చి నిన్ను ఇరుసుకొని తింటా.. నలుసుకోని తింటా.. నంచుకోని తింటా.. ఉహుహు.. ఉహుహు..” అని బెదిరింపులు మొదలుపెట్టినాడు.

అవ్వ ఏమాత్రం భయం లేకుండా ఒత్తులు చేసుకుంటూ కూర్చుంది.

“అమ్మను బెదిరించింది ఛాల్లే గానీ.. ఇదుగో ఈ రూపాయ తీసుకోని కదులు ఇక్కడి నించి.. ఛూసినాం ఫో.. ఎక్కువైందిలే నీ బడాయి! ఫో ఫో ఫో.. ఇంక ఛాల్లే నీ బెదిరింపులు!” అని అవ్వగారి కొడుకు నిష్ఠూరంతో, అభిమానంతో కూడిన నవ్వుతో డబ్బులిచ్చి పంపేసినాడు.

“పది రూపాయలియ్యాల్నంట.. వీడి అబ్బ గంటు యేదో ఇక్కడ పెట్టినట్టు.. పనిల్యా.. పాటల్యా ..ఎధవలకు..” అవ్వ స్వగతంగా తిడుతూనే వుంది.

ఈ కథనంతా చూస్తూ.. అవ్వ ధైర్యానికి అబ్బురపడుతూ.. భయం మరిచి తనకు దగ్గరగా వొచ్చిన పిల్లలను మరొక్కసారి బెదిరించి.. ఉహుహూ.. అని ఒక్క ఉదుటున పరిగెత్తించినాడు శూర్పణక్క వేషధారి.

తరువాత తెలిసింది ఆ శూర్పణక్క వేషధారి ఆ అవ్వా వాళ్ల జీతగాడి తమ్ముడని! అప్పుడప్పుడూ అవ్వను తాకుతానని బెదిరించి డబ్బులు గుంజుతుంటాడని!

రావణాసురుని వేషం వేసినవాడు వాళ్ల జీతగాడేనట! ఇదంతా ఆ అవ్వకు తెలుసు!

విజయదశమి తరువాత రోజు వేషగాళ్లంతా మామూలు దుస్తులతో అందరిళ్లకూ వొచ్చి, ఆశీర్వచన పద్యాలు చెప్పి, సంభావనలు తీసుకొనివెళ్లేవారు. పాత పట్టుచీరలు, పాత పట్టుపంచెలూ ఇచ్చి పంపేది అమ్మ.

అట్లా దసరా సెలవులు.. బొమ్మల కొలువులు పెట్టుకోవడం, అమ్మా వాళ్లు చేసిన రకరకాల పిండివంటలు తినడం, పేరంటాలకు పోవడం, పగటివేషాల వాళ్లను చూడడం వంటి కాలక్షేపాలతో సరదా సరదాగా గడిచిపోయేవి! బంగారు రోజులంటే అవే కదా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here