బతుకమ్మా, నీకు పుష్పాంజలి!

0
3

[శ్రీమతి వారణాసి నాగలక్ష్మి రచించిన ‘బతుకమ్మా, నీకు పుష్పాంజలి!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]వా[/dropcap]నలు వెల్లువై కురిసినప్పుడు తెలిసింది
నువ్వొస్తావని…
ఎండిన అడవులు చిగురిస్తుంటే తెలిసింది
నువ్వొస్తావని…
బీళ్ళు పచ్చిక తివాసీ పరచినపుడు తెలిసింది
నువ్వు వచ్చేస్తున్నావని …
పుడమంతా పూల సోయగంతో పులకిస్తుంటే
నీ రాక కనిపించింది!

ఎంతటి కరుణాంతరంగవు కాకపోతే
నీ ఆగతికి ముందే ప్రకృతి పచ్చనై పూలదారి పరుస్తుంది?
బిడ్డవై అమ్మల మురిపించే, అమ్మవై బిడ్డల కరుణించే నువ్వు
ఎంతటి గారాల బిడ్డవో అంతటి వరాల తల్లివి!
ఇంతగా మురుస్తూ మేమెవరిని పిలుస్తాం నిన్ను తప్ప?
ఇంత కరుణ కురిపిస్తూ మా దరికి ఎవరొస్తారు నువ్వు తప్ప?

మబ్బుల గొడుగు కింద అల్లారుముద్దుగా ఇంటికి తెచ్చుకుని
పువ్వులదొంతర మీద తమలపాకులు పరిచి ప్రతిష్ఠించుకుంటే
మా ఇళ్లూ వాకిళ్లూ పులకించేలా
నిన్నటి పూలలో నిండుగా కొలువై వెన్నెల కురిపిస్తావు,
అమవస నాడే పూర్ణ చంద్రోదయమనిపిస్తావు!

ఎంగిలిపూల బతుకమ్మవైనా, అటుకుల బతుకమ్మవైనా
ముద్దపప్పు బతుకమ్మవైనా, నానబియ్యం బతుకమ్మవైనా
అట్ల బతుకమ్మవైనా, అలిగిన బతుకమ్మవైనా
వేపకాయల బతుకమ్మవైనా, వెన్నముద్ద బతుకమ్మవైనా
చివరకు సద్దుల బతుకమ్మవై సందడి చేసినా
ఆనందమే గాని ఆర్భాటం లేకుండా వాయనాలిప్పిస్తావు!
తొమ్మిదిరోజుల పాటు తొమ్మిది రకాల సంబరాలు జరిపిస్తావు
ఇంట దొరికే వస్తువులతోనే ఇంతటి పండుగా నడిపిస్తావు

విశిష్టమైన పూలడుగవు, విశేషమైన భక్ష్యాలు కోరవు
మాఇంట నిన్ను ప్రతిష్ఠించుకుని మనసారా కొలుచుకుందుకు
చుట్టూ పరచుకున్న చెట్టు చేమలిచ్చే ఆకూ పువ్వే చాలంటావు
ఎంతటి సరళహృదయవు! ఎంతటి భక్త సులభవు!
కులమత వర్గ తారతమ్యాలెంచని నిర్మలాంతరంగవు

తంగేడు గన్నేరు నిత్యమల్లీ-
గుమ్మడీ బీరా బంతీ చేమంతీ-
కంచె మీది పూలే చాలు కదా నీకు!
ఆకాశమంటేలా దొంతరలు పేర్చి,
ఆనందముప్పొంగేలా నాట్యమాడి
ఆటపాటలతో నిన్ను హత్తుకుని
పూల తట్టలలో నిన్నెత్తుకుని
సందె పొద్దుల్లో నిన్ను చెరువుకి చేర్చి
పొంగారు హృదయాలతో ఇళ్లకు చేరితే,
మట్టిలో నీటిలో సమస్త ప్రకృతిలో కలిసిపోయి
మమ్మల్ని పరివేష్ఠించి, పరిరక్షిస్తావు నువ్వు!

మనిషికీ మట్టికీ అనుబంధముందనీ,
మట్టికీ మానుకీ సంబంధముందనీ- చెప్పి
మనిషినీ మట్టినీ చెట్టునీ కలిపి కట్టి
హరిత సౌందర్యానికి పూవన్నెలు జతచేస్తావు
తల్లివీ బిడ్డవూ నీవే అయి మా ముంగిళ్ల
హరివిల్లులు విరబూయిస్తావు!
మా బతుకులకింతటి శోభనిచ్చిన,
తల్లీ బతుకమ్మా, నీకిదే పుష్పాంజలి!
*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here