తనదాకా వస్తేనే తెలిసేది

1
4

[మోహనరావు మంత్రిప్రగడ గారు రచించిన ‘తనదాకా వస్తేనే తెలిసేది’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]‘దా[/dropcap]సు, ఆరోగ్య శాఖా మంత్రి’ – బోర్డు చూసి చిన్నగా నవ్వుతూ లోపలకి అడుగుపెట్టాడు, నారాయణ. ఇంటి బైట రెండు కార్లు ఆగి ఉన్నాయి, పైకి వచ్చాడు నారాయణ. ఇంతలో మంత్రిగారి శక్రటరి వచ్చాడు, “సార్ మంత్రిగారిని కలవాడానికి వచ్చారా” అడిగాడు అతను.

“అవును” అన్నాడు నారాయణ ఇంటిలోపలకి చూస్తూ.

“అప్పాయంట్‌మెంట్ ఉందాండి” మళ్ళా అడిగాడు అతను.

“లేదు, నేనాయన బంధువుని. ముఖ్య స్నేహితుడిని” బదులిచ్చాడు, నారాయణ.

“అలాగా, అయతే అలా కూర్చోండి మంత్రిగారు ఎవరితోటో మాట్లాడుతున్నారు” అన్నాడు శక్రటరి.

ఆ మాటకి దాసు బైటకి చూసాడు, అక్కడ నారాయణ కనిపించాడు, అయనా మొహం తిప్పేసుకొని వాళ్ళతో మాట్లడసాగాడు. నారాయణ ఆశ్చర్యపోయాడు, బహుశా గుర్తుపట్టలేదేమో అనుకొని అక్కడ కూర్చున్నాడు. కొంతసేపటికి ఆ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, అయినా దాసు నారాయణ దగ్గరకి రావడం కాని  పిలవడం కాని చేయలేదు. శక్రటరి వెళ్ళి చెప్పాక “లోపలకి పంపు”  అన్నాడు. నారాయణ లోపలకెళ్ళాడు.

“రండి నారాయణగారు, అలా కూచోండి” అన్నాడు దాసు.

ముందు వేళాకోళం ఆడుతున్నాడనుకొని “అలాగేనండీ దాసుగారు” అని కూర్చొన్నాడు.

“సరే చెప్పండి, ఏ పని మీదోచ్చారు, గమ్మున చెప్పండి. మళ్ళా నేను బైటకెళ్ళాలి” అన్నాడు అసహనంగా దాసు.

ఈసారి నారాయణకి విషయం అర్థమైయింది, దాసు కావాలనే అలా మాట్లాడుతున్నాడని. “ఏం లేదండి తమరికి లోగడ ఓసారి మా ఊరి సర్పంచి మా ఊరి రోడ్ల గురించి మనవి చేసాడండి, మొన్న గోతిలో సైకిల్‌తో పడి ఒకాయన కాలు విరిగిందండి, మెయిన్ రోడ్డునించి మూడు కిలోమీటర్లుంటుందండి, రోడ్డు బాగుండక స్కూలు బస్సులు రావటం లేదండి, చాలామంది ఆడపిల్లలు చదువులు మానేసారండి, దాని సంగతి తమరికి మరోసారి మనవి చేద్దామని వచ్చానండి” అన్నాడు నారాయణ వినయంగా నుంచొని.

“ఇలాంటివి రోడ్లు భవనాల మంత్రిగార్కి చెప్పాలి. నేను ఆరోగ్యశాఖ మంత్రిని నాకు చెప్పేం లాభం, వారిని కలవండి” అని లేచాడు దాసు.

“అయ్యా తమరు మా నియోజవర్గం ఎమ్‌ఎల్యే కదాని తవరికి మనవి చేసానండి” అన్నాడు మరింత వినయంగా.

“సరే నేను వారికి చెబుతాను” అని గబగబా మేడపైకి వెళ్ళిపోయాడు దాసు. ఇదంతా గుమ్మంలోంచి విన్న ఆయన భార్య బైటకొచ్చి “బాగున్నారా బావగారు, అక్కయ్య ఎలా వుంది” అని అడిగింది.

“అందరం బాగానే ఉన్నాం. మీ నాయన, అమ్మ కూడా బాగానే ఉన్నారు. వెడతానమ్మా” అని నారాయణ బైటకి వచ్చేసాడు.

దాసు క్రిందకి వచ్చాడు, “ఇదేం బాగోలేదు” అంది ఆయన భార్య. దాసుకి అర్థమయింది, కాని ఏం తెలియనట్లు “దేనిమాట” అని అడిగాడు.

“మీరు నారాయణ గారితో మాట్లాడిన తీరు, మీ పూర్వ జీవితం మర్చిపోయారనుకొంటాను, మీ ఈ ప్రగతికీ సోపానం నిర్మించిందాయనే అని, పట్టుపట్టి సర్పంచి గాను, ఆ తరవాత మండల ప్రెసిడెంటుగాను, చివరకి ఎమ్‌ఎల్యేగా నెగ్గడానికి బాగా ఆయన, మీ గ్రామస్థులు అందరు బాగా కృషి చేసారన్న మాట మరచినట్లున్నారు” అందావిడ వెటకారంగా.

“ఓసి వెర్రిమొహమా, తీగ అల్లుకొనే దాకానే పందిరి అవసరం, అది పెద్ద చెట్టుకో, మేడ గోడకో అలముకొన్నాక అది పందిరిని వదిలేస్తుంది, అలాగే చెరువులో పుట్టిన తామరపువ్వు ముందు మొగ్గగా క్రింద బురదలోనే పెరుగుతుంది, అది పైకొచ్చి వికసించాక ఇంకా బురదతో దానికి పనేమిటి, ఆలోచించు” అని ముందుకు కదలబోయాడు.

“మరే అదే కలవ రెండ్రోజులు తరవాత ఎండకి ఎండి నీటిలో కలసిపోతుంది, ఆనవాలు లేకుండా, అలాగే ఏదైన పెద్ద గాలికి, అల్లుకొన్న తీగ క్రిందపడితే దాన్ని నిలపెట్టడానికి కర్రలే అవసరం. ఇవి మీరు గ్రహించండి” అని ఆవిడ లోపలకెళ్ళిపోయింది.

ఆ విషయాన్ని పెద్దగా తీసుకోలేదు దాసు. బైటకివెళ్ళిపోయాడు. అలా కొన్నిర్రోజులు గడిచాయి,  దాసుకి తన నియోజకవర్గంలో ఓ ఊళ్ళో కట్టిన ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్ళవలసి వచ్చింది.

అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. ఆ రోజు బయలుదేరాడు ఆయన.

కారు జోరుగా హైవే మీద నడుస్తోంది, కొంతదూరం వెళ్ళాక ఆయన వెళ్ళవలసిన గ్రామం బోర్డు కనపడింది. డ్రైవరు కారు గమ్మున ప్రక్కకి తిప్పాడు, అక్కడ రోడ్ హైవేకి కలిసే చోట గుంట పడింది. అది గమనించలేదు డ్రైవరు. అంతే, కారు ఆ గుంతలో పడి ప్రక్కకు వాలిపోయింది. అనుకోకుండా అలా జరగడంతో ఫోన్‌లో మాట్లాడుతున్న దాసు ముందుకి తూలిపోయి ముందు సీటుకు గుద్దుకొని డోరు ఓపెనయి, క్రింద పడిపోయాడు. క్రింద రాయి తలకి తగిలి గాయమైయింది. వెంటనే వెనక వస్తున్న ఎస్కార్టు వాహనంలో వాళ్ళు ఎలర్టయి, దిగి మంత్రిగారిని లేవతీసి వాళ్ళ వాహనంలో హాస్పటల్‌కి తీసుకుపోయారు. దాసుకి తలకి రాయి తగలడం వల్ల బ్లడ్ పోయింది, కొంచెం సృహ తప్పాడు.

ఆయనకి కొంతసేపటికి తెలివి వచ్చింది, తల భారంగా ఉండి కదపలేకపోయాడు. కళ్ళు విప్పి చూసాడు, భార్య కనిపించింది. దగ్గరగావచ్చి “బాధగా ఉందా” అడిగింది.

ఇంతలో డాక్టరు వచ్చి ఇంజక్షన్ ఇచ్చి, “మరేం పరవాలేదు మేడం, రేపు డిశ్చార్జి చేస్తాం. కొన్ని రోజుల్లో మామూలైపోతారు సారు” అని ధైర్యం చెప్పాడు.

ఆ వార్త మీడియాలో పబ్లిషయ్యింది.

నారాయణ దాసుతో మాట్లాడి వచ్చి విషయం గ్రామంలో అందరికీ చెప్పాడు, అందరు ముక్కున వేలేసుకొన్నారు. కొందరైతే పైకి “అంత అహం ఉండకూడదు” అని విమర్శించారు.

దాసుకి ప్రమాదం జరిగిందన్న వార్తని గ్రామస్థులు నారాయణకి చెప్పారు. ఆయనేం మట్లాడలేదు, కొంతమంది తగిన శాస్తి అని అన్నారు. నారాయణ అందర్ని వారించాడు.

దాసు ఇంటికొచ్చాక చాలా మారిపోయాడు, అతని మస్తిష్కంలో అనేక ఆలోచనలు లేచాయి. నారాయణ చెప్పిన మాటలు గుర్తుకి వచ్చాయి. తను మంత్రి కనక వెంటనే అందరు స్పందించారు. అదే సామాన్యుడైతే అతని గతేమిటీ, అలా ఎంతమంది బాధలు పడ్డారో, ఎంతమంది కాళ్ళూ చేతులు విరక్కొట్టుకొన్నారో, ఏం చెయలేని నిస్సహాయతతో ఎంతమంది కుమిలిపోయారో, అని అనిపించింది. తండ్రి పోతే తనని సొంత కొడుకు కన్నా ఎక్కువగా పెంచిన తన బాబాయి చావుబ్రతుకుల్లో ఉన్నారని ఫోనోస్తే ఆ ఊరు వెళ్ళే రోడ్ బాగుండదని, కాలు విరిగిందని రాలేనని అబద్ధం చెప్పించాడు తను. నారాయణ – తన స్వంత తమ్ముడిలా ఆదరించి తను కోరుకున్న అమ్మాయితో తన బాబాయిని ఒప్పించి వివాహం చేయించాడు. అటువంటి నారాయణ ఇంటికొస్తే ఎంత నీచంగా ప్రవర్తించాను, పదవి అహం తలకెక్కి మూలం మరచిపోయాను, ఏ అహంతో అయతే అలా ప్రవర్తించానో ఆ అహం తనకి దెబ్బతగలకుండా కాపాడలేకపోయింది, తన భార్య చెప్పిన యథార్థం గుర్తుకొచ్చింది, ఆవిడని కూడా చాలా కించపరచాను, ఆవిడ కన్న తల్లిదండ్రులు వస్తే అతి హీనంగా అవమానించి వాళ్ళని ఆవిడకి దూరం చేసాను, ఇప్పుడు ఏం చేస్తే ఆ పనికి పరిహారం జరుగుతుంది, అన్న ఆలోచనతో తల వేడెక్కిపోయింది. దాసు మనస్సంతా పశ్చాతాపంతో నిండిపోయింది.

భర్త ఏదో ఆలోచించి సతమతవుతున్నట్లుగా ఆయన భార్య గ్రహించింది. దగ్గరగా వచ్చి “ఆ విషయాలు మరచిపొండి. ఆలోచించడంవల్ల ఏమి లాభం లేదు. ముందు సంగతి ఆలోచించి వాళ్ళకి ఆ వూరుకి న్యాయం చేయండి. అదే మీకు మనశ్శాంతి కలిగిస్తుంది. ఇప్పటికే కోట్లు కూడపెట్టాం, ఇంకా సంపాదించి ఏం చేస్తాం? ఉన్న ఒక్క కొడుకు మీ పద్ధతి నచ్చక దూరంగా వెళ్ళిపోయాడు. ఇంకా ఎవరి కోసం సంపాదిస్తారు? మనం హరీమంటే అదంతా పరుల పాలవుతుంది, స్వంత ఊరికి, ఆత్మీయులకు మనం చేసిందేమిటి అలోచించండి, సంపాదించింది సద్వినియోగం చేయండి” అంది ఆవిడ.

“నిజమే అదే మంచిది. నీవ్వు చెప్పినట్లు ఆలోచిస్తాను, ఇప్పుడు మనసంతా సంతోషంగా ఉంది, చాలా కాలం తరవాత నీతో మనసు విప్పి మాట్లాడగలిగాను, డబ్బు కోసం పరుగాపి, ఆత్మీయత కోసం నడుస్తాను” అన్నాడు దాసు.

ఆ తరవాత దాసు ముఖ్యమంత్రి గారిని కలిసాడు. తన పెంపుడు తండ్రి పేర తన ఊళ్ళో హాస్పటల్ కట్టిస్తాననీ, దానిని ముఖ్యమంత్రిగారు ఓపెన్ చెయాలని కోరాడు. దానికి ఆయన అంగీకరించాడు. ముందుగా పంచాయితీరాజ్ మంత్రిని, రహదారుల శాఖ మంత్రిని కలిసాడు, విషయం చెప్పాడు, ముఖ్యమంత్రిగారు వెళ్ళే రోడ్లన్ని బాగు చేయించాలని అడిగాడు.

రాజు తలచుకొంటే డబ్బులకి కొదవా, ఆ ఊరు వెళ్ళే రోడ్, ఆ వూళ్ళో అన్ని మట్టి రోడ్లు మంచి రోడ్లుగా మారిపోయాయి.

అనుకొన్నట్టుగానే దాసు తన బాబాయి ఇల్లు ఆసుపత్రిగా మార్చాడు. ఆ రోజు రానే వచ్చింది, ముఖ్యమంత్రిగారు వచ్చి హాస్పటల్ ఓపెన్ చేసి వెళ్ళిపోయారు. ఈసారి దాసు తన భార్యని కూడా తీసుకొచ్చాడు. దాసు అక్కడే ఉండి నారాయణ, వస్తాడని ఎదురు చూడసాగాడు. నారాయణే కాదు ఆ వూరిలో ఎవరూ వచ్చి ఆయనని పలకరించ లేదు. ఆయన ఎదురుచూపు గ్రహించి ఆయన భార్య “మీరు ఎదురుచూసే వాళ్ళెవరు రారు, ముఖ్యమంత్రి గారి సమావేశం అయిపోగాన అందరూ వెళ్ళిపోయారు, నారాయణ గారసలు రాలేదు” అంది.

దానికేం సమాధానం చెప్పకుండా ఆయన లేచి, “రా వెడదాం” అన్నాడు. కారు ముందుకి తేబోయాడు డ్రైవరు. ఆయన చెయ్యి ఎత్తి వద్దని సౌంజ్ఞ చేసాడు. ముందుకి నడిచాడు, వెనక ఆయన భార్య నడిచింది ఆ వెనక ఆయన బృందం కదిలింది.

దాసు, తిన్నగా నారాయణ ఇంటికి చేరి గబగబా మెట్లెక్కాడు, ఆ వెనుక భార్య అనుసరించింది. గుమ్మం తలుపు దగ్గరగా వేసుంది.

కొంచం పరకాయించి అటు ఇటు చూసాడాయన. అక్కడ ఓ కర్ర కుర్చీ మీద  ఓ తువ్వాలు కనపడింది. వెంటనే ఆయన చొక్కా విప్పేసి, ఆ కుర్చీ మీదున్న తువ్వాలు బుజం మీద వేసుకొన్నాడు. దూరాన్నించి చాలామంది గ్రామస్థులు అది గమనించసాగారు. దాసు కొంచం ముందుకొచ్చి, “ఒరే నారిగా” అని గట్టిగా పిలిచాడు, వెంటనే నారాయణ  తలుపుతీసి “ఓరి దాసుగాడా” అని వచ్చి కౌగలించుకొన్నాడు. అలా కొంచం సేపు ఉండిపోయారిద్దరు.

“బాగుంది మీరలా మైమరచి పోతున్నారు వెనక మా చెల్లి ఉంది” అంది నారాయణ భార్య,

“ఓ అలాగా, సతీసమేతంగా వేంచేసారన్న మాట, దయచేయండి లోపలకి” ముందుకి దారి తీసాడాయన.

అంతా అక్కడే భోం చేసారు, అక్కడే దాసు మావగారు అత్తగారు కూడా కలిసారు, దాసు ఆయనకి నమస్కరించి “క్షమించండి మావయ్యా, అత్తయ్యా” అన్నాడు. ఆయన భార్య తన తల్లి దగ్గరకెళ్ళి హత్తుకుంది. కొంచెం సేపు మౌనం రాజ్యం చేసింది అక్కడ.  “నువ్వు చేసిన పనికి నాకు చాలా ఆనందంగా ఉందిరా. పైలోకంలో ఉన్న మీ బాబాయి ఆత్మ సంతోషిస్తుంది, ఇంత మంచి ఆలోచన ఎలా వచ్చిందిరా” అడిగాడు నారాయణ.

“అదా బావగారు, ఈయన తలకి దెబ్బ తగిలింది. దాంతో జ్ఞానోదయమయింది”, అని అంతా చెప్పింది దాసు భార్య.

“అయ్యో అలాగా ఇప్పుడు బాగానే ఉందా బుర్ర” అని అడిగాడు నవ్వుతు నారాయణ.

“అవున్రా అందుకే ఇలా చేయగలిగాను”, అన్నాడు దాసు నవ్వుతు.

“అయనా తనదాకా వస్తేకాని తెలియదని, స్వానుభవం అయ్యాక ప్రజల ఇబ్బందులు గుర్తొచ్చాయి, ఒకేసారి రోడ్లు వేయించడం ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరింది, బావగారు” అంది దాసు భార్య.

“మరేరా కారు గోతులోపడి తలకి గాయం అయ్యాక అర్థమయిందిరా పరిస్థితి” అన్నాడు దాసు.

ఆ తరవాత దాసు తరచు గ్రామం వచ్చి పోతున్నాడు.

(పాఠకులకు మనవి. ఇది కేవలం కల్పితమని – ఏ వ్యక్తి లేక వ్యక్తులను ఉద్దేశించింది కాదని మనవి చేయుచున్నాను. అలాగే ఇలా ఎప్పడైన జరుగుతుందని ఆశపడడం కూడా భ్రమే అవుంతుందని మనవి.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here