పుట్టుమచ్చలు – పచ్చబొట్లు

0
3

[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘పుట్టుమచ్చలు – పచ్చబొట్లు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]సుం[/dropcap]దర్‌కి తీపి ఆవకాయ అంటే వల్లమాలిన ఇష్టం. అది తిన్నప్పుడల్లా వాళ్ల అమ్మమ్మ గుర్తుకొస్తుంది.

అమ్మమ్మ గుర్తుకొచ్చిన ప్రతిసారీ తన గత మధురానుభూతులను నెమరు వేసుకుంటూ ఉంటాడు.

సుందర్ వాళ్ల ఊరులో ఏడవ తరగతి వరకే ఉండటం వలన ఎనిమదవ తరగతి నుండి పదవ తరగతి వరకు వాళ్ల తాత గారింటిలో ఉండి చదువుకున్నాడు.

అప్పుడు సుందర్ వాళ్ల అమ్మమ్మ ప్రతి వేసవిలో తీపి ఆవకాయ ఎక్కువ మొత్తంలో తయారు చేసేది.

అదో పెద్ద యజ్ఞమన్నట్టు పెద్ద, పెద్ద ముక్కలుగా కోసి ఆవకాయ తయారు చేసి పూర్తిగా ముక్కలూరి పాకం కుదిరిన తరువాత రెండు మూడు పెద్ద జాడీలతో అటక పైన నిలువ ఉంచేది.

ఆవకాయన్న మాటే గాని రుచి మామిడి తాండ్రని తలదన్నేది. ఆ రుచే సుందర్‌కి దానికి దాసోహం చేసిందేమో.

అయినా రుచి తెలిసిన వారు, అభిరుచి ఉన్న వారు ఎవరు మాత్రం తీపి ఆవకాయని తక్కువచేసి చూపగలరూ!

అలా తయారు చేసి అటకపైనుంచిన జాడీల నుంచి అవసరం వచ్చినపుడు కావలిసినంత ఆవకాయ కిందకు దింపుకునే వారు. అయితే ఆవకాయ అటక మీది నుండి ఆవకాయను కిందికి దించడమంటే అదో ప్రహసనం.

ఎలాగంటే, ఓ తలుపు పైకి ఎక్కి లాఘవంగా అటకనందుకోవాలి. ఆ ఘనకార్యం సుందర్ మరియు అతని అత్తలు మాత్రమే చేయగలిగేవారు. అయితే ఇంట్లో సుందర్ అందుబాటులో ఉంటే ఆ అవకాశం వాడికే దక్కేది. సుందర్ ఆ అవకాశాన్ని ఎప్పుడూ వదులుకునే వాడు కాదు.

ఎందుకంటే అటకపైకెక్కిన ప్రతి సారి, కనీసం రెండు మూడు ముక్కలైన నోట్లో కుక్కుకోవచ్చు అనేది అతని ఆశ, ఆశయం.

తన భోజనంతో ఎన్నిముక్కలు కావలంటే అన్ని తినే వెసలుబాటు ఉన్నా, చూసే వారికి బాగుండదుగా!

దొంగతనంగా తినే తిండిలో ఓ మధురానుభూతి ఉంటుందని అతని భావనేమో మరి.

అయితే వాళ్ల అమ్మమ్మకి తెలుసు ప్రతిసారీ సుందర్ ఆవకాయ కోసం అటక ఎక్కినప్పుడు చేయబోయే నిర్వాకం గురించి. కానీ తప్పనిసరై సుందర్‌ని అటకపైకి ఎక్కించేది. పోనీలే, తిన్నా ఎన్ని ముక్కలు తింటాడు అని అనుకొని ఉండవచ్చు.

అందుకనే ఆమె సుందర్ అటక ఎక్కిన ఓ రెండు క్షణాల తరువాత కావాలనే సుందర్‌ని పిలిచేది “ఏరా! ఊరగాయ నింపుకుని వేగంగా దిగూ” అంటూ.

దానికి సుందర్ నుండి ఎటువంటి స్పందన ఉండేది కాదు, నోటి నిండా ఆవకాయ ఉండేది మరి.

కిందికి దిగిన తరువాత దానికి సరిపడా అక్షింతలు పడేవి.

దానికెప్పుడూ సుందర్ బాధ పడిందిలేదు. ఎందుకంటే తీపి ఆవకాయంటే అంత ఇష్టం మరి.

నిజం చెప్పాలంటే ఆమెకు మనవడంటే వల్లమాలిన ప్రేమకూడా ఉండేది. ఆ విషయం సుందర్‌కీ తెలుసు.

ఇప్పటికి ఆ ఊరగాయ ప్రహసనం గుర్తుకు వస్తే సుందర్ మొహం పైన ఓ చిరునవ్వు మెరుస్తుంది. అమ్మమ్మా గుర్తుకు వస్తుంది.

అతను తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడే తాతగారు కాలం చేసారు. సుందర్ వాళ్ల అమ్మమ్మకి ఓ కోరిక ఉండేది తాను పుణ్యస్త్రీగా పోవాలని. పాపం! ఆ కోరిక తీరలేదు. ఆమె సుందర్ ఉద్యోగంలో చేరిన మూడు సంవత్సరాలకు కాలం చేసింది..

అయితే ఈ సందర్భంగా సుందర్‌కి వాళ్ల తాతయ్యతో ఉన్న అనుబంధాన్ని కూడా ఓ సారి గుర్తు చేసుకోవాలి. ఆయన పాత రోజుల్లో యస్. యస్.యల్.సి వరకూ చదివి ఓ కోపరేటివ్ బాంక్‌లో మేనేజర్‌గా పదవి విరమణ చేసి, తరువాత సొంత ఊరిలోనే వ్యవసాయం చూసుకునే వారు. సుందర్‌కి తాత అనే కన్నా ఓ గురువనే చెప్పాలి. ఆయన ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండేవారు. పరాకుగా, చిరాకుగా ఉండేవారు. సరదాగా మాట్లాడిన సందర్భాలు లేవనే చెప్పాలి. అప్పడప్పుడు సుందర్‌ని తనతో పొలానికి పుస్తకం పట్టుకుని రమ్మనేవారు. పొలం గట్టు పైన కూర్చోబెట్టి పాఠం చెప్పేవారు. కొన్ని సార్లు వెళ్లేవాడు. తక్కువ సార్లు డుమ్మా కొట్టేవాడు. ఎందుకంటే ఆటలాడాల్సిన సమయంలో ఆయన తనతో రమ్మనే వారు. అది సుందర్‌కి నచ్చేది కాదు. ఆ నిర్లక్ష్యం వాళ్ళ తాతకి నచ్చేది కాదు. తరువాత తిట్లు పడేవి. అయితే సుందర్‌కి వేసవి శెలవులలోనే రాబోయే తరగతులకు సంభందించిన ఇంగ్లీష్ పాఠాలు ఆయన చెప్పేసేవారు.

తెలుగు, ఇంగ్లీష్ లలో సుందర్ వాళ్ల తాతయ్య చేతిరాత అధ్బుతంగా ఉండేది. నిస్సందేహంగా భావితరాలకు చూపించి స్ఫూర్తినివ్వగలిగేంత అందమైన చేతిరాత అది. దురదృష్టవశాత్తు సుందర్ తాతగారి చేతిరాతని పదిల పరుచుకోలేక పోయాడు.

సుందర్ తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు తాతగారు కాలం చేసారు. సుందర్‌కి అప్పుడు తెలియదు తానేం కోల్పోయాడో. తరువాత, తరువాత అనిపించేది కనీసం తన చదువు పూర్తెనంత వరకైనా బ్రతికి ఉండుంటే బాగుండేదని, తానో మంచి మార్గదర్శిని, సంరక్షకున్ని కోల్పోయానని.

ఇప్పటికీ ఏదో ఓ క్షణానా బాధ పడుతునే ఉంటాడు, తనకు మార్గదర్శనం లేక సరైన మార్గంలో నడవలేక పోయానని.

అది గతం.

ఇప్పుడు సుందర్‌కి ఏభై ఏళ్లు, పాతికేళ్ల క్రితమే ఉద్యోగాన్వేషణలో దగ్గరలో ఉన్న ఓ నగరానికి చేరాడు. చిరు ఉద్యోగంలో కుదురుకొని అక్కడే ఉండిపోయాడు.

శుభ, అశుభ కార్యాలకు సుందర్ తాతగారి ఊరు వెళ్తూ వస్తూనే ఉంటాడు. సుందర్ మేనమామ వాళ్లు ఆ ఊళ్లో ఉంటారు. వారు కూడా ప్రతి సంవత్సరం వేసవిలో తప్పకుండా ఆవకాయ పెడుతూనే ఉంటారు.

ఎప్పుడు సుందర్ వాళ్లింటికి వెళ్లినా కొంత ఆవకాయ ఇస్తూ ఉంటారు. అలాగే ఈసారి కూడా ఓ పెళ్లికి హాజరు కావలిసి వచ్చి ఆ ఊరికి వెళ్లి తాతగారింటికి వెళ్లాడు. ఈసారి ఆవకాయ పెట్టారా అని అడిగాడు. వాళ్లకూ తెలుసు సుందర్ తిండి యావ గురించి, తీపి ఆవకాయంటే ఉన్న ఇష్టం గురించి. “పెట్టాం లేరా వెళ్లేటప్పుడు తీసుకెళ్దువు గాని” అని అన్నారు.

ఊల్లో పెళ్లి సందర్భంగా వచ్చిన బంధువులంతా పిచ్చాపాటీగా మాట్లాడుతూ ఉండగా, సుందర్ మేనమామని, అత్తని పక్కకు పిలిచి ఓ విచిత్రమైన కోరిక కోరాడు. మిగతా వాళ్లకు వీళ్లు దూరంగా ఉండటం వలన వాళ్లెవరూ సుందర్ ఏం అన్నాడో వినలేదు.

అయితే ఆ కోరిక విన్న వాళ్ల మేనమామ, అత్త కొంత ఆశ్చర్యపడ్డా ఓ చిరునవ్వుతో “ఓస్ అంతేనా! అదేం చేసుకుంటావురా, చాల పాతది, పైగా పాడైపోయింది. ఏమిటో నీ చాదస్తం గానీ!” అంటూ “అంతగా నీవు కావాలనుకుంటే తీసుకుపోరా. దాన్ని మేమెలాగూ వాడటం లేదు.” అని అన్నారు.

ఇంతకూ సుందర్ వారి నుండి కోరినది ఓ పాత కర్రపెట్టె. అందులో ఓ పింగాణీ జాడీ, అందులోనే వాళ్లమ్మమ్మ తినుబండారాలు పెట్టేది. జాడీని ఆ పెట్టెలో దాచి తాళం వేసి ఉంచేది. సాయంకాలాలు స్కూల్ నుండి వచ్చిన వెంటనే సుందర్‌కి ఒకటో రెండో ఇచ్చేది. తానే చేసానని ఎప్పుడు చెప్పేది కాదు. ఎవరో ఇచ్చారు, మళ్లీ అడగొద్దని చెప్పేది. అవునా! అంటూ సుందర్ ఇచ్చింది పుచ్చుకుని బయటికి ఉరికే వాడు.

అయితే అసలు విషయం సుందర్‌కి తెలుసు అమ్మమ్మే తయారు చేసిందని. ఆమే తయారు చేసిందని తనకు తెలిస్తే ఎక్కువ మొత్తంలో అడుగుతానని అలా చెబుతుందని. కానీ ఏమీ తెలియనట్టు నటించేవాడు. అయితే అందులో దాచిన చిరుతిల్లు సింహ భాగం ఆమె సుందర్‌కే ఇచ్చేది.

అయినా సరే సుందర్‌కి తిండి యావ ఎక్కువగా ఉండడం వలన, తన హస్తలాఘవం చూపి, అమ్మమ్మని ఏమార్చి తాళాన్ని సాధించి ఇంకొన్ని కొట్టేసేవాడు. తిట్లూ కాసేవాడు.

ఇంతకు ముందు చాలా సార్లు తాతగారింటికి వెళ్లినప్పుడు ఆ పెట్టెను చూసేవాడు. దాని జాగ్రత్తగా ఓ మూల పెట్టి వాడుతూ ఉండేవారు. కానీ ఈసారి వెళ్లినప్పుడు దాన్ని ఆరు బయట ఎండలో చూసాడు. తెరిచి చూసాడు, అందులో అదే జాడీ, తనకు అమ్మమ్మ పలుకరించనట్టనిపించింది. కళ్లు సజలమయ్యాయి. ఆశ్చర్యం! పక్కనే తాతగారి చేతి వ్రాతతో కొన్ని పాడైపోవడానికి దగ్గరగా ఉన్న కాగితాలు, అవి చూసిన తరువాత తన కల సాకారమైనట్టిపించింది సుందర్‌కి.

బహుశా పెట్టె పాడయిందేమో లేక ఆధునిక వస్తువుల పేర్పులో అది అడ్డమనిపించిందేమో ఇలా పడేసారు అనుకుని, వాళ్లు ఎలాగూ వాడటం లేదు కనుక ,దాన్ని బాగుచేయించి అమ్మమ్మ జ్ఞాపకంగా పదిలపరుచుకుందామని తలంపుతో తన కిచ్చేయమని అడిగాడు. వారు ముందు ఆశ్చర్య పోయినా, సరే తీసుకోమని చెప్పారు.

దాన్ని కారులో ఎక్కించుకుని అమ్మమ్మ తాతయ్యలు పంచిన షరతులులేని ప్రేమను తలచుకుంటూ తిరుగు ప్రయాణమయ్యాడు సుందర్.

సహజంగానే రచయిత అయిన సుందర్ తనలో కలిగే స్పందనలను వెంటనే రాసుకునే అలవాటుండటం వలన, కారు ఓ పక్కన ఆపి తన మొబైల్లో నోట్ పాడ్ తెరిచి ఇలా రాసుకున్నాడు.

“కొన్ని జ్ఞాపకాలు పుట్టుమచ్చల్లా
మరికొన్ని నడుమనొచ్చిన పచ్చబొట్టుల్లా
హృదయాంతరాలలో పక్షుల్లా
మనసు పొరలలో ఎగిసే అలల్లా
తనువు కరిగిపోయేంత వరకూ
మనసు మాయమయేంత వరకూ
అవి అంటి పెట్టుకునే ఉంటాయి
చివరంటా పలకరిస్తూనే ఉంటాయి.!!!”

“నన్నెప్పుడూ అంటిపెట్టుకని ఉన్న ఆ మాతామహుల జ్ఞాపకాలు ఆ పాత పెట్టెలో దొరకడం, నాకైతే ఓ నిధిని కొట్టేసినంత ఆనందంగా ఉంది. నా ఈ మధుర జ్ఞాపకాలను ఓ కథగా అక్షరబద్ధం చేస్తాను, కథకి ‘జ్ఞాపకాల పెట్టె’ అని పేరు పెట్టి ఆ కథను నా మాతామహులకు అంకితమిస్తాను” అని టైప్ చేసి మొబైల్ పక్కన పెట్టి తన గమ్యం వైపు కారుని పోనిస్తున్నాడు, డిక్కీనిండా నింపిన జ్ఞాపకాల బరువుతో..!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here