వ్యామోహం-20

0
3

[శ్రీ వరిగొండ కాంతారావు రచించిన ‘వ్యామోహం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఒకరోజు ఆసుపత్రిలో డాక్టర్సాబ్ ఒక్కరే ఉన్న సమయంలో వీరలక్ష్మి వస్తుంది. ఆమె రాకని ఊహించని డాక్టర్సాబ్ విస్తుపోతాడు. తన సంగతులన్నీ చెప్పుకుని బాధపడుతుంది వీరలక్ష్మి. తమ సంగతి తెలిసిపోయాకా, బాల్రెడ్డి పటేల్ తనని చితకబాదాడనీ, డాక్టర్సాబ్ చంపుతాననీ అన్నాడనీ అంటుంది. జింక పిల్లని చంపించి తన చేతనే వండించాడనీ, దాని మాంసం బలవంతంగా తినిపించాడనీ చెప్తుంది. ఆ ఊర్లో ఉండలేక ఇక్కడికి వచ్చాననీ, నెలరోజుల తర్వాత డాక్టర్సాబ్ దవాఖానా తెలిస్తే వచ్చానని చెప్తుంది. ఆమె జోడెద్దుల పాలెంలో ఉండడమే అందరికీ మంచిదని నచ్చజెప్తాడు డాక్టర్సాబ్. తమ్ముడు, మరదలితో మాట్లాడి నిర్ణయం తీసుకోమంటాడు. సరేనని బయల్దేరుతుంది వీరలక్ష్మి. ఇక చదవండి.]

[dropcap]మూ[/dropcap]డవ రోజున అదే సమయానికి వచ్చింది వీరలక్ష్మి. ఈసారి ఉపోద్ఘాతాలేమీలేవు.

“రేప్పొద్దుగాల ఐదుగంటల ప్యాసెంజరుకు జోడెడ్లపాలెం పోతున్న” చెప్పింది వీరలక్ష్మి.

“సంతోషం. వెంట మీ తమ్ముడొస్తున్నాడా!”

“లేదు మా తమ్మునికి గని, మరదలుకు గని నేనక్కడికి వాపసుపోవుడిష్టం లేదు. నాక్కూడ పూర్తిగ ఇష్టం లేదు.”

“మరెందుకు పోవడం. ఇక్కడే ఉండొచ్చుగా!”

“నువు పొమ్మన్నవు కద డాక్సర్సాబ్!”

నవ్వొచ్చింది డాక్టరు గారికి. “నేను చెప్పింది సలహా మాత్రమే. నీ జీవితం. నీ ఇష్టం. నీవు తీసుకున్న నిర్ణయాల ప్రకారం నీవు నడవాలి. ఎవరో ఏదో చెప్పారని కాదు.”

“అట్లనా! నువ్వేదో నిజంగనె పొమ్మన్నవనుకున్న.”

“నేను నిజంగానే పొమ్మన్నాను. ఆలోచించుకొని పొమ్మన్నాను.” స్పష్టంగా చెప్పాడు డాక్టరు గారు.

“అందుకే కద పోతున్న నా కోసం నీకంటె ఎక్కువ సోచాయించెటోల్లెవరున్నరు చెప్పు.”

“వీరలక్ష్మీ నీ ఆలోచనలో ఏదో అయోమయమున్నది.”

“అయోమయం లేదు డాక్సర్సాబ్. పొవాన్ననె అనుకుంటున్న. పోతున్న, దైర్నెం చాల్తలేదు. దైర్నెం చాలకుంటె బిజిగిరి షరీఫ్ దాటంగనె మానేరస్తది కద. దాన్లా దూకుత. అది కూడ నిర్ణయం చేసుకున్న” నిశ్చలంగా చెప్పింది వీరలక్ష్మి.

“ఇదేమి నిర్ణయం. ఆగిపో!”

“ఆగజాల. పోజాల. దైర్నెం సరిపోతె జోడెడ్లపాలెం పోత. బాల్రెడ్డి పటేలు ఎన్కటి లెక్కనె ప్రేమతోని ఉంచుకుంటడా లేకుంటే కొట్టి సంపుతడా పోతె గని తెల్వది. దైర్నెం సరిపోకుంటె మానేరుతల్లి ఉండనే ఉన్నది” నిర్వేదంగా చెప్పింది వీరలక్ష్మి.

“ఈ మనస్థితిలో ఒంటరి ప్రయాణం మంచిది కాదు. ఆగిపో! ఇక్కడే మీ తమ్ముడు, మరదలుతో ఉండిపో.”

“అట్లనే నయ్య! పొమ్మని నువ్వె చెప్పినవు. ఇప్పుడు వద్దని కూడ నువ్వె చెప్తున్నవు. రేపు మబ్బుల రైలుయాల్లకు ఏ మాట పన్జేస్తె ఆ మాట నమలుచేస్త. ఉంటె మల్లస్త” అంటూ లేచి బయటకు నడిచింది వీరలక్ష్మి.

“వీరలక్ష్మీ” ఏంటన్నట్లు వెనక్కు చూచింది. “నీకంతా మంచే జరుగుతుంది” చెప్పాడు డాక్టరు గారు. సంతోషంతో ముందుకడుగేసింది వీరలక్ష్మి.

***

తెల్లవారగట్ల నాలుగున్నరకల్లా కాజీపేట స్టేషన్లో ఉన్నాడు డాక్టరు గారు. మూడు పెట్టెలు వెతికాక నాలుగో పెట్టెలో కనపడింది వీరలక్ష్మి. ఒంటరిసీట్లో కాకుండా పొడవాటి సీట్లో కూర్చుంది. రైలు పెద్ద రష్‌గా లేదు. నవ్వింది వీరలక్ష్మి. బదులుగా నవ్వాడు డాక్టరు గారు. డాక్టరుగారాశించిన ఆశ్చర్యం వీరలక్ష్మి మొహంలో కనపడలేదు. ‘అనుకున్నది సాధించడంలో స్త్రీలది అందెవేసిన చెయ్యి’ మనసులోనే అనుకున్నాడు డాక్టరు గారు.

రైలు కూత వేసేప్పటికి దాదాపుగా సీట్లన్నీ నిండిపోయాయి. క్రమేణా వెలుగులు పరచుకొంటున్నాయి. వెంట తెచ్చుకున్న పుస్తకం చదవడంలో లీనమై పోయాడు డాక్టరు గారు. అయినా మధ్య మధ్య వీరలక్ష్మిని గమనించడం మానలేదు. తొమ్మిదిన్నరకు రైలు మొలకలగూడెం చేరుకుంది. ఇద్దరూ రైలు దిగారు. రైలు వెళ్ళిపోయింది.

“వీరలక్ష్మీ! పదిలంగ పొయిరా! నేనిక్కడ స్టేషన్లనె వుంట. సాయంత్రం నాలుగొట్టె దాన్క కాజీపేటకు బండి లేదు. నేనా బండికి పోత” చెప్పాడు డాక్టరు గారు. తలూపి వెళ్ళిపోయింది వీరలక్ష్మి.

స్టేషన్ మాస్టర్ ఆఫీసు వేపు అడుగువేశాడు డాక్టరు గారు. ఎదురుపడ్డ ఆఫీసు ప్యూను, పాయింట్స్‌మన్ పలుకరించారు. స్టేషన్ మాస్టరు మల్లికార్జునరావు ఆప్యాయంగా పలుకరించాడు డాక్టరు గారిని. మల్లికార్జునరావు స్వస్థలం సత్తుపల్లి. డాక్టరు గారిది అశ్వారావుపేట. రెండు గ్రామాల మధ్య దూరం పాతిక ముప్ఫై మైళ్ళలోపే. రెండు గ్రామాలు ఖమ్మం జిల్లాలోనివే. ఈ కారణంగా వారిద్దరి మధ్యన ఆత్మీయత సుగమమైంది. మాట్లాడుకోవడానికి చాలా విషయాలున్నాయి.

రోజు మొత్తంలో బలార్షా వైపు వెళ్ళే రైళ్ళు రెండు, కాజిపేట వేపు వెళ్ళే రైళ్ళు రెండు మాత్రమే ఆగుతాయా స్టేషన్లో. వచ్చిపోయే గూడ్సు రైళ్ళకి, అక్కడ ఆగని ఎక్స్‌ప్రెస్ రైళ్ళకి సిగ్నల్స్ ఇవ్వడం తప్ప పెద్దగా పనిలేని స్టేషనది.

స్టేషన్ పక్కనే స్టేషన్ మాస్టరు గారి క్వార్టర్సు. ఇల్లాలు పురిటికెళ్ళిన కారణంగా ఒక్కడే వుంటున్నాడు. ప్యూన్ వంట చేసి పెడతాడు. టిఫిన్లు, భోజనాలు స్టేషన్ మాస్టరు గారింట్లోనే కానిచ్చి నాలుగ్గంటలకి కాజీపేట రైలెక్కాడు డాక్టరు గారు. కాజీపేట చేరేసరికి ఏడున్నర. ‘అమ్మయ్యా! ఒక పని నెరవేరింది’ అనుకుంటూ నాలుగడుగులు వేశాడో లేదో “నమస్కారమయ్య!” అంటూ వినపడింది కుడిపక్కగా. తల తప్పిచూశాడు. వీరలక్ష్మి. “అదేమిటి?” నివ్వెరపోయాడు డాక్టరు గారు.

“సమ్మక్క వాల్లింటికి పొయిన. బుక్కెడంత తిన్న. ఉండబుద్దికాలే. వాపసచ్చిన”

ఏమనాలో తోచలేదు డాక్టరు గారికి.

“కరీంబాదోల్లు కలిసిన్రు బాంచెను. ఇంకర్ధ గంటల వరంగల్లుకు రైలున్నది. వాల్లతోని కలిసి పోత” నమస్కరించి దూరంగా వెళ్ళిపోయింది వీరలక్ష్మి.

తను సాధించిందేమిటో బోధపడని డాక్టరు గారి కారాత్రి నిద్ర లేదు.

***

డాక్టరు గారి దగ్గర ఒక విశేషమైన గుణముంది. ఏ విషయాన్ని గురించైనా తీవ్రంగా ఆలోచిస్తారు. పరిష్కారాలను కనుగొంటారు. సూచిస్తారు. తానాచరింపవలసినవైతే మారుమాటాడకుండా ఆచరిస్తారు. తన చేతిలో లేని విషయాలను గురించి పట్టించుకోరు. అలాగే తానిచ్చిన సలహాలను అవతలివారు పాటిస్తారా లేదా అన్నది ఆయనకు అనవసరం. సలహాలను పాటించిన వారిపట్ల ఎలా వుంటారో పాటించని వారి పట్ల కూడా ఆయన ప్రవర్తన అలాగే వుంటుంది. ఈ కారణంగా ఆయన మరచిపోదగిన విషయాలను తేలిగ్గా మరచిపోగలరు. మూడో రోజుకల్లా ఆయన వీరలక్ష్మి సమస్యను మరచిపోయి తన పనిలో తాను పడిపోయాడు.

మందులన్నీ అయిపోవచ్చాయి. ఇన్నాళ్ళూ బద్ధకించి ఊరుకున్నాడు. పోక తప్పనిసరి అయింది. హోమియో మందుల కొనుగోలు అంటే అందుబాటులో ఉండేది వరంగల్లు పాపయ్యపేట చమన్ లోని చంద్రా హోమియో స్టోర్సు మాత్రమే. హైదరాబాదులో రామకృష్ణ హోమియో హాలు, సాగర్ హోమియో స్టోర్సులకు ఎంత చరిత్ర ఉందో, చంద్రా హోమియో స్టోర్సుకు కూడ అంత చరిత్ర వుందన్నమాట.

ఉదయం పదకొండున్నరకల్లా మందుల కొనుగోలు పూర్తి చేసుకొన్నాడు. భోంచేసి బయల్దేరాడు కాబట్టి ఆకలి బాధ లేదు. ‘ఎలాగూ ఇంతదూరం వచ్చాను కదా! ఓ అడుగు కృష్ణమాచారి ఇంటికి వేద్దాం. కలసి చాన్నాళ్ళయింది’ అనుకుని డా॥ కృష్ణమాచారింటికి బయల్దేరాడు. చమన్ నుండి బొడ్రాయికి వెళ్ళేదారిలో బొడ్రాయికి నాలుగడుగుల ఇవతల వుంటుంది కృష్ణమాచారిల్లు. ఎండ కారణంగా జన సంచారం అంతగా లేదు. అప్పుడో సైకిలు ఇప్పుడో సైకిలు అన్నట్లుగానే వుంది సంచారం. అల్లంత దూరంలో కృష్ణమాచారిల్లు కనిపిస్తుంటే సైకిలు తొక్కుతున్నాడు డాక్టరు గారు. ఎవరో ఆడమనిషి వీధి గుమ్మంలో నుంచుని ఐస్‌ఫ్రూట్ కొనుక్కొంటోంది. వాడు డబ్బాలోంచి ఐస్‌ఫ్రూట్‌ని ఆమె చేతికందిస్తున్నాడు. డాక్టరు గారి దృష్టంతా రోడ్డు మీద వుంది. కనుకొలుకుల్లోంచి కనబడిన దృశ్యమిది. ఐస్‌ఫ్రూట్ కొనుక్కుంటున్న ఆడమనిషి ఒక్కసారిగా అరిచింది “డాక్సర్సాబ్, డాక్సర్సాబ్!” అని.

డాక్టరు గారు ఉలిక్కిపడి సైకిలాపుకుని అరుపు వచ్చిన వైపు చూశాడు. వీరలక్ష్మి దాదాపుగా పరుగెత్తుకుంటూ వచ్చింది. “రా డాక్సర్సాబ్! ఇదే మా ఇల్లు. చూసిపోదువు” అంది.

“మరోసారి వస్తాలే!” అన్నాడు డాక్టరు గారు.

“నువు మల్ల రావు నాకెర్కనే గని. వచ్చి ఐదు నిమిషాలు కూకుండిపో. చాలు.” అని బలవంతపెట్టింది. డాక్టరు గారికి తప్పలేదు. మూడు గదుల ఇల్లులా ఉంది. ముందు గదిలో కుట్టుమిషను. స్టూలు. రెండు గోద్రేజ్ స్టీలు మడత కుర్చీలు వున్నాయి. అప్పుడప్పుడే వస్తున్నాయి ఆ కుర్చీలు. ఒక కుర్చీవేసి కూచోమంది డాక్టరు గార్ని.

“ఐస్‌ఫ్రూట్ కొనుక్కున్నావుగా తిను” అన్నాడు డాక్టరు గారు.

“లేదయ్య! గిలాసల పెట్టిన. కరిగిపోతది గద. నీల్లు తాగుత. నువ్వెప్పుడు రావు కద.”

“ఇదేమిటి ఇక్కడున్నావు. మీ పుట్టిల్లు కరీమాబాదు కద!”

“కరీమబాదనే. జోడెడ్లపాలెం నుంచి అక్కడికె పొయిన. తమ్ముడుండుమన్నడు. మరదలు సైసలే. నేను చెడిపోయిందాన్ని కద. నన్ను చూసి దాని పిల్లలు చెడిపోతరని భయం దానికి. తమ్ముడే ఈ ఇల్లు చూసిండు. కిరాయ వాడె గడ్తడు. ఇల్లుగలాయన మావోని దోస్తె. కుట్టుమిషను, ఈ కుర్చీలు, మంచం, పక్కబట్టలు, వంట సామాను కాడికెల్లి వాడే కొనిచ్చిండు. ఇప్పటికైతె వాడె నడుపుతుండు నన్ను. కుట్టు పని ఇప్పుడిప్పుడే మొదలైంది. పనికొద్దిగ జోరుకస్తె నా బువ్వ నేనె తింట.” తన కథను క్లుప్తంగా చెప్పింది వీరలక్ష్మి.

“జోడెడ్లపాలెంలో కుట్టుమిషను?” అడిగాడు డాక్టరు గారు.

“కుట్టుమిషను, వంటసామాన్లు, ఇంటి సామాన్లు అన్ని సమ్మక్కకె ఇచ్చిన. ఇంటి జాగ మొత్తమ్మాదె. నువు జూస్తివి గద. గుడిసె మా అత్తమామలు కట్టిచ్చింది. గూన పెంకల ఇల్లు పటేలు గట్టిచ్చిండు. నా కొఱకని అందరనుకుంటరుగని తన సుకం కొఱకు కట్టించుకున్నడని నేననుకుంట. మాకు ఒక్క బర్రె వుంటుండె. ఇప్పుడు నాలుగు బర్రెలు, రెండు దున్నపోతులు, రెండెడ్లు, ఒక ఆవు, ఒక కోల్యాగ వున్నయి. అయన్ని పటేలిచ్చినయె. ఆయన అన్నిచ్చిండాగని నా చేతిల పెంపయినయి. ఇల్లు తాలం బెట్టిన. తెల్లారి మర్నాడు పటేలుకియ్యుమని తాలపు చెయ్యిని సుంకరి సాంబయ్యకిచ్చిన. ‘తల్లిగారింటికి బోతున్న ఆడనె బతుకుత. వాపసచ్చెడ్డిలేదని పటేలుకు చెప్పు’మన్న. ఇది జరిగింది.

మొన్న జోడెడ్లపాలెం బోలె. మొలకలగూడెంలనె మా మ్యానత్త బిడ్డ వుంటది. అక్కన్నె బుక్కెడంత తిని వున్న. నీ కంట్లో బడకుంట కాజిపేటకచ్చిన. దిగినంక నిన్ను కలిసిన. పాలెం పోబుద్దికాలే. నేన్చేసింది తప్పో ఒప్పో నాకె తెలువది.

ఊరంతకు నేను అక్కనొ, చెల్లెనా, బిడ్డనా. ఇప్పుడా పరిస్థితి లేదు. నన్ను తేరిపార చూసెటోల్లెక్కువైను. అది నేను భరింపజాల. సుంకరోల్లెదురుంగ తాకరాని తావుల నన్ను తన్నినంక నాకు పతేర యాడుంటది చెప్పయ్య” దుఃఖం తన్నుకొస్తోంది. దాన్ని అధిగమించే యత్నంలో ఆగిపోయింది వీరలక్ష్మి.

మౌనంగా వింటున్న డాక్టరు గారు వీరలక్ష్మి చెప్పడమాగిపోయినా మౌనంగానే వుండిపోయాడు.

కొద్ది సేపటికి తేరుకుంది వీరలక్ష్మి. “అయ్య! ఎంతసేపు చెప్పిన నాకత ఇట్లనె వుంటది గని కొద్దిగంత చాయ చేసిస్త తాగిపోదువు.”

“వద్దు వీరలక్ష్మీ!”

“వద్దంటే కలువదయ్య. తాగిపోన్రి గంతె. అంతకెక్కువ మీనుంచి నేనేమి కోరుకుంటలేను. కోరుకోను గూడ. సంబంధం బందని మొన్ననే చెప్తిరి కద!” నిష్ఠూరంగా అంది వీరలక్ష్మి.

“సరే! టీ పెట్టు.” రాజీపడ్డాడు డాక్టరు గారు.

డాక్టరు గారు టీ తాగుతున్నంత సేపు జోడెడ్లపాలెం విషయాలను చెప్తూనే పోయింది వీరలక్ష్మి. “అయ్యొ! తినెటియాలకు చాయిచ్చిన. అన్నం తిన్నవా డాక్సర్సాబ్!”

“తినే బయల్దేరాను. బాధలేదు” జవాబిచ్చాడు డాక్టరు గారు.

“నాకు బాధనె డాక్సర్సాబ్. నువు బందును బందు వెట్టెదన్క నాకు బాధనె.” ఈ మాటలంటుంటే వీరలక్ష్మి కళ్ళల్లో వింత మెరుపు కనిపించింది డాక్టరు గారికి.

“కొత్తగ ఆశలు పెట్టుకోకు. బందంటె బందె” స్థిరంగా చెప్పాడు డాక్టరు గారు.

“అయితాయె తియి. నేనైతె బతుకున్నన్ని దినాలు ఆశపడ్తానె ఉంట.” జవాబిచ్చింది వీరలక్ష్మి.

బయల్దేరడానికి లేచాడు డాక్టరు గారు. ఇంటి మెట్లు దిగి రోడ్డు మీద వున్న సైకిలు హ్యాండిల్‍కు మందుల సంచీని తగిలించుకుని స్టాండు తీస్తున్నాడు. ఆయన్ని సాగనంపడానికి వచ్చి గుమ్మం బయట మెట్ల మీద నిలబడింది వీరలక్ష్మి.

ఉన్నట్టుండి నలుగురు వ్యక్తులు ఎక్కడి నుండి ఊడిపడ్డారో తెలీదు. కన్ను మూసి తెరిచే లోపు బాణాకర్రలతో డాక్టరు గారి మీద దాడిచేశారు. మొదటి దెబ్బ వెనుక నుండి తల మీద పడడంతో తూలి ముందుకు పడిపోయాడు డాక్టరు గారు. ఆయన మీద సైకిలు పడింది. వాళ్ళు కర్రలతో బాదుతునే ఉన్నారు. సైకిలు ఆయనకు కవచంలా పనిచేస్తున్నది. ఆయన బాధతో పెడ్తున్న కేకలకు, వీరలక్ష్మి అరుపులకు చుట్టు పక్కల ఇళ్ళవాళ్ళు తలుపులు తీసుకుని బయటకు వచ్చారు. జనాన్ని చూసిన నలుగురు ఎలా వచ్చారో అలానే మాయమయ్యారు. ఇదంతా మూడు నాలుగు నిమిషాల వ్యవహారం. జనానికేమీ అర్థం కాలేదు.

“ఈనెది మా ఊరె. డాక్సర్సాబ్. నేనయిస్ప్రూట్ కొనుక్కుంటున్న. ఏదో పనిమీద పోతుండట. కనపడ్డడు. పిలిచిన. చాయ తాగిపొమ్మంటె లోపటికచ్చిండు. చాయ తాగి బయలెల్తుండు. సైకిలు స్టాండు తీస్తుండు. ఎక్కన్నించచ్చిన్రి తెలువది. ఫటఫట కొట్టిన్రు. మాయమయిన్రు. ఆయనకు మా ఊల్లెనె పగోల్లు లేరు. పగోడంటెనె ఆయనకు తెలువది. అసొంటిది ఇక్కడ ఎవ్వరెర్కలేని జాగల ఇట్లచ్చి మీద పడ్డరు” దుఃఖపడుతూ చెప్పింది వీరలక్ష్మి.

మగ ఆడ కలసి పదిమంది దాకా పోగయ్యారు. “కత సంగతి అటెన్కగని ముందుగాల మనిషినైతె లేపున్రి” అంటూ కర్తవ్యాన్ని గుర్తుచేశాడొక పెద్దాయన. గుంపులో నలుగురు యువకులు కూడా ఉన్నారు. ఒకతను సైకిలు లేపి నిలబెట్టాడు. ఇద్దరు యువకులు డాక్టరు గారి చెరో రెక్కా పట్టుకొని నిలబెట్టారు. వీరలక్ష్మి గబగబా ఇంట్లోకి పరుగెత్తుకెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చింది. డాక్టరుగారి మొహమ్మిద కొన్ని నీళ్ళు కొట్టారు. కాస్త తెప్పరిల్లాడాయన. మంచినీళ్ళు తాగించారు. మొహమంతా డోక్కుపోయింది. కాళ్ళ మీద వీపు మీద పడ్డ దెబ్బలకు బట్టలు చిరిగిపోయాయి. తలవెనుక భాగం చిట్లిపోయి కొద్దిగా రక్తం స్రవించి ఆగిపోయింది.

“తిరుమల్రావు డాక్టరిల్లు ఇక్కణ్ణే కద. తీస్కపోదాం నడువున్రి” ఇందాకటి పెద్దాయనే అన్నాడు.

డాక్టరు గారు నడవలేకపోతున్నాడు. ఇద్దరు యువకులు భుజాల మీదకెత్తుకున్నారు. వాళ్ళ భుజాలనాసరాగా చేసుకొని అతికష్టమ్మీద అడుగుతీసి అడుగు వేస్తున్నాడాయన. ఆడవాళ్ళు ఇళ్ళల్లోకి వెళ్ళిపోయారు. మరో నలుగురు వ్యక్తులు పక్కన నడుస్తూ వస్తున్నారు సాయంగా. అందరూ డాక్టర్ తిరుమల్రావు ఆసుపత్రికి చేరుకున్నారు. క్లినిక్ మూసేసి వుంది. “అరె! దవాఖాన బందున్నది” అన్నారొకరు.

“డాక్టర్సాబ్ ఇల్లు కూడ ఇదే. గొల్లెంగొట్టి పిలువున్రి. తలుపు తీస్తడు” అన్నాడు పెద్దాయన. ఈలోగా ఇంటికి తాళం పెట్టి అక్కడకు చేరుకొంది వీరలక్ష్మి.

డాక్టరు తిరుమల్రావు తలుపు తీశాడు. పేషెంటును చూశాడు. వచ్చినవాళ్ళు చెప్పింది విన్నాడు. తలకు తగిలిన గాయాన్ని చూశాడు. స్పిరిట్‌తో కడిగి బెంజాయిన్ వేసి కట్టుగట్టాడు. మొహానికి తగిలిన గాయాలను కడిగి ఆయింటుమెంటు పూశాడు. ఒళ్ళంతా తగిన గాయాలను పరిశీలించాడు. ఎముకలేవీ విరుగలేదని నిర్ధారించాడు. ముంగాళ్ళు, పాదాలపైభాగం గీరుకుపోయి గాయాలయ్యాయి. వాటికి ఐయోడిన్ రాశాడు. నొప్పులు తగ్గడానికికొక ఇంజెక్షన్, ధనుర్వాతం రాకుండా ఉండేందుకొక ఇంజెక్షన్ ఇచ్చాడు. అంతవరకు అందరూ మౌనంగా ఉన్నారు. డాక్టరు గారు తేరుకున్నారు.

వచ్చిన వాళ్ళలో ఒకడన్నాడు “అన్నా! ఈనె శేఖరన్న లెక్క వున్నడే!”

“ఓహో! ఇప్పుడర్థమైంది. వాల్లెందుక్కొట్టిన్రో. శేఖరన్న గుట్ట కింద గ్యాంగు లీడరు. మన పాపన్నపేట దాదా బాబూరావును వాల్లోసారి కొట్టిన్రు. ఇప్పుడొక్కడు ఒంటరిగ దొరికిండనుకోని పాపం ఈనెను కొట్టిన్రు. సైకిలు ఈనె మీద పడుడుతోటి బచాయించిండు. ఆ దెబ్బలు సైకిలు మీద గాక ఈనె మీదనె పడుంటే గాంధీ దవాఖానకు పోతే కూడ నమ్మిక లేకుంటుండెగావచ్చు” మరో మధ్య వయస్కుడన్నాడు.

“ఇంతకు మీరెవరండి” అడిగాడు డాక్టర్ తిరుమల్రావు లోపల్నించి తెచ్చిన మంచినీళ్ళనందిస్తూ. గ్లాసెడు నీళ్ళనూ గటగటా తాగేసి రెండు నిమిషాలు మౌనంగా ఉండి చెప్పాడు డాక్టరు గారు.

“నేను హోమియో ప్రాక్టీషనర్‍ను. లష్కర్ బజార్ల నా క్లినిక్ ఉన్నది. మందుల కొఱకు చంద్రా హోమియో స్టోర్సుకొచ్చిన. మందులు కొనుక్కున్న. ఈ బొడ్రాయి దగ్గర ఉంటడు డాక్టర్ కృష్ణమాచారి. నా చిన్ననాటి స్నేహితుడు. కొద్ది సేపాయనింట్ల వుండి చల్లబడ్డంక హనుమకొండకు పోతననుకున్న. లోగడ జోడెడ్లపాలెంల నా ప్రాక్టీసుండె. అక్కడ ఇగో ఈ వీరలక్ష్మి నా పేషెంటు. ఆమె ఇల్లు ఇక్కడేనట. నాకు తెలువదు. నేను కృష్ణమాచారింటికని సైకిలు మీద పోతున్న. వీరలక్ష్మి గల్మల నిలబడి వున్నదట. నేనూడలే. నన్ను చూసి గుర్తుపట్టి పిల్చింది. ఆగిన. ఇంట్లకచ్చి చా తాగి పొమ్మన్నది. చా తాగి బయటికచ్చిన. సైకిలు స్టాండు తీస్తున్న. నాకంతవరకె తెలుసు. మల్ల వీల్లు లేబడ్తుంటెనె తెలివిబడ్డది.” వివరంగా చెప్పాడు డాక్టరు గారు.

ఈలోగా చాయలొచ్చినయి అందరికి. “చాయలెక్కడియోయ్” అడిగాడు డాక్టర్ తిరుమల్రావు.

“మేమె తెచ్చినం. కరీం హోటల్నుంచి” వచ్చిన వాళ్ళు చెప్పారు. అందరూ టీలు తాగారు. “ఇప్పుడెటు పోతరు” అడిగాడు డాక్టరు తిరుమల్రావు.

“కృష్ణమాచారింటికి పోయి, కొద్దిగ సేదతీరినంక ఇంటికి పోత” జవాబిచ్చాడు డాక్టరు గారు.

“మీకు తెలువనట్టున్నది. కృష్ణమాచారి మేనమామ చనిపోయిండు. నిన్ననే అందరు ఇల్లు తాళంబెట్టి ఏలూరుకు పొయిన్రు. పదిరోజుల వరకు రారు. ఇంటిదాక వచ్చి చెప్పిపొయిండు. ఒకే వృత్తి కద. నాగ్గూడ మంచి స్నేహితుడే. ఆపద సంపద అన్నట్టు” చెప్పాడు తిరుమల్రావు.

“అయ్యో! అట్లనా! సరె నేను ఇంటికి పోత. మీ ఫీజు” అన్నాడు జేబులో చెయ్యి పెడ్తూ.

“ఫీజా ఇంకేమన్ననా! మీరు డాక్టరు. అండ్ల మా కృష్ణమాచారి చిన్ననాటి స్నేహితుణ్ణంటున్నరు. మీ దగ్గర పైసల్దీసుకుంటనా!” అన్నాడు వారిస్తూ తిరుమల్రావు.

“ఎట్ల పోతరు?” మళ్ళీ తనే అడిగాడు.

“సైకిలు మీదనె.”

“వద్దు నా మాట వినుండ్రి. రెండు మూడు రోజులు విశ్రాంతిగుండున్రి. మీ తల మీద పడ్డ దెబ్బ అల్కగ పడ్డది. అదే బలంగ పడుంటే పరిస్థితి ఎట్లుంటుండెనొ తెలువది. దేవుడు మీ దిక్కున్నడు. రిక్షాల గని, జట్కాల గని పొండ్రి” చెప్పాడు తిరుమల్రావు. “సైకిలు నడిచెటట్టు లేదు. ఫోర్కు వంగిపోయింది. రిమ్ము బెండయింది” సైకిలు నిలబెట్టిన యువకుడన్నాడు.

“మంచిదండి వస్తాను” లేచి నిల్చున్నాడు డాక్టరు గారు. లేవడంలో కొంత ప్రయాస ఏర్పడింది. డాక్టరు తిరుమల్రావు ముందుకు వచ్చి చొక్కా ఎత్తి వెన్నెముకను పరీక్షించాడు. కాళ్ళు జాడిచ్చమన్నాడు. మోకాళ్ళను నొక్కి చూచాడు. “ఎముకలేమి విరుగ లేదుగని, దెబ్బలు బలంగనే తాకినయి” అన్నాడు. తనే మళ్ళీ “కూర్చోండ్రి డాక్టర్సాబ్! ఎవలన్న ఒకలు చమను కాడికి పోయి జట్కాబండి తీసుకరాన్రి” అంటూ పురమాయించాడు.

ఈలోగా ఇంటికి వెళ్ళి డాక్టరు గారి సైకిల్ను లోపల పెట్టించి ఆయన మందుల సంచితో వచ్చింది వీరలక్ష్మి. జట్కా వచ్చింది. ఇద్దరు యువకులు, వీరలక్ష్మి, డాక్టరు గారు జట్కానెక్కారు. జట్కాబండి వరకు వచ్చి వీడ్కోలు చెప్పారు డాక్టరు తిరుమల్రావు.

లష్కర్ బజారులో ఇంటిముందర ఆగింది జట్కా. సాయంత్రం నాలుగు కావస్తూంది. జట్కాలోంచి తలకు కట్టు, చిరిగిన బట్టలు ఒళ్ళంతా గాయాలతో దిగిన డాక్టరు గారిని చూచి ఇంటికి ఈ పక్కన ఆ పక్కన ఉన్నవాళ్ళు ఆదుర్దాగా వచ్చారు. డాక్టరు గారింట్లోకి వెళ్ళి ఆయన పడుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. వీరలక్ష్మీ, కూడా వచ్చిన యువకులు ఇలా అందరూ తలా ఒక చెయ్యి వేశారు.

“దెబ్బలెట్ల తాకినయి” అడిగారు వాళ్ళు.

“డాక్సర్సాబ్ సైకిలు మీద వస్తుండు. టక్కరైంది. మందులకొఱకు పాపయ్యపేటకు వచ్చిండట. మందుల్దీసుకోని వాపసస్తుండు. ఎవడో మోటార్ సైకిలోడు గుద్దిపోయిండు. ఆగలె. సరిగ్గ మా ఇంటి ముంగట్నే పెద్ద చప్పుడచ్చెటాల్లకు ఏందా అని దర్వాజ తెరువబెడుదును గద ఎదురుంగ ఈనె వున్నడు. నేను గుర్తుపట్టిన. ఎన్కట నేను ఈనె మందులు వాడిన. బీమారి కమ్మయింది. గుర్తుపట్టిన కాబట్కె మా ఇంటి దగ్గర్నె వున్న డాక్టరు దగ్గరకు కొంటబొయినం. ఏం పరవలేదన్నరు. ఇగో దించడానికీ ఇద్దరు తమ్ములచ్చిన్రు” వివరించింది వీరలక్ష్మి.

“అమ్మ, పిల్లలు లేనట్లున్నరు. ఒక్కడు ఎట్లనొ ఏమొ!” రందిపడింది వీరలక్ష్మి.

“మేం లేమా అక్కా! అన్నను మేమర్చుకుంటం తియ్యి. పిల్లలున్నరు గద. పిల్లలను పంపి ఏంగావాన్నో తెలుసుకుంటం. పొద్దుగూగుతె మా మొగోల్లెట్లైన వస్తరు” ఇంటికి అటు పక్కావిడా, ఇటు పక్కావిడా హామీనిచ్చారు వీరలక్ష్మికి.

మందుల సంచీని అప్పజెప్పి జాగ్రత్తలు చెప్పి విడువలేక విడువలేక వెళ్ళింది వీరలక్ష్మి. వచ్చిన జట్కాలోనే ముగ్గురూ వెళ్ళిపోయారు. ఆ యువకులకు మరీ మరీ కృతజ్ఞతలు చెప్పాడు డాక్టరు గారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here