అత్తింటిలో అమ్మతనం

0
3

[శ్రీ బివిడి ప్రసాదరావు రాసిన ‘అత్తింటిలో అమ్మతనం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]న్నపూర్ణ విస్తుపోయింది.

తన చెంత చేరిన కరుణని చూస్తూనే ఉంది.

శోభనం గది నుండి అర్థాంతరంగా వచ్చేసిన కరుణ చాలా ముభావంగా అగుపిస్తుంది.

తాము శోభనం గది తలుపు మూసి ఎంతో సమయం కాలేదు!

శోభనం గది తంతు సద్దుమణిగేక.. తను వంట గది పని సర్దుతుండగానే.. తన చేరువన చేరింది కరుణ.

“ఏంటమ్మా.” అన్నపూర్ణ తికమకలోనే ఉంది.

కరుణ స్తిమితం చెల్లాచెదురై ఉంది. అయోమయంగా అన్నపూర్ణని చూస్తోంది.

ఆ ఇద్దరూ అత్తాకోడళ్లు.

అన్నపూర్ణ కొడుకు రామారావు. రామారావు భార్య కరుణ.

ఈ ఇద్దరికి ఐదు రోజుల క్రితం పెళ్లైంది. వారికి ఈ రోజు శోభనం.

“ఇలా వచ్చేసావేంటి.” అన్నపూర్ణ ప్రశ్నించగలుగుతోంది.

“మా అమ్మ కోసం వచ్చేసాను. అమ్మ ఏదీ.” కరుణ మాట్లాడగలుగుతోంది.

తికమకలోనే, “పాపం మీ అమ్మ బాగా అలసిపోయింది. తనను పడుకోమని గది చూపాను. అక్కడ తను పడుకుంది.” చెప్పింది అన్నపూర్ణ.

“ఎక్కడ.. ఏ గది.” నంగిగా అడుగుతోంది కరుణ.

కోడలు బొంగురు గొంతును పసిగట్టి, “ఎందుకు. ఏమైందమ్మా.” అడగ్గలిగింది అన్నపూర్ణ.

కరుణ ఏమీ అనలేదు. బెదురు బెదురుగా కదిలింది.

“చెప్పు తల్లీ.” అనునయం చూపింది అన్నపూర్ణ.

కరుణ బేలతనం స్పష్టం కావడంతో, అన్నపూర్ణ తన కుడి అర చేతితో కరుణ కుడి భుజంని సున్నితంగా అదిమింది.

“మీ అమ్మకు చెప్పతలచింది నాకు చెప్పవచ్చు. చెప్పమ్మా.” అంది.

కరుణ తెములుకోలేక పోతోంది.

“నన్ను.. నీ తల్లి అనుకోవచ్చు. నిర్భీతిగా చెప్పమ్మా.” అన్నపూర్ణ అనునయిస్తూనే ఉంది.

కరుణ మెల్లిగా కుదురు కాగలుగుతోంది.

“మీరూ రండి. మీ ముందే మా అమ్మకు చెప్తాను.” చెప్పగలిగింది.

“అయ్యో. ఆవిడ పడుకుంది. పైగా తనను ఎందుకు హైరానా పర్చడం. నాతో చెప్పొచ్చు.” నిదానం వీడడం లేదు అన్నపూర్ణ.

కరుణ వెంటనే ఏమీ చెప్పలేక పోయినా, అన్నపూర్ణ నెమ్మదికి నిమ్మళమవ్వగలిగింది.

“మరేమో..”

“ఆగేవేం. చెప్పమ్మ.”

“మరే.. అతను.. మీ అబ్బాయి..”

“ఉఁ. చెప్పమ్మ.”

“తా.. తాగారు.”

అన్నపూర్ణ వెంటనే ఏమీ అనలేదు. కరుణ మాత్రం తననే చూస్తోందని గుర్తించింది. తల దించుకుంది.

“వాడు తాగుతాడని నాకు తెలుసు. అదీ అడపాతడపా. ఇప్పుడూ తాగాడా!”

“తాగారా కాదు. తాగుతున్నారు.”

సర్రున తలెత్తింది అన్నపూర్ణ.

“పైగా నన్నూ తాగమన్నారు. పోరుతున్నారు. తాగమంటున్నారు. తనకు థ్రిల్ కావాలట.” చెప్పేస్తోంది కరుణ.

అన్నపూర్ణ అవస్థలోకి జారిపోతోంది.

“ఎట్టా. ఏంటీ.” గడబిడవుతోంది.

కరుణ తదేకంగా అన్నపూర్ణనే చూస్తోంది.

అన్నపూర్ణ గమ్మున వంట గది నుండి బయటికి వచ్చేసింది. అయోమయంగా ఆ శోభనం గది వైపుకు చూస్తోంది. ఆ గది తలుపు బార్లా తీసి ఉంది. అందులోని రామారావు కానరావడం లేదు. మంచం ఆ గదిన మూలలో ఉంది.

తిరిగి అన్నపూర్ణ వంట గదిలోని కరుణ చెంతకు వచ్చి.. మెతకగా..

“తల్లీ.. ఇప్పుడు ఎట్టి రొచ్చు వద్దు. వాడు తాగిపడ్డాడో.. తాగుడులో మునిగాడో.. నిన్ను పట్టించుకున్నట్టు లేడు. రా. మనం ఈ రాత్రికి నా గదిలో పడుకుందాం. రేపు మాట్లాడదాం.” చెప్పింది.

కరుణకు ఏమీ పాలుపోడం లేదు.

వంట గదిలోని లైట్ ఆర్పేసి.. “రామ్మా.” కరుణను అక్కడ నుండి తీసుకుపోయింది అన్నపూర్ణ.

అలా తీసుకు పోతూనే.. “వద్దు. నా గదిలో వద్దు. మీ మామయ్య అందులో ఉన్నారు. మనం వేరే గదిలో పడుకుందాం. ఏం.” అంది. తను చాలా గింజుకుంది.

ఆ మరో గదిలో.. మంచం మీదకి.. ఆ ఇద్దరూ చేరేక..

“నువ్వు దిగులు అవ్వకు. అన్నీ సర్దుకుంటాయి. వాడి గురించి ఇంతలా అనుకోలేదు. వాడితో మాట్లాడతాను. అన్నీ సమసిపోయేలా నేను.. నేను చూస్తానుగా.” గుసగుసగా నచ్చ చెప్పుతుంది అన్నపూర్ణ.

కరుణకు చాలా చికాకుగా ఉంది.

“వాడు అప్పుడప్పుడు తాగుతాడని తెలుసు. కానీ వాడు ఎప్పుడూ ఇంట్లో తాగేది లేదు. మరి ఈ వేళ ఏమైందో.. వాడు భరితెగించినట్టే. నేను సహించను.” మాట్లాడుతోంది అన్నపూర్ణ.

కరుణ ఏమీ అనలేక పోతోంది. బెదిరిపోతోంది.

“నువ్వు బెంబేలు కాకు. ఏమీ కాకు. నేను నీకు ఉన్నాను. వాడిని సరి చేసి ఇస్తాను.” వత్తాసు పలుకుతోంది అన్నపూర్ణ.

కరుణ స్తిమితం కాలేకపోతోంది.

“మొదట్లో లేదు. ఉద్యోగంలో చేరేకనే వాడు తాగుడు వైపు మొగ్గేడు. స్నేహితుల సహవాసం, స్వయం సంపాదన ఆసరాలయ్యాయి. మీ మామ అడ్డు చెప్పింది, పట్టించుకొంది ఎన్నడూ లేదు. మెతక మనిషి. నేనూ పెద్దగా పట్టించుకోలేదు. తప్పే..” చెప్పుతోంది అన్నపూర్ణ.

కరుణ ఆలకిస్తోంది.

“నా కంట పడకుండా మేనేజ్ చేసేవాడే.. ఈ వేళ భళ్లున బయట పడ్డాడు. ఇక నేను ఊరుకోను. నీ కోసం నేను నిలుస్తాను.”  మాట్లాడుతూనే ఉంది అన్నపూర్ణ.

కరుణ కవుకు దెబ్బలు తగిలిన దానిలా అల్లాడిపోతోంది.

“వాడు తాగింది కాక.. నిన్ను.. నిన్ను తాగమంటాడా. చెప్పుతాను. చెడామడా చెంపలు వాయి కొడతాను. నీ కోసం వాడ్ని కనికరించను. మీ మామయ్యతో పని కాదు. నేనే నిబ్బరంగా పూనుకుంటాను.” అన్నపూర్ణ ఆగి ఆగి అంటూనే ఉంది.

కరుణ ఆలకిస్తూనే ఉంది.

“నీ స్థానంలో నా కూతురు ఉంటే.. అమ్మో.. లేదు లేదు. నువ్వు నా కోడలువి కాదు.. నా కూతురు సమానం. కూతురు అసౌకర్యం అమ్మ భరించలేదు.”  చెప్పుకుపోతోంది అన్నపూర్ణ.

వింటున్న కరుణ క్రమేపీ నిద్ర లోకి జారిపోయింది.

కొద్ది సేపటికి అది గుర్తించిన అన్నపూర్ణ మరింత  పట్టుకంబం మాదిరైంది. తనూ మెల్లిగా నిద్రపోగలిగింది.

తెల్లవారింది.

నిద్ర లేచిన అన్నపూర్ణ.. పక్కన కరుణ లేకపోయేసరికి ఇబ్బందయ్యింది.

మంచం దిగి ఎకాఎకీన కరుణ అమ్మగారికి కేటాయించిన గదికి వెళ్లింది.

అక్కడ ఆ తల్లీ కూతురులిద్దరూ కనిపించారు.

“నిద్ర లేచి వచ్చేసావా.” కరుణతో అంది అన్నపూర్ణ తడారిన గొంతుతో.

ఆ వెంబడే కరుణ తల్లి వైపు చూస్తోంది.

“వదినగారూ.. ఏమిటిలా. రాత్రే నన్ను లేపవలసింది.” అయోమయంలో ఉంది కరుణ తల్లి.

“ఏమీ కాదు వదినగారు. నన్ను నమ్మండి. కరుణ మీకెంతో ఇకపై నాకు అంతే. నాది హామీ. అన్ని చక్కదిద్దుతాను.” చెప్పింది అన్నపూర్ణ. అప్పటికే కరుణ తల్లి అర చేతులను తన చేతుల్లోకి తీసుకొని నిమురుతోంది.

“ఏమో. నాకు మాత్రం ఇలా కావడం చాలా ఆందోళనగా ఉంది. మీ అబ్బాయి గురించి దాచినట్టు..”

అంటున్న తల్లికి అడ్డై.. “అమ్మా. అత్తమ్మగారు కూడా సతమతమవుతున్నారు. ఆయన తీరు ఈ రీతిన ఉంటుందని తనకూ తెలియదు.” చెప్పింది కరుణ.

“అవును వదినగారు. నాకూ హైరానాగానే ఉంది. నాకు వదిలేయండి. నేను తప్పక మంచి చేసి చూపుతాను. మీరు దయచేసి కుదురవ్వండి. నన్ను నమ్మండి. యాగీలు వద్దు.” అన్నపూర్ణ వత్తాసు పలుకుతోంది.

కరుణ ఏమీ అనలేక పోతోంది.

కరుణ తల్లి.. “నా కూతురు బ్రతుకు..” అంటుండగా..

“లేదు వదినగారు.. కరుణ మన కూతురు. తనకు ఏమీ కానీయను. నాకు ఛాన్స్ ఇవ్వండి.” కలిగించుకుంది అన్నపూర్ణ.

కూతురును అయోమయంగా చూస్తోంది కరుణ తల్లి.

“నన్ను తీసుకు వెళ్లడానికి మీ నాన్న ఈ రోజు వస్తారు.” గజిబిజిగా అంటున్న తల్లితో..

“నువ్వు ఆందోళన పడకమ్మా.” అనగలిగింది కరుణ.

“వదినగారూ.. ఈ సంగతి మన ముగ్గురు మధ్యనే ఉంచుకుందాం. అన్నయ్యగారికి చెప్పకండి. నేను త్వరగానే చక్కదిద్దుతాను. మీరు నిశ్చింతగా వెళ్లండి.” చెప్పింది అన్నపూర్ణ.

ఆ వెంబడే.. “మీరే శంక పెట్టుకో వద్దు. కరుణ బాధ్యత నాది. మరో మారు కోరుకుంటున్నాను. నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి.” నిలకడగా మాట్లాడుతోంది అన్నపూర్ణ.

అంతలోనే హాలులో అలికిడిలు వినిపించాయి.

“పదండి. మనం నిదానంగా ఉందాం. వీలు వెంబడి నా దిద్దుబాటు పనులు నేను చేపట్టి ఈ అవస్థని మాపుతాను. దయచేసి సహకరించండి.” చెప్పింది అన్నపూర్ణ.

ఆ ఇద్దరూ వినుకున్నారు. ముగ్గురూ గది బయటికి వచ్చారు.

నిద్ర లేచి.. అన్నపూర్ణ భర్త హాలులో సోఫాలో కూర్చొని ఉన్నాడు.

అన్నపూర్ణ వంట గదిలోకి నడిచింది.

కరుణ, కరుణ తల్లి దంత క్షాళనకు సమాయత్తమగుతున్నారు.

రామారావు ఆలస్యంగా గది నుండి బయటికి వచ్చాడు. నంగిలా తచ్చాడుతూ.. ముఖ్యంగా అన్నపూర్ణని తప్పించుకు తిరుగుతూ.. ప్రతి సారిలా కాక.. ఈ మారు చాలా త్వరగా ఆఫీసు కంటూ ఇంటి నుండి బయటపడ్డాడు.

రామారావు తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి తొమ్మిది దాటేసింది.

మధ్యాహ్నం భోజనాల తర్వాత.. కరుణ తల్లి.. ఉదయమే వచ్చిన భర్తతో కలిసి తమ ఊరెళ్లిపోయింది. వెళ్తూ.. కరుణను పక్కకు పిలిచి ధైర్యం చెప్పగలిగింది. అంతకు ముందు అన్నపూర్ణ నుండి నికరమైన హామీ కోరి తీసుకుంది.

రామారావు డిన్నర్ కానిచ్చేసి తన గదిలోకి వెళ్లిపోయాడు. డిన్నర్ అప్పుడు కరుణ కనిపించక పోవడం, తల్లి ముభావం.. అతడిని మిక్కిలి అస్థిరపరిచాయి.

అన్నీ సర్ది తమ గదిలోకి వచ్చింది అన్నపూర్ణ.

“నేను పక్క గదిలో పడుకుంటాను. మీరు పడుకోండి.” చెప్పింది భర్తతో.

“అదేంటి. నిన్నంటే ఈరకత్తెకి తోడంటూ అక్కడ పడుకున్నానన్నావు. మరి ఆమె లేదుగా.” అన్నాడు అన్నపూర్ణ భర్త.

“కోడలుకి మైల రోజులు. కొత్తగా.. ఒంటరిగా ఏం పడుకుంటుంది. నేను తోడుంటా.” మరలా అబద్ధమాడింది అన్నపూర్ణ.

ఆ వెంటనే.. ఆ గది నుండి బయటికి వచ్చి, కరుణను తీసుకొని మరో గదిలోకి వెళ్లిపోయింది.

ఎంతకూ గదిలోకి రాని కరుణను తలుస్తూ.. అప్పటికే తను దాచి పెట్టుకున్న బ్రాందీ సీసాలు రెండు అగుపించక పోవడంతో.. ‘కక్కు రాక, మింగుడు పడక’ అన్నట్టు సతమవుతూనే ఎప్పటికో నిద్ర పోయాడు రామారావు.

ఇంటికి తిరిగి వెళ్లిందే కానీ, కరుణ తల్లి.. కూతురుకు, అన్నపూర్ణకు దఫదఫాలుగా ఫోన్ చేస్తూనే ఉంది. హైరానా అవుతూనే ఉంది.

మూడో రోజున.. రమారమీ గత రెండు రోజులుగా తను పడుతున్న అవస్థే కొనసాగుతుండడంతో.. మరి గింజుకోలేక.. అనువు చూసి అన్నపూర్ణని డాబా మీదకు లాక్కుపోయాడు రామారావు.

“అప్పుడప్పుడు తాగుతానని నీకు తెలియందా.” రామారావు తలదించుకొని ఉన్నాడు.

“భేష్. తప్పును గుర్తించావే.” అంది అన్నపూర్ణ విసురుగా.

“శోభనం రోజున నేను తాగడమే మీ కోపానికి కారణమని పోల్చుకున్నాను..” చెప్పుతున్నాడు రామారావు.

అడ్డై.. “నువ్వు తాగడమే కాదు.. నీ భార్యను తాగమనడమూ సరైనది కాదు.” విసురుగా అంది అన్నపూర్ణ.

“నా కొలీగ్ చెప్పాడు. అలా తాగడంలో థ్రిల్ ఉంటుందని.” నసిగాడు రామారావు.

“నోర్మూయ్. నిన్ను ఏం అనుకోవాలి. తల్లితో ఇలానా మాట్లాడేది. ఛఛ.” విసుక్కుంది అన్నపూర్ణ.

ఆ వెంబడే.. “నువ్వు ఎప్పుడైతే అట్టి ఫ్రెండ్స్‌తో తిరుగుతున్నట్టు తెలిసిందో.. అప్పుడే నిన్ను నిలదీసి నివారించి ఉండవలసింది. నాదే తప్పు. రెండు రోజులుగా నీ గదిలో శోధించినట్టు మొదటిలోనే శోధించి ఉండవలసింది. బ్రాందీ సీసాలు గదిలోకి తెచ్చి తలుపేసుకొని ఇంట్లోనే తాగుతుండే వాడివేమో. ఛఛ.  నువ్వు ఇంతగా దిగజారుతావని నేను అనుకోలేదు. చూసీ చూడనట్టు తిరిగినందుకు నాకు గొప్ప గతి పట్టించావురా. నీ మూలంగా కరుణ ఉసురు పోసుకుంటున్నానురా. నా కర్మ.” అంది అన్నపూర్ణ. తలను బాదుకుంటుంది.

రామారావు నిశ్చేష్టితుడయ్యాడు.

నిముషం తర్వాత కానీ తెములుకోలేక పోయాడు. తల్లి చేతులు పట్టుగా పట్టుకున్నాడు.

“అమ్మా.. అమ్మా.. ప్లీజమ్మా. నా మాట వినమ్మా. అప్పుడప్పుడు బయటే తప్పా.. నేను ఇంటిలో తాగింది ఇదే మొదటి సారి. నమ్మమ్మా.” బతిమలాట చేపట్టాడు.

“చాల్లేరా. నన్ను వదులు.” సరసరా అంది అన్నపూర్ణ.

“నా పని ఇంతగా నన్ను నిలదీస్తుందని అనుకోలేదమ్మా. నా తప్పు తెలుస్తోందమ్మా.” అంటున్నాడు రామారావు.

“నీ మాటలు నమ్మాలా. ఇంతకు బరి తెగించినవాడివి.. నిన్నెలా నమ్మేది. ఛఛ.” అన్నపూర్ణ కొడకును ఈసడించుకుంటోంది.

“లేదమ్మా. నన్ను నమ్మమ్మ. నేను ఇలా ఇకపై చేయను..” అంటున్నాడు రామారావు.

అడ్డై.. “అంటే.. ఇకపై ఇంట్లో తాగననా.” అడిగింది.

“మొత్తమే తాగనంటే తాగనమ్మా.” చెప్పాడు రామారావు.

“అబ్బో. తాగినోడి మాటలు నీటి మీది రాతలే. నన్ను నమ్మించి మళ్లీ ఏడిపించకు.” కటువుగా అంది అన్నపూర్ణ.

“అయ్యో. అమ్మా. ఎప్పుడైనా నా వలన నువ్వు ఏడ్చావా. లేదుగా. ఇదే తొలిసారి. ఇదే ఆఖరిసారి కూడా. నమ్మమ్మా. నిన్ను ఏడిపించే ఏ పని ఇక చేయనమ్మా.” చెప్పుతున్నాడు రామారావు.

అడ్డై.. “ఎలా నమ్మేది.” అడిగింది అన్నపూర్ణ.

రామారావు మాట్లాడలేకపోయాడు.

కొద్దిసేపటి తర్వాత..

“వేచి చూస్తాను. నువ్వు మారేవు అనిపించేకనే నీ శోభనం చేయిస్తాను. సమ్మతమేనా.” అడిగింది అన్నపూర్ణ.

“అమ్మా.” రామారావు నీరుకారేడు.

“అంతే.”  కఠినంగా ఉంది అన్నపూర్ణ.

“నేను మంచిగా ఉంటానమ్మా..” చెప్పుతున్నాడు రామారావు.

అడ్డై.. “ఉండి చూపమ్మా.” అంది అన్నపూర్ణ.

“సరేనమ్మా.” ఒప్పుకున్నాడు రామారావు.

“ఈ ఒప్పుకోలు మన మధ్యనే కాదు.. కరుణ కూడా నీ చేతలతో తేలిక పడాలి. తేడా జరిగిందా కొడుకువని కూడా చూడను. చాలా తీవ్రంగా వ్యవహరిస్తాను.” చెప్పింది అన్నపూర్ణ.

“అమ్మా. లేదమ్మా లేదు. అలా జరగనీయను. నీ కోసం.. కాదు కాదు.. మీ కోసం.. నా చపలత వదిలేయగలను.  నువ్వే చూడు.” పట్టుగా చెప్పాడు రామారావు.

“అదీ చూస్తాను.” అంటూ అన్నపూర్ణ డాబా దిగేసింది.

వెనుకే దిగాడు రామారావు.

ఆ రాత్రి.. భర్తకు కొడుకు వ్యవహారమంతా విశదపరిచింది అన్నపూర్ణ.

“మీరు కలుగచేసుకోవద్దు. కానీ వాడి ఎదుట ఉపేక్ష అగుపర్చండి. అంతా నేను సర్దిపెడతాను.” చెప్పింది.

అన్నపూర్ణ భర్త తలాడించాడు.

నిద్రకై కరుణని తనతో పాటు వేరే గదిలోకి తోడ్చుకుపోయింది.

డాబా మీద.. తనకు, రామారావుకు మధ్య చోటు చేసుకున్న మాటలను కరుణకి వివరించింది.

“నువ్వు డీలా పడవద్దు. నేను చక్కదిద్దుతాను.” చెప్పింది.

కరుణ తలాడించింది. వారం రోజులు గడిచాయి.

ఆ రోజుల్లో.. రామారావు వేళకు ఆఫీసుకు వెళ్తుండడం.. వేళ మించక ఆఫీసు నుండి ఇంటికి వచ్చేయడం.. ఇంట్లో ఒబ్బిడిగా తిరగడం.. అన్నపూర్ణ పట్టున పసిగట్టింది. అలానే తనతో, కరుణతో రామారావు మాట్లాడేందుకు సంశయపడుటను గుర్తించింది.

ఆ తర్వాత.. ఉదయం..

“ఈ కాఫీని బాబుకు ఇవ్వు.” కరుణకి కాఫీ గ్లాస్ నందిస్తూ చెప్పింది అన్నపూర్ణ.

అత్త మొహంలోకి చూసింది కరుణ.

“సడలింపు కాదు. అవకాశం కల్పించడం. వెళ్లు. ఇచ్చి రా. మనం కాఫీ తాగుదాం.” చెప్పింది అన్నపూర్ణ.

కరుణ ఆ కాఫీ గ్లాస్‌తో కదిలింది.

శోభనం రాత్రి తర్వాత తన గదిలోకి మళ్లీ కరుణ రావడం చూసిన రామారావు చకితుడయ్యాడు. గమ్మున మంచం మీంచి లేచి నిల్చున్నాడు.

కరుణ ముభావంగానే తన చేతిలోని కాఫీ కప్పును రామారావు వైపు పెట్టింది. రామారావు దానిని అందుకున్నాడు.

కరుణ వెంటనే అక్కడి నుండి తిరిగి వంట గది వైపుకు మరలింది.

ఆ తర్వాత.. అడపాతడపాలా ఐనా.. రోజున రెండు మూడు మార్లు టిఫిన్ కని, భోజనాలకని పిలవమని రామారావు గదికి కరుణను అన్నపూర్ణ పంపుతుండేది.

కరుణ అప్పగించిన పనిని అప్పచెప్పినట్టు కానిచ్చేసింది. దాంతో రామారావుకు మాట్లాడే అవకాశం అందీ అందనట్టు అయ్యేది.

మరి కొద్ది రోజుల తర్వాత..

వంట గదిలో అన్నపూర్ణ ఒంటరిగా ఉండడం గమనించిన రామారావు గబగబా అక్కడికి వెళ్లాడు.

“అమ్మా. ఇంకా నన్ను అనుమానిస్తున్నావు. నన్ను నమ్మమ్మా. నేను తాగుడు జోలికి పోలేదు. ఇక ముందు పోనుకూడా.” చెప్పాడు దీనంగా.

అన్నపూర్ణ వెంటనే ఏమీ మాట్లాడలేదు.

“ఇవే విషయాల్ని కరుణతో చెప్పుకుంటాను. జరిగిందానికి క్షమించమంటాను. ప్రాధేయపడతాను. తను మాట్లాడడానికే అవకాశం ఇవ్వుట లేదు. నువ్వేనా మేము మాట్లాడుకునేలా అవకాశం కల్పించమ్మా. ప్లీజ్.” వేడుకున్నాడు రామారావు.

కొడుకు రీతి అన్నపూర్ణలో సన్నపాటి కంపనం తెచ్చింది.

బయటికి మాత్రం.. “ప్రయత్నిస్తాను.” అని మాత్రమే అంది. తిరిగి తన వంట పనిని కొనసాగిస్తోంది.

తచ్చాటలాపి.. “ఆఫీసుకు వెళ్తున్నాను.” చెప్పి కదలబోయాడు రామారావు.

“ఈ మాట కరుణకు చెప్పి వెళ్ళు.” చెప్పింది అన్నపూర్ణ.

ఆ వెంబడే.. “అలానే. తనతో మాట్లాడడానికి సమయం కోరుకో.” అంది.

“తను కనిపించడం లేదు.” నసిగాడు రామారావు.

“పెరటిలో పూజకు పూలు కోస్తోంది.” చెప్పింది అన్నపూర్ణ.

అటు వెళ్లాడు రామారావు.

“నేను ఆఫీసుకు బయలుదేరుతున్నాను.” మెల్లిగా చెప్పాడు.

కరుణ చూపు మార్చుకుంది. పూలు తుంచుకుంటుంది.

“నీతో మాట్లాడాలి.” నసిగాడు రామారావు.

ఆ వెంటనే.. “మా అమ్మకు చెప్పాను.” చెప్పాడు.

కరుణ తలెత్తలేదు.. ఏమీ అనలేదు. నిముషం మౌనం తర్వాత.. “మా అమ్మతో మాట్లాడి చెప్పు.” అంటూనే అక్కడి నుండి కదిలిపోయాడు రామారావు.

ఆ తర్వాత.. రామారావు, కరుణ.. ఓ రోజున అన్నపూర్ణ కల్పించగా.. పెరటిలో మల్లె పందిరి కింద కుర్చీలేసుక్కూర్చుని మాట్లాడగలుగుతున్నారు.

“నాకు మొదటి నుండి ఎట్టి వ్యసనం లేదు. నా కో-ఎంప్లాయి ప్రోద్బలంకు వశమై.. తను చెప్పిన  థ్రిల్ కై తాగుడు వైపు మొగ్గేసాను. నిజానికి ఆ మత్తు ఏదో గమ్మత్తుగా తోచడంతో అప్పుడప్పుడూ చాటు మాటుగా తాగేవాణ్ణి. శోభనం నాడు ఇంటిన తాగడం కూడా వాడి ఉసిగొల్పు కారణం..” చెప్పుతున్నాడు రామారావు.

అడ్డై.. “తప్పు తప్పు. మీరు ఏ మాత్రం ఆలోచించుకోలేక పోవడం మీ తప్పు.” అంది కరుణ.

“అవునవును. నేను టెంప్ట్ కావడం నా బలహీనతే. దాని ఫలితం అనుభవిస్తున్నాను. దయచేసి విముక్తుడ్ని చేయండి.” రామారావు రీతులో దీనత్వం స్పష్టంగా అగుపిస్తోంది.

కరుణ చిన్నగా కదుల్తోంది.

“నాన్న ఉదాసీనతను.. అమ్మ ఔన్నత్యమును.. నేను దుర్వినియోగ పరిచాను. ఇంట్లోని నా తాగుడు ఘటన తర్వాతనే నేను గుర్తించగలిగాను. నాది ఒక ఘోర తప్పిదమే..” చెప్పుతున్నాడు రామారావు.

భర్తనే చూస్తూ.. కరుణ వింటుంది.

“నేను తప్పు చేసాను. నన్ను మన్నించు. ఇక మీదట ఇట్టివి జరగనీయను. మాటిస్తున్నాను. నన్ను నమ్ము.” వేడుకుంటున్నాడు రామారావు.

“ఎలా నమ్మమంటారు.” టక్కున అడిగింది కరుణ.

“ఇలా అడుగుతావనుకున్నాను. అందుకే ఒకటి యోచించి పెట్టుకున్నాను.” చెప్పాడు రామారావు.

కరుణ విస్మయమవుతోంది.

“ఇక మీదట ప్రతి నెల నా జీతం మొత్తంని మనిద్దరి జాయింట్ అకౌంట్‌గా బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తుంటాను. ప్రతి జమా, ఖర్చు నీకూ తెలుస్తోంది. ఇదే సరైన  పరిష్కార మార్గంగా నాకు తోస్తోంది.” చెప్పి ఆగాడు రామారావు.

అతడిప్పుడు కరుణనే చూస్తున్నాడు.

కరుణ మెల్లిగా తల దించుకుంది.

“దీనికి నువ్వు ఒప్పుకోవాలి. నేను మారేందుకు అవకాశం ఇలా ఇవ్వు. ప్లీజ్.” చెప్పాడు రామారావు.

“అత్తమ్మగారితో మాట్లాడతాను.” మెల్లిగా చెప్పింది కరుణ. ఆ వెంబడే లేచి నిల్చుంది.

“సరే.” అనేసాడు రామారావు.

కరుణ అక్కడి నుండి ఇంటిలోకి వెళ్లింది.

కొద్ది సేపు తర్వాత రామారావు కదిలాడు.

కరుణ చెప్పింది విన్న అన్నపూర్ణ.. “వాడు మారేడని, మారతాడని నీకు అనిపిస్తోందా.” అడిగింది.

“మీకు.” ఆగడిగింది కరుణ.

“మారకపోతే తనకే కష్టమని వాడు గ్రహించాడు.” చెప్పింది అన్నపూర్ణ.

కరుణ ఏమీ అనలేదు.

“నేను విశ్వసించ గలుగుతున్నాను. నువ్వు నన్ను నమ్ము.” చెప్పింది అన్నపూర్ణ.

‘సరే’ అన్నట్టు తలాడించింది కరుణ.

ఈ అత్త కోడలు సంభాషణ పిమ్మట.. నెల దాటి కొద్ది రోజులు గడవక ముందే..

తల్లిని, భార్యను తీసుకొని బ్యాంక్ కెళ్లాడు రామారావు.

కరుణ, తన పేర్ల మీద ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసాడు. అందిన జీతం మొత్తంని అందులో జమ పరిచాడు.

తల్లి సమక్షంన.. ఆ బ్యాంక్ పాస్ బుక్‌తో పాటు తన సేలరీ షీట్‌ను కరుణకు అందిస్తున్నాడు రామారావు.

అన్నపూర్ణ చెప్పగా వాటిని పుచ్చుకుంది కరుణ.

అన్నపూర్ణ నిండుగా నవ్వుకుంది.

ఆ తర్వాత..      అన్నపూర్ణ  కోరిక మేరకు కరుణ తల్లి వచ్చింది. వారం రోజులు పాటు ఆ ఇంటిలో ఉంది.

ఉదయం..

భర్తతో కలిసి అన్నపూర్ణ.. కరుణతో కలిసి రామారావు.. వీళ్లతో పాటు కరుణ తల్లి డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని.. బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు.

కరుణ తల్లి.. “ఇక్కడికి రాక ముందు మీరు, కరుణ ఫోన్‌లో చెప్పేవి వింటున్నా.. ఏదో వెలితి వదినగారు. మీరు నన్ను మభ్యపెట్టుతున్నారేమో అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూసాక.. నాలో గుబులు దూదిలా ఎగిరి పోయింది. ఇంతటికీ కారణం మీరే వదినగారు. నా కరుణ మరో తల్లి చెంతన చేరింది. నాకు ఇక చింత లేదు.” నిండుగా చెప్పింది.

“మరైతే పంతులు గారిని పిలిపించి.. పిల్లల శోభనం ముహూర్తం తీంచనా. మీరుండగా అదీ కానిద్దాం.” అంది అన్నపూర్ణ.

“అలానే కానీయండి వదినగారు.” అనేసింది కరుణ తల్లి.

అప్పుడే.. కరుణ సిగ్గుతో తల దించుకుంటోంది.. రామారావు సంపదగా నవ్వుకుంటున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here