అద్వైత్ ఇండియా-3

0
4

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[రాబర్ట్ భార్య ఆండ్రియా, కూతురు ఇండియా రాజమండ్రి వస్తారు.  స్టేషన్ దగ్గర వాళ్ళని చూసిన రాఘవ ఇంటికి వెళ్ళి అద్వైత్‍కి ఈ విషయం చెప్తాడు. వాళ్ళొస్తే నాకెంటని అద్వైత్ అంటే, ఏమో, కాలగతిలో బంధువులు కావచ్చేమో అంటాడు రాఘవ. కాసేపటికి అక్కడికి రంగయ్య, అతని బావమరిది బాలయ్య వచ్చి నరశింహశాస్త్రి గారిని కలవాలంటారు. ఆయన లోపలి నుంచి వచ్చి రంగయ్యని పలకరించి విషయం ఏమిటని అడిగితే, బాలయ్య కూతురు చామంతిని రాబర్ట్ కొడుకు గర్భవతిని చేసి కలకత్తా వెళ్ళిపోయాడని, తమకు న్యాయం జరిపించమని కోరుతారు. వాళ్ళిద్దరికి పెళ్ళి జరిపించమని చెప్తారాయన. అందుకు సహకరించమని వాళ్ళు ప్రార్థిస్తారు. నరసింహ శాస్త్రి స్థానిక చర్చ్ ఫాదర్ జీజస్‍ను పిలిపిస్తారు. జరిగినదంతా వివరించి న్యాయం చేయమంటారు. రాబర్ట్‌తో మాట్లాడి, అతని కొడుకును యిక్కడికి పిలిపించి వారి వివాహం జరిగేలా చూస్తానని చెప్తారు ఫాదర్ జీజస్. అనుకున్న రోజున ఉదయం ఆరున్నరకల్లా వెళ్ళి రాబర్ట్ ఇంటి కాలింగ్ బెల్ కొడతాడు అద్వైత్. నిద్రమత్తులో ఉన్న ఇండియా వచ్చి తలుపు తీసి ఎవరిని అడిగితే, మీ నాన్నకి తెలుగు నేర్పడానికి వచ్చానని చెప్తాడామెకు. కొంతసేపటికి రాబర్ట్ వస్తాడు. ఆ పూటకి పాఠాలు చెప్పి ఇంటికి బయల్దేరుతాడు అద్వైత్. దారిలో సుల్తన్ కొడుకు అంజాద్ కనబడి, తెల్లదొరలకు ఎదురుతిరగాలనే రాఘవ ఆలోచనలనూ, ప్రయత్నాలను చెప్పి, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు. రాఘవ పెడదారి పట్టకుండా చూడాలని అనుకుంటూ ముందుకు సాగుతాడు అద్వైత్. – ఇక చదవండి.]

అధ్యాయం 5:

[dropcap]ఆ[/dropcap] సాయంత్రం.. రాఘవ అద్వైత్‍లు.. గోదావరి ఒడ్డుకు వచ్చారు. నది దరులు దాటి ప్రవహిస్తూ వుంది.

“బావా!.. ఏదో చెప్పాలన్నావ్.. చెప్పు..”

మౌనంగా నడుస్తున్న అద్వైత్‌ను చూచి అడిగాడు రాఘవ.

“రాఘవా!.. ఆ నదీ ప్రవాహాన్ని చూడు..” అన్నాడు అద్వైత్ .

నదివైపు చూచి.. దృష్టిని అద్వైత్ వైపుకు త్రిప్పి..

“ఆ.. చూచాను”

“ఏమనిపిస్తూ వుంది..”

“దరులను దాటి మహావేగంతో ముందుకు తన ప్రియుడైన సాగరుని చేరబోతూ వుందనిపిస్తూ వుంది.”

“ఎవరైనా.. ఆ ప్రవాహానికి ఎదురు నిలబడగలరా!..”

“ఏంది బావా యీ ప్రశ్న!.. యింతటి ప్రవాహానికి ఎవరైనా ఎదురు నిలబడగలరా!..’

“నిలబడలేరు కదూ!..”

“అవును..”

“మరి నీవెందుకు రా నిలబడాలనుకొంటున్నావ్?..”

రాఘవ ఆశ్చర్యంగా అద్వైత్.. ముఖంలోకి చూచాడు.

“రాఘవా!.. నేటి మన పాలకవర్గం.. యీ ప్రవాహంతో సమానం.. వారిని ఎదిరించాలనుకోవడం అవివేకం..”

రాఘవ.. అద్వైత్ మాటలకు నవ్వాడు “బావా!.. నా మనస్సులోని నిర్ణయం నీకు ఎలా తెలిసింది!..”

“నాకు దివ్య దృష్టి లేదు. నేను యోగిని కాదు. మామూలు మనిషిని. నీ చర్యలను గురించి సుల్తాన్ భాయ్ కొడుకు అంజాద్ నాతో చెప్పాడు. వాడికి ఎలా తెలిసిందో నేను అడగలేదు. వాడు చెప్పలేదు. వాడు నీ గురించి చెప్పగానే.. నేను ఆశ్చర్యపోయాను. ఒరేయ్!.. బాగా చదువుకున్నావు. ఏదైనా వుద్యోగ ప్రయత్నం చేసి.. అందులో చేరి ప్రశాంతంగా బ్రతికే దానికి ప్రయత్నించరా!..”

“అంటే.. మనస్సులోని ఆశయాలను ఆదర్శాలను చంపుకొని.. జీవచ్ఛవంగా బ్రతకమంటావా!..”

“మనిషికి ఆశలు ఆదర్శాలు వుండాలి. సమయం కోసం సహనంతో వేచి వుండాలి. తగని సమయంలో వాటి ప్రదర్శన చేస్తే మనకు పరాభవం తప్పదంటున్నాను.”

“అంటే జీవచ్ఛవంగా బ్రతకమనేగా నీవు చెప్పడం!..”

“కాదు ఓర్పు సహనంతో బ్రతకమని..”

“బావా! ఓ మాట అడగనా!..”

“అడుగు..”

“యీ భూమి మీద పుట్టినది ఏదైనా శాశ్వతంగా యుగాంతం వరకూ వుండగలదా!..” “అసంభవం..”

“సృష్టిలోని అన్ని జీవరాశుల్లోకి మానవుడు మహోన్నతుడు కదూ!..’

“అవును..”

“వీడికీ చావు వుంది కదూ!..”

“వుంది..”

“బావా!.. నా మనస్సులోని లక్ష్యసాధనలో నాకు చావు సంప్రాప్తిస్తే నేను ఆనందంగా చచ్చిపోతాను. అలా కాకుండా నీవు చెప్పినట్లు ఆశలను ఆశయాలను గుండెల్లో సమాధి చేసికొని.. ఆత్మవంచన చేసికొని ప్రతిరోజూ చస్తూ.. నేను బ్రతకలేను బావా!.. నేను ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటాన్ని సాగించటం తథ్యం. నా లక్ష్యాన్ని నీవు సమర్థించి నాతో ఏకీభవిస్తావని వచ్చాను. కానీ నీ భావన వేరుగా వుంది. మన వుద్దేశాలు రొండూ కలవని ధృవాలు.. నా వలన నీవు కష్టాల పాలు కావడం నాకు యిష్టం లేదు. నీ మనస్సును శాసించే హక్కు నాకు లేదు. అలాగే నా నిర్ణయాన్ని కాదనే హక్కు నీకూ లేదు. నేను వెంటనే విశాఖపట్నం వెళ్ళిపోవాలి. పద యింటికి పోదాం” తన నిర్ణయాన్ని చెప్పాడు రాఘవ.

“రాఘవా!.. నీవు చాలా ఆవేశంలో వున్నావు. నా మాట..”

“బావా!.. ప్లీజ్.. ఆ విషయాన్ని గురించి నాకు మీరు యిక ఏమీ చెప్పవద్దు” అద్వైత్ పూర్తి చేయక ముందే రాఘవ ఆవేశంగా అన్నాడు.

“రాఘవా!.. నీవు నన్ను ఏమన్నావ్?..” ఆశ్చర్యంతో అడిగాడు అద్వైత్.

“మీరు, అన్నాను.. మీరు నా కంటే పెద్దవారు కదా బావా!..” నవ్వుతూ రాఘవ ముందుకు నడిచాడు.

అతన్ని గురించిన ఆలోచనలతోనే అద్వైత్.. అతని వెనకాలే నడిచాడు.

యిరువురూ.. మౌనంగా యింటికి చేరారు. రాఘవ నేరుగా సావిత్రి వున్న వంట యింట్లోకి వెళ్ళి.. “అత్తయ్యా!.. నేను విశాఖపట్నం బయలుదేరుతున్నాను” అని చెప్పాడు. అద్వైత్ వచ్చి ద్వారం దగ్గర నిలబడ్డాడు.

“ఎప్పుడు రా!..”

“యిప్పుడే అత్తయ్యా!..” అద్వైత్ ముఖంలోకి చూస్తూ చెప్పాడు రాఘవ.

‘వీడి మాటను నేను కాదన్నానని.. నా మీద కోపంతో వూరికి యిప్పుడే వెళతానంటున్నాడు. ఎంత తెలివైన వాడో అంత మూర్ఖుడు కూడా!.. తన నిర్ణయమే రైట్ అనుకొంటాడు. నా మాటలలోని యథార్థాన్ని ఆలోచించే దానికి ప్రయత్నించడం లేదు. వీడిని ఆ భగవంతుడే రక్షించాలి’ అనుకొన్నాడు అద్వైత్.

సావిత్రి అద్వైత్‌ను సమీపించింది.

“ఏరా!.. వాడు ఏమన్నాడో విన్నావా!..” అడిగింది సావిత్రి.

“విన్నానమ్మా!..” మెల్లగా చెప్పాడు అద్వైత్.

అద్వైత్.. కంఠ స్వరంలోని వ్యత్యాసాన్ని గమనించి యిరువురి ముఖాల్లోకి చూచింది సావిత్రి. యిరువురూ మౌనంగా వేరు వేరు దిశలను చూస్తున్నారు. సాధారణంగా ఆ యిరువురు సావిత్రిని కలిసినప్పుడు బావమరదుల మధ్యన జరిగే చతుర సంభాషణతో.. సావిత్రి నవ్వలేక పోయేది. యీ రోజు యిరువురూ క్లుప్తంగా వారి వారి ఆలోచనలలో వారు వున్నందున, యిరువురి మధ్యన ఏదైనా గొడవ జరిగిందేమో అనే అనుమానం కలిగింది సావిత్రికి.

“ఏరా!.. వసపిట్టల్లా వాగే యిరువురూ మౌనంగా వున్నారు. ఏ విషయంలోనైనా గొడవ పడ్డారా!..”

రాఘవ నవ్వాడు. వాడి నవ్వును చూచి అద్వైత్ ఆశ్చర్యపోయాడు.

“అత్తయ్యా!.. మా బావ బంగారు. నా మేలు కోరేవాడు. అలాగే యీ రాఘవ తన బావను ఏ విషయంలోనూ బలవంతం చేసి కష్టపెట్టడు. వూరికి వెళతానని చెప్పాను. నేను వెళ్ళడం బావకు యిష్టం లేదు. కానీ నేను వెళ్ళాలి అత్తయ్యా!.. అందుకే బావ అదోలా వున్నాడు” చివరి మాటలు రాఘవ అద్వైత్ ముఖంలోకి చూస్తూ చెప్పాడు.

“రాఘవా!..” కాస్త హెచ్చు స్థాయిలో సంభోదించాడు అద్వైత్.

రాఘవ ఆ పిలుపు విని ఆశ్చర్యంతో అద్వైత్ ముఖంలోకి చూచాడు.

“యీ రాత్రి పూట నీవు వెళ్ళవద్దురా. నా మాట విను. అమ్మా!.. నీవు వాడికి చెప్పమ్మా!..” అద్వైత్ మాటల్లో అభ్యర్ధన..

“విన్నావుగా!.. రాఘవా!.. యీ రాత్రి నీవు వెళ్ళడం లేదు” అంది నవ్వుతూ సావిత్రి.

కొన్ని క్షణాలు ఆలోచించి రాఘవ అద్వైత్.. ముఖంలోకి చూస్తూ.. “సరే అత్తయ్యా!.. మీ మాట ప్రకారమే నేను యిప్పుడు వెళ్ళడం లేదు. రేపు వుదయాన్నే వెళతాను. బావా!.. సంతోషమా!..” నవ్వాడు రాఘవ.

“ఆఁ..” చెప్పి అద్వైత్.. తన గది వైపుకు నడిచాడు. రాఘవ అతన్ని అనుసరించాడు. ఇరువురూ.. మంచంపైన కూర్చున్నారు. రాఘవ నవ్వుతూ అద్వైత్ ముఖంలోకి చూచాడు.

“రాఘవా!.. నీవు నవ్వితే చాలా బాగుంటావురా!..” చిరునవ్వుతో చెప్పాడు అద్వైత్.

“ఇండియా కంటేనా!..” కళ్ళు ఎగరేసి అడిగాడు రాఘవ.

“రేయ్!.. ఆ పిల్ల నవ్వింది నీవు ఎప్పుడు చూచావురా!..”

“స్టేషన్‌లో దిగి కారు ఎక్కేటప్పుడు. అవునూ!.. నీవు వాళ్ళ యింటికి రాబర్ట్‌కు తెలుగు నేర్పేటందుకు వెళ్ళావుగా.. ఆ పిల్లను చూచావా.. నిన్ను చూచి నవ్విందా లేదా!..”

“చూచింది.. కానీ నవ్వలేదు.”

“నీవేదైనా జోగ్గా మాట్లాడితేగా!..”

“ఆ పిల్లతో నాకేంటిరా జోక్?..”

“ఆడపిల్ల కాబట్టి!..”

“ఆఁ..”

“అవును బావా!.. నీవేదైనా జోక్ వేసి చూడు. ఆ పిల్ల నవ్వితే ఎంత బాగుంటుందో తెలుస్తుంది..”

“అది నాకు అవసరమారా!..”

“ఆ పిల్ల నవ్వినప్పుడు ఎంత అందంగా వుంటుందో చూడాలనుకొంటే అవసరంగానే భావించాలి కదా బావా..”

“నాకంత అవసరం లేదు.”

“నా సిక్స్త్ సెన్స్ చెబుతూ వుంది..”

“ఏమని?..”

“చెప్పరా!..”

“నీకు ఆ అవసరం వస్తుందని..”.

“రేయ్!.. యిక ఆ సోది ఆపు.”

“నిజాన్ని చెబితే యీ రోజుల్లో జనం అంత తేలికగా నమ్మరు బావా!.. కానీ నీవు అందరిలాంటి వాడివి కాదే!.. నా సిక్స్త్ సెన్స్ సిగ్నల్ తప్పు కాదు. ముందు ముందు నీవే చూస్తావుగా!..”

“ఏందిరా నేను చూచేది!..” హేళనగా అన్నాడు అద్వైత్.

“నీ ప్రశ్నకు కాలమే జవాబు చెబుతుంది బావా!..” నవ్వాడు రాఘవ.

“ఇక ఆ ప్రసక్తిని ఆపు. నేను చెప్పేది విను”

“చెప్పు బావా!..”

“ఒరేయ్!.. మనం సామాన్య మధ్యతరగతి వర్గానికి చెందిన వాళ్ళం. మనకు డబ్బు కన్నా పరువు.. మర్యాద.. గౌరవం ముఖ్యం”

“బావా!..”

“ఏమిటి?..”

“ఒక్క పదాన్ని మరిచావు?..”

“ఏమిటది?..”

“ఆశయం..”

అద్వైత్ ఆశ్చర్యంగా రాఘవ ముఖంలోకి చూచాడు.

“అంటే!..”

“బావా!.. నీవు ఎన్ని చెప్పినా నా నిర్ణయం.. అదే నా ఆశయం మారదు”

“అంతేనా!..”

“అంతే బావా!..”

సావిత్రి పిలుపుతో యిరువురూ లేచి భోజనానికి వెళ్ళారు.

నరశింహశాస్త్రిగారు సమక్షంలో వున్నందున అద్వైత్, రాఘవ ఏమీ మాట్లాడలేదు.

“రాఘవ రేపు వుదయం వూరికి వెళతాడట..” అంది సావిత్రి

“ఏరా..” అడిగారు నరశింహశాస్త్రి.

“అవును మామయ్యా!..” మెల్లగా చెప్పాడు రాఘవ

“ఏం అంత అవసరం? నాలుగు రోజులు వుండి వెళ్ళవచ్చుగా!..” శాస్త్రిగారు.. రాఘవ ముఖంలోకి చూచారు.

“నాయనమ్మ.. సీత ఒంటరి వాళ్ళు కదా మామయ్యా!..”

“ప్రక్కన వుండే యిళ్ళల్లో వుండే వాళ్ళంతా మనవాళ్ళే కదరా!..”

“నిద్ర లేచినప్పటి నుంచీ ఎవరి పనులు వారికి వుంటాయి కదా మామయ్యా!.. నేను లేని కారణం సీతే అన్నింటికి బయటికి పోవలసి వస్తుంది. అది నాకు యిష్టం లేదు మామయ్యా!..”

నరశింహశాస్త్రి కొన్ని క్షణాలు ఆలోచించారు.

“అవున్రా!.. నీవు అన్న మాట నిజమే!.. సీత వయస్సు వచ్చిన ఆడబిడ్డ కదా!.. నీ యిష్ట ప్రకారమే వూరికి వెళ్ళు.. జాగ్రర్త..”

“అలాగే మామయ్యా!..”

భోజనానంతరం.. నరశింహశాస్త్రి తన గదికి.. రాఘవ.. అద్వైత్ గదికి వచ్చారు.

“బావా!..”

“నీవు నా చెల్లెలు సీతను పెండ్లి చేసుకొంటావా!..” ప్రాధేయపూర్వకంగా అడిగాడు రాఘవ. అద్వైత్.. ఆశ్చర్యపోయాడు.

“ఏందిరా నువ్వన్నది!.. నేను ఎత్తుకొని ఆడించిన పిల్లను నన్ను పెండ్లి చేసికోమంటావా..”

“సీత నీకు వరసే కదా బావా!..”

“సీతంటే నాకు ఎంతో అభిమానం.. ప్రేమ ఆమెను నేను నా అక్క కూతురుగా భావించానే తప్ప.. నాకు వరసైన దానిగా నేను ఏనాడూ చూడలేదురా!..’

రాఘవ మారు మాట్లాడలేదు. వారిరువురి మధ్యన మాటలు సాగలేదు. మంచాలపై వాలిపోయారు.

వుదయాన్నే లేచి రాఘవ.. అందరికీ చెప్పి విశాఖపట్నం వెళ్ళేదానికి స్టేషన్ వైపుకు బయలుదేరాడు. రాఘవ నూరు అడుగులు ముందుకు వెళ్ళి వెనక్కు తిరిగి చూచాడు. తనవైపుకే వస్తున్న అద్వైత్‍ను చూచి ఆగాడు. అద్వైత్ అతన్ని సమీపించాడు.

చిరునవ్వుతో రాఘవ అద్వైత్.. ముఖంలోకి చూచాడు.

“ఏం బావా!..” మెల్లగా అడిగాడు.

“నిర్ణయం విషయంలో మరొక్కసారి నా మాటను మన్నించి స్థిమితంగా సావధానంగా ఆలోచించరా!..” ప్రాధేయపూర్వకంగా చెప్పాడు అద్వైత్.

“యీ మాట చెప్పేదానికేనా వెనకాలే వచ్చావ్!..” విరక్తిగా నవ్వాడు రాఘవ.

“అవున్రా!..” అద్వైత్ ముఖం ఎంతో గంభీరంగా వుంది.

“ఆవేశం అనర్థానికి దారి తీస్తుంది రాఘవా!.. నీ నిర్ణయాన్ని మార్చుకో.. నా మాట వినరా!..” ప్రాధేయపూర్వకంగా చెప్పాడు అద్వైత్ .

“బావా!.. నా అమ్మా నాన్నలు ఎలా చనిపోయారో.. మరచావా!..”

“లేదు.. దానికి నీ నిర్ణయానికి ఏమిటి సంబంధం?..”

“ద్వేషం.. పగ.. వీటి రొంటి పర్యవసానం దారుణంగా వుంటుందని నాకు తెలుసు బావా!.. కానీ.. నా నిర్ణయాన్ని మార్చుకోలేను. కాకిలా నూరేళ్ళు బ్రతికేకంటే.. కోకిలలా ఒక్క సంవత్సరం బ్రతికినా చాలనే నిర్ణయానికి వచ్చాను. నా లక్ష్యాన్ని పది మందికి పంచుతాను. నేను నేల రాలిపోయినా.. నా సాటి సోదరులు నా ఆశయాన్ని సాధిస్తారు. నాకు కావలసింది అదే. బండికి టైమయింది బావా. నీవు యింటికి వెళ్ళు..” రాఘవ వేగంగా ముందుకు నడిచాడు. స్టేషన్ చేరాడు. ఆగి వున్న రైల్లో ఎక్కాడు. కిటికీ ప్రక్కన ఖాళీగా వున్న సీట్లో కూర్చున్నాడు. గార్డు విజిల్ వేశాడు. బండి కదిలింది. వేగంగా కిటికీని సమీపించి అద్వైత్‍ను చూచి ఎడం చేతిని ఆడించాడు రాఘవ. కన్నీటితో అద్వైత్ యాంత్రికంగా తన చేతిని ఆడించాడు.

అధ్యాయం 6:

ఆ రోజు ఆదివారం రాబర్ట్ యింటికి అద్వైత్ వెళ్ళాడు. మామూలు ప్రకారం రాబర్ట్ చెప్పిన ఆంగ్ల పదాలకు తెలుగు పదాలను చెప్పాడు. రాబర్ట్ తెలుగు పదాలను ఇంగ్లీషు లిపిలో వ్రాసుకొని ఉచ్చరించసాగాడు. మరీ ఛండాలమైన రాబర్ట్ పలికే తీరుకు అద్వైత్‍కు నవ్వు వచ్చేది. అణచి పెట్టుకొని.. ఆంగ్లంలో రాబర్టుకు చెప్పి తెలుగులో తాను స్పష్టంగా ఉచ్చరించేవాడు.

రాబర్ట్ భార్య ఆండ్రియా వచ్చి నవ్వుతూ..

“హలో యంగ్ మాస్టర్!.. హవ్ ఆర్ యు?..” అంది.

“ఫైన్ మేడమ్..”

“మే ఐనో యువర్ నేమ్!..”

“అదెయిత్..” నవ్వుతూ చెప్పాడు రాబర్ట్.

“నో సార్!.. అద్వైత్..”

“షల్ ఐ కాల్ యు ఆది!..”

“నో ప్రాబ్లం మేడమ్..”

“సీ, ఆదీ..”

“యస్ మేడమ్!.”

“వెయిట్ ఏ మినిట్!..” చెప్పి లోనికి చూచి.. “ఇండీ.. ప్లీజ్ కమ్!..” బిగ్గరగా, పిలిచింది.

ఇండియా వచ్చింది నవ్వుతూ..

అప్పుడు చూచాడు అద్వైత్.. ఇండియా నవ్వును. వెంటనే రాఘవ గుర్తుకొచ్చాడు. ‘ఒరేయ్ రాఘవా!.. నీవు చెప్పింది నిజమేరా.!..’ అనుకొన్నాడు అద్వైత్.

“షి యీజ్ మై డాటర్ ఇండియా!..” చెప్పింది ఆండ్రియా.

“గుడ్ మార్నింగ్ సార్!..” నవ్వుతూ చెప్పింది ఇండియా.

“గుడ్ మార్నింగ్ మిస్ ఇండియా!..” చిరునవ్వుతో చెప్పాడు అద్వైత్

“ఆదీ!.. షి వాంటు లెర్న్ టెలుగు ఫ్రమ్ యు. కెన్ యు ప్లీజ్ టీచ్ హార్!..”

ఇండియా.. ఆసక్తిగా అద్వైత్ ఏం జవాబు చెబుతాడో అని.. అతని ముఖంలోకి చూచింది. ఆ చూపుల్లో అభ్యర్థన గోచరించింది అద్వైత్‍కు.

“ఓకే మేడమ్..” చిరునవ్వుతో చెప్పాడు.

“థ్యాంక్యూ సార్!..” మరోసారి అందంగా నవ్వింది ఇండియా.

“డూ యు వాంట్ టు రైట్ దేర్ లెటర్స్!..” అడిగాడు రాబర్ట్.

“యస్ డాడ్..” తల వూపి మరీ చెప్పింది ఇండియా.

“ఆదీ.. ఫ్రమ్ టుమారో టీచ్ హర్ వెల్. ఓకే!..” ఆజ్ఞాపించాడు రాబర్ట్.

“ఓకే సార్!..”

“హౌ బిగ్ ఈజ్ యువర్ ఫామిలీ మిస్టర్ ఆదీ!..” అడిగింది ఆండ్రియా.

“నాన్నగారు అమ్మగారు నేను అంతే మా ఫామిలీ మేడమ్!..” ఇంగ్లీష్ చెప్పాడు.

“స్మాల్ ఫామిలీ.. గుడ్..” నవ్వింది ఆండ్రియా.

“వీళ్ళ నాన్న మహా గర్విష్టి..” ఇంగ్లీష్‌లో చెప్పాడు రాబర్ట్.

అద్వైత్.. క్షణంసేపు అతని ముఖంలోకి చూచాడు. తలను ప్రక్కకు త్రిప్పుకొన్నాడు.

‘ఒరేయ్!.. నా తండ్రిని గురించి నీకేం తెలుసురా!.. నీవు చెప్పిన పదం నీకే వర్తిస్తుంది’ అనుకొన్నాడు

“సార్!.. యిక నే వెళతాను. బై..” చెప్పాడు.

“ఓకే.. యుకెన్ గో..” ఠీవిగా చెప్పాడు రాబర్ట్.

అద్వైత్ హాల్లో నుండి వరండాలోకి వచ్చాడు. ఫాదర్ జీజస్ అతనికి ఎదురైనాడు.

“సార్ వున్నారా బాబూ!..” అడిగాడు జీజస్.

“వున్నారు ఫాదర్..”

“యింత వుదయాన్నే యిక్కడికి వచ్చావు.. కారణం?..”

“నేను రాబర్ట్ గారికి తెలుగు నేర్పుతున్నాను ఫాదర్..”

“ఓ.. అలాగా!..”

“అవును. నే వెళుతున్నా ఫాదర్..” చెప్పి వేగంగా వీధివైపుకు నడిచాడు అద్వైత్

జీజస్ కాలింగ్ బెల్ నొక్కాడు.

ఇండియా కర్టెన్ జరిపి వరండాలోకి వచ్చింది.

“గుడ్ మార్నింగ్ ఫాదర్..” నవ్వుతూ చెప్పింది ఇండియా.

“గుడ్ మార్నింగ్ బేబీ!.. ఫాదర్ జీజస్ వచ్చాడని నాన్నగారికి చెప్పమ్మా!..” ఇంగ్లీష్ చెప్పాడు.

“ప్లీజ్ టెక్ యువర్ సీట్..” కుర్చీని చూపించింది ఇండియా.

జీజస్ కుర్చీలో కూర్చున్నాడు.

ఇండియా.. లోనికి వెళ్ళిపోయింది.

ఐదు నిముషాల తర్వాత రాబర్ట్ వరండాలోకి వచ్చాడు. జీజస్‍ను చూచాడు.

రాబర్ట్‌ను చూడగానే.. జీజస్ లేచి నిలబడ్డాడు.

“సిడౌన్ ఫాదర్.. సో యర్లీ మార్నింగ్ యు హ్యావ్ కమ్!.. వాట్ యీజ్ ద మ్యాటర్” రాబర్ట్ కుర్చీలో కూర్చున్నాడు. ఎదురుగా వున్న కుర్చీలో జీజస్ కూర్చున్నాడు.

తాను రాబర్ట్ చెప్పదలచుకొన్న విషయాన్ని ఏ రీతిగా ప్రారంభించాలా అనే ఆలోచనతో తల దించుకొన్నాడు జీజస్. అతని వాలకాన్ని చూచిన రాబర్ట్..

“ఫాదర్!.. టెల్ మి ది పాయింట్.. వై డూ యు ఫీల్ షయ్!..” రాబర్ట్ మాటల్లో నిర్లక్ష్యం గోచరించింది జీజస్‍కు.

“ఒక తప్పు జరిగింది సార్!..”

“ఏమిటా తప్పు.. చేసింది ఎవరు?..” తన సహజ ధోరణిలో కసిరినట్లు అడిగాడు రాబర్ట్ ఆంగ్లంలో.

నీ తనయుడే తప్పు చేశాడని.. ఎలా చెప్పాలో తోచక జీజస్ కళ్ళు మూసుకొన్నాడు.

అతని ముఖంలోకి చూచి రాబర్ట్.. “ఫాదర్ ఐ హ్యావ్ నో టైమ్. టెల్ మీ ద ఫ్యాక్ట్..”

యిక చెప్పక తప్పదనే నిర్ణయానికి వచ్చిన జీజస్.. “యువర్ సన్ డిడ్ ఏ మిస్టేక్!..” మెల్లగా చెప్పాడు జీజస్.

“వాట్!.. మై సన్!..”

“యస్ సార్!..”

“హీ యీజ్ ఎట్ కలకత్తా!..”

“మూడు నెలల క్రిందట యిక్కడికి వచ్చాడుగా సార్!..”

“యస్ హి కేమ్.. వాటీజ్ ది మిస్టిక్ హి డిడ్!.. టెల్ మీ!..” అసహనంగా అడిగాడు రాబర్ట్.

“హి స్పాయిల్డ్ యువర్ సర్వెంట్ గర్ల్ సార్!..” మెల్లగా చెప్పాడు జీజస్.

“వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ ఫాదర్..” ఆవేశంగా అన్నాడు రాబర్ట్.

“యిటీజ్ నాట్ నాన్సెన్స్. ఫ్యాక్ట్ సార్..” యీసారి కాస్త హెచ్చుస్థాయిలో చెప్పాడు జీజస్.

రాబర్ట్ ఫాదర్ ముఖంలోకి తీక్షణంగా చూచాడు.

“ఐ నీడ్ నాట్ టెల్ యు లై సార్!..” అనునయంగా చెప్పాడు జీజస్.

“వాట్ యీజ్ ద ఫ్రూఫ్!..”

“షి యీజ్ ప్రెగ్నెంట్ సార్!..”

“దట్ మే బీ బై ఎనీవన్.. హౌ కేన్ యు సే అబౌట్ మై సన్!..”

“నేను ఏమీ కల్పించి చెప్పడం లేదు సార్.!.. ఆ అమ్మాయి మీ అబ్బాయి పేరునే చెప్పింది” ప్రాధేయపూర్వకంగా ఆంగ్లంలో చెప్పాడు.

“ఐ కాంట్ బిలీవ్ దిస్ రబ్బిష్!..”

“యాజ్ ఎ ఫాదర్ ఐయాం సేయింగ్ సార్.. యు హ్యావ్ టు బిలీవ్ అండ్ డు ద జస్టీస్ ప్లీజ్..” ప్రాధేయపూర్వకంగా అడిగాడు జీజస్.

రాబర్ట్ కొన్ని క్షణాలు జీజస్ ముఖంలోకి తీక్షణంగా చూచాడు. సింహద్వారాన్ని సమీపించి మూసి గడియవేశాడు. సాలోచనగా మెట్లు దిగి వీధిగేటు వైపుకు నడవసాగాడు.

జీజస్ అతని వెనకాలే అప్రసన్నంగా నడిచాడు. రాబర్ట్ గేటును సమీపించి వెనక్కు తిరిగాడు.

“ఫాదర్ జీజస్!..”

“యస్ సర్..”

“మీరు ఒక పని చేయండి”

“ఏమిటి సార్ అది?..”

“నేను మీకు కొంత డబ్బు యిస్తాను. ధాన్ని మీరు ఆ పిల్ల తల్లిదండ్రులకు యివ్వండి. అబార్షన్ చేయించి వేరే ఎవరితోనైనా పెండ్లి జరిపించమనండి”

“సార్..” ఆశ్చర్యంతో అన్నాడు జీజస్.

“ఫాదర్!.. డు వాట్ ఐ సెడ్!..”

“ఆ పనిని నేను చేయలేను సార్..”

“కారణం?..”

“యీ విషయంలో నరశింహశాస్త్రిగారు..”

“హు!.. ఎవరూ!..”

“నరశింహశాస్త్రిగారు..

“ఆ పిల్లకు ఆ ముసలివాడికి ఏమిటి సంబంధం?..”

“వారు ఆ పిల్ల తల్లిదండ్రులకు మాట యిచ్చారు..”

“ఏమని?..”

“మీ అమ్మాయి వివాహం.. ఆ అబ్బాయితో జరిపిస్తానని..”

“వాట్!..”

“వాట్ ఐ సెడ్ యీజ్ ట్రూత్ సార్..”

“బుల్ షిట్.. హు యీజ్ దట్ ఓల్డు ఫెలో టు ఫిక్స్ మై సన్ మ్యారేజ్ విత్ దట్ కంట్రీ బ్రూట్..” ఆవేశంగా అన్నాడు రాబర్ట్.

“సార్.. మీకు నరశింహశాస్త్రిగారి పూర్తి వివరాలు తెలియవు!.. ఆయన అందరిలాంటి మనిషి కాదు”

“హో.. యు మీన్ హి యీజ్ సూపర్ మ్యాన్!..”

“మోర్ దాన్ దట్ సార్!..”

“జీజస్!.. హి కాంట్ షేక్ మి!..” వికటంగా నవ్వాడు.

“ఇది మీరు నవ్వవలసిన సమయం కాదు సార్!.. సావధానంగా ఆలోచించి.. మీ కొడుకు చేసిన తప్పును సరిదిద్దుకోవలసిన సమయం”

“అంటే!..”

“ఆ అమ్మాయితో మీ అబ్బాయి వివాహం జరిపించడం మీ ధర్మం..”

“డోంట్ సే వన్స్ దట్!.. వాట్ ఐ సెడ్ యు హ్యావ్ టు డు! ..”

“ఐ కాంట్ డు దట్ సార్!..”

“వై!?..”

“యిట్ యీజ్ ఏ క్వశ్చన్ ఆఫ్ ఏ సోల్..’

“యిప్.. ఐ కెన్ కిల్ హర్ వాట్ యు అండ్ దట్ ఓల్డ్ ఫెలో విల్ డు!..”

జీజస్ అతని మాటలకు భయపడి వెంటనే బదులు చెప్పలేకపోయాడు. సాలోచనగా తల దించుకొన్నాడు. అతని స్థితిని చూచి నవ్వుతూ రాబర్ట్..

“ఫాదర్ జీజస్.. ప్లీజ్ డు వాట్ ఐ సెడ్.. యిట్ యీజ్ బెటర్ ఫర్ యు. అదర్‍వైజ్ ఫ్రమ్ టుమారో యు విల్ నాట్ బీ కాల్డ్ య్యాజ్ ఫాదర్.. సే యస్..” హేళనగా నవ్వాడు రాబర్ట్.

“ఐ వాంట్ టు లివ్ యాజ్ ఎ హ్యుమన్ దాన్ ఫాదర్. బై సార్.!..” గేటు తెరచుకొని జీజస్ వేగంగా వెళ్ళిపోయాడు. తన్ను ధిక్కరించి వెళ్ళిపోతున్న జీజస్‌ను తీక్షణంగా చూచాడు రాబర్ట్.

ఆండ్రియా తలుపును సమీపించి తెరవబోయింది. రాబర్ట్ వరండాలో గడియ బిగించినందున తలుపు తెరవబడలేదు. ఆండ్రియా ఆశ్చర్యపోయింది. ‘వై రాబర్ట్ క్లోజ్డ్ ద డోర్..’ స్వగతంలో అనుకొంది. తలుపును తట్టింది బలంగా.

ఆ సవ్వడిని విన్న రాబర్ట్ వేగంగా వరండాలోకి వెళ్ళి తలుపు గడియ తీశాడు. ఎదురుగుండా ఆండ్రియా.. రాబర్ట్ దిక్కులు చూచాడు.

“రాబర్ట్!.. తలుపును ఎందుకు మూశావు?..” చిరాగ్గా ఆంగ్లంలో అడిగింది.

‘అబద్ధం ప్రస్తుతానికి చెప్పి ఆండ్రియాను నమ్మించవచ్చు. కానీ.. రేపు విషయం తెలిస్తే.. ఆండ్రియా అడిగే ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేను. యిప్పటికి మూడుసార్లు అభిప్రాయ భేధాల వలన విడాకులను ప్రపోజ్ చేసింది ఆండ్రియా. ఆండ్రియా అందగత్తె. ఎంతో తెలివైయింది. నిర్మొహమాటస్తురాలు. ముక్కుకు సూటిగా నడిచే మనిషి. నాకా వయస్సు యాభై దాటింది. తనకు నాకు వివాహం అయిన తర్వాత.. నాకు అంతకు ముందే వివాహం అయ్యి భార్య చనిపోయిందన్న విషయాన్ని తెలిసికొన్న తర్వాత.. నన్ను ఆ విషయాన్ని గురించి అడగలేదు. యీ వయస్సులో ఆమెతో అభిప్రాయభేదం.. నాకు మంచిది కాదు. విషయాన్ని ఆమెకు చెప్పడం ఉచితం’ అనే నిర్ణయానికి వచ్చిన రాబర్ట్.. చిరునవ్వుతో..

“ఇండియా ఎక్కడ ఆండ్రియా!..”

“రెస్ట్ రూమ్‍కు వెళ్ళింది. నేను అడిగిన ప్రశ్నకు మీరు జవాబు చెప్పలేదు..” సీరియస్‍గా రాబర్ట్ ముఖంలోకి చూస్తూ అడిగింది ఆండ్రియా.

రాబర్ట్ తలుపు మూసి ఆండ్రియాను సమీపించి..

“కూర్చో.. చెబుతాను” అన్నాడు.

ఆండ్రియా కూర్చుంది. కుర్చీని ఆమె ప్రక్కకు లాక్కొని రాబర్ట్ కూర్చున్నాడు.

“ఏమిటి విషయం?..” అడిగింది ఆండ్రియా.

ఫాదర్ జీజస్ తనకు చెప్పిన విషయాన్ని.. తాను అతనికి చెప్పిన జవాబును.. రాబర్ట్ ఆండ్రియాకు మెల్లగా వివరించాడు.

ఆండ్రియా ముఖంలో బాధ.

“స్టుపిడ్ ఫెలో.. డన్ ఏ గ్రేట్ సిన్, అండ్ యు టూ..” విచారంగా అంది ఆండ్రియా.

“ఆండ్రియా!..” ఆమెను శాంత పరిచేటందుకు రాబర్ట్ ఏదో చెప్పబోయాడు. మధ్యలోనే ఆండ్రియా..

“మిస్టర్ రాబర్ట్!.. యు హ్యాటు ఛేంజ్ యువర్ థాట్. దే మేబీ పూర్.. బట్ దే ఆర్ ఆల్ సో హుమెన్స్. వాట్ ఫాదర్ జీజస్ సెడ్ యీజ్ రైట్. కాల్ దట్ ఫెలో ఫ్రమ్ కల్‍కతా. హి షుడ్ మ్యారీ హర్.. ఇఫ్ యు డిజ్ అగ్రీ విత్ మి.. ఐ విల్ గివ్ యు డైవర్స్” ఆవేశంగా చెప్పి ఆండ్రియా కుర్చీ నుంచి లేచి లోనికి వెళ్ళిపోయింది.

రాబర్ట్.. ఆగ్రహావేశాలతో పళ్ళు కొరికాడు. ‘షి యీజ్ నాట్ మదర్. డెవిల్’ అనుకొన్నాడు. సుల్తాన్ వచ్చాడు. అతని వదనంలో విచారం.

“ఏమి సుల్తాన్!.. నీ ముఖం చాలా విచారంగా వుంది?..” అడిగాడు రాబర్ట్ ఆంగ్లంలో. “మిమ్మల్ని కర్నల్ మూన్ గారు రమ్మన్నారు సార్!..”

“మూన్!.. కాల్డ్ మి?..”

“యస్ సార్!..”

“ఫార్ వాట్..”

“వారు నాతో చెప్పలేదు. మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు”

కొన్నిక్షణాలు రాబర్ట్ ఆలోచించాడు. ఆండ్రియా వరండాలోకి వచ్చింది. క్రోధంగా వున్న రాబర్ట్ ముఖం చూచింది. “వాట్ సుల్తాన్.. ఎనీ న్యూస్!..” అడిగింది ఆండ్రియా.

“యస్ మేడమ్. కర్నల్ మూన్ సార్ కాల్డ్ అవర్ సార్!..”

“లెటజ్ గో సుల్తాన్!..” ఆజ్ఞాపించాడు రాబర్ట్.

“రాబర్ట్!.. మిస్టర్ మూన్ యీజ్ వెరి వెరీ ఫేర్ పర్సన్. యు నో దట్. ఐ నో హిమ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. వుయ్ బోత్ ఆర్ ఫ్రమ్ వన్ ప్లేస్. టాక్ విత్ హిం యాజ్ ఎ జెంటిల్మెన్” చిరునవ్వుతో చెప్పింది ఆండ్రియా.

రాబర్ట్ క్షణంసేపు ఆండ్రియా ముఖంలోకి చూచి.. “సుల్తాన్.. కమాన్!..” వేగంగా ముందుకు నడిచాడు. సుల్తాన్ అతన్ని అనుసరించాడు.

రాబర్ట్ కారు యిరవై నిముషాల్లో మిస్తర్ మూన్ నిలయం చేరింది. సుల్తాన్ రాబర్ట్ కారు దిగారు.

కారు శబ్దాన్ని విన్న మిస్టర్ మూన్.. అతని వెనకాల ఫాదర్ జీజస్ వరండా లోకి వచ్చారు. రాబర్ట్ను చూచిన మూన్ నవ్వుతూ..

“గుడ్ మార్నింగ్ మిస్టర్ రాబర్ట్!..”

“యస్ సర్!.. గుడ్ మార్నింగ్..” వినయంగా కొని తెచ్చుకొన్న కపటపు నవ్వుతో చెప్పాడు రాబర్ట్.

“యు నో హిమ్!..” ఫాదర్ జీజస్‌ను చూపుడు వ్రేలితో చూపుతూ అడిగాడు మూన్.

“యస్ సర్!..” మెల్లగా చెప్పి జీజన్ ముఖంలోకి చూచాడు రాబర్ట్ తీక్షణంగా.

జీజస్ చిరునవ్వుతో పలకరించాడు రాబర్టు.

“కమాన్ మిస్టర్ రాబర్ట్..”

మిస్టర్ మూన్ ముందు నడువగా.. జీజస్, రాబర్ట్‌లు అతన్ని అనుసరించారు. ముగ్గురూ హాల్లో ప్రవేశించారు. “టెక్ యువర్ సీట్ మిస్టర్ రాబర్ట్..” నవ్వుతూ చెప్పాడు మిస్టర్ మూన్.

రాబర్ట్ కూర్చున్నాడు. అతని ముఖంలో అప్రసన్నత.. ‘యీ జీజస్ గాడు విషయాన్ని మూన్‍కు చెప్పాడు. వాడు యింత దూరం వస్తాడని నేను వూహించలేదు. మూన్ నాతో.. యిప్పుడు ఏం చెబుతాడో!..’ ఆందోళనతో అనుకొన్నాడు రాబర్ట్.

“మిస్టర్ జీజస్!.. కూర్చోండి” ఆంగ్లంలో చెప్పాడు మూన్.

జీజస్ కూర్చున్నాడు. మూన్ రాబర్కు ఎదురుగా కూర్చున్నాడు.

“జీజస్ యిక్కడ వున్న కారణంగా.. నేను నిన్ను ఎందుకు పిలిపించానో నీకు అర్థం అయ్యింటుందనుకొంటాను రాబర్ట్. నీవు కంపెనీకి ఎంతో నమ్మకమైన వుద్యోగివి. ఆ విషయం నాకు తెలుసు. కానీ!.. నీ కొడుకు చేసిన పని చాలా కిరాతకం.. మంచి మనస్సు వున్న ఏ వ్యక్తి వాడిని సమర్థించడు. నేనూ అంతే.. పేదవారితో మనం ప్లే చేస్తే మన జీజస్ మనలను మన్నించడు. నీవు గొప్ప తెలివి కలవాడివి. ఆ నీ తెలివి అన్యాయాన్ని సమర్థించకూడదు. న్యాయాన్ని సమర్ధించాలి. నీ కొడుకు విషయంలో యీ జీజస్ చెప్పింది న్యాయం. దాన్ని నీవు పాటించాలి. ఆ అమ్మాయితో నీ కొడుకు మ్యారేజ్ జరిపించాలి. నీపై అధికారిగా, నీ మేలు కోరే వాడిగా.. ఇది నేను నీకు యిచ్చే సలహా రాబర్ట్.” అనునయంగా చెప్పాడు మిస్టర్ మూన్ కర్నల్.

“సార్..” ఏదో చెప్పబోయి ఆగాడు రాబర్ట్.

“నీవు చెప్పదలచుకొన్నది చెప్పు మిస్టర్ రాబర్ట్..” సౌమ్యంగా చెప్పాడు మూన్. ‘

“షి యీజ్..”

“వెరీ పూర్ గర్ల్.. అన్ ఎడ్యుకేటెడ్.. నాట్ అవర్ కమ్యూనిటీ.. యీజ్ యిట్ సో!..

“యస్ సర్!..”

“యువర్ సన్ యీజ్ వెల్ ఎడ్యుకేటెడ్!..”

‘అవును’ అన్నట్లు తల ఆడించాడు రాబర్ట్.

“నీ కొడుక్కు వున్న విజ్ఞానం.. అమానుషంగా ప్రవర్తించే దానికే పరిమితమా!..’

అదే సమయానికి నరసింహశాస్త్రి.. రంగయ్య అక్కడికి వచ్చారు. వారిని చూచి రాబర్ట్ బెదిరిపోయాడు. తలను ప్రక్కకు త్రిప్పుకొన్నాడు.

“గుడ్ మార్నింగ్ సార్!..” మూన్‍ను విష్ చేశాడు నరశింహశాస్త్రి.

“సార్ వీరే నరశింహశాస్త్రిగారు..” చెప్పాడు జీజస్.

మూన్ వెంటనే లేచి శాస్త్రిగారిని సమీపించి.. “గుడ్ మార్నింగ్ సార్.. ప్లీజ్ కమ్.. టేక్ యువర్ సీట్..” సగౌరవంగా చెప్పాడు.

“వీరి పేరు రంగయ్య.. అతను నేను మీతో మాట్లాడాలని వచ్చాము. యిక్కడ వున్న వారిని చూచిన తర్వాత.. మేము చెప్పకుండానే మీకు విషయం తెలిసిందని నాకు అర్థమయింది” రాబర్ట్ ముఖంలోకి చూచి చిరునవ్వుతో.. “గుడ్ మార్నింగ్ మిస్టర్ రాబర్ట్!..” అన్నారు నరశింహశాస్త్రి అతని ప్రక్కనే సోఫాలో కూర్చున్నారు. రంగయ్య బెదురు చూపులతో అందరినీ చూచి తల దించుకొన్నాడు. జీజస్ అతని సమీపించి ప్రీతిగా అతని భుజంపై చెయ్యి వేసి..

“భయపడకు.. మూన్ సార్ చాలా మంచివారు. మీకు న్యాయం జరుగుతుంది.” మెల్లగా చెప్పాడు జీజస్.

“మిస్టర్ శాస్త్రి సార్!.. మీ గురించి మేము సాలా విన్నామ్!..” నవ్వుతూ తనకు వచ్చిన తెలుగులో మాట్లాడాడు.

“యు ఆర్ ఏ గ్రేట్ మాస్టర్.. గ్రేట్ డాన్సర్.. గ్రేట్ ఫిలాసఫర్.. హో!.. వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ!.. యాం వెరీ హ్యాపీ బై మీటింగ్ యు సార్..” అన్నాడు మూన్.

“నాట్ సో గ్రేట్ మిస్టర్ మూన్ సార్!.. ఐ యాం ఏ స్మాల్ హుమన్ బీయింగ్..” వినయంగా చెప్పాడు నరశింహశాస్త్రి.

నవ్వాడు మిస్టర్ మూన్.. “ఓవ్!.. ఆల్ గ్రేట్ పీపుల్ విల్ సే సో..” బిగ్గరగా నవ్వాడు.

“ఓకే సార్!.. కమ్ టు ది పాయింట్. వాట్ కెన్ ఐ డు ఫార్ యు..”

“జస్టిస్ సార్!..” అన్నాడు నరశింహశాస్త్రి.

“ఏ విషయంలో!..”

“ఫాదర్ జీజస్ మీకు చెప్పిన విషయంలో ప్లీజ్..” ఆంగ్లంలో జవాబు చెప్పాడు నరశింహశాస్త్రి. రాబర్ట్ అతని ముఖంలోకి తీక్షణంగా చూచాడు. అతని చూపులను గమనించిన కర్నల్ మూన్..

“మిస్టర్ రాబర్ట్.. యువర్ సన్ ఈజ్ నాట్ ఎ విక్టిమ్. బై మీన్స్ ఆఫ్ యువర్ అగ్లీ లుక్స్.. ఐ హ్యాటు కాల్ యు ఆల్సో యాజ్ కన్విక్ట్!..”

“సార్!.. వీరి పేరు రంగయ్య.. ఆ అమ్మాయి మేనమామ”

రంగయ్య కళ్ళ నుండి కారే కన్నీటిని చూచాడు మూన్.

“మిస్టర్ రంగియా!.. ఎడ్వకు.. నెను నికు నాయం చేస్తాను..” రాబర్ట్ వైపుకు తిరిగి..

“రాబర్ట్.. సే సారీ టు మిస్టర్ నర్సింఅ సార్..” మూన్ తీక్షణమైన చూపులకు రాబర్ట్ భయపడ్డాడు. “సార్.. సారీ!..” చెప్పి క్షణంసేపు నరసింహశాస్త్రి ముఖంలోకి చూచి తల దించుకొన్నాడు రాబర్ట్.

“ఫాదర్ జీజస్.. ఫిక్స్ ఎ డేట్ ఫార్ మ్యారేజ్..” జీజస్ ముఖంలోకి చూస్తూ నవ్వుతూ చెప్పాడు కర్నల్ మూన్.

“ఆ పని సార్ చేస్తే బాగుంటుంది సార్!..” జీజస్ నవ్వుతూ చెప్పి.. నరశింహశాస్త్రి ముఖంలోకి చూచాడు.

“ఓ దట్ యీజ్ రైట్..” చిరునవ్వుతో నరశింహశాస్త్రి ముఖంలోకి చూచి..

“సార్.. ప్లీజ్ టెల్‍ మి ది యాస్పీషియస్ డేట్..” అడిగాడు మూన్.

“కమింగ్ సిక్స్ సార్!..”

“దట్ మీన్స్ తర్టీన్త్ డే!..”

“యస్ సార్!.. దటే యీజ్ ఫ్రైడే..”

“డియ్యర్ రాబర్ట్!..”

“సార్!..”

“బాధగా వుందా!..”

రాబర్ట్ మౌనంగా తల దించుకొన్నాడు.

“నా నిర్ణయం నీకు నచ్చలేదు కదూ!..” పరీక్షగా కొన్ని క్షణాలు రాబర్ట్‌ను చూచాడు కర్నల్ మూన్.

“ఇది నా నిర్ణయం కాదు. మన జీజస్ నిర్ణయం. కలకత్తా మద్రాస్ బాంబేల్లో మనవారు ఎందరో యీ దేశపు కన్యలను వివాహమాడారు. దే హ్యావ్ క్రియేటెడ్ వన్ మోర్ కమ్యూనిటీ కాల్డ్ ఆంగ్లో ఇండియన్స్. యు షుడ్ బీ హ్యాపీ దట్ యువర్ సన్.. పార్ట్ అండ్ పార్శిల్ ఆప్ దట్ కమ్యూనిటీ.. గెట్ అప్.. గో అండ్ షేక్ హ్యాండ్ విత్ మిస్టర్ రంగయా..” నవ్వాడు కర్నల్ మూన్.

రాబర్ట్ యాంత్రికంగా లేచాడు. రంగయ్యను సమీపించాడు. అతని చేతిని తన చేతిలోకి తీసికొన్నాడు. రంగయ్య తన రెండవ చేత్తో రాబర్ట్ హస్తాన్ని పట్టుకొన్నాడు.

రంగయ్య ముఖంలో ఆనందం. రాబర్ట్ చేతిని వదలి మూన్‌ను సమీపించి వంగి అతని పాదాలను తాకి.. “అయ్యా!.. మీరు చాలా మంచివారు.. మా పాలిటి దేవుడు.” అన్నాడు పరవశంతో.

మూన్ అతని భుజాలను పట్టుకొని పైకి లేపి.. “నీవు మనిసివి.. నేను మనిసిని.. నేను దేవుడు కాను..” చిరునవ్వుతో తనకు తెలిసిన తెలుగులో చెప్పాడు.

“సార్!.. యిక నే వెళతాను..” మూన్‌ను సమీపించి చెప్పాడు రాబర్ట్.

“ఓకే!.. డోంట్ వర్రీ అబౌట్ ఆండ్రియా.. షి విల్ నాట్ సే నో టు మై జస్టిఫికేషన్!..” సగర్వంగా నవ్వాడు కర్నల్ మూన్.

రాబర్ట్ అందరినీ ఒకసారి చూచి మెల్లగా కదిలాడు.

“మిస్టర్ రాబర్ట్.. ప్లీజ్ వెయిట్ ఏ మినిట్..” అన్నారు నరశింహశాస్త్రి.

రాబర్ట్ వెను తిరిగి చూచాడు. నరశింహశాస్త్రి అతన్ని సమీపించారు.

“మిస్టర్ రాబర్ట్.. స్వార్థం.. పగ.. ద్వేషం.. యీ మూడూ మనిషికి శత్రువులు. ప్రేమ.. జాలి.. దయ.. యీ మూడూ మనిషికి హితులు. ప్రతి ఒక్కరూ.. వారి వారి జీవితాన్ని నేను చెప్పిన రెండు విధానాల్లో ఏదో ఒక విధానంలో సాగిస్తున్నారు. మొదటి విధానపు చివరి ఘట్టం.. నాశనం.. రొండవ విధానం చివరి మజిలీ.. పరమానందం. మనమంతా మనుషులం. మనకు ఆనందం కలిగే మార్గంలో పయనిస్తూ.. ఎదుటివారి ఆనందాన్ని కోరుకోవాలి. మన ఆనందాన్ని వారికీ పంచాలి. అప్పుడే మనం అసలు సిసలైన మనుషులం అవుతాం. అప్పుడు.. పది మంది మనలను గౌరవిస్తారు.. అభిమానిస్తారు. మన సాహచర్యాన్ని కోరుతారు. నేను ఆ దారిన నడిచేవాణ్ణి. యికపై మీరూ నా దారిన నడవాలని ఆశిస్తున్నాను. నేను మీకు చెప్పదలచుకొన్నది చెప్పేసాను. యిక మీరు వెళ్ళవచ్చు.” చిరునవ్వుతో తనకు వచ్చిన అనర్గళమైన ఆంగ్లభాషలో చెప్పాడు నరశింహశాస్త్రి.

వింటున్న కర్నల్ మూన్.. నవ్వుతూ.. “వెల్ సెడ్ సార్.. వెల్ సెడ్..” చప్పట్లు కొట్టాడు.

రాబర్ట్ వారిరువురినీ క్షణంసేపు చూచి వేగంగా ముందుకు నడిచాడు. వరండాలో వున్న సుల్తాన్.. రాబర్ట్‌ను అనుసరించాడు.

నరశింహశాస్త్రి.. కర్నల్ మూన్‍కు ధన్యవాదాలు తెలిపి రంగయ్యతో వెళ్ళిపోయారు.

అనుకొన్న రోజున రాబర్ట్ సన్ విన్సెంట్‌కు రంగయ్య మేనకోడలు బాలయ్య కూతురు చామంతికి చర్చిలో వివాహం జరిగింది.

విన్సెంట్ రాబర్ట్ మొదటి భార్య కొడుకు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here