ఫస్ట్ లవ్-10

1
3

[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఫస్ట్ లవ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఓ రోజు రాత్రి పది గంటలకి రఘురాం‍కి ఫోన్ చేసి, హసంతి ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళిందనీ, ఉప్పల్ బస్టాప్ దగ్గర ఉందనీ, బస్సులు స్ట్రైక్ అవడం వల్ల చిక్కుకుపోయిందనీ, గౌతమ్ ఇంట్లో ఉంటే పంపించి హసంతిని ఇంటికి తీసుకురమ్మనమని చెబుతుంది. ఆయన గౌతమ్‍ను పంపిస్తారు. ఈలోపు ఉప్పల్ బస్టాప్ దగ్గర నిలబడ్డ హసంతి ఆటోలు బేరమాడుతూ ఉంటుంది. కొందరు రామంటారు. ఒకడు వస్తానన్నా అతని వాలకం అనుమానస్పదంగా ఉండడంతో వద్దంటుంది. బేరం కుదిరి ఓ ఆటోలో ఎక్కబోతుంటే, అక్కడికి వచ్చిన గౌతమ్ ఆమెని ఆపి, అత్తయ్య పంపించిందని చెప్పి, తన బైక్‍ మీద ఎక్కించుకుని ఇంటి దగ్గర దింపుతాడు. హసంతి ముభావంగానే ఉంటుంది. ఇంట్లోకి అడుగుపెడుతుంటే, గౌతమ్ ఏడి అని తల్లి అడిగితే వెళ్ళిపోయాడని చెప్పి, తన గదికి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. కార్తీక్ తన గదిలో హసంతి గిఫ్టుగా అందజేసిన డైరీలు చదువుతూ ఆమె భావుకతకు అబ్బురపడతాడు. ఆమె రాసిన కొటేషన్స్ అతన్ని ఆకర్షిస్తాయి. హసంతి మీద ఇష్టం పెరుగుతుంది కార్తీక్‍కి. మరోవైపు హసంతిలో అంతర్మథనం ఆగదు. తనని ప్రేమించే గౌతమ్,  తను ప్రేమిస్తున్న కార్తీక్‍ల మధ్య నలుగుతూంటుంది. కార్తీక్ తన టీమ్ లీడర్‍కి ఫోన్ చేసి రీరికార్డింగ్‌కి రెండు రోజులు లీవ్ కావాలని అడుగుతాడు. అతను సెలవు మంజూరు చేసి గుడ్ లక్ చెప్తాడు. హసంతి ఫ్రెండ్ ధృతి ఫోన్ చేస్తుంటే, కాల్ కట్ చేస్తుంది హసంతి. ఇక చదవండి.]

[dropcap]హ[/dropcap]సంతి క్లాస్మేట్ ధృతి లోపలికి వచ్చింది.

“ఆంటీ ఎక్కడున్నారు?” అనేసరికి కిచెన్‌లో ఉన్న కవిత ఇవతలకు వచ్చి

“నువ్వా? ధృతీ! ఒక్క నెల ఇంటర్న్‌షిప్ చేసి వస్తానని చెప్పి వెళ్లావు. కనీసం మీ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్‌కి కూడా రాలేదు.” అంది.

“ఎంగేజ్మెంట్ అయిందా?” ఆశ్చర్యంగా అడిగింది ధృతి.

“నువ్వేంటే ఇలా చిక్కిపోయావు. వేళకి తినటం లేదా?” అని కవిత ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే..

“ఆగండి ఆంటీ! ఎంగేజ్మెంట్ అని హసంతి ఒక్క మాట కూడా చెప్పలేదు. కనీసం నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయటం లేదు” అంది.

“హసంతి నీకు చెప్పలేదా!?! ఆశ్చర్యంగా ఉందే!” అంది కవిత.

“అవును.”

“మీరిద్దరూ ఫ్రెండ్సే కదా! వెళ్ళు, పై గదిలో ఉంది.”

టెర్రస్ మీదకు వచ్చింది ధృతి.

హసంతి ఓ కార్నర్‌లో కూచుంది. కళ్ళార్పకుండా పూల మొక్కల్ని చూస్తోంది. వెనక నుండి ధృతి వెళ్లి చేయి పట్టుకుని లాగేసరికి ఆశ్చర్యంగా చూసి కళ్ళు తుడుచుకుంది.

“ఏయ్! ఏమైందే నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎదుటి వాళ్ళని ఏడిపించడమే గానీ, నువ్వు ఏడ్చిన దాఖలాలు నీ డిక్షనరీలోనే లేవు కదా! ఏమైందే నీకు” అంది ధృతి.

“ఏం లేదు. ఎప్పుడొచ్చావే” అంది హసంతి కళ్ళు తుడుచుకుని, తెచ్చి పెట్టుకున్న నవ్వుతో.

“ఏంటి? నా దగ్గర కూడా దాచాలనుకుంటున్నావా?! చిన్నప్పటినుంచి చూస్తున్నాను. నీ ఫీలింగ్స్ ఏంటో నాకు తెలియవా! కనీసం ఎంగేజ్మెంట్ అని కూడా చెప్పనంత దూరంగా పెట్టావు. ఎట్లీస్ట్ ఫోన్ చేసినా పలకవు. నువ్వు చేసి మాట్లాడవు.”

హసంతి బదులు ఇవ్వకుండా ధృతి వైపు చూసింది.

“నీతోనే మాట్లాడుతోంది. ఏంటి నాతో మాట్లాడవా?” అంది ధృతి.

కవిత ఇద్దరికీ కాఫీ తెచ్చింది.

“ఏమైంది ఆంటీ! దీనికి. నేను మాట్లాడిస్తున్నా, తనని కాదన్నట్టు ఎవరో కొత్త మనిషిని చూసినట్టు చూస్తోంది.”

“పది మాటలు మాట్లాడాల్సిన చోట ఒక్క మాట మాట్లాడుతోంది మీ ఫ్రెండ్” అంది కవిత.

“అలాగే ఉంది ఆంటీ! దీని వాలకం.”

“వంట చేస్తాను. కాసేపాగి ఇద్దరూ కిందికి రండి” అని వెళ్ళింది.

“అవునూ.. ఏమైంది నీకు? నువ్వు ఇలా సైలెంట్‌గా ఉండే మనిషివి కాదే. సంథింగ్ రాంగ్. అంటే నీకు కార్తీక్‌కి జరిగిన ఎంగేజ్మెంట్లో ఏదైనా గొడవ జరిగిందా?” అని ధృతి అడుగుతుంటే..

“నో. ఎంగేజ్మెంట్ కార్తీక్‌తో కాదు” అంది హసంతి.

హసంతి చెప్పిన కార్తీక్‌ని మొదటిసారి చూసినప్పుడు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రతి విషయం ధృతికి కళ్ళ ముందు కదిలాయి. అప్పటికే హసంతి కళ్ల వెంట ధారాపాతంగా కన్నీళ్లు కారుతున్నాయి. హసంతి వేగంగా కదిలి ధృతిని హగ్ చేసుకుంది.

“మనకు ఇష్టం లేని ఒక్క చెడు విషయాన్ని మర్చిపోవాలంటే.. వంద మంచి విషయాల పైకి మనసు మళ్లించాలంటారు. కానీ వంద మంచి విషయాల పైకి దృష్టి సారించడానికి.. కార్తీక్‌ని నేను అయిష్టంతో ప్రేమించలేదు. పైగా అది నేరంగా కూడా నాకు అనిపించడం లేదు.” అంది హసంతి ఏడుపు స్వరంతో.

“సరే! ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఎవరితో జరిగింది?”

“గౌతమ్‌తో. అతను మా మేనత్త కొడుకు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. మా చిన్నప్పుడు మా అత్తయ్యకి జబ్బు చేసి, చనిపోతూ మా అమ్మతో గౌతమ్‌కి నాకు పెళ్లి జరిపించాలని మాట తీసుకుందట”..

“అయితే గౌతమ్ కోసం కార్తీక్ ప్రేమని త్యాగం చేయాలనుకుంటున్నావా?”

“ఇందులో త్యాగం ఏమీ లేదు? ఇంట్లో అమ్మను ఎదిరించి నేనే ఎటూ తేల్చుకోలేక పోతున్నాను.”

“నువ్వు చెప్పేది కామెడీగా ఉంది. చిన్న విషయం అయినా నీకు నచ్చకపోతే, ఇంటిని ఒక ఆట ఆడించి మాట నెగ్గించుకునే మహారాణివి. నీ మాట ఇంట్లో వాళ్ళు వినటం లేదనటం హాస్యాస్పదంగా లేదా!?”

“ఇదే విషయాన్ని ఇండైరెక్టుగా మా అమ్మని కూడా అడిగాను. మొన్న నేను గదిలో ఒంటరిగా చీకట్లో కూర్చున్నప్పుడు మా అమ్మ వచ్చింది.

‘పెళ్లి కాబోయే ఆడపిల్ల ఇలా ఒంటరిగా చీకట్లో కూర్చుంటే వచ్చిపోయే వాళ్ళు ఏమనుకుంటారు? కిందకి రా !’ అని లైట్ వేసి అమ్మ వెళ్తుంటే..

‘అమ్మా! నిన్ను ఒకటి అడగనా?’

‘ఏంటో అడుగు తల్లీ!’

‘నా ఫ్రెండ్ సౌమ్య తెలుసుగా!’

‘బెంగళూరులో జాబ్ చేస్తోందని చెప్పావు’

‘అవును.. తనే. ఒక అబ్బాయిని ప్రేమిస్తోంది. కానీ ఇంట్లో వాళ్ళు వేరే సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేశారు. అది తప్పు కదమ్మా! మనసులో ఒకరిని ఉంచుకుని, పెళ్లి మరొకరిని చేసుకోవటం’ అన్నాను.

‘తప్పెలా! అవుతుంది? ప్రేమించి మనసుకు నచ్చిన వాడినే చేసుకోవాలంటే ప్రపంచంలో 90% ఆడపిల్లలకి పెళ్లిళ్ళే కావు. సౌమ్య ప్రేమించడం తప్పు కాదు. ఇంట్లో వాళ్ళు చూసిన అబ్బాయిని చేసుకోవటమూ తప్పు కాదు. ఆడపిల్ల తల్లిదండ్రులు, కుటుంబమే ముఖ్యమని భావిస్తే తన ప్రేమను త్యాగం చేయటంలో తప్పేమీ లేదు. నువ్వు ఎవరో గురించి ఎక్కువగా ఆలోచించకు’ అంది.

ఇప్పుడు చెప్పు ధృతీ!.. సడన్‌గా రేపు ఎంగేజ్మెంట్ అని ఇంట్లో వాళ్ళు ఈ రోజు సాయంత్రం చెప్తే, ఏం చేయాలో నువ్వే చెప్పు” అంది కళ్ళు తుడుచుకుంటూ.

“అంటే మీ అమ్మ, గౌతమ్ వాళ్ళు కలిసి వాళ్ళ సెంటిమెంట్‌ని బలవంతంగా నీ మీద రుద్ది ఎంగేజ్మెంట్ కూడా పూర్తి చేశారన్నమాట” అంది ధృతి.

“రఘురాం మామయ్యకి హార్ట్ ప్రాబ్లం వల్ల బైపాస్ సర్జరీ చేశారు. దాంతో ఆయనకి భయం పట్టుకుంది. యు.ఎస్.లో జాబ్ చేస్తున్న గౌతమ్‌ని పిలిపించారు. ఇంటికి వచ్చారు, చూశారు, రెండు రోజుల తర్వాత ఎంగేజ్మెంట్ అన్నారు. నేను పెద్దవాళ్ళని తప్పు పట్టడం లేదు.

ఎందుకంటే మనలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో తల్లిదండ్రులు ఇలా ఆలోచించడానికి కారణం సమాజమే. వీళ్లేమంటారో, వాళ్లేమనుకుంటారో, బంధువులు ఇళ్ళకి రారేమో, ఫ్రెండ్స్‌లో పలచనైపోతామోనని భయపడుతూ.. వాళ్లకి ఇష్టమైన జీవితాన్ని తల్లిదండ్రులు గడపలేకపోతున్నారు. ఇటు పిల్లలని స్వేచ్ఛగా ఉండనివ్వలేక పోతున్నారు.. వాళ్లకి స్వేచ్ఛ ఇవ్వలేకపోతున్నారు.

సామాజిక భయం ముసుగులోనే జీవిస్తున్నారు. చిన్నప్పటి నుంచి మనకి కావాల్సిన చదువులు, సౌకర్యాలు అప్పులు చేసైనా సమకూరుస్తున్నారు. కానీ పెళ్లి దగ్గరకి వచ్చేటప్పటికి వాళ్ళ మాటే నెగ్గాలనుకుంటున్నారు. సోషల్ స్టిగ్మా ఎలా పనిచేస్తుందో చూడు.

ఇలాంటి ఇంట్లో నేను ఇలాగే ఉండి తీరాలి. అందుకే పది మాటలు మాట్లాడే చోట.. ఒక్క మాటతోనే సరిపెడుతున్నాను.” అంది హసంతి ఆవేదనగా.

“అబ్బా! హసంతి నువ్వు చెప్పింది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. సరే! మీవాళ్ళని వదిలేయ్.

గౌతమ్‌తో నేనింకో అబ్బాయిని ప్రేమిస్తున్నానని ధైర్యంగా చెప్పొచ్చుగా!” అంది ధృతి.

“గౌతమ్ వీళ్ళ కంటే డిఫరెంట్‌గా ఉన్నాడు.”

“అంటే!?”

“డీసెంట్ గానే ఉన్నాడు. మంచి జాబ్ చేస్తున్నాడు. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన మాటకు కట్టుబడి నన్నే తలచుకుంటూ పెరిగాడు. అది అతని తప్పూ కాదు. కానీ నా వల్ల అతని జీవితంలో ఎటువంటి సునామి రాకూడదు అనుకుంటున్నాను.”

“అంటే అతనితో పెళ్లికి సిద్ధపడ్డానని చెప్పు”

“అది కాదు. అతను బాగుండాలని కోరుకుంటున్నాను.”

“అదే నిజమైతే గౌతమ్‌ని పెళ్లి చేసుకున్నాక, అతనితో నువ్వు బాగుండాలిగా! మనసులో కార్తీక్, మనువులో గౌతమ్.. అంటే నీ మనస్తత్వం ఒప్పుకుంటుందా! అడ్జస్ట్ అవుతుందా! ఒక్కసారి ఆలోచించు. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలంటారు. నీ ప్రేమ గురించి గౌతమ్‌తో నువ్వే చెప్పాలి!”

“అదే.. నా వల్ల కావడం లేదు. చెప్పే అవకాశమూ కలగటం లేదు. చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. కానీ ఎందుకనో చెప్పలేకపోతున్నాను.”

“నీ మాటల్ని బట్టి చూస్తే గౌతమ్ నీలో ప్రవేశించి నీ మనసంతా ఆక్రమించుకున్నాడు” అంది ధృతి.

“ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు”

“హసంతీ! నువ్వు గౌతమ్ లైఫ్ బాగుండాలని ఆశిస్తున్నావు. కానీ అతనితో ఎంగేజ్మెంట్‌కి ముందే.. కార్తీక్‌తో నీ ప్రేమ గురించి అతనికి ఇప్పటికే చెప్పి ఉండాల్సింది. ఇప్పటికీ మించిపోలేదు. గౌతమ్ నీతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు కదా! డైరెక్ట్‌గా చెప్పలేకపోతే ఫోన్లో చెప్పు. అయినా నువ్వు ఎప్పుడైనా అతనికి ఫోన్ చేసావా? చెయ్యవు. ఎందుకంటే నీ మనసులో కార్తీక్ ఇంకా ఉన్నాడు. ఎంగేజ్మెంట్ అయినా గౌతమ్‌తో నువ్విలా ముభావంగా ఉంటే, తను నీకు నచ్చాడో లేదో అని ఆలోచిస్తాడు కదా! ఎప్పుడూ నీ వైపు నుండే కాకుండా, కాస్త గౌతమ్ వైపు నుండి కూడా ఆలోచించు. ఎంగేజ్మెంట్ అయిందంటే సగం పెళ్లయినట్టే. నీతో గడపాలని, నీతో మాట్లాడాలని గౌతమ్ ఆశించడంలో తప్పే లేదు. కార్తీక్ గురించి, అతని ఆలోచనల నుంచి ముందు బయటికి రా! అసలు గౌతమ్ తప్పు ఏమైనా ఉందా? బాగా ఆలోచించు. ఈ ఆలోచనలన్నీ ఎంగేజ్మెంట్ జరగకుండా ఆపగలిగితే నువ్వు చెబుతున్నవి వాస్తవాలే. నౌ టైం ఈజ్ ఓవర్. గౌతమ్ గురించి ఆలోచించడం మొదలు పెట్టు” అని లేచి వెళ్ళిపోయింది ధృతి

***

గౌతమ్ చీకట్లో కూర్చొని లాప్‌టాప్‌లో..

‘గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా!

ప్రేమల ప్రశ్నకు కన్నులు బదులంటే మౌనమా!’

పాట వింటూ, చూస్తున్నాడు.

గౌతమ్ తండ్రి రఘురాం వచ్చి లైట్ వేసేసరికి తలెత్తాడు.

“ఏమైందిరా! గౌతమ్? చీకట్లో ఒంటరిగా కూర్చుని విషాద గీతాలు వింటున్నావేంటి? ఎప్పుడూ హ్యాపీగా ఉండే నువ్వేంటి రా! ఇలా ఏదో కోల్పోయినట్టు ఉంటున్నావు? నేను వచ్చి పది నిమిషాలైనా గమనించనంతగా దేనిని గురించి ఆలోచిస్తున్నావు?” అని లాప్‌టాప్ ఆఫ్ చేశాడు.

గౌతమ్ తండ్రి వైపు చూశాడు.

“ఏంట్రా? ఏమైంది?” అన్నాడు కొడుకు భుజం మీద చెయ్యేసి.

“డాడీ! హసంతికి నేను నచ్చానో లేదో అడిగే ఈ పెళ్లి ఫిక్స్ చేశారా” అన్నాడు.

“ఎంగేజ్మెంట్ అయ్యాక ఈ మాట అడిగేంత సంఘటన ఏం జరిగిందిరా! మీ ఇద్దరి మధ్య”

“లేదు డాడీ! నేను చిన్నప్పటి నుంచి హసంతిని ఇష్టపడుతున్నాను. తనూ అలాగే నన్నూ ఇష్టపడుతుందో, లేదో తెలుసుకోవాలని ఉంది”

“హసంతి ఏమైనా అందా? ఇద్దరూ ఏమైనా గొడవపడ్డారా?”

“అలాంటిదేం లేదు. అసలు నాతో మనస్ఫూర్తిగా తను మాట్లాడటం లేదననిపిస్తోంది.”

“అవన్నీ నీ అపోహలు. ఆడపిల్లలు మగ పిల్లలంత తొందరగా చొరవగా మాట్లాడారు. నువ్వే ఆమెతో కల్పించుకొని మాట్లాడాలి. బయటికి తీసుకెళ్లాలి. మనసు విప్పి మాట్లాడాలి. మనకి సమయం తక్కువగా ఉంది. ఈ లోపల ఇలాంటి సమస్యలు పెట్టుకుని, మనసు పాడు చేసుకోకు. అంతా సవ్యంగానే జరుగుతుంది. బీ హ్యాపీ” అన్నాడు రఘురాం

***

అదే సమయంలో..

గదిలో ఒంటరిగా కూర్చుంది హసంతి. ధృతి వెళ్లిపోయాక ఆమె చెప్పిన మాటలు, తల్లి అన్న మాటలు పనిచేయటం ప్రారంభించాయి.

అవును మధ్యలో గౌతమ్ తప్పేముంది? చిన్న వయసు నుండి పరిచయం ఉన్న అతని ప్రేమను కాదనుకోవటంలో అర్థం లేదు. అటు తల్లిదండ్రుల పాత్ర గాని, కార్తీక్ పాత్ర గాని ఏముంది? కార్తీక్ తన వెంట పడటం లేదు. తనే పరిచయం లేని అతనిని గురించి ఎక్కువగా ఆలోచించి ‘లవ్ ఈజ్ బ్లైండ్’ అన్నట్టు ఊహించుకుంటోంది. తప్పెవరిది? అని ప్రశ్నించుకుంటే కనిపించే తొలి ముద్దాయిని నేనే.

‘దూరపు కొండలు నునుపు అన్నట్టు అసలు కార్తీక్‌కి తనెవరో తెలియకుండా, అతనికి కనీసం తను ప్రేమిస్తున్నట్టు చెప్పకుండా.. దగ్గరగా కనిపిస్తున్న స్వాతిముత్యం లాంటి గౌతమ్పై అనవసరపు వ్యతిరేకత పెంచుకోవడం తన తప్పే.’ అని ఆలోచించిన హసంతి, ఫోన్ తీసుకొని గౌతమ్‌కి కాల్ చేసింది.

***

తండ్రితో తన మనసులోని బాధంతా చెప్పుకున్న గౌతమ్‌తో “ఎక్కువగా ఆలోచించకు రా! పెళ్లయితే అన్నీ అవే సర్దుకుంటాయి. పెళ్లి కాని ప్రతి అమ్మాయికీ ఏవో కొన్ని ఊహలు, ఆశలు ఉంటాయి. అందరికీ అన్నీ 100% సంతృప్తినివ్వవు. ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా హసంతితో ఫ్రీగా ఉండు” అన్నాడు రఘురాం.

అంతలో ‘కానున్న కల్యాణం ఏమన్నది ? స్వయంవరం, మనోహరం’ ఫోన్ రింగ్ టోన్ వినిపించేసరికి

“డాడీ! హసంతి ఫోన్ చేసింది” అన్నాడు సంతోషంగా.

“ముందు మాట్లాడు”

“హలో!”

“ఈరోజు మనం బయట ఎక్కడైనా కలుద్దామా! గౌతమ్” అని హసంతి అడిగింది.

“ఆఁ.. ఖచ్చితంగా. నేనే వచ్చి పికప్ చేసుకుంటాను”

“సరే బై!” అని ఫోన్ పెట్టేసింది.

“డాడీ! హసంతి బయట కలుద్దామంది.”

“నేను చెప్పలా! నువ్వు ఊహించుకున్నట్టు ఏమీ ఉండదని. ముందు హసంతిని మాట్లాడనియ్యి. మాటకు ముందు నువ్వే గబగబ మాట్లాడకు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వు. అప్పుడే నీ ప్రశ్నలకి జవాబు దొరుకుతుంది.”

“అలాగే డాడీ!”

“ఎంజాయ్” అని కొడుకు భుజం తట్టి వెళ్ళిపోయాడు రఘురాం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here