మహతి-45

5
3

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[కరణం గారి అమ్మాయి పెళ్ళి వైభవంగా జరుగుతుంది. వంట బ్రాహ్మడు సుబ్బారాయుడి గారికి బదులుగా వారి మనవడు సత్యనారాయణ శాస్త్రి వస్తాడు. అతను కొన్ని నిబంధనలను పెడతాడు. అద్దెకిచ్చే షామియానాల కింద వంట చెయ్యననీ, అద్దెకిచ్చే గరిటలూ, గంగాళాలు, సత్తు పాత్రలతో సహా వేటిని వాడననీ, శాఖాహార ఇళ్ళల్లో వుండే గంగాళాలు, గ్లాసులు చెంబులు వంట పాత్రలు మాత్రమే వాడతాననీ అంటాడు. అందుకు సహేతుకమైన కారణాలు చెప్తాడు. పెళ్ళిళ్ళు సరే, రేపెప్పుడైనా పెద్ద కర్మలకీ సంవత్సరీకాలకీ వంట చెయ్యాల్సి వస్తే అని కరణంగారు ప్రశ్నిస్తే, పాత్రశుద్ధి కూడా ఉండాలండీ అంటాడతను. అతని వైఖరి గురించి మహతికి చెప్పి మహతిని అతనికి పరిచయం చేస్తుంది మనోరమ. తాను బిఎ చదివాననీ, తర్వాత మూడేళ్ళు కంప్యూటర్ కోర్సులు చేశాననీ, అయినా, వంట వండి వడ్డించడాన్ని ఒక ఉపాసనగా భావిస్తాననీ అందుకే దీన్లోకి వచ్చాననీ చెప్తాడు. సంవత్సరమంతా బిజీగా ఉండలేము కాబట్టి, తమ ఊళ్ళో ఓ కంప్యూటర్ సెంటర్ పెట్టి దాదాపు నలభై మందికి కంప్యూటర్ నేర్పిస్తున్నానీ, పాకవిద్యపై ఆసక్తి ఉన్న కొందరిని తన వెంట తిప్పుతూ తర్ఫీదు ఇస్తున్నాననీ చెప్తాడు. అతని మాటా, పద్ధతి అన్నీ మహీకి బాగా నచ్చుతాయి. మర్నాడు అతనికీ మహతికి మధ్య డబ్బు సంపాదన గురించి, జీవితం గురించి చర్చ జరుగుతుంది. బజ్జీలకి, కూరకీ ఉపయోగించే అరటికాయల్లో ఎలాంటి తేడాలుండాలో అతను చెప్తే మహతి ఆశ్చర్యపోతుంది. పెళ్ళికి మహతి తల్లిదండ్రులు తమ్ముడు చెల్లీ వచ్చి వెళ్తారు. వాళ్లతో శ్రీధర్ గారి అనారోగ్యం గురించీ, కుసుమ గురించీ, పెళ్ళి గురించీ, సత్యా పాటించిన పద్ధతుల గురించీ మాట్లాడుతుంది మహీ. పెళ్ళయ్యాకా, సాయంత్రం వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ పెళ్ళిలో కొందరు – తమ కొడుకుని పెళ్ళి చేసుకుంటావా అని మహతిని అడుగుతారు. కొన్ని సంబంధాలు అమ్మానాన్నలకి చెప్పారు. పెళ్ళిళ్ళలోని అనవసరపు ఖర్చుల గురించి వనజ, త్రిపుర, మహతిల మధ్య చర్చ జరుగుతుంది. దుబారా అరికట్టే పద్ధతిని మధ్యతరగతి వాళ్ళు పాటించాలని అంటుంది మహతి. నీ పెళ్ళికి అలా పాటిస్తావా అని వనజ గారంటే, తప్పకుండా పాటిస్తానని చెప్తుంది మహతి. – ఇక చదవండి.]

మహతి-3 మహి-12

[dropcap]డా.[/dropcap] సూరిగారు వచ్చారు. హాస్పటల్‌కు వెళ్ళకుండా డైరక్టుగా మా ఇంటికొచ్చారు. తాతయ్య తీరిగ్గా రామాయణం చదువుతున్నాడు. అది రామాయణ బొమ్మల పుస్తకం. ఆయనకి బొమ్మలంటే ప్రాణం.

“రచన ఎంత కష్టమో చిత్రలేఖనం అంతకన్నా కష్టం అమ్మ” అంటాడు నాతో. డా. సూరి తాతయ్యని పలకరించి, “తాతగారూ, మహీ.. నేను మీతో ఓ ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చాను..” అన్నారు.

“హాయిగా కాఫీ తాగుతూ చెప్పు బాబూ” అన్నాడు తాతయ్య.

“కాఫీ గురించి కాదు లెండి. మహీ కూడా ఇక్కడే ఉంటే బాగుంటుంది.” అన్నారు.

“సరే.. చెప్పండి” అన్నాడు తాతయ్య.

“ఎన్నిసార్లు చెప్పినా శ్రీధర్ పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. మీరు అతన్ని ఒప్పించాలి” అన్నారు డా. సూరి.

“గాలి పెళ్ళి మీదకు మళ్ళిందని ఒకసారి నాతో అన్నారు డాక్టర్. ఇప్పుడు మీరు ప్రయత్నిస్తే ఆయన్ని ఒప్పించటం కష్టం కాదనుకుంటాను.” అన్నాను.

డా. సూరి ఆశ్చర్యపోయి, “నీతో అన్నాడా..!” అన్నారు.

“అవును” అన్నాను.

 ఓ సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచారు సూరి. “పిల్ల ఎవరో, ఎవర్ని పెళ్ళాడాలనుకున్నాడో ఏమైనా చెప్పాడా?” సూరి గారు అన్నారు. తాతయ్య సైలెంటుగా వింటున్నాడు.

“లేదండీ. ఆయన చెప్పేముందే ఓ సారి యాక్సిడెంట్ కేస్ వచ్చింది. అంబులెన్స్ తెచ్చింది మీరేగా అప్పుడు. ఆ తరువాత ఫీవర్ రావడంతో పెళ్ళి గురించిన ఏ మాటా జరగలేదు” అన్నాను. కాసేపు నిశ్శబ్దం రాజ్యం చేసింది.

“సరే నాకు తెలిసింది నేను చెబుతాను. అతనికి చుట్టాలు పక్కాలు ఎవరూ లేరు. ఉన్నారేమో తెలీదు కూడా. చాలా కష్టపడి డాక్టరయ్యాడు నా స్నేహితుడు. స్నేహితుల్నే బంధువులుగా పరిగణిస్తాడు. ఓ మేనమామ ఉన్నాడని మేం చదువుకునేటప్పుడు ఓసారి చెప్పాడు. అంతే. ఆ తరువాత ఏ సంగతీ ఎత్తలేదు. కొంత ఆస్తి వుందని చెప్పేవాడు. పెళ్ళి విషయం ఏనాడూ తను ఎత్తలేదు. మేం ఎత్తినా ‘పెళ్ళా’ అని నవ్వేసేవాడు. మొన్న జ్వరం వచ్చినప్పుడు అతన్ని చూశాకా చాలా బాధ కలిగింది. జీవితం నిస్సారంగా గడవకుండా ఉండాలంటే తోడంటూ ఒకరు ఉండాలి. ఈ ఇంట్లోకి అతను మారాక, మీ అందరి గురించి ఉత్సాహంగా అతను చెబుతుంటే, అప్పుడు నాకు అనిపించింది. మీరు అతన్ని పెళ్ళికి ఒప్పించగలరని” అన్నారు డా. సూరి. చిన్నగా నవ్వాడు తాతయ్య.

“అలాగే సూరిగారు. దానికేముందీ, పిల్ల అంతే చూపించి ఫలానా పిల్లని చేసుకుంటే బాగుంటుందని చెప్పగలం. ఏదీ, ఎవరూ లేకుండా పెళ్ళి చేసుకో అని చెప్పడం?” అన్నాడు తాతయ్య.

“డా. శ్యామల చాలా మంచిది. నేనడగలేదు గాని, శ్యామలకి శ్రీధర్ అంటే ఇష్టమేనని అనుకుంటున్నాను. శ్యామల మీద శ్రీధర్ అభిప్రాయ౦ మీరు తెలుసుకుని చెబితే బాగుంటుంది” అన్నారు సూరి.

“అదెంత భాగ్యం.. ఇవ్వాళే అడుగుతాను. ఒకవేళ శ్రీధర్ ఒప్పుకున్నాక శ్యామల గారు No అంటే?” అన్నాడు తాతయ్య.

“నూటికి నూరు పాళ్ళు no అని అనడని నా నమ్మకం” అన్నారు డా. సూరి.

“అయితే ఒక పని చెయ్యండి సార్. మీరు శ్యామల గార్ని అడగండి. మేము శ్రీధర్ గార్ని అడుగుతాం. అప్పుడు విషయం స్పష్టంగా ఓ కొలిక్కి వస్తుంది” అన్నాను నేను.

చిన్నగా నవ్వి “అందుకే నేను ఇక్కడికి వచ్చింది. మహీ, నువ్వు తాతగారు యీ విషయాన్ని హేండిల్ చెయ్యగలరని నాకు మొదటినించి నమ్మకమే!” అన్నారు డా. సూరి.

ఆయన వెళ్ళిపోయాక, ఈ విషయం మీద నేనూ తాతా కాసేపు చర్చించాము.

“అతని జీవితంలో ఏదో జరగకూడనిది జరిగి వుంటుంది. లేకపోక అందర్నీ దూరంగా పెట్టి ఒంటరిగా బ్రతకడు. ఆస్తిపాస్తులు ఉండొచ్చు. కానీ, ఆదరనే కరువై ఉంటుంది. ఆ విషయాలు అడగడం భావ్యం కాదు. పెళ్ళి విషయం వరకే మాట్లాడదాం.” అన్నాడు తాతయ్య. నిజమే కదా! కష్టపెట్టుకునే విషయాన్ని ఎత్తడం ఎందుకూ? అనుకున్నాను. శ్రీధర్ గారికీ శ్యామలకీ పెళ్ళి జరిగితే బాగానే ఉంటుంది.

“అన్నట్టు శ్యామలగారి విషయాలు కూడా మనం పూర్తిగా తెలుసుకోలేదుగా. ఆమె కుటుంబం గురించీ మిగతా వివరాల గురించీ మనకేమీ తెలీదుగా!” అన్నాను నేను.

“ఆ విషయాలు మనకి సంబంధం లేనివి. ఎందుకంటే, శ్రీధర్‌ని పెళ్ళికి ఒప్పించడం వరకే మనకి అప్పగించబడిన బాధ్యత. మిగతా విషయాలు సూరిగారే చూసుకుంటారు” అన్నాడు తాతయ్య.

***

ఫోన్ మ్రోగింది. అమ్మ లైన్‍లో ఉంది. “చెప్పమ్మా ఎలా ఉన్నారు అందరూ?” ఉత్సాహంగా అన్నాను. “తాతయ్య వాకింగ్ వెళ్ళారా?” అన్నది అమ్మ. “అవును.” అన్నాను అయోమయంగా.

“నీతో కొన్ని విషయాలు విడిగా మాట్లాడడానికే ఇప్పుడు ఫోన్ చేశాను.” అన్నది. నేను అవాక్కయ్యాను. ఏం మాట్లాడబోతోందో అని నాకు ఆశ్చర్యం. అయినా తేరుకుని, “చెప్పమ్మా ఏమిటి విశేషం?” అన్నాను. ఓ క్షణం మా ఇద్దరి మద్య సైలెన్స్,

“మహీ.. నీ జీవితంలో నువ్వు ఏం కాదలుచుకున్నావో స్పష్టంగా చెప్పవలసిన పరిస్థితి ఇది. ఊరికీ, ప్రపంచానికీ – విస్తళ్ళు మంచివా, పేపర్ ప్లేట్లు మంచివా, ఎవరెందుకు విడాకులు ఇస్తున్నారూ, ఎక్కడ ఏ సేవ చెయ్యాలీ ఇలాంటివి చేస్తు సమయం గడుపుతానంటే ఓ తల్లిగా నేను చూస్తూ ఊరుకోలేను. తాతయ్య కోసం ఆ ఊర్లో ఉండి పోతానన్నావు. దానికి నీవిచ్చిన కారణాలూ సరైనవే అని ఊరుకున్నాను. ఇప్పుడు తాతయ్య చాలా చాలా కోలుకున్నారు. ఆయన ఉన్న ఇప్పటి స్థితిలో ఇక్కడికి తీసుకొచ్చినా బాగానే ఉంటారు. So,” ఆగింది అమ్మ సుదీర్ఘంగా శ్వాస తీసుకుంటూ.

“So, ఇప్పుడు అర్జంటుగా బయలుదేరి అక్కడికి వచ్చెయ్యమంటావా? నేను ‘కాని’ పసులను చేస్తే నువ్విలా మాట్లాడవచ్చా, నేనే పని చేసినా ఊరి మంచికేగా. అదీగాక నేను సంవత్సరం గ్యాప్ అడిగాను. ఆ లోగా ఖచ్చితంగా నిర్ణయించుకుంటాను ఏం చెయ్యాలో. ఇప్పటికిప్పుడు ఎందుకు తొందరపెడుతున్నావూ?” అడిగాను. అమ్మకి ఎవరో నా మీద బాగా ‘ఎక్కించి’ వుండాలనిపించింది. అందుకే నాకు కోపం వచ్చి నిర్మొహమాటంగా మాట్లాడాను.

“నీతో చర్చించడాని చెయ్యలేదు మహీ.. అలాగని నీ చేత నీకు ఇష్టం లేని పని చేయించడానికో నేను ఫోన్ చెయ్యలేదు. జీవితం మనుషుల కోసం ఆగదు. జీవితం అంటే, అంతా మన ఇష్టంతో జరిగేది కాదు. కొన్ని జరుగుతై, కొన్ని జరగవు. జీవితం అంటే ఓ విధంగా రాజీ లాంటింది. సరే.. నేనేమీ జీవితాన్ని కాచి వడబోసిన దాన్ని కాదు. నాకు కావల్సింది ఒక్కటే. ప్రజలకి ఉపయోగపడే పనులు చేయద్దని నేను అనను. నువ్వేది చెయ్యాలన్నా మొదటి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే శక్తి సంపాయించాలి. కనీస విద్యార్హతలు కూడా ఉండి తీరాలి. సినిమాల్లో అన్నీ జరిగిపోతై. జీవితంలో అలా జరగదు.” గ్యాప్ తీసుకుంది అమ్మ. ఆవిడ మాటలు చాలా నిస్పృహతో ఉన్నై.

“అసలేం జరిగిందమ్మా” మెల్లగా అడిగాను.

“ఏమి జరగలేదు. ఏమీ జరగదు కూడా. నేను ఆలోచించేది నీ కోసం. నిన్నక్కడ వదిలేసి, నీకో మార్గం ఏర్పరచకుండా నేను ప్రశాంతంగా ఉంటానని ఎలా అనుకుంటావూ?” సీరియస్ గానే అన్నది అమ్మ.

“ఎవరూ… అహల్యా మాట్లాడుతున్నదీ?” వస్తునే అడిగారు తాతయ్య.

“నేను నీతో మాట్లాడినది ఏదీ తాతకి చెప్పకు. ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. కానీ మహీ.. నేను అన్న విషయాన్ని తేలిగ్గా తీసుకోకు. మళ్ళీ ఫోన్ చేసినప్పుడు నీ ప్లానంతా స్పష్టంగా నాకు చెప్పి తీరాలి. ఇప్పుడు తాతయ్యకి ఇవ్వు” అన్నది అమ్మ.

“తాతయ్యా, అమ్మ మాట్లాడుతుందట” అని ఫోన్ తాతయ్యకి ఇచ్చి నేను వంటగదిలోకి వెళ్ళాను.

ఇంత సడెన్‍గా ఉరుము మెరుపు లేని వర్షంలా అమ్మ ఫోన్ వచ్చిందంటే, కారణం ఏమై వుండాలీ? చెప్పుడు మాటలు విని అవే గుడ్డిగా నమ్మే వ్యక్తిత్వం కాదు మా అమ్మది. ఏది ఆలోచించినా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంది. అలాంటిది ఇవాళ ఇలా మాట్లాడటం నాకు ఆశ్చర్యమే కాదు కంగారు కూడా పుట్టింది. తను నాతో మాట్లాడే విషయం మా నాన్నకి చెప్పివుండదని నాకనిపించింది.

తాతయ్య మాటల్ని బట్టి గ్రహిస్తే, అమ్మ తాతయ్యతో మామూలుగానే మాట్లాడుతున్నదనిపించించింది. పుట్టిన తరువాత మా అమ్మ ఏనాడూ ఇంత సీరియస్‍గా నాతో మాట్లాడలేదు.

“మహీ.. అమ్మ పిలుస్తోంది” అన్నాడు తాతయ్య. ఫోన్ తీసుకుని ‘హలో’ అన్నాను.

“నీతో సీరియస్‍గా మాట్లాడినందుకు సారీ. కానీ కొన్ని విషయాలు అలాగే ఉంటాయి. అసలు నిజం చెప్పాలంటే నీకు పెళ్ళి చేద్దామనుకున్నా. కానీ, మినిమమ్ ఎడ్యుకేషన్ ఇవ్వకండా నిన్ను నట్టేట ముంచలేను. కానీ, నువ్వు పరిస్థితులను అర్థం చేసుకోకుండా మొండి పట్టుపడితే నేనేం చెయ్యలేను. వీలున్నంత త్వరగా మళ్ళీ కాలేజీలో చేరు. నేను చెప్పేదీ, చెప్పదలుచుకున్నదీ ఇదే.” ఫోన్ పెట్టేసింది.

ఏం జరిగి వుండాలీ? నాన్నకి ఫోన్ చెయ్యొచ్చు. కానీ ఎందుకో ఫోన్ చెయ్యలేకపోయాను. అమ్మ మాట్లాడిన మాటల ప్రకారం నాన్నకి కూడా విషయం ఏమిటో అమ్మ చెప్పిందని నాకు అనిపించలేదు. సురేన్‌కి ఫోన్ చేసి డిస్టర్బ్ చెయ్యదలచుకోలేదు. తమ్ముణ్ణీ, చెల్లిని అడగటం వ్యర్థం. వాళ్ళకి అసలు ఏమీ తెలిసి ఉండదు.

మంచం మీద పడుకుని ఆలోచించాను. నేను చేస్తున్న పనుల్లో తప్పు ఏదైనా వున్నదా? నా ప్రవర్తన మీద ఎవరైనా అభాండాలు వేశారా? ఉడత మీద ఉరుము పడినట్లు సడెన్‍గా యీ పెళ్ళి వ్యవహారం తెర మీదకి ఎలా వచ్చిందీ? ఠక్కున లేచి కూర్చున్నా.

శ్రీధర్ గారు ఏమైనా వెళ్ళి గురించి ఎత్తారా? అమ్మ అపార్థం చేసుకొని నన్ను ఇక్కడి నించి తప్పించడానికి ప్రయత్నిస్తున్నదా? లక్షా తొంభై ఆలోచనలు.

అవుమా, పెళ్ళి విషయం ఎత్తినప్పుడు సూరిగారు కూడా తాతయ్యతోబాటు నన్ను ఉండమన్నారు. శ్యామల గురించి చెప్పేటప్పుడు నేను కూడా ఉండాల్సిన ఆవశ్యకత ఏముంటుంది. నా మూడ్స్ కనిపెట్టడానికి శ్యామల విషయం సూరి గారు ఎత్తారా? మనసు పరిపరి విధాలపోతోంది.

“మహీ.. ఏమిటీ ఆలోచిస్తున్నావూ?” అన్నాడు తాతయ్య.

“ఏం లేదు తాతయ్య.” అన్నాను చిన్నగా నవ్వే ప్రయత్నం చేస్తూ.

ఏడవడానికే కాదు.. నవ్వడానికి కూడా కారణం వుంటుంది. వుండాలి.

“మహీ.. కారణం చెప్పమని అడగను. మీ అమ్మ ఫోన్‌లో బాగానే మాట్లాడింది గాని, ఆ మాటలు సహజంగా లేవు. మీ అమ్మతో మాట్లాడాకా నీ ముఖము ఓ విధంగా మారింది. సహజంగా లేదు. కారణాలు అనేకం కావొచ్చు. ఒక్కటి మాత్రం చెప్పగలను. యుద్ధం చెయ్యాలి అంటే ముందు సిద్ధపడాలి. ఆలోచనల్ని, ఆయుధాల్నీ, ఆచారణ క్రమాన్ని సిద్ధపరుచుకోవాలి. ఈ లోకమే ఒక ప్రవాహం లాంటిది. జీవితం కూడా ప్రవాహామే. కాళ్ళూ చేతులూ విదిలిస్తూ ఈతని ఆ నీళ్ళలోనే నేర్చుకున్నవాడు నీటిని జయించి హాయిగా ఒడ్డు చేరతాడు. ఈతకి భయపడ్డవాడు కాలంతో పాటు కొట్టుకుపోతాడు.” అన్నాడు తాత.. బయటికి అడుగులు వేస్తూ. ‘అమ్మయ్య’ అనుకున్నాను.

మళ్ళీ ఆలోచించడం మొదలెట్టాను, మంచం మీద వాలి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. సంఘంలో కావల్సినంత మంచి పేరు వుంది. నావల్ల మా ఇంటి పరువుప్రతిష్ఠలకి ఏ మాత్రం భంగం కాలేదు. నలుగురు నన్ను వేలెత్తి చూపే పని నేనేమి చెయ్యలేదు. మరి ఎందుకీ తీవ్రత అమ్మలో?

“మహీ..” అన్న పిలుపు వినిపించింది. త్రిపుర గారు. “రండి, రండి” అని సోఫాలో కూర్చోబెట్టాను. అవి ఫోమ్ సోపాలు కావు. పూర్వకాలం ‘వైర్’ తో అల్లినవి. వాటికి పొడుగూ వెడల్పూ ప్రకారం పరుపులు, దిళ్ళు కుట్టించినవి. త్రిపుర గారు కూర్చుని, “మా ఇంట్లోనూ ఇలాంటి సోఫాయే వుండేది.. అప్పుడు.. ఆ రోజుల్లో. మా వదిన గారి హయాం వచ్చాక అవన్ని పాత సామాను వాళ్ళ పరమైపోయాయి. మనకు అవి తీపి జ్ఞాపకాలు. కొందరికవి రోతలు” నిట్టూర్చారు.

“కాఫీ కలపనా? టీ నా?” అన్నాను.

“మాంఛి అల్లం టీ కలిపితే చాలా సంతోషిస్తా. తలనెప్పిగా ఉంది” అన్నారు త్రిపుర.

టీ పెడుతూ ఆలోచించాను. నా సమస్యని త్రిపుర గారితో చర్చిస్తే బాగుంటుందని. కానీ తలనెప్పితో బాధపడుతున్న ఆవిడకి మరో తలనెప్పి ఎందుకూ తగిలించడం. టీ తాగుతున్నాంత సేపూ మౌనం రాజ్యం చేసింది.

“మనం ఎన్నో అనుకుంటాం మహీ. మన వాళ్ళకీ, మన వూరికీ, మన చుట్టుపక్కల వాళ్ళకీ ఏదో చేసేద్దామని. ఎంత నిస్వార్థంగా మనం చేసినా వచ్చేది గుర్తింపు కాదు, విమర్శలు. అదీ క్రూరమైన విమర్శలు. పొద్దుటి నించీ మహిళామండలిలో స్వరూపరాణి విషయం చర్చకి వచ్చింది. పాయింట్ బ్లాంక్‍గా నేను చెప్పాను – రెండు పార్టీల వాదన విన్న తరవాత నిర్ణయం తీసుకోవాలని. వాళ్ళల్లో కొందరు ఏమన్నారో తెలుసా? ‘గొడ్రాలికేం తెలుసూ పురిటి నెప్పులూ’ అని. అసలీ మాటకీ సమస్యకీ సంబంధం ఏదన్నా వుందా?” కణతలు నొక్కుకుంటూ అన్నారు త్రిపుర.

“రిలాక్స్‌డ్‍గా టీ తాగండి” అనునయంగా భుజం మీద చేయి వేసి అన్నాను.

ఎంత క్రూరత్వం! ఆవిడకి పిల్లలు లేరుగనక ‘గొడ్రాలు’ అన్నారు సరే. మరి అందరూ స్వరూపరాణికే ఎందుకు సానుభూతి చూపిస్తున్నారు? స్వరూపరాణి అత్తగారు గొడ్రాలు కాదే. బిడ్డని కని భర్తగా స్వరూపకి ఇచ్చిందే. ఈ వూరికో న్యాయం ఆ వూరికో న్యాయమా? చెప్పలేనంత కోపం వచ్చింది.

“పదవి ఎన్నెన్ని నాట్యాలు చేయిస్తుందో ఇవ్వాళ కళ్ళరా చూశాను మహీ. ఆఫ్ట్రాల్ ఓ ఊరి మహిళామండలి ప్రెసిడెంటుకే ఇంత అహంకారం, దర్పం వుంటే, మినిస్టర్లకూ, ప్రధానులకూ ఎంతుండాలి?” ఓ చెప్పలేని బాధతో అన్నారు త్రిపురగారు. ఆవిడని అలా మాట్లాడనివ్వడమే మంచిదని నాకనిపించింది.

“లేదు మహీ, ఇది వాళ్ళ తప్పుకాదు. నాదే. దొంగ వచ్చినప్పుడు అరవాల్సింది కుక్క కానీ, గాడిద కాదుగా. అంటే, ఎవరి దగ్గర పదవీ పవరూ ఉంటాయో వాళ్ళే రైటు. ఎందుకంటే జనాలు అనుసరించేది వాళ్ళనేగా! ఒకడు పచ్చి వెధవనీ, దగుల్బాజీ అని అందరికీ తెలుసు. అయినా వాడ్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు గెలిపిస్తున్నామా? ఎందుకు వాడి ముందు బానిసల్లా అణిగిమణిగి పడి వుంటున్నారూ? నిజం నిలకడ మీద ‘తేలుతుంది’ అంటాం. నిలకడ మీదైనా గెలుస్తుందా? అధికారం, ధనబలం, అహంకారం, ఇవి రాజ్యమేలే చోట న్యాయం ధర్మం అనేవి నోరు మూసుకుని ఉండాల్సిందే!” వ్యగ్రతతో అన్నారు త్రిపుర.

“నువ్వన్నది నూరుపాళ్ళూ నిజమేనమ్మా. స్వాతంత్ర్యం వచ్చింది కానీ బానిసత్యం పోలేదు. ఇంకా ఇంకా పరిఢవిల్లుతోంది. ఆరో తరగతి చదివిన వాడు మంత్రై IAS లని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక సరైన మార్గంలో సర్కారుని నడపడం ఎలా సాధ్యమవుతుందీ? గూండాలు, రౌడీలు యథేచ్ఛగా రాజకీయాల్లోకి వస్తున్నారు. తప్పెవరిదీ? అమ్మాయ్ త్రిపురా, దేశం కోసం నేనేమైనా చెయ్యాలీ అనే ఉత్సాహాన్ని అణగదొక్కే శక్తులు అడుగడుగునా ఎదురవుతూనే వుంటాయి. ఎదురు తిరిగి ఆ శక్తున్ని అణచాలా, వాటికి భయపడి నిర్లిప్తతతో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ కూర్చోవాలా అనేది మన నిర్ణయాల పట్లే ఆధారపడి వుంటుంది” అన్నాడు తాతయ్య.

తాతయ్య రాజకీయాల గురించి ఇంతగా మాట్లాడటం నేను విన్నది ఇవ్వాళే. ఆయన త్రిపురగారి సమాధానం కోసం వేచి వుండకుండా మళ్ళీ మా పాక గొడవున్‍లోకి వెళ్ళిపోయాడు.

ఆయన అన్న మాటలని బట్టి, త్రిపుర గారి బాధని ఆయన వినే వుండాలి.

చాలాసేపు మేమిద్దరం మౌనంగానే కూర్చున్నాం. తాతయ్య చెప్పిన మాటలు త్రిపుర గారికే కాదు, నాకూ వర్తిస్తాయన్నది నాకు అర్థమయింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here