దాతా పీర్-4

0
3

[సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ హృషీకేశ్ సులభ్ హిందీలో రచించిన ‘దాతా పీర్’ అనే నవలని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు ‘భారత్ భాషా భూషణ్’ డా. పుట్టపర్తి నాగపద్మిని.]

[పీర్ ముహానీ కొత్త కొత్త ఇళ్లతో కళకళలాడుతూ ఉంటే, పాతబడిన ఇళ్ళతో లోహానీపుర్ బోసిపోతూ ఉంటుంది. లోహానీపుర్‍లోని ధనవంతుడు బాబూ బిచ్చీ సింహ్ గుర్రపుబండిని తోలుతూ ఉండేవాడు బాసిత్ మియ్యా. ఒకరోజు చెత్తకుప్ప మీద ఓ పిల్లాడు దొరికితే, తన ప్రియురాలు నూర్ బీ తో కలిసి ఆ పిల్లాణ్ని పెంచుతాడు. ఆ కుర్రాడే సత్తార్ మియ్యా.  సత్తార్‍కి పదేళ్ళు వచ్చేసరికి తండ్రి చనిపోతాడు. అప్పటి నుంచి మరో ఐదేళ్ళు నూర్ బీ – చిక్ పట్టీకి తీసుకువెళ్ళి – అక్కడ పెంచుతుంది. సత్తార్‍కి 15, 16 ఏళ్ళప్పుడు నూర్ బీ చనిపోతే, అక్కడ్నించి సత్తార్‍ని వెళ్ళగొడతారు. అనాథ అయిన సత్తార్ లూలా మిస్త్రీ మోటార్ గరాజులో కొంతకాలం పనిచేస్తాడు. అక్కడ ఓ స్త్రీతో సంబంధం పెట్టుకోవడంతో, లూలా మిస్త్రీ ఉద్యోగంలోంచి తీసేస్తాడు. చిక్ పట్టీ నుంచీ తోలు కొని కాంట్రాక్టర్ లకు అమ్ముతూ జీవనం సాగిస్తాడు సత్తార్. వ్యసనాలూ అలవడతాయి. రసీదన్ భర్త నసీర్‍తో స్నేహం కుదురుతుంది. నసీర్ తల్లిదండ్రులు చనిపొతో, రసీదన్ వాళ్ళమ్మే అన్ని ఏర్పాట్లూ చేస్తుంది. అలా నసీర్ రసీదన్ వాళ్ల కుటుంబంలో కలిసిపోతాడు. రసీదన్‌తో పెళ్ళి తరువాత, గోరీలగడ్డలోనే స్థిరపడిపోతాడు. నసీర్‍తో స్నేహం కారణంగానే తాను లోహానీపుర్ నుండీ పీర్ ముహానీకి వచ్చేశానని సత్తార్ చెప్పుకుంటూ ఉంటాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-4

[dropcap]చ[/dropcap]లి రాత్రి. బయటినుంచీ ప్రశాంతంగా నిశ్శబ్దంగా లోపల్లోపల కల్లోలంగా!! పొగమంచులో కరెంటు స్తంభాలనుండీ పడే గుడ్డి వెలుతురు దుప్పట్లను కప్పుకుని, రాత్రివేళ, సమాధుల్లో నిద్రిస్తున్న జీవితాలు అటూ ఇటూ ఒత్తిగిల్లుతున్నాయి.

రసీదన్‌కు నిద్ర పట్టటం లేదు. ఒక వైపు చలి, రెండో వైపు దగ్గు, ఇక మూడో కారణం, ఇద్దరు ఆడపిల్లల వ్యవహారం. పెద్దది అమీనా కూడా చిన్నది చున్నీలాగా తన ఇష్టారాజ్యంగా తయారైంది. ఇంతకు ముందు అమీనా తల్లిమాట వినేది. నీడలాగా అమ్మతో పాటే ఉండేది. ఏమీ మాట్లాడకపోయినా అమ్మను సముదాయిస్తుండేది. ఇప్పుడీ పిల్లకు కూడా రెక్కలు మొలుచుకుని వచ్చాయి. చిన్నదాని లాగే బాగా విచ్చలవిడిగా ఉంటూంది. మాట మాటకూ, సమాధానమిస్తోంది. అబద్ధాలెంత బాగా చెబుతోందో!! ఇప్పుడు తనమీద ఏ మాత్రం నమ్మకం లేకుండా పోయింది రసీదన్‌కు!! ఇంతకు ముందు అంతగా లేదు కానీ, ఇప్పుడు చిన్నదానిలాగే, ఎప్పుడూ అద్దం ముందు నిల్చుని చూసుకునే రోగం పట్టుకుంది. ఈ వయసుకిది సహజమే!! కానీ దీనికి అర్థం, ముందు వెనుకలు చూడకుండా మనసులో ఏది వస్తే అది చేసేయటం, ఇతరుల కళ్ళల్లో మట్టికొడుతూ ఉండటమని కాదు కదా!! ఇప్పటికి నూరు సార్లు చెప్పింది సత్తార్ మియ్యాతో దూరంగా ఉండమని!! కానీ వింటేనా?? ఇరవై నాలుగ్గంటలూ నోటి చాపల్యమే దీనికి! ఈ డెబ్భై ఏళ్ళ వెధవ ఇలాగే ఏదో మాంసం ముక్కలు ముందు పడేస్తూ ఉంటాడు, వీళ్ళ ముందు!! ఇలా ముక్క పడేయగానే, ఇదిగో అందుకునేందుకు తయార్!! కొంతకు కొంతైనా గౌరవం ఉంచుకోవటం లేనేలేదు ఇద్దరిలోనూ!! చిన్నదానితో చాలైపోయింది రసీదన్‌కు, ఎక్కడైనా అది మునిగి చచ్చినా శాంతి దొరుకుతుందన్నట్టుగా ఉంది!! ఎంత పొగరు!! ఎంత మోసం!! ఎప్పుడే ఘనకార్యం చేస్తుందో అని ఒకటే గుండె దడ ఎప్పుడూ!! కన్ను మూసి తెరిచేంతలో గాలి మాదిరి అలా మాయమైపోతుంది. ఒక పని చెబితే లక్ష సాకులు!! ముక్కు మీదే కోపమెప్పుడూ నిప్పులు కురిపిస్తూ!! భూమిని నలిపేస్తుందేమోనన్నట్టు నడక!! ఇంతవరకు ఇటువంటి వయసు చేష్టలనెక్కడా చూడనేలేదు రసీదన్. పగలూ రాత్రీ ఆ కల్లూ మియ్యా కొడుకు చక్కర్లు కొడుతూనే ఉంటాడు. పిల్లి లాగే ఉంటుంది చిన్నదాని వ్యవహారం!! గోరీల గడ్డ గేట్ దగ్గర ఫజ్లూ ఉన్నా కూడా కళ్ళు మూసి తెరిచేంతలో బైటికి ఉడాయిస్తుంది. చదువుకోలేదు కానీ మొబైల్‌లో దూరిపోయి ఉంటుందెప్పుడూ!! చెవుల్లో వైరు దూర్చుకుంటుంది. కళ్ళు మొబైల్ మీద!! ఇరవైనాలుగ్గంటలూ ఇదే పని!! లక్ష సార్లు పిలవనీ, వినదూ, జవాబివ్వదూ!! పొరపాటున ఎప్పుడైనా జవాబు చెప్పినా అది విన్నాక అప్పుడే గొంతు పిసికి చంపేయ్యాలనీ,లేదా విషం తాగి తానే చచ్చిపోవాలనీ అనిపిస్తుంది. అలంకరణంటే పిచ్చి ప్రాణం. పొద్దున పడక మీద నుండీ లేచింది మొదలు, కాలి గోళ్ళ నుండీ తల వెంట్రుకల వరకూ సర్దుకోవటమే సర్దుకోవటం!! అటువైపు సందులో బచ్చన్ గుప్తా పెద్ద కోడలు ఇంట్లోనే బ్యూటీ పార్లర్ పెట్టింది. అక్కడికెళ్ళి రింగుల జుట్టు చేయించుకుని వచ్చింది. కనుబొమ్మలు చేయించుకునేందుకు ప్రతి వారమూ వెళ్తుంది. ఎవరాపగలరు యీ ప్రమాదాన్ని? ఒక రోజు రసీదన్ అడిగింది, ‘గుప్తా గారి కోడలికిచ్చేందుకు నీ దగ్గర డబ్బులెక్కడివే?’ అని! ఏ మాత్రం సిగ్గు లేకుండా అనేసింది, ‘సత్తార్ మియ్యానైతే అడగనే అడగను.’ అని!! ఇప్పుడిక యీ మాటకు అర్థమెవడు చెబుతాడు?? ఒక రోజు భుట్టీ అన్న పాన్ దుకాణం దగ్గర ఎవరో అబ్బాయి అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పుడీ చిన్నది తిట్లు మొదలుపెట్టింది. ఇంకేముంది? జనమంతా పోగయ్యారు. భుట్టీ అన్న చాలా మంచివాడు. రసీదన్‌ను సోదరిలా చూస్తాడు. అందుకే తానే కల్పించుకుని యీ గొడవను ఆపాడు. ఆ అబ్బాయిని తిట్టి తరిమేశాడు. ఈ దొంగమొహంది ఎంతకీ కదలదే!! భుట్టీ అన్న ఏవేవో మంచి మాటలు చెప్పి బుజ్జగిస్తే అప్పుడు అక్కణ్ణించీ కదిలింది.

ఏదో ఒక రోజు కొంప మీదికి తెచ్చేతీరుతుందీ చున్నీ!! ఇంత పెద్ద వీధిలో మనవాళ్ళంటూ నలుగురైదుగురు కూడా లేరిప్పుడు!! ఎప్పుడో చాలా మందే ఉండేవాళ్ళేమో గానీ ఇప్పుడు లెక్కపెట్టటానికి కొంతమందైనా లేరు. మెల్లి మెల్లిగా ఇల్లూ వాకిలీ అమ్ముకుని, ముస్లిములు వేరే చోట్లకు వెళ్ళి స్థిరపడిపోయారు. సైయ్యద్ సాహబ్ వాళ్ళది చిట్టచివరి కుటుంబం. వాళ్ళైనా ఎందుకున్నారంటే, ఆ ఇంట్లో చాలామంది అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ళ భాగాలున్నాయి. అందరూ ఇక్కడా అక్కడా చెదురు మొదురైపోయి స్థిరపడ్డారు. అందరికంటే చిన్నవాడొక్కడూ ఉన్నాడింకా ఇక్కడే తన కుటుంబంతో! వాళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు. అందుకే ఎలాగో మొత్తం సర్దుకున్నారు. అందరినీ కలుపుకొని, ఏదో ధరకు ఇల్లు అమ్మేసుకుని హారున్ నగర్ కాలనీకి వెళ్ళిపోయారు. వాళ్ళంతా వెళ్ళిపోయిన తరువాత, ఒక్కటైనా స్థితిమంతమైన కుటుంబం లేదు పీర్ ముహానీలో!! ఇదిగో యీ గోరీల గడ్డ మాత్రం నిలిచింది. ఇది లేకపోతే తానూ ఉండేదికాదిక్కడ!! బీదా బిక్కీ పరిస్థితి చాలా భయంకరంగానే ఉందిప్పుడు!! కానీ రసీదన్ కుటుంబానికేమీ ఇబ్బంది కలుగలేదు. ఇప్పటికీ యీ ప్రాంతంలో రసీదన్ను బిడ్డా, అక్కా అనే పిలుస్తూ ఉంటారు. అందరి ఇళ్ళకూ రాకపోకలున్నాయి. హోలీ, దివాలీ పండగలప్పుడు ఎన్నో ఇళ్ళవాళ్ళు, తీపి తినుబండారాలు పంపుతూనే ఉంటారు. తమ పండగలకు ముందు, యీ దారి శుభ్రపరచటం, అలంకరణ పనులన్నీ ఫజ్లూ, సాబిర్‌ల బాధ్యతే!! ఐనా సరే, యీ చున్నీని తలచుకుంటే రసీదన్‌కు గుండె దడ మొదలౌతుంది, ఎప్పుడేగొడవ తెచ్చిపెడుతుందోనని!! దీని వ్యవహారo గురించి ఫిర్యాదులు విని వినీ చెవులు దిబ్బళ్ళు వేసేశాయి.

కూతుళ్ళ గురించే కాదు, కొడుకు గురించీ దిగులే రసీదన్‌కు!! అల్లా మియ్యా ముందే ఒక కాలు తీసేసుకున్నాడు. దీనికి తోడు బీడీ, గాంజా, తాగుడూ – వీటి వ్యసనం. ఎవరినడగాలి, వీడికి పిల్లనిమ్మని? ఎవరిస్తారు పిల్లను? అసలు బంధువులెవరూ లేరిక్కడ. ఇక్కడినుంచీ వెళ్ళీపోయి, ఎక్కెడెక్కడో కొత్త ప్రపంచాలను సృష్టించుకున్నారు. వాళ్ళ హోదాలు పెరిగిపోయాయి. ఇప్పుడిక రసీదన్‌ను పలకరించేవాళ్ళేరీ?

రసీదన్‌కు నిద్రెప్పుడో దూరమైపోయింది. అప్పుడప్పుడు కాళ్ళూ చేతులూ ఆడిస్తుంది, ముడుచుకుంటుంది, గాఢంగా ఊపిరి పీల్చుకుంటూ, యా అల్లాహ్.. అనుకుంటూ పడుకుంటుందంతే!!

***

రసీదన్ దిగులు గురించి తెలియని చున్నీ, అమీనా వరండాలో ఉన్నారు. వరండా అటూ ఇటూ రెండు అరుగులున్నాయి. వాటిమీద వాళ్ళ పడకలు. వసారాలో జనపనార బస్తాలను కుట్టి, వెదురు బొంగుకు వేలాడదీస్తూ ఒక పరదా ఏర్పాటుచేశారు, చలిని ఆపేందుకు!! పొద్దునంతా దీన్ని పైకి మడిచి కట్టి ఉంచుతారు. వర్షాకాలంలో యీ వరండాలోనే వంట చేస్తూ ఉంటారు. చిన్నదీ, పెద్దదీ, ఇద్దరూ తమ బల్లలమీద కూర్చుని వున్నారు.

చిన్నదానిలాగా పెద్దమ్మాయికి పెద్ద పెద్ద కలలేవీ లేవు. ఇంటి పనులు పూర్తి చేయటమనే దుప్పటి కప్పుకుని, మౌనంగా పడి ఉండే దుఃఖాలు తప్ప!! మనసులో గోధుమ వన్నె నాగుపాము లాగా చుట్టలు చుట్టుకుని తిష్టవేసుకుని ఉన్న భయం ఉంది. చనిపోయినవాళ్ళ యీ ఆశ్రయ స్థలం నుండీ బైటపడి, ఎక్కడో దూరంగా బతకాలి, ముగ్గురు నలుగురు పిల్లల్ని కని సంతోషంగా బతకాలనే కోరిక మాత్రముంది. సత్తార్ మియ్యా, అమ్మ, ఫజ్లూ, చున్నీ అంటే అసహ్యముంది, దాన్ని గుండెల్లో అణచుకుని ఇక్కడ రోజులు వెళ్ళదీస్తూ ఉంది.

ఎప్పుడైనా గాఢ నిద్రలో ఉన్నప్పుడు, సత్తార్ మియ్యా చేతులు తన చాతీ పై పాకుతున్నట్టు కల వస్తుంది. కేక వేస్తూ ఉలిక్కిపడి ఒక్కసారిగా లేస్తుంది. ఆమె కేక, గొంతులోనే ఉండిపోతుంది. ఆ రాత్రినస్సలు మరచిపోలేదు అమె!! సత్తార్ మియ్యా ఎప్పుడు ముందుకొచ్చి నిలబడినా, ఆయన పొడుగైన బలిష్టమైన దేహం, కేవలం చెయ్యిగా మారుతుంది. ఆమె ఒళ్ళంతా మట్టి ముద్దైపోతుంది. ఇంట్లో వాళ్ళంతా అనుకుంటారు, సత్తార్ మియ్యాను తాను వలలో వేసుకుంటూ ఉందని!! కానీ సత్తార్ మియ్యా అంటే చెడ్డ అసహ్యం తనకు!! సత్తార్ మియ్యాను తన తల్లిలాగా వెళ్ళగొట్టలేదు. మియ్యా తన డబ్బులన్నీ యీ ఇంటిమీద పెడతాడు. పెడితే పెట్టనీ!! అతన్ని ఆపితే యీ ఇంట్లో పోయేదేమీ లేదు. ఫజ్లూను అమ్మేమీ అనదు. ఎందుకని? వాడు పగలూ రాత్రీ ఆ సత్తార్ మియ్యా శిష్యరికం లోనే ఉంటాడు. అమ్మకు యీ సత్తార్ మియ్యా చాలా సంవత్సరాలనుంచీనే తెలుసు. ఆతనెటువంటివాడో తెలుసు. మరటువంటప్పుడు ఆయన్ని ఇంట్లోకి ఎందుకు రానివ్వటం? ఇంట్లో ఇద్దరిద్దరు వయసులో ఉన్న ఆడపిల్లలున్నారని అప్పుడు తెలియలేదా తనకు? ఇదే వసారాలో భయం భయంగా వణుకుతూ, చున్నీని వాటేసుకుని తాను పడుకునే ఉండేది, అమ్మ, ఆ సత్తార్ మియ్యా ఉన్న గదిలోంచీ, ఏవేవో వింత వింత శబ్దాలు రాత్రంతా వస్తూ ఉంటే!! సాబిర్‌తో పాటూ ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది, యీ కబ్రిస్తాన్ నుంచీ బైటపడి!! కానీ సాబిర్ చేసే పనులు చూస్తుంటే, మనసులో ఎన్నో సందేహాలతో నమ్మకం సడలిపోతూ ఉంటుంది. అతగాడు కూడా ఫజ్లూతో పాటే సత్తార్ మియ్యా వెనకే పడి వేలాడుతూ ఉంటాడు. సత్తార్ మియ్యా నీడ కూడా పడకూడదు, తన జీవితంలో! అదే కావాలి తనకు!! ఒక రోజు, తనకు గట్టి నమ్మకం కుదిరింది, సాబిర్ కేవలం తనవాడేనని!! తాను సాబిర్‌తో లేచిపోతుందంతే!! అమీనా గొంతు ఎండిపోతూంది. కన్నీళ్ళు ధారాపాతంగా కురుస్తున్నాయి. సాబిర్ తరువాతొచ్చాడు కానీ, అతనికంటే ముందు తనకు తన స్నేహితురాలు సరోజ్ అన్నంటే ఇష్టముండేది. వెల్డింగ్ పనులు చేసేవాడతను. సరోజ్ ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేది అమీనా. అతనితో లేచిపోవటానికి కూడా సిద్ధమైంది. కాని అతని ఆలోచనలతో ఒక చిక్కు వచ్చి పడింది. పెళ్ళి కంటే ముందే..! ఈ షరతును యే నమ్మకంతో ఎలా ఒప్పుకుంటుంది మరి? సరోజ్ ఇంటికి వెళ్ళి రావటం మానేసిందంతే! తనతో ఎలా చేయాలనుకున్నాడో, అతని చెల్లెలు సరోజ్ విషయంలో సరిగ్గా ఇలాగే జరిగింది. వీధికి అటువైపు వీధిలో సరోజ్ వాళ్ళమ్మ ఒక సేఠ్ ఇంట్లో పని చేసేది. ఆ సేఠ్ కొడుకు సరోజ్‌ను వల్లో వేసుకున్నాడు. సరోజ్‌కు కడుపొచ్చింది. సేఠ్ కొడుకు ఒప్పుకోలేదు. పెద్ద పొట్ట వేసుకుని సరోజ్ సల్ఫర్ బిళ్ళలు మింగి చనిపోయింది. ఆ తరువాత వాళ్ళ కుటుంబమంతా అక్కణ్ణించీ ఎక్కడికో వెళ్ళిపోయింది. సాబిర్ ఏమైనా అనుకోనీ, తను సరోజ్‌లా చనిపోదు. ఆమె లేచి నీళ్ళ కుండ దగ్గరికెళ్ళింది. గొంతులో ముళ్ళు గుచ్చుకుంటున్నట్టుంది. నీళ్ళు తాగి, పక్కచేరుకుంది. మోకాళ్ళలో ముఖం దాచుకుంది.

చున్నీ ఊపిరి బిగబట్టి పడుకునే ఉంది. చీకటిగా ఉంది. ఐనా, అమీనా లేవటం, నీళ్ళు తాగటం మళ్ళీ వచ్చి పక్కమీదా పడుకోవటం – అన్నీ కళ్ళు విప్పి చూస్తూనే ఉంది. అప్పుడప్పుడూ ఇలా జరుగుతూనే ఉంటుంది, ఇద్దరక్క చెల్లెళ్ళూ, పక్కలమీద పడుకుని మేల్కునే ఉంటారు, కానీ మాట్లాడుకోరు. చున్నీకి ఒకటే ఆలోచన, బబ్లూ సంగతి ఎటూ తేలటం లేదేమా అని! కానీ యీ పెద్దదానికి భయమే లేదు. సత్తార్ మియ్యా డబ్బులతో జల్సాలు చేస్తూనే ఉంటుంది. ఇరవై నాలుగ్గంటలూ చొంగ కార్చుకుంటూ దీని వెనకే తోకాడించుకుంటూ తిరుగుతూనే వుంటాడు. సాబిర్ మూగవాడు. తొందరగా బైట పడడు. కానీ అఖండుడు. బైటికెంత కనిపిస్తాడో, అంతకంటే రెండింతలు భూమిలోపల దాక్కుని ఉంటాడు. సత్తార్ మియ్యా అతగాని గురువు కదా!! అందుకే అందరి ముందూ బైట పడడు. కానీ అమీనా, సత్తార్ మియ్యా మధ్య జరిగేవన్నీ చున్నీకి తెలుసు. ఒక వారం కిందటే బబ్లూ, తనూ, సాబిర్వాడీ రోడ్డులో బనారసీ చాట్ దుకాణం దగ్గర, అమీనా సాబిర్ ఇద్దరూ చాట్ తింటూ ఉండగా చూశారు. ఆ మరుసటి రోజే ఆకుపచ్చ రంగు కొత్త కుర్తీ వేసుకుని విహరిస్తూ ఉంది అమీనా!! చున్నీ అనుకుంది, ‘ఇక ఇప్పటినుంచీ, యీ ఇంటి వాళ్ళ గురించి అలోచించనే కూడద’ని!! ఎటైనా చావనీ అందరూ!! ఇచ్చి పుచ్చుకోవడాలేవీ లేవు వీళ్ళతో తనకింక! ఇష్టముంటే ఇంటి పని కాస్తో కూస్తో చేస్తుంది, లేకుంటే కూచుంటుంది దర్జాగా!! ఎవరెంత మొత్తుకున్నా సరే, లెక్ఖ చేయదంతే!! బబ్లూ దగ్గర ఇంకా కొంచెం డబ్బు జమా ఐతే చాలు, కోల్కత్తాకు లేచిపోవడమే ఇద్దరూ! రాత్రి రైల్లో కూచుంటే పొద్దునకల్లా కోల్కత్తా!! హౌరాలో బబ్లూ అత్త ఉంటుంది. అక్కడ ఆసరా దొరుకుతుంది. అక్కడే యేదైనా పని చూసుకుంటాడు బబ్లూ. పోలీసుల గోలా ఉండదింక!! అంత పెద్ద కోల్కత్తాలో ఎక్కడని వెదుకుతారు పోలీసులు బబ్లూ కోసం? కోర్టు గొడవంతా అదంతకదే చప్పగా చల్లారి పోతుంది. బబ్లూకు ఎదురే లేదు. ఇప్పుడు రాత్రి వేళలో లాల్జీ వాడ వైపునుంచీ ప్రహరీ గోడ దూకి గోరీల అడ్డాలోకి వస్తున్నాడు. బారీ సాహబ్ సమాధిలో దాక్కుని కూచుంటున్నాడు. ఈ కబ్రిస్తాన్‌లో ఉన్న సమాధి అదొక్కటే!! టాటా వాళ్ళు దాన్ని చక్కగా కట్టించారు. అప్పటినుంచీ అది పరిశుభ్రంగా తయారైంది. నెలలో రెండు మూడు సార్లు వీలు కుదురుతుంది. చిమ్మ చీకటి ఉండాలంతే!! పోయిన సారి మొబైల్ లో సినిమా చూపించాడు, ఒళ్ళంతా ఒకటే పొగలూ, సెగలూ!! గొంతెండిపోయింది. కాళ్ళల్లో ఒకటే వణుకు!! ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయింది తను!! ఎంతో కష్టం మీద తప్పించుకుని వచ్చేసింది కానీ బబ్లూ మియ్యా తక్కువ వాడేమీ కాదు. సత్తార్ మియ్యాకన్నా రెండాకులు ఎక్కువే చదివాడు. ఐనా సరే, తనను చేజిక్కించుకునేంత కాదు. తాను జునైద్ పెళ్ళాం లాంటి దాన్ని కాదనీ, పెళ్ళికి ముందు ఇలాంటి పప్పులేవీ ఉడకవనీ బబ్లూకు ముందే చెప్పేసింది తను!! కల్లూ మియ్యా ఇంటి గుట్టంతా తెలుసు చున్నీకి!! జునైద్, బబ్లూ చిన్నాన్న కొడుకు. కంకడ్ బాగ్‌లో మాంసం దుకాణముంది వాళ్ళకు!! దుకాణం పనుల్లో అతడెప్పుడూ సతమతమౌతూ ఉంటే, బబ్లూ మియ్యాతో అతగాడి భార్య..!! ఇదంతా బబ్లూ నే చెప్పాడు తనకు!! పోనీ, ఇదంతా తనకు అక్ఖర్లేదు. పెళ్ళికంటే ముందు, ఎంత కావాలంటే అంతగా ఎగురుకోనీ! కానీ ఒకసారి పెళ్ళైపోతే ఇంక యీ ఆటలేవీ సాగనివ్వదు తను!! అలా ఏమైనా చేస్తే, బతికుండగానే బబ్లూకు గోరీ కట్టేస్తుందంతే!! పోయినసారి పట్టుబడక పోయి ఉంటే, ఇప్పుడీపాటికి, తమ జీవితమే మారిపోయి ఉండేది. ఈ అసహ్య వాతావరణం నుండీ దూరం వెళ్ళిపోయుండేది తను!! కబ్రిస్తాన్ కంటే భయంకరమైన స్థలమింకా ఏదైనా ఉంటుందా అసలు?

గాఢ నిద్రలో అమీనా ఊపిరి చప్పుడు వినిపిస్తూ ఉంది. కానీ చున్నీకి కళ్ళలో ఇంకా నిద్రకు చోటు దొరకటం లేదు. బబ్లూతో గడపబోయే జీవితం గురించిన కలలే నిండి ఉన్నాయి. ఇప్పుడీ కలలను తోసేసి, నిద్రకు చోటివ్వటమెలా సాధ్యం పాపం?

***

ఇలాంటి ఒడుదుడుకుల రాత్రుల్లో రసీదన్, పెద్దమ్మాయి, చిన్నమ్మాయిలు మాత్రమే బల్ల మీద అటూ ఇటూ ఒత్తిగిల్లుతూ గడుపుతారా?? కానేకాదు, సమాధిలోపల నిద్రిస్తున్న కాలే ఫకీర్ కూడా!! ఎవరైనా నమ్ముతారో నమ్మరో కానీ, రసీదన్ మాత్రం నమ్ముతుంది. ఏమని? తన జీవితంలో కష్టాల వల్ల భయపడిపోయి, దిక్కు తోచకుండా పోయిన సమయాల్లో సమాధి లోపల నిద్రపోతున్న కాలే ఫకీర్ తాతయ్యకు కూడా నిద్ర పట్టదనీ, సమాధిలో నుంచీ లేచి బైటికి వచ్చి, తన కలలో కనిపించి, తన యోగక్షేమాలు కనుక్కుంటాడనీ, ధైర్యం నూరిపోస్తాడనీ!! కుశల సమాచారాలు అడగటమే కాదు, తన మనవరాలి కష్టాలు తొలగిపోవాలని, అల్లాను ప్రార్థిస్తాడు కూడా!! ఆయన ప్రార్థనల వల్లే ఇప్పటివరకూ తన కష్టాలన్నీ దూరమైపోతూ ఉన్నాయని ఆమె నమ్మకం.

రసీదన్‌కే కాదు, పీర్ ముహానీలో నివసించే అందరికీ కాలే ఫకీర్ ప్రార్థనలంటే అదే నమ్మకముంది. ఆయనలో ఉన్న దైవిక శక్తి పైన ఇప్పుడు కూడా అదే నమ్మకముంది. పున్నమి రాత్రుల నిశ్శబ్దంలో కాలే ఫకీర్ నీడ అటూ ఇటూ తిరుగుతూ ఉండగా చూసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. రసీదన్ వాళ్ళ తాతయ్య తనను నిద్ర లేపి సిగరెట్ ఇమ్మని అడుగుతారని పిండిమర బటేసర్ భగత్ ఇప్పటికీ చెబుతుంటాడు. కళ్ళు తెరచి చూస్తే, అంతా మాయం!! ఒక్కోసారి ఒక సిగరెట్ తన తలగడ కింద పెట్టుకుని పడుకుంటాడట అతను, కళ్ళు తెరిచి చూసేసరికి సిగరెట్ ఉండదట!! మోహన్ మిస్రీ నాన్నగారు బతికున్నంత కాలం, ప్రతిరోజూ రాత్రి తల దగ్గర ఖైనీ (తినుబండారం) తయారు చేయించి పెట్టుకునేవారట, కాలే ఫకీర్ కోసం!! ప్రతి షబ్ఏ బరాత్ రాత్రి, ఖైనీ, పది పన్నెండు ఆకులూ, సున్నం డబ్బా ఇచ్చి వెళ్ళేవాడాయన, కాలే ఫకీర్ సమాధి దగ్గర పెట్టటానికి!!

రసీదన్ కళ్ళల్లోకి నిద్ర ప్రవేశించబోతూ ఉంది. కనురెప్పలు బరువుగా మూతబడే సమయంలో సరిగ్గా గదిలో ఒక గాలేదో ప్రవేశించినట్టు చిన్న అలికిడి!! తలుపు దగ్గర పరదా కాస్త తొలగినట్టూ, ఏదో గాలి తోసుకుని లోపలికి వచ్చినట్టూ అనిపించింది. మూతపడబోతున్న కనురెప్పలను కష్టం మీద తెరచి, గదిలో చీకట్లోనే పరిశీలించే ప్రయత్నం చేసింది. ఎక్కడా ఏమీ లేదు. గాలీ లేదు, మనిషి అలికిడీ లేదు. కాంతీ లేదు. రసీదన్ అటువైపు ఒత్తిగిలింది. కళ్ళు మళ్ళీ మూసుకుని నిద్రపోయే ప్రయత్నం చేసింది. కాసేపటికి కనురెప్పలు మూసుకుపోయి, నిద్ర లోకి జారుకుందో లేదో, ఆమె తాతయ్య కాలే ఫకీర్ ముందు నిల్చుని ఉన్నాడు. నెమ్మదిగా కాలే ఫకీర్ ఆమె దగ్గరికి వచ్చాడు. తలాపు దగ్గర కూచున్నాడు. ఆమె నుదుటి మీద చేత్తో నిమురుతూ ‘ఎందుకు, నా చిన్నారి మనవరాలిలా దిగులుగా ఉంది?’ అని అడిగాడు.

‘తాతా, వచ్చారా?’ రసీదన్ అడిగింది.

‘ఎందుకు రాను? నువ్విలా దిగులుగా కూచుని ఉంటే, నాక్కడ సమాధిలో సుఖంగా నిద్రెలా పడుతుంది?’

‘పిల్లల గురించే నా దిగులు తాతా!’

‘పిల్లల గురించి దిగులు పడకు బిడ్డా! ఎవరి నుదుటి రాతను వాళ్ళు అనుభవించాల్సిందే!’

‘మా నుదుటి రాతలే దరిద్రంగా ఉన్నాయి మరి!’

‘నుదుటి రాతను తిట్టవద్దు బిడ్డా!! అల్లా మియ్యాను నమ్ముకో!! అంతే! అల్ హంబుదిల్లా..ఇల్లిల్లాహ్!!’

ఉలిక్కి పడి లేచిందామె!!తాతయ్య వచ్చి వెళ్ళిపోయాడు. తనకోసం అల్లాను ప్రార్థించాడు కూడా!! కళ్ళు చిట్లించి చీకట్లో తాతయ్య కనిపిస్తాడేమోనని వెదికిందామె!! కాస్త తెరిపి పడ్డట్టయింది మనసు!! రెండు చేతులూ పైకెత్తి ‘అల్ హదుల్లిల్లాహ్’ అని ప్రార్థించింది.

గదినుంచీ బైటికొచ్చిందామె! బైట, రంయ్ రంయ్ మని గాలి వీస్తూంది. ఏదో ఇతర లోకపు పక్షుల్లా తమ తెల్లని రెక్కలు విప్పుకుని, మబ్బు తునకలు గాలి తాకిడికి ఎగురుతూ పోతున్నాయి. పెద్దమ్మాయి, చిన్నమ్మాయి ఇద్దరూ తమ పక్కల మీద బొంతలు కప్పుకుని గాఢ నిద్రలో మునిగి ఉన్నారు. ఒక్క గాలి చప్పుడు తప్ప గోరీల గడ్డలో అంతటా నిశ్శబ్దమే!! బూడిద రంగు తప్ప అన్ని రంగులూ మాయం!! వసారా నుంచీ దిగింది రసీదన్. తలెత్తి ఆకాశం వైపు చూసింది. కరెంటు స్థంభం మీద వెలుగుతున్న లైటు కాంతి వసారా దగ్గర వేలాడుతున్న పరదా దాకా వచ్చి మాయమైపోయింది. పరదా దాటి బైటికి వచ్చిందామె. రాత్రంతా ఇదే బాధ, యీ పొగ మంచులో యీ రోజు సూర్యుడొస్తాడా రాడా అని!! నమ్మకమైతే లేదు.

***

తెల్లారింది. సూర్యుడు, మంచు దుప్పటి కప్పుకునున్నాడు. కాసేపటికి గాలి బాగా వీచి మంచు దుప్పటి తొలగిపోయింది కానీ కాంతివిహీనంగానే ఉన్నాడు సూర్యుడు. కాస్త పరాకుగా, ఉదాసీనంగా కూడా!!

రసీదన్‌కు తెల్లారు ఝామునే మెలుకువ వచ్చేసింది. పొద్దున చేసే ప్రార్థన ముగించి తిరిగి వచ్చేసరికి, పెద్దది, చిన్నదీ ఇద్దరూ ఇంకా ముడుచుకుని పడుకునే ఉన్నారు. రసీదన్ బైటికి నడిచి, రాధే గోప్ చాయ్ దుకాణానికి వెళ్ళి చాయ్ తాగింది.

చలికాలమైనా ఎండాకాలమైనా రాధే కొట్టు తెల్లారకముందే తెరుచుకుంటుంది. పొద్దున పొద్దున పనులకు వెళ్ళే ఆడవాళ్ళ రోజు, యీ కొట్టులో చాయ్ తాగటంతోనే మొదలౌతుంది. ఇక్కడెప్పుడూ గుంపులు గుంపులు జనాలుంటారు. ఎంత తొందరున్నా, పరస్పరం కుశల ప్రశ్నలూ వగైరాలు నడుస్తూనే ఉంటాయి. ఇంటి వాళ్ళందరి కుశల సమాచారంతో పాటు చాడీలు చెప్పుకునేందుకూ సమయం ఇదే మరి!! రసీదన్ చాలా సేపటివరకూ అక్కడే కూచుంది.

తాను ఎన్నిసార్లు చెప్పినా పొద్దున పొద్దున సత్తార్ మియ్యా వాళ్ళ ఇంటికి వచ్చి పడటం మామూలైపోయింది ఇటీవల!! రాధే దుకాణం దగ్గర కూర్చుని ఉండగానే, కబ్రిస్తాన్ గేట్ నుంచీ సత్తార్ మియ్యా లోపలికి వెళ్ళటం చూసింది. ఆమెకు సత్తార్ మియ్యా ఎదురుగా వెళ్ళటం ఇష్టం లేదు. అతని ముఖం చూస్తే చాలు, గుండె నిప్పు కణికెలా మండిపోతుంది. ప్రతి రోజూ యీ గొడవను ఇక భరించటం కష్టమైపోయిందామెకు!! కానీ ఏం చేయటం? ఈ దరిద్రాన్ని స్వయంగా తానే గుండెలమీదకి తెచ్చి పెట్టుకుందాయె!! నిన్ననే వెయ్యిన్నొక్క తిట్లు తిట్టింది. వెంట పడి కొట్టింది కూడా!! ఐనా యీ వెధవకు సిగ్గూ ఎగ్గూ లేదు. సిగ్గూ ఎగ్గూ లేదు! లక్షసార్లు చీదరించుకున్నా, తుడిచేసుకుని కుక్కలాగా తోకాడించుకుంటూ మళ్ళీ వస్తాడు. ఎవరికి అర్థం కావాలో వాళ్ళే అర్థం చేసుకోకపోతే సత్తార్ మియ్యా ను అనేందుకేముందిక? ‘పెద్దదానికే తన భవిష్యత్తు గురించి చింత లేదసలు, నేను తల పగులగొట్టుకుని ఏంటి లాభం?’ అనుకుంది రసీదన్.

‘అత్తా!! ఇంకో కప్పు చాయ్ కావాలా? చిక్కగా ఉందిప్పుడింకా!!’ రాధే గొంతు విని ఆమె ఉలిక్కి పడింది. కబ్రిస్తాన్ గేట్ దగ్గరే నిలిచి ఉన్న ఆమె చూపులు అక్కణ్ణించీ మరలాయి, రాధే చాయ్ కప్పు ఆమెకివ్వగానే!! రాధే ఆమెను అత్తా అనే పిలుస్తాడు. రాధే వాళ్ళ నాన్న రాం బరన్ గోప్‌ను రసీదన్, అన్నా అని పిలిచేది. పోయిన సంవత్సరమే చనిపోయాడాయన! ఈ వాడకంతటికీ ఆడబడుచు రసీదన్. అందుకే అందరూ ఆమెను తమ ఇంటి ఆడబడుచులాగే గౌరవిస్తారు. ఆమె పేరిక్కడ ముందు రసీదనీ. తరువాతే రసీదన్. బిడ్డ, చెల్లెలు, అత్తా, ఇలాగే పిలుస్తారందరూ! ఆమెను రసీదనీ అని పిలిచే పెద్దవాళ్ళు ఇప్పుడు తక్కువమందయ్యారు. ఫజ్లూ వాళ్ళ నాన్నకు కూడా యీ వాడలో అల్లుడు హోదానే ఉండేది. ఎవరికిష్టమైనట్టు వాళ్ళు ఆమెను ఆట పట్టించేవాళ్ళు. రాం బరన్ అన్నైతే రోజూ ఆమెను ఆట పట్టించేవాడు. తిట్టేవాడు కూడా!! సమాన వయస్కుల్లో ఇలా ఉంటే పెద్ద వయసు వాళ్ళు గౌరవిస్తారు. ఎప్పుడూ ఎవరూ నసీర్ భార్య అని పిలవనే లేదు.

రసీదన్ చాయ్ తాగేసింది.

రాధే అడిగాడు,’చాయ్ బాగా కుదిరిందా అత్తా?’ అని.

‘చాలా బాగుందిరా!! ఫజ్లూ దగ్గరినుండీ డబ్బు తీసుకో!’ అంది.

‘సరేలే అత్తా!! నువ్వు మరీ బాగున్నావ్!! ఎప్పుడైనా డబ్బు కోసం ఇవ్వటం ఆపానా చెప్పు?’ ఆమె చేతినుండీ గ్లాస్ తీసుకుంటూ అన్నాడు రాధే.

నవ్విందామె.

మెల్లి మెల్లిగా సూర్యుడి కాంతి పెరుగుతోంది. ఎదురుగా ఫజ్లూ వస్తుండగా చూసింది రసీదన్. కూతుళ్ళిద్దరి సోమరిపోతు తనానికి అప్పుడప్పుడు చిరాకేస్తుందామెకు!! ఫజ్లూకు చాయ్ పిచ్చి. ఇంట్లో చేసి ఇవ్వాల్సింది ఆడపిల్లలు. చిన్నదాని గురించి ఎలాంటి ఆశా పెట్టుకునేందుకే లేదు. కనీసం పెద్దదైనా ఒక కప్పు చాయ్ చేసి ఇవ్వాల్సింది వీడికి. ఇంకో తమ్ముడో అన్నో ఉండి ఉంటే, ఇల్లు రణరంగం చేసి ఉండేవాడు. కానీ.. సత్తార్ మియ్యా ఇంట్లోకి అడుగు పెట్టీ పెట్టగానే చాయ్ కప్పుతో తయారీ మహారాణి!!

“అమ్మా!!” ఫజ్జూ ఎదురుగా నిలబడి పిలుస్తున్నాడు.

“రా..చాయ్ తాగు!” గోముగా పిలిచిందతన్ని.

“చెవుడొచ్చిందా నీకేమైనామ్మా? ఏమీ వినబడటమే లేదే? ఇద్దరూ దయ్యాలాగ ఇంట్లో డాన్స్ చేస్తున్నారు. ఒకరినొకరు నమిలి మింగేసేలా ఉన్నారు. నిన్ను పిలిచి పిలిచి నా గొంతు బొంగురు పోయింది. పో తొందరగా!”

రాధే దుకాణం ముందున్న బెంచీ మీద ఫజ్లూ కూచున్నాడు.

‘యా అల్లా..’ మోకాళ్ళ మీద చేతులానించి, మెల్లిగా రసీదన్ లేచింది. ‘ఆ ఇద్దరు దొంగ ముండల నాలుకలకెప్పుడూ దురదే!! చేసేదీ పెట్టేదీ యేమీ ఉండదు కానీ, వేషాలు మాత్రం అమ్మో..!’

కాళ్ళు తడబడుతుండగా రసీదన్ గోరీలగడ్డకేసి నడిచింది.

***

రసీదన్ ఇంట్లోకి రాక ముందే అక్కచెల్లెళ్ళిద్దరి యుద్ధం ముగిసింది.

అమీనా వరండాలో స్టూల్ మీద కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. చున్నీ చేతి గోళ్ళు కొరుక్కుంటూ ఉంది, అమీనా వైపు వీపు చేసి!! ఆమె చూపంతా ఎదురుగా వేలాడుతున్న సినిమా పోస్టర్‌తో చేసిన పరదా మీదే!! దీపికాను ముద్దాడుతున్న షారూఖ్‌నే చూస్తూంది. ఇంతలో రసీదన్ ఇంట్లోకొచ్చింది. ముద్దాడుతున్న షారూఖ్ ముఖం అదృశ్యమైపోయింది. దీపికా ముఖాన్ని అర్ధం దాకా పరదా మింగేసింది. చున్నీ ఒక్క క్షణం రసీదన్ కేసి చూసి, చూపు తిప్పేసుకుంది.

రసీదన్ లోపలికి రాగానే అప్పటిదాకా అటూ ఇటూ కదులుతూ ఉన్న పరదా ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ షారూఖ్, దీపికా ఇద్దరూ ముద్దాడుకుంటూ!! అమ్మ లోపలికి రావడం గమనించనట్టుగానే చున్నీ వాళ్ళిద్దరు ముద్దులాడుకోవటాన్నే చూస్తూ ఉండిపోయిందిప్పుడు!

రసీదన్‌ను చూడగానే అమీనా వెక్కిళ్ళు ఎక్కువయ్యాయి. కన్నీళ్ళు, ముక్కు నుండీ కారుతున్న చీమిడితో తడిసిన అమె ముఖం చిత్ర విచిత్రంగా ఉంది. కాసేపటి కిందటే, చున్నీని ఎంత చాకచక్యంగా, అడ్డుకుంది అమీనా. ఇప్పుడేమో, దానికి పూర్తి భిన్నంగా దీనాతి దీనంగా కనబడేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి యుద్ధ కౌశలంలో ఇద్దరూ ఆరితేరినవాళ్ళే! గట్టిగా అరుస్తూ యాగీ చేయటం చున్నీ ఆయుధమైతే, ఏడ్చి గొడవ చెయ్యటం అమీనా ఆయుధం.

వసారాలో ఓ పక్క పొయ్యి పడుంది. బొగ్గు ముక్కలన్నీ చెల్లాచెదురుగా పడున్నాయి. పొయ్యిలో కిరోసిన్‌తో తడిసిన కట్టెలు కొన్ని, కాస్త దూరంలో కిరోసిన్ సీసా దొర్లుతూ ఉంది. కిరోసిన్ వాసన చుట్టుపక్కల అంతటా వ్యాపించి ఉంది, గాలి వీచినప్పుడల్లా ఆ వాసనే!! ఐతే యుద్ధమిక్కడి నుంచే మొదలైందన్నమాట! రోజూ పొయ్యి రాజేయటం చున్నీ వంతు. ఆ పని చెయ్యకుండానే తాను బైటికి వెళ్ళబోతూ ఉంటే అమీనా అడ్డుకుంది. సరే, వెనక్కి వచ్చి, పొయ్యి రాజేసే పనిలో పడింది చున్నీ, మధ్య మధ్య తన మాటలతో అమీనాను ఎగతాళి చేస్తూ!! అమీనా దీనికి ఎదురు తిరిగేసరికీ, ఇదిగో యుద్ధం మొదలైంది, ఎప్పుడూ అయ్యేలాగానే!! రాజ్యాలు ఇచ్చి పుచ్చుకోవటమూ కాదు, హక్కుల కోసమూ కాదు!! పొంగులెత్తుతున్న యవ్వనం ఇద్దరిదీ!! తమ పైచేయి సాధించుకోవటం కోసం ఇదే సరైన మార్గం. మాట్లాడుకోనవసరం లేకుండానే ఇటువంటి అవకాశాలు అంది పుచ్చుకుంటారిద్దరూ!!

రసీదన్ ముందుకు అడుగులేసి, కిరోసిన్ సీసా చేతుల్లోకి తీసుకుంది. దానిలో ఇంకా కాస్త కిరోసిన్ మిగిలి ఉంది, బహుశా ఒక చెంచా ఉండొచ్చు. ఆమె సీసాతో పాటు, ముందుకు నడిచింది, ముంగిటి మధ్యలోకి!! ఆ మిగిలి ఉన్న కిరోసిన్ ను అమ్మ తన నెత్తిమీద దిమ్మరించుకోవటం, అగ్గి పెట్టె కోసం వెదకటం, అమీనా చూసింది. ఒక్కసారిగా అరుస్తూ అమ్మ దగ్గరికి చేరుకుంది. చున్నీ వెనకే ఇదంతా జరుగుతూ ఉంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి మళ్ళీ నిర్లక్ష్యంగా ముఖం తిప్పుకుంది అటుకేసి!! రసీదన్ అగ్గిపెట్టె కోసం వెదుకుతూనే ఉంది. ఆమె ఎదురుగా నేలమీదే కూర్చుంది అమీనా, రసీదన్ మోకాళ్ళను చుట్టేస్తూ!! అగ్గిపెట్టె కోసం అమ్మ వెదకటాన్ని అడ్డుకుంటూ!! చున్నీ మధ్య మధ్య ఒకసారి వెనక్కి తిరిగి, రసీదన్‌నూ, అమీనాను చూసి, మళ్ళీ దీపికా షారూఖ్ లవైపే దృష్టి నిలుపుతూ ఉంది. కిరోసిన్‌లో పూర్తిగా తడిసిపోయిన అగ్గిపెట్టె పొయ్యిలోపల కట్టెల మధ్య నుండి ఒకటే నవ్వుతోంది.

రసీదన్ అక్కడే కూలబడిపోయింది, శూన్య దృక్కులతో!! అటూ ఇటూ చెల్లా చెదురుగా పడి ఉన్న బొగ్గు ముక్కలను పొయ్యి దగ్గరికి చేర్చింది అమీనా. చున్నీ బకెట్ తీసుకుని నీళ్ళు తేవటానికి వెళ్ళింది. నీళ్ళు తెచ్చి సంప్ దగ్గర పెట్టింది. అమీనా గదిలోపల అల్మారీలో ఉన్న సోప్ తెచ్చింది. రసీదన్ భుజాలు పట్టుకుని లేపింది. సంప్ దగ్గరున్న బండమీద కూర్చోబెట్టింది, స్నానం చేసేందుకు!! ఈ లోపల చున్నీ పొయ్యి వెలిగించి, బొగ్గు ముక్కలందులో వేసింది. పొయ్యి నుంచీ పొగ లేచి ఆవరణంతా వ్యాపించింది. ఇంక ఎవరినీ పట్టించుకోకుండా, తనంతకు తాను బైటికి వెళ్ళిపోయింది. అమీనా మాత్రం తల్లి తలకు సబ్బు పట్టించి, స్నానం చేయిస్తూ ఉంది.

***

రెప్పపాటులో చున్నీ ఇంట్లోనుండీ బైటపడి రాధే కొట్టుకు చేరుకుంది. అక్కడికి చున్నీ వచ్చేది చాలా తక్కువ. రాధే అంటే తనకు చాలా భయం. కబ్రిస్తాన్ గేట్‌కు సరిగ్గా ఎదురుగా కొట్టు ఉన్నందువల్ల చున్నీ రాకపోకలపైన రాధే కన్నేసి ఉంచుతాడు. అతడామెనేమీ అనడు, ఆపడు కానీ అతడు చూసే చూపులకు చున్నీ గడ గడ వణికిపోతుంది. ఫజ్లూ అక్కణ్ణించీ వెళ్ళిపోయాడప్పటికి. చున్నీని చూసి “చాయ్ కావాలా చున్నీ?” అనడిగాడు రాధే.

హు.. ఒక చిన్నగా నిట్టూరుస్తూ చున్నీ, కబ్రిస్తాన్ గేట్ వైపే చూస్తూ కూచుంది, రాధే, చాయ్ వడగట్టి గ్లాస్ చేతికిచ్చేవరకూ!! బిస్కెట్లున్న సీసాలకేసి చుస్తూ, “బిస్కెట్ కూడా అన్నా..” అంది.

రాధే ఇచ్చిన బిస్కెట్ లను చాయ్ లో ముంచి తాగుతూ కబ్రిస్తాన్ గేట్ వైపే చూస్తూ కూచునివుంది. ఆమెకు తెలుసు, తన భరతం పట్టేందుకు, అక్క తప్పకుండా బైటికి వస్తుందని! కానీ, అమీనా బైటికి రాలేదు. గేట్ వైపే చూస్తున్న చున్నీ ఆశ నిరాశే అయింది. ఎంగిలి గ్లాస్ కింద పెడుతూ ‘రాసుకో అన్నా..’ అంది.

“బాకీ పెరిగిపోతూంది చున్నీ..”

“మా మీద నమ్మకం లేదా అన్నా?”

“చున్నీ, బాకీ ఎక్కువయ్యే కొద్దీ, నమ్మకం తగ్గిపోతూంది మరి..”

“అందుకే నీ కొట్టుకు రావటమే తగ్గించేశాను. రాం బరన్ బాబూ మామయ్య చనిపోయాక, ఏదో ఒకడో రెండో సార్లు వచ్చి ఉంటాన్నేను చాయ్ కోసం.లెక్క పెట్టుకోలేదా అన్నా??”

రాధేకు ఎదురుదెబ్బ తగిలింది. ఫజ్లూ వెళ్ళిపోతూ, ఈరోజు గొడవంతా చెప్పి వెళ్ళాడు. ముందే లోపల్లోపల రాధే ఉడికిపోతున్నాడు. కానీ యీ పిల్లతో పెట్టుకోవటం అతనికిష్టం లేదు. కానీ దేనికైనా హద్దంటూ ఒకటుంటుంది కదా!

రాధే చున్నీ ముందుకొచ్చి నిలబడ్డాడు. “చున్నీ విను. మేము ఆ చిట్టా అంతా చూసుకున్నాం లే!! అంతా సరిపోయింది. నువ్వు మా కిచ్చేదీ లేదు, మేం తీసుకునేదీ లేదు. కానీ, ఇదిగో, యీ రోజునుంచీ, రాధే కొట్టుకు నీకూ రాం రాం. ఇక్కడికి రాకింక!” అనేశాడు.

చున్నీ కూడా రెచ్చిపోయింది. రాధే అంటే లోపల్లోపల చున్నీకున్న భయమంతా బడబడా బైటికి వచ్చేసింది కోపం రూపంలో! “నీకూ చెబుతున్నా అన్నా!! నాకేసి చూడొద్దింక!! రోడ్డు మీద కొట్టుంది కాబట్టి మేం అటూ ఇటూ తిరుగుతూనే ఉంటాం. చూడాలనుకోకపోతే చూడకు. కళ్ళు మూసుకుంటావో, పొడుచుకుంటావో, నీ ఇష్టం. నాకేమీ నష్టంలేదు.”

రాధే అలా నిలబడిపోయాడు. కొట్టులో ఉన్నవాళ్ళు కూడా!!

***

చున్నీ వెళ్ళిపోయింది కానీ, రాధే గోప్‌ను కోప జ్వాలలలోకి నెట్టివేసి మరీ వెళ్ళింది. సాధారణంగా తీయగా మాట్లాడే అతని మనసు మీద బొబ్బలెక్కాయి. స్వభావానికి విరుద్ధంగా అతని ముఖం జేవురించింది. పొయ్యి మీద పెట్టిన కెటిల్ నుంచీ చాయ్ తెర్లి కింద పడింది. పాలు కాగి కాగి మాడిపోయిన వాసన అంతటా వాపించింది. రెండు చాయ్ గ్లాస్లు విరిగిపోయాయి. బిస్కెట్లు నిండుగా వేసిన ఒక గ్లాస్ జార్ చేతుల్లోనుండీ కింద పడుతూ పడుతూ బతికిపోయింది.

పొద్దున్న కాస్తా సాయంత్రమైనా అతని మనసు కుదుట పడనేలేదు. పొద్దెక్కేకొద్దీ అతని బుర్ర చిందర వందరగా మారిపోతూనే ఉంది. శీతాకాలంలో కూడా పొద్దెక్కేవరకూ తెరిచే ఉండే అతని చాయ్ దుకాణాన్ని, రాధే సాయంత్రమే మూసేసి వెళ్ళిపోయాడు. నాలుగో వీధిలో భూలోటన్ గోప్ దగ్గరికి వెళ్ళి పౌచ్ తెప్పించుకుని తాగిన తరువాతే ఇల్లు చేరుకున్నాడు. నిద్రపోయే ప్రయత్నం చేశాడు, కానీ నిద్ర పట్టనేలేదు. కొంత సేపు, అటూ ఇటూ పొర్లిన తరువాత, కబ్రిస్తాన్ గేట్ దగ్గరికి చేరుకున్నాడు రాధే. గేట్ దగ్గరుండే గదిలో ఫజ్లూ, సాబిర్ ఇద్దరూ, చిలుం తాగుతున్నారు. ఆ గదిలోనుంచీ గాంజా వాసనలు మూసిన తలుపుల్లోంచీ, కిటికీ పలుగుల్లోంచీ, బైటికి వస్తున్నాయి. రాధే పిలిచాడు, “ఫజ్లూ..ఓ ఫజ్లూ..!!”

గదిలో కూర్చుని ఉన్న సాబిర్, ఫజ్లూ ఇద్దరూ రాధే గొంతును గుర్తు పట్టారు. సాబిర్ మెల్లిగా తలుపు ఒక రెక్కను ఓరగా తెరిచాడు. గాంజా వాసనలు వెల్లువెత్తి, రాధే నాసికా రంధ్రాల్లో దూరిపోయాయి. రాధే , ఇప్పటికే పౌచ్ మత్తులో విహరిస్తున్నాడు. లోపలికొస్తూ, “దొంగ వెధవల్లారా!! మీరిద్దరినీ ఎప్పుడో ఒకరోజు, ఎవరో ఒకరు బొక్కలోకి తోస్తారు..” అన్నాడు.

“ఎందుకన్నా? గాంజా మీద నిషేధం లేదు కదా!! మన ముఖ్య మంత్రిగారు కూడా పొగ తాగుతారని విన్నాను. నువ్విప్పుడు పౌచ్ పట్టించి వచ్చావు కదా, ఇదే తప్పు.” గది తలుపు మూస్తూ సాబిర్ అన్నాడు నవ్వుతూ!!

ఫజ్లూ ఏమీ మాట్లాడటం లేదు. రాధే హఠాత్తుగా రావటానికి కారణమేమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు, జాగ్రత్తహా!! చున్నీ, రాధే మధ్య జరిగిన గొడవ గురించి అతనికి తెలిసిందిప్పటికే!! అతని చేతుల్లో, మాసిన గుడ్డ సంచీలో చుట్టిన చిలుం ఉంది. దాన్ని రాధే కు అందిస్తూ, “తీసుకో..” అన్నాడు.

రాధే చిలుం తీసుకుని, దమ్ము పీల్చాడు. ముక్కునుండీ పొగ వదులుతూ అన్నాడు, “దొంగ నాయాళ్ళు, ఇద్దరూ దీన్లోంచీ అంతా పీల్చేసారుగా!! కొత్తదివ్వండిరా..”

సాబిర్ రాధే చేతిలో చిలుం తీసుకుని, గది మూలకు వెళ్ళి దానిలోని బూడిదనంతా విదిల్చేసి, మళ్ళీ చిలుంలో గాంజా నింపటం మొదలెట్టాడు. ఫజ్లూ తన బూడిద కళ్ళతో రాధేను చూస్తూ ఉన్నాడు.

సాబిర్ మొదలెట్టాడు, “ఈ రోజు చాలా త్వరగా కొట్టు మూసేశావన్నా!!”

రాధే కూడా ఆచి తూచి జవాబిచ్చాడు, “అవును.” తరువాత ఫజ్లూ కేసి చూశాడు.

రాధే ఎందుకొచ్చాడో ఫజ్లూకు అర్థమైంది. మాటలెలా ప్రారంభిద్దామా అని ఎదురుచూస్తున్నాడు.

ఇంతలో సాబిరే “ఎందుకు?” అని అడిగాడు.

సాబిర్ మాటను పట్టించుకోకుండా రాధే ఫజ్లూతో అన్నాడు, “ఈ రోజు చునియా ఏం చేసిందో తెలుసా?” అని.

“ఆ.. విన్నాను. నీ మీద అరిచిందట కదా బాగా?” ఫజ్లూ గొంతు తటస్థంగా ఉంది.

“చునియాను కాస్త అదుపులో పెట్టు ఫజ్లూ!! ఇప్పుడు తను అదుపు తప్పిపోతూంది. అత్తింకా ఉంది కదా అని నేనింకా నోరూ కళ్ళూ మూసుకుని వున్నాను. కానీ ఇప్పుడు నిండా మునిగేంతవరకూ వచ్చింది. కల్లూ మియ్యా కొడుకు బబ్లూ ప్రేమలో పడింది కదా!! మిమ్మల్ని ఎటూ కానీకుండా చేసేస్తుందీ పిల్ల!! ఆ బబ్లూ గాడు రాత్రనకా పగలనకా ఏదో ఒకలాగ గోరీల గడ్డ లోకి వస్తుంటాడు. వెళ్తుంటాడు. ఇద్దరి కథా, వీధిలో ప్రతి ఒక్కరికీ తెలుసు. మేమంతా కళ్ళూ, నోరూ మూసుకుని కూర్చున్నామంతే!! అందుకే ఎవరూ మాట్లాడటం లేదు. ఐనా ఇంకా ఎంతవరకూ సహిస్తాం చెప్పు? ఇప్పుడింక మనకే ఎదురుతిరుగుతోందీ పిల్ల కుంక!! నీకు తెలీదా యీ రోజు నాతో ఏమందో?”

“తెలుసు. ఇప్పుడింక ఒకటే ఉపాయం. ఏదో ఒక రోజు పీక నులిమి చంపేయాల్సిందే!” ఫజ్లూ గొంతులో కోపం కాదు, బాధే ఎక్కువగా వినిపించింది.

“ఇదిగో ఫజ్లూ!! నామాట విను!! బబ్లూ గాడికి ఏమాత్రం మానం, మర్యాదా లేదు. అందుకే వాళ్ళ నాన్న కల్లూ మియ్యా వాడిని కొట్టులో కూర్చోనివ్వటమే లేదు. దొంగతనం, దారిదోపిడీ లాంటి కేసుల్లో ఇరుక్కుని ఉన్నాడు. ఒక్కసారి దొంగతనం రుచి మరిగాడంటే, పోలీసు దెబ్బ తగిలిందంటే ఇక యీ రోగాన్ని వదిలించుకోవడం కష్టమే!! ఈ రోజో రేపో మళ్ళీ ఏదో ఒక ఘనకార్యం చేసి తీరుతాడు, పోలీసులకు చిక్కుతాడు కూడా!! చునియాకు నచ్చజెప్పండి మీరు. అర్థం చేసుకుందంటే సరే, లేకపోతే ఆ బబ్లూ గాడికే వల వేయాలి. ఒకరోజు మేమే అందరం చుట్టుముట్టి పట్టుకుంటాం. సమస్య దానంతటదే పరిష్కారమైపోతుంది. వెధవ, యీ వీధిలోకి రాకపోకలే బందయిపోతాయంతే!!”

“ఇప్పుడైతే వాడే వస్తున్నాడిక్కడికి. అప్పుడు యీ పిల్లే బబ్లూ కోసం లోహానీపుర్ వెళ్ళటం మొదలెడితే?” ఇంతవరకూ మౌనంగా ఉన్న సాబిర్ తన అనుమానం వెలిబుచ్చాడు.

“ఎలా వెళ్తుంది? కాళ్ళు నరికేస్తాను. నాలాగ కుంటిదైపోయి ఇంట్లో పడుంటుందంతే!” ఫజ్లూ గొంతులో కోపం తాండవిస్తూంది. గంజాయి మత్తులో ముందే ఎర్రగా ఉన్న అతని కళ్ళల్లో రక్తం చిందింది.

“చూడు ఫజ్లూ, రసీదన్ అత్త ముఖం చూసి ఇంతవరకూ ఊరుకున్నానింతవరకూ! కానీ వీధిలో వాళ్ళంతా ఎప్పటి దాకా సహిస్తారు? ఎప్పుడో ఉపద్రవం ముంచుకొస్తుంది, యీ పిల్ల తీరు ఇలాగే ఉంటే!! అదీ యీ రోజుల్లో..” తన మాటలు మధ్యలోనే ఆపి సాబిర్ వైపు చూశాడు రాధే.

“ఊ.. ఈ రోజుల్లో?” ఫజ్లూ గొంతులో అనుమానం.

“అదే, ఈ రోజుల్లో పగలూ రాత్రీ హిందూ ముస్లిం గొడవలే కదా! అందుకే ముందే చెబుతున్నా!! నాకైతే ఒకటే భయం, బబ్లూ ఎప్పుడో ఒకసారి పట్టుబడతాడు. అప్పుడింక ప్రమాదమే!! దీనికంటే ముందే మనం ఆ వెధవ ఆట కట్టించాలి.” ఒక్క ఉదుటున రాధే లేచాడు. పౌచ్, చిలుము – రెండిటి మత్తూ రెట్టింపుగా ఎక్కింది, గొంతు గట్టిగా వినిపించింది.

సాబిర్ లేచి వాకిలి రెక్కొకటి తెరిచాడు. రాధే తూలుకుంటూ, బైటికి నడిచాడు. ఫజ్లూ కూర్చునున్నాడు. అతడి చెవుల్లో రాధే మాటల్లో హిందూ ముస్లిం అన్న మాటలు మాత్రమే రింగుమంటూ అలజడి సృష్టిస్తున్నాయి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here