గుంటూరు టు హైదరాబాద్

0
4

[box type=’note’ fontsize=’16’] బస్‍స్టాండ్‌లో మొదలై బస్‌స్టాండ్‌లో ముగిసే ఈ కథలో ప్రయాణీకుల వైఖరి, స్త్రీ పురుషుల మధ్య తేడాలు, రియల్ ఎస్టేట్‌తో విస్తరిస్తున్న పట్నాలు, కుంచించుకుపోతున్న పల్లెలు… మారుతున్న మనుషులు, సాటివారి పట్ల లోపిస్తున్న సానుభూతి… జనాలలో పెరిగిపోతున్న స్వార్థాన్ని కళ్ళకు కట్టినట్టు చిత్రించారు రచయిత చావా శివకోటి. [/box]

[dropcap]పా[/dropcap]ర్వతి గుంటూరు బస్ స్టేషన్‌కు వచ్చింది. భుజాన అంతగా లగేజి లేదు. ఓ బ్యాగు, నీళ్ళ సీసా తప్ప. హైదరాబాద్ బస్సులు ఆగే చోటుకు చేరుకుంది. అసహనంగా లేదు, అలా అని సంతోషంగానూ లేదు. పెందలాడి బస్సుకు వెళితే చీకటి పడక ముందు వెళ్ళొచ్చు అనే ఉద్దేశం కావచ్చు. పార్వతి వయస్సు ఇరవై దాటి ఒకటి రెండేళ్ళు ఉండొచ్చు. వాలుగరెబ్బలా ఉన్నా చామన ఛాయతో ముక్కు, మొఖం అందంగా ఉంది. నడక నాజుకుగా ఉండదు. కానీ బాగుంటది. చీర కుచ్చిళ్ళను వరుసగా పేర్చి అందంగా కట్టుకుని పైటను అలవోకగా వేసుకుని నీటుగా కనిపించింది. చూసేందుకు కన్నులు చాలవు అనేట్టుగా లేకపోయినా మంచిగ అనిపిస్తది. టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్ళి ‘గరుడ’ బస్సు టైము కనుక్కుని ‘అమ్మో! ఇంకా అరగంట టైముంది’ అనుకుని వచ్చి అక్కడున్న కుర్చీలో కూర్చొంది. ఓ ముసలయ్య వచ్చి పక్కన కూర్చుని “బస్సు అరగంట ముందే స్టాండుకు రావాలి, రాలేదా? అని అడుగుతుంటే కనపడటంలా అని కసురుకుంటున్నారు” అని సణుక్కున్నాడు.

బస్ స్టేషన్ రద్దీగానే ఉంది.

“రావేం, ఇదేం ఇల్లనుకున్నావా? నివాటంగా నడుస్తున్నావ్” అన్న మగ మాట కరుకుగా వినిపించడంతో అటు చూసింది. ఆ మాట అన్న ఆయన, కొద్ది దూరాన చంకన పిల్లనేసుకుని బరువైన ఓ బ్యాగ్‍ని లాక్కొంటూ వస్తున్న ఆవిడా కన్పించింది. ఆవిడకు నలభై ఏండ్లు ఉండొచ్చు. ఆటో రిక్షా దిగి హడావిడిగా వస్తున్నట్టుంది. నుదుట చెమట బిందువులు కనిపిస్తున్నాయ్. రా… రమ్మంటూ ఆరాటపెడుతున్నది ఆవిడ భర్తేమో! అతనిని కలిసేందుకు వేగంగా నడుస్తూ, జనాన్ని తప్పుకుంటూ నానా తిప్పలు పడుతుంది. చంకనున్న పసిది జారుతుంటే పైకి జరుపుకుంటూ, మగమహారాజు మాత్రం టికెట్ల కౌంటర్ వైపు జిప్పు బ్యాగుతో హడావిడిగా వెళ్ళి క్యూలో నిలబడి చాలా కష్టపడ్డట్టు ‘హమ్మయ్య’ అనుకొన్నాడు. ఈవిడ గసపెడుతూ వచ్చి వాళ్ళెక్కాల్సిన బస్సు దిశగా నడిచి ఓ ఖాళీ కుర్చీలో కూర్చుని పెద్ద సంచీని ముందెట్టుకుని పసిదాన్ని ఒళ్ళోకి తీసుకుని నెమ్మదిపడ్డది.

ఇది మనుషుల ప్రపంచమని తెలిసినా ఈ మగాళ్ళు మాత్రమే మనుషులైనట్టు ఆడవారికి మూడు ముళ్ళు వేసి, ఇల్లాలిగా చేసుకుని వారికి కొన్ని పరిమిత అవకాశాలు కల్పించి (మగవారికి ఉపయోగపడే విధాన) ఆ గీటు దాటరాదని అహంకరించే హక్కు వీరికెవరిచ్చారు? అలాంటి మనిషితో మెదలడం పొరపాటని, అది స్వతహాగా హక్కు కాదని వారి ధ్యాసలోకి ఎప్పుడు వస్తుందా? అని మెదలి మనసంతా ఏదోలా అయ్యింది పార్వతికి. తను ఒంటరిగానే ఉంటున్నది. పట్నాన నౌకరీ చేస్తూ. తన మెడలో ఏ తాడూ పడని పుణ్యాన అప్పడప్పుడు కొంత ఒంటరితనం బాధ అనిపించినా, శాపంలా ఎప్పుడూ అన్పించలేదు. స్వేచ్ఛగానూ ఉంది. మన మహర్షులు, యోగులు ఏకాంతాన్ని ఆశ్రయించి ఎదిగిన వారే కదా. మనకున్న ఏ ఆలోచనకైనా మనస్సే కదా ప్రదానం. దానిపై ప్రభావం చూపే పరిసరాలూ. వీటికి భయపడితే జంకు, చక్కిలిగింత పెడితే తుళ్ళింత. ఏడిపిస్తే బాధ. ఉత్సాహంగా పరుగులు తీసినట్టనిపిస్తే వళ్లంతా తేలిపోయినట్టుండడం. ఇదంతా దాని నడక ప్రభావమే కదా. ఒక్కోసారి మాత్రం ఈ జనారణ్యాన్ని వదిలి చాలా దూరంగా పారిపోవాలనిపిస్తుంది. ఇలా నడుస్తున్న ఆలోచనలకు పుల్‌స్టాప్ పెడుతూ, గరుడ బస్సు స్టేజి మీద కొచ్చి ఆగింది హారన్ కొడుతూ.

నెమ్మదిగ లేచి లగేజీతో అడుగు కదిపింది. అప్పటి దాకా ఎక్కడున్నారో కానీ ఉసిళ్ళ మందలా జనం బాగానే గుమికూడారు. ఎవరి సీటు వారికి రిజర్వ్ చేసినది గమనంలో ఉన్నా నెట్టుకొంటూ, తోసుకుంటూ ఒరుసుకుంటూ దానిలో దూరి అక్కడా ఆగక నెంబర్ల ప్రకారం సీట్లు వెదుక్కోవడంలోనూ హడావిడి పడుతున్నారు. అందరూ ఎక్కిందాకా అక్కడే నిల్చుని, బస్సెక్కి టిక్కెట్లో ఉన్న నెంబరు ప్రకారం సీటు చూసుకొని దానిలో కూర్చుంటూ సంక సంచీ నుంచుకుని మిగతాది పైనున్న లగేజీ క్యారియర్‌లో వేసింది. కూర్చున్నాక ప్రక్కకు చూసింది. అప్పుడే ఓ అరవై ఏళ్ళ పెద్దాయన వచ్చి తన నెంబరు చూసుకొని పార్వతి ప్రక్కన కూర్చుని ఆమెను చూసి పలకరింపుగా నవ్వాడు. కొందరు నెంబర్లు చూసుకుంటూ గందరగోళంగా కూర్చుంటునే ఉన్నారు. బస్సు కదలబోతుండగా ఒక పెద్దావిడ ఎక్కవ లగేజీతో లోపలికెక్కబోతూ దాన్ని లోపలికి నెట్టి తను క్రిందకు జారింది. మూలుగుతూ, ముక్కుతూ మొకాలికంటిన మట్టిని తుడుచుకొని తగిలిన దెబ్బతో నెమ్మదిగా ఎక్కింది. దగ్గరగా కూర్చున్న ఎవ్వరిలోనూ చలనం కనిపించలేదు, చిత్రంగా చూడటం తప్ప. ఆమె అలాగే సామాను జరుపుకుంటూ నెంబరు చూసుకుంటూ పార్వతి ముందు వరసన ఆగి టిక్కెట్ పార్వతి చేతికిచ్చింది. పార్వతి దాన్ని చూసి తన వెనక సీటు చూపి దానిలో కుర్చోమని ఆవిడ సామానును పై ర్యాక్‌‌లోన సర్దుకొనేందుకు సహాయపడింది. ప్రక్కన కూర్చున్న పెద్ద మనిషిని జరగమని ఆవిడ నెమ్మదిగా సీటు దగ్గరకెళ్ళి కూర్చుని పార్వతి వైపు తేరిపార చూసి “ఆడపిల్లవి… ముసలిదాన్నని సహయం చేశావు. నీ కడుపు చల్లగుండ” అని ‘రామ!రామ’… అని సణుక్కోవడం మొదలుపెట్టింది. ఈ వయస్సు వాళ్ళను ఇలా ఒంటరిగా పంపడం ఎందుకో అర్థం కాలేదు.

బస్సు టౌన్ దాటేసరికి అరగంట పైన పట్టింది. ఊరు దాటిన దగ్గర్నుంచీ పంటపొలాలలో కూడా ప్లాట్లలాగా రాళ్ళు పాతి, ఇనుప తీగెలు వాటికి చుట్టి కన్పించినయి. బీళ్ళలా ఉన్న చోట మాత్రం పశువులు పచ్చగడ్డి మేస్తూ కనిపించినయి. మందకో ముసలయ్య మాత్రం కర్రను మెడపై అడ్డంగా పెట్టుకొని, దానిపై అటో చెయ్యి ఇటో చెయ్యి వేసి వాటిని అదిలిస్తూ కన్పించాడు. గాలి మంచిగానే వీస్తున్నా, వచ్చే పోయే వాహనాలతో హారన్ మోతలు, వాటి వేగపు చప్పడు కలిపి రణగొణగా చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. ఏదో వారపత్రిక చదువుదామనిపించినట్టుంది, దాన్ని బయటకు తీసి బస్సు కుదుపులకు చదవడం అంత మంచిది కాదో ఏమోనని ఊరుకుంది.

ఇంతలో ‘వాసు’ గుర్తుకొచ్చాడు. ఎందుకొచ్చాడో అర్థం కాలేదు కానీ నవ్వొచ్చింది. తను అతనిని ప్రేమించాలని కోరుకునేవాడు. చదువేమో పదితో ఆపాడు. అక్కడక్కడా గుమస్తాగిరి వెలగబెడుతుంటాడు. ఇళ్ళు దగ్గరవడం మూలాన వస్తూ, పోతూ ఇంటి దగ్గర ఆగి పోతుంటాడు. బయట కల్సినా ‘ఏమైనా కావాలా? నాతో ఏమైనా అవసరం ఉందా? వస్తాను…’ అన్నట్టు చూసేవాడు. తెలిసినవాడు, ఆత్మీయంగా చూస్తుంటాడు. స్నేహశీలిగా మసులుతాడు అన్న ధ్యాసలో తనూ నవ్వేది. దానికే అతడు చాలా ఇదిగా అయి సంతోషించినట్టు ముఖం విప్పారేది. ప్రక్కనున్న అతని స్నేహితులవైపు చూసి గర్వంగా నవ్వేవాడు ‘చూశారా! నన్ను చూసి నవ్వింది’ అన్నట్టు. నేను పట్టించుకొనేదానిని కాదు. అతడు అయాచితంగా ఆనందపడే దానికి నేనెందుకు అడ్డుపడాలి? అనిపించేది. తరచూ అతను కనిపించగానే అలవోకగా నవ్వి వెళ్ళిపోయేదాన్ని. మనకు బాగా తెలిసినవారి సంతోషం కోసం ఓ నవ్వు పారేయడం కాని విషయమూ కాదూ, ఖరీదైన విషయమూ కాదు కదా.

***

ఒకసారి నేను ఆఫీసు నుండి వస్తుంటే ఎదురుపడి ‘ఇంటికేగా?’ అని పలకరించి వెంటనడుస్తూ, ‘నీతో మాట్లాడాలి పార్వతీ!’ అన్నాడు. ‘మాట్లాడు, నువ్వు మాట్లాడుతుంటే నేనేమీ అడ్డుపడడం లేదు కదా?’ అన్నాను. నా ధోరణిని చూసి ‘ఇప్పుడు కాదులే’ అన్నాడు. ‘ఇప్పుడు కానప్పుడు..’? అని కోపంగా చూశాను. ‘అలా అని కాదు..’ అని నక్కిళ్ళు పడ్డాడు.

‘మరి ఎప్పుడు?’

‘నేను మళ్ళా కలిసినప్పుడు  చెబుతా. నువ్వు ఇంటికే కదా వెళ్ళేది. నాకు పనుందిలే’ అని చకచకా వెళ్ళిపోయాడు. ‘వట్టి పిరికి గొడ్డు’ అనిపించింది.

అసలు ఏదైనా, ఎవరితోనైనా మాట్లాడదలచుకొన్నప్పుడు ఈ నసుగుడెందుకు? చెప్పాల్సిందేదో చెప్పి పోవాలి కదా. ఓసారి మా ప్రక్కింటి సుబ్బారావు గారింటికొచ్చాడు. ఆయన కొడుకు జులాయి కాకున్నా చదువబ్బక ఇతనిలాగే ఏదో దొరికిన పనిని చేసుకొనేవాడు. ఇతనంత బద్దకస్తుడు మాత్రం కాదు. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల దాకా ఆ ఇంట అతడు కనబడడు. అంతో ఇంతో ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటాడు. వాసు అలా కాదు. తన ఆదాలో ఒక్క పైసా కూడా ఇంటి దగ్గర ఇవ్వడు. ముప్పూటలా ఇంట్లోనే భోంచేసి వస్తుంటాడు. తన కొడుకు లేడని సుబ్బారావు చెప్పడంతో వెనక్కి తిరిగి మా ఇంటికి వచ్చి లోనకు చూస్తూ ఆగాడు. నేను వరండాలోనే ఉన్నాను కనుక కనిపించాను. తొంగి చూసి ‘ఇవాళ ఆఫీసు లేదా?’ అని అడిగాడు. అప్పుడు చూశాను నేనతనిని. ‘ఉంది వెళ్ళాలి’ అన్నాను. ఇంతలో ఇంట్లోంచి మా అమ్మ ‘ఎవరే’? అంది ‘వాసు మన వర్థనమ్మ గారి వాసు’ అని చెప్పాను. కాస్త ఆగమంటూ బయటికొచ్చింది. వాసును లోనకు పిలిచి “అమ్మ బాగుందా? నెల  రోజులలోగా ఒకసారి దానిని కలిసిపోవాలనుకుంటున్నా కుదిరి చావడం లేదు” అంది.

‘బాగానే ఉంది’ అని ‘ఏమైనా చెప్పమంటారా?’ అని అడిగాడు. “నీతో చెపితే నేను మాటాడినట్టవుతదా? నేనే వారం రోజులలో వచ్చి కలుస్తానని చెప్పు” అని చెంగుతో చెయ్యి తుడుచుకుంటూ లోనకెళ్ళింది. పిలిచింది కనీసం మంచినీళ్ళైనా తాగుతావా? అని అడగనే లేదు. “ఇక వెళతాను” అన్నాడు లేచి వెళ్తూ. అవిడ వినిపించుకుందో లేదో?

ఇక నేను ‘నిన్ను పిలిచిన మా అమ్మ ఎప్పుడో లోనకెళ్ళింది. ఇక నీదే ఆలస్యమన్న’ట్టు చూశాను. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాడు. గేటు దాటుతూ ‘బై’ చెప్పడంలా చేయి ఊపాడు. అతను చెయ్యి ఎందుకు ఊపుతున్నాడో కూడా నేను గమనించలేదు. నేను ఆఫీసుకి వెళ్ళే తొందరలో ఉన్నాను.

***

బస్సు స్లో గా నడుస్తుంది. మంగళిగిరి దాటి బెజవాడలోకి ప్రవేశించింది. మంగళగిరి నుంచి బెజవాడ దాకా రోడ్డంట చాలా భాగం ఇళ్ళే కన్పించినయి. అవి రెండూ కలిసే ఉన్నట్టు కనిపిస్తది కొత్త వారికి. కిటికీ నుంచి బయటకు చూస్తున్నాను. ప్రక్కనున్న ఫంక్షన్ హాలుకు చాలా మంది వెళుతున్నట్టున్నారు. నీటుగా కన్పించారు ఆడవారు. అందున్న పిల్లలు ఇద్దరు బస్సు వేపు చూస్తున్నారు. అందంగా కన్పించారు, ఎగురుతున్న పైటలను అదుపు చేసుకుంటూ. ఆడపిల్లలు ఎందుకోగానీ వయసోచ్చాక అందంగా కన్పిస్తారు. అందుకే కుర్రకారు చొంగలు కార్చుకుంటూ వెంటతిరిగేది అనిపించి నవ్వొచ్చింది పార్వతికి. అలా తిరిగే వారు తలలో మెదిలారు. ఈ ఆడవాళ్ళకు వయసొస్తున్న కొద్దీ స్వేచ్ఛ తగ్గిపోతుంది. ‘ఇంత పొద్దుపోయిందాకా ఎక్కడున్నావే?’, ‘ఏం రాచకార్యాలమ్మా ఆడపిల్లలకు?’. ఎక్కడ చదివినా నౌకరీ చేసినా పొద్దు వాలకముందే ఇంటికి చేరాలి అని ఇంటనున్న మగవారే కాదు, ఎక్కవ ఆడవారి నోటనే మనం ఈ మాట వింటాం. బస్సు బెజవాడ బస్ స్టేషన్‌లో ఆగింది. ఐదారుగురు దిగారు. దిగినంతమంది గబగబా లోనికి వచ్చి నెంబర్లు చూసుకొని ఆరాముగా కూర్చున్నారు.

బస్సు పదినిమిషాలు ఆగుతుంది అని డ్రైవర్ చెప్పి దిగిపోయినా అప్పడే కూర్చున్నవారు మాత్రం దిగలేదు. వెనకు నుంచి వచ్చి కొందరు నెమ్మదిగ దిగుతున్నారు. పార్వతి వెనక కూర్చుని రామనామం జపిస్తున్న ఆవిడ ఆమెను తట్టి ‘అమ్మాయి, ఇది బెజవాడేనా?’ అని అడిగింది. అవునన్నట్టు తలూపింది పార్వతి.

“మంచినీళ్ళు త్రాగి బస్సు ఎక్కాల్సి వచ్చింది. ఇద్దురు వయస్సు పోరళ్ళు ఇంట్లో ఉన్నా అసలు ఇప్పటికి ఒకతి లేచిందో, లోవలేదో? ఒకతి మాత్రం లేచి మొహం కడిగి కాఫీ కాచి త్రాగి, మగడు ఎప్పుడు లేస్తుంటాడా అని ఎదురుచూస్తూంటుంది. వాడుంటే దానికి ఎంతో కొంత దడుపుంది. ఎలా భయపెట్టాడో ఏమో? బయట మాత్రం అమ్మో! నంగనాచి తుంగబుర్రలు…” అని “ఆ సోద నీకెందుకులేమ్మా, నువ్వు కిందకు దిగుతావా?” అని అడిగింది. తలూపింది పార్వతి. “ఓ పెరుగన్నం పొట్లం తెచ్చివ్వరాదూ?” అని డబ్బిచ్చింది. పార్వతి వెళ్తూ, “మంచి నీళ్ళున్నాయా?” అని అడిగింది. ఉన్నట్టు తలూపి మంచినీళ్ళ సీసా చూపింది. కిందకి దిగి కాఫీ త్రాగి ఆవిడకు కావలసిన పెరుగన్నం పొట్లం తెచ్చిచ్చింది పార్వతి. ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంది కనుక ఓ మాస పత్రిక కొంది. “నా అదృష్టం కొద్దీ నువ్వు తోడయ్యావ్” అంది మెటికలు విరుస్తూ పొట్లం తీసుకొని! ‘ఏం?’ అన్నట్టు చూసింది.

“ఒకసారి హైదరాబాద్ నుండి వస్తుంటే మధ్య తోవలో బస్సాగిన దగ్గర ప్రక్కన కూర్చున్నావిడతో ‘కొంచెం మంచినీళ్ళు తెచ్చిస్తావమ్మా’ అనడిగితే అదోలా చూసి ‘ఇక్కడ నీ నౌకర్లు ఎవరున్నారు’ అంది. నోరు మూసూకుని గుంటూరు వచ్చిందాక ఓర్చుకుని దిగాక నోరు తడుపుకోవాల్సి వచ్చింది. ఆవిడ మాత్రం ఆ తర్వాత నిదానంగా లేచి క్రిందికి దిగి సమోసాలు, పాప్‌కార్న్ తెచ్చుకొని మంగళగిరి దాటిందాకా పరపరా నములుతూనే ఉంది” అని అనగానే, “అందరూ ఒక తీరుగా ఉంటారాండీ?” అన్నది పార్వతి. ‘ఎవరికెవరికి మనస్తత్వాల సామీప్యత కన్పించదు’ అనుకుని కూర్చుంది. బస్సు తిరిగి కదిలింది.

నగరాలు బ్రహ్మరాక్షసుల్లా కాయాలను పెంచుకుంటూ పోతుంటే పల్లెలు కబేళాలకు పోతున్న పశువుల్లా బక్కచిక్కపోతున్నాయి. ఇప్పుడు బస్టాండ్ వదిలి బజవాడ దాటడానికి లోగడ కంటే ఒక అరగంట సమయం పెరిగింది. అది మనం చూడకపోయినా తెలుస్తనే ఉంటది. పల్లెలు, పచ్చిక, చెట్లు, గుట్టలు, పశువులు, జీవాలు ఇలా కంటికి ఇంపుగా కనిపిస్తూనే ఉంటాయి. మళ్ళీ నందగామ దగ్గర్నుంచీ ఈ పల్లెతనం.

ఎదురుగా రోడ్డుపై గుంపు కన్పించింది. బస్సు నెమ్మదిగా నడిపి అక్కడ ఆపాడు. అదీ ఆర్టీసీ బస్సే. దాని క్రింద గేదె పడి చనిపోయింది. కాళ్ళు విరిగి ఛిద్రంగా కనిపించింది. బస్సునున్న అన్ని తలకాయలూ తొంగి చూసినయి. ‘ఏం జరిగింద’ని ఆగిన డ్రైవరును పలకరించి ‘డిపోలో ఏమైనా చెప్పాలా’ అని అడిగి తిరిగి బస్సు స్టార్టు చేశాడు. గేదే ముప్ఫయి వేలు చేస్తుందట. వాటిని కట్టి బస్సు కదలమంటున్నారు గుంపునున్న జనం. ఆ బస్సున ప్రయాణం చేస్తున్న వారెమో తమ తమ గమ్యస్థానాలకు ఎలా వెళ్ళాలా, ఏమిటి పరిస్థితి అని దిగాలుగా కన్పించారు. డ్రైవరు తెలుసుకున్న అక్కడి సారాంశమిది.

ప్రకృతంటే మనషికి గౌరవముంది. అభిమానిస్తాడు కూడా. కానీ అతని అవసరానికి దానిని తెగటార్చెందుకు వెనకాడడు. తన అవసరాన్ని మరుగున పెట్టి ఒక సాకు మాత్రం చెపుతాడు. ఇప్పటికంటే చాలా మెరుగుగ ఉన్నదని భ్రమ కలిగిస్తాడు. కాలం నడకన ఒకప్పటి నాగరికతే ఇప్పటి అనాగరికం. దానిని మనం చూస్తున్నాం… అర్థం చేసుకోవడంలో తేడాలున్నా.

అందమైన శిల్పం ఉంది. దాని ఆంతర్యం మనకు తెలియదు కదా. కాని దానిని చెక్కిన శిల్పికి తెలుసు కదా. ఈ అంత్రం మనకు త్వరగా అంతుబట్టదు. ఓ అమ్మాయి నవ్వుతుంటే చూడముచ్చటేస్తుంది. ఒకరు నవ్వుతుంటే రాళ్ళడబ్బా మ్రోత వినిపిస్తది. మరో నవ్వున విషాదపు జీర. మరో చోట ఆహ్లాదం. అయితే వీటి వెనకనున్న ఆలోచనలు కానీ, భావాలు కాని అంతుచిక్కవు. అసత్యం చెప్పడం మంచిది కాదని నిత్యం అబద్దాలాడే వాడికి మాత్రం తెలిదా? అది తప్పనుకుంటుంటాడు కానీ దానిని మానడు. కుక్క తోక సామెత.

***

ఒకనాడు వర్షంలో ముద్ద ముద్దగా తడిసి వచ్చాడు వాసు. అతన్ని అలాగే చూస్తుండిపోయా. తల తుడుచుకొమ్మని కండువా ఇవ్వలేదు. నేనేం చేస్తున్నానూ అంటే తెలియదు. కాని ఏదో మనస్సుకు తెలుస్తుంది. నగ్నంగా మగాడు అనే శల్తీ ఎలా ఉంటుందో మనస్సు గ్రాస్ప్ చేసిందన్నమాట.

“వర్షంలో వచ్చాడు. తల పూర్తిగా తడిసింది. జలుబు చేస్తుంది. ఆ తుండుగుడ్డ తెచ్చియ్యి” అని అమ్మ గదిమిందాకా నాకా ఏ ఆలోచనా రాలేదు. ఆ వేళ నన్ను మనస్సున ఎంత తిట్టుకున్నాడో. ఒకనాడు వాసు కూరగాయల బండిలో వస్తూ కనిపిస్తే అమ్మ ఎదురుపడి ‘అరె వాసూ నువ్వు పెళ్ళి చేసుకోవాట్రా, నీకు ఇరవై మూడేళ్ళు దాటాయనుకుంటా. పక్కింటి దీక్షితులుగారబ్బాయికీ నీకూ పదిరోజులో తేడా అట. వాడు మొన్న కన్పించినప్పుడు ‘ఇంక నాలుగు నెలలు పోతే నాకు ఇరవై ఐదు వస్తాయి. ఇప్పటికి పిల్లని ఇస్తామని ఎవరూ రాలేదు. నేను కావాలనుకొనే పిల్లా నాకు కన్పించలేదు’ అని సణుకుంటూ వెళ్ళిపోయాడట. ‘అది సరే, నీ సంగతేమిట’ని అడిగితే ‘నా పెళ్ళాన్ని నేను సాకగలను అనిపించినప్పుడు అన్నాడ’ట. ‘మరి అప్పుడు నీ వయస్సు ముఫ్పై దాటితేనో’ అంటే, ‘గంతకు తగ్గ బొంత దొరక్కపోతుందా’ అని పెద్దగా నవ్వాడు. ‘మరి నిన్ను పోషిస్తానన్న పిల్ల ఎదురుపడితే…’ ‘నేనంత అదృష్టవంతుడిని కాదులే’ అని వెళ్ళిపోయాడట. ఇతంలో గౌరి గుర్తుకొచ్చింది. వాళ్ళ పక్కింటబ్బాయి ఓ పూట గౌరి దగ్గరికి అరాటంగా వచ్చాడట. మధ్యంతరంలోనే తన ప్రేమను చెప్పకొందామనుకొన్నాడట. కాని అవకాశం దొరకలేదట. ఇప్పడు ఒంటరిగా వేపచెట్టు క్రింద కూర్చొని అంటే వచ్చి పదహారు పళ్ళు కనబడేలా దాన్ని చూసి నవ్వాడు. వ్వాట్ అన్నట్టు చూసింది. ‘ఇప్పుడెవ్వరూ లేరు. దగ్గరలో మల్లెపొదా ఉంది. ఇప్పుడు నిన్ను ముద్దెట్టుకుని పారిపోతే ఏం చేయగలవ్’ అని అదాటుగా వాటేసుకుని ఆత్రంగా ముద్దెట్టుకుని పరుగులాంటి నడకతో పారిపోబోయాడు. పదడుగులు పడక ముందే ‘హలో ఆగు’ అందట. ఆగాడు. ‘నిన్ను ఇప్పటిదాకా పిరికి వెధవ్వి అనుకొన్నాను. ఆకారం తప్ప చింతాకంత బుర్ర కూడా లేదని ఇప్పడర్థమైంది’ అనగానే ఉక్రోషంగా చూశాడట. ‘నేను ఒంటరిగా ఉన్నాను. ప్రక్కన మల్లె పొద ఉంది. చుట్టూరా ఎవరూ లేరు. ఒక్క ముద్దుతో సరిపెట్టుకొని తోక తెగిన నక్కలా ఆ పరుగేమిటి. అసలు నిన్ను ఏమనుకోవాలి. ఛ’ అని ఇంటి వైపు నడిచిందట. దగ్గరికి రాబోయాడట కాని తల మొద్దుబారడంతో అడుగులు కదపలేకపోయాడట. ఇది తలన మెదిలి నవ్వొచ్చింది.

***

సూర్యపేటలో బస్సాగింది. ఆలోచన తెగింది. “మీరు భోజనానికి వస్తారా మామ్మగారూ” అనడిగింది పార్వతి వెనకాల ఉన్న ఆవిడను చూచి.

“అక్కర్లేదమ్మా, నువ్వు పెరుగన్నం తెచ్చావు కదా. అది ఇప్పుడే తినేశాను. ఇక హైదరాబాద్ చేరిందాకా ఏమీ అక్కర్లేదు” అంది. “నేను రెండు రొట్టెలు తినొస్తాను” అని దిగింది. భోజనం టైం అని బస్ డ్రైవర్ చెప్పడంతో దాదాపు అంతా కదిలారు. పార్వతి దిగి క్యాంటీన్ వేపు నడిచింది. తను నడుస్తుండగానే సైరన్ కొడుతూ పోలీస్ జీపులు బస్టాండ్‌ను రౌండప్ చేసినయి. ఆమె నిలబడిపోయింది. దాదాపు నాలుగు జీపులలో హుటాహుటిన దిగి బస్సులను చెక్ చెయడం ప్రారంభించారు. స్టేషన్ నుంచి బయటికి కూడా ఎవరినీ వెళ్ళనీయలేదు. ఎటు పోయేవి అయితేనేం దాదాపు పదిహేను దాకా బస్సులు ఆగి ఉన్నాయి. పోలీసుల హడావిడికి అక్కడున్న జనం ఏం జరుగుతుందో అన్నట్టు స్థాణువులా నిలబడిపోయారు. కొందరు బిక్కబిక్కుమంటూ బస్సుల వైపు నడిచారు. పసిపిల్లల ఏడుపు అక్కడక్కడా వినిపించింది. స్టేషన్ అంతా గందరగోళం. బస్సులో తనిఖీ పది నిమిషాల్లో పూర్తి చేసుకుని క్యాంటీన్‌లోని జనాన్ని పరిశీలిస్తుండగా ‘అదిగో’ అన్నాడు ఓ పోలీసు ఒకతన్ని చూపుతూ. ఐదురుగురు అటుగా పరుగెత్తి అతన్ని చుట్టుముట్టి పట్టుకున్నారు. ఈలోపు క్యాంటిన్ మూలన కాఫీ త్రాగుతున్న ఒకడ్ని ఈడ్చుకుంటూ వచ్చారు. మిగతా ప్రాంతాలలో కూడా గాలించి ఆ ఇద్దరినీ లాక్కునిపోయి వాళ్ళను జీపులో పడేసి, వచ్చినంత వేగంగా వెళ్ళిపోయారు. ఉరుము, మెరుపు లేకుండా వర్షం పడి టక్కున వెలిసినట్టయింది. జీపులు వెళ్ళిపోవడంతో జనాల కదలిక ప్రారంభమైంది. ఆనక పట్టుకుని వెళ్ళిన వారిపై ఊహాగానాలు స్టార్ట్ అయినయి. ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకుంటున్నారు.

బస్సు డ్రైవరు లోపల భోంచేస్తూ కన్పించాడు. ఓ పూరీల కూపన్ తీసుకొని సప్లై కుర్రాణ్ణి తొందరపెట్టి, గబగబా తిని, కాఫీ త్రాగి బస్సెక్కింది పార్వతి. బస్సు దగ్గరకు వస్తుండగా రెండు కాళ్ళు లేని అతను ‘అమ్మా!’ అన్నాడు. ఓ రూపాయి తీసి అతనికిచ్చి ‘ఇలాంటి వారిని పాలకులు ఎందుకు ఆదుకోరు?’ అనుకుంటూ నడిచింది. దిగినవారు అప్పటికే చాలా మంది లోనకూర్చుని కొనుకొచ్చుకున్న సమోసాలు, అరటిపళ్ళు తింటూ కన్పించారు.

‘అసలెవరంటావు వాళ్ళు?’ ప్రశ్న… అరటికాయ మొత్తం తిని తొక్క పారేస్తూ.

‘తెలీదు’ జవాబు.

‘అయినా ఇది నక్సలైటు ఏరియా కదా? వారు కాక బస్సు దొంగలు, దోపిడి దొంగలు ఇలా ఎవరేమిటని చెప్పగలం?’ అన్నాడు ప్రక్కవాడు పాప్‌కార్న్ కరకరా నములుతూ.

‘మామూలు దొంగల కోసం ఇంత హడావిడి చేయరు. ఏ పెద్దదో జరిగుంటది. వారి మెప్పుకోసం ఈరకం హడావిడి చేస్తారు. వీరి కష్టానికి మామూళ్ళు దొరకుతయి కదా’ అని  అదోలా నవ్వాడొకడు.

జరిగినదానికి ఎవ్వరూ కలత చెందినట్టు లేదు. అదో రకం హేళన కన్పిస్తుంది. ఇంతలో డ్రైవర్ వచ్చి అందరూ ఉన్నారా? అన్నట్టు చూసి శాల్తీలు లెక్కించుకుని ‘ఇంకొకరు రావాలి’ అని సీట్లో కూర్చుని హారన్ కొట్టాడు బస్సు స్టార్ట్ చేస్తూ.

ఇక వెనకాల ఉన్నవాడు “నా ప్రక్కనున్నోడు రాడండి, అతన్ని పోలీసులు పట్టుకుపోయారు. బస్సు పోనీయండి” అన్నాడు.

చివరి సీట్లో కూర్చున్న ముసలయ్య డెబ్బై ఏళ్ళుంటయి. బాగా ఏడుస్తున్నట్టు కళ్ళు ఎర్రగా కన్పించినయి. ‘ఎవరతను?’ అని ఒక పది మంది కోరస్‌గా అడిగారు వెనక్కితిరిగి. ‘ఎవడెటు చస్తే మాకేం, బస్సు కదిల్తే చాలు’ అన్న భావనే కొందరిలో కనిపించింది. ముసలయ్య మాత్రం కళ్ళు తుడుచుకుంటూ కూర్చునే ఉన్నాడు. చిత్రంగా చూడటం తప్ప చీమ కుట్టినట్టైనా లేదు చాలా మందికి. తన దాకా వస్తే కదా బాధ తెలిసేది. “ఎవరు తాతా! మీ బంధువా?” అడిగాడు ప్రక్కనున్న అతను అనునయంగా. “పట్టుకుపోయింది నా బిడ్డ కొడుకును బాబూ. వాడు పట్నంలో చదువుతుండు. మూడు దినాలైంది వచ్చి. వెళ్తుంటే పోలీసులు పట్టుకుపోయారు. ఎందుకో ఏందో?” అని పెద్దగా ఏడ్చాడు. “మీదే ఊరు?” అడిగాడు ఒకడు. అది ఇప్పుడు అవసరమా అనుకొంది పార్వతి. వినిపించనట్టు ఊరుకొన్నాడతను. పోరడ్ని పట్టుకొనిపోయారన్న బాధతో విలవిల్లాడుతున్నట్టు అన్పించింది.

బస్సు నడుస్తుంది. పట్టుకొనిపోయిన వారిపై ఎవరి ఆలోచనలో వారు ఏమీ తెలియకున్నా పూర్తిగా మునిగి ఉన్నారు. “మనల్ని చంపేసేవాడు అయినా, మన ప్రక్కనే కూర్చుని ప్రయాణం చేసినా తెలిసి చచ్చేట్టు లేదు” అన్న గొంతొకటి పెద్దగా వినిపించింది. ‘అవునా’ అన్నట్టు నోరెళ్ళబెట్టాడు ఓ నాగరికుడు. “బస్సు బోల్తాపడి చచ్చేప్పుడు ముందుస్తుగా కబురు ఎవరికన్నా తెలుస్తుందా? అస్సలు మన బ్రతుకులే గాల్లోదీపాలు” అన్నాడొక వృద్ధుడు తనలో తనే నవ్వుకొంటూ.

‘మంచి నీళ్ళున్నయ్యా తల్లీ?’ అంది వెనకావిడ. సీసా ఇచ్చింది పార్వతి. తాగి దాహం తీర్చుకొని ‘సల్లగుండు’ అని సణిగింది నీళ్ళసీసా ఇస్తూ. బస్సు వేగంగా పరిగెడుతుంది.

స్టాప్..స్టాప్.. అంటూ ఎవరో బస్సుకు అడ్డంగా నిలబడి చేయి ఊపారు. బస్సు స్లో చేసి ‘ఇది గరుడ, ఏడ పడితే ఆడ చెయ్యి ఊపగానే ఆపరు’ అంటూ ‘చదువుకున్న వారిలాగే ఉన్నారు సన్నాసులు. అస్సలు ఏ సెన్సూ లేకుండా చదువులు పూర్తి చేస్తున్న తరమిది’ అని పెద్దగానే అంటూ బ్రేక్‌పై కాలు వేశాడు డ్రైవరు. ‘థాంక్స్’ అంటూ ఓ యువజంట చంక సంచీలతో లోనికెక్కారు. వారినే చూస్తూ ‘సూర్యాపేట నుంచి టికెట్ అవుతది’ అన్నాడు. ‘అలాగే’, అని పర్సు తీసి ఐదొందల నోటిచ్చాడు. టిక్కెట్ తీసుకొని అక్కడో సీటు, ఇక్కడో సీటు ఖాళీగా ఉంటే వెళ్ళి కూర్చున్నారు ఒకరినొకరు చూసుకుంటూ. అటుగా చూసింది పార్వతి. కాలేజీ చదువులు పూర్తయిన వాళ్ళలాగానే కన్పించారు, లేదా ఏదైనా నౌకరీలు చేస్తున్నారో? వారు నిజంగా ప్రేమికులో, భార్యాభర్తలో అయితే బాగుంటుందనీ, ‘మంచి జంట’ అనీ అనుకొంది పార్వతి.

బస్సు నడుస్తోంది. దాదాపు రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర్లోకి రాగానే బస్సును ఆర్టీవో ఆపాడు. డ్రైవరు దిగి, పేపర్లు చూపి అన్నీ కరెక్టుగా ఉన్నా, పది నిమషాల తర్వాత వచ్చి బస్సెక్కాడు. అక్కడేం జరిగిందో… వాళ్ళను బూతులు తిడుతూ అసహనంగా బస్సు నడుపుతున్నాడు. డ్రైవరు అసహనం ప్రయాణీకులకు అపాయ సంకేతం అనుకొని బాట వైపు చూస్తూ కూర్చుంది. ఇక నగర ప్రవేశం జరిగింది అనుకొంది.

“ఈ బస్సు స్టాండుకు చేరెందుకు ఎంత టైము పడుతుంది?” అడిగింది వెనకావిడ.

“అరగంట పైన… ట్రాఫిక్ జామ్ కాకుండా ఉంటే” అని చెప్పింది.

“నేను డీర్ పార్క్ దగ్గర దిగాలమ్మా, కొంచెం చెప్పు. మా వాళ్ళేమో పార్క్ దగ్గరకు వస్తామన్నారు” అంది.

“అక్కడ ఆపుతాడులే” అంది పార్వతి.

ఎవరి స్టాపు దగ్గర వాళ్ళు దిగేందుకు సన్నద్ధమై ఒక్కొకరు డ్రైవర్ దాకా వెళ్ళి తామెక్కడ దిగాలో చెప్పుకొంటున్నారు. అతను వింటున్నాడో, లేదో కాని అతని పద్ధతి ప్రకారం ఆపుతూ ఇది ఫలానా స్టాప్ అని కేక వేసి చెపుతున్నాడు. అలా ఆగుతూ బస్సు స్టేషన్‌కు చేరేసరికి ఇంకా పొద్దుంది. నెమ్మదిగ దిగింది. దిగి చుట్టూరా కలియచూసింది. తెలిసినవారెవరూ కన్పించలేదు. ‘అయినా నా కోసం ఎవరొస్తారు, నా భ్రమ కానీ…’ అనుకుంటూ ఆటో స్టాంట్ వైపు నడిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here