[box type=’note’ fontsize=’16’] “డ్యూటీ సిన్సియర్‌గా చేస్తూనే ఉన్నాడు. ఎక్కడ నిలిచిపోయాడో అక్కడే వున్నాడు. పరిగెత్తతూ కుంటుతూ… నిజంగా ఫలితాలొస్తాయా?” ఓ వైద్యుడి అంతరంగ మథనాన్ని చిత్రించిన కథ “నిర్ణయం”. రచన డా. చిత్తర్వు మధు. [/box]
[dropcap]సో[/dropcap]మవారం ఉదయం తొమ్మిది నలభై మూడు.
కనుచూపు మేరా కార్లు. హిమాయత్‌నగర్ నుంచి నారాయణగుడా దాకా ఒకటే లైన్. మెల్లగా పొడగాటి లైన్ నత్త నడక నడుస్తోంది.
డాక్టర్ ధీరజ్ విసుగ్గా టైం చూసుకున్నాడు.
ధన్వంతరీ హాస్పిటల్ ఓ.పి.లో తొమ్మిదికే వుండాలి. కానీ ఆలస్యం అయిపోతోంది మళ్ళీ.
ఇప్పటికే, రెండు సార్లు మెత్తగా హెచ్చరికలు వచ్చాయి సి.ఈ.ఓ నుంచి.
మొబైల్ ఫోన్‌లోంచి బ్లూటూత్‌లోని ఇయిర్ ఫోన్‌కి కాల్ వస్తోంది.
ఆన్సర్ అన్న సిగిల్ నంబర్ కీ నొక్కి డ్యూటీ డాక్టర్ నీరజకి చెప్పాడు “కొంచెం లేటవుతుంది. ట్రాఫిక్ జామ్! నువ్వు కాస్త నేను వచ్చేవరకు ‘మ్యానేజ్’ చెయ్యి నీరజా! ప్లీజ్!”
“నో ప్రోబ్లం సర్!”
***
ఓ గంట తర్వాత మెడికల్ ఓపీలో…
“ఏం బాధ అమ్మా”
“గుండె నొప్పొస్తోంది బిడ్డా… గిక్కడ!”
ముసలావిడ చేయి పట్టుకుని చూపించింది ఎడమ ఛాతి వైపు.
“నీరజా, ఇ.సి.జి. కూడా తీయించలేదా” విసుగ్గా అడిగాడు ధీరజ్.
“సార్! అమెకి ‘క్యాబేజ్’ CABG (అంటే బైపాస్ సర్జరీ) కూడా అయిపోయింది. అయినా గుండెనొప్పి అంటోంది!” అంది డాక్టర్ నీరజ.
“మైగాడ్! ఇంత బీదగా కనిపించే ముసలావిడకి బైపాస్ కూడా చేసేసారా? అయినా నొప్పి?”
గబగబా మెడికల్ రికార్డు అంతా చూశాడు. ఆమెకి ఇన్స్యూరెన్స్ – ఆరోగ్యశ్రీ వుంది.
ఒక చోట కళ్ళు ఆగిపోయాయి.
హిమోగ్లోబిన్ 5 గ్రాములు వుంది.
“తీవ్రమైన రక్తహీనత! దాని వల్ల గుండె నొప్పి వస్తోంది. ఎనీమియాకి వైద్యం చేయాలి కాని. ఇన్స్యూరెన్స్ వుందని ఆపరేషన్ చేసేశారు.
ధీరజ్‌కి కోపం ఒక్కసారి వెల్లువలా…
గుండె జబ్బు లేకున్నా బైపాస్ ఆపరేషన్ చెయ్యడమే కాకుండా… ఆమెకి చివరికి నొప్పి తగ్గలేదు. అసలు కారణం ఎనిమీయా!
సర్జరీకి ఎక్కువ డబ్బులు… అదాయం వస్తుందనా?
“నువ్వు హాస్పిటల్‌లో చేరమ్మా. రక్తం తక్కుగా వుంది. ట్రాన్స్‌ఫ్యూషన్ చెయ్యాలి. అప్పుడు తగ్గుతుంది. ఆ తర్వాత రక్తహీనత ఎందుకు వచ్చిందో పరీక్ష చేయాలి. ఇది గుండె జబ్బు వల్ల వచ్చే నొప్పికాదు!” చెప్పాడు.
***
ఓ.పి అయిపోవస్తోంది.
తెల్ల ప్యాంట్, కోటు వేసుకున్న బంట్రోతు వచ్చి నిల్చున్నాడు.
“ధీరజ్ సార్! అమ్మగారు మిమ్మల్ని అర్జంటుగా రమ్మన్నారు!”
అమ్మగారంటే హాస్పిటల్ డైరెక్టర్ చందన.
ఇది ఐదు నక్షత్రాల ధన్వంతరీ కార్పోరేట్ హాస్పిటల్. ఆ హాస్పిటల్ డాక్టర్ చందన, ఆవిడ భర్త కలిసి స్థాపించారు. ఆమె ఆస్పత్రి బోర్డ్ డైరెక్టర్.
అతనికి కోపం వచ్చింది.
డాక్టర్ ధీరజ్… మాసిన గడ్డం, గిరజాల జుత్తు, కొద్దిగా నలిగిన తెల్లకోటు. అరడుగల పొడవైన శరీరం. అయినా ఆలోచనలతో అలసిపోయినట్లున్న ఎర్రని కళ్ళకింద నల్లటి చారలు.
మంచి డాక్టర్. డయాగ్నోసిస్‌లో గొప్పవాడు అని పేరుంది.
అందుకే చందన తనని ఇక్కడ పని చెయ్యమంది.
చందన అంటే డైరెక్టరే కాదు, ఒకప్పటి క్లాస్‌మేట్. ఇంకా క్లాస్‌మేట్ కంటే ఎక్కువ.
ఎక్స్ ఫ్లేమ్ అనాలా!
ఆఖరి జ్వాల అంటారా! ఈ జీవిత ప్రయాణాలలోని కఠినమైన వాస్తవాల మధ్య మరిచిపోవాల్సిన ఓ తీపి గురుతు.
మనుషుల సంబంధాలన్నీ ఆర్థికమే అని జ్ఞాపకం చేసే ప్లాస్టిక్ చిరునవ్వు.
“నిన్ను ఎందుకు ఇక్కడ ఎపాయింట్ చేశాను ధీరజ్!”
నవ్వాడు.
“ఏమయింది మళ్ళీ?”
“ఏముంది! నువ్వు అదాయం లేకుండా, ప్రాక్టీస్ లేకుండా తిరుగుతున్నావని మీ ఆవిడా మీ అమ్మాయి గోల చేస్తే నా హాస్పిటల్‌లో కన్సల్టెన్సీ ఇచ్చాను. నీ ఎక్సెంట్రిక్ ప్రవర్తనతో రోజూ ఫిర్యాదులే? ఎలా?”
ధీరజ్ ప్రశాంతంగా చూశాడు.
“గో ఆన్ చందనా. చెప్పు! ఏం చేశాను తప్పులు!”
“ఏమీ స్పెషల్ టెస్టులు రాయవు. జబ్బు ఏమీ లేదని పేషంటుకి చెప్పి పంపేస్తే హాస్పిటల్ ఎలా నడుస్తుంది? పి.ఆర్.ఓలు ఒకటే గోల! స్కానింగ్ వద్దంటావు. బ్లడ్ టెస్టులు చెయ్యవు. ఒకటో రెండో ముఖ్యమైనవి చాలంటావు. ఎం.ఆర్.ఐ., సి.టి., బ్లడ్ ప్రొఫైల్స్ చెయ్యకపోతే ఎలా? కోట్ల ఖరీదున్న ఎక్విప్‌మెంటు, వాటికి ఇన్‌స్టాల్‌మెంట్ ఎలా కట్టడం?”
“చందనా… వైరల్ ఫీవర్‌తో వచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తుడికి నడుం నొప్పి వుందని అంటే వాడికి రీయింబర్స్‌మెంట్ వుందని ఎం.ఆర్.ఐ.ని నడుముకి చేయించమంటావా? జ్వరానికి ఒళ్ళు నొప్పులకి బ్రెయిన్ స్కాన్, నడుము స్కాన్ కావాలా? పారాసెట్‌మాల్ చాలదా? నీరసంగా వుందని రక్తహీనత అనే ఎనీమీయాతో వచ్చిన స్త్రీకి ఇ.సి.జి తీసి ఎంజియో బైపాస్ చేయాలా? కాల్షియం లేక కాళ్ళ నొప్పులంటే మొత్తం కీళ్ల జబ్బులన్నిటికీ ANA ప్రొఫైల్ చేయాలా? ఈ పి.ఆర్.ఓ. ఎవరు నాకు చెప్పేందుకు. నాకు తెలీదా?”
డాక్టర్ చందన. ఆమెతో గట్టిగా మాట్లాడలేడు. ఆ కళ్ళలో మెరుపు, నుదిటిన గుండ్రటి బొట్టు. ఇప్పుడే జుట్టులో అక్కక్కడా నెరసిన బంగారు దారాలు. ఆ గొంతు వింటే మనసు ఎక్కడికో వెళ్ళి చల్లబడి ఘనీభవిస్తుంది.
“ఇది రెఫరల్ ఆసుపత్రి. ఆఖరి (టెరిషియర్) గా అందరు రోగులూ వచ్చే అధునాతన ఆస్పత్రి. అన్ని పరీక్షలు చేయందే కుదరదు. నువ్వు గోల్డ్ మెడలిస్ట్ కావచ్చు, తెలివిగల వాడివి కావచ్చు. కానీ….”
ఆమె గొంతు మళ్ళీ బాధగా మూలిగింది.
“ధీరజ్ నీకు కనీసం రెండు లక్షలైనా ఆదాయం ఇప్పించాలని నిన్ను ఇక్కడ పెట్టుకున్నాను. కానీ రోజు ఫిర్యాదులే. లేటుగా వస్తావు. పేషంట్లని తిడతావు, రఫ్‌గా మాట్లాడుతుంటావు. ఎలా?”
“నేను చూడక పోయినా, కాదన్నా, లేట్ అయినా రెసిడెంట్లు డి.ఎం.ఓ.లు చూస్తున్నారు. అవి వాళ్ళకి శిక్షణే కదా. నాకు నీలా మెర్సిడిస్ కారూ డ్రైవరూ లేరు. ట్రాఫిక్ జామ్‌లో వచ్చేసరికి లేటవుతూ వుంటుంది. ఏం చేయను చందనా. పేషంట్లు సరిగా డయిట్ తీసుకోకపోతే, మందులు వేసుకోకపోతే మందలిస్తాను. అది తిట్టడమా?”
“లాభం లేదు ధీరజ్. ఇక కష్టం! మా హజ్బండ్‌కి ఏం చెప్పాలి?”
ధీరజ్‌కి అర్థం కాకపోలేదు. మర్యాదగా ‘వెళ్ళిపోమ్మ’ని చెబుతోంది.
“ఓకె. నేనిక్కడ ఇమడలేను. రాయమంటే నా రాజీనామా రాసిస్తాను. నా మాట చాలునంటే ఇదే నా రాజీనామా అనుకో. థాంక్స్”
లేచి నిల్చున్నాడు.
“చాలా హెల్ప్ చేశావు. కానీ… చందూ”.
అలా పిలిచి చాలా రోజులైంది. ఎప్పుడో ఉస్మానియాలో చదువుకునేటప్పుడు నెక్లెస్ రోడ్డులో, జలవిహార్‌లో కూర్చున్నప్పుడు సంతోషంగా స్వీట్‌నథింగ్స్ చెప్పుకున్నప్పుడు పిలిచిన పేరు.
“చందూ. టెరిషరీ అయినా ప్రైమరీ సెంటర్ అయినా వైరల్ జ్వరం వైరలే కదా. ఏ జబ్బు అయినా దాని లక్షణాల బట్టి, డయాగ్నోసిస్‌ని బట్టి పరీక్షలు చికిత్స వుంటాయి. అంతే కాని ఎక్కువ ఖర్చు అనో, రోగికి తృప్తి కోసం అనో, ఇన్‌స్టాల్‌మెంటు కట్టాలనో పరీక్షలు చేయం. కనీసం అది నా నమ్మకం. దానికి వ్యతిరేకంగా నేను పని చేయలేను.”
“ధీరజ్ నీ పిచ్చి ఆదర్శాలకి నీ ఫ్యామిలీ దెబ్బతింటది. పైసలెట్లొస్తాయ్. నీ కూతురికి పెళ్ళెలా చేస్తావ్. మీ ఆవిడకి కనీసం మంచి చీరలైనా నగలైనా కొనగలవా. ఎట్లా చెప్పు ఎళ్ళిపోతానంటే? నీ తోటి స్నేహంతోనే కదా ఇంత జేసింది”.
సహజ భాషలో కోపంతో, బాధతో చందన మామూలుగా మాట్లాడేస్తోంది. జలపాతం హోరులో వుండే పురాతన నిర్వేదం. నిజాయితీ కూడా చెళ్ళున తగుల్తోంది.
బయటికి నడిచాడు. “ఈ నెల 30వ తారీఖుతో ‘క్విట్స్’ చందూ. మన దారులు వేరు అనుకో” ఆగి వెనక్కి తిరిగి అన్నాడు మళ్ళీ “మనసులు ఒకటే కాని…”
***
ఏప్రిల్ ముఫ్ఫైవ తారీఖు పదకొండు గంటల పదిహేను నిముషాలు. ఓపి గలగల లాడుతోంది. ఒక్కక్కరినే చూచి పంపుతున్నారు ధీరజ్, నీరజ.
“ఈ రోజుతో సరి. ధన్వంతరీ హాస్పిటల్ ఉద్యోగం ఆఖరు!” అనుకున్నాడు.
తర్వాత….?
ఈ ప్రశ్న ఎప్పుడూ జీవితంలో వస్తూనే వుంది. ఎంబీబీఎస్ అయినాకా, ఎండీ అయినాకా, జాబ్ రానప్పుడూ , గల్ఫ్ వెళ్లి… వచ్చేటప్పుడూ…
తర్వాత… తర్వాత ఏమిటి?
“మంచి క్లినిక్… హిమాయత్‌నగర్లోనో, నల్లకుంటలోనో ఓ షట్టర్ బాడుగకి తీసుకుని బోర్డు పెట్టడమే”.
“ఇలా ఎన్నాళ్లకి మీకు పైసలొస్తాయో! ఇల్లెప్పుడు కొంటాం. పిల్లని అమెరికా చదువుకు… పెళ్ళీ…” భార్య మూతి విరుపు గుర్తుకొస్తున్నాయి.
తర్వాత అన్నప్పుడల్లా అదే దృశ్యం.
‘Do your duty sincerely’. అలా చేస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయని గత కాలగర్భంలో గతించిన తన ప్రియమైన ప్రొఫెసర్ మూర్తిగారు ఎప్పుడూ అనేవారు.
డ్యూటీ సిన్సియర్‌గా చేస్తూనే ఉన్నాడు. ఎక్కడ నిలిచిపోయాడో అక్కడే వున్నాడు. పరిగెత్తతూ కుంటుతూ…
నిజంగా ఫలితాలొస్తాయా?
“సార్ ఎమర్జెన్సీ కేస్ ఒకటి అర్జెంటు”.
ధీరజ్ విసుగొచ్చింది. సాధారణంగా ఓపీ టైంలో తనని లోపలకి పిలవరు.
“ఎందుకు సి.ఎం.ఓ. లేడా? అయన్నే చూడమను. నేను బిజీ”.
“సారీ సార్. సి.ఎం.ఓ. భూషణం సార్ కేసు అర్థం కావడం లేదు. మిమ్మల్ని రమ్మన్నారు. వి.ఐ.పి పేషంటు. అమ్మ గారి భర్త. అర్జంట్ సార్. అందరూ అక్కడే వున్నారు”.
“ఓ…” లేచి గబగబా లిఫ్ట్ వైపు పరుగెత్తాడు.
***
స్థూలకాయం, నాలుగో ఐదో వెంట్రుకలు తప్ప తల మీద ఏమీ లేదు.
నగ్నంగా ఉన్న ఛాతీ మీద ఇ.సి.జి ఎలక్ట్రోడ్స్… అతను ఎగిరెగిరి పడుతున్నాడు. ముఖం మీద ఆక్సిజన్ మాస్క్. ఐవి నీడిల్స్ ద్వారా సైలైన్ వెళ్తోంది.
చూస్తూండగానే మళ్ళీ ఫిట్స్ రావడం, మెలికలు తిరగడం, నోరు వంకర బోయి నాలుక కొరుక్కోబోతున్నాడు.
“మౌత్ గ్యాగ్. లెఫ్ట్ లేటరల్ పొజిషన్. ఇంజెక్షన్ లోరాజపామ్…” వెళ్తునే అరిచాడు ధీరజ్.
డ్యూటీ డాక్టర్, సి.ఎండి, నర్సులు. చందన ఎర్రబడ్డ కళ్ళతో….
“ఫిట్స్ ఇది వరకే వున్నాయా”
“నో ధీరజ్. ఎప్పుడూ లేవు.”
“డయాబిటిస్”
“ఎస్. జానువియా, లాంటస్ తీసుకుంటారు. ఇంకా ఏటోర్వా, ఏస్పిరిన్…”
“ఇ.సి.జి”
డ్యూటీ డాక్డర్ ఇచ్చాడు. నార్మల్.
“బ్లడ్ సుగర్?”. మూడు వందల ముఫ్ఫై.
సోడియం
పోటాషియం
యూరియా
2డి ఇకో
సిటి స్కాన్…. అన్నీ నార్మల్
“హైపోగ్లైసీమియా అనుకున్నాం. 25% గ్లూకోజ్ ఇచ్చాం. తగ్గలేదు. షుగర్ అందుకే ఎక్కువ కనిపిస్తోంది. స్ట్రోక్ అనుకున్నాం. సి.టి. నార్మల్” చెప్పాడు సి.ఎం.ఓ.
మరి ఎందుకు ఫిట్స్. ఫిట్స్… బ్రెయిన్ స్ట్రోక్ లేదా ట్యూమర్ లేదు.
పేషంట్ ఇప్పుడు చందన భర్త. కానీ తన పేషంట్. ఒక డయగ్నోస్టిక్ మిస్టరీ అంతే. ఒక పరిష్కరించాల్సిన సమస్య, అంతే.
“ఫీవర్, మోషన్స్… నిన్న పార్టీలో ఏమన్నా ఆల్కహాల్ తీసుకున్నారా?”
చందన. అలోచించింది. “అవును. నిన్న కొద్దిగా తీసుకున్నారు. తర్వాత మోషన్స్. మెట్రోజిల్, లెవోఫ్లోక్ససిన్ ఇంజెక్షన్ నేనే చేశాను. సైలెన్ ఇంట్లోనే ఎక్కించేశా!”.
ఆధారం దొరికింది.
క్లూస్.
నవ్వాడు.
“చందూ, ఇవి డ్రగ్స్ వల్ల వచ్చిన సీజర్స్ (ఫిట్స్) క్వినోలిన్, మెట్రోజిల్ ఆల్కహాల్ తీసుకున్నాక ఇవ్వద్దు! ఫిట్స్ వస్తాయి. ఏం లేదు. తగ్గిపోతుంది. అవే తగ్గిపోతాయి”.
ఆమెకి ఒక్కసారి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. ఈ లోకంలోకి తిరిగి వచ్చి మళ్ళీ దృఢంగా నిలబడిన స్పృహ.
“సెల్ఫ్ లిమిటింగ్. అవే తగ్గుతాయి. నో బ్రెయిన్ స్ట్రోక్. నో హార్ట్ ఎటాక్. నథింగ్. హి ఈజ్ ఫైన్. క్పినోలిన్ ఇన్‌డ్యూస్డ్ సీజర్స్. లెవిపిల్ కూడా ఇవ్వండి! నో ప్రోబ్లం.”
ధీరజ్ పేషంట్‌ని చెకింగ్ కూడా చేయకుండా వెనుతిరిగాడు.
చందన ఏమీ అనలేదు.
“’భాషా’ లాంటి ధీరజ్ ఒక్కసారి చెబితే అంతే ఇక తిరుగులేదు. వందసార్లు చెప్పినట్లే” నవ్వుకుంది.
***
“నువ్వు వెళ్ళిపోతే నన్ను చంపుకు తిన్నంత ఒట్టు.”
“ఎలా చందూ… నాకిక్కడ కుదరదు అని తెల్సినాక!”
“నో… నో. నువ్వు నాకు, ఇక్కడ అవసరం. నువ్వు కావాలి!”
నవ్వింది ఈ సారి మనోహరంగా.
చాలా కాలం క్రితం వైజాగ్ బీచ్‌లో… నోవాటెల్ హోటల్ దగ్గర్నుంచి బీచ్‌లో ఇద్దరూ నడుస్తున్నప్పుడు నవ్విన నవ్వు.
“నేను నీకు సరిపోను చందనా. అంతరాలు వేరు. మెర్సిడీస్‌కీ మారుతీకి చాలా తేడా. నా దారిన నన్ను పోనీ. నువ్వు ఏంజెల్‌వి. మధురమైన స్మృతివి అంతే”.
“అబ్బ కవిత్వం. బోడి కవిత్వం. దేనికి పనికొస్తుంది” వెళ్ళిపోయింది.
చీకటి సమయంలో అలలు ఎత్తుగా వెలుగు చిమ్ముతూ ఎగిరిపడిన అఖరి రాత్రి.
ఓ తప్పుడు నిర్ణయం తీసుకున్న రాత్రి.
***
“నువ్వు ఇక్కడే ధన్వంతరీలోనే పని చేయి. నీ ఇష్టం వచ్చిన టైమింగ్‌లో రా. రెండు లక్షలు జీతం. కానీ ఎప్పుడూ డ్యూటీలో అదే ‘ఆన్ కాల్’ వుండాలి. అర్ధరాత్రి వస్తే ఐదువేలు. స్కై ఈజ్ ది లిమిట్” నవ్వింది.
కారిడార్ చివర ఒక స్పెషల్ కన్సల్టేషన్ గది వైపు నడిచారు.
డాక్టర్ ధీరజ్ ఎం.డి. డయాగ్నోస్టిక్ మెడిసన్ ఛీఫ్ అని బోర్డు.
గలగలా నవ్వుతోంది.
“ఈసారైనా మంచి నిర్ణయం తీసుకో. మంచి రోజులు వస్తాయి”.
వ్యాధి నిర్ణయాలు చేయగలడు గానీ జీవితంలో అన్ని తప్పుడు నిర్ణయాలే.
“తప్పదా!” అన్నాడు నవ్వుతూ.
“అంతే మరి! దటీజ్ మై ఆర్డర్”
కారిడార్‌లో చాలా మంది స్టూడెంట్స్, డాక్టర్స్, నర్స్‌లు పెద్దగా నవ్వుతూ కరతాళ ధ్వనులు చేస్తున్నారు.
స్ప్రింగ్ డోర్ తీసి లోపలకి అడుగుపెట్టాడు ధీరజ్.
ఎక్కడో అంతరాలలో మూర్తి గారి మాటలు వినిపిస్తున్నాయి.
అవును ఫలితాలు వస్తాయి.
నిర్ణయం సరైనదైతే.