తమసోమా జ్యోతిర్గమయ-1

0
3

[box type=’note’ fontsize=’16’] “తన జీవితం అంతా ఎవో మడతలు పెట్టేసినట్లయింది. ఎన్ని మడతలు విప్పగలదూ…! ప్రతీ మడత విప్పుకుంటూ పోతూంటే కనిపిస్తున్నది చీకటి…” ప్రమాదంలో గాయపడ్డ భర్త ఆపరేషన్ థియేటర్‌లో ఉండగా భార్య మనసులో చెలరేగిన అల్లకల్లోలం ఇది. గంటి భానుమతి గారి “తమసోమా జ్యోతిర్గమయ” ధారావాహికం మొదటి భాగం.  [/box]

[dropcap]సా[/dropcap]యంకాలం ఆరు దాటింది. కానీ అలా అనిపించడంలేదు. బయట ఆకాశంలో దట్టంగా కమ్ముకున్న నల్లటి మేఘాల మూలంగా అర్థరాత్రిలా ఉంది. అయితేనేం, పట్టపగలుని తలపించేలా వెలుగుతున్న లైట్లు. అంతా నిశ్శబ్దం. అప్పుడప్పుడు వినిపిస్తున్న హాస్పటల్ శబ్దాలు, ఆ నిశ్శబ్దానికి భంగం కలిగించడం లేదు. ఆ రోగుల  ప్రపంచంలోని  ఓ ఆపరేషన్ థియేటరు ముందు ఓ పది మంది ఉన్నారు. అంత మంది    ఉన్నా శ్మశాన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలోంచి యమధర్మరాజు మెత్తటి అడుగులు ఆగీ ఆగీ వినిపిస్తున్నాయి కొంతమందికి.

ఆ కొంత మందిలో రాధ లేదు. ఆమెకి ఎక్కడో, ఏదో ఓ మూల నమ్మకం కలుగుతోంది. మాధవ్ బతుకుతాడు అని తప్పకుండా బతుకుతాడు. ఎందుకంటే మాధవ్ జీవితాన్ని పూర్తిగా చూడలేదు. ఏదీ అనుభవించ లేదు. తమ కలలపంట  మరో నాలుగు నెలల్లో ఈ ప్రపంచంలోకి రాబోతున్నాడు. వాడిని చూడడం కోసం అయినా బతకాలి. బతుకుతాడు. నిన్నటి వరకూ గడిచిన జీవితం ఓ నీటి బుడగలాంటిది కాకూడదు. మామూలుగా అయిపోతాడు అని ఆమె నమ్మకం.

“మాధవ్‌కి ఏం కాదు. ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. చూస్తూండు, ఆ తలుపులు తెరుచు కుంటాయి. డాక్టర్లందరూ నవ్వుతూ బయటికి వచ్చి, థాంక్ గాడ్, గాడ్ ఈజ్ దేర్. ఆపరేషన్ సక్సెస్. య్యెస్, హీ ఈజ్ ఆల్ రైట్, అవుట్ ఆఫ్ డేంజర్…. అని అంటారు” అని అంది సౌమ్య రాధ మొహంలోకి చూస్తూ.

సౌమ్య రాధ స్నేహితురాలు.మాధవ్ గురించిన ఆలోచనలతో ,ఎన్నో మర్చిపోయిన రాధ ఆమె మాటలతో వాస్తవంలోకి వచ్చింది.

అలా జరిగితే ఎంత బావుంటుంది….! కానీ అలా జరుగుతుందా…….! అసలు ప్రమాదం జరిగింది ఆ రోజు ఉదయాన్నేనా! కానీ ఆమెకి అలా అనిపించడం లేదు.. ఎప్పుడో జరిగినట్లుగా అనిపిస్తోంది. అసలు నిజంగా జరిగిందా… లేకపోతే కలా… కలలోనా…! కల అయితే ఎంత బావుండేది…. కాని… ఇది కల కాదు, నిజం అని అక్కడున్న వాతావరణం, మాటలు మర్చిపోయినట్లుగా ఉన్న మనుషులు చెప్పకనే చెప్తున్నాయి. అయినా ఏదో కన్‌ఫ్యూజన్.

ఉదయం ఆరు గంటలకి, ఈ సాయంత్రం ఆరు గంటలకి ఎంత తేడా….! ఉదయం జరిగిన సంఘటన, అది ఓ జ్ఞాపకమా…!  కాదు. అది నిజం. ఆ నిజం ఎప్పుడో జరిగి పోయినదయితే… …ఇప్పుడు పైపొర  పక్కకి  తప్పుకుంటున్న పచ్చిపుండు లాంటి నిజం…. మంట పెట్టేస్తున్న నిజం… క్షణం క్షణం సలిపేస్తున్న నిజం. ఏమాత్రం భరించలేకపోతోంది, ఆ బాధని.

రాధ కళ్ళంబడి నీళ్ళు కారిపోతున్నాయి. ఏడవడానికి కారణం తెలియడం కూడా  విషాదమే. అంతవరకూ తన భుజం మీద ఉన్న చేతులు హటాత్తుగా మాయం అయినట్లుగా అనిపిస్తోంది. అంత వరకూ చేయి పట్టుకుని నడుస్తూ వచ్చిన మాధవ్ హటాత్తుగా చేతిని వదిలేసి ఆ మూసిన తలుపులు వెనకాల ఉన్నాడు. అన్నితానే అయిన మాధవ్, ప్రతీ సారీ తనకి తోడుగా ఉన్న మాధవ్, ఇప్పుడు ఒంటరిగా ఆపరేషన్ టేబులు మీద స్పృహ లేకుండా ఉన్నాడు.

గాజు తలుపులకి తలని ఆనించి, కళ్ళు మూసుకుంది. ఒక్కసారి చల్లటి తేమ గాలి, మొహాన్ని తాకింది. ఉలిక్కిపడింది. ఈదురుగాలికి తలుపు కొంచెంగా తెరుచుకుంది. కళ్ళు తెరిచి చూసింది బయటి ప్రపంచాన్ని. బయటి వాతావరణం కూడా తనలాగే ఉంది. ఈదురు గాలులతో కూడిన వర్షం జోరుగా కురుస్తోంది. చినుకుల బరువుకి, పువ్వులూ, రెమ్మలూ కిందకి వాలిపోతూ ఊగుతున్నాయి.. లైటు స్థంభాల కింద చిక్కుకుపోయిన వెలుగులో, వెండి తీగెల్లాగా జారుతూ మెరుస్తున్న వానని చూస్తోంది రాధ. మధ్య మధ్య కళ్ళు మూసుకుంటోంది. కళ్ళు తెరిచినప్పుడల్లా, రెప్పల కింద జీవితం మసక మసకగా కనిపిస్తోంది. గొంతులో ఏదో అడ్డుపడుతోంది. అది ఏఁవిటో ఆమెకి తెలుసు. అది పేరుకుపోయిన దుఃఖం. ఆ దుఃఖం కిందికి దిగిపోతోంది. తిన్నగా గుండెల్లోకి జారిపోతోంది. అందుకే గుండె బరువెక్కిపోతోంది. ఆ బరువుకి గుండె పగిలి ముక్కలై, బయటికి వచ్చేస్తుందేమో… తెలీకుండా రెండు చేతుల్నీ గుండెమీద గట్టిగా నొక్కి ఉంచింది. ఆ క్షణాన భోరున ఏడవాలని ఉంది. కాని ఏదో అడ్డొస్తోంది.

“ఛ… ఏడవకు…. అందరి ముందు కళ్ళ నీళ్లు పెట్టుకోకు. కన్నీళ్ళు చాలా విలువైనవి, దాన్ని ఎంతో జాగ్రత్తగా వాడాలి తెలుసా….” అని చెవి దగ్గర ఎవరో అంటునట్లుగా అనిపిస్తోంది. అది ఎవరి గొంతు అని ఆలోచించక్కర్లేదు. అది మాధవ్ గొంతు. ఆ మాటలు ఒకప్పడు తనతో అన్నవి.

ఏడవకు అంటే ఏడవకుండా ఎలా  ఉండగలదు…..! ఆగని దుఃఖాన్ని ఎంతసేపని గుండెల్లో నొక్కి ఉంచగలదు..! బయటికి వచ్చేస్తోంది. ..కళ్ళల్లోంచి.. ..నీళ్ళల్లాగా వచ్చేస్తోంది. ఈ క్షణాన మాధవ్ చూస్తే ఏం అంటాడూ…? ఆ రోజున ఏం అన్నాడో ఇప్పుడు కూడా అదే అంటాడు.

“ఛ.. ఏడవకు, అందరి ముందు ఏడిస్తే… ఎలా…! విలువైన దాన్ని అలా బయటికి చూపిస్తే ఎలా….”

వింతగా చూసింది, మాధవ్‌ని.

“అంత మాట ఎలా అనగలిగావు….? బయటికి చూపిస్తే ఎలా అని అంటావేంటీ? ఇది ఒకరికి చూపించాలని నేను ఏడవడం లేదు. అలా నేనుకోవడంలేదు. ఏడుపొచ్చింది అంతే ఏడ్చేసాను. అయినా మనం మనుషులం.  దేవుడు ఈ విశాల విశ్వంలో మనకి మాత్రమే మనసునిచ్చాడు, అందులో ఫీలింగ్స్ ఉంటాయి. నవ్వొచ్చినప్పుడు నవ్వేసినట్లుగానే,కోపం వచ్చినప్పుడు చూపించినట్లుగానే ఏడుపొస్తే ఏడ్చెయ్యాలి. అది మనకున్న స్వేచ్ఛ. అంతేకాని, ఎక్కడ… ఎవరున్నారు….. ఎవరైనా చూస్తున్నారా అని చూడను. అది తప్పని నేనుకోను..” అని అంది.

“తప్పని కాదు. కాని, మన సమాజం కొన్ని నేర్పించింది. చిన్నప్పటినుంచి గట్టిగా నవ్వకూడదని, పైకి గట్టిగా ఏడవకూడదని…. అవి మన సొంతం. మన సొంతమైనది పబ్లిక్ ప్రాపర్టీ కాదు. విషాదం కాని, కోపం కానీ బయటికి కనిపించనీయకూడదు. అవి తప్పు అవని, ఒప్పు అవనీ, అవి మనవి, మన అనుభవాల్లోని భాగాలు. వాటితో బయటి వాళ్ళకి పని లేదు. అవసరం లేదు. అవి ఉన్నన్ని రోజులు నువ్వు ఎలా ఎదుగుతావు. ఎదగలేవు. అందుకని వాటిని వదిలెయ్యి, దూరం పెట్టు, అప్పుడు నువ్వు మానసికంగా స్ట్రాంగ్ అవుతావు…”

ఈ మాటలే తనని మాధవ్‌కి దగ్గర చేసాయి. ప్రతీదీ పాజిటివ్‌గా మలిచేస్తాడు. ప్రతీది మనం ఎదగడానికి తోడ్పడుతాయని అంటాడు. మనం ప్రశాంతంగా ఉండాలంటే ఇదే మనకి మందు.

తను డిప్రెషన్‌లోకి వెళ్లిపోతూంటే మరో మనిషిగా కావడానికి ఎన్నో చెప్పేవాడు. మాధవ్ స్నేహంలో, తనని తాను మర్చిపోయింది. తను మరో తనుగా మారిపోయింది. తన జీవితానికి ఎన్నో రంగులు పులిమాడు. ప్రతీ దృశ్యం రంగులమయం చేసి, పాజిటివ్‌గా మలిచేవాడు

ఇదీ మాధవ్…. దిసీస్ మాధవ్. ఇది మాధవ్ మనసు. ఇది మాధవ్ యాటిట్యూడ్. ఆరోగ్యకరమైన యాటిట్యూడ్.. తనని మార్చేసాడు. కానీ ఈ రోజున ఆ యాటిట్యూడ్‌తో పాజిటివ్‌గా ఉండలేకపోతోంది. ఇది వరకు మాధవ్ నింపిన రంగులు అలుముకు పోయాయి.

ఇప్పుడు మాధవ్ చెప్పినట్లు చెయ్యాలా! అంటే తను మరో తనులా మారాలా!.. పైకి ఏడవకూడదు అన్నాడు, అలా చెయ్యకపోతే…! తను తనలోనే కుంచించుకు పోదా..! పైన ఏమీ ఎక్స్‌ప్రెషన్ ఉండకుండా లోలోపల డిప్రెస్ అయిపోయి పిచ్చిదయిపోతే…

తన జీవితం, నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నట్లుగా ఉంది. ఆమెకి భవిష్యత్తే అగమ్యంగా అనిపిస్తోంది. తన జీవితం అంతా ఎవో మడతలు పెట్టేసినట్లయింది. ఎన్ని మడతలు విప్పగలదూ…! ప్రతీ మడత విప్పుకుంటూ పోతూంటే కనిపిస్తున్నది చీకటి… కళ్ళ ముందు కొన్ని వేల అమావాస్యల చీకటి.

ఆమె పక్కన కొంతమంది, ఆమెకి ఎదురుగా కొంత మంది కుర్చీల్లో కూచున్నారు. కానీ ఆమె ఎవరినీ గమనించడంలేదు. కళ్ళుమూసుకుని దేవుడిని ప్రార్థిస్తోంది. ఆమే కాదు, అక్కడున్నఅందరూ అలాగే ఉన్నారు. అందుకే నిశ్శబ్ధం రాజ్యం ఏలుతోంది.

అక్కడున్న వాళ్ళ దృష్టి అంతా మూసిన ఆపరేషన్ థియేటరు తలుపుల వైపు ఉంది… ఆ తలుపులు తెరుచుకుని బయటికి వచ్చే డాక్టరు ఏం చెప్తాడో! ఏం వినాల్సి వస్తుందో…! ఆ తలుపుల పైన ఓ ఎర్రటి లైటు వెలుగుతోంది. ఆ లైటు ఓ రెండు గంటల నుంచి వెలుగుతోంది. అది ఇంకా ఎన్ని గంటలు వెలుగుతుందో తెలీదు.  ఆ సంగతి ఓ సారి తలుపులు తీసుకుని బయటికి వచ్చిన డాక్టరుని రాధ, అక్కడున్న వాళ్లందరూ అడిగారు.

“ఏమో చెప్పలేము, ఇది మేజర్ ఆపరేషను కదా… దీనికి, ఎంత టైము పడుతుందో చెప్పడం కష్టం. ఆరు గంటలు పట్టచ్చు, ఏడు గంటలు పట్టచ్చు. ఇంకా ఎక్కువ కూడా కావచ్చు” అని డాక్టరు లోపలికి వెళ్ళి తలుపులు మూసేసాడు.

మళ్ళీ అందరూ ఆ మూసిన తలుపులనే చూస్తుండిపోయారు. ఆ తలుపుల వెనక మాధవ్. జీవితానికి ఎన్నో ఆశలు కలిపించిన మాధవ్, జీవితం గురించి ఎన్నో ఊహించిన మాధవ్ అక్కడ మృత్యువుతో పోరాడుతున్నాడు. కాదు పెద్ద యుద్ధమే చేస్తున్నాడు. జీవితాన్ని పూర్తిగా చూడని, అనుభవించని మాధవ్, ఆ థియేటర్లో ఛావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడు

దీనికి ఎవరు కారణం? రోడ్ రూల్స్ పాటించని ఆ డ్రైవర్ కాదా…! సమయానికి సాయం చేయని పోలీసులు కాదా…! మెసేజ్ అందిన వెంటనే చేరుకోని అంబులెన్స్ కాదా…! సమయానికి వైద్య సాయం అందించని డాక్టర్లు కారా…! సాటి మనిషికి అందులో రోడ్డు ప్రమాదం జరిగిన మనిషికి సాయపడే వాళ్ళని భయపెట్టే చట్టాలది కాదా….! ఎదుటి వాడి ప్రాణం గాల్లో కలుస్తూంటే….. ఎవరికీ అక్కర్లేదు. ఆలోచిస్తూంటే ఎలాంటి మనుషులున్నారో…. అందరూ తలో రకంగా కారణమే….. అందుకే ఒంటరి పోరాటం చేస్తున్నాడు.

ఈ యుద్ధంలో గెలుస్తాడన్న నమ్మకం డాక్టరుకి కూడా లేదు. డాక్టరు అన్నది గుర్తుకు తెచ్చుకుంది……

“కష్టం అమ్మా… చెప్పలేం… మెడ పక్కనుండే నరాలు, రక్తనాళాలు, నొక్కుకు పోయాయి. తల లోపల హెమరేజ్ అయినట్లు అనిపిస్తోంది. ఎముకలు విరిగాయి. అయినా మీరు ధైర్యంగా ఉండండి. లోపల ఓ అర డజను మంది డాక్టర్లం ఉన్నాం. మేమంతా ఎన్నో హెడ్ ఇంజ్యూరీలు జరిగిన వాళ్ళకి, ముఖ్యంగా ఇలా రోడ్డు ప్రమాదాల్లో తలకి దెబ్బలు తగిలిన వాళ్ళకి ఆపరేషన్లు చేసాము. అన్నీ విజయవంతం అయ్యాయి. ఇది కూడా అలాగే అవుతుంది” అని ఆ డాక్టరు లోపలికి వెళ్ళి పోయారు.

లోపల మాధవ్ ఎలా ఉంటాడో ఊహించుకోవడం పెద్ద కష్టం కాదు. దెబ్బ తగిలింది తలకి కాబట్టి ముందు జుట్టు తీసెస్తారు. ఆనవాళ్ళు పెడతారు. కపాలాన్ని తీస్తారు. ఈ అరడజను మంది డాక్టర్లు వాళ్ళ తలల్ని అందులోకి దూరుస్తారు. ఏదో టైం బాంబుని డిఫ్యూజ్ చేస్తున్నట్లుగా, నెమ్మదిగా, అతి నాజూకుగా, కదిలిస్తూ… ఇంతింత దూది కుక్కి కుక్కి, రక్తస్రావాన్నిఅరికట్టడానికి ప్రయత్నిస్తారు. ఆ తరవాత ఓ రెండు గంటలయ్యాకా ఆపరేషన్ సక్సెస్ అంటూ నవ్వు మొహాలతో బయటికి వస్తారు.

కానీ అలా జరగుంతుదన్న నమ్మకం ఆ డాక్టర్లకే లేనట్లుంది. అందుకే మధ్యలో ఓ సారి వచ్చి అన్నారు.

“మా శక్తి కొద్దీ, మా ప్రయత్నం మేము చేస్తాం. ఆ పైన ఏదైనా అద్భుతం జరగాలి….”

ఇప్పుడు ఆ అద్భుతం జరగడం కోసమే దేవుడిని ప్రార్థిస్తోంది రాధ.

ఎందుకంటే ఇప్పుడు ఆమె జీవితాన్ని నడిపిస్తున్నది ఆ దేవుడు.

ఆమె పక్కన కూచున్న సౌమ్య, ఏం కాదన్నట్లుగా చేయి నొక్కి, భుజం పైన చిన్నగా నొక్కింది. ఆమె ఆ స్పర్శకి లోకంలోకి వచ్చింది. కాని కదల్లేదు.

“లే… రాధా… కొంచెం కాఫీ తాగి వద్దాం పద…….”.అంది సౌమ్య, రాధ భుజం మీద చెయ్యి వేసి తట్టింది.

ఆ మాటలతో అక్కడున్న అందరిలో కొంచెం చలనం వచ్చినట్లయింది. అందరూ ఒక్కసారి లేచారు. నీటి తెరల్లోంచి రాధ అందరిని ఓ సారి చూసింది. వీళ్ళందరూ ఎవరూ…? తమ మధ్య బంధుత్వం ఏం లేదు. స్నేహం మాత్రమే ఉంది. అందులో మానవత్వం ఉంది. అంతకు మించిన దగ్గరితనం ఉంది. తనవాళ్ళు రక్తసంబంధం ఉన్నవాళ్ళు ఎవరు తన పక్కన లేరు.  కాని వీళ్ళు ఉదయం యాక్సిడెంటు జరిగినప్పటి నుంచి తనతోనే ఉన్నారు.

“జీవితాన్ని మించిన మిస్టరీ మరోటి లేదు. ఎవరు ఎందుకు పరిచయం అవుతారో, ఎందుకు విడిపోతారో అర్థం కాదు. ఎంతో మంది తాత్వికులు దీని గురించి వివరించారు, కానీ ఎవరి వ్యాఖ్యానాలు వారివే. కానీ అందరూ ఇచ్చిన సారాంశం ఒకటే. ఎవరూ ఎవరికీ ఏమీ కారు, జీవితాంతం మనం గడిపేది మనతోనే. చివరికి మిగిలేది మనమే. ఒక్కొక్కసారి, మన కన్నీళ్ళని మనమే తుడుచుకోవాలి, ఓదార్పు కోసం ఎదుటి వారి భుజం కోసం వెతుక్కోవాలి. కానీ నీకు ఇంత మంది ఉన్నారు. మేమంతా ఉన్నాం.”

నిజమే, తన చుట్టూ ఓ పది మంది ఉన్నారు. ఉదయం నుంచి అన్నీ తామే అయి తిరుగుతూ ఉన్నారు.

జరిగినది అంతా కళ్ళముందు ఓ సినిమాలా కనిపిస్తోంది.

***

ఒక్కసారిగా పెద్ద శబ్దం….

గాజు ముక్కలు పెళ పెళ మన్న శబ్దం. చెల్లా చెదురుగా పడుతున్నశబ్దం.

ఆ శబ్దాలు విన్న ఆ వీధిలో ఉన్న వాళ్ళు ఉలిక్కిపడి, ఒక్కసారిగా తలలు తిప్పి ఆ వైపు చూసారు.

ఏం జరుగుతోందో తెలుసుకునే లోపుగానే ఆ తెల్ల కారు ఓ సారి ఓ పక్కకి అడ్డంగా జరిగి, రెండుసార్లు వంకర్లు తిరిగి, మూడోసారి పైకి లేచి, దభీల్మని కింద డివైడర్ మీద పడి, అక్కడున్న స్తంభాన్నికొట్టుకుని ఓసారి అటూ ఇటూ ఊగి, ఆగిపోయింది.

ఒక్కసారిగా….నిశ్శబ్ధం .భయంకరమైన నిశ్శబ్ధం.

పళ్ళు కొనడానికి కారు దిగిన రాధ, రోడ్డు వారగా ఉన్న సీతాఫలాలు కొనడానికి వెళ్తున్న రాధ… ఆ శబ్దం విన్న రాధ… ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ శబ్దం ఏఁవిటీ..! ఏదైనా బాంబు లాంటిది, పేలిందా ఏఁవిటీ….! ఈ శబ్దం మరీ ఇంత భయంకరంగా ఉందేంటీ….! ఎక్కడో ఇక్కడికి…. దగ్గర్లోంచే వచ్చింది…. ఎక్కడై ఉంటుందో..! ఏ వైపునుంచి వచ్చింది ఇంత శబ్దం…! అని అనుకుంటూనే వెనక్కి తిరిగింది. అంతే బొమ్మలా ఉండిపోయింది. చూడలేనిది చూస్తున్నట్లుగా నోరు తెరిచేసింది. ఒక్కసారిగా  రెండు చేతులని చెవులపై నుంచి, కళ్ళు పెద్దగా చేసింది.  ఎదురుగా కనపడుతున్నది చూసి మాట పడిపోయినట్లుగా ఉండిపోయింది.

ట్రాఫిక్ సిగ్నల్  దగ్గరున్న తెల్ల కారు, డివైడర్ ని కొట్టుకుని ఓ చక్రం పైన వంకరగా తిరిగి ఉంది. గాజు ముక్కలు రోడ్డు మీద పడి ఉన్నాయి. తలుపు, ముందు భాగం, బాగా సొట్టలు పోయి లోపలికి వెళ్ళిపోయింది. నమ్మలేనట్లుగా, మ్మలా ఉండిపోయింది. ఎందుకంటే ఆ కారు వాళ్ళదే. అందులో ఉన్నది ఆమె భర్త మాధవ్. ఒక్కసారి కళ్ళు పెద్దగా చేసి, నోరు తెరిచేసింది. తల తిరిగినట్లయింది. తనని తాను సంబాళించుకోడానికి సమయం పట్టింది.  వెంటనే, మతి లేనట్లుగా “మాధవ్” అంటూ అరుస్తూ ముందుకి పరిగెత్తింది. కళ్ళు తిరిగినట్లయింది. అంతే….. అలాగే అక్కడే…. ఒక్కసారిగా కూలబడి పోయింది. అది రోడ్డని కూడా అనుకోలేదు. అసలు ఆ స్పృహే లేదు.

ఆ రోజు ఆదివారం, పైగా పొద్దున్న సమయం. ఇంకా చీకటి పూర్తిగా పోనే లేదు. అటూ ఇటూ ఉన్న దుకాణాలు ఇంకా తెరవలేదు. పెద్దగా హడావిడి లేదు. అప్పుడప్పుడు, ఒకటీ రెండు ఆటోలూ, సైకిళ్ళు, బైకులు స్పీడుగా వెళ్తున్నాయి. కాని అవి  కూడా ఎక్కువ కాదు…  పళ్ళు తోముకుంటు కొంత మంది, అక్కడ ఉన్న ఓ బండి దగ్గర టీ తాగుతు కొంతమంది ఉన్నారు. అంతే.

శబ్దం వినగానే అందరు ఒక్కసారిగా భయపడ్డారు. ఒక్కసారిగా తలలు తిప్పి ఆవైపుగా చూసారు.వెంటనే పరిగెత్తుకుంటూ కొంతమంది వచ్చి చోద్యం నుంచున్నారు.వెళ్ళి పోతున్న వాహనాలు ఆగి ,ఓ సారి చూసి,వెళ్ళిపోతున్నాయి.

      పళ్ళు తోముకుంటున్న వాళ్ళు అలాగే తోముకుంటూ, చూసి పరిగెత్తారు… ఏదో తమాషా జరిగింది దాన్ని చూడడానికి వచ్చినట్లుగా నుంచుని ఉన్నారు, ప్రమాదం జరిగింది, సహాయం కావాలేమో దగ్గరికి వెళ్లి చూద్దాం అన్న ఆలోచన ఉన్నవాళ్ళు కారు దగ్గరికి వెళ్ళి అన్ని వైపుల నుంచి చూస్తున్నారు. కాని సాయానికి వచ్చినట్లుగా లేరు. యాక్సిడెంటు ఎలా అయిందో అని చూస్తున్న వాళ్ళకి, స్పీడుగా వెళ్ళిపోతున్న ఓ ఎర్ర కారు కనిపించింది.

“అదిగో ఆ వెళ్ళి పోతున్న ఆ కారే అయ్యుంటుంది. రాంగ్ సైడు నుంచి వచ్చి, యాక్సిడెంటు చేసి వెళ్ళిపోతోంది. ఎర్ర లైటు పడింది, ఆగాలి కదా, ఆగలేదు, అయినా వెళ్ళిపోయాడు. యాక్సిడెంటయిన సంగతి తెలీదా!” అని అన్నారెవరో

“ఎందుకు తెలీదు…? ఆ శబ్దం అందరికి వినిపించినట్లుగా వాడికి కూడా వినిపించి ఉంటుంది. ఆగితే అందరూ కొడతారేమో అన్న భయంతో వెళ్ళిపోయి ఉంటాడు.”

“అలాగే అనిపిస్తోంది.అదే .. కావచ్చు, నంబరు చూడండి, ఎవరేనా… అయినా పోలీసులు ఎక్కడున్నారో…..”

“ఏం మాట్లాడుతున్నారు…? ఇన్ని సినిమాలు చూసాం. పోలీసులు ఎప్పుడొస్తారో మనందరికి తెలుసు. అంతా అయ్యాకా వస్తారు కదా…. ఇప్పుడు కూడా అంతే….”

“నంబరు సరిగా కనిపించడడం లేదు. కాని కొన్ని నంబర్లు గుర్తున్నాయి. అయినా సీసీ కెమెరాలో ఎక్కీ ఉంటుంది.”

రాధకి ఏవో మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. ఏం జరుగుతోందో రాధకి అర్థం కావడానికి చాలా సమయం పట్టింది.

ఏదో గుర్తొచ్చినట్లు, వెంటనే లేచింది. “మాధవ్, మాధవ్” అంటూ పరిగెత్తింది… అది తన గొంతేనా! అనిపించింది. పీలగా ఉంది… వినపడిందో లేదో…!

కారు దగ్గరికి వెళ్ళి, బయటినుంచి చూసింది. లోపలికి బాగా చొచ్చుకు పోయిన తలుపు మాధవ్ శరీరాన్ని, మెడని, తలని నొక్కెస్తోంది. తల ఓ వైపుకి ఒరిగిపోయి ఉంది. తన మొహాన్ని కిటికీకి ఆనించి, లోపలికి చూసింది. లోపల గాజు ముక్కలు, సీటు మీదా కిందా, మాధవ్ పైనా పడీ ఉన్నాయి. కిటికీకి గాజు తలుపు విరిగి, కోణాలు కోణాలుగా ఉండిపోయాయి. ఆ విరిగిన కోణాల్లోంచి తలని కొంచెం వంచి చూసింది. గాజు ముక్కలు కోణాలు మొహాన్ని గుచ్చాయి. గుచ్చుకున్న చోట మండింది. లెక్కచేయకుండా తలని బాగా వొంచి చూసింది. మాధవ్ ముందుకి ఒరిగి పోయి ఉన్నాడు. రక్తం మెల్లిగా జుట్టు దగ్గర నుంచి బయటికి వస్తోంది… తన కుడి చేతితో విరిగిన కిటికీ లోంచి, మాధవ్‌ని కదిలించ బోయింది. కాని మాధవ్ అందలేదు. తలని ఇంకొంచెం లోపలికి పెట్టి, ఇంకొంచెం వంగి, చేతిని ఇంకొంచెం ముందుకి చాపి, మాధవ్‌ని కదపబోయింది. ఏ విధమైన స్పందన రాలేదు. తలుపు  తీయబోయింది. రాలేదు. ఏం చేయాలో తెలీక అటూ ఇటూ చూసింది. అందరూ ఆమెనే చూస్తున్నారు.

ఎందుకో ఒక్కసారి  భయం వేసింది. వెంటనే ఏదో ఆలోచన వచ్చినట్లు కిటికీ లోంచి తలని తీసింది. మళ్ళీ గాజు ముక్కలు గుచ్చుకున్నాయి. గబుక్కున తలని బయటికి తీయడం వల్ల, ఈ సారి ఇంకా బలంగా గీరుకున్నాయి, గుచ్చుకున్నాయి. పరుగు పరుగున, అంతకు ముందు తను కూచున్న వైపుకి వెళ్ళి, తలుపు తీసి లోపలికి కెళ్ళి కూచుని, మాధవ్‌ని కుదిపింది.ఆ చిన్న కదలికకే ఓ పక్కకి ఒరిగిపోయాడు.

అదేంటీ అలా పడిపోయాడు? ఒక్కసారి భయం వేసింది. ఆ పడిపోయిన విధానం చూసి ఆలోచనలు. మనసు పరి పరి విధాలుగా పోయింది. భయంతో ఏదీ ఊహించడానికే మనసు ఒప్పలేదు… వెంటనే ఏదో చెయ్యాలి, బయటికి తీయాలి. అందుకని, కారు దిగి మాధవ్ ఉన్న వైపు వెళ్ళి, తలుపు తీసింది. పూర్తిగా తెరుచుకోలేదు. డివైడరు అడ్డొస్తోంది. తలుపు బాగా సొట్ట పోయింది. అందుకని తీయడం ఇంకా కష్టం అయింది.

అక్కడున్న వాళ్ళ దగ్గరకొచ్చి,చూసింది… వాళ్ళకి, ఆమె చూపులు అర్థం అయ్యాయి. కొంతమంది కదిలారు. అతి ప్రయత్నం మీద, అటు లాగి, ఇటు లాగి ఎంతో చేస్తే, తలుపు కొంచెం తెరుచుకుంది. ఆ కొంచెం లోంచి తన శరీరాన్ని కొద్దిగా వంచి, మాధవ్ వైపుగా వంగింది. లోపలంతా గాజు ముక్కలు. తలుపు తీయడంలో వేసుకున్న కుర్తా భుజాల దగ్గర చిరిగి గీరుకుపోయింది. అయినా లోపలికి బాగా వొంగి కుదిపింది. చలనం లేదు. లోపలికి వెళ్ళడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఓ కాలు కారు అంచు మీద పెట్టి,తన ఎడమ చేతిని మాధవ్ మెడ కిందకి పెట్టడానికి ప్రయత్నించింది. కానీ ఫలించలేదు. ఇక లాభం లేదనుకుని, అతి కష్టం మీద కాలు తీసి, బయటికి రావడానికి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో ఆమె వేసుకున్న కుర్తా వీవు దగ్గర, నడుము దగ్గర, చిరిగి పోయింది. చాలా చోట్ల గీసుకు పోయి, రక్తం కారుతోంది. పగిలిన అద్దం ముక్కలు గుచ్చుకుంటున్నా, లెక్క చేయకుండా, బయటికి ఓ వెనక్కి అడుగు వేసింది. కానీ తన తలని లోపలికి బాగా వంచి అంతా ఓ సారి చూసింది. నిస్తేజంగా నిస్సహాయంగా భర్తని చూసింది. ఏడుపు, వణుకు. భయం భయంగా మాధవ్ ఛాతి వైపు చూసింది. కదులుతోంది. బతికి ఉన్నాడు. ఇంతవరకూ పరవాలేదు. ఆలస్యం అయిపోతే…. అయినా తన ప్రయత్నం చేస్తోంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here