తెలుగుకు కవిత్వం అవసరమేనా?

0
3

[dropcap]ఒ[/dropcap]క కళలో కళాకారులం ఔదాం అనుకునేవాళ్లు ఆ కళను అభ్యసిస్తారు. ఆ కళలోని ప్రాథమిక అంశాల్ని నేర్చుకుంటారు. గానకళను తీసుకుంటే తాళం, స్వరం‌ వీటిని‌ కొన్నాళ్లు సాధన‌ చేసి వాటికి‌ మాలిమి‌ అవుతారు.‌ అలా తొలిగా మాలిమి‌ అయ్యాకే మలిదశలోకి అడుగు పడుతుంది. అలాంటి అవసరం లేనివాళ్లు తెలుగు కవులు! కళను నేర్చుకున్నాకే కళాకారులు అవుతారు. ఏమీ నేర్చుకోకుండానే తెలుగులో కవులు, గొప్పకవులు అయిపోవచ్చు! కవి‌ తన మొదటి వాక్యంతోనే మేధావి అయిపోతాడు; ఆకాశం నుంచి ఊడిపడ్డవాడు అయిపోతాడు. తెలుగు కవి తానొక మామూలు‌ మనిషినని అనుకోడు.‌ విశ్వంలోనే తానొక విశిష్టమైన వ్యక్తిని అని, తానొక మేధావిని అని ఊహించుకోవడం కాదు నిర్ణయించుకుంటాడు. తెలుగు కవికి విషయాల్ని తెలుసుకోవడమూ, లోక జ్ఞానమూ అక్కర్లేదు. ఇవాళ తెలుగు కవికి తెలుగును కూడా చదువుకోవాల్సిన అవసరం లేదు!

ఏ కళాకారుడికైనా కళ పరమైన తెలివిడి ఉండాలి. తెలుగు కవికి తెలివిడి అక్కర్లేలేదు. తెలుగు కవికి తెలివిడిపై ఆలోచన లేదు. అందుకే హైకు, రుబాయీ, గజల్ వంటి ప్రక్రియలు తెలుగు కవికి పట్టుబడలేదు. తెలుగు కవి హైకును పట్టుకోవడం తెలియక చేజార్చుకుని ఛిద్రం చేసేశాడు. తెలుగు కవి రుబాయీని అందుకోలేకపోయాడు; రూబాయీ అనుకుని దేన్నో రాస్తున్నాడు. ప్రక్రియ పరంగా రుబాయీకి ఉండాల్సిన లక్షణాలు తెలియకపోవడమే కాదు ‘రుబాయీ’ అన్న ప్రక్రియ పేరు కూడా సరిగ్గా రాయడం తెలియని తెలుగు కవి  ‘రుబాయి’ అని ఏదో రాసేస్తే సారస్వత పరిషత్తులు పురస్కారాలు ఇచ్చేస్తాయి. గజల్ కాని అజల్ తెలుగులో గజల్‌గా చలామణిలో ఉంది. తెలుగులో ఎప్పుడో విదూషకత్వమైపోయిన గజల్ ఇప్పుడు వికారం కూడా ఐపోయింది. ఏది గజలో తెలియనివాడు, గజల్ ఆకృతిపై ప్రాథమికమైన ఎరుక కూడా లేనివాడు తెలుగులో సుప్రసిద్ధ గజల్ పరిశోధకుడు, గురువు, ఎన్‌సైక్లోపీడిఅ ఐపోయాడు. వాక్యాలు రాయడం కూడా చాతకానివాళ్లు గజల్ రాణులు, రాజులు. నేరగాళ్లు గజల్ అంటూ అరుస్తున్నారు. గజల్ ఇవాళ తెలుగు భాషనే ధ్వంసం చేసేసింది. ప్రపంచంలో ఒక విదేశీ కవితా ప్రక్రియవల్ల ఒక భాషే ధ్వంసం అవడం అన్నది గజల్‌వల్ల తెలుగు భాష విషయంలో జరిగింది. తెలుగు చావుకు వచ్చింది గజల్.

ఏది ప్రక్రియ అవుతుందో తెలుగు కవికి, విశ్లేషకుడికి తెలియదు. మరే భాషలోనూ లేని విధంగా తెలుగుకు ప్రక్రియల వెర్రెక్కింది. తెలుగులో కుల కవితా ప్రక్రియలు కూడా వచ్చేశాయి. ఏ అభివ్యక్తైనా వాక్యంగానే ఉంటుంది. అసలు వాక్యమే అవని మూడు, నాలుగు పొడిపదాలు నానో, తళుకు పేర్లతో కవితా ప్రక్రియలైపోయిన వికృతం తెలుగులో చోటు చేసుకుంది. నాని, రెక్క, మొగ్గ, రవ్వ వంటివి ప్రక్రియలు కానేకావు అన్న చదువు, తెలివి తెలుగు కవికి, విమర్శకుడికి లేవు. జంతికలు, చక్రకేళీలు, పూతరేకులు పేర్లతో చెత్తాచెదారాన్ని కూడా ప్రక్రియలు అని తెలుగులో అంటారు. “తెలుగులో ఉన్నన్ని ప్రక్రియలు మరే భాషలోనూ లేవు” అని మేధావులైన తెలుగు కవి, విమర్శకులు అంటూంటారు. తెలుగు కవులకులాగా ఇతర భాషల కవులకు మతి పగిలిపోలేదు కాబట్టి మరే భాషలోనూ తెలుగులో ఉన్నట్టుగా ప్రక్రియల వెర్రి లేదు.

తెలుగు కవిత్వాన్ని కమ్యూనిజమ్ చావుదెబ్బ కొట్టింది. కమ్యూనిజమ్ దెబ్బకు తెలుగు కవిత్వం చెల్లాచెదురు ఐపోయింది. కొన్ని దశాబ్దుల క్రితం తెలుగులో దిగంబర, విప్లవ కవితా ధోరణులు రావడం అటు తరువాతే ఏ భాషలోనూ లేని రీతిలో తెలుగులో కవిత్వం వికలం అవుతూండడం అర్థం చేసుకోవాల్సిన పరిణామం. మొదట్లో దిగంబర, విప్లవ కవితా ధోరణుల్ని సమర్ధించినవాళ్లు సైతం కొన్ని దశాబ్దుల తరువాత తెలుగు కవిత్వానికి అవి పెనుకీడు చేశాయని గ్రహించారు. పెద్దశాతం దిగంబర, విప్లవ కవులే తరువాతి రోజుల్లో తప్పు తెలుసుకుని తమ పంథాను మార్చేసుకున్నారు. కానీ అప్పటికే పరిస్థితి చెయ్యి దాటిపోయింది. దిగంబర, విప్లవ ధోరణుల కాలం నుంచీ తెలుగు కవిత్వం నుసి అవుతూండడం స్పష్టంగా తెలుస్తోంది.

తెలుగులో ఆరు దశాబ్దుల క్రితమే  పిహెచ్.డి. వ్యాసాలు అమ్మబడ్డాయి, కొనుక్కోబడ్డాయి. ఆ పిహెచ్.డి. వ్యాసాలతో పెద్ద స్థాయి అధ్యాపకులు, ప్రముఖ కవులు, విమర్శకులు ఐపోయినవాళ్లు ఉన్నారు. తెలుగులో కవిత్వం కుళ్లిపోవడానికి వాళ్లు ముఖ్యమైన కారణాలు. వాళ్లు తెలుగు భాషను కూడా నాశనం చేసేశారు. ఎం.ఎ., ఎం.ఫిల్., పిహెచ్.డి.ల వాళ్లు, అధ్యాపకులు, కవులు, విమర్శకులు, పరిశోధకులు మూకుమ్మడిగా తెలుగు కవిత్వంపై దండయాత్ర చేశారు, చేస్తున్నారు; తెలుగు కవిత్వాన్ని నాశనం చేశారు, చేస్తున్నారు.

చీటి పాటలు పాడుకుని ఆ డబ్బుతో విదేశాలకు పారిపోయినవాళ్లు, అనైతికంగా మరొకరి భార్యను లేవదీసుకునిపోయినవాళ్లు, పోలీస్ ఉన్నతాధికారుల కాళ్లుపట్టుకుని శిక్షలు తప్పించుకున్నవాళ్లు, కావాల్సిన వాటిని సప్లై చేసేవాళ్లు, ఎవరి చేతో రాయించుకుని తమ పేర్లు వేసుకునేవాళ్లు, గోడ మీద పిల్లులు, కోర్ట్‌ల ద్వారా చట్టపరంగా నిరాకరించబడ్డవాళ్లు, తప్పుడు పనులు చేసి రాత్రికి రాత్రి ఊరు వదిలి పారిపోయినవాళ్లు, పురస్కారాలు ఇప్పించే బ్రోకర్లు కవులుగా, ప్రముఖ కవులుగా తెలుగులో తచ్చాడుతున్నారు. తెలుగు కవయిత్రులు రాసే అశ్లీలానికి సాటి, పోటీ ఏ ఇతర భాషలోనూ ఉండవు. చదువు, తెలివిడి,‌ ప్రతిభ, విజ్ఞత, నీతి, నిజాయితి, సభ్యత, వాస్తవాలు వీటితో పని లేనివాళ్లు తెలుగు కవులు, విమర్శకులు. అక్షరానికీ మాత్రకూ తేడా తెలియని విద్వత్తుతో దేన్ని పడితే దాన్ని కవిత్వం అని అంటూ, కవితా ప్రక్రియ అని అంటూ, కవితా విశ్లేషణ అంటూ ఊసుపోక కోసం ఊరికే ఊగిపోతున్నారు తెలుగు విశ్లేషకులు. ఏ కళకైనా కళా సంస్కారం ఉంటుంది. అది తెలుగు కవిత్వంలో లేకుండాపోయింది.

“ఈ దశాబ్దపు ఉత్తమ కవి ఇతడే”, “విశిష్టమైన కవిత్వం అంటే ఇదే” వంటి అజ్ఞానం మాటలు, అనర్థం మాటలు తెలుగులో వినిపిస్తూంటాయి. తాగుబోతుల పేలాపనలకు తెలుగు కవిత్వంలో పెద్దపీట వేశారు. ఆ పేలాపనలు విశ్లేషణలు, విమర్శలు, ముందుమాటలు అయ్యాయి. డబ్బు కోసం, మందు కోసం, ఇతర లాభాల కోసం ముందుమాటలు రాసిన ప్రముఖ కవులున్నారు.

కవులు, విమర్శకులవల్ల కవిత్వం ప్రజలకు దూరమైపోయింది. కొన్ని దశాబ్దులుగా తెలుగులో కవులు కవిత్వాన్ని కాటేస్తున్నారు; విమర్శకులు విషం విశిష్టమైందని ప్రచారం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో తెలుగు కవులు, విశ్లేషకులు మానసిక రోగులేమో అని భయం వేస్తూ ఉంటుంది.

కృతకత్వంవల్ల, పేలిపోయిన భావాలవల్ల, వక్రతవల్ల, ముక్కలైపోయిన శైలివల్ల, విశ్లేషణల శ్లేష్మంవల్ల, చదువు, ప్రతిభ లేని కవులు, విశ్లేషకులవల్ల, అసహ్య, అపాయకర సంగమాలవల్ల, అధ్వాన్న సమ్మేళనాలవల్ల, అనైతికతవల్ల తెలుగు కవిత్వానికి హాని జరుగుతూండడం కాదు పెనుమోతాదులో హననమే జరుగుతోంది. కవులు, విమర్శకులు, పరిశోధకులు అన్న పలకల్ని మెడల్లో వేసుకుని ఉన్న తెలుగు వృద్ధుల్ని చూసి సభ్య సమాజం చాలకాలం క్రితమే తల తిప్పేసుకుంది. తెలుగు కవిత్వాన్ని ముసలి ముప్పు కమ్మేసింది.

“మేం ముస్లీం వాదులం, మేం దళిత వాదులం, మేం బహుజన వాదులం,‌ మేం క్రైస్తవ వాదులం” అని చెప్పుకునే ఇతర కళాకారులు ఉండరు. కానీ తెలుగు కవులు చాతకానితనంతో కవిత్వానికి వాదాల చెద పట్టించారు. వాదాల చెద పట్టలేదు కాబట్టే ఇతర కళల్లో మేలిమి, జనరంజకత్వం పుష్కలంగా ఉన్నాయి, ఉంటాయి. కులోన్మాదులు, మతోన్మాదులు, వాదోన్మాదులు, సమాజానికి, ప్రజలకు పొసగని విద్వేషవాదులు, సమాజంలోని పెద్దశాతం ప్రజలకు వ్యతిరేకులు తెలుగులో కవులు అయ్యారు. తెలుగు కవులు మానసిక బానిసలై విదేశీ మతాల్ని, విదేశీ విధ్వంసక భావజాలాల్ని నెత్తిమీద పెట్టుకుని మోస్తున్నారు. ప్రజా సంస్కృతికి ప్రజాభీష్టానికి విరుద్ధంగా, అన్ని రకాలుగానూ పెద్దశాతం ప్రజలకు విరుద్ధంగా కవిత్వం పేరుతో కుట్ర జరుగుతోంది. కవిత్వం పేరుతో జన జీవనంపై, సమాజంపై దాడి జరుగుతోంది. జాతి వ్యతిరేకత, జాతీయతా వ్యతిరేకత, దేశ వ్యతిరేకత, ప్రజాస్వామ్య వ్యతిరేకత, ప్రజా ప్రభుత్వ వ్యతిరేకతలతో తెలుగు కవిత్వం ప్రమాదకరంగా ఉంది.

పురస్కారాలు తెలుగు కవిత్వానికి ఔతున్న తీవ్రమైన గాయాలు. హాస్యాస్పదంగా ఎవరుపడితే వాళ్లు జాతీయ పురస్కారాలు ఇచ్చేస్తూంటారు. వందో, రెండు వందలో ప్రతులు అచ్చయ్యే ఒక పత్రిక జాతీయ పురస్కారాలు ఇచ్చేస్తుంది. ఏదో బృందం జాతీయ పురస్కారాలు ఇచ్చేస్తుంది. స్థితి, గతి, మతి లేని కొందరు అటువంటి పురస్కారాల కోసమూ వెంపర్లాడుతూండడం దయనీయం. అమ్ముడుపోయిన నిర్ణేతలవల్ల, పైరవీలవల్ల అకాదెమీల పురస్కారాలు విలువ లేనివైపోయాయి; అవి తెలుగుకు జరుగుతున్న అవమానాలు ఔతున్నాయి. కావాల్సినవాళ్లు అడుక్కుంటే నిర్ణేతలు ఏ లబ్దో పొందితే ఏ పురస్కారమైనా వచ్చేస్తుంది. పురస్కారాల్ని ఇప్పించేందుకు దళారులు ఉన్నారు. పురస్కారాలు తెలుగు కవిత్వాన్ని తీవ్రంగా గాయపరిచాయి. వాట్స్ఆప్ సమూహాలు కూడా తెగబడి పెద్ద పెద్ద బిరుదులు ఇచ్చేస్తూంటాయి.

కొన్ని వేల రూపాయలతో తెలుగు కవులు రత్నలు, శ్రేష్ఠలు, విభూషణులు, శిరోమణులు, రాజులు, చక్రవర్తులు అయిపోతారు. డబ్బుతో తెలుగు కవులకు ఎలాంటి బిరుదులైనా వచ్చేస్తాయి. తెలుగు కవులకు ఉన్న బిరుదుల దురదకు వైద్యం లేదు; రాదు. అడిగిన డబ్బు ఎవరు ఇస్తే వాళ్ల ముఖపత్ర కథనాలు, ఇంటర్వూలు వేస్తూ పొట్టపోసుకుంటున్న హీనస్థాయి సంపాదకులు కవిత్వం కోసం పత్రికలు నడుపుతున్నారు.

కవిత్వం వికారమైందని, విదూషకత్వమని, కవులు, విమర్శకులు వికృత స్వభావులని, అసభ్యకరమైవాళ్లని, ప్రజలు‌ అర్థం చేసుకున్నారు. కవులు, విమర్శకులవల్ల కవిత్వం అంటే ప్రజలకు జుగుప్స కలిగింది. గత యాబైయేళ్ల కాలంలో మరే కళా రూపమూ దెబ్బ తిననంతగా తెలుగు కవిత్వం దెబ్బ తింది. మరోవైపు గానకళ ప్రజలకు ఎంతగానో చేరువైంది. మరికొన్ని కళా రూపాలూ ప్రజలకు బాగా దగ్గరయ్యాయి. ఒక మిమిక్రీ కళకారుడికి ఉన్న మన్నన ఇవాళ తెలుగులో కవికి లేదు. ప్రజలు తమ మానసిక సంక్షేమం కోసం, ఆనందం కోసం ఇతర కళలవైపుకు వెళ్లిపోయారు. ప్రజలు కవిత్వం నుంచి తమను తాము‌ రక్షించుకుంటున్నారు.

కల్మషానికి కవిత్వానికి, రసానికి నసకు, కక్కడానికి కనడానికి, చెయ్యడానికి చీల్చడానికి తేడా ఉంటుందనేది తెలుగు కవికి, విమర్శకుడికి కొన్ని దశాబ్దుల క్రితమే తెలియకుండాపోయింది. కాల్చేసేది‌, కూల్చేసేది కవిత కాదు అన్న తెలివిడి కవికి లేకుండాపోయింది. కడుపులో అరగందేదో

కవిత అంటూ కవి చేస్తున్న‌ వాంతిలో బయటకు వస్తోంది, అందువల్ల ప్రజలకు వెలపరం కలుగుతోంది. భ్రష్టత్వం కాదు ఔన్నత్యం కావాలి అని, వక్రత్వం కాదు శ్రేష్ఠత్వం కావాలి అని తెలుగు కవి తెలుసుకోవడం లేదు. కవికి ఎగ్గు లేకపోవడంవల్ల కవిత్వానికి నిగ్గు లేకుండా పోయింది; కవి చాతకానితనంవల్ల కవిత్వం చవి చచ్చిపోయింది. కవిత్వం నుంచి ప్రజ పారిపోయింది; ప్రజ నుంచి కవిత్వం జారిపోయింది.

ఇవాళ తెలుగు కవిత్వం ఉన్న పరిస్థితిలో అహంకారం, చెడ్డతనం, భ్రష్టత్వం, ఆత్మవంచన, తాగుబోతుల పేలాపన, చవకబారుతనం వీటిని దాటుకుని “తెలుగుకు కవిత్వం అవసరమేనా?” అన్న అత్యవసరమైన ప్రశ్న రావాల్సి ఉంది.

తెలుగుకు కవిత్వం అవసరమేనా? అన్న ప్రశ్నా, ఆ ప్రశ్నకు జవాబుదారీతనంతో జవాబూ అనివార్యంగా కావాల్సి ఉంది. తెలుగులో చదువు, తెలివిడి, లోకజ్ఞానం, ప్రతిభ, విజ్ఞత, నీతి, నిజాయితి, వ్యక్తిత్వం లేని కవులు, విమర్శకులు లేకుండాపోతే తెలుగు ఒక భాషగా ఐనా నిలబడి ఉంటుందేమో? తెలుగుకు పరువు, మర్యాదలైనా దక్కుతాయేమో? భాష పరంగా అనైతిక, ఆసాంఘీక కార్యకలాపాలు ఆగిపోతాయేమో? మతం పరంగా, కులం పరంగా అదనపు కీడు జరగకుండా ఉంటుందేమో? తెలుగులో కవిత్వం పేరుతో ఉన్న కల్మషం, దోషం, నీచత్వం, వైపరీత్యం, విచ్యుతి లేకుండాపోతే సమాజానికి కొంత మేరకు మేలు జరుగుతుందేమో??

[Disclaimer:
The view and opinions expressed by the author are of his own and Sanchika does not subscribe to nor support them. Sanchika can in no way be held responsible for author’s opinions and views.
Sanchika Team]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here