[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
ఏ శ్వాసలో చేరితే..
~
చిత్రం: నేనున్నాను
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం సిరివెన్నెల
గానం: చిత్ర
~
పాట సాహిత్యం
పల్లవి :
వేణుమాధవా.. వేణుమాధవా
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో (2)
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్ర మౌతున్నదో
ఆ శ్వాసలో నే లీనమై, ఆ మోవిపై నేమంత్రమై నిను చేరనీ మాధవా ॥ ఏ శ్వాసలో ॥
చరణం :
మునులకు తెలియని జపములు జరిపినదా మురళీసఖి వెనుకటి బతుకున చేసిన పుణ్యమిదా తనువును నిలువున తొలచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా
వాళ్లకు కనువిచ్చే
కృష్ణా నిన్ను చేరిందీ.. అష్టాక్షరిగ మారింది ఎలా యింత పెన్నిధి వెదురు తాను పొందింది వేణు మాధవా నీ సన్నిధీ ॥ ఏ శ్వాసలో ॥
చరణం:
చల్లని నీ చిరునవ్వులు కనపడక -కనుపాపకీ నలువైపుల రాతిరి ఎదురవదా?
అల్లన నీ అడుగుల సడి వినపడక – హృదయానికీ అలజడితో అణువణువు తడబడదా?
నువ్వే నడుపు పాదమిదీ, నువ్వే మీటు నాదమిదీ నివాళిగా నామది నివేదించు నిమిషమిదీ.. వేణుమాధవా నీ సన్నిధీ..
సాకీ :
రాధికా హృదయ రాగాంజలీ, నీ పదముల వ్రాలు కుసుమాంజలి, ఈ గీతాంజలి!
♠
“మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే
ఎంతహాయి యీ రేయి నిండెనో
ఎన్నినాళ్లకీ బతుకు పండెనో..”
అన్న కృష్ణశాస్త్రి గీతంలా.. భావాల వెన్నెల్లో ఊయలలూగించేది, మనసులో మల్లెలు పూయించేది, భావకవిత్వం.
భావకవిత్వం అనే పదాన్ని మొదట గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఉపయోగించినట్లు తెలుస్తుంది. 1920లలో రాయప్రోలు రచనలతో తెలుగు కవిత్వంలో భావ కవిత్వం వెలువడింది. ఈ కాలంలో జనించిన కవిత్వంలో కేవలం వస్తువుల భౌతిక స్వభావం కంటే భావోద్వేగానికి, ఆధ్యాత్మిక సౌందర్యానికి ప్రాధాన్యత మారడం కనిపిస్తుంది. శృంగార ప్రేమ, భక్తి ఇతివృత్తాలు, ప్రకృతి కవిత్వం మరియు దేశభక్తి వంటి భావ కవితల ద్వారా అనేక ఇతివృత్తాలు భావకవిత్వంలో భాగాలయ్యాయి. తన కవిత స్వేచ్ఛా ప్రీతితో ఉయ్యాలలూగించడమే కాకుండా, విరహాన్ని, విషాదాన్ని, ప్రకృతిని తిలకించగానే కలిగే భావావేశాన్ని, ఆవేదనను, ఆర్తిని, ఉరకలు వేసే ఉత్సాహాన్ని సమపాళ్ళలో నింపుకొని కవితాగానం చేసిన భావకవులలో వీరు అగ్రగణ్యులు.
భావ కవిత్వంలో ఊహాత్మక ప్రియురాలిని తరచుగా వర్ణిస్తారు. స్త్రీని విశ్వ ప్రేమకు చిహ్నంగా, స్నేహితురాలిగా, తత్వవేత్తగా ఉన్నతీకరించారు. దైవత్వాన్ని ఆపాదించారు.
అయితే ఈ శైలి భావకవిత యుగానికి ముందు నుండే మనకు సుపరిచితం. మీరాబాయి, సక్కుబాయి వంటి మహాభక్తురాళ్ళు, భర్తలోనే కృష్ణ పరమాత్మను దర్శించి, కృష్ణుడికి తాము ప్రేయసిగా, ఊహాత్మక గానాలు చేశారు. నామదేవుడు, చైతన్యప్రభు, జయదేవుడు, అన్నమయ్య, రామదాసు వంటి భక్తాగ్రేసరులు, భగవంతుని పురుషునిగా, తమను తాము ప్రేయసిగా భావించి ఉన్నతమైన, భావోద్వేగపూరితమైన, భక్తి శృంగార గీతాలను వెలువరించారు. సుందర భావాలను పదవిన్యాసంతో కూర్చడం, తీర్చిదిద్దడం, గీతాలాపన చేయడం పద కవితగా రూపొందింది.
ఆత్మాశ్రయత్వం/అంతర్ముఖత్వం, ప్రకృతి ప్రీతి, స్వేచ్ఛా ప్రియత్వం, ప్రణయ తత్వం, మానవతా వాదం; భావకవిత్వం లక్షణాలుగా వర్గీకరించుకోవచ్చు. భావకవిత్వానికి సాహిత్యంలో తొలి బీజాలు నాటిన వారు రాయప్రోలు, అబ్బూరి, కాగా దీనికి 1920లో అఖిలాంధ్ర ప్రాచుర్యం కల్పించిన వారు ‘ఆంధ్రా షెల్లీ’గా పిలవబడే దేవులపల్లి కృష్ణశాస్త్రి.
ఇంగ్లీషులో Romantic Poetry గా పిలువబడే ఈ కవితా శైలితో “a new heaven is begun” అని William Blake నిర్వచిస్తే, ఒక తరం తర్వాత Percy Bysshe Shelley దాన్ని “The world’s great age begins anew” అని నిర్ధారించాడు. Wordsworth ఇంకా Hunt ల గురించి ప్రస్తావిస్తూ “These, these will give the world another heart, / And other pulses,” అన్నాడు John Keats.
సాహిత్య రంగంతో పాటు, సినీ సాహిత్యంలో కూడా భావ కవిత్వం ఒక ఉప్పెనలా చొచ్చుకొని వచ్చి, సరికొత్త భావాల వాగులను, వంకలను తనివితీరా పారించింది. సినిమాకి ప్రధానంగా కావల్సింది వినోదమే. సినిమా పాటకి ప్రధానంగా కావల్సింది సంగీతమే. తెలుగు సినీరంగంలో గొప్ప గొప్ప గీత రచయితలు, కవులు, భావకవులు ఎంతోమంది ఉన్నారు, ఎన్నో అద్భుతమైన గీతాలు (tune to lyrics), పాటలు (lyrics to tune) రాశారు. అది చాలా గొప్ప విద్య. ఎంతో ప్రతిభ, కృషి కావాలి. వారిలో కొందరు సినిమాయేతర అద్భుతమైన భావకవిత్వం రాసినవారు ఉన్నారు. ఉదాహరణకి, దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు అద్భుతమైన భావకవి (romantic poet) మాత్రమే కాక, సినిమా పాటలు కూడా రాశారు.
‘ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై
నునులేత రెమ్మనై, ఈ యడవి దాగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా?’ అని ప్రశ్నించుకుంటూ..,
‘మావి చిగురు తినగానే కోయిల పలికేనా? కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా?’ అని ప్రశ్నిస్తూ, మధురమైన, లోతైన భావ పరిమళాలను వెదజల్లారు.
అదేవిధంగా సిరివెన్నెల పాటల్లో, ప్రకృతి ప్రియత్వం, అంతర్ముఖత్వం, స్వేచ్ఛా ప్రియత్వం ఉన్నతీకరించిన స్త్రీ వర్ణన, మానవత్వం (మనిషి తనం), సామాజిక స్పృహతో కూడిన భావోద్వేగ భరితమైన ఎన్నో పాటలు మనకు కనిపిస్తాయి. వాటిని వరుస వెంబడి మనం విశ్లేషించుకుందాం. సిరివెన్నెల తరంగాలు అనే పుస్తకంలో ఇలాంటి పాటలను భావ తరంగం శీర్షికన సిరివెన్నెల అమర్చారు. ఆ సందర్భంగా ఆయన ఇలా వివరించారు.
‘నా ప్రతిభ సంగతి ఎలా వున్నా, అదృష్టమూ, దైవానుగ్రహమూ నాకు ఎక్కువగా అనుకూలించడం వల్ల, తెలుగు సినిమారంగం చాలా సందర్భాల్లో నాపట్ల ఉదారంగా వ్యవహరించి తన నిబంధనలు సడలించి ఈ “భావతరంగాల” ద్వారా నా ‘సొంత గొంతుక’ వినిపించగలిగేలా “స్వీయ భావావిష్కరణ” చేసే అవకాశాలు అందించింది.’
రొటీన్‌గా రాసే నేపథ్య గీతాలకి, సిచుయేషన్ సాంగ్స్‌కి, ఆయా పాత్రధారుల భావాల్లోకి దూరి, వారి వేషాలు వేసుకుని పాటలు రాయాల్సి ఉంటుంది. ‘అలా కాకుండా విభిన్నమైన ఇతివృత్తాలకు (సిరివెన్నెల, స్వాతికిరణం లాంటి చిత్రాలకు) రాసే పాటలలో, భాష, భావం, శిల్పం ఇలాంటి అంశాల్లో కొంచెం ఎక్కువ లిబర్టీ తీసుకోవచ్చు, ఉన్నతంగా వ్యక్తీకరించవచ్చు’, అంటారు సిరివెన్నెల.
ఈ భావతరంగాల్లో ఆయా సందర్భాలను తన వైపు తెచ్చుకుని తాను తానుగా ఎలా స్పందిస్తారో అలా రాస్తానని చెప్పారు. మిగతా పాటల్లో సినీ కవి ఎక్కువగా కనిపిస్తాడనీ, ఈ భావతరంగాల్లో కవి పోలికలు కనిపిస్తాయనీ, ఈ రెండు రకాల పాటల మధ్య మౌలికమైన వ్యత్యాసం ఇదేనని ఆయన చెప్పారు. సిరివెన్నెలకు ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డులను సాధించిన గీతాలు ఎక్కువ శాతం ఈ (భావ కవిత్వం) భావతరంగాలలోనివేనట!
ఉదాహరణకు ఈ పాటను గమనిస్తే, ఉన్నతమైన భావ కవిత్వం, శబ్దం, పదం, లయ, దానికి తగిన రసానుభూతి, మనకు కనిపిస్తాయి.
సౌందర్య లహరి సౌందర్య లహరి సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి
శృంగార నగరి స్వర్ణ మంజరి రావే రసమాధురి..
వన్నె చిన్నెల చిన్నారి నీ జంట కోరి ఎన్ని జన్మలు ఎత్తలే ఈ బ్రహ్మచారి
కల నుంచి ఇల చేరి కనిపించు ఓసారి..
…………
కలగంటి తెలుగింటి కలకంఠిని, కొలువుంటె చాలంట నాకంట సుకుమారి (పెళ్ళిసందడి)
~
అటువంటి మరో భావతరంగంలో, ఎంతో లోతైన భావోద్వేగం విరహపు జాడ ఎరుగని శతజన్మాల బంధం.. లాంటి బలమైన పదబంధాలు మనకు కనిపిస్తాయి.
తెలుసా.. మనసా, ఇది ఏనాటి అనుబంధమో..
తెలుసా.. మనసా, ఇది ఏ జన్మ సంబంధమో..
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో, శత జన్మాల బంధాల బంగారు క్షణమిది,
తెలుసా.. మనసా..” (క్రిమినల్):
~
శ్రీకృష్ణుడి పైన, కృష్ణ తత్వం పైన సిరివెన్నెల రాసిన కొన్ని పాటలను గమనిస్తే, ఆయన భావాల్లోని శ్రీకృష్ణుడు మనకు ఓ దృశ్యకావ్యంలా దర్శనమిస్తాడు. వీటి తరువాత మనం విశ్లేషించుకుంటున్న మరో కృష్ణుడి పాటని తనివితీరా ఆస్వాదిద్దాం.
ఆపద్భాందవుడు (1992)లో శ్రీ కృష్ణలీలలపై జానపద రీతిలో రాసిన పాటను చూద్దాం-
అతడు: ఔరా అమ్మక చెల్లా, ఆలకించి నమ్మడమెల్లా అంత వింతగాథల్లో ఆనందలాలా
కోరస్:
అమ్మలాల! పైడి కొమ్మలాల! ఏడి? ఏవయాడె? జాడ లేదియాల కోటి తందనాల – ఆనందలాల గోవులాల, పిల్ల గోవుల్లాల, గొల్ల భామలాల ఏడ నుందియ్యాల నాటి నందనాల-ఆనందలీల.. ॥అమ్మలాల॥
చరణం:
అతడు: ఔరా అమ్మక చెల్లా, ఆలకించి నమ్మడమెల్లా
అంత వింతగాథల్లో ఆనందలాలా
ఆమె: బాపురే బ్రహ్మకు చెల్లా – వైనవంత వల్లించ వల్లా? రేపల్లె వాడల్లో – ఆనందలీల!
~
సిరివెన్నెల చిత్రంలో ‘చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగుపూలు తేవే..’ అనే పాటలో కూడా మనకు బృందావనం, మురళీ రవం, రాధా మాధవుల రాసలీలలు దర్శనమిస్తాయి.
మునిజనమానస మోహిని, యోగిని బృందావనం
మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
రాధామాధవ గాధల రంజిల్లు బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం
బృందావనం, బృందావనం, బృందావనం..
~
ముకుంద చిత్రంలో కూడా మనకు కృష్ణుడు- గోపికకి సంబంధించిన ఇతివృత్తంలో ఒక పాట కనిపిస్తుంది.
గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదరా..
గోపికమ్మ నిను వీడనీమ్మా మంచు తెరా…
విరిసిన పూమాలగా, వెన్నుని ఎదవాలగా, తలపుని లేపాలిగా బాలా
పరదాలే తీయకా, పరుపే దిగనీయకా, పవళింపా ఇంతగా మేరా..
~
ఇప్పుడు మనం విశ్లేషించుకుంటున్న పాట, నేనున్నాను చిత్రంలో తేనె ధారల చిత్ర ఆలపించిన ఓ మాధుర్య ప్రధాన గీతం ‘ఏ శ్వాసలో చేరితే’..
ఇక ఏ శ్వాసలో చేరితే పాట, తనను వేణువుగా మార్చిన వేణును(కథానాయకుడిని), వేణుమాధవునిగా భావించి, తనను మురళితో పోల్చుకుని, నాయిక ఆలపించే ఆరాధనాగీతం.
‘నేనున్నాను’ చిత్రంలో కథానాయకుని పేరు వేణు. అతడు జీవితంలో మోసపోయిన నాయికను ఆదుకొని, దుండగుల బారి నుంచి కాపాడి,ఆమెలో సహజంగా ఉన్న గాన కళను గుర్తించి, ఆమెను పాటల పోటీకి పంపిస్తాడు. పుట్టుకతో వచ్చిన గాన నైపుణ్యాన్ని ప్రోత్సహించి, తన జీవితాన్ని సార్థకం చేసిన కథానాయకుని పట్ల ఆమె మనసులో కృతజ్ఞతా భావం నిండిపోతుంది. అప్పుడు ఆమె తన హృదయంలోని కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరుస్తూ, తన గీతంతో అంజలి ఘటిస్తూ ఈ పాట పాడుతుంది.
కృష్ణుడు అనగానే మన తలపులోకి ముందుగా వచ్చేది, బృందావనం, నెమలి పించం, మురళి. ఈ పాటలో కూడా, వేణు మాధవా! అంటూ, ఆర్తితో పిలిచే వేణు గళాన్ని మనకు వినిపిస్తారు సిరివెన్నెల.
వేణుమాధవా.. వేణుమాధవా
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో (2)
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్ర మమౌతున్నదో
ఆ శ్వాసలో నే లీనమై, ఆ మోవిపై నేమంత్రమై నిను చేరనీ మాధవా ॥ ఏ శ్వాసలో॥
గాలిని కూడా గాంధర్వం చేసే రాధా మనోహరుని శ్వాసలో తను లీనమైపోవాలని, వేణువుకు ప్రతిబింబంగా తనను భావించుకునే నాయిక ఆకాంక్ష. ఏ పెదవిని తాకగానే మౌనాన్ని శ్వాసించే పిల్లనగ్రోవి సంగీత మంత్రాలు ఆలపిస్తుందో, తాను కూడా అలాంటి మంత్రమై, ఆ గోపీ వల్లభుడిని చేరుకోవాలన్న తపన, పల్లవిలో మనకి కనిపిస్తుంది. మురళిని తాకిన వేణుగానలోలుని శ్వాస, గాలిలో పరిమళించి, ఆ గాన పరిమళమే మనల్ని ఏ గంధర్వ లోకాలకో తీసుకొని వెళ్తుందట! ఎంత రసాత్మకమైన అభివ్యక్తి!
మునులకు తెలియని జపములు జరిపినదా మురళీసఖి వెనుకటి బతుకున చేసిన పుణ్యమిదా
తనువును నిలువున తొలచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా
వాళ్లకు కనువిచ్చే కృష్ణా నిన్ను చేరిందీ.. అష్టాక్షరిగ మారింది ఎలా యింత పెన్నిధి వెదురు తాను పొందింది వేణు మాధవా నీ సన్నిధీ ॥ ఏ శ్వాసలో॥
చరణంలో, వేణువు చేసుకున్న పుణ్యం ఏమిటో అర్థం కాక, తన అసూయను వెలిబుచ్చినట్టు అనిపిస్తుంది. ఎవరూ చేయని పూజలు ఏమైనా చేసిందా? గత జన్మలో తరిగిపోని పుణ్యాలు చేసిందా?
నిలువెల్లా గాయాలతో ఉన్న తనువే.. తనకి తరగని వరమయిందా? తను ఓర్చుకున్న గాయాలే, కన్నయ్య మోవిపై అష్టాక్షరీ మంత్రంగా మారిందని, గేయాలు పలికించిందన్న సత్యంతో అందరికీ కనువిప్పు కలిగించిందా? ఏ వరం వల్ల వెదురు అంత గొప్ప భాగ్యాన్ని పొందింది? అన్న ప్రశ్నలు సంధించి, బహుశా అవన్నీ చేసి ఉంటుందేమో!.. అన్న సమాధానాన్ని కూడా ఎంతో నేర్పుగా మనకు అందిస్తున్నారు సిరివెన్నెల.
Hans Ostrom రాసిన Instruments అనే కవితలో కూడా.., సెల్లో ఇంకా ఫ్లూట్- భావాల చిత్రాల్ని గాలిలో నుండి రూపుదిద్ది, మన గుండె లోతుల్లోకి వెళ్లి గుసగుసలాడుతాయి.. అని వర్ణిస్తారు.
Cello and flute induce moods,
summon shapes of emotion from air, whisper secrets to the soul.
చల్లని నీ చిరునవ్వులు కనపడక -కనుపాపకీ నలువైపుల రాతిరి ఎదురవదా?
అల్లన నీ అడుగుల సడి వినపడక – హృదయానికీ అలజడితో అణువణువు తడబడదా?
నువ్వే నడుపు పాదమిదీ, నువ్వే మీటు నాదమిదీ నివాళిగా నామది నివేదించు నిమిషమిదీ.. వేణుమాధవా నీ సన్నిధీ..
మాధవుని సాన్నిహిత్యం ఎంత అపురూపమైందో మొదటి చరణంలో వర్ణిస్తే, తాను కనుమరుగైన క్షణం ఎంత వేదన కలుగుతుందో రెండో చరణంలో వివరిస్తారు సిరివెన్నెల. కన్నయ్య చల్లని చిరునవ్వులు కనపడకపోతే, నలువైపులా చీకట్లు కమ్ముకుంటాయట! మువ్వగోపాలుని అడుగులు వినపడకపోతే, హృదయం అలజడితో తల్లడిల్లుతుందట! నువ్వు నడిపించే పాదం ఇది, నువ్వు పలికించి నాదమిది, నువ్వు లేకుంటే చలనం లేకుండా ఆగిపోతుంది.. కాబట్టి, కన్నయ్యా! నీ సన్నిధి నాకు వరంగా ఇవ్వు.. అన్న అభ్యర్థనను, తన గీతం ద్వారా నివేదిస్తుంది నాయిక.
మొత్తం మీద, విరహం చాలా కఠినమైనది కాబట్టి, తను వేణుమాధవుని సన్నిధిలోనే నిరంతరంగా ఉండాలన్న భావాన్ని, అంతర్లీనంగా ఆయన పలికిస్తారు.
రాధికా హృదయ రాగాంజలీ, నీ పదముల వ్రాలు కుసుమాంజలి, ఈ గీతాంజలి!…
పాట మొదట్లో సాధారణంగా వినిపించే సాకీ, పాట చివరలో వినిపించడం కూడా ఒక వైవిధ్యమే!
రాధిక హృదయం పలుకుతున్న ఈ రాగం నీ పదాలను చేరాలనుకున్న ఒక కుసుమం, అందుకే నా ఈ గీతాంజలి స్వీకరించు మాధవా! అన్న ప్రార్థనతో, పాటకు చక్కటి ముగింపును ఇచ్చారు సిరివెన్నెల.
శ్వాసలో చేరి గాలి గాంధర్వం కావడం, మోవిపై వాలి మౌనం మంత్రం, శ్వాసలో లీనం కావడం, నిలువుగా తొలచిన గాయాలు, జన్మకి తరగని వరముల సిరులు.., వంటి అపూర్వమైన అభివ్యక్తులతో, భాషా ప్రేమికులు, రసజ్ఞులు, సమ్మోహితులవుతారనడంలో సందేహమే లేదు!
స్థూలంగా చెప్పాలంటే కవిత్వానికి (భావకవిత్వానికి), గీతరచనకి, 1: భావోద్వేగం (emotion), 2: నైరూప్యం (abstractness), 3: భావుకత (abstractness plus emotion), 4: ప్రాస (rhyme), 5: లయ (rhythm) ప్రధానంగా ఉంటే, చదివినా, విన్నా, క్షణాల్లో పాఠకులకు/ శ్రోతలకు ఉద్రేకం, ఉత్సాహం కలిగిస్తాయి. ఇలాంటి లక్షణాలన్నీ నిండుగా, మెండుగా తన సినీ గీతాల్లో కూడా పలికించగలిగిన సాహితీ చంద్రుడు సిరివెన్నెల!
Images Courtesy: Internet