[డా. కోగంటి విజయ్ రచించిన ‘పో వెతుకు’ అనే కవితని అందిస్తున్నాము.]
[dropcap]మ[/dropcap]నసు తడి ఆరిపోయిన నేల
ఎడారి అయిపోయినట్లు
నీలో నీడలా ఎవరికీ చెందలేని
ఒక ఒంటరితనపు గుబులు
అందరూ అందరికీ కనిపిస్తున్నా
ఎవరూ ఎవరికీ వినిపించని
ఈ గాజు గోడల జీవితపు చీకటి ముసురులో
ఒక మిణుగురు పురుగు లాటి వెతుకులాట
అయినా పరిగెత్తించే చక్రం లాటి గడియారాన్ని
గుర్తుకుతేని ఒక్క ఉదయం కోసం
లోలోపలగా మసిలే ఈ అగ్నిగుండం నుంచి
నింపాదిగా బయటకు నడిపించే ఒక దారి కోసం
నిండుగా కౌగలించుకునేందుకు పిలిచే
ఆ నీలి ఆకాశపు చేతుల కోసం
పూల తోటల్లాటి మనుషులమధ్య
నీవో ఒక పరాగమై నిలిచిపోవడం కోసం
ఏ ఆరాటమూ లేక నిలిపే ఒక్క శ్వాస కోసం
కొత్తగా నీ కోసమే చిగిర్చే ఓ కొత్త ఉదయం కోసం