[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు, రచయితలకు నమస్కారాలు. ‘సంచిక’ను ఆదరిస్తున్న వారందరికి కృతజ్ఞతలు. పెరుగుతున్న పాఠకుల ఆదరణ ఆనందం కలిగిస్తున్నా, ఇంకా ఎంతో మంది పాఠకులను ‘సంచిక’ చేరలేకపోతోంది. సాహిత్య ప్రపంచంలో నెలకొని వున్న అపోహలూ, దురూహలూ, దుష్ప్రచారాలూ, ముఠాలు, సంకుచితాల పరిధులను ఛేదించి తెలుగు పాఠకులందరినీ చేరాలని ‘సంచిక’ ప్రయత్నిస్తోంది.
ప్రస్తుతం ఎన్నికల జ్వరం దేశమంతా ఆవరించింది. ఆరోపణలు, దూషణలు, వెక్కిరింతలు, హేళనలతో వాతావరణం కోలాహలంగా వుంది. పాలసీల ఆధారంగా కాక, వ్యక్తుల ఆధారంగా ఇష్టాయిష్టాలు స్థిరపడుతున్నాయి. మంచి-చెడు విచక్షణతో తెలుసుకున్న సత్యాల ఆధారంగా కాక గుడ్డిగా నిర్ణయించేసుకుని, ముందూ వెనుకా చూడకుండా ద్వేష భావనలు ప్రదర్శించటం ఆమోదకరమైన ప్రవర్తనగా మారుతోంది. ఆరోపణలు చేయటంలో, దూషించటంలో, హేళన చేయటంలో, అడ్డూ అదుపుల్లేకుండా, కనీస మర్యాద, గౌరవాలు లేకుండా ఎంతవారినయినా, ఎంతయినా అనేయటం కనిపిస్తోంది. అలా అనేయగానే, వారి సమర్థకులు గుడ్డిగా సమర్థించటం, ఇష్టమొచ్చినట్టు వాదించటం, ఎదుటివారి వాదనలో లేశమాత్రమైనా సత్యం వుంటుందేమో అన్న ఆలోచన కూడా లేకుండా వాదించటం కనిపిస్తోంది. అంటే, అసహనం, హింస, అవమానించటం, క్రమశిక్షణ, గౌరవాలు లేకుండా ప్రవర్తించటం సర్వ సామాన్యమైన ప్రవర్తనలా చలామణీ అవుతోందన్నమాట. రాజకీయాలలో కనిపిస్తున్న ఇలాంటి ప్రవర్తన సాహిత్య ప్రపంచంలోనూ కనిపించటం అత్యంత శోచనీయమైన అంశం. ఆందోళన కలిగించే అంశం.
సాహిత్య సృజన ఒక గురుతరమైన బాధ్యత. తరతరాలనూ ప్రభావితం చేసి, సమాజానికి దిశా నిర్దేశనం చేయగల శక్తివంతమైనది సాహిత్యం. సాహిత్య ప్రయోజనం ప్రపంచంలోని ఇతరులకు తెలిసినా తెలియకున్నా భారతీయులకు స్పష్టంగా తెలుసు. సాహిత్యం ఆధారంగా సజీవంగా నిలుస్తున్నది భారతీయ ధర్మం. కొన్ని వేల ఏళ్ళ క్రితం అక్షరబద్ధమైన రామాయణం, భారతం, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలు ఈనాటికీ భారతీయ జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మార్గదర్శనం చేస్తున్నాయి. సమాజం సందిగ్ధ దశలో వున్నప్పుడు సమాజానికి దిశానిర్దేశనం చేసేందుకు సాహిత్యాన్నే ఆశ్రయించారు దిశానిర్దేశకులు. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, నింబార్కాచార్యులు ఇలా ఆచార్యులు సాహిత్య సృజన ద్వారా సమాజ గతిని నిర్దేశించారు. మరోవైపు, అతి జటిలమైన అంశాలను సామాన్యులకు చేరువ చేసి సమాజాన్ని జాగృతం చేసేందుకు సంత్ జ్ఞానేశ్వర్, తుకారం, నామదేవ్, చైతన్య మహాప్రభు, లల్లేశ్వరి, అక్కమహాదేవి, మీరా, అన్నమయ్య, క్షేత్రయ్య, రామదాసు, సురదాసు, పురందర దాసు, తులసీదాసు, కబీరు, రవిదాసు, జయదేవ్, గురు హర్ రాయ్, గురు గోవింద్ సింఘ్ వంటివారు సాహిత్య సృజననే ఆశ్రయించారు. అమిర్ ఖుస్రావ్, ఖ్వాజా ఘులామ్ ఫర్హీద్, సుల్తాన్ బాహు, బుల్లేశాహ్, లాల్ శహబాజ్ ఖలందర్, మౌలానా రూమి వంటివారితో సహా అనేకులు సమాజంలో తమ ఆలోచనలను విస్తరించేందుకు సాహిత్యాన్నే ఆశ్రయించారు. ఈనాటికీ వీరు సృజించిన సాహిత్యం సమాజంపై ప్రభావాన్ని చూపిస్తోంది. ఇదీ భారతీయ సమాజంలో సాహిత్యాన్ని దైవ స్వరూపంగా భావించి, సరస్వతిని సృజన దేవతగా కొలవటం వెనుకవున్న తత్వం.
ప్రస్తుతం సాహిత్య ప్రపంచంలో పెద్దలుగా పేరుపొందినవారికి గానీ, పెద్ద రచయితలుగా చలామణీ అవుతున్నవారికి గానీ, సాహిత్య ప్రాధాన్యం గురించి అవగాహన వున్నట్టు అనిపించటంలేదు. ఎంతసేపూ, ముఠాలేర్పాటు చేసుకుని వ్యక్తిగతానికే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప, సాహిత్యాభివృద్ధి, సమాజ అభ్యున్నతి గురించిన ఎలాంటి ఆలోచనలు కనబరచటంలేదు. రాజకీయాలలో తాము అనుకున్నదే సత్యం, ప్రత్యర్ధి ఏంచేసినా అసహ్యం అన్నట్టుండే ప్రవర్తన కనిపిస్తోందో, పెద్దా చిన్నా లేకుండా ఎవరిని పడితే వారిని ఏం తోస్తే అది అనేస్తారో, సాహిత్య ప్రపంచంలోనూ అలాంటి ప్రవర్తననే కనిపిస్తోంది. నువ్వు నావైపు వుంటే నా మిత్రుడివి, కాకపోతే శత్రువువి అన్నట్టు ప్రవర్తించటం, రాజకీయ నాయకులలాగే చుట్టూ వందిమాగధ భజన బృందాలను ఏర్పాటు చేసుకోవటం కనిపిస్తోంది. తన ముఠాలో వుండి, తనచుట్టూ తిరిగి సజ్దాలు చేసేవాళ్ళే రచయితలు, వారు సృజించేదే సాహిత్యం, తన బృందంలో లేనివారిది సాహిత్యం కాదు, వారు రచయితలే కాదనే హీనమూ, హేయమూ, అత్యంత శోచనీయమూ, గర్హనీయమూ అయిన ప్రవర్తన సాహిత్య ప్రపంచంలో స్థిరపడటం తీవ్రమైన ఆవేదననూ, ఆందోళననూ కలిగించే అంశం.
ఇలాంటి ముఠాలు, ముఠాధిపతులవల్ల సాహిత్యం సంకుచితమైపోతోంది. తాము రాసేదే సాహిత్యం, తాము ఆమోదించినదే సాహిత్యం అని బహిరంగ వేదికలపై ప్రకటిస్తూ, తాము తందాన అంటే తాన అనే సాహిత్య పెద్దలు, మీడియాల ఆధారంగా దాన్నే స్థిరపరచాలని వీరు చేస్తున్న ప్రయత్నాలను సాహిత్యాభిమానులు గుర్తించి ఎదుర్కోకపోతే, భవిష్యత్తు తరాలు, తెలుగు సాహిత్యం ఒక ముప్పై ఏళ్ళ క్రితంనుంచే ఆరంభమయిందనుకునే వీలుంది. ఇప్పటికే ఒక పద్ధతి ప్రకారం మన ప్రాచీన సాహిత్యానికి సమాజం దూరమయింది. మన సంస్కృతి, సాంప్రదాయాలకు దూరమయింది. ఒకప్పుడు భారత భాగవత పద్యాలు ప్రతిఒక్కరికీ తెలిసేవి. నాటకాలలో పద్యాలు వూరూ వాడా ప్రతిధ్వనించేవి. కానీ, ఆధునిక సాహిత్య సృజనకారులుగా చలామణీ అవుతున్నవారికి తమ సమకాలీనులే తెలియటంలేదు. తామే తెలుగులో సృజనకు ఆద్యులం అన్న మూర్ఖత్వం ప్రదర్శిస్తున్నారు. గుడ్డిగా దాన్నే నమ్మి అందరినీ నమ్మించాలని చూస్తున్నారు.
ఆమధ్య కొందరు తెలుగులో చారిత్రక కథల తొలిసారిగా తామే రాశామని నమ్మించాలని ప్రయత్నించారు. రాయటం చేతకాకపోయినా తెలుగు రచయితగా గొప్ప పేరు సంపాదించాలంటే ఏం చేయాలో అన్నీ చేసి చూపించారు. ‘సంచిక’ అలాంటి రచనలలోని డొల్లతనాన్ని స్పష్టం చేయటమే కాక, తెలుగులో చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలకు ఎంత చరిత్ర వున్నదో నిరూపించింది. కానీ, ప్రతి సంవత్సరం కథల సాంవత్సరీక సంకలనాలు ప్రచురించేవారు, పత్రికలలో ప్రచురించే కథలను ఎన్నుకునే పద్ధతికి భిన్నంగా, ఆ సంకలనంలోని కథలను ఎన్నుకున్నారు. నాణ్యత లేని కథలకు ప్రామాణికతనాపాదించాలన్న ప్రయత్నం ఇది. అంటే తమ పరిధిలో లేనివారు ఏం రాసినా సాహిత్యం కాదు. తమవారు ఎలా రాసినా అది ఉత్తమ సాహిత్యం అన్నమాట. ఇదే ధోరణి సమకాలీన తెలుగు సాహిత్యంలో అడుగడుగునా కనిపిస్టోంది.
ఈ ధోరణికి పరాకాష్ట.. ఇటీవలే ఒక బహిరంగ సభలో తమకు ముందున్నదంతా చెత్త సాహిత్యమనీ, తాము శిక్షణనివ్వగా రచయితలుగా ఎదిగినవారూ, తమవారూ సృజించినదే సాహిత్యమనీ ప్రకటించటం, ఆ సభ నిర్వాహకులు దాన్ని ఖండించకపోవటం తెలుగు సాహిత్య ప్రపంచం ఎంతగా ఒకవైపు వాలిపోయిందో నిరూపిస్తుంది.
రచయిత సృజనాత్మక జీవి. సంపాదకులూ, పత్రికలూ, విమర్శకులూ, కథల సంకలనాలు చేసేవారూ, కథల డాటాబేస్‍లు తయారుచేస్తూ గొప్ప సాహిత్య సేవ చేస్తున్నామని, ఎంతో కష్టపడిపోతున్నామనీ సానుభూతి పొందేవారూ గ్రహించాల్సిందేమిటంటే, వీరంతా రచయిత సృజనపై ఆధారపడి బ్రతికే పరాన్నజీవులని! రచయిత రచన చేయకపోతే వీరికి అస్తిత్వం లేదు. సంపాదకుడు దేన్ని ఎడిట్ చేస్తాడు? పత్రికలు ఏం ప్రచురిస్తాయి? విమర్శకులు దేన్ని విమర్శిస్తారు? సంకలనకర్తలు వేటి సంకలనం చేస్తారు? కథల డేటాబేస్‌లు తయారు చేసేవారు తమ డేటాబేస్ లను దేనితో నింపుతారు? అందుకే రచయిత వీరందరికన్నా అధికుడు. వీరందరికీ జీవికనిచ్చేవాడు. కానీ, తెలుగు సాహిత్యంలో పరాన్నజీవులు తాము ఆధారపడ్డవాడిని తమపై ఆధారపడినవాడిలా చూస్తున్నాయి. తమపై ఆధారపడిన భిక్షగాడిని చేస్తున్నాయి. రచయిత ఏం రాయాలో, ఎలా రాయాలో, ఏది ఉత్తమ రచననో, ఏది చెత్తనో, అసలు ఏది రచననో, ఏది కాదో రచయితకు పాఠాలు చెప్పి రచయితను పరాన్నజీవులు నిర్దేశించే విచిత్రమూ, హేయనీయమూ, ప్రమాదకరమూ అయిన దుస్థితి తెలుగు సాహిత్య ప్రపంచంలో నెలకొనివుంది.
తమ కన్నా ముందు వున్న రచనలు, తాము మెచ్చని రచనలూ అన్నీ చెత్త అని ఎవరైనా ఎలా అనగలరు? ఒక రచనను చెత్త అనేందుకు వాడిన ప్రామాణికాలేమిటి? ఎన్ని రచనలను చదివి ఈ నిర్ణయానికి వచ్చారు? తాము మెచ్చని రచనలు, చెత్త అనేవారు రచనలను తులనాత్మక అధ్యయనం చేశారా? ఆ అధ్యయన ఫలితాలనెక్కడ ప్రచురించారు? ఏ అధ్యయనం ఆధారంగా అలాంటి వ్యాఖ్యలు చేయగలిగారు? ఇలాంటి ప్రశ్నలను అడిగే వ్యవస్థ లేదు కాబట్టి, అడగాల్సినవారంతా ముఠాల నెట్‌వర్క్‌లో భాగాలే కాబట్టి అడిగేవారు లేకుండా పోయారు. ఎవరయినా అడిగినా కాకి గోల అంటూ కొట్టి పారేస్తారు. చుట్టూ వుండే భజనగణాలు కళాకారులు కాకులుగా ఎందుకవుతారంటూ అమాయకంగా అడుగుతారు, కాకికి తన గొంతు గొప్పతనం తెలియదన్నట్టు. ఇంతకీ తమని ప్రశ్నించేవారంతా కాకులనటంలోనే అసలు అహంకారం కనిపిస్తుంది. ఇదే రకమయిన అహంకారం ఈ ముఠాల్లోని యువ రచయితలూ ప్రదర్శిస్తున్నారు. వారూ ముఠానాయకుడికి వంత పాడుతున్నట్టు తాము సృజించేదే సాహిత్యమనీ, తమముందు సాహిత్యం లేదు. తరువాత వుండదు, వున్నా అంతా చెత్త అన్నట్టు ప్రవర్తిస్తున్నారు.
ఇతర సాహిత్యమంతా చెత్త అని బహిరంగంగా ప్రకటిస్తే తెలుగు సృజనాత్మక రచయితలు మౌనంగా ఎలా వుండగలుగుతున్నారు? రచయిత తన రచనను ఒక్క సారి ప్రచురించిన తరువాత దాన్ని వదిలేయాలి. ఎవరేమన్నా స్వీకరించాలి. మంచి రచనలు నిలుస్తాయి. రచనలో పసవుంటే అది బ్రతుకుతుంది లాంటి శుష్కవాదనలకు కాలం చెల్లింది. తెలుగు రచయితలు ఇకనైనా సుషుప్తిని వదల్చుకుని తమ రచనలకు సాహిత్య ప్రపంచంలో సముచితమైన స్థానం లభించాలని ముందుకు రాకపోతే, తమ రచనల గౌరవంకోసం కలసికట్టుగా నిలబడి సాహిత్య మాఫియా ముఠాల ఆటలు కట్టించే ప్రయత్నాలు చేయకపోతే, ఎలాగయితే ప్రాచీన సాహిత్యం నెమ్మదిగా కొద్దిమందికే పరిమితమవుతోందో, అంతకన్నా ఘోరంగా ముఠాలకు లొంగని సాహిత్యం కనుమరుగయి కాలగర్భంలో కలసిపోయే వీలుంది. బంగారపు పళ్ళేనికయినా గోడ చేర్పు కావాలి. రచన ఎంత గొప్పదయినా దాని గురించి ఎవరో ఒకరు చెప్పాలి. లేకపోతే ఎంత గొప్ప రచన అయినా నీరందని చెట్టులా వాడిపోతుంది. ఓడిపోతుంది.
ఈ విషయంలో ‘సంచిక’ కొన్ని నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేపడుతోంది. ప్రస్తావనకు రాని మంచి రచనలను పాఠకులకు పరిచయం చేయటం, వినూత్న పోకడలు పోతూ, అనూహ్యమైన ఎత్తులు ఎదుగుతున్న ప్రపంచ సాహిత్యాన్ని పాఠకులకు చేరువచేయటం, విస్మృతికి గురయిన రచనలను వెలికి తేవటంద్వారా, తెలుగు సాహిత్య ఔన్నత్యాన్నీ, ప్రాచీనతను, లోతును పాఠకుల గ్రహింపుకు తేవటం, ఈనాడు, ఏం చేసినా తామే తొలిసారిగా చేస్తున్నట్టు చెప్పుకునే వీలు లేకుండా చేయటం వంటి ప్రయత్నాలతో పాటూ, రచయితలు తమ రచనల వైశిష్ట్యాన్ని తామే చెప్పే వీలు కల్పించటం, గొప్ప రచనలుగా పరిగణనకు గురవుతున్న రచనల నిగ్గు తేల్చి ప్రదర్శించటం వంటి కార్యక్రమాలు కూడా ‘సంచిక’ చేపడుతోంది. అందరూ గమనించాల్సిందేమిటంటే ఈ ప్రయత్నాలేవీ వ్యక్తిగతం కావు. సాహిత్యం కోసమే. వ్యక్తులు శాశ్వతం కాదు. సాహిత్యం శాశ్వతం. అలాంటి సాహిత్యాన్ని సంకుచితం చేసి, కొద్ది కాలానికే పరిమితం చేయాలనే ప్రయత్నాలను అడ్దుకొని, భవిష్యత్తు తరాలకు తెలుగు సాహిత్యం సంపూర్ణంగా అందేట్టు చేయటం కోసమే ఈ ప్రయత్నాలు. ఈ ప్రయత్నంలో పాఠకులు, రచయితలు, సాహిత్యాభిమానులంతా ‘సంచిక’కు తమ సహాయసహకారాలందించాలని ‘సంచిక’ అభ్యర్ధిస్తోంది. ఇది ఒక వ్యక్తి వల్లనో, ఒక సంస్థవల్లనో అయ్యే పనికాదు. ఇది సమష్టి సమాజ శక్తి మాత్రమే సాధించగలిగే కార్యం.
పాఠకులకు విభిన్నమైన, విశిష్టమైన రచనలను అందించాలనే ‘సంచిక’ ప్రయత్నం కొనసాగుతోంది.
‘సంచిక’ లోని రచనలు విభిన్న దృక్కోణాలకు, భిన్న స్వరాలకూ తావిచ్చేలా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాము.
కశ్మీరు సంపూర్ణంగా ఇస్లామికీకరణమవడానికి ప్రత్యక్ష సాక్షియైన శ్రీవరుడు రచించిన ‘జైన రాజతరంగిణి’ – తెలుగులో తొలిసారిగా వ్యాఖ్యాన సహిత అనువాదంతో కొద్దిరోజుల క్రితం ‘సంచిక’లో మొదలయింది.
గత ఏడు నెలలుగా ధారావాహికంగా ప్రచురితమైన సైన్స్ ఫిక్షన్ అనువాద నవల ‘అంతరిక్షంలో మృత్యునౌక’ ఈ నెలతో ముగుస్తోంది. త్వరలో మరో సైన్స్ ఫిక్షన్ నవల అనువాదాన్ని అందించనున్నాము. ఇదే కాకుండా పాఠకులను ఆకట్టుకునే మరికొన్ని ధారావాహికలూ రానున్నాయి.
సైన్స్ లెక్చరర్‍గా, ఆకాశవాణిలోను, పలు టివీ ఛానెల్స్ లోనూ కార్యక్రమాల రూపకర్తగా, ఉత్తమ విలేఖరిగా పేరు పొందిన శ్రీ తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘జీవన సాఫల్య యాత్ర’ ఈ నెల నుంచి సంచికలో వారం వారం ప్రచురితం కానున్నది..
పాఠకుల ఆదరణను మరింతగా పెంచుకునేందుకు గాను కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.
నాణ్యమైన సాహిత్యాన్ని పాఠకులకు అందించాలన్న ‘సంచిక’ ప్రయత్నాన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము.
ఎప్పటిలానే సీరియల్, వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, పుస్తక విశ్లేషణ, గళ్ళనుడికట్టు, ఇంటర్వ్యూ, పిల్లల కథ, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 ఏప్రిల్ 2024 సంచిక.
1 ఏప్రిల్ 2024 నాటి ‘సంచిక’లోని రచనలు:
సంభాషణం:
- రచయిత్రి, కవయిత్రి ప్రొఫెసర్ కొలకలూరి ఆశాజ్యోతి అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్
సీరియల్:
- అంతరిక్షంలో మృత్యునౌక-8 – పాణ్యం దత్తశర్మ
కాలమ్స్:
- సంచిక విశ్వవేదిక – శబ్ద-అక్షర ఆవిర్భావం – ఒక అసంపూర్ణ ఊహ! – సారధి మోటమఱ్ఱి
- శ్రీ మహా భారతంలో మంచి కథలు-8 – శ్రీ కుంతి
గళ్ళనుడికట్టు:
- సంచిక – పదప్రహేళిక ఏప్రిల్ 2024 – టి. రామలింగయ్య
వ్యాసాలు:
- అమ్మ కడుపు చల్లగా -49 – ఆర్. లక్ష్మి
- ఆర్యులు ఒక జాతియా? ద్రవిడులు ఒక జాతియా? – డా. నెల్లుట్ల నవీన చంద్ర
కవితలు:
- హౌజ్‌వైఫ్ – శ్రీధర్ చౌడారపు
- పో వెతుకు – డా. విజయ్ కోగంటి
- కాలం – శంకరప్రసాద్
కథలు:
- మదిని దోచే గది – గంగాధర్ వడ్లమన్నాటి
- మాలిన్యం – ఆసూరి హనుమత్ సూరి
- గెట్ వెల్ నౌ – మల్లాది లక్ష్మణ శాస్త్రి
పుస్తకాలు:
- మానవీయ విలువల సందేశాన్ని వినిపించే నీటి గలగలలు – పుస్తక విశ్లేషణ – డా. నల్లపనేని విజయలక్ష్మి
బాల సంచిక:
- అడవిలో ఆలోచనలు — – కంచనపల్లి వేంకటకృష్ణారావు
సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.
సంపాదక బృందం.