కథ-సంవిధానం

0
2

[box type=’note’ fontsize=’16’] “పాత్రల స్వభావాలను, కథా సంఘటనలను గీతల ముగ్గులంత సరళంగా ఊహలకు అందుతూ కూడా ఆసక్తిని కలిగించేది ఒక రీతి అయితే, మెలికల ముగ్గులంత జటిలంగా వెనుక ముందు సంఘటనలను అల్లుతూ ఉత్కంఠను రేకెత్తించేది ఒక రీతి” అని వివరిస్తున్నారు బుసిరాజు లక్ష్మీ దేశాయికథ – సంవిధానం” అన్న వ్యాసంలో. [/box]

[dropcap]క[/dropcap]థకులూ చదువరులూ తమ జీవనమనే అధ్యయనంలో సాక్షాత్కరించే సత్యాలను అనుభూతి చెంది పరిపక్వత దిశగా అడుగులు వేయడంలో సమానులు. కాకపోతే కథకులు తమ దర్శనాలను పదాలలో పొదిగి ఆ యా విషయవస్తువును సులభతరంగా అందుకొనే విధంగా చూపించగలరు కాబట్టి ఈ సంగతికి చెందినవరకూ కథకుల స్థాయి ఇంకొంచెం ఎక్కువ అన్నది నిస్సందేహం. కథకు కథకులు ఎంత ముఖ్యమో చదువరులు అంతే ముఖ్యం.

కథా సంవిధానం

ఒక చదువరికి తెలిసినంత వరకు కథను చదువుతున్నప్పుడు పఠనీయత (చదివించే గుణం), రసానుభూతి, శబ్దకౌశల్యం ఉన్నప్పుడు కథలు ఆకట్టుకోగలవు. ఏదైనా తగుమాత్రంగా ఉన్నప్పుడే ప్రయోజనకారిగా ఉంటుందన్నది జగమెఱిగిన సత్యం. ఇది కథారచనలో కూడా వర్తించే విషయం. క్లుప్తత అన్నది వీటన్నిటికీ వర్తిస్తుందని వేరే చెప్పవలసిన అవసరం లేదు.

సమాజంలో ప్రాముఖ్యత గల అంశాన్ని కథా వస్తువుగా ఎన్నుకోవడం; పాత్రల మధ్య సంఘటనలు మరియు సంభాషణల ద్వారా పాత్రల స్వభావాలతో స్పష్టమైన పరిచయం ఏర్పరచడం ద్వారా ఆసక్తి దెబ్బతినకుండా కథాగమనం ఉండడం పఠనీయతలో భాగం.

ఆ యా సంఘటనలలో పాత్రల తీరుతెన్నులను వాటి స్వభావాలకు అనుగుణంగా నడిపించడం వల్ల ఔచిత్యం సమకూరుతుంది. దాన్ని బట్టి ఆ సంఘటనలలో, తీరుతెన్నులలో సహృదయులైన చదువరులు తల్లీనత చెందగలిగినపుడు పాఠకులకు రసానుభూతి కలుగుతుంది.

వీటితో పాటు చక్కని, సరళమైన, ప్రామాణికమైన శబ్దసంయోజనం ఉన్నప్పుడు చదువరికి ఎటువంటి ఆటంకమూ లేకుండా పఠనం సాగుతుంది.

ఇక వివరణలూ, సంభాషణల ఉనికి సాధ్యమైనంత వరకు ఆయా కథలోని సంఘటనల, పాత్రల నేపథ్యానికి చెందినవైనపుడు వాటి నిడివి బాధించదు. అలా కాని వాటిని పరిహరించినపుడే క్లుప్తతను సాధించినట్టౌతుంది. అంతేకాక క్లుప్తత వాటి నాణ్యతను పెంచుతుంది.

కథా సంవిధానంలో పఠనీయత, రసావిష్కరణ, శబ్దకౌశల్యం, క్లుప్తత ప్రాధాన్యత వహిస్తాయి.

***

ప్రాచీన కథలలో వివిధ స్థాయిలలో ఈ సంవిధాన ప్రావీణ్యతను గమనించవచ్చు. అసలు లేనివి, కొద్ది మాత్రం ఉన్నవి, గణనీయమైన స్థాయిలో ఉన్నవీ, వెగటు పుట్టించే స్థాయిలో ఉన్నవీ వెలువడినాయి.

ఉపర్యుక్త లక్షణాలు అవసరానికి మించి వెగటు పుట్టించడం వల్ల క్రమేపీ ప్రాచీన కథా సాహిత్య ప్రస్థానంలోని చివరి అడుగులు తడబడి, చాలామటుకు చదువరుల ఆకర్షణను కోల్పోయినాయి. రసావిష్కరణ, శబ్దకౌశల్యం చూపడంలో ఉన్న ధ్యాస; వస్తువు మరియు పాత్రల ఔచిత్యాలను విడిచిపెట్టేలా చేయడంతో ప్రబంధకాలపు రచనల తర్వాతి రచనలు అంత పాఠకాదరణకు నోచుకోలేదు. ఇది ముగిసిన అధ్యాయం.

నవీన కథా సంవిధానం

పాఠకులకు కావలసిన పఠనీయత, రసావిష్కరణ, శబ్దకౌశల్యం; వీటన్నిటిలో క్లుప్తత నవీన కథా సంవిధానంలో ఉన్నాయా? ఎంతవరకూ ఉన్నాయి? అచ్చుపత్రికలు, జాల పత్రికలు లెక్కకు మించి ప్రచురింపబడడం, వాటికి అంతకు మించి రచనలు రావడం జరుగుతోంది. కానీ వీటిలో నాణ్యత ఎంతవరకూ ఉంది? గత కాలపు రచనలు కాలానికి నిలబడినట్టు నేటి రచనలు నిలబడగలవా? లేకపోతే ఎందుకు నిలబడలేవు?

ముందుగా ఈ కాలపు రచనల్లో పైన చెప్పిన అంశాలు ఏమేరకు చోటు చేసుకుంటున్నాయో చూద్దాం.

౧. పఠనీయత

(క) వస్తువు లో సమగ్రత

వస్తువు, పాత్రరచన, సంభాషణలపై కథాగమనం ఆధారపడుతుంది. ఈ కథాగమనం ఎంత ఆసక్తికరంగా సాగితే అంతగా ఆ రచనకు పఠనీయత ఉందని అర్థము.

వస్తువు సమకాలీనము కానీ, ప్రసిద్ధ విషయము గానీ, రచయిత ఊహిస్తున్నది కానీ కావచ్చు. సమకాలీనము అయినప్పుడు ఆ వస్తువు/కథాంశమునకు కథకులు చూడగల అనేక కోణాలుంటాయి. ఆ కోణాలను రచనలో ప్రస్తావించకపోతే ఆ కథాంశం అసమగ్రం అవుతుంది. వర్గాంతర సంఘర్షణను చిత్రించేటప్పుడు రెండు వర్గాల బలాలు, బలహీనతలను ప్రస్తావించడం సమంజసం. యజమాని కార్మికుల మధ్య లేదా స్త్రీ పురుషుల మధ్య లేదా రెండు తరాల మధ్య సంఘర్షణ కథాంశం అయినపుడు పూర్తిగా ఒక వర్గం వారంతా దోషులు అని రచయిత నిర్ధారించి చిత్రించడం వల్ల కథకు సమగ్రత రాదు. ఒక వర్గంలో ఒక వ్యక్తినో, ఒక కూటమినో దోషపూర్ణంగా చిత్రించడం సహజమే. కానీ ఒక వర్గాన్ని మొత్తం దోషభూయిష్టంగా చిత్రించి, ఇంకొక వర్గం పూర్తి నిర్దోషంగా చిత్రించడం వలన ఆ కథాంశం సమగ్రతను కోల్పోయినట్టే. మహాభారతం వంటి కథా నిర్మాణాలను పరిశీలించినపుడు నాయక, ప్రతినాయక వర్గాలలోని ప్రతి పాత్రకు ఇవ్వబడిన ప్రాధాన్యతను గమనించగలము. జరిగిన కథలకూ, ఊహల్లో జరిగిన కథలకూ కూడా ఈ నియమం వర్తించబడినప్పుడే కథ రక్తి కడుతుంది.

అస్తిత్వ వాద రచనలలో ఈ లోపం ఎక్కువ కనిపిస్తుంది. అస్తిత్వవాద రచనల ముఖ్య ఉద్దేశ్యం పైన ఉదహరించిన రెండు వర్గాల మధ్య సమతూకం సాధించడం. అలా కాక అప్పటికే ఉన్న సమస్యాత్మక స్థితిని తల క్రిందులు చేయడం వల్ల సమస్య కొత్తరూపం తీసుకోవడమే తప్ప నివారింపబడదు. “నీవెంత ముఖ్యమో నేనూ అంతే ముఖ్యం” అని నిరూపించినపుడు అస్తిత్వ వాద ప్రయోజనం నెరవేరుతుంది కానీ, “నాకన్నా నీవు ముఖ్యం కాదు, నీకన్నా నేనే ముఖ్యం” అనుకుంటూ పోతే పాత్రలు మారినా సమస్య ఉన్నది ఉన్నట్టే ఉంటుంది.

(ఖ) కథాగమనంలో ఔచిత్యం

ఇక పాత్ర రచనలో ఘటనలద్వారా కానీ, సంభాషణల ద్వారా కానీ పాత్ర స్వభావాన్ని పాఠకులకు పరిచయం చేస్తున్నప్పుడు ఉన్నట్టుండి ఆ పాత్ర తద్విరుద్ధంగా ప్రవర్తించడం చూస్తే ఆ పాత్ర ఆకట్టుకోదు. ఆయా సంఘటనలలో భిన్నంగా ప్రవర్తించడం వేరు, తన స్వభావాన్ని తనకే నమ్మలేనట్టు ఉండడం వేరు.

ఈ కథాగమనంలో సరళమైన రీతిని పాటించి, జటిలమైన రీతిని పాటించి ప్రసిద్ధులైన కథకులు మనకు తెలుసు. పాత్రల స్వభావాలను, కథా సంఘటనలను గీతల ముగ్గులంత సరళంగా ఊహలకు అందుతూ కూడా ఆసక్తిని కలిగించేది ఒక రీతి అయితే, మెలికల ముగ్గులంత జటిలంగా వెనుక ముందు సంఘటనలను అల్లుతూ ఉత్కంఠను రేకెత్తించేది ఒక రీతి.

అన్ని రకాల కథాగమనాలలో పాత్రల స్వభావాలను, సంఘటనలను బలంగా చిత్రించడం వలన మాత్రమే రచనలు పాఠకాదరణ పొందగలవు. అంటే అన్నీ ఉదాత్త పాత్రలే అయి ఉండడం అని చెప్పడం లేదు. స్వభావం ఏదైనా ప్రతి పరిస్థితిలోనూ ఆ పాత్ర వ్యవహరించే తీరు, పాత్రను ప్రత్యక్షంగా/పరోక్షంగా వర్ణించిన తీరుతో విభేదించరాదు. అప్పుడే అది బలమైన చిత్రీకరణ అవుతుంది. నీతిపరులు పరిస్థితుల వలన ఉన్నట్టుండి అవినీతి పరులుగా మారిన లేదా అటుదిటు అయిన సందర్భంలో కూడా నీతి మరియు అవినీతి పైన వారికున్న అవగాహన ఏమిటన్నది పాఠకులకు స్పష్టత కావాలి. ఈ విధంగా కథావస్తువు, పాత్రలు కథాగమనానికి తోడ్పడుతూ పఠనీయతను తీసుకొస్తాయి.

కానీ ఇప్పుడు వస్తున్న అనేక కథలలో పాత్రలపైన ఇటువంటి అవగాహన పాఠకునికి వచ్చేలా లేవు. కారణం ఏమిటంటే, పాత్రల దృఢత్వం కానీ, బలహీనతలు గానీ స్పష్టంగా చిత్రించబడడం లేదు. చిన్న కథల మీద మోజు పెరిగాక వాటిలో అంత అవకాశం కూడా ఉండడం లేదు బహుశా.

౨. రసావిష్కరణ

ఈ విషయానికొస్తే, నాటి రచనలలో ఉన్న వీరాది రసాలపై నేడు ఆసక్తి తగ్గింది. అసలు రసమంటే ఏమిటన్న అవగాహన కూడా మన తరాలకు తక్కువేనని చెప్పాలి. రసానుభూతి అనేది కథలో పాఠకులు తల్లీనం చెందే స్థితికి తీసుకొని వెళ్తుంది. ఆ కథనాన్ని మరల మరల చదవడానికి పాఠకులు కుతూహలం చూపించడానికి దోహదపడుతుంది. అయితే ఇందులో ఆనందాన్ని, సంభ్రమాన్ని, పారవశ్యాన్ని కలిగించే రసాలు కొన్ని. జుగుప్స , భీతి కలిగించేవి కొన్ని. ఆనందాన్ని కలిగించేవి పాఠకులను మరల మరల ఆకర్షించడం అత్యంత సహజమైన విషయం.

ప్రపంచప్రసిద్ధములై, కాలానికి నిలిచి ఉన్న వివిధ భాషాసాహిత్యాల రచనలలో రసానుభూతి పాత్ర తిరస్కరించలేనిది. దేశదేశాలలోని నాటి వీర,శృంగార, కరుణా రసాలే కాక నేటి హారీపాటర్, అవెంజర్స్ వంటి కథలలో ఉన్న అద్భుత రసావిష్కరణలు కాలంతో సంబంధం లేకుండా ప్రపంచ చదువరులను ఊహా ప్రపంచాలకు చిత్రరూపం ఇచ్చేంతగా స్ఫూర్తినిస్తున్నాయి.

అయితే రచనల్లో నేడు వాస్తవ సంఘటనలను, జరిగే అవకాశముందనే ఊహలను వర్ణించడంలో బీభత్స, భయానక రసావిష్కరణ అత్యధికంగా జరుగుతోంది. శారీరక సమస్యలను కథాంశంలో భాగంగా వర్ణించేటప్పుడు అవసరమైన దానికన్నా ఎక్కువగా జుగుప్స కలిగించే రీతిలో వర్ణనలు ఉంటున్నాయి. ప్రబంధ కాలం నాటి రచనల్లో శృంగారం, పురాణ కథల్లో వీరం ఇత్యాదులు వెగటు పుట్టించేంత అధికంగా ఉన్నాయని వ్యాఖ్యానించే అభ్యుదయ రచనాకారులే ఈ బీభత్స, భయానక రసాలను అవసరానికి మించి వర్ణించడం ఈ మధ్య కాలంలో పాఠకలోకం గమనించనిది కాదు.

చిన్న కథలలో రసావిష్కరణకు అవకాశం లేదనేందుకు ఆస్కారం లేదు. సుప్రసిద్ధమైన ఆవు-పులి, నాన్నా పులివచ్చె కథలలో కరుణరసమూ, భక్తసిరియాళ కథలో కరుణ, బీభత్స రసాలు, ఒణకె ఓబవ్వ కథ (ఇది వాస్తవగాథ) లో వీర రసమూ, హారర్ కథలలో భయానకరసమూ తెలిసినవే. ఇవన్నీ చిన్న కథలే.

రసానుభూతి పాఠకులను ఆకర్షించే దశలో కాక దూరం నెడుతున్న స్థితిలో ఉండడం శోచనీయం. బీభత్స, భయానక రసాదులు వద్దని కాదు. అవి తగుమాత్రంగా ఉండవలసినవే కానీ మొత్తం వర్తమాన సాహిత్యమంతా పరచుకొని ఉండదగినవి కాదు.

౩. శబ్దకౌశల్యం

ఈ విషయం గురించి ఏదైనా ఆశించడం నేటి తరంలో కొంచెం కష్టమే. భాషకు ప్రాముఖ్యత పూర్తిగా తగ్గిపోయిన విద్యారంగం నుంచి వచ్చిన తరం మనది. ప్రొఫెషనల్ కోర్సులకూ వాటి పునాది కోర్సులకూ తప్ప ఇక్కడ ఏ భాషకూ తగిన ప్రాధాన్యత లేదు. కాబట్టి భావాలకు తగిన పదజాలం మన వద్ద లేదు. విద్యలో భాగంగా కాక పాఠకులకూ కథకులకూ కూడా ఇతర సాహిత్యం చదివేంత తీరిక లేనట్టి పరుగెడుతున్న జీవన శైలులు కూడా ఈ కొరతకు కారణమే.

సాహిత్య కృషిలో వ్రాయడాన్ని మించినదిగా చదవడం ఉన్నప్పుడే మజ్జిగ చిలికి వెన్న తీసినట్టు చదువుల/లోకానుభవాల లోంచి సారాన్ని తీసి పాఠకలోకానికి అందించగలము.

క్లుప్తత

ఈ విషయానికొస్తే స్పష్టతకు అడ్డుపడని విధంగా క్లుప్తతను సాధించినపుడే సముచితంగా ఉంటుంది. క్లుప్తంగా కథనం ఉన్నప్పుడు కూడా అన్ని దారాలకు ముడి పడనినాడు పాఠకుని ఒక వెలితి వెంటాడుతుంది. మొదటినుంచీ చివరిదాకా పాత్రల్లో/కథాగమనం లో సందిగ్ధత లేని నాడు క్లుప్తత అర్థవంతమౌతుంది.

నవీన కథాసంవిధానాలు – కొన్ని పరిశీలనలు

౧. పాత్ర స్వభావాన్ని సంఘటనల/సంభాషణల/తగుమాత్ర వర్ణన ద్వారా పాఠకులకు స్పష్టంగా పరిచయం చేయడం వల్ల ఆ పాత్ర సాధారణ పరిస్థితుల్లో (ప్రత్యేక పరిస్థితులు కాదు) ఏ విధంగా ప్రవర్తించగలదో ఒక ఊహకు రావడం జరుగుతూ పాఠకుల దృష్టిలో నిలిచిపోతుంది. ఇది పాజిటివ్/నెగెటివ్ పాత్రలకు వర్తిస్తుంది. రామాయణాదులలో ఉన్న పాత్రలు నెగెటివ్/పాజిటివ్ అనే భేదం లేకుండా సమాన ప్రాధాన్యాన్ని పొందాయి. అందుకే అది చరిత్రగా నమ్మినవారు, కథగా కూడా ఈసడించినవారు కూడా ఈ పాత్రల స్వభావాల ఛాయలు లేకుండా తమ కథారచనలు చేయలేకుండా ఉన్నారు. పాత్రచిత్రణ లో సమర్థత అనే లక్షణం ఆధునిక కథలలో చాలా తక్కువ కనిపిస్తున్నది.

 ౨. సమకాలీన కథా వస్తువులో గతకాలపు భావజాలాల పాజిటివ్ నెగెటివ్ ప్రభావాలను చూపించడం సహజమే. కానీ, వస్తువు గతకాలపుదైనప్పుడు సమకాలీన భావజాలాన్ని చొప్పించడం అసమంజసం. ప్రపంచం నలుమూలల భావజాలాలు వాటి వాటి నేటివిటీ ఉన్న చోటే కాకుండా పరస్పరం మిళితమైపోతున్న రోజులలో వికసించిన నేటి దృక్పథాలను నాటి పాత్రలకు ఆరోపించడం ఔచిత్యలోపం. నది ముందుకే గానీ వెనక్కు మళ్ళనట్టు ముందు కాలపు భావాలు ఈ కాలంలో వాళ్ళ ఆలోచనలని ప్రభావితం చేయగలవు గానీ, ఈ కాలపు భావాలు గడిచిన కాలపు పాత్రల నోటినుంచి పలికించడం హాస్యాస్పదం.

 ౩. రసానుభూతి అన్న భావనకు ఎక్స్‌పైరీ స్థితిని అంటగట్టిన నవీన కథా సాహిత్యం బీభత్స, భయానక రసాలను మాత్రం తప్పించుకొన లేకపోతున్నది. భౌతిక, మానసిక పరంగా కూడా యథేచ్ఛగా గుప్పిస్తున్నది. పాత్రల అంతరంగాలను యథేచ్ఛగా చిత్రిస్తూ, భయానక రసావిష్కరణతో కుటుంబసభ్యులపైన కూడా మనిషి నమ్మకం కోల్పోయేంతగా ప్రభావితం చేస్తున్నది.

 ౪. వ్యావహారిక భాషలో వ్రాస్తున్న మాట నిజమే గాని, అందుకు తగినట్టుగా మాండలీకాలలో, వాడుకభాషలో ఉన్న పదనిధిపై నవీన సాహిత్యం పట్టు సాధించలేకపోయింది. గ్రాంథిక సహాయం లేనిదే పని నడవడం లేదు. దాని మీద కూడా పూర్తిగా పట్టు లేదు. కాబట్టి ఉన్న విషయాన్ని ప్రస్తుతీకరించడంలో శబ్దకౌశల్యం పాఠకులను ఎక్కువ ఆకర్షించలేకపోతున్నది. శబ్దకౌశల్యం అతివృష్టి కాలం సాహిత్యాన్ని నిరాదరణకు గురిచేసినట్టే అనావృష్టి కాలంగా నేడు నిరాదరణకు గురిచేస్తున్నది.

నిష్కర్ష

ప్రాచీన కథా సంవిధానాలలో తలెత్తిన లోపాల గురించి చర్చలు జరిగాయి. నవీన కథాసంవిధానాలలో ఉన్న లోపాలు అవే, కొత్తరూపాలు ధరించి వచ్చాయని నిరూపణ అయింది. కాబట్టి నవీన కథా సంవిధానాలలో ఉన్న నవీనత నేతి బీరకాయలోని నెయ్యి వంటిది. లోపాలను సరిచేయకుండా వాటికి ముసుగు వేసిన చందంలో తయారైందన్న విషయాన్ని గమనించి సరిదిద్దుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here