[సంచిక కోసం రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు ప్రొఫెసర్ కొలకలూరి ఆశాజ్యోతి గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]
బహుభాషా సాహితీమూర్తి ప్రొఫెసర్ కొలకలూరి ఆశాజ్యోతి:
పండిత కుటుంబంలో జన్మించిన వారంతా పండితులు కానక్కర లేదు! కానీ పండితులు అయితే.. అది అదృష్టమనే చెప్పాలి. దాని వెనుక స్వయం కృషి, అభిలాష, ప్రోత్సాహం ఇంటి వాతావరణం, ఇటువంటి విషయాలన్నీ కలసి రావాలి. అలాంటి వాతావరణం నుంచి వచ్చిన మహనీయురాలు ప్రొఫెసర్ ఆశాజ్యోతి గారు. తండ్రి పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారు తెలుగు పండితులు కావడం, రచయిత-కవి కావడం, వైస్ – ఛాన్సలర్ వంటి ఉన్నత పదవులలో రాణించడం వల్ల, డా. ఆశాజ్యోతి గారు తండ్రికి తగ్గ తనయగా, అంచలంచెలుగా ఎదిగారు. ఇతర రాష్ట్రంలో (కర్ణాటక), తెలుగు భాషా శాస్త్ర అధిపతి అయ్యారు. తెలుగుతో పాటు కన్నడం, మలయాళం, ఆంగ్లం, రష్యన్ భాషలలో మంచి పట్టు సాధించారు. అధ్యాపకురాలిగా, పరిశోధకురాలిగా, పర్యవేక్షకురాలిగా, రచయిత్రిగా, కవయిత్రిగా, అనువాదకురాలిగా పేరుప్రతిష్ఠలు సంపాదించుకున్నారు.
కొలకలూరి కుటుంబంలో మరో ‘పద్మశ్రీ’ గా ఎదగడానికి అవిరళ కృషి జరుపుతున్న డా. ఆశాజ్యోతి గారు, తన సాహితీ కృషి గురించి ఇంకా ఏమి చెబుతారో చూద్దాం..
~
1. సంచిక అంతర్జాల మాస పత్రిక పక్షాన మీకు స్వాగతం ప్రొఫెసర్ ఆశాజ్యోతి గారు.
జ: నమస్తే డాక్టర్ గారూ ! ధన్యవాదాలు.
2. ఆశాజ్యోతి గారూ, మీ పేరులో ఏదో ప్రత్యేకత కనిపిస్తున్నది. మీ పేరు వెనుక ప్రత్యేకమైన చరిత్ర ఉంటే వివరించండి.
జ: ప్రత్యేక చరిత్ర కాదు కానీ డాక్టర్ గారూ, మేం నలుగురం పిల్లలం. ఇద్దరు అమ్మాయిలం, ఇద్దరు అబ్బాయిలు. క్రీస్తు జన్మదినం సందర్భంగా ఒక్కొక్క పద్య కవితా ఖండికను మేం పుట్టిన సందర్భంలో మాకు పెట్టాలనుకున్న పేర్లతో రాశారు నాన్న కొలకలూరి ఇనాక్. ఆ పద్య కవితా ఖండికలు – ఆశాజ్యోతి, శ్రీకిరణ్, మధు జ్యోతి, సుమ కిరణ్. మా నలుగురి పేర్లు వరుసగా అవే!
3. మీ విద్యాభ్యాసం ఎక్కడ ఎలా జరిగింది, చెబుతారా?
జ: అమ్మానాన్నల ఉద్యోగ రీత్యా అనంతపురంలో ఉండడంతో నలుగురం అనంతపురంలోనే పుట్టాం. నా ప్రాథమిక విద్య అనంతపురం చర్చ్ స్కూల్‌లో, ఎల్.ఆర్.జి ఇంగ్లిష్ మీడీయం స్కూళ్ళలో సాగింది. ఎనిమిదవ తరగతి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్, మదనపల్లిలోనూ, తొమ్మిదవ తరగతి పద్మావతి గర్ల్స్ హై స్కూల్, తిరుపతిలోనూ, పదవ తరగతి శారదా మునిసిపల్ హై స్కూల్ అనంతపురంలో సాగింది. ఇంటర్మీడియట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా శ్రీ సత్యసాయి కళాశాల, అనంతపురంలో సాగింది. పిహెచ్.డి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ‘ఆధునికాంధ్ర కవిత్వంలో జానపదేతివృత్తం’ అన్న అంశం మీద ఆచార్య యం.కె. దేవకి గారి వద్ద చేశాను. నా సిద్ధాంత గ్రంథానికి ‘తూమాటి దొణప్ప బంగారు పతకం’ (1990) లభించింది.
4. సాహిత్యం పట్ల మక్కువ ఎప్పుడు ఎలా ఏర్పడింది ? మీ మొదటి రచన ఏ ప్రక్రియలో ఎప్పుడు చేశారు?
జ: ఎం.ఏ.లో ఉండగా ఆల్ ఇండియా రేడియో, కడపకు ఒక కథ ‘ఉత్తరం ఎందుకు నీకు ఈ తత్తరం’ రాసి చదివాను. ఉత్తరం రాసి సమాధానం కోసం ఎదురు చూసే మనస్థితిని తెలిపే కథ. 1983లో ప్రసారమైంది.
5. మీది విద్యావేత్తల కుటుంబం అని అందరికీ తెలిసిందే. మరి వృత్తిగా తెలుగు బోధన ఎందుకు ఎంచుకోవలసి వచ్చింది? దీని వెనుక ఎవరి ప్రోత్సాహమైనా ఉందా? వివరించండి.
జ: నాన్న తెలుగు ఆచార్యులు. కవి, వ్యాసకర్త, నవలాకారుడు, కథకుడు. ఆయన రచనలు చూస్తూ పెరగడం, విషయం పట్ల ఒక పట్ల ఒక అవగాహనతో మాట్లాడడం, బోధనా ప్రాముఖ్యత అర్థం చేసుకోవడం వంటివి నాన్న నుండే అలవడ్డాయి. అమ్మ స్త్రీ శిశు సంక్షేమం శాఖలో ఆఫీసరు కావడం వల్ల అడ్మినిస్ట్రేషన్ పరంగా విధులు ఎలా నిర్వర్తించాలో అర్థమయ్యేది. బోధన నాన్నను చూసే అలవడింది. నాన్నకు ఆడపిల్లలు అధ్యాపక వృత్తిలో ఉండాలని బలంగా ఉండేది. అదే జరిగింది.
6. కర్ణాటకలో ఉన్నారు. ఆ భాషతో పరిచయం ఉందా?
జ: ఉంది. నాకు ఆంగ్లంతో పాటు కన్నడ, హిందీ, సంస్కృతం, రష్యన్ భాషలు తెలుసు. విద్యార్థినిగా ఉన్నప్పుడే ఈ కోర్సులను చేశాను. నేను పదవ తరగతిలో ఉండగా రష్యన్ భాష నేర్పిస్తున్నారని తెలుసుకుని నాన్న నన్ను చేర్పించారు. తరగతులు ఆయ్యాక సాయంకాలాలు, ఆదివారాలు రష్యన్ క్లాసులకు హాజరయ్యేదాన్ని. ఇతర భాషలన్నీ అలాగే నేర్చుకున్నాను. తమిళం నేర్చుకోకపోయినా మా వారు చిత్తూరు దగ్గర ఎన్.కోటూరు వాస్తవ్యులు కావడం, అత్తగారింట్లో అందరూ తమిళం మాట్లాడడం (తెలుగు వాళ్ళైనా, ఆ పల్లెలో అంతా తమిళం మాట్లాడతారు ఇళ్ళల్లో) వల్ల తమిళం తెలుసు.
7. వృత్తిపరంగా మీరు కర్ణాటకలో స్థిరపడడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా? వివరించండి.
జ: నేను పిహెచ్.డి చేస్తున్న సమయంలో బెంగళూరు విశ్వవిద్యలయంలో రీసెర్చి అసిస్టెంట్ పోస్ట్‌కు నోటిఫికేషన్ పడిందని అప్పటి తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య తంగిరాల సుబ్బరావు గారు తెలపడం, ఆ పోస్ట్‌కు అప్లై చేసుకోవడం, సెలక్ట్ కావడం వరుసగా జరిగి పోయాయి. కర్నాటకలో ఉద్యోగం రావాలంటే ఇతర భాషీయులకు తప్పకుండా కన్నడ భాష తెలిసి ఉండాలి. నేను పిహెచ్.డి చేస్తున్న సమయంలో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో కన్నడం, తమిళం సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశపెట్టారు. పరిశోధన చేస్తున్న సందర్భంలోనే కన్నడ సర్టిఫికెట్ కోర్సు చేసి యూనివర్సిటీలో మొదటి స్థానంలో నిలబడ్డాను. కన్నడ భాష తెలిసి ఉండడం వల్ల బెంగళూరు విశ్వవిద్యాలయంలో ఉద్యోగంలో చేరాను. పరిశోధన చేస్తున్నప్పుడే ఎపిపిఎస్సి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను. డిగ్రీ కాలేజి గుత్తిలో ఉద్యోగం వచ్చింది. ఐతే అప్పటికే బెంగళూరు విశ్వవిద్యాలయంలో చేరడంతో, ఆ ఉద్యోగంలో చేరలేదు. మైసూరు రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో లెక్చరర్‌గా ఢిల్లీలో సెలెక్ట్ అయ్యి ఒక సంవత్సరం పని చేసి, తిరిగి మళ్ళీ బెంగళూరు విశ్వవిద్యాలయంలో చేరాను. 36 ఏళ్ళుగా ఈ విశ్వ విద్యాలయంలో అధ్యయన, అధ్యాపక, పరిశోధన, తులనాత్మక రంగాలలో కృషి చేస్తూ ఉన్నాను.
8. కర్నాటకలో తెలుగు మాట్లాడేవారి శాతం ఎంత వరకు ఉంది?
జ: కన్నడిగుల తరువాత తెలుగు మాట్లాడే ప్రజలు 14% ఉన్నారు.
9. విశ్వవిద్యాలయ స్థాయిలో తెలుగు చదువుకునే వారి సంఖ్య ఆశాజనకంగా ఉందని మీరు భావిస్తున్నారా? ఎందుచేత?
జ: అసలు సమస్య ఇక్కడే ఉంది. విద్యార్థులు చదవడానికి, చేరడానికి ఉన్నారు. సుమారు 2010 వరకు విశ్వవిద్యాలయంలో ఎస్సి, ఎస్టి విద్యార్థులకు హాస్టల్‌లో ఫ్రీ సీటు, ఎం.ఏ అడ్మిషన్ ఫీజు నానుమాత్రంగా ఉండేది. తరువాత ఎస్సి, ఎస్టీ విద్యార్థులను జనరల్ విద్యార్థులుగా ప్రకటించడంతో అందరూ ఫీజు కట్టి చేరవలసి రావడం, హాస్టల్‌లో ఉచిత సీటు కాస్తా పేమెంట్ సీటు కావడంతో దళిత, బహుజన విద్యార్థులు ఫీజు కట్టలేక పోవడంతో తెలుగు అధ్యయన శాఖ ఆ బాధ్యత తీసుకుని విద్యార్థులను చదివిస్తోంది. చాలా మందిని చదివించే ఆర్థిక స్థితి శాఖకు లేకపోవడంతో ఎక్కువ మందిని చదివించలేక పోతోంది. ఈ కారణం చేత విద్యార్థులు చేరడంలో అవరోధం ఏర్పడుతోంది.
10. మీరు పని చేస్తున్న విశ్వవిద్యాలయంలో ‘తెలుగు శాఖ’ ఆ రాష్ట్ర విద్యార్థులకేనా? ఇతరులకు కూడా అవకాశం ఉంటుందా?
జ: మాకు ఎక్కువగా విద్యార్థులు ఆంధ్ర, తమిళనాడులోని హొసూరు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వస్తారు. గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ నుండి కూడా వస్తున్నారు. కర్ణాటకలో ఉన్న తెలుగు విద్యార్థులు మా శాఖలో చేరడం తక్కువ. ఇతర కోర్సులలో చేరతారు.
11. మీ శాఖలో పరిశోధక విద్యార్థులు ఉన్నారా?
జ: ఉన్నారు. ప్రస్తుతం సుమారు 16 మంది పరిశోధన చేస్తున్నారు.
12. అనువాద ప్రక్రియ మీద మీ అభిప్రాయం చెప్పండి.
జ: అనువాదం సృజనకు అనుసృజన. సృజనాత్మక రచనలో కవికి/రచయితకు స్వేచ్ఛ ఉంటుంది. పరిమితులు ఉండవు. ఆకాశమే హద్దు అభివ్యక్తికి. కథైనా, కవితైనా, నవలైనా రచయిత చెప్పినట్టు నడుస్తాయి. పాత్రను స్వేచ్ఛగా సాగుతుంది. వస్తువును విస్తారంగానో, సంక్షిప్తంగానో చెప్పగలగడం రచయిత నిర్ణయం. అనువాదకుడికి ఎటువంటి స్వేచ్ఛా ఉండదు. రచయిత వస్తువు, హృదయం దెబ్బ తినకుండా రాయగలగడం కత్తి మీద సాము వంటిది. సృజన కంటే అనుసృజన కఠినతరమైన పని.
13. మీకు ఇష్టమైన ప్రక్రియ ఏది? మీరు గ్రంథస్థం చేసిన మీ రచనల గురించి వివరించండి
జ: సాహిత్యంలో అన్ని ప్రక్రియలూ ఇష్టం. దేని ప్రత్యేకత దానిదే. అనువాద క్షేత్రంలో కృషి చేశాను. వివిధ జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో చదివిన పరిశోధనా పత్రాలు ‘సాహిత్య సమాలోచన’, ‘ఆశాజ్యోతీయం’ గానూ ముద్రితమయ్యాయి. మరొక వ్యాస సంకలనం ఈ సంవత్సరం రాబోతూ ఉంది. సాహిత్య అకాడెమీకి కన్నడం నుండి గీతానాగభూషణ రాసిన ‘బదుకు’ నవలను ‘బతుకు్’ గానూ, రాఘవేంద్ర పాటీల రాసిన ‘తేరు’ నవలను ‘తేరు’ గానూ అనువదించాను. సాహిత్య అకాడెమీ ప్రచురించింది. సమతా దేశమానె రాసిన తొలి కన్నడ దళిత మహిళ ఆత్మకథ ‘మాతంగి దివిటిగె’ను ‘మాతంగి దివిటీ’ గా అనువదించాను. ఈ అనువాదాన్ని కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం ప్రచురించింది. బైబిల్ సొసైటీకి బైబిల్ కథలు, బసవ సమితికి కన్నడ ‘వచనాల’ను అనువదించాను. నాడహళ్ళి శ్రీపాదరావు రాసిన ‘చరణ పల్లవి’ నవల అనువదించాను. నా సిద్ధాంత గ్రంథం ‘ఆధునికాంధ్ర కవిత్వంలో జానపదేతివృత్తం’ ముద్రించాను. జానపద సాహిత్య అధ్యయనంలో భాగంగా చిత్తూరు జిల్లా జానపద గేయాలను సేకరించి ‘పల్లె పాటలు’ గా పుస్తకం తెచ్చాను. కందుకూరి వీరేశలింగం గురించి నేను చేసిన ఉపన్యాసం ‘కందుకూరి వీరేశలింగం సమకాలీన సమాజం’ పేరుతో ప్రజాశక్తి, విజయవాడ ముద్రించింది. అదే పుస్తకాన్ని శ్రీమతి పారనంది నిర్మల గారు హిందీలోకి ‘కందుకూరి వీరేశలింగం ఔర్ సమకాలీన్ సమాజ్’ పేరుతో అనువదించారు. సాహిత్య అకాడమీ ముద్రించిన జైన సాహిత్యానికి సంబంధించిన ‘నడ్డారాధనె’ కథలను ఇతర అనువాదకులతో కలిసి అనువదించాను.
14. విశ్వవిద్యాలయ స్థాయిలో అనువాదం ఎలా ఉంది?
జ: కొన్ని విశ్వవిద్యాలయాలలో అనువాద శాఖలు ఉన్నాయి. హైదరాబాదు విశ్వవిద్యాలయంలో అనువాద విభాగం ఉంది. మరిన్ని అనువాద శాఖలు రావాలి. భిన్న భాషల సాహిత్యాన్ని అవగాహన చేసుకోవడం సామాజిక అవసరం. ప్రపంచీకరణ నేపథ్యంలో భూగోళం కుగ్రామమైన సందర్భంలో ఉన్నాం. ఇప్పుడు పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాలలో భిన్న భాషలను నేర్చుకోవడానికి దారులు ఏర్పరుస్తున్నారు. ఇది మంచి పరిణామం.
15. విశ్వవిద్యాలయ స్థాయిలో మీ సాహిత్య కృషి ఎలా సాగింది?
జ: ప్రవాసేతర రాష్ట్రంలో ఉన్న తెలుగు శాఖ కనుక, నేను శాఖాధ్యక్షురాలినైన తర్వాత నిర్వహించిన జాతీయ, అంతర్జాల సదస్సులన్నీ తులనాత్మక కోణంలో సాగాయి. ‘దాక్షిణాత్య భాషా సాహిత్యాలు’ (2015) ‘తెలుగు – కన్నడ శైన సాహిత్యం (2016), ‘తెలుగు-కన్నడ బహుజనవాద సాహిత్యం’ (2018), ‘తెలుగు – కన్నడ పత్రికలు – సాహిత్య కృషి’ (2019) ‘తెలుగు – కన్నడ కథలు – ప్రపంచీకరణ ప్రభావం’ (2017) వంటి సదస్సులకు తెలుగు – కన్నడ సాహితీ ప్రముఖులు ఉపన్యాసకులుగా హాజరై తమ సాహిత్య, పరిశోధనాత్మక ఆలోచనలను ఆలోచనలను విద్యార్థి లోకానికి అందించారు. కరోనా సమయంలో నిర్వహించిన అంతర్జాల సదస్సులలోనూ (2020 జూలై, ఐదు రోజులు నరుసగా), ‘అత్యాధునిక తెలుగు సాహిత్యం – వస్తు, రూప పరిణామాలు’ వరుసగా మూడు రోజుల సదస్సులు (జనవరి 2021) నెచ్చెలి, అంతర్జాల పత్రిక, కాలిఫోర్నియా తెలుగు శాఖ సంయుక్తంగా నిర్వహించిన సందర్భంగా వివిధ సాహిత్యాంశాల పై ప్రముఖులు ఉపన్యసించారు.
16. అంతర్జాతీయ సదస్సులకు హాజరయ్యారా?
జ: అవును. వివిధ అంతర్జాతీయ సదస్సులకు హాజరయ్యాను. మా వారు ప్రొఫెసర్, డైరెక్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ అధ్యయన విభాగం, బెంగళూరు విశ్వవిద్యాలయం. వారితో పాటు అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని జాతీయ, అంతర్జాతీయ విషయాలు, సాహిత్యేతర విషయాలు తెలుసుకోగలిగాను. అందులో భాగంగా జర్మనీ, అమెరికా, శ్రీలంక, దుబాయ్, అబుదబి, మాల్దీవ్స్, టాంజానియా, జాంజీబార్ ఐలాండ్స్, ఫ్రాన్స్, ఇటలీ, వాటికన్ సిటీ స్వీడన్, డెన్మార్క్, గ్రీస్ దేశాలు సందర్శించగలిగాను. గ్రీసు దేశంలో ఇజ్రాయెల్ దేశం అధ్యక్షులు (2006 – 2008) శ్రీ ఇహుద్ ఓల్మెర్ట్ తో మాట్లాడడం, ఫోటో దిగడం ఒక నుంచి జ్ఞాపకం. ప్రపంచ దేశాలు చూడడం మానసిక, శారీరక చైతన్యానికి దోహదం చేస్తాయి. సంకుచితమైన ఆలోచనలు విశాలతరం అవుతాయి. భిన్న సంస్కృతులు అవగతమవుతాయి.
17. మీ సృజనాత్మక రచనలు ఉన్నాయా?
జ: కవిత్వం అడపాదడపా రాసాను. మనోఫలకంలో ఒక కదలిక వచ్చినప్పుడు అది కవితై సీతాకోక చిలుకలా రెక్కలార్పుతుంది. ఉద్వేగం ఊపిరి సలపనివ్వనప్పుడు అక్షరాలు దారులేర్పరిచి కవితా పంక్తులై ఒదిగాయి. నా కవితలను పుస్తకంగా తేవాలనుకుంటున్నాను.
నా కవితలు ‘విస్మృత బాల్యం’ కవిత ఓలేటి పురస్కారం (2006), ‘నీ గర్భాశయంలో చోటివ్వు’ కవిత వేకువ కవితా పురస్కారం (2011), ‘పొట్టు పొయ్యి’ కవిత జాతీయ స్థాయిలో మొదటి స్థానం సిపిఎం వారు నిర్వహించిన కవితల పోటీలో (2015) నిలిచి పురస్కారాలు పొందాయి. ప్రజాశక్తి వారు ‘పొట్టు పొయ్యి’ పేరుతో సుమారు 80 కవితలను ప్రచురించారు. ఆ సంకలనానికి ఆచార్య మేడిపల్లి రవికుమార్ రాసిన ‘కులం పొయ్యిలో పొట్టు కూరుస్తున్న కవిలోకం’ గుర్తుంచుకోదగింది.
18. తెలుగు శాఖాధ్యక్షులుగా, ఆచార్యులుగా మీ కార్య నిర్వహణ గురించి చెప్పగలరా?
జ: కర్ణాటకలో గత 15 ఏళ్ళుగా డిగ్రీ స్థాయిలో విద్యార్థుల పాఠ్య ప్రణాళిక రచన, ప్రశ్నా పత్రం రూపొందించడం వంటి బాధ్యతలు నిర్వహిస్తున్నాను. B.A., B.Sc., B.Com., B.C.A., కోర్సులకు పాఠ్య ప్రణాళిక రూపొందించాను. Bangalore University, Bengaluru North University, Bengaluru City University – Board of Studies & Board of Examiner Committee Chairman గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. అలాగే Board of Studies, TELUGU – PG – BUB, Board of Examiners, TELUGU PG BUB Chairman గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. BUB-Chairman ఎంతో ప్రతిష్ఠాత్మకమైన NAAC: Peer Committee Member – Coordinator గా బాధ్యతలు 2019 నుండి, UGC – Paper Setting Committee: JRF/NET/Asst. Professor: from – 2006 నుండి ఇప్పటి దాకా, Chief Custodian : DCC & DE – PG Annual Scheme Exams, Bangalore University, Bengaluru – 2016, 2017, 2018 & 2019, గానూ, Chairperson : Indian Languages and Global Languages, State Level Committee – Implementation of NEP 2020 – Subject wise Expert Committee to draft MODEL CURRICULUM Contents for FOUR years UG Integrated Course. – 2021 గానూ, Deputy Examiner Responsible: (TELUGU) International Baccalaureate, Cardiff, London, United Kingdom – from: 2018, Principal Examiner: (TELUGU) 2022 – గానూ చేస్తున్నాను. బెంగళూరులో సుమారు 50 కళాశాలలో గవర్నింగ్ కౌన్బిల్ మెంబర్‌గా ఉన్నాను. LIC (Local Inquiry Committee) member గా బెంగళూరు విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్న కళాశాలలను పర్యవేక్షించాను. ఎన్నో విశ్వవిద్యాలయాలలో Board of Studies & Board of Examiner Committee గా ఉన్నాను. Berhampur University, D.Litt committee Chairman గా ఉన్నాను. Mauritius University, Board of Studies & Board of Examiner Committee member గా ఉన్నాను. Professor, Associate Professor, Asst. Professors selection Board Chairman గా ఉన్నాను.
19. కర్ణాటకలో తెలుగు కళాశాల స్థాయిలో ఎలా ఉంది?
జ: డిగ్రీ స్థాయిలో విద్యార్థులు బాగానే చేరుతారు. ఐతే తెలుగుకు బోధనా సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు ఇతర భాషలకు వెళుతున్నారు. తెలుగు అన్ని స్థాయిల్లోనూ ప్రమాదకర స్థితిలో ఉంది.
20. మీరు అందుకున్న అవార్డులు వివరిస్తారా ?
జ: నేను అందుకున్న అవార్డుల వివరాలివి:
1. ఆచార్య తూమాటి దొణప్ప బంగారు పతకం – ఆధునికాంధ్ర కవిత్వంలో జానపదేతివృత్తం | 1990 |
2. నేతాజి ప్రశస్తి | 2005 |
3. విస్మృత బాల్యం – ఓలేటి పురస్కారం | 2009 |
4. నీ గర్భాశయంలో చోటివ్వు వేకువ కవితా పురస్కారం | 2011 |
5. పొట్టు పొయ్యి – సిపిఎమ్. జాతీయ స్థాయి కవితా పురస్కారం | 2015 |
6. DISTINGUISHED FACULTY IN LANGUAGE STUDIES (Specialisation – Telugu) award from Venus International Foundation at Green Park, Chennai | 8.07.2017
|
7. ఆశాజ్యోతీయం – జానుమద్ది హనుమచ్చాస్త్రి, పురస్కారం | 10.12.2017 |
8. SAHITYA RATNA award from Universal Peace Cross, Chittoor | 10.3.2016 |
9.”Literate of the Year” award from Universal Peace Cross, Chittoor | 10.3.2017 |
10. మాడభూషి సాహిత్య పురస్కారం | 2022 |
11. నల్లూరి రాజ్యలక్ష్మి స్మారక ప్రతిభా పురస్కారం – నరసం, నెల్లూరు | 2023 |
21. మీకున్న అంతర్జాతీయ గుర్తింపును తెలపండి
జ: నా బయో-డేటా అంతర్జాతీయ వాల్యూంలలో అచ్చైంది. ఆ లోని ఇంటర్నేషనల్ బకొలొరేట్ సంస్థ, లండన్ వారు నన్ను కారణంగానే నాకు లండన్ తెలుగు భాషకు ప్రిన్సిపల్ ఎగ్జామినర్ గా తీసుకోవడానికి దారులేర్పరచింది. కింది వివరాలు నా బయో-డేటాను ముద్రించిన వివిధ అంతర్జాతీయ వాల్యూంలు.
1. Asia – Pacific WHO’S WHO XIV edition 2016 recognized me as one among the influential personalities and published my Biography. |
2. LEARNED INDIA – Educationists WHO’S WHO III edition 2017 published my biography.
3. EMERALD WHO’S WHO IN ASIA – Vol III – 2017 published my Biography along with 504 personalities in 2017. |
4. ASIAN AMERICAN WHO’S WHO – Vol VIII published my Biography along with 416 capsule profiles. |
5. ASIAN ADMIRABLE ACHIEVERS – Vol X – 2018 published my Biography along with 1250 eminent personalities of Asia |
6. BIOGRAPHY INDIA – 2021, published my biography for the year 2021. |
7. BIOGRAPHY INDIA – 2022, published my biography for the year 2022. |
1. Biography India – 2024 , published my biography for the year 2024. |
22. మీ సమయాన్ని వెచ్చించి మీ గురించి తెలిపినందుకు ధన్యవాదాలు.
జ: డాక్టర్ గారూ! నాకు ఈ అవకాశం ఇచ్చి, ‘సంచిక’ పాఠకులకు నన్ను పరిచయం చేసినందుకు మీకు మనఃపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే! సెలవ్!
~