తందనాలు-26

0
3

[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]

251
బ్రతికున్నంత వరకు మనసుకు బాధే
అత్యాశ, ఆవేశ, కావేశాలతో
శత విధాల నిర్మలంగా వుంచుకోవాలి
అంతే జీవితం సుఖమయమౌతుంది

252
మనసే కారణం జీవితం ఒడిదుడుకులకు
ఎన్నడూ ఆవేశ, కావేశాలు కూడదు
కనుక అదుపులో ఉంచాలి
చిన్ననాటి నుండే అలవడాలి

253
దాన ధర్మాల అగత్యం?
పనులు లేక బీదవారైనందుకా?
పనులు కల్పించాల్సిన ప్రభుత్వ ఉదాసీనతా?
అన్నీ కలిపి బీదవారుగా మారటమా?

254
కొందరు ప్రజల సొమ్ము స్వాహా చేయటానికే పుట్టారేమో
మందభాగ్యులైన వారిని మోసం చేయటం
ముందంజలో వుంటారు కొందరు
అందరూ మోసపోరు

255
పేరు మార్చుకున్నంత మాత్రాన
వీరులై పోతారా, భాగ్యవంతులు ఔతారా?
కోరిన కోరికలన్నీ తీరుతాయా?
తీరని సమస్యలన్నీ సమసిపోతాయా?

256
రుద్రాక్షతో శుభాలు?
క్షుద్ర పూజలతో ఆరోగ్య సమస్యలు తీరేనా?
భద్రకాళీ పూజలతో శక్తి లభించేనా?
వేద మంత్రాల పూజలతో సమస్యలన్నీ తీరేనా?

257
ఆకాశమంత మనసు ఇరుక్కుపోయింది తలలో
లోకమంతా సంచరించు
ఏకాగ్రత వుండనే ఉండదు
చక చకా ఆలోచించు, నిర్ణయం ఆలస్యమే

258
ద్రాక్ష గుత్తుల్లాంటి ఊపిరితిత్తులు
దీక్ష బూని జీవాన్ని రక్షించు
లక్ష సార్లైనా పనికి విసుగు చెందవు
లక్ష్యంతో పని చేసి రక్తాన్నిశుద్ధి చేయు

259
కన్ను యెంత చిన్నదైనా రెప్పల్లోనే
దాని చూపు మాత్రం సుదూరమే
కనే దృశ్యాలన్నిటిని మెదడుకు అందజేస్తుంది
తాను మాత్రం దేన్నీ గుర్తుంచుకోదు

260
అన్నీ తనలోనే ఇముడ్చుకున్న తల
కొన్నైనా చేయగలదని ధీమా
కన్ను కొన్ని వైపులు చూచుటకు సహకరిస్తుంది
దేని విశిష్టత దానిదే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here