[box type=’note’ fontsize=’16’] తల్లి పిట్టకున్నంత మమత నీకు లేకపోయిందని బిడ్డను చెత్తకుప్పలో పారేసిన ఓ తల్లిని ఉద్దేశించి అంటున్నారు సింగిడి రామారావు “వనితా ఏమైంది నీ మమత?” అనే కవితలో. [/box]
రెక్కలు సరిగ్గా రాని మైన గోర పక్షికూన
చెట్టుపై గూటినుంచి జారి క్రింద పడి
మా ఇంటిముందు గేటు క్రింద చేరి
కీచు…కీచు మని ఒకటే రోద…
కొంతదూరంలో కరెంటు తీగలపై కూర్చున్న
పెద్దగోర పిట్టలు గోల గోల గా ఆక్రందన
వాటిని చూస్తూ గేటు దరికి చేరిన నా తలపై
ఒకతన్ను తన్ని నా కూతురి జోలికి వెళ్తావా వెధవా
అన్నట్లు జాగ్రత్త చెప్పి ఎగిరిన తల్లి పక్షి
సీతమ్మవారిని ఎత్తుకెళ్తున్న రావణుని తలపై
తన్నిన జటాయువును తలపించింది
పక్షులలో ఉన్న ఈ మమకారం మనుషుల్లో
కరవయిందా !! జన్మించిన పసికందును
పాలిథిన్ సంచిలోవేసి నిర్ధాక్షిణ్యంగా పారవేసిన
వనితా ఏమైంది నీ మమత తల్లివి కాదా నీవు
కసాయిగా మారావా రాక్షసి అయినా తన శిశువును
రక్షించుకుంటుందే ఏమిటీ ఘోరం
పక్షిజాతికన్నా హీనమైందా మానవ జన్మ
ఓ వనితా మాతా మాతృమూర్తిగా త్యాగమూర్తిగా
భారతదేశ ఖ్యాతి నిలుపు నీచబుద్ధి మాను
గౌరవరాలివై వెలుగు వందే మాతరం