[శ్రీ గోపగాని రవీందర్ రచించిన ‘అజ్ఞానపు చెరసాల’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఆ[/dropcap]వరించిన దట్టమైన చీకటిని
లక్షల నక్షత్రాలు చీల్చినట్లుగా
ఇక్కట్లతో కుమిలిపోతున్న మనిషిని
ఉత్తేజాన్నిచ్చే కోట్ల కొలది అక్షరాలు
ఒక స్నేహితుని వలే పలకరిస్తున్నాయి
నిర్ణయాల డోలాయమానంలో చిక్కుకొని
నిన్ను నువ్వు శిక్షించుకున్నంత కాలం
ఒంటరితనమే ఆవరిస్తుంది..!
ఈ భూగోళం పైన
ప్రాణంతో తొణికిసలాడడమే ముఖ్యం
గ్లోబల్ మాయాజాలంలో కనుమరుగవుతున్న
అనుబంధాలకు ఊపిరి పోయడమే ముఖ్యం
ఎడతెగని జీవన ప్రయాణంలో
ఆదరించిన వారిని ఆదుకోవడమే ముఖ్యం
ఆశయ శిఖరాన్ని చేరుకోగలవని నమ్మిన
ఆప్తులకు అండదండలందించడమే ముఖ్యం
అమానవీయమైన రహదారిలో
పచ్చని చిగురులతో విస్తరించడమే ముఖ్యం..!
నడిచే దారి పాతదే కావచ్చు
నూతనత్వంతో ఆలోచనలు వికసిల్లాలి
నిత్యం కనిపించే దృశ్యాలన్నీ పాతవే కావచ్చు
ప్రతి దృశ్యమిచ్చే సందేశాన్ని అవగాహన చేసుకోవాలి
పదాలు వాక్యాలు వ్యాఖ్యానాలు పాతవే కావచ్చు
వాటి అర్థాలతోనే పొరపాట్లను సరిదిద్దుకోవాలి
మసక బారిన అద్దాలను మార్చుకోనంత కాలం
అజ్ఞానపు చెరసాలలో బందీవైపోతావు..!