పూచే పూల లోన-45

0
3

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[టాక్సీని ఎంగేజ్ చేసుకుని మాండోవి నది వైపు వెళ్తుంటాడు సుందర్. దారంతా విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది. రోడ్డు మీద చాలామంది పోలీసులు కనబడతారు. ఏమయిందని అడిగితే ఓ సినిమా హీరో గురించి అంటాడు డ్రైవర్. ఇంతలో చిత్ర ఫోన్ చేసి, జ్యోతిని డిశ్చార్జ్ చేస్తున్నారనీ, తాను తన ప్రొడ్యూసర్లకి చెప్పాననీ అంటుంది. జ్యోతి ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అవటానికి, మీ ప్రొడ్యూసర్‌కీ సంబంధమేంటని అడుగుతాడు సుందర్. తనకి ప్రొడ్యుసర్ ఏర్పాటు చేసిన గెస్టుహౌస్‍లో జ్యోతిని ఉంచవచ్చా అని అడిగాననీ, అందుకు వాళ్ళు ఒప్పుకోలేదని, మీ రిసార్ట్సుకే తీసుకువస్తున్నానని చెప్తుంది చిత్ర. తొందర పడొద్దనీ, తాను రిసార్ట్స్‌లో లేనని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు సుందర్. రోడ్డు మీద వస్తున్న గుంపు ఏవో బానర్లు పట్టుకుని వస్తుంటారు. బానర్ల మీద సమీర్ బొమ్మలుంటాయి, ‘సమీర్ నిర్దోషి, అరెస్ట్ చేయకండి’ అని రాసుంటుంది. సమీర్ సినీహీరో మాత్రమే కాదని, మొత్తం గోవాకే హీరో అని అంటాడు డ్రైవర్. సమీర్ చేసిన మంచి పనుల వల్ల ఊహల కందని ఎత్తుకు ఎదిగిపోయాడని, ఎన్నికలలో నిలబడితే సులువుగా గెలుస్తాడనీ, అందుకే కేసు పెట్టారని అంటాడు డైవర్. కొన్ని బ్యానర్లలో జోవాక్విమ్ కనబడితే, కావాలనే అతనెవరు అని డైవర్‍ని అడుగుతాడు సుందర్. జోవాక్విమ్ డఫోడిల్స్ ఆడిటోరియమ్ యజమాని అనీ. గొప్ప కళాకారుడనీ, సమీర్ కుడి భుజం అనీ చెప్తాడు డ్రైవర్. అతనికి చాలా విద్యలు తెలుసని అంటాడు. చిత్ర ఫోన్ చేస్తుంది. ఆమెతో ఏం మాట్లాడాలో తెలియక, ఆన్సర్ చేయడు. కొన్ని క్షణాల తర్వాత కార్వాల్లోకి ఫోన్ చేసి తనకో సాయం కావాలంటాడు. ఆర్డర్ చేయమని అంటాడు కార్వాల్లో. – ఇక చదవండి.]

[dropcap]కొ[/dropcap]ద్ది సేపటికి ట్రాఫిక్ క్లియర్ అయింది. ఈ డ్రైవర్ నన్ను చూసి నవ్వుతాడనుకున్నాను. అలా జరగలేదు. ఎవరికో హాయ్ చెప్పి బండి స్టార్ట్ చేసాడు. ఓ అరగంట తరువాత ఆస్పత్రి ముందరున్నాం. ఆస్పత్రి ఎదురుకుండా ఉన్న చెట్లకు కూడా ఫ్లెక్సీలు తగిలించి ఉన్నాయి. వాటి మీద సమీర్ రకరకాల పోజుల్లో కనిపిస్తున్నాడు. ఆస్పత్రిలో కూడా ఎందుకో పోలీసులు ఎక్కువగా కనిపిస్తున్నారు. కొంపదీసి నా కోసం వచ్చారా? నిజమే. ఎందుకు కాకూడదూ? కానీ అదే నిజమైతే సూటిగా రిసార్ట్స్‌కు రాగలరు.

“ఫోన్ ఎత్తకుండా చంపేస్తారు కదండీ? మీ కోసం ఎప్పటి నుండి చూస్తున్నానో..” చిత్ర గొంతు వినిపించింది. ఈ సారి డ్రైవర్ నవ్వాడు.

“నువ్వు పార్క్ చేస్కో” అన్నాను.

అతను వెళ్లిపోయాడు. చిత్ర చేతిలో ఏవో పండ్లు, మందులు తీసుకుని నిలబడి ఉంది.

“డిశ్చార్జ్ చేసారా?” అడిగాను.

“ఎప్పుడో. ఇంకాస్త ఆలస్యం అయితే కాంపౌండ్ వాల్ బయటకు తెచ్చి దింపేలా ఉన్నారు. ఏంటీ ఈ ఆలస్యం?”

“ఈ పోస్టర్లు చూస్తున్నావు కదా!?”

కళ్లు పెద్దవి చేసి మెల్లగా అడిగింది.

“ఓ! అవి అంటిస్తున్నారా?”

ఈ అమ్మాయిలో ఇదే అర్థం కానిది. క్షణంలో కొంపలంటుకున్నట్లు అరుస్తుంది, క్షణంలో కామెడీలోకి వచ్చేస్తుంది. పేరుకు తగ్గట్లు చిత్రమైనదే.

“అవును మరి” అంటూనే లోపలికి నడిచాను.

“పోస్టర్లు జాగ్రత్తగా చూసాను”, చెప్పింది.

“ఎందుకని?”

“మీరు కూడా వాటిల్లో ఉంటారేమోనని!”

“సినిమాల్లో నటించాలనే కోరిక నాకు లేదు.”

“అబ్బో! అందుకు కాదు. మిమ్మన్ని కూడా లోపలికి పంపుతారేమోనని ఆలోచించాను.”

“ఆశలకు అంతుండాలి.”

“ఇంతకీ జ్యోతిని ఎక్కడికి తీసుకెళుతున్నాం?”

“నాకేం తెలుసు?”

ఆగిపోయింది చిత్ర.

“జోకా?”

“కాదు. నాకేంటి సంబంధం?”

“ఇదెక్కడి గోలండీ? నేను చెప్పాను కదా? మా ప్రొడ్యూసర్లు ఒప్పుకోలేదని!”

“కావచ్చు. రిసార్ట్స్‌కి తీసుకెళ్లలేను కదా?”

అక్కడ దగ్గరలో వున్న కూర్చీ చూసుకుని తల పట్టుకుంది. కోపంగా చూసింది.

“మీరేదో నాకు హీరో అనుకున్నాను.”

“అనుకోవటం ఏంటి? నేను హీరోనే..”

“పనికిమాలిన హీరో”, చిరాకుగా అంది. అటుగా వెళుతున్న నర్స్ చక్కగా, చిక్కగా చిరునవ్వు నవ్వి వెళ్లిపోయింది.

ఫోన్ మ్రోగింది. కార్వాల్లో.. వచ్చేసినట్లున్నాడు.

“సార్, నేను గేటు దగ్గర ఉన్నాను. అన్నీ రెడీ చేసాను. లోపలికి రమ్మంటే వస్తాను. స్ట్రెచరా లేక వీల్ చెయిరా? నేను పట్టుకోవాలా?”

“ఏమి అక్కరలేదు. అక్కడ ఉండండి. మేమే వచ్చేస్తాము!”

అతను ఫోన్ పెట్టేసాడు.

“జ్యోతి ఎక్కడ?” అడిగాను.

“ఇంతకీ ఎక్కడికి వెళ్లాలి?”, చిత్ర అడిగింది.

“కార్వాల్లో వచ్చాడు, కారు తీసుకుని.”

“ఇప్పుడు ఈయనెవరండీ?”

“చెబుతాను పద!”

ఇద్దరం వార్డ్ లోకి నడిచాం.

ఎందుకో అనుమానం వచ్చి ఆగాను.

“అవునూ, ఇంతకీ జ్యోతి పరిస్థితి ఎలా ఉంది? మాట్లాడుతోందా?”

“అంతగా లేదు.”

“నేను ఎదురుగా వెళ్ళచ్చా?”

చిత్ర అగిపోయింది.

“నిజమే..” చెప్పింది, “..ఓ పని చేద్దాం. మీరు కారు దగ్గర ఉండండి. ఇక్కడ ఏదో గొడవ పడటం అంత మంచిది కాదు” అంటూ గబగబా వెళ్లిపోయింది.

నేను మెల్లగా ఆస్పత్రి బయటకొచ్చాను. కార్వాల్లో దగ్గరకెళ్లి ఆగాను.

కొద్ది సేపటికి చిత్ర జ్యోతిని మెల్లగా నడిపించుకుంటూ వస్తూ కనిపించింది. వాళ్ల వెనుక ఇద్దరు పోలీసులు ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఈ అమ్మాయి నన్ను చూసి ఏమంటుందో చూడాలి. జ్యోతి తన హండ్ బ్యాగ్‍ను కండక్టర్ లాగా ముందర వైపుకు వ్రేలాడ దీసుకుని ఉంది. ఇద్దరూ కాంపౌండ్ లోంచి బయటకొచ్చారు. పరిస్థితి మాములుగానే అన్నట్లుంది. కార్వాల్లో ఎంతో మర్యాదగా చేతులు కట్టుకుని చూస్తున్నాడు. గేటు బయటకొచ్చారు. చిత్ర అటూ ఇటూ చూసి రోడ్డకు ఇవతల ఉన్న మమ్మల్ని చూసి జ్యోతిని గట్టిగా పట్టుకుంది. ఇద్దరూ మెల్లగా రోడ్డు దాటారు. జ్యోతి నన్ను చూసి చిరునవ్వు నవ్వింది.

“ఎలా ఉన్నావు జ్యోతీ?” అడిగాను. ఆలోచిస్తున్నట్లు మొహం పెట్టింది. వెనక్కు తిరిగి ఆస్పత్రిని ఒకలాగా చూసింది. చెదిరి ఉన్న జుట్టును ముందరికి తెచ్చుకుంది.

“ఎలా ఉన్నాను?” అడిగింది.

అనవసరంగా కదిలించానా అనుకున్నాను.

“బాగానే కనిపిస్తున్నావు” అన్నాను.

“మనం ఎక్కడికి వెళుతున్నాం?” అడిగింది.

“గెస్ట్ హౌస్.”

“మీదా?”

“కాదు.”

“మరి?”

“నా మిత్రుడిది. బావుంటుంది.”

“అక్కడికి వెళ్దామా?”

“ఎక్కడికి?”

“అక్కడికి.”

చిత్ర వైపు చూసాను. ఆమెకీ ఏమీ అర్థం కాలేదు.

“ఎక్కడికి జ్యోతీ?” అడిగింది.

“జోవాక్విమ్ తీసుకెళ్లిన భవనం.”

అందరి గుండెల్లో రాయి పడింది.

“అది మూసేసారు జ్యోతీ. తెరచినప్పుడు వెళదాం” అన్నాను.

“అతనేడీ?”

“ఎవరు?”

“జో.”

“అతను వెళ్లిపోయాడు.. వాళ్ల ఆడిటోరియంకి”, అన్నాను.

“ఓకే. అతను బ్రతికే ఉన్నాడు కదా?”

చిత్ర జ్యోతిని గట్టిగా పట్టుకుంది.

“జ్యోతీ.. బాగానే ఉన్నాడు. నీకెందుకు సందేహం? దా.. కారెక్కు.”

కార్వాల్లో కారు డోర్ తెరచి పట్టుకున్నాడు.

మెల్లగా లోపలికెళ్లి కూర్చుంది. చిత్ర అటునుండి ఎక్కి కూర్చుంది. డోర్స్ పడిపోయాయి. నేను నా డ్రైవర్‌ని ఫోన్‌లో పిలిచాను. ఇప్పటి వరకూ గేటు దగ్గర ఉన్న పోలీసులు రోడ్డు దాటి మా దగ్గరకొచ్చారు.

కారు నంబరు ఫొటో తీసుకున్నారు.

“ఎందుకు అలా చేస్తున్నారు?” అడిగాను.

“మీ పేరు?” అడిగాడు ఒకడు.

“సుందర్.”

“ట్రీట్‌మెంట్ అయిపోయిందా?”

“లోపలున్న అమ్మాయిని ఇప్పుడే డిశ్చార్జ్ చేశారు.”

“ఏంటి జబ్బు?”

“డిప్రెషన్.”

“ఇప్పుడు బాగుందా?”

“బాగానే ఉంది. రెస్ట్ తీస్కోవాలి.”

“ఎక్కడి కెళుతున్నారు?”

“మధుకర్ గవడే గారున్న చోటకి.”

“అక్కడికెందుకు?”

“ఇప్పటికిప్పుడు వాళ్ల ఊరు వెళ్లటానికి లేదు. అందుకని.”

“ఊఁ, ..జోవాక్విమ్ మీకు తెలుసా?”

“తెలుసు”

“ఎలా తెలుసు?”

“ఆడిటోరియంలో పరిచయమయ్యాడు.”

“ఎంత కాలంగా తెలుసు?”

“వారం పది రోజులు. అంతే.”

“ఇప్పడు జైల్లో ఉన్నాడన్న సంగతి తెలుసా?”

“తెలుసు”

“మిమ్మల్ని కలవాలంటున్నాడు.”

“ఎందుకు?”

“అక్కడికి వెళ్లాక మీరే తెలుసుకోండి.”

“అంటే నన్నూ ఆరెస్ట్ చేస్తారా?”

“నో.. నో..”, నవ్వాడు. “మీ నంబరు మా దగ్గరుంది. కానీ మేమే చెయ్యలేదు.”

“ఎందుకని?”

“ఆస్పత్రిలో బిజీగా ఉంటారని అతనే చెప్పాడు.”

“ఓ, థాంక్యూ.”

“సర్లెండి. వీలున్నప్పుడు ఒక్కసారి స్టేషన్‍కి రండి.”

“అలాగే.”

మా కారు వచ్చి ఆగింది. పోలీసులు రోడ్డు దాటుతూండగా తలుపు తీసుకుని జ్యోతి ఇవతలికి వచ్చింది. ఆ స్పీడ్ చూస్తే కళ్లు తిరిగాయి.

“హలో..”

పోలీసులు ఇటు తిరిగారు.

“జో ఎలా ఉన్నాడు?”

ఇద్దరూ ఒకళ్ల మొహాలొకళ్ళు చూసుకున్నారు.

జ్యోతి ఆయాసపడుతూ తిరిగి కార్లోకి వెళ్ళి కూర్చుంది. కిటికీ లోంచి గట్టిగా అరచింది,

“చంపేస్తారు కదూ?”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here