[తాతా కామేశ్వరి గారు రచించిన ‘నీదే విజయం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]సు[/dropcap]ధీర్, కమల్ ఒకే ఆఫీసులో గత ఇరవయి ఏళ్ళుగా పని చేస్తున్నారు. కమల్ మంచివాడే కానీ ఛాన్స్ దొరికుతే స్వంత డబ్బా వాయించకుండా ఉండలేడు. సుధీర్ ఆనాడు ఆఫీసులో లంచ్ ముగిస్తూ ఉండగా కమల్ వచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని కాసేపు ఇతర సంగతులు మాట్లాడి, చివరికి అడగాలనుకున్నది అడిగేశాడు.
“ఏం సుధీర్, ఈ ఏడాది మీ వాడు బోర్డ్ పరీక్ష రాస్తున్నాడు కదా, ప్రిపరేషన్ ఎలా సాగుతోంది? తెలుసుగా, గత ఏడాది మా కాశ్యప్ స్కూల్ టాపర్ అయ్యాడు. మీ వాడు కూడా మావాడిలా స్కూల్ టాపర్ అవ్వాలి. కావాలంటే ఇంకో రెండు ట్యూషన్స్ పెట్టు. మన పిల్లలు స్కూలుకే కాక మన ఆఫీసులో కూడా మన పేరు నిలబెట్టాలి సుమా” అన్నాడు ఓ వెకిలి నవ్వు నవ్వుతూ.
ఈ మాటలు విన్న సుధీర్‌కి చిరాకుతోపాటు మనసులో చెప్పలేని ఆందోళన మొదలైయింది. రాజా తెలివైనవాడు, ఇప్పటివరకు బాగా చదువుతూ ఎప్పుడూ క్లాస్ ఫస్టే అవుతున్నాడు. కానీ తను ఆఫీస్ పనులతో బిజీగా ఉండడంతో భార్య దేవియే ఇంటి పని, పిల్లల చదువు అన్నీ చూసుకుంటుంది. కానీ ఇవాళ కమల్ అన్న మాటలతో ఇంటికి వెళ్లి రాజా చదువు విషయం అడిగి తెలుసుకోవాలని అనుకున్నాడు.
సుధీర్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి, రూములో చదువుకుంటున్న రాజాని పిలిచాడు.
రాజా మెల్లగా రూములో నుండి రాగానే సుధీర్, అతని మొహం టెన్షన్‌గా, కళ్ళు యెర్రగా ఉండడం గమనించాడు.
రాజాని తన పక్కనే కూర్చోపెట్టుకుని ప్రేమగా “నాన్నా రాజా, ఎలా చదువుతున్నావు? సారీరా, ఆఫీస్ పనులలో మునిగి ఇన్నాళ్ళు నీ ఊసు పట్టించుకోలేదు. నీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా చెప్పు” అన్నాడు రాజా తల ప్రేమగా నిమురుతూ.
“బానే చదువుతున్నాను నాన్నా, నెక్స్ట్ వీక్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి” అని ముభావంగా తన రూములోకి వెళ్లిపోయాడు.
సుధీర్‌కి రాజా ప్రవర్తన కొంచం సహజంగా ఉన్నట్టు అనిపించలేదు. మునుపు తనతో ఓ ఫ్రెండులా అన్ని విషయాలు షేర్ చేసుకునే పిల్లాడు ఇలా ముభావంగా ఉండడం అతనిని ఆందోళనకి గురిచేసింది. రాత్రి భోజనం వద్ద కూడా రాజా సరిగ్గా తినకుండా తన రూముకి వెళ్లిపొయాడు.
రాత్రి భార్య దేవితో రాజా ఆలా ముభావంగా ఉన్న విషయం అడిగాడు.
దానికి ఆమె “అవునండి, ఈ మధ్యే కొన్ని రోజులుగా చూస్తున్నాను, రాజా చాలా టెన్షన్ పడుతున్నాడు. సరిగ్గా భోజనం చెయ్యటం లేదు, పడుకోవడం లేదు, కళ్లు యెర్రబడి ఉంటున్నాయి, ఏమి అడిగినా చెప్పటం లేదు. నేనే ఈ విషయం మీరు తీరికగా ఉన్నప్పుడు చెపుదాం అనుకున్నాను అండీ” అంది కొంచం బెంగగా.
భార్య మాటలు విన్న సుధీర్ “సరే దేవి, రేపు నేను ఆఫీస్ నుండి వచ్చి వాడిని అలా బయటకు తీసకెళ్ళి విషయం అడుగుతా” అని ధైర్యం చెప్పాడు.
మరునాడు సుధీర్ ఆఫీస్ నుండి వచ్చి రాజాని ఐస్ క్రీమ్ తిందాం అని బయటకి తీసుకోని వెళ్ళాడు.
పార్క్‌లో కూర్చుని ఐస్ క్రీమ్ తింటున్న రాజా వేపు చూస్తూ మెల్లగా అడిగాడు సుధీర్.
“రాజా, నేను నీ బెస్ట్ ఫ్రెండ్‌నే కదా?”
దానికి రాజా “అవును నాన్నా, యు అర్ మై బెస్ట్ ఫ్రెండ్” అన్నాడు.
“అయితే బెస్ట్ ఫ్రెండ్‌కి అన్ని విషయాలు చెపుతారు కదా? మరి నువ్వు నాకు నీ ప్రాబ్లెమ్ చెప్పటం లేదు ఎందుకు?” అని సుధీర్ అడగడంతో రాజా కొంత సేపు ఏమి మాట్లాడలేదు.
చివరికి కొంచం బొంగురు గొంతుతో “నాన్నా, నాకు బోర్డ్ ఎగ్జామ్స్‌లో కమల్ అంకుల్ కొడుకు కాశ్యప్‌లా మంచి మార్క్స్ రావేమో అని దిగులుగా ఉంది. నాకు తెలుసు మీకు నేను కూడా కాశ్యప్‌లా స్కూల్ ఫస్ట్ రావలన్న కోరిక ఉంది. లాస్ట్ ఇయర్ కాశ్యప్ రిజల్ట్స్ చూసి మీరు నన్ను కూడా ఆలా బాగా చదివి స్కూల్ టాప్ అవమన్నారు. ఆ రోజు నుండి నాకు టెన్షన్ మొదలైంది. నేను బాగానే చదువుతున్నాను కానీ మీ మాట నిలుపుకోలేనేమో అన్న ఒకే ఒక భయం. ఎప్పుడు టెన్షన్‌గా ఉంటుంది, సరిగ్గా నిద్ర పట్టడంలేదు, చదివిందంతా మరిచిపోతున్నా” అన్నాడు కంటతడి పెట్టుకుంటూ.
రాజా మాటలు విన్న సుధీర్ మనస్సు చివుక్కుమంది. తను ఎప్పుడో అన్న మాట రాజా మీద ఇంత ప్రభావం చూపిందని చాలా బాధ పడ్డాడు. ఆ పసి మనసులో మంచి మార్క్స్ తెచ్చుకొని నాన్న పేరు నిలపాలి అన్న మాట ముద్ర పడిపోయింది. అది ఎక్కడ చెయ్యలెనో అన్న దిగులు పాపం ఆ పసివాడిని ఒక పురుగులా తొలిచేస్తోంది.
సుధీర్‌కి ఏమి అనాలో అర్థం అవక ఇంటికి వచ్చి ఈ విషయం భార్యకు చెప్పాడు.
భార్యా, భర్త ఇద్దరు చాలా విధాలుగా రాజాకి బోధపర్చడానికి ప్రయత్నించారు కానీ రాజా పరిస్థితిలో పెద్ద మార్పు రాలేదు. చివరికి ఇద్దరు రాజాని ఓ కౌన్సిలర్ వద్దకి తీసుకెళ్లాలని నిర్ణయంచుకొని, దేవి స్నేహితురాలు సూచించిన సునీతగారి దగ్గరికి తీసుకొని వెళ్ళాలని ఆమె వద్ద వెంటనే అపాయింట్‌మెంట్ తీసుకున్నారు.
అపాయింట్‌మెంట్ నాడు సుధీర్ దంపతులు రాజాని ఆమె వద్దకు తీసుకొని వెళ్లారు. ఆమె కౌన్సిలింగ్ సెంటర్ ప్రకృతి వడిలో చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, పూల మొక్కలతో ప్రశాంతంగా ఉంది. కౌన్సిలర్ సునీతగారు రాజాతో ఏకాంతంగా మాట్లాడాలని అతనిని ఒక్కడినే రూములోకి పిలిచారు. రాజా ఆమెను విష్ చేసి కొంత ఇబ్బందిగా ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.
ఆమె రాజాని అతని ప్రాబ్లమ్స్ అడిగి తెలుసుకొని “సరే రాజా, ఒక సంగతి చెప్పు, మునుపు ఎప్పుడూ లేని భయం, బెంగ, టెన్షన్ నీకు ఇప్పుడు ఎందుకు కలుగుతోందో తెలుసా?”
దానికి తెలియదు అన్నట్టు తల ఊపాడు రాజా.
ఆమె “సరే నే చెపుతా విను. ఇవన్నీ క్రితం ఏడాది కాశ్యప్‌కి బోర్డ్ ఎగ్జామ్స్‌లో ఫస్ట్ రేంక్ వచ్చినప్పటినుండి మొదలైంది కదా, అంటే నువ్వు యెంత బాగా చదువుతున్నా అతనితో నిన్ను పోల్చుకుంటున్నావు. అతనిలా ఫస్ట్ రావాలని, అమ్మానాన్నలని సంతోష పెట్టాలని కోరుతున్నావు. నేను చెప్పబోయే మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకో, మనం యితరులతో పోటీ పడకుండా మనకి మనమే పోటీ అవ్వాలి. అలా అయితే మనకి ఎలాంటి టెన్షన్ కానీ భయం కానీ బాధించవు”.
ఆమె మాటలను జాగ్రత్తగా వింటున్న రాజాతో సునీత గారు “నేను ఒక చిన్న కథ చెపుతాను వింటావా” అనగానే తల ఊపి అంగీకారము తెలిపాడు రాజా.
ఆమె కథను ఇలా చెప్పడం మొదలుపెట్టారు “ఒక అడవిలో ఒక చెట్టు కొమ్మపై రోజూ ఒక చిన్న పక్షి వాలి విశ్రాంతి తీసుకునేది. ఓ రోజు పక్షి చెట్టుపై సేద తీరుతూ ఉండగా చాలా జోరుగా గాలి వీచడంతో చెట్టు వూగిపోసాగింది. కానీ ఆ పక్షి మాత్రం చలించకుండా ఆ కొమ్మని వీడలేదు, ఎందుకంటే ఆ పక్షికి కొమ్మ విరిగినా, చెట్టు కూలినా ఏ భయం లేదు. దానికి దాని రెక్కలపై పూర్తి నమ్మకం ఉంది, యెగిరి యింకో కొమ్మ లేదా ఇంకో చెట్టుపై ఆశ్రయం తీసుకోగలననే నమ్మకం ఉంది. రాజా నువ్వు ఆ చిన్న పక్షిలా ఆత్మవిశ్వాసముతో ఉండాలి. నువ్వు ఇతరులతో పోల్చుకోకుండా శ్రద్ధగా చదువుకుని, నీపై నమ్మకంతో పరీక్షలు రాయి. ఈ పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థికి విజయం సాధించగలమా, లేదా అన్న భయం ఉంటుంది. కానీ నిన్ను నువ్వు నమ్మితే నిన్ను చూసి భయం భయపడుతుంది. ఎగ్జామ్స్ అంటే కొంచం టెన్షన్ ఉండడం సహజం అది మంచిదే కూడా కానీ తీవ్రమైన టెన్షన్, ఆందోళన వల్ల విద్యార్థులు ఏకాగ్రత కోల్పోయి, చదివినది మరిచిపోయి, ఎగ్జామ్స్ బాగా రాయలేరు. నీ మనసులోని భయం, టెన్షన్ తొలిగించే కొన్ని చిట్కాలు చెపుతాను. ముందు ఒక షెడ్యూల్ రెడీ చేసుకొని చదువుతోపాటు నీకు నచ్చిన హాబీస్‌కి కూడా కొంత సమయం కేటాయించు. ఫ్రెండ్స్‌తో సాయంత్రాలు కొంతసేపు నీకు నచ్చిన స్పోర్ట్స్ ఆడుకో. రోజంతా చదువుతూ ఉండడమేకాక మధ్యమధ్యలో బ్రేక్ తీసుకొని నచ్చిన పాటలు విను, కథల పుస్తకాలు చదువుకొని రిలాక్స్ అవ్వు. ఇలా చేస్తే తప్పక నీదే విజయం”.
యిలా సునీత గారి స్పూర్తినిచ్చే మాటలు రాజాని ఎంతగానో ప్రభావితం చేసాయి. ఆలా కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకున్న రాజాలో చాలా మార్పు వచ్చింది. రాజాలో ఒక కొత్త ఉత్సాహం మరియు నమ్మకం కలిగాయి. తను కథలో పక్షిలా తన సామర్థ్యంపై పూర్తి విశ్వాసంతో అనంత ఆకాశంలో విహరించడానికి సంసిద్ధుడయ్యాడు.