[‘ఆకాశంలో ఒక నక్షత్రం’ అనే కథా సంపుటిని వెలువరించిన డా. ఎమ్. సుగుణరావు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం డా. ఎమ్. సుగుణరావు గారూ.
డా. ఎమ్. సుగుణరావు: నమస్కారం.
~
ప్రశ్న 1. మీరు రాసి, ప్రచురించిన 24 కథల సంపుటికి శీర్షికగా మొదటి కథ ‘ఆకాశంలో ఒక నక్షత్రం’ పేరునే ఎంచుకోవడంలోని కారణం ఏమిటి?
జ: నా కథల పేర్లన్నీ పాంచ భౌతికం. నా మొదటి కథాసంపుటి పేరు ‘జాబిలి మీద సంతకం’. రెండో కథాసంపుటి ‘నేలకు దిగిన నక్షత్రం’. మూడో కథాసంపుటి ‘ఆకాశంలో ఒక నక్షత్రం’. అలాగే నేను కొన్ని కథలకు పెట్టిన పేర్లు… ఆకాశంలో రెండు తారకలు, నేనే విశ్వం, నట్టింట్లో నక్షత్రం. – ఇలా బాల్యం నుంచీ నాకు కాస్మిక్ సైన్స్, నక్షత్రాలూ, గ్రహాలూ… వీటి మీద ఉన్న అభిలాష దృష్ట్యా ఇలాంటి పేర్లు కుదిరాయి. అయితే ‘ఆకాశంలో ఒక నక్షత్రం’ కథలో రోహిత్ అనే విద్యార్థి ప్రయాణాన్ని చెప్పాను.
కుల వివక్షతకు, అసమానతలకు గురైన వేముల రోహిత్ అనే యూనివర్శిటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఇతివృత్తం ఆధారంగా ఈ కథ రాసాను. అయితే అతని మరణంతో వారి ఆశయసాధన ఆగిపోకూడదు. మనుష్యులు వస్తారు, వెళ్తారు. రోహిత్ వేముల లాంటి వ్యక్తులు ధృవతారల్లా ఉండిపోతారు. నక్షత్రాలు కొన్ని వేల సంవత్సరాలు నిలిచిపోతాయి. అదే దృష్టికోణంలో ‘ఆకాశంలో ఒక నక్షత్రం’ శీర్షికను ఆ కథకు పెట్టడం జరిగింది.
ప్రశ్న 2. ఒకనాటి, నేటి మనుషుల స్వభావ లక్షణాలను ఈ కథలలోని పాత్రలు ప్రతిబింబిస్తాయి. ముందుమాటలో మీ అబ్బాయి హర్ష చెప్పినట్లు ఈ కథల్లో రాజకీయ, సామాజిక, మానవీయ చింతనలు కనిపిస్తాయి. ఈ సందర్భంగా, మీ రచనా ప్రస్థానం గురించి వివరిస్తారా?
జ: నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు 1975 ప్రాంతంలో ఈనాడు పత్రిక మొదలయ్యింది. ఆ పత్రికలో చిన్న చిన్న కథలు, కాలమ్స్ వేసేవారు. నేను కూడా ఒక కథ రాద్దామని నా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్‌లో ఉన్న డాక్టర్ ఆల్‌బర్ట్ స్క్వైజర్ గారి ఆత్మకథ తెలుగులో అనువాదం చేసి, దాన్ని మా అన్నయ్య ఎమ్.ఎస్. బాబూరావు గారికి పంపాను. వారు అప్పటికే కథకులుగా, జర్నలిస్టుగా సుప్రసిద్ధులు. ఆ వ్యాసాన్ని సంస్కరించి, ఆయనే ఈనాడుకి పంపారు.
ఆఫ్రికాలో మొరాకో దీవిలో కుష్ఠువ్యాధి బాగా ప్రబలిపోయింది. అప్పుడు ఈ డాక్టర్ గారు ఆ దీవికి వెళ్లి అక్కడ కుష్ఠురోగులకు చికిత్స చేసి, చాలా మంది ప్రాణాలు కాపాడి, ఆయన ఆ వ్యాధికి గురై చనిపోయారు. తర్వాత ఆయనను ఫాదర్ డామియన్‌గా అక్కడి ప్రజలు దేవుడిలా కొలిచేవారు. అయితే అక్కడ పుట్టిన పిల్లలను వేరే ప్రాంతాలకు తరలించేవారు. ఆ పిల్లలకు కుష్ఠువ్యాధి సోకుతుందని. అలా ఆ ద్వీపంలో పసిపాపలు లేరు. దానికి పసిపాపలు లేని ద్వీపంగా పేరు వచ్చింది. ఆ పేరుతోనే నేను ఆ కథ రాసి పంపాను. దాన్ని ఈనాడువారు ప్రచురించి నాకు పాతిక రూపాయిలు బహుమతిగా పంపారు.
ఆ కథ పడిన ఈనాడు పత్రికను మా అమ్మ మట్టా చక్రమ్మ ఇంటికి వచ్చిన అందరికీ చూపించి మా అబ్బాయికి పాతిక రూపాయిలు బహుమతి వచ్చిందని చెప్పి ఆనందపడేది. ఆ పత్రిక చూసినవారు పాతిక రూపాయిలా, పాతిక వేలా అంటూ జోక్ చేసేవారు. మా అబ్బాయి పాతిక వేలు బహుమతి కూడా తీసుకొనే రోజు వస్తుంది అంటూ వారికి చెప్పింది. ఆలా మా అమ్మ దీవెన ఫలించింది.
2015 సం॥లో నేను రాసిన ‘గాంధీ మహాత్ముడికి లేఖ’ భారత తంతీ`తపాలా శాఖ వారి ఉత్తరాల పోటీలో పాతిక వేలు బహుమతి పొందింది.
అలాగే 2020 లో స్వాతి అనిల్ అవార్డు కథల పోటీలో నా కథ ‘క్షమాభిక్ష’కు పాతిక వేల రూపాయిలు బహుమతి వచ్చింది.
తొమ్మిదో తరగతిలో వ్యాసం రాసిన తర్వాత నేను చదువులో పడి చాలా సంవత్సరాలు రచనావ్యాసంగం జోలికి వెళ్లలేదు. 1983 లో మళ్లీ ఒక కథ రాసాను. అదే నా మొదటి కథగా చెప్పుకోవచ్చు. పసిపాపలు లేని ద్వీపం వ్యాసం రూపంలో ఉన్న కథ.
వెటర్నరీ సైన్స్ విద్యార్ధిగా ఉన్నప్పుడు సికింద్రాబాద్‌లోని బోయగూడ పశువుల ఆసుపత్రిలో ప్రతి వారం అక్కడి క్లినిక్ డ్యూటీకి వెళ్లవలసి వచ్చేది. ఆ సమయంలో ఒకరోజు ఒక విదేశీ కారులో ఒక అమ్మాయి కుక్కను తీసుకువచ్చింది. దానికి ఆరోగ్యం బాగోలేదని, ట్రీట్‌మెంట్ చేయమని ఏడుస్తూ చెప్పింది. ఆ కుక్కను తీసుకువచ్చిన ముసలాయన పరిస్థితి కూడా బాగోలేదు. అతను కూడా జ్వరంతో వణుకుతున్నాడు. కానీ ఆ అమ్మాయి ముసలాయన గురించి అసలు పట్టించుకోకుండా, కుక్క గురించే దుఃఖించడంతో నాకు ఆశ్చర్యం కలిగింది. ఎన్నో పుణ్యాలు చేసుకుంటేనే గానీ మానవ జన్మ లభించదు అంటారు. మరైతే ధనికుల ఇళ్ళల్లో వాళ్ల పెంపుడు కుక్కగా జన్మించడానికి ఏం పుణ్యం చేసుకోవాలో! అనే ప్రశ్న నాలో మొదలయ్యింది. అలా ‘పుణ్యం`పాపం’ అనే కథకు బీజం పడిరది. ఇలా నా మొదటి కథ ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురింపబడిరది.
‘వంద కథలు చదివిన తర్వాత ఒక కథ రాయాలి’ అనే మా అన్నయ్య ఎమ్.ఎస్. బాబూరావు గారి సూచన మేరకు నేను విస్తృతంగా చదవడం మొదలుపెట్టాను. ‘తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ’ అనే ఒక సింపుల్ టెక్నిక్ మా అన్నయ్య గారు చెప్పడంతో కథారచన మొదలుపెట్టాను. ఆ సమయంలో మహా కథకులు శ్రీకాకుళం కథా నిలయం నిర్మించిన కథల మాస్టారు కాళీపట్నం రామారావు గారు ఆంధ్రభూమి దినపత్రికలో ‘నేటి కథ’ అనే శీర్షిక నిర్వహించేవారు. ఆ శీర్షిక కోసం ఔత్సాహిక రచయితల నుంచి కథలు సేకరించేవారు. అలా ఆంధ్రభూమి పత్రికలో ‘నేటి కథ’ శీర్షికలో నావి దాదాపు 13 కథల వరకు పబ్లిష్ అయ్యాయి. వారు చాలా ప్రోత్సహించేవారు.
కథారచన గురించి ఎన్నో విషయాలు చెప్పేవారు. శైలి కోసం సాహిత్యాన్నీ, వస్తువు కోసం జీవితాన్నీ చదవాలని చెప్పేవారు. సమాజంలోని అసమానతలు, వైరుధ్యాలు, వైవిధ్యాలు, దళిత స్త్రీవాద, బహుజనవాద, మానవ సంబంధాల నేపథ్యం గురించిన కథలు రాయమని వారిని కలిసిన నాతో పాటు చాలా మంది ఔత్సాహిక రచయితలకు వారు సలహా ఇచ్చారు. ఆ విధంగా కథను కొత్తగా చూడడం, కథలోని కొత్త చూపును దర్శించడం కా.రా. మాస్టారి సాహచర్యంతో అలవడిరది. వారి కథలు, రావిశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు, బుచ్చిబాబు, గోపీచంద్… ఇలా ఎందరో రచయితల కథలను అధ్యయనం చేయడం జరిగింది. విస్తృతమైన కథాపఠనంతో, అధ్యయనంతో నా కథాప్రయాణం మొదలయ్యింది. ఇదీ నా రచనా ప్రస్థానం.
ప్రశ్న 3. ముందుమాటలో గుడిపాటి గారు “ఎవరిది ఏ కులమో చెప్పకుండానే కథలో పాత్రల చిత్రణలో, సన్నివేశాల కల్పనలో సూచిస్తారు. ఇది రచయిత కథనాత్మక వ్యూహంలోని మేలిమి అంశం” అన్నారు. ఈ కథలు చదివిన పాఠకులకు ఈ అభిప్రాయం సరైనదేననిపిస్తుంది. మీ ‘కథనాత్మక వ్యూహం’ గురించి వివరిస్తారా?
జ: సాధారణంగా మనుష్యులంతా మంచివాళ్లే. అసలు మనిషి అంటేనే మంచివాడు అంటాడు ఒక సినిమాలో ఒక పాత్ర. సమాజంలోని అవ్యవస్థలు, అరాచకీయ ధోరణులు, అమానవీయ సంబంధాలు మనుష్యుల్ని ఏమార్చుతూ ఉంటాయి. అంచేత మనుష్యులను జాతి వర్గ కులం పరంగా వేరుపర్చకుండా అందరూ సమసమాజం వైపు నడిచే దిశగా సాగించేందుకు రచనావ్యాసంగం ఉండాలని నమ్ముతాను. అందువల్ల నా కథల్లో ధర్మాగ్రహం ఉంటుంది. సమాజంలోని వైరుధ్యాలపై, వైవిధ్యాలపై. అంతే తప్ప మనుష్యులపై కాదు.
ప్రశ్న 4. ‘ఆకాశంలో ఒక నక్షత్రం’ కథలో పేరు తిరగేసి పెట్టుకున్నారెందుకు అనే ప్రశ్నకి జవాబుగా “ప్రపంచం తలక్రిందులుగా ఉంది. ఇలాంటి ప్రపంచంలో నడవాలంటే అలాగే ఉండాలి” అంటూ జాషువా గారి ‘గబ్బిలం’ కావ్యం చదవమని చెప్తారు. గబ్బిలం ప్రస్తావన ప్రతీకాత్మకమే అయినా, ఈ సూచనలో అంతర్లీనంగా ఉన్న ఆ కావ్యంలోని సందేశాన్ని క్లుప్తంగా మా పాఠకులకి వివరిస్తారా?
జ: గబ్బిలాన్ని ఒక అపశకునపు పక్షిగా చాలా మంది చెడుకు సంకేతంగా భావిస్తారు. గబ్బిలం వెలుగు చూడదు. చీకటి ప్రాంతాల్లో బతుకుతుంది. అలాగే చాలా మంది దళితులు జీవితాల్లో ఎంత ఎదిగినా చదువుకున్నా ఇంకా వెలుగు లేదు. వారిని ఇంకా సమాజం దూరంగానే పెడుతోంది. దాని ప్రతీకగా జాషువా మహా కావ్యం గబ్బిలం రాశాడు. ఇది గబ్బిలం కావ్యంలోని అంతః సూత్రం.
ప్రశ్న 5. ‘రెయిన్ డాన్స్’ కథలో మంచినీళ్ళు అడుక్కోవడానికి రావడం కస్తూరికి షాకింగ్‌గా అనిపిస్తుంది. అక్కడి వారికి నీటి సమస్య బాగా తెలుసు. కొన్ని జిల్లాల్లో వేసవిలో నీటికి తీవ్రమైన కటకట ఉంటుందని తెలుసుకానీ నీరు అడుక్కోడం గుండెను పిండేస్తుంది. ఈ కథ లోని ఘటనలూ, పాత్రలు మీకు ఎదురయ్యాయా / ఎదురైనారా? లేదా వార్తల్లో విన్న సంఘటనలతో అల్లిన కథా??
జ: ‘రెయిన్ డాన్స్’ కథలో చాలా భాగం వాస్తవంగా జరిగినదే! మా శ్రీమతి ఉద్యోగ రీత్యా అనంతపురంలో కొన్ని రోజులు ఉండడం జరిగింది. ఆ సమయంలో వేసవిలో అక్కడి ప్రజలు నీటి కోసం ఎదుర్కొనే సమస్యల్ని స్వయంగా చూసాను. అలాగే అక్కడ చాలా మంది యాచకులు ఆహారం కన్నా తాగే నీరునే అడుక్కోవడం కూడా నేను చూసిన దృశ్యం. ఆ సంఘటనలు కలచివేయడంతో దాన్ని కథగా మలిచాను.
ప్రశ్న 6. ‘పూర్ణాహుతి’, ‘నేను విశ్వం’ కథలకు పెట్టిన శీర్షికలు ఎంతో ఔచిత్యవంతంగా ఉన్నాయి. ముందుగా కథకి ఇతివృత్తం తట్టినప్పుడు ఆ పేర్లు అనుకుని కథలు రాశారా? లేకపోతే కథ రాస్తున్నప్పుడు యాదృచ్ఛికంగా పేర్లు తట్టాయా?
జ: కథ ఇతివృత్తానికీ, కథాంశానికీ అనుగుణంగానే ‘పూర్ణాహుతి’, ‘నేనే విశ్వం’ అనే పేర్లు పెట్టడం జరిగింది. అది కథ చదివిన పాఠకుడికి అర్థమౌతుంది.
ప్రశ్న 7. “ఆ మాటలకు లక్ష్మీపతిరావు భయపడ్డాడు” అనే ఈ నాలుగు పదాలలో ‘కన్నీరు ఉప్పగా ఉంటుంది’ కథ సారం చెప్పవచ్చు. తండ్రులుగా ఈ కథలోని లక్ష్మీపతిరావుని ‘రెయిన్ డాన్స్’ కథలోని సుబ్రహ్మణ్యాన్ని, ‘నేను విశ్వం’ కథలోని విశ్వాన్ని పోల్చవచ్చా? ఈ మూడు పాత్రల స్వరూప స్వభావాలు ఒకేలా అనిపిస్తాయి కదా??
జ: కన్నీరు ఉప్పగా ఉంటుంది’ కథలో లక్ష్మీపతిరావు, ‘రెయిన్ డాన్స్’ కథలోని సుబ్రహ్మణ్యం, ‘నేనే విశ్వం’ కథలోని విశ్వం – మూడూ విభిన్నమైన పాత్రలు. అయితే ఒకే పోలిక ఏమిటంటే – ఈ ముగ్గురూ తమ కూతుళ్లను విపరీతంగా ప్రేమించడం. వారి ఉన్నతి కోసం పాకులాడడం. అయితే లక్ష్మీపతిరావు పాత్రలో పరిణతి కనిపిస్తుంది. విశ్వం తాత్త్వికచింతనతో అతనికి ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది. అయితే సుబ్రహ్మణ్యం పాత్ర కథాంశంలో కూతురి నిర్ణయాన్ని హర్షించలేని సందిగ్ధతలో ఉండిపోతాడు.
ప్రశ్న 8. “ద్వేషాన్ని, దురాశను, రాక్షసత్వాన్ని జయించిన మనిషి కొత్త ప్రపంచంలోకి అడుగుపెడతాడు” అంటుందో పాత్ర ‘విశ్వమానవుడి వీలునామా’ కథలో. ఈ వాక్యంతో మనిషి విశ్వనరుడు కావడమెలాగో చెప్పారు. ఇది ఆచరణీయమైనదే అయినా, అసాధ్యం కాకపోయినా Utopian Idea లా అనిపించే అవకాశం ఉంది కదా?
జ: Utopia అంటే మంచితనం సాధించిన ఒక పరలోకం. అంటే ఆదర్శవంతమైన ప్రదేశం. ఆదర్శ థామం అనవచ్చు. అంటే మనుష్యులందరూ ఆనందంగా, ఆప్యాయంగా ఏ వైరుధ్యాలు, వైవిధ్యాలు లేకుండా ఒక వసుదైక కుటుంబంలా ఒకరి కోసం ఒకరు బతకడం. ఇలా ఆలోచించడంలో ఆచరించడంలో తప్పు లేదు కదా? అదే కదా మానవుడి పురోగతికి, వికాసానికి అంతిమ లక్ష్యం.
ప్రశ్న 9. ఈ సంపుటిలోని ఏ కథ మీకు బాగా నచ్చింది? ఎందుకు?
జ: నాకు ఈ సంపుటిలోని ‘ఆకాశంలో ఒక నక్షత్రం’ అనే కథ చాలా ఇష్టమైన కథ. అందుకే ఈ సంపుటికి ఆ కథాశీర్షిక ఉంచాను. దీనికి కారణం ఈ కథ చాలా మంది విమర్శకుల ప్రశంసలు పొందింది. ఉపాధ్యాయ మాసపత్రిక కథల పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. ఈ కథను మా అబ్బాయి శ్రీవంశీ ఇంగ్లీషు నాటకంగా మలిచాడు. ఆ నాటకం ‘స్టార్ ఇన్ దిస్ స్కై’ పేరుతో బాంబే టాటా లిట్ ఫెస్ట్ సుల్తాన్ పదాంసే ఇంగ్లీషు నాటక పోటీలో రెండవ బహుమతి లక్ష రూపాయిలు పొందింది. నాకు మరింత ఆనందాన్ని తెచ్చిపెట్టింది. మనం రాసే కథకు ఎల్లలు లేవు. ఆ కథ బాగుంటే ఆకాశమే దానికి హద్దు అని అర్ధమైంది.
ప్రస్తుతం అమెరికాలోని విస్కాన్సన్ యూనివర్శిటీ ఆఫ్ మేడిసన్ విశ్వవిద్యాలయంలో రెసిడెంట్ ఫ్యాకల్టీగా ఉన్న మా అబ్బాయి శ్రీవంశీ రాసిన ఆ ఇంగ్లీషు నాటకానికి అక్కడివారి ప్రశంసలు కూడా లభించడం మరో మంచి అనుభవం. అందుకే ‘ఆకాశంలో ఒక నక్షత్రం’ కథ నాకు చాలా ఇష్టం.
ప్రశ్న 10. ఈ సంపుటిలోని ఏ కథ రాయడం కష్టమనిపించింది? ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండవచ్చు అని అనిపించిందా?
జ: ఈ సంపుటిలో ‘నేనే విశ్వం’ రాయడానికి కష్టపడాల్సి వచ్చింది. సొంత ఊరిలో వున్న మనిషి తన ఊరి కోసం ప్రాకులాడతాడు. ఆ ఊరు దాటితే జిల్లావాళ్లు అనే సంకుచిత ధోరణి ఏర్పడుతుంది. జిల్లా దాటి రాష్ట్రం, ఆ తర్వాత దేశం దాటితే నేను, నాది అనే తత్త్వం మరింత విస్తృతమౌతుంది. అలాంటి మనిషి ఏ ప్రాణీ తోడుగా లభించని ఒక గ్రహంలో కాలు పెడితే ఆ ఒంటరితనంలో ఏమి కోరుకుంటాడు? ఇలా ఒక సగటు మనిషిని ఊళ్లూ, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు దాటించి గ్రహం మీద అడుగు పెట్టించే క్రమంలో సాగే ఈ కథ నన్ను చాలా కష్టపెట్టించింది. అయినా ఉత్తమ ఫలితం సాధించింది. ఎందరో పాఠకుల, విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.
ఈ సంపుటిలో ‘గంగ పొంగింది’ కథ చాలా సంవత్సరాల క్రితం రాసాను. నేను రచయితగా తొలి అడుగులు వేస్తోన్న సమయంలో రాసినది. ఇప్పుడు ఆ కథను చదివితే ఇంకా బాగా రాస్తే బాగుండేదనిపిస్తుంది.
ప్రశ్న 11. ‘ఆకాశంలో ఒక నక్షత్రం’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఉంటే వాటిని పంచుకుంటారా?
జ: ‘ఆకాశంలో ఒక నక్షత్రం’ పుస్తకం పాలపిట్ట బుక్స్ ద్వారా గుడిపాటి గారు ప్రచురించారు. ఈ పుస్తకం ప్రచురించే క్రమంలోనే అన్నీ మంచి అనుభవాలే. ఈ పుస్తకం కూడా దేశ విదేశాల్లో చాలా మంది పాఠకులకు చేరువయ్యింది. మంచి సమీక్షలు వచ్చాయి. కొన్ని సంస్థలు ఈ పుస్తకానికి బహుమతి కూడా ప్రకటించాయి.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు డా. ఎమ్. సుగుణరావు గారూ.
డా. ఎమ్. సుగుణరావు: ధన్యవాదాలు.
***
ఆకాశంలో ఒక నక్షత్రం (కథాసంపుటి)
రచన: డా. ఎమ్. సుగుణరావు
ప్రచురణ: పాలపిట్ట బుక్స్, హైదరాబాద్
పేజీలు: 248
వెల: ₹ 200/-
ప్రతులకు: డాక్టర్. ఎమ్. సుగుణ రావు,
312 గ్రీన్ మెడోస్ అపార్ట్మెంట్స్,
హోటల్ ఫెయీర్ ఫీల్డ్ మారియట్,
మాధవధార, ఉడా కాలనీ,
విశాఖపట్నం – 530018.
ఫోన్: 9704677930, 9393129945
~
‘ఆకాశంలో ఒక నక్షత్రం’ కథా సంపుటి సమీక్ష:
https://sanchika.com/aakaasamlo-oka-nakshatram-book-review-kss/