మరుగునపడ్డ మాణిక్యాలు – 85: మండేలా

4
2

[సంచిక పాఠకుల కోసం ‘మండేలా’ అనే తమిళ సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

[dropcap]మ[/dropcap]ళ్ళీ ఎన్నికల సీజన్ వచ్చేసింది. ఎమ్మెల్యే లేదా ఎంపీ మీద అసంతృప్తితో ఉంటే ఆటోమాటిక్‌గా అవతలి పార్టీకి ఓటేస్తారు చాలామంది. వేసే ముందు ఆలోచించుకోండి. ఇంతకు ముందు ఆ పార్టీ ఏం చేసింది? వాళ్ళు కూడా అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారా? మరి ఈసారి బాగా పని చేస్తారని నమ్మకం ఉందా? ఉంటే మంచిదే. లేకపోతే వేరే దారి ఉందేమో చూడండి. పార్టీలని పక్కన పెట్టి మనుషులను గమనించండి. నియోజకవర్గంలో మంచి పేరున్న అభ్యర్థి ఎవరైనా ఉంటే చూడండి. మనిషి మంచివాడైతే పార్టీని పట్టించుకోనక్కరలేదు. ఎవరూ నచ్చకపోతే నోటాకి ఓటు వెయ్యండి. నోటాకి ఓటేస్తే ఓటు వృథా అనుకోవద్దు. ఏ అభ్యర్థీ మీకు నచ్చలేదని చెబుతున్నారు అంతే. అసలు నోటా పెట్టిందే అందుకు. డబ్బులిచ్చినవారికి, మద్యం ఇచ్చిన వారికి ఓటేస్తే మనదే తప్పు. ఇలాంటి విషయలు లెక్చర్‌లా చెబితే సుత్తి కొడుతున్నారనిపిస్తుంది. ఈ విషయాలే వినోదాత్మకంగా చెప్పిన తమిళ చిత్రం ‘మండేలా’ (2021). నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. తెలుగు శబ్దానువాదం లేకపోవటం విచారకరం. ఆంగ్లం సబ్ టైటిల్స్‌తో చూడవచ్చు.

ఒక ఊళ్ళో ఒక మంగలివాడు ఉంటాడు. ఒక మర్రిచెట్టు కింద అతని దుకాణం, పైన అతని నివాసం. పైనున్న చెట్టు కొమ్మలకి ఒక బ్యానర్ ఉయ్యాలలా కట్టి అందులోనే పడుకుంటాడు. అతన్ని అందరూ స్మైల్ అని లేదా దున్నపోతు అని పిలుస్తారు. అతని అసలు పేరు అతనికే గుర్తు లేదు. అతని నోరు ఎప్పుడూ కొంచెం తెరుచుకుని ఉంటుంది కాస్త నవ్వుతున్నట్టుగా. అందుకని స్మైల్ అని పేరు. అతనికి సహాయకుడు ఒక పదిహేనేళ్ళ కుర్రాడు. వాడి పేరు కిరుదా. స్మైల్ అంటే ఊళ్ళో అందరికీ చులకనే. ఇంటికి పిలిపించుకుని క్షవరం చేయించుకుంటారు. డబ్బులు మాత్రం సరిగా ఇవ్వరు. ఇంట్లోకి పెరటి తలుపు నుంచే లోపలికి రావాలి. రేషన్ సరుకులు తెప్పించుకుంటారు. తెచ్చిన సరుకుల్లో గుప్పెడు వాడి సంచిలో పడేస్తారు. బియ్యం, పప్పు కలిసిపోతే వాటిని వేరు చేయటం కిరుదా పని. కిరుదాకి ఊరివాళ్ళ పద్ధతి నచ్చదు. కానీ స్మైల్ తలవంచుకుని ఉంటాడు.

స్మైల్‌కి ఒక మంగలి కొట్టు పెట్టుకోవాలని కోరిక. పోస్టాఫీసులో అకౌంట్ ఉంటే లోను వస్తుందని తెలిసి అతను పోస్టాఫీసుకి వెళతాడు. అక్కడి పోస్ట్ మాస్టర్ తేన్మొళి. ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్ ఏదైనా ఉంటే తప్ప అకౌంట్ తెరవటం సాధ్యం కాదని చెబుతుంది. మనవాడికి అవేమిటో కూడా తెలియదు. తేన్మొళి ఆధార్ కార్డ్ కి తానే దరఖాస్తు చేస్తానని, తర్వాత మిగతా కార్డులకి కూడా దరఖాస్తు చేయవచ్చని అంటుంది. అయితే ఒక చిక్కు. స్మైల్ అసలు పేరు ఎవరికీ తెలియదు. ఒక స్టాంప్ మీద నెల్సన్ మండేలా బొమ్మ చూసి తేన్మొళి “ఈ పేరే పెట్టుకో. పంచాయితీ ప్రెసిడెంట్ సంతకం ఉంటే ఆ పేరే పెట్టుకోవచ్చు” అంటుంది. అతను ప్రెసిడెంట్ సంతకంతో పేరు మార్చుకుంటాడు. తేన్మొళి సాయంతో ఆధార్ కార్డ్ వస్తుంది. కిరుదా కోసం దాచిన డబ్బులు అకౌంట్లో వేస్తాడు మండేలా. మిగతా కార్డులకి కూడా తేన్మొళి దరఖాస్తు చేస్తుంది. కొన్ని రోజులు గడుస్తాయి. మండేలా తాను సంపాదించే డబ్బు కొంచెం కొంచెం అకౌంట్లో వేస్తూ ఉంటాడు.

ఊళ్ళో కులం ప్రాతిపదికన రెండు వర్గాలు. తమాషా ఏమిటంటే ఈ రెండు వర్గాల నాయకులకు తండ్రి ఒక్కరే. ఆయనే ఆ ఊరి ప్రెసిడెంటు. పేరు పెరియయ్య. రెండు కులాల మధ్య సయోధ్య కుదర్చాలని ఆయన రెండు కులాల నుంచి ఒక్కో ఆమెని పెళ్ళి చేసుకున్నాడు. కానీ ఆయన కొడుకులు తమ తల్లుల కులానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఊరు రెండుగా చీలిపోయింది. ఉత్తరం, దక్షిణం అని రెండు భాగాలు. మండేలా మాత్రం రెండు భాగాల్లోనూ క్షవరానికి వెళతాడు. అతడొకడే ఆ ఊళ్ళో తటస్థుడు. ఊళ్ళో గొడవలు పెరుగుతూ ఉంటాయి. దక్షిణం వారు స్కూలు కట్టించి ఉత్తరం వారి పిల్లలకి ప్రవేశం లేదన్నారు. ఉత్తరం వారు స్కూలు కూల్చేశారు. ఉత్తరం వారు పబ్లిక్ మరుగుదొడ్డి కట్టించి దక్షిణం వారిని రావద్దని అడ్డుకుంటారు. దక్షిణం వారు మరుగుదొడ్డిని కూల్చేస్తారు. ఈ గొడవలకి పెరియయ్యకి పక్షవాతం వస్తుంది. పంచాయితీ ఎన్నికల్లో ఇప్పటి వరకు ఆయనే ఏకగ్రీవం. ఆ ప్రాంత ఎమ్మెల్యే అయన్ని తన రాజకీయ వారసుడిని ఎన్నుకోమంటాడు. మీరేమనుకుంటున్నారో నేనూహించగలను.. మండేలాని ప్రెసిడెంట్ చేస్తాడని అనుకున్నారు కదా? నేనూ అలాగే అనుకున్నాను. ఫార్ములాని తలకిందులు చేయటమే ఈ చిత్రం ప్రత్యేకత. ప్రెసిడెంట్ వారసుడిని ఎన్నుకుంటాడని ఆయన కొడుకులిద్దరూ అనుచరుల్ని తీసుకుని వస్తారు. వారి పేర్లు రత్నం, మదీ.  “ఎవరిని ఎన్నుకున్నా మిగిలేది అల్లర్లే. నేను ఎన్నుకోను” అంటాడు ప్రెసిడెంట్. దాంతో పంచాయితీ ఎన్నికల్లో ఆయన కొడుకులు ఇద్దరూ పోటీ చేస్తారు. ఒక ఫ్యాక్టరీ రాబోతోందని, ప్రెసిడెంట్ దానికి ఆమోదం ఇస్తే వాళ్ళు ఐదు కోట్లు ఇస్తారని తెలిసి ఇద్దరూ గెలవాలని పట్టుదలగా ఉంటారు. నిజానికి వాళ్ళు ముప్ఫై కోట్లు ఇవ్వటానికి తయారుగా ఉన్నారు. ఇప్పుడు ఐదు కోట్లని చెప్పి తర్వాత కమీషన్ కొట్టేయాలని ఎమ్మెల్యే పథకం. ఆ ఫ్యాక్టరీ వల్ల ఊరికి నష్టం అని ఇన్నాళ్ళూ పెరియయ్య దానికి అనుమతి ఇవ్వలేదు.

రెండు నెలల్లో ఎన్నికలు. లెక్కలేసుకుంటే దక్షిణం వారికి 341 మంది మద్దతు ఉండగా, ఉత్తరం వారికి 340 మంది ఉంటారు. గెలుస్తామని దక్షిణం వారు ధీమాగా ఉంటారు. ఉత్తరం వారికి కంగారు పుడుతుంది. ఇంతలో దక్షిణంలో ఒక ముసలామె మరణిస్తుంది. రెండు వర్గాలకి సమానమైన మద్దతు ఉంది. రత్నం, మదీ ఒకరోజు తమ అనుచరులతో ఒకరికొకరు ఎదురుపడతారు. మదీ “మీలో మగాడు ఎవడైనా నాకు ఓటేస్తే లక్ష ఇస్తాను” అంటాడు. రత్నం “ఒక్కడెవడైనా నాకు ఓటేస్తే నా ఆస్తి సగం ఇస్తాను” అంటాడు. మాటా మాటా పెరుగుతుంది. కత్తులు, కర్రలు తీసుకుని కొట్టుకోవటానికి సిద్ధపడతారు. ఇంతలో బీడీఓ వస్తాడు. కొత్త ఓటర్ కార్డ్ వచ్చింది అంటాడు. అది మండేలాకి వచ్చిన ఓటర్ కార్డ్. ఇప్పుడు మండేలాకి డిమాండే డిమాండు.

మన పల్లెటూళ్ళలో ఉండే దురాచారాలని హాస్యం జోడించి వ్యంగ్యంగా చూపించారు ఈ చిత్రంలో. స్మైల్ మొదటిసారి పోస్టాఫీసుకి వెళ్ళినపుడు పోస్టాఫీసు వెనక్కి వెళ్ళి పెరటి తలుపు ఉందేమో అని చూస్తాడు. పెరటి తలుపు లేకుండా లోపలికి ఎలా వెళ్ళటం అని కిరుదాతో అంటాడు. మనకి నవ్వూ వస్తుంది, నిట్టూర్పూ వస్తుంది. దక్షిణంలో ఒక ముసలావిడ చనిపోయే పరిస్థితిలో ఉందని తెలిసి ఉత్తరం వారు ఆమెని చంపేస్తే తమకి మద్దతు సరిసమానంగా ఉంటుందని ఎత్తు వేస్తారు. “గట్టిగా అరిస్తే చచ్చిపోతుంది” అని ఒకడంటాడు. రాత్రివేళ ఆమె ఇంటిలోకి చొరబడతాడు. మదీ తెలివైన వాడు. ఆమెకి కాపలాగా కొందరిని పెడతాడు. వారు వచ్చినవాడిని తరిమేస్తారు. ముసలావిడ దగ్గర కూర్చున్నవాడు ఆమెతో “నీ ఓటు కోసం గొడవలు జరుగుతున్నాయి. నువ్వు బతికి ఉండి ఓటు వేయాలి. ఎవరికి వేస్తావో చెప్పు?” అంటాడు. ఆమె “ఎమ్జీఆర్ కి వేస్తాను” అంటుంది. ఇప్పటి వారికి తెలియదేమో గానీ ఎమ్జీఆర్ నలభై ఏళ్ళ క్రితం తమిళనాట పెద్ద నేత. సినిమారంగంలో పేరు సంపాదించి రాజకీయాల్లో కూడా బాగా ప్రజాదరణ పొందాడు. 1987లో మరణించాడు. ఈ ముసలావిడ ఇంకా ఎమ్జీఆర్‌ని మరచిపోలేదు. ఆమె పక్కన ఉన్నవాడు “అయ్యో! ఎమ్జీఆర్ చచ్చిపోయి ముప్ఫై ఏళ్ళయింది” అంటాడు. “ఎమ్జీఆర్ పోయాడా?” అని ముసలావిడ ప్రాణం వదిలేస్తుంది. అప్పట్లో వీరాభిమానం అలా ఉండేది. అదే ప్రాణం మీదికి వచ్చింది. ఉత్తరం వారికి కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టయింది. వీరాభిమానం మీద కూడా వ్యంగ్యబాణం వేశాడు రచయిత, దర్శకుడు మదోన్ అశ్విన్.

పేరు మార్చుకున్నాక మండేలా తనని మండేలా అని పిలవకపోతే చిన్నబుచ్చుకుంటూ ఉంటాడు కానీ ఏమీ అనడు. అతని కన్నా కిరుదాకి పట్టుదలగా ఉంటుంది. ఓటర్ కార్డు వచ్చిందని తెలిసి రత్నం, మదీ అనుచరులతో సహా మండేలా చెట్టు దగ్గరకి వెళతారు. మండేలా చెట్టు పైన ఉయ్యాలలో పడుకుని ఉంటాడు. అతన్ని దున్నపోతా అని పిలిస్తే కిరుదా “మండేలా అని పిలవండి” అంటాడు. ఎవ్వరూ అతని మాట వినరు. మదీ లౌక్యం తెలిసినవాడు. మొదట తనే మండేలా అని పిలుస్తాడు. అతన్ని చూసి రత్నం కూడా మండేలా అని పిలుస్తాడు. ఓటరంటే దేవుడు కదా మరి. నాయకులను చూసి అనుచరులు కూడా మండేలా అని పిలుస్తారు. అందరి దగ్గరా కత్తులు, కర్రలు చూసి మండేలా బెదిరిపోతాడు. ఓటరు కార్డ్ చూపించి “ఓటరు కార్డ్ నీదేనా?” అంటే “నాది కాదు” అంటాడు. కిరుదా కార్డ్ చూసి “ఈయనదే” అంటాడు. రత్నం, మదీ తామిద్దరం ఎన్నికల్లో నిలుచున్నామని చెప్పి ఎవరికి ఓటేస్తావు అని అడుగుతారు. “ఒకరికి వేస్తే రెండోవారు బాధపడతారు కదా. ఇద్దరికీ వేస్తాను” అంటాడు. ఇలా చెల్లని ఓట్లు వేసేవారు మన దేశంలో చాలానే ఉన్నారు. చివరికి మండేలా “నేను నిర్ణయించుకుని చెబుతాను” అంటాడు. అతనికి ఊరు ఊరంతా బ్రహ్మరథం పడుతుంది. అతని ఓటు కావాలంటే అతన్ని ఆకట్టుకోవాలి కదా. అతని బొమ్మతో రెండు వర్గాలూ ఫ్లెక్సీలు పెడతాయి. ఒకదాని మీద “మట్టిలో మాణిక్యం” అని రాస్తారు. ఒకదాని మీద “మా సౌందర్యరహస్యం” అని రాస్తారు. ఇంతకీ మండేలాకి చదువు రాదు! ఇలా ఎన్నో వ్యంగ్యాస్త్రాలు. కొసమెరుపు ఏమిటంటే పాత ప్రెసిడెంట్‌ని పెరియయ్య అందరూ అని పిలిస్తారు. అంటే పెద్దయ్య అని అర్థం. అతని అసలు పేరు అది కాదు. ఇంట్లో వాళ్ళకి ఆయన పేరు తెలియకపోదు. కానీ ఊరివాళ్ళు మరచిపోయారు. మండేలా అసలు పేరు మరచిపోయినట్టే! కులస్థుడి పేరూ లోకం మరచిపోయింది, పంచముడి పేరూ లోకం మరచిపోయింది. నామం గుర్తు లేకపోయినా కులం మాత్రం గుర్తుంది. అదే దౌర్భాగ్యం. నామంతో పాటు కులం కూడా మర్చిపోతే అదే అద్వైతం.

రాజకీయం స్వరూపం ఎలా మారిపోయిందో ఒక సన్నివేశంలో తేలిగ్గా చెప్పేశాడు దర్శకుడు. పెరియయ్య తన కొడుకులలో ఒకరిని ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవాలనుకున్నప్పుడు వారిని ఊరికి ఏం చేస్తారని అడుగుతాడు. మదీ “సారా కొట్టుని ఏసీ చేస్తాను. గెలవగానే జాతరలా సంబరాలు చేస్తాను. సినిమా, విందు అన్నీ ఉంటాయి” అంటాడు. రత్నం “నేను అందరి అకౌంట్లో చెరో పదిహేను వేలు వేస్తాను” అంటాడు. అంతే గానీ ఊరిని అభివృద్ధి చేస్తాను అని ఎవరూ అనరు. రాజకీయం డబ్బు సంపాదించుకునే మార్గంగా మారిపోయింది. సంపాదించుకున్న దాంట్లో కొంత ప్రజలకి పారేస్తే చాలు అనే భావన పెరిగిపోయింది. ప్రజల తప్పు కూడా ఉంది. ‘మాకు ఉచితంగా ఏం ఇవ్వనక్కరలేదు. ఊరిని అభివృద్ధి చేయండి’ అనేవాళ్ళు తక్కువ. ఈ సినిమాలో కులం గురించి ప్రజలు పట్టుదలగా ఉంటారు. అభివృద్ధి గురించి ఆలోచించరు. మా కులం వాడే నెగ్గాలి అనుకుంటారు. నాయకులు ఈ కులవిద్వేషాలను రెచ్చగొడుతూ ఉంటారు.

సినిమా పేరు ‘మండేలా’ అని ఉండటంతో నేను పెరియయ్య మండేలాని తన బదులు ప్రెసిడెంట్‌గా నిలబెడతాడని అనుకున్నాను. అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ‘ప్రెసిడెంట్ పేరమ్మ’, ‘ఎర్రమందారం’ లాంటివి. కానీ రచయిత ప్రతిభ ఇక్కడే కనపడుతుంది. మండేలా సాధారణ ఓటరైనా అసాధారణ పరిస్థితి ఎదుర్కుంటాడు. ఓటరు చుట్టూ కథ తిరిగే సినిమా నాకు తెలిసి ఇదొక్కటే. హాస్యప్రధానంగా ఉన్నా మనసుకి హత్తుకునే విషయాలు కూడా ఉంటాయి. మండేలా తన కోసం దాచుకున్న డబ్బు మర్రిచెట్టి తొర్రలో దాస్తాడు. కిరుదా కోసం దాచిన డబ్బు తన మొలకి కట్టుకుంటాడు. అతని డబ్బు పోతుంది. ఇది కిరుదా డబ్బు అని తేన్మొళికి ఇచ్చి అకౌంట్లో వేస్తాడు. తర్వాత మరి కొంత డబ్బు జమ అవుతుంది. ఒక సందర్భంలో ఆదాయం లేక వేసిన డబ్బు తీస్తూ ఉంటాడు. ఒకరోజు తేన్మొళి “కిరుదా డబ్బు మాత్రమే మిగిలింది” అంటుంది. “అయితే తీయొద్దు” అంటాడు మండేలా. మనిషికి ఆస్తి ముఖ్యం కాదు, విలువలు ముఖ్యం. ఈ చిత్రంలో అందరు నటులూ చక్కగా నటించారు. చివరికి పెరియయ్య ఇద్దరు భార్యలుగా నటించిన నటీమణులు కూడా చాలా సహజంగా నటించారు. మండేలాగా యోగిబాబు నటన చిత్రానికే తలమానికం.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. కథ ఇంకొంచెం కూడా తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. కానీ అందరూ వ్యాసం చివరి వరకు చదవాలనే నా కోరిక. ఈ చిత్రం లోని సందేశం అంత ముఖ్యమైనది. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

మండేలాకి ఉచితంగా భోజనం రోజూ వస్తూ ఉంటుంది. రెండు క్యారియర్లలో! క్షవరం కావాలంటే ఊరివారు అతన్ని వాకిటి తలుపు నుంచి రమ్మనటం ప్రారంభిస్తారు. అతని కులమే ముఖ్యమైతే ఇన్నాళ్ళూ పెరటి తలుపు నుంచి రమ్మన్నవాళ్ళు ఇప్పుడు వాకిటి తలుపు ఎందుకు తెరిచారు? ఇదే ద్వంద్వ ప్రవృత్తి. లాభం ఉందంటే ఏమైనా చేస్తారు. మండేలా కొన్నాళ్ళు బాగానే పని చేస్తాడు. ఉచితంగా అన్నీ వస్తుండటంతో తర్వాత పని చేయటానికి బద్ధకిస్తాడు. పెరియయ్యని కూడా పట్టించుకోడు. కిరుదాకి అసహ్యంగా ఉంటుంది. ఒంటరిగా పనికి వెళతాడు. “నువ్వు కూడా మా నెత్తెక్కుతావు” అని అతన్ని పొమ్మంటారు. మండేలాకి ఇరు వర్గాలు బాగా మందు పోస్తాయి. దీంతో అతను ఎవరికి ఓటేయాలో తేల్చుకోలేకపోతాడు. ఇలా కాదని రత్నం అతనికి ఒక చిన్న సెలూన్ కట్టించి ఇస్తాడు. మండేలా ఆనందానికి హద్దు ఉండదు. అతను రత్నం వైపు మొగ్గే లోపల సెలూన్లోకి మంచి మంగలి కుర్చీ మదీ ఇస్తాడు. దాంతో కథ మొదటికొస్తుంది. మండేలా భోగాన్ని చూసి ఊరిలో కొంతమందికి అసూయ పుడుతుంది. మరికొందరు తక్కువ కులం వాడికి మర్యాద ఇవ్వటం ఇష్టం లేక దూరంగా ఉంటారు. మొత్తనికి ఎవరూ అతని షాపుకి రారు. తేన్మొళి కూడా మండేలాని అసహ్యించుకుంటుంది. “నీకు కాదు, నీ ఓటుకి మర్యాద ఇస్తున్నారు. ఎన్నికలు కాగానే నిన్ను పక్కన పడేస్తారు” అంటుంది. అయినా అతను వినడు.

మండేలా ఎటూ తేల్చకపోవటంతో ఈ పంచాయితీ ఎమ్మెల్యే దగ్గరకి చేరుతుంది. ఎమ్మెల్యే మండేలా ఓటుని వేలం వేయమంటాడు. అతని దగ్గర వేలానికి ఒప్పుకున్నట్టే ఒప్పుకుని వేలంలో ఓడిపోతే మండేలా చేయి నరికేయాలని ఇరువర్గాల వారూ నిశ్చయించుకుంటారు. ఇది కిరుదాకి తెలుస్తుంది. మండేలాని తప్పించటానికి అతను వేలం జరుగుతున్న చోటికి వచ్చి పెరియయ్య చచ్చిపోయాడని అబద్ధం చెబుతాడు. అందరూ పెరియయ్యని చూడటానికి వెళ్ళిపోతారు. కిరుదా మండేలాతో కలిసి పారిపోతుంటాడు. నిజం తెలిసి ఇరు వర్గాల వారూ మండేలాని పట్టుకుని కొడతారు. అబద్ధం  చెప్పాడని కిరుదాని కూడా కొడతారు. కిరుదాని ఆసుపత్రిలో పెట్టే పరిస్థితి వస్తుంది. మండేలా రత్నం దగ్గరకి వెళ్ళి “కిరుదాని కాపాడితే నా ప్రాణం ఇస్తాను” అంటాడు. “నీ ప్రాణం ఎవడిక్కావాలి. నీ ఓటు నాకు వేస్తావా?” అంటాడతను. వేస్తానంటాడు మండేలా. ఇంతలో మదీ వస్తాడు. “నేను కిరుదాని కాపాడితే నాకు ఓటు వేస్తావా?” అంటాడు మదీ. వేస్తానంటాడు మండేలా. ఆటలాడుతున్నావా అని ఇద్దరూ అతన్ని వదిలేసి పోతారు. అతను ఊరు విడిచిపోకుంటా కట్టడి చేస్తారు. మనిషి ప్రాణం కన్నా ఓటే నాయకులకి ముఖ్యం. అందుకేగా చనిపోయిన వారి పేర్లు ఓటరు లిస్టుల్లో కనపడుతున్నాయి. ప్రజాస్వామ్యం ఇలా తయారయింది. కిరుదాని తేన్మొళి ఆసుపత్రిలో చేర్పిస్తుంది. మండేలా ఆమె దగ్గరకి వెళ్ళి కిరుదా ఎలా ఉన్నాడని అడుగుతాడు. ఆమె “నీ ఓటు కోసం నీ జీవితం పాడు చేసుకోవటమే కాక కిరుదా జీవితం కూడా పాడు చేశావు. నీకు మండేలా అని పేరు పెట్టినందుకు సిగ్గు పడుతున్నాను. ఎక్కడికైనా పోయి చావు” అంటుంది. మండేలా చావటానికి సిద్ధపడతాడు. అప్పుడే కథ మలుపు తిరుగుతుంది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. అయినా అందరూ చదవాలనే నా కోరిక.

మండేలా రాత్రివేళ ఊరవతల కత్తితో గొంతు కోసుకోబోతుంటే దగ్గరలో అలికిడి వినపడుతుంది. మరుగుదొడ్డి లేక స్త్రీలు అక్కడికి వస్తూ ఉంటారు. ఉదయం మగవాళ్ళు వస్తారు. పన్నెండింటివరకు అక్కడ తాగుబోతులు తాగుతూ ఉంటారు. అందుకని పొద్దున్నే మూడు గంటలకి స్త్రీలు వస్తారు. ఒక స్త్రీ మండేలాతో “మరుగుదొడ్డి కూల్చేశారు. ఏం చేస్తాం? నీ ఓటు ఉపయోగించి తాగుబోతులు ఇక్కడికి తాగటానికి రాకుండా చూడొచ్చు కదా” అంటుంది. మండేలాకి ఒక ఆలోచన తళుక్కున మెరుస్తుంది. మదీ దగ్గరకి వెళ్ళి “మరుగుదొడ్డి కట్టిస్తే ఓటు నీకు వేస్తాను” అంటాడు. ముందు మదీ అతన్ని ఛీత్కరిస్తాడు. కానీ ఫ్యాక్టరీ వాళ్ళు ప్రెసిడెంట్‌కి ఇచ్చే లంచం 30 కోట్లని తెలిసి దిగివస్తాడు. మరుగుదొడ్డి కట్టిస్తాడు. మండేలా రత్నం చేత ఊరి నీళ్ళ ట్యాంక్ బాగుచేయిస్తాడు. ఇలా ఇరువర్గాలతో స్కూలు, రోడ్లు, వీధిదీపాలు ఏర్పాటు చేయిస్తాడు. అందరికీ నీళ్ళు అందుతాయి. పిల్లలు స్కూలుకి వెళుతూ ఉంటారు. ప్రజలు సంతోషంగా ఉంటారు. మండేలా తాను ఉచితంగా ఏమీ తీసుకోను అని నియమం పెట్టుకుంటాడు. పొస్టాఫీసులో ఉన్న డబ్బులు తీసుకుని పొట్ట నింపుకుంటూ ఉంటాడు. చివరికి కిరుదా డబ్బులు మాత్రమే మిగులుతాయి. అవి తీసుకోకుండా పస్తులు ఉంటాడు.

ఓటింగ్ రోజు వస్తుంది. అందరూ ఓటు వేస్తారు. మండేలాని ఎవరికి ఓటు వేశావో చెప్పమంటే “రేపు ఫలితాలు వస్తాయి కదా. అప్పటి దాకా ఆగండి” అంటాడు. అప్పుడే ఒక విచిత్రం జరుగుతుంది. రత్నం ఓటు కోసం ఒక్కొక్కరికీ రెండు వేలు పంచాడు. మదీ ఇరవై రూపాయలు ముందు ఇచ్చి ఓటు వేశాక రెండు వేలు ఇస్తానంటాడు. రత్నం దగ్గర డబ్బు తీసుకున్నవారు “మా పిల్లలు స్కూలుకి వెళుతున్నారు, రోడ్లు బావున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, మీ డబ్బు తీసుకోవటం మర్యాద కాదు” అని డబ్బు తిరిగి ఇచ్చేస్తారు. మదీ దగ్గర ఇరవై రూపాయలు తీసుకున్నవారు కూడా తిరిగి ఇచ్చేస్తారు. ఓటేశాను, మీ డబ్బు నాకు వద్దు అంటారు. ప్రజలకి ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఇస్తే వారికి ఇంకేమీ అవసరం లేదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఉచితంగా డబ్బులు తీసుకుని ఖాళీగా కూర్చోవటం మొదట బానే ఉంటుంది. కానీ మనిషి చైతన్యజీవి. కర్మ చేయకపోతే ఉండలేడు. అతనికి పనులు చేసుకోవటానికి మంచి వాతావరణం కల్పిస్తే చాలు. కానీ నాయకులు అభివృద్ధి చేస్తే డబ్బు వెనకేసుకోవటం కుదరదుగా. అందుకు చేయరు. ప్రజలకు ఉచితంగా కొంత పారేస్తారు. డబ్బు వెనకేసుకోవటం కాకుండా బాధ్యతలు సరిగ్గా చేసే నాయకులనే ఎన్నుకోవాలి. ఎవరూ నచ్చకపోతే నోటాకి వేయాలి. ఒక చోట నోటాకి మెజారిటీ వస్తే అప్పుడు నాయకులకి దిమ్మతిరుగుతుంది.

చివరికి రత్నం, మదీ ఎవరికి వారు తాను ఓడిపోతే మండేలాని చంపేయాలని నిర్ణయించుకుంటారు. తేన్మొళికి ఈ సంగతి అర్థమవుతుంది. మండేలాని కాపాడాలని ఆమె తాపత్రయం. మండేలాకి తన పరిస్థితి తెలుసు. అతను అన్నిటికీ సిద్ధపడతాడు. కిరుదా ఆసుపత్రిలో కోలుకుంటూ ఉంటాడు. అతనికి మంచి చదువు చెప్పించమని తేన్మొళితో అంటాడు మండేలా. తేన్మోళి పెరియయ్యని తీసుకుని వస్తుంది. ఆయన్ని చూసైనా మండేలా మీద హత్యాప్రయత్నం ఆపుతారని. తర్వాత ఊరంతా మండేలాకి సాయంగా వస్తుంది. హత్య చేయటానికి వచ్చిన కిరాయి రౌడీలు భయపడి వెళ్ళిపోతారు. ప్రజాబలం అంటే అది. ఐకమత్యం ఉంటే ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోవచ్చు. చివరికి ఒక్క ఓటు తేడాతో ఒక అభ్యర్థి గెలిచాడు అనే ప్రకటన వస్తుంది. అది ఎవరనేది దర్శకుడు చెప్పలేదు. అవసరం కూడా లేదు. ఊరు గెలిచింది అని చెప్పి చిత్రం ముగిస్తాడు. నిజం! ఊరు, దేశం బావుండాలని కోరుకుని పని చేస్తే అందరూ బావుంటారు. నేనే బావుండాలి అనుకుంటే అశాంతే మిగులుతుంది. ‘వ్యష్టిర్జీవో సమష్టిరీశ్వరః’ అని వేదవాక్యం. ఒక్కడే ఉంటే జీవుడు. అందరూ కలిస్తే దేవుడు. సమాజమే దేవుడు. అది మరచిపోవటం వల్లే కలియుగం ఇలా ఉంది. అయినా మనం కొన్ని ఊళ్ళలో ప్రజలు కలిసికట్టుగా తమ ఊరిని బాగు చేసుకున్నారనే వార్తలు వింటూనే ఉన్నాం. ఎవరి ఊరు వారు బాగు చేసుకుంటే చాలు. కలియుగమే కృతయుగమౌతుంది. అందుకు మొదటి అస్త్రం ఓటు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here