[box type=’note’ fontsize=’16’] సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు. [/box]
ఉదయే సవితా రక్తో
రక్తశ్చాస్తమయే తతా ।
సంపత్తౌ చ విపత్తౌ చ
మహతామేక రూపతా ॥
ఆటవెలది
ఉభయ సంధ్య లందు ఉజ్జ్వలంబుగ వెల్గు
అరుణ మూర్తి పగిది అవని యందు
కష్ట సుఖము లనక కలకాల మొకరీతి
సజ్జనాళి యెపుడు సాగు చుండు ౧౬
తలచకుంటె ద్వంద్వం !
వీడదెపుడు ఆనందం !!
**
అలసస్య కుతో విద్యా
అవిద్యస్య కుతో ధనమ్।
అధనస్య కుతో మిత్రం
అమిత్రస్య కుతః సుఖమ్ ॥
తేటగీతి
అలసులకు రావు విద్యలు అవని నెపుడు
విద్య లేక రాదు ధనము వితత గతిని
ధనము లేక రారు సఖులు ధరణి యందు
సఖులు లేక రాదు గనగ సుఖము యెపుడు ౧౭
అలసత్వం వీడు !
విద్యయే నీకు తోడు !!
***
క్షమా దానం క్షమా యజ్ఞః
క్షమా సత్యం హి పుత్రికాః ।
క్షమాయ శః క్షమా ధర్మః
క్షమయా విష్ఠితం జగత్ ॥
తేటగీతి
క్షమయె దానమ్ము, యజ్ఞమ్ము క్షమయె సుమ్ము
క్షమయె ధర్మమ్ము, సత్యమ్ము క్షమయె కనగ
క్షమయె కీర్తి నిచ్చు, క్షమయె సర్వ మిచ్చు
క్షమయె జగమంత నిలువంగ కారణమ్ము ౧౮
***
న సా విద్యా న తద్విత్తం
న సా శక్తిర్న తద్బలమ్ ।
యది విద్యా ధనే శక్తి
బలే న్యోపకృతౌ న చేత్ ॥
ఆటవెలది
తనకు గలుగు విద్య, ధనము, శక్తి, బలము
పరుల హితము కొఱకు పనికి రాక
వ్యర్థ మౌను అవ్వి వసుధాతలము నందు
తెలుసు కొమ్ము ఇద్ది తెలివి బేర్చి ౧౯
పది చేతులా సంపాదిద్దాం !
పరుల కొఱకు వినియోగిద్దాం !!
***
సత్యమేవేశ్వరో లోకే
సత్యే ధర్మః సదాశ్రితః ।
సత్య మూలాని సర్వాణీ
సత్యాన్నాస్తి పరం పదమ్ ॥
తేటగీతి
విశ్వ మందున సత్యమే ఈశ్వరుండు
అఖిల ధర్మముల్ సత్యమ్ము నాశ్రయించు
అవని నన్నింటి కాధార మదియె సుమ్ము
కలదె సత్యమ్ము కన్నను ఘన పదమ్ము ౨౦
సత్యమ్ము నాశ్రయించు !
సత్యమునే ప్రేమించు !!