[శ్రీ వరిగొండ కాంతారావు రచించిన ‘వ్యామోహం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[ఓ రోజు పొద్దున్నే వచ్చి మర్నాడు ఉదయం ప్యాసెంజరుకు జోడెడ్లపాలెం వెళ్తున్నానని చెప్తుంది వీరలక్ష్మి. డాక్టర్సాబ్ వెళ్ళమన్నాడని వెళ్తున్నాను కానీ, వెళ్లడానికి ధైర్యం సరిపోవడం లేదని అంటుంది. అలా అయితే ఆగిపోమని చెప్తాడు డాక్టర్సాబ్. ఆగలేనంటుంది. మర్నాడు ఉదయం నాలుగున్నరకల్లా కాజీఫేట స్టేషన్‍కి చేరి ప్యాసెంబరు బండిలో వీరలక్ష్మి కోసం వెతుకుతాడు. నాలుగో పెట్టెలో కనబడుతుంది. ఆయన కూడా ఎక్కి కూర్చుంటాడు. రైలు బయల్దేరే సమయానికి ఆ బోగీ అంతా జనాలతో నిండిపోతుంది. ఇద్దరూ మొలకలగూడెంలో దిగుతారు. వీరలక్ష్మిని జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి, తాను సాయంత్రం నాలుగు గంటల బండికి వెళ్తానని అంటాడు డాక్టర్సాబ్. స్టేషన్ మాస్టర్ గారి క్వార్టర్‍లో విశ్రాంతి తీసుకుంటాడు. టిఫిన్లు, భోజనాలు స్టేషన్ మాస్టరు గారింట్లోనే కానిచ్చి నాలుగ్గంటలకి కాజీపేట రైలెక్కుతాడు. కాజీపేటలో దిగి నాలుగు అడుగులు వేయగానే పక్కనుంచి వచ్చి వీరలక్ష్మి పలకరిస్తుంది. సమ్మక్క వాళ్ళింటికి వెళ్ళాననీ, అక్కడ ఉండలేక వెనక్కి వచ్చేసాననీ, మరో అరగంతలో వరంగల్ రైల్లో ఇంటికి వెళ్తానని అంటుంది. మూడు రోజులు గడుస్తాయి. తన వద్ద ఉన్న మందులన్నీ అయిపోవడంతో చంద్రా హోమియో స్టోర్సుకు వెళ్ళి మందులు కొనుక్కుంటాడు. ఎలాగూ వచ్చాను కదా అని కృష్ణమాచారిని కలిసి వెళ్దాం అని వాళ్ళింటి వైపు సైకిల్‍పై వెళ్తుంటే ఒక వీధిలో వీరలక్ష్మి కనబడి పిలుస్తుంది. ఇక్కడున్నావేంటని డాక్టర్సాబ్ అడిగితే, జరిగినదంతా చెప్తుంది. ఆమె పెట్టిచ్చిన, టీ తాగి బయటకు వస్తాడు డాక్టర్సాబ్. ఉన్నట్టుండి నలుగురు వ్యక్తులు ఎక్కడి నుంచో వచ్చి బాణాకర్రలతో డాక్టర్సాబ్‍పై దాడి చేసి పారిపోతారు. అక్కడ పోగయిన వారితో ఆయన తమ ఊరి డాక్టర్సాబ్ అని చెప్పి, ఆసుపత్రికి తీసుకువెళ్తామని అంటుంది. డాక్టర్సాబ్ నడవలేకపోతే, ఇద్దరు కుర్రాళ్ళు ఆయన్ను భుజం మీద ఎక్కించుకుని డా. తిరుమల్రావు వద్దకు తీసుకెళ్తారు. ఆయన పేషంటుని చూసి, గాయాలని స్పిరిట్‍తో కడిగి, కట్టుకడతాడు. ఇంజెక్షన్‍లు చేస్తాడు. ఎవరు మీరు ఏం జరిగిందని అంటే, డాక్టర్సాబ్ అన్నీ వివరంగా చెప్తాడు. తిరుమల్రావ్ గారు తానూ కృష్ణమాచారి మిత్రుడినేననీ, కృష్ణమాచారి వాళ్ళు బంధువులు చనిపోతే ఊరెళ్ళారని చెప్తాడు. ఫీజు ఇవ్వబోతే తీసుకోడు. మందులు ఎలా వాడాలో చెప్తాడు. సైకిలు బాగా పాడయిపోతే, వీరలక్ష్మి జట్కా ఏర్పాటు చేయిస్తుంది. ఇంటికి రాగానే ఇరుగుపొరుగు వారు డాక్టర్సాబ్‍కి ఏమయిందిని అడిగి, తాము జాగ్రత్తగా చూసుకుంటామని అంటారు. ఇక చదవండి.]
[dropcap]ఉ[/dropcap]దయం ఎనిమిదిన్నర కావస్తూంది. పనిమనిషి వచ్చి ఇల్లూడ్చి, అంట్లు తోమి వెళ్ళింది. డాక్టరమ్మ తన పనులన్నీ తనే చేసుకొంటుంది. పనిమనుషులంటే ఇష్టముండదు. కాని తాను నెలన్నర పైబడి ఉండబోవడం లేదు కదా! అందుకని తానుండగానే పనిమనిషిని ఏర్పాటు చేసుకొంది. తానుండననీ డాక్టరు గారు ఒక్కరే ఉన్నప్పుడు నాగాలు పెట్టవద్దని చెప్పి మరీ వెళ్ళింది. డాక్టరుగారికి టక్కరైందని తెలుసుకొని బాధపడింది పనిమనిషి. అదనంగా ఏమన్నా పనులుంటే చెప్పమంది కూడా!
స్టౌమీద కాఫీ కాచుకుని తాగుతున్నాడు డాక్టరుగారు. వీధి తలుపునెవరో తట్టారు. తీరా చూస్తే వీరలక్ష్మి.
“ఏమిటి ఇంత పొద్దున్నే!” ఆశ్చర్యపోయాడు డాక్టరు గారు.
“లోపటికి రానిస్తవా అయ్య!” తప్పుకున్నాడు డాక్టరుగారు. లోపలికొచ్చింది వీరలక్ష్మి.
“నేను బాగానే వున్నాను కదా!”
“మీరనుకుంటే సరిపోతదా! వంటచేసి పోదామని వచ్చిన” అంది నేరుగా వంటింట్లోకి దారితీస్తూ.
“అదేమిటి, నువ్వా!”
“మా ఇంట్ల నేను వండింది తిన్నరు గద. మీ ఇంట్ల వండితే తప్పేంది?” ప్రశ్నించింది వీరలక్ష్మి.
“తప్పొప్పుల ప్రశ్నకాదు. ఇది సరియైన పద్ధతి కాదు.”
“తప్పో ఒప్పో నాకు తెలువది డాక్సర్సాబ్! నీకు పానం బాగలేదు. అమ్మ ఊర్లే లేదు. నేను వండిపెడత. అది కూడ నాకు తెలిసింది కాబట్కె.”
లాభం లేదనిపించి వాదించడం మానేసాడు డాక్టరు గారు. కూడా కూరగాయలు తెచ్చింది. పాలకూర పప్పు వండింది. ఆలుగడ్డలు వేయించింది. పచ్చిపులుసు చేసింది. అప్పటికి పదకొండున్నర కావస్తూంది. డాక్టరు గారి పూజ అయిపోయింది.
“డాక్సర్సాబ్ తినుండ్రి కాద, వడ్డించి పోత” అన్నది వీరలక్ష్మి.
“నేను మెల్లగ తింటతియ్యి.”
“రాత్రికి కూడ వండిన. అన్నం చల్లగైందనుకొంటే వెచ్చబెట్టుకోన్రి. ఇప్పుడు నా ఎదురుంగ తింటే నాకు తృప్తి.”
డాక్టరు గారికి తప్పలేదు. కొసరి కొసరి వడ్డించి మరీ తినిపించింది. చెయి కడుక్కున్నాక కంచం కూడ తనే ఎత్తి దొడ్లో వేసింది. శుద్ధిపెట్టింది. ‘బ్రాహ్మణ ఆచారాలను ఎక్కడ నేర్చుకుందో!’ ఆశ్చర్యపోయాడు డాక్టరు గారు. అదే విషయం అడిగాడు.
“అమ్మ మీ ఇంట్ల నాకు మస్తుసార్ల అన్నం పెట్టింది.”
“నాతో ఎప్పుడూ అమ్మ చెప్పలేదు!”
“ఎవలకన్న మేలు చేసి చెప్పుడు అమ్మ కలువాటు లేదు.” చెప్పింది వీరలక్ష్మి.
“నువు కూడ ఇక్కడనె తిను.”
“లేదయ్య. పొయి వండుకుంట.”
“నన్ను బాధపెట్టిందానివయితవు.”
“అట్లయితె తింట బాంచెను” అంటూ వడ్డించుకుందు కుద్యమించింది వీరలక్ష్మి.
భోజనం చేశాక డాక్టరు తిరుమల్రావుగారిచ్చిన మందుల్ని డాక్టరు గారు వేసుకొన్నదీ లేనిదీ నిర్ధారణ చేసుకొని మరీ వెళ్ళింది వీరలక్ష్మి.
డాక్టరు గారు వద్దన్నా వినకుండా రెండో రోజూ, మూడో రోజు కూడ అలాగే వచ్చింది. నాలుగవ రోజు డాక్టరు గారు కరాఖండీగా చెప్పేశాడు రావద్దని. చిన్నబుచ్చుకుంది వీరలక్ష్మి. అయినా డాక్టరు కుదుటపడ్డాడన్న విషయాన్ని గ్రహించుకొని సరిపెట్టుకుంది. ఐదవ రోజు సాయంకాలం సైకిలు తెచ్చిచ్చాడు ఆ రోజు టాంగాలో వచ్చిన యువకులలో ఒకడు. మరమ్మత్తు డబ్బులు తీసుకొమ్మంటే తీసుకోలేదు. వీరలక్ష్మి ఇచ్చిందని చెప్పాడు. ఎంతంటే కూడ చెప్పలేదు.
ఆ తెల్లారి నుండి డాక్టరు గారు మామూలుగా ఆసుపత్రి కెళ్ళడం మొదలెట్టారు. గాయాలన్నీ మానిపోయాయి గాని ఎడమ బుగ్గ మీద రాయి గుచ్చుకున్న కారణంగా ఏర్పడ్డ మచ్చ అలానే వుండిపోయింది.
వారానికోసారి క్రమం తప్పకుండా వచ్చి డాక్టరు గారి యోగక్షేమాలను విచారించి వెళ్తుంది వీరలక్ష్మి. రోగులుంటే అందరూ వెళ్ళిపోయేవరకు వేచి వుంటుంది. చివరి రోగిగా లోపలకు వచ్చి ఒక అరగంట కాలక్షేపం చేసి వెళుతుంది.
ఎల్లుండి బళ్ళు తీస్తారనగా పిల్లలను తీసుకొని డాక్టరమ్మ, సత్యమూర్తి, మంగమ్మ గారు వచ్చారు. బుగ్గ మీద మచ్చను గురించి అడిగారందరూ. ప్రమాదం జరిగిందని చెప్పాడు డాక్టరు గారు.
“టెలిగ్రాం ఇవ్వొచ్చుకద బావా!” అన్నాడు సత్యమూర్తి.
“పెద్దగా దెబ్బలేమీ తగల్లేదు. అనవసరంగా కంగారుపడ్తారని ఇవ్వలేదు. మామూలుగానే ఉన్నాను కదా!” జవాబిచ్చాడు డాక్టరు గారు.
“ఆయన పెద్ద పెద్దవి జరిగినప్పుడే దాచిపెట్టారు. చిన్నచిన్నవి మనకి చెప్తారా!” కోపాన్ని దుఃఖాన్ని కలగలిపి చెప్పింది డాక్టరమ్మ. తండ్రిని కలిసిన ఆనందంలో పిల్లలందరూ తండ్రిని అల్లుకుపోయారు. మరునాడుదయాన్నే బయల్దేరారు సత్యమూర్తి, మంగమ్మ గారూను. “అప్పుడేనా!” అన్నారు డాక్టరు గారు.
“బావా రేపు బళ్ళు మళ్ళీ తెరిచేరోజు. రేపు బడికెళ్ళకపోతే రెణ్ణెల్ల జీతాలాపేస్తారు.”
“ఓహో! అలా అయితే సరే? ప్రొద్దుటే ఆలోచన వచ్చింది. రమాలక్ష్మి అన్న ప్రాశన సంగతే మరచిపోయాం” అన్నాడు డాక్టరు గారు.
“అవునండీ నా మతిమండా!” తన్ను తాను తిట్టుకుంది డాక్టరమ్మ.
ఈలోగా పంచాంగాన్ని చూసి లెక్కలు వేసి చెప్పారు డాక్టరు గారు. “పధ్నాలుగు జూన్ శుక్రవారం బాగుంది.”
“అమ్మా! ఇంకా వారం రోజులేగా! నువ్వుండిపో. తమ్ముడు వెళ్ళివస్తాడు’ అంది డాక్టరమ్మ.
“శుక్రవారం బడి వుంటుంది కదే!” అన్నాడు సత్యమూర్తి.
“సెలవు పెట్టి రారా! మేనమామ లేకుండా దానికి అన్నప్రాశన ఎలా చేస్తాననుకున్నావు” ఎదరుదాడికి దిగింది డాక్టరమ్మ.
పిల్లల చదువు ప్రశ్న వచ్చింది. రాము ఇప్పుడు ఏడవ తరగతిలోకొస్తాడు. ఆరో తరగతి మేనమామ దగ్గరే చదివాడు. మందులకుంటలో బడి మాధ్యమిక పాఠశాల అంటే ఎనిమిదవ తరగతి వరకు ఉంటుంది. రాము ఏడు, ఎనిమిది కూడ మేనమామ దగ్గరే వుండి చదువుకుంటానన్నాడు. రెండో వాడు మూడో వాడు బడికి వెళ్ళాలి. లష్కర్ బజారుకు దగ్గర బడి అంటే మర్కజి మాత్రమే. మర్కజి అంటే మెయిన్ రోడ్డు మీంచి వెళ్ళాలి. వాహనాల రద్దీ వుంటుంది. పైగా వీళ్ళున్న ఇంటికి దూరం కూడాను.
శ్రీరాములు సారని అయ్యోరు పంతులు నడిపే వీధిబడి ఒకటి వీళ్ళింటికి దగ్గరలోనే వుంటుంది. ఇద్దరు పిల్లల్ని దాంట్లో వేశారు. రెండోవాడు మూడవ తరగతి. మూడోవాడు ఒకటవ తరగతి.
అన్నప్రాశన బాగా జరిగింది. సత్యమూర్తి వచ్చి వెళ్ళాడు. సత్యమూర్తితో పాటు రాము కూడా వెళ్ళాడు. మరో వారం రోజులున్నాక మంగమ్మ గారిని బస్సెక్కించాడు డాక్టరు గారు. మందులకుంటలో బస్సు దింపుకున్నాడు సత్యమూర్తి.
ఇన్నాళ్ళూ తల్లి ఉన్న కారణంగా డాక్టరమ్మ కాలక్షేపానికి కొదువలేకపోయింది. ఇప్పుడు మధ్యాహ్న సమయం ఖాళీగా వుంటోంది. ఇరుగు పొరుగు అవసరమయ్యారు. వాళ్ళు కూడా డాక్టరమ్మతో ముచ్చట్లాడ్డానికి తహతహలాడుతున్నారు. నాలుగురోజుల పాటు రోజూ వీరలక్ష్మి రాకడపోకడ చూసి బుగ్గలు నొక్కుకున్నారు. గుసగుసలాడుకున్నారు. ఏవేవో ఊహించుకున్నారు. అవన్నీ డాక్టరమ్మకు ఎప్పుడు చెబుదామా అని ఉగ్గబట్టుక్కూర్చున్నారు. అవకాశం వచ్చింది. కడుపులో ఉన్నదంతా కక్కేసి ఆయాసం తీర్చుకున్నారు. కుదుటపడ్డారు.
సంసారుల ఇంటిని డాక్టరు గారు సానికొంపగా మార్చారు. సిగ్గూ ఎగ్గూ లేకుండ, నలుగురూ గమనిస్తారనైనా పట్టించుకోకుండా, పరాయి ఆడదానితో ఉదయం పూటనే డాక్టరు గారు రాసక్రీడలు కొనసాగించారు. ఇదీ డాక్టరమ్మకు అర్థమైన విషయం.
రాత్రి తొమ్మిదిన్నరకు ఆసుపత్రి కట్టేసి వచ్చిన డాక్టరు గారికి ఇంటి వద్ద అపరకాళిక కనపడింది. “ఏమైంది అలా ఉన్నావు” అడిగాడు డాక్టరు గారు.
“ఏమీ కాలేదు. ముందు భోంచేయ్యండి.”
“నువు కూడా రా!”
“నేను తర్వాత చేస్తాను.”
డాక్టరు గారు భోంచేశారు. ఎంగిళ్ళెత్తి గిన్నెలు మూత పెట్టేసింది డాక్టరమ్మ.
“అదేంటి నువు తినట్లేదు.”
‘నా కాకలి లేదు.”
“ఏం”
“నేను చచ్చిపోవడమేగా మీకు కావల్సింది.”
“అదేంటి త్రిపురా! అర్థంపర్థం లేకుండా మాట్లాడతావు.”
“వీరలక్ష్మి ఇక్కడి కొచ్చిందా!”
డాక్టరు గారికి విషయం అర్థమైంది. నిట్టూర్చి అన్నాడు “అవును.”
“నాకింత వరకు ఎందుకు చెప్పలేదు.”
“అత్తయ్యగారెదుట ఈ చర్చ ఎందుకని చెప్పలేదు.”
“అది సాకు. నేనడిగి వుండకపోతే ఎప్పటికీ చెప్పేవారు కాదు.”
“చెప్పేవాణ్ణి. అయినా ఈ విషయాన్ని నీకెవరు చెప్పారు?”
“ఎవరు చెప్తే ఏంటి? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే లోకానికి తెలియదా!”
నవ్వొచ్చింది డాక్టరు గారికి. నవ్వితే ప్రమాదం. నవ్వును తమాయించుకుని జవాబిచ్చాడు. “పిల్లి కళ్ళు మూసుకుంది. కాని పాలు తాగలేదు.”
“పాలిచ్చి వెళ్ళిందా!” డాక్టరమ్మ గొంతులో తీవ్రమైన వెటకారం.
పరిస్థితి విషమించింది. ఇప్పుడేం చెప్పినా తను నమ్మదు. కాని ఇప్పుడే చెప్పాలి. ఎలా?
“త్రిపురా! నీకు సగం సగం విషయాలు, అవి కూడ తప్పుగా తెలిసాయి. జరిగింది మొత్తం చెప్తే గాని నీకు విషయమర్థం కాదు. భోజనం చెయి. అప్పుడు చెప్తాను.”
“ఈలోగా ఏంచెప్పాలా అని ఆలోచిస్తారన్నమాట.”
“లేదు త్రిపురా! ఇప్పుడైనా అప్పుడైనా జరిగింది మాత్రమే చెప్తాను. భోజనం చెయ్” చుబుకం పట్టుకు బ్రతిమిలాడాడు డాక్టరు గారు.
“దాని మొహం చూడనని నా మీద ఒట్టుపెట్టుకున్నారు. దాన్ని ఏకంగా ఇంటికి తీసుకొచ్చారు. ఒట్టు పనిచేసి నేను చచ్చిపోవాలనే కదా మీ ఉద్దేశ్యం.”
“ఛ! ఛ! అలాంటిదేం లేదు. మొత్తం విన్నాక నీకే తెలుస్తుంది. నేను ఒట్టుకు కట్టుబడి ఉన్నానని” సముదాయించాడు డాక్టరు గారు.
ఎప్పటెప్పటి కబుర్లో చెపుతూ, డాక్టరు గారు వడ్డిస్తుంటే భోజనం పూర్తి చేసిందావిడ. గిన్నెలు సర్దుకొచ్చి, ముందు గదిలో డాక్టరు గారి ఎదుట కుర్చీలో కూర్చుంది. “ఇప్పుడు చెప్పండి.”
“విషయాన్ని మరిచిపోలేదన్నమాట” చిరునవ్వుతో అడిగాడు డాక్టరు గారు.
“అది మర్చిపోయే విషయం కాదు. నేను జీవించి ఉండాలా! ఆత్మహత్య చేసుకోవాలా! అని తేల్చుకోవాల్సిన విషయం.” తీవ్రంగా బదులిచ్చింది డాక్టరమ్మ.
“అలాంటి ఆలోచనే రావద్దు డాక్టరమ్మా! జరిగింది చెప్తా విను” అంటూ వీరలక్ష్మి తన దగ్గర కొచ్చింది లగాయతు ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు డాక్టరు గారు.
“అసలు దానింటికెళ్ళాల్సిన అవసరమేమొచ్చిందండి మీకు” డాక్టరమ్మ కోపమింకా చల్లారలేదు.
“వీరలక్ష్మి ఇల్లూ, వాకిలి నాకు తెలీవు. చంద్రా హోమియో స్టోర్సులో మందులు కొనుక్కొని కృష్ణమాచారింటికని వెళుతున్నాను. వీధిలో ఐస్ ఫ్రూట్ కొనుక్కుంటోందిట. నన్ను చూచి పిలిచింది.”
“జోడెడ్లపాలెంలో ఇంటిముందర ముగ్గు వేసుకుంటుంటే చూచి పిలిచింది. మిమ్మల్ని ముగ్గులోకి లాకింది. ఇప్పుడు ఐఫ్రూట్ కొనుక్కుంటూ చూసి పిలిచింది. మీరు ఐస్‌లా కరిగిపోయి దానింట్లోకి వెళ్ళిపోయారు.”
“అలాంటిదేం లేదు త్రిపురా! కృష్ణమాచారి ఊళ్ళోలేడని ముందే తెలిసుంటే, అసలా వీధిలోకే వెళ్ళేవాడిని కాను.”
“ఒకసారి దాని సావాసం చేశారు. సర్వస్వాన్ని పోగొట్టుకొని కట్టుబట్టల్తో మిగిలారు. మళ్ళీ దానితో మీకేం పని.”
“తనంతట తనే నన్ను వెతుక్కుంటూ వచ్చింది”
“అదే అంటున్నా! మీ మీద వ్యామోహం లేకపోతే అదలా రాదుకదా! మొదటిరోజే నాలుగు చీవాట్లు పెట్టి ‘జన్మలో నాకు నీ మొహం చూపించొద్దు’ అని చెప్పడానికేమడ్డమొచ్చింది” తీవ్రంగానే అడిగింది డాక్టరమ్మ.
“సంస్కారం”
“కాదు, తనపట్ల మీకు గల ప్రేమ. అంతర్నిహతమైన ప్రేమ. పచ్చిగా చెప్పాలంటే కామం.”
“లేదు త్రిపురా! ప్రమాణపూర్తిగా చెపుతున్నాను. నీ మీద ఒట్టేసిన క్షణాన్నుండే తన పట్ల నాకు గల కామభావనను వదలివేశాను. తనకు ఆ విషయాన్ని చెప్పాను కూడా.”
“ఏమని? ‘నా పెళ్ళామీద్మ ప్రమాణం చేశాను కనుక నిన్ను ముట్టుకోవడానికి లేదు. నన్ను క్షమించు’ అనా!” డాక్టరమ్మ నాలుక పదును ముందు కత్తిపీట పదును కూడా పనికొచ్చేలా లేదు.
“ఛఛ! నా వ్యక్తిత్వమ్మీద నీకు నమ్మకం లేదా! ‘ఏ కారణంగా ఏర్పడ్డా, మనది అక్రమ సంబంధం. అక్రమ సంబంధం ఏదో ఒక రోజున రద్దు కావలసిందే. జోడెడ్లపాలెం సంఘటనతో రద్దైంది. ఇక నుండి నేనెవరో నీవెవరో!’ అని చెప్పాను.”
“మరింటికెందుకొచ్చింది” డాక్టరమ్మకు అనుమానం తీరలేదు.
“చెప్పాను కద! ఆసుపత్రి నుండి జట్కాలో వచ్చామని. తనూ నేను మాత్రమే గాక ఇంకో ఇద్దరు కుర్రాళ్ళు వచ్చారని చెప్పాను కదా!”
“మూడ్రోజులు వరుసగా!”
“తనొక్కతే వచ్చింది. వండి పెట్టడానికొచ్చింది. నేను వద్దన్నాను. వినలేదు. తీవ్రంగా కోప్పడ్డాను. నొచ్చుకొంది. మారు మాట్లాడలేదు. ఆ రోజు నుంచి రావడం మానేసింది.”
“ఆసుపత్రికి వస్తోంది కదా!”
“అప్పుడప్పుడూ వస్తోంది.”
“ఎందుకట.”
“తను మానసిక సంతులనాన్ని కోల్పోయింది. బాల్రెడ్డి తనతో క్రూరంగా ప్రవర్తించాడు. చెప్పుకోవడానికొస్తోంది. నేను తనకు వైద్యం చేస్తున్నాను. మందులు తక్కువ మాటలు ఎక్కువ” వివరించాడు డాక్టరు గారు.
“బాల్రెడ్డి దేం తప్పు. ఏ మగాడైనా తన పెళ్ళాం పరాయివాడి దగ్గర పడుకుంటే సహిస్తాడా! వీరలక్ష్మి చేసిన తప్పే నేను చేస్తే ‘పోనీలే డాక్టరమ్మా! మంచి పనిచేశావు’ అని నన్ను కావలించుకొని ముద్దుపెట్టుకుంటారా మీరు.”
“త్రిపురా!” డాక్టరు గారి గొంతులో తీవ్రత ధ్వనించింది.
“చూశారా! నేను మాట వరుసకొక తప్పుడు మాటంటేనే మీకింత కోపం వచ్చింది. మరి మీరిద్దరూ కలసి చేసిన పనికి బాల్రెడ్డికి కోపం రాదా!”
“క్షమించు త్రిపురా! ఒకటి మాత్రం సత్యం. నేను త్రికరణశుద్ధిగా చెప్తున్నాను. ఇప్పుడు వీరలక్ష్మి నాకొక పేషెంటు మాత్రమే. వేరే ఏది కాదు.”
“జోడెడ్లపాలెంలో కూడా ఆవిడ మీకు పేషెంటుగానే పరిచయమైంది.”
“అంటే ఒక ప్రణాళిక ప్రకారం నన్నామె లొంగదీసుకుందంటావా”
“కావచ్చు. కాకపోవచ్చు. ఆమె జబ్బును గుర్తించి మీరు నయం చేశారు. దైవికంగా ఆవిడ భర్త జబ్బును కూడా నయం చేశారు. లేకుంటే ఆమె చనిపోయే పరిస్థితి. ఆ కృతజ్ఞతతోనే వీరలక్ష్మి తనను తాను మీకర్పించుకొంది” విశదపరిచింది డాక్టరమ్మ.
“అది సమంజసమేనంటావా!”
“సమంజసమా! అసమంజసమా! అన్నది ప్రశ్న కాదు. ఏ స్త్రీయైనా తాను పొందిన మేలుకు సంబంధించిన ఋణం తీర్చుకోలేనిదని అనిపించినప్పుడు, తనను తాను దైహికంగా సమర్పించుకోవడం ద్వారా ఆ ఋణాన్నుండి విముక్తిని పొందుతుంది. కట్టుబాట్ల కారణంగా తనను తాను అర్పించుకొనడం సాధ్యం కానప్పుడు, ఆమె వారి పట్ల అపూర్వమైన ఆదరణ చూపెడుతుంది. రుచికరంగా వండి పెట్టాలనుకొంటుంది. వీలైతే భర్తకు చెప్పి వారికేమైనా సాయం చేయించాలనుకుంటుంది. వారు ఆపదలో ఉంటే ఆదుకోవాలనుకొంటుంది. ఉత్తమమైన సంస్కారం కలిగిన స్త్రీ వారిని తోబుట్టువులనుగా చేసుకుంటుంది. ఇది స్త్రీ సహజమైన తత్త్వం” ఉపన్యాసాన్ని ముగించింది డాక్టరమ్మ.
“వామ్మో! ఆడవాళ్ళ ప్రవర్తనలో ఇన్ని అంతరార్థాలుంటాయా!”
“ఇంకా ఎక్కువే వుంటాయి. చెప్పినా మీకర్థం కావు. అర్థమైవుంటే మీరు కూడ ఆడదానిగానే పుట్టేవారు.”
“అప్పుడు మన సంసారం.”
“మీ మొగుడు వేరే. నా మొగుడు వేరే!” గలగలా నవ్వింది డాక్టరమ్మ.
ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయారా దంపతులు.
(ఇంకా ఉంది)