[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
ప్రకృతి కాంతకు..
~
చిత్రం: సిరివెన్నెల
సంగీతం: కె.వి. మహదేవన్.
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: ఎస్పీ. బాలసుబ్రమణ్యం
~
పాట సాహిత్యం
పల్లవి:
ప్రకృతి కాంతకు ఎన్నెని హొయలో
పదము కదిపితే ఎన్నెన్ని లయలో
ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో ॥2॥ ॥ప్రకృతి ॥
సిరివెన్నెల నిండిన ఎదపై సిరిమువ్వల సవ్వడి నీవై నర్తించగ రావేలా – నినునేఁ కీర్తించేవేళ
చరణం :
అలల పెదవులతో – శిలల చెక్కిలిపై కడలి ముద్దిడువేళ
పుడమి హృదయంలో ఉప్పొంగి సాగింది అనురాగము
ఉప్పెనగ దూకింది ఈ రాగము ॥ప్రకృతి॥
చరణం :
కొండల బండల దారులలో, తిరిగేటి సెలయేటి గుండెలలో
రా రా రా రమ్మని పిలిచిన ॥2॥
కోన పిలుపు వినిపించగనే ॥ 2 ॥
ఓ కొత్త వలపు వికసించగనే
ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో ॥ప్రకృతి॥
♠
మనోహరమైన, మనోరంజకమైన, రసాత్మక కవితా శిల్పమే, భావ కవిత్వమని నిర్వచించుకుంటే, ఈ ఉదాహరణలలో వాల్మికి అనుష్టుప్పులు, వ్యాసుని అనుష్టుప్పులు, కాళిదాసు వృత్తాలు, కవిత్రయం పద్యాలు, శ్రీనాధుని పద్యాలు, పోతన పద్యాలు, అష్ట దిగ్గజాల పద్యాలు, రాయల వారి పద్యాలు, చేమకూర వెంకటకవి పద్యాలు, మరెందరో కవుల పద్యాలు చోటుచేసుకుంటాయి.. ఇవేకాక జయదేవుని అష్టపదులను, అన్నమయ్య పదాలలో కొన్నిటిని, త్యాగరాజ కృతులలో కొన్నింటిని, క్షేత్రయ్య పదాలలో కొన్నింటిని, భావ కవిత్వానికి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. గత సంచికలో చర్చించినట్టు, కవితా శిల్పం భావాత్మకమైనా, కవితా వస్తువులో మాత్రమే భేదాలు గమనించవచ్చు.
ఇకపోతే ఈ శతాబ్దంలోని కవులలో భావకవితలు వ్రాసిన వారు ఇంకా ఎందరో వున్నారు.. వారిలో కొందరు ప్రముఖులు.. తిరుపతి వెంకట కవులు, పింగళివారు, కాటూరివారు, విశ్వనాథ సత్యనారాయణ, జంధ్యాల పాపయ్య శాస్త్రి, జాషువా, తుమ్మల సీతారామమూర్తి చౌదరి, గురజాడ అప్పారావు, నండూరి సుబ్బారావు, బసవరాజు అప్పారావు, సముద్రాల రాఘవాచారి, మల్లాది రామకృష్ణ శాస్త్రి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, ఆరుద్ర, శ్రీ శ్రీ, దాశరధి, వంటి వారు.. ఇలాంటి మహనీయులు.. ఇంకెందరో ..
అలాగే ఈ నాటి భావకవితా రంగంలో (చలనచిత్ర సాహిత్యం ద్వారా కూడా) సుప్రసిద్దులు: డా॥ సి. నారాయణరెడ్డి, వేటూరి సుందర రామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, భువనచంద్ర, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంత శ్రీరామ్, భాస్కరభట్ల.. ఇలా ఇంకా ఎందరో.. భావ కవితా సిద్ధులు.
భావ కవిత్వ లక్షణాలలో ఒకటి, ప్రకృతి ప్రియత్వం. ఇంగ్లీష్ సాహిత్యంలో, Romantic Period లో అంతులేని ప్రకృతి వర్ణనలతో నిండిపోయింది. ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధిస్తూ వ్రాసిన చాలా ప్రముఖమైన కవితలలో కొన్ని:
I Wandered Lonely as a Cloud – William Wordsworth,
A Red Red Rose – Robert Burns,
On the Grasshopper and Cricket – John Keats,
The Call of the Wild- Alexander Posey,
A Bird Came Down the Walk- Emily Dickson,
The Road Not Taken, Nothing Gold Can Stay, Stopping by The Woods on a Snowy Evening- Robert Frost,
The Brook- Alfred Tennyson
Sonnet 18 – William Shakespeare,
Sea Fever- John Masefield,
Winter Morning – Odgen Nash,
The Rain- W.H.Davie,
Tulips- Sylvia Plath
ఈ కవితలన్నీ కూడా మనోహరమైన ప్రకృతి వర్ణనతో, హృదయాలను ఎంతగానో రంజింప చేశాయి. అదే విధంగా పైన ఉదాహరించుకున్న మన మహాకవులందరూ రమణీయ ప్రకృతికి అక్షర నీరాజనాలు అందించారు. ప్రకృతిని వర్ణించిన వాళ్లందరూ ఎంతో నిశితమైన పరిశీలన చేసి (microscopic observation), సూక్ష్మమైన వివరాలపై కూడా (minutest details) తగినంతగా focus చేసి, ఎంతో హృద్యమైన కవితలను వెలువరించారు. ఇప్పుడు మనం ప్రకృతి వర్ణనలకు ప్రాణం పోసిన సిరివెన్నెల సంద్రంలోని, ఆణిముత్యాలను కొన్నింటిని పోగేసుకుని ఆస్వాదిద్దాం.
ఇటీవల ఎక్కువగా వైరలైన, ‘సామజవరగమనా’ పాటలో.. నా చూపులనలా తొక్కుకు వెళ్ళకు/నీ కళ్ళకు కావలి కాస్తాయే కాటుకలా నా కలలు.. (నీ కళ్ళకు కావాలి కాస్తా యే కాటుకల నా కలలు.. అని వినిపిస్తుంది.. పాట వింటే.. ఆ పాడిన తీరులోని విరుపుల వల్ల, సాహిత్యాన్ని చదువుకుంటే గాని భావం మనసుకి ఎక్కలేదు!)/మల్లెల మాసమా, మంజుల హాసమా, ప్రతి మలుపులోను ఎదురుపడిన ‘వన్నెల వనమా’.. వంటి Ecstatic.. Highly Romantic expressions, ఏ భావలోకాల్లోకో మనల్ని తీసుకువెళ్తాయి.
‘సంకీర్తన’ చిత్రంలోని ఈ యుగళగీతాన్ని గమనిస్తే, మనసులో మలచిన సరిగమలు, తరగలుగా మారి, అతడి కలలను మోసుకొని వెళ్లి, ఒక కమ్మని ఊసును తెలియజేస్తాయట! అతనిలో పొంగే కవితలాగా ఆమె పరుగున వచ్చి, ఎద సందడితో నటించాలట! పాటలు మువ్వల రవళి పిలిస్తే, కవిత బదులు పలకడం, వసంతాల గీతమే మేలుకొల్పడం, భావాల పూలరాగాల బాట వేచి ఉండడం, ఏదో స్వరజతి నూతన పదగతి చూపడం, పాదాలను శ్రుతి చేయడం వంటి భావాత్మక ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి.
అతడు: మనసున మొలిచిన సరిగమలే
ఈ గలగల నడకల తరగలుగా
నా కలలను మోసుకు నినుజేరి
ఓ కమ్మని ఊసుని తెలిపేనే
కవితవు నీవై పరుగున రా.. ఎదసడితో నటియించగా.
~
ఇదే చిత్రంలోని మరో పాటలో ఈ ‘నేల కావ్యంలో’ ఉన్న వేవేల వర్ణాలు, అలలూ, శిలలూ తెలిపే కథలన్నీ నాలో గీతాలై పలుకుతున్నాయి. తల్లి గోదారి తుళ్ళి, తుళ్ళి పరుగడుతుంటే, పల్లెలో ఏపుగా పెరిగిన పచ్చిక, పచ్చని పందిరి అయింది. ప్రకృతిలోని ప్రతి కదలిక ఓ నాట్యమే, ప్రతి ఋతువు ఒక చిత్రమే, అని మైమరచి వర్ణిస్తారు సిరివెన్నెల. వాన తన వేలితో నేల వీణను మీటితోందట! ఆ నేల నింగి కలిసిన పాటే, ఈ చేలట! తోట అనే కవి కాళిదాసు పాట రాసుకుంటే పూలలాగా విరబూసాయట! భావ కవితకు ఇంతకంటే మంచి నిర్వచనం దొరుకుతుందా? అనిపిస్తుంది ఇలాంటి పాటలు వింటే.
పల్లవి:
అతడు : వేవేల వర్ణాల ఈ నేల కావ్యాన అలలూ శిలలూ తెలిపే కథలు పలికే నాలో గీతాలై వేవేలా వర్ణాల ఈ నేల కావ్యాన..
……..?
చరణం:
అతడు: వాన వేలితోటి నేల వీణ మీటే నీలి నింగి పాటే ఈ చేలట
కాళిదాసు లాటి ఈ తోట రాసుకున్న కమ్మనైన కవితలే ఈ పూలట
ప్రతి కదలికలో నాట్యమె కాదా ప్రతి ఋతువూ ఒక చిత్రమె కాదా ఎదకే కనులుంటే॥వేవేల॥
~
‘సంసారవీణ’, చిత్రంలో వాళ్ల కుటుంబంలో వెల్లివిరిసే ఆనందాలని, ఎంత అందమైన ఉపమానలతో పోల్చారో గమనించండి! ఆమని రాగం లాంటి అనురాగం/ శ్రావణ మేఘం లాంటి చల్లని మమకారం/ పిల్లనగ్రోవి అల్లరి స్వరాల వంటి పిల్లలు/మొత్తం మీద వారి బ్రతుకులు పున్నమి కడలిలో వెన్నెల తరగలలా, చీకటి ఛాయలే ఎరగని బ్రతుకుల్లా ..తుది లేని ఆనంద సామ్రాజ్యంలో ఉన్నాయట! ఇంత గొప్ప భావవ్యక్తీకరణలకు మనసారా జేజేలు పలకడం తప్ప, తనివారా ఆస్వాదించడం తప్ప, మనం చేయగలిగింది ఏమీ లేదు.
పల్లవి:
ఆమె: సత్యం శివం సుందరం మా అందాల మందార మందిరం
అరుదైన కాంతుల స్వర్ణోదయం
అపరంజి ఆశల స్వప్నాలయం ॥సత్యం శివం సుందరం॥
చరణం:
ఆమె: ఆమని రాగంలా వెచ్చని అనురాగం అందించు శ్రీవారి సాంగత్యం ఇల్లాలి సారధ్యం
అతడు: శ్రావణ మేఘంలా చల్లని మమకారం చిందించు
ఆమె: పిల్లనగ్రోవిలో అల్లరి స్వరములు పిల్లల నవ్వులే ఇంటికి వెలుగులు….
……
ఆమె: సాగాలి తుదిలేని ఆనంద సామ్రాజ్యం ॥సత్యం శివం సుందరం॥
చరణం:
……….
అతడు: పున్నమి కడలిలో వెన్నెల తరగలు చీకటి ఛాయలే ఎరగని బ్రతుకులు..
~
‘రాముడు కాదు రాక్షసుడు’ చిత్రంలో సిరివెన్నెల గారి మరొక అందమైన భావ కవితా సుమం.
ఆమె: చుక్కలకందని జాబిలివో చక్కిలిగింతల జావళివో నీకే జోహారయ్యో నీలో ఏంజోరయ్యో ఊపే తూఫానల్లే ఊపేసిందయ్యో..
అతడు: సూర్యుడు చూడని సుందరివో కాముడి జాడల సందడివో నీకే జోహారమ్మో దూకే గోదారమ్మో సోకే తూనిగల్లె తూగాడిందమ్మో..
~
‘కచదేవయాని’ చిత్రంలో తన సొగసులకు తానే మురిసిపోయిన దేవయాని, తనతో సరితూగగల అందాలు పూలకన్నెలకు ఉన్నాయా? పాలవెన్నెలకు ఉన్నాయా? వాన విల్లులకు ఉన్నాయా? లేక తేనె జల్లులకు ఉన్నాయా.. అని పాడుకుంటుంది. ఇక కోయిలనూ, నెమలినీ, హంసను, చేపను, జలపాతాలను, సెలయేటిని.. ఇన్ని కలిసిన ప్రకృతి శోభలను, తన అందాలకు ధీటుగా నిలవగలవా అని ప్రశ్నిస్తుంది. గాలిని తరలివచ్చి తన మేని సుగందాన్ని పూసుకుని వెళ్ళమని ఆహ్వానిస్తుంది. నూటికి నూరు శాతం భావతీతమైన అభివ్యక్తే కదా!
పల్లవి:
పూల కన్నెలా లేక పాల వెన్నెలా వాన విల్లులా కాక తేనె జల్లులా ఈ భువిలో మరి ఆ దివిలో నను పోలిన అందములేవి మరి
చరణం:
కాటుక పూసుకు కూసెదవేటికి పొగరెందుకే కోయిలా
నా వలె పాటకు దీటగు మేని పసందులు నీకున్నవా కొంచెము పింఛము దించి తలొంచుకు పోవే మయూరమా
సర్వాంగ సౌందర్య నటనాలయం నేను నా ముందు వయ్యారమా
తుళ్ళేవు నీళ్ళలో దేనికి మీనా నా సోగ కళ్ళకు పోలిక నీవనా ఓ గాలీ ఆగాలి నా మేని గంధాలు పూసుకు పో
చరణం:
లేజవరాలిని నా నడకలుగని చూపవె నీ సొగసు రాచమరాళమ నీ అడుగులు తడబడులే అది తెలుసా
గల గల పారెడు సెలయేరా నా ఈడుకు సరి జోడు ఉరకల పరుగిడు పరువముతో జలపాతములే ఓడు ప్రకృతి శోభలనేకములైనా ఆ అందాలన్నీ ఏకమే అయినా నా ముందు నిలిచేనా అందాల పందెము గెలిచేనా..
~
‘నేటి చరిత్ర’, చిత్రంలోని మరో మేటి ఉపమానాలూ, అభివ్యక్తులు గల ఈ యుగళగీతం.. చిగురు తొడిగిన శిలలు.. చెలిమి చినుకు.. ఎడారిలో విడిది చేసిన వసంతం.. చిలిపి తలపు మొలవడం.. ప్రతిక్షణం సుధా నదీ ప్రవాహం.. పరుగులిడే సరాగం.. ఎటు చూసినా ఉషా రాగాలే.. చిటికేసిని నిషా గానాలే..
వంటి సుందరమైన పదబంధాలు.. మన మనసును ఆనంద డోలికలూగిస్తాయి.
ఆమె : శిలలు చివురు తొడిగె చెలిమి చినుకు కురిసె నొసటి నిశిని కడిగె పసిడి వెలుగు విరిసె ఎడారిలో విడిది చేసె వసంతం ఇదే కదా ఎదకు ప్రథమ నిశాంతం ఆకాశమే దిగే నా కోసం సాగాలని సదా సావాసం
ఇతడు : కలలు కనులు తెరిచె కలికి కులుకు మెరిసె వలపు పిలుపు తెలిపె చిలిపి తలపు మొలిచె ప్రతి క్షణం సుధానది ప్రవాహం పదే పదే పరుగులిడే సరాగం ఎటు చూసినా ఉషారాగాలే చిటికేసినా నిషా గానాలే
~
‘సంసారవీణ’ చిత్రంలోని విరహ గీతంలో కూడా, వాన జాడ లేని ఎద ఎడారి.. శృతి పోయిన గీతి.. శూన్యంలో సుడి తిరుగు బ్రతుకు.. కలలు రేపి కరిగిన స్వర్ణ సీత.. వంటి ఉదాత్త ఉపమానాలు, సిరివెన్నెల గారి భావుకతకు కొన్ని ‘మెచ్చు’తునకలు.
ఆగిపోదేమి ఈ గుండె ఇంకా మూగబోదేమి ఈ గొంతు ఇంకా@2
స్వాతివాన జాడలేని ఎద ఎడారిలో శృతిపోయిన గీతిలోని కడలి హోరులో @2
శూన్యంలో సుడితిరుగుతు బ్రతికున్నది ఇంకా ఈ బదులు రాని కేక
బ్రతుకు తీపి చెరిపిన ఆ చెలిమి గీతను కలలు రేపి కరిగిన ఆ స్వర్ణ సీతను
గీతా గీతా సీతా గీతా గీతా అని వెతుకుతు వెళ్ళిపోక గీతా ॥ఆగిపోదేమి॥
ఈ భావలహరిలోని ఊహాత్మక గీతాలు ఎంత చర్చించుకున్నా తరగవు కాబట్టి, ఈరోజు మనం విశ్లేషించుకోవాల్సిన, సిరివెన్నెల చిత్రంలోని, ‘ప్రకృతికాంతకు ఎన్నెన్ని హొయలో..’ అన్న సీతారామశాస్త్రి గారి గీతంలోని భావ కవిత్వపు వెల్లువలో ఒకసారి తనివితీరా మునకలేద్దాం.
హరి, జ్యోతి సాగర తీరంలో విహారం చేస్తుండగా, అంధుడైన కథానాయకుడు హరికి, జ్యోతి ప్రకృతి అందాలను తన స్పర్శ సహకారంతో కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తుంది. తన మనోనేత్రంతో వాటిని దర్శించుకోగలిగిన హరి ఎంతో పులకించిపోతాడు. ప్రకృతి అందాలకు ఆనందపరవశుడై హరి ఈ పాటను ఆలపిస్తాడు. ఇక్కడ మనం మరో ముఖ్యమైన విషయం గుర్తు చేసుకోవాలి. Anne Sullivan Macy (ఆన్ సలువిన్ మ్యాసి) అనే పాక్షికంగా అంధత్వం బారినపడిన ఒక శిక్షకురాలు, అతి చిన్న వయసులోనే ఒక జ్వరం వల్ల, కళ్ళు, వినికిడి శక్తి, మాట..అనే మూడు ఇంద్రియాలు పనిచేయకుండా ఆగిపోయిన హెలెన్ కెల్లర్ కు.. జ్ఞాన బిక్ష పెట్టి, అత్యంత ప్రభావవంతురాలిగా తీర్చిదిద్దగలిగింది. కేవలం స్పర్శించడం, వాసన చూడగలగడం అనే రెండు ఇంద్రియ జ్ఞానాలతోనే, ప్రపంచం మరువలేని ఒక గొప్ప వ్యక్తిగా, రచయిత్రిగా, వక్తగా, హెలెన్ కెల్లర్ ను మార్చగలిగిందంటే, ఆ బోధకురాలి గొప్పదనాన్ని గుర్తించండి. సామాన్య మానవుల ఊహకు కూడా అందని అంత గొప్ప ఘనతను సాధించిన, శిక్షకురాలు.. పట్టుదలతో సాధించి ఉన్నత శిఖరాలను అందుకున్న శిష్యురాలు.. ఇద్దరూ శ్లాఘనీయులే! అంత గొప్ప concept తో, రాసిన.. చిత్రీకరించిన ఈ పాట.. అంతే స్థాయిలో ప్రజల మన్ననలు పొందగలిగింది.
పల్లవి:
ప్రకృతి కాంతకు ఎన్నెని హొయలో
పదము కదిపితే ఎన్నెన్ని లయలో
ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో ॥2॥ ॥ప్రకృతి॥
సిరివెన్నెల నిండిన ఎదపై సిరిమువ్వల సవ్వడి నీవై నర్తించగ రావేలా – నినునేఁ కీర్తించేవేళ
ప్రకృతిని ఒక నిండు యవ్వనవతి లాగా, ‘ప్రకృతి కాంత’, అని సంబోధిస్తూ, ఆమెలోని హోయలన్నింటిని వర్ణిస్తున్నారు సిరివెన్నెల. ఒకవేళ ఆ ప్రకృతి కాంత పదము కదిపి నర్తిస్తే.. ఎన్ని లయలు ప్రకటితమవుతాయో.. ఒక ఊహా గానం చేస్తున్నారు. ప్రకృతి కన్యను చూసిన పారవశ్యంలో ఎద నిండుగా సిరివెన్నెల పరుచుకోగా , ఆమెను కీర్తించేవేళ .. సిరిమువ్వల సవ్వడితో తన ఎదపై నర్తించడానికి రమ్మని ఆహ్వానిస్తున్నారు.
అలల పెదవులతో – శిలల చెక్కిలిపై కడలి ముద్దిడువేళ
పుడమి హృదయంలో ఉప్పొంగి సాగింది అనురాగము
ఉప్పెనగ దూకింది ఈ రాగము ॥ప్రకృతి॥
ఏ కళకైనా ప్రేరణ ప్రకృతి నుండే లభిస్తుంది. అందునా అది సముద్రం అయితే.. ఆ అనుభూతులకు అంతమే లేదు. ఎగసిపడుతున్న అలలను పెదవులతో, శిలలను చెక్కిళ్లతో పోలుస్తూ, అలలు శిలలను ముద్దాడే వేళ, పుడమి హృదయంలో అనురాగం పొంగి పారగా.. ఈ సంగీతకారునిలో (కథానాయకుడు హరి)ఈ రాగం ఉప్పెనలాగా దూకి వచ్చిందట! Poetry is a spontaneous overflow of powerful thought, అంటారు.. ఒక్క పోయెట్రీ మాత్రమే కాదు, ఈ కళ అయినా.. అలాంటి ఉప్పొంగే భావమే.
కొండల బండల దారులలో, తిరిగేటి సెలయేటి గుండెలలో
రా రా రా రమ్మని పిలిచిన ॥2॥
కోన పిలుపు వినిపించగనే ॥2॥
ఓ కొత్త వలపు వికసించగనే
ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో ॥ప్రకృతి॥
బాహ్య నేత్రాలతో దర్శించుకోలేక, ప్రకృతి అందాలను అనుభవించలేని హరి స్తబ్దుగా ఒక బండలాగా ఉండేవాడన్న సంకేతాన్ని రెండవ చరణంలో అందిస్తున్నారు సిరివెన్నెల. అలా కొండల బండల మధ్య పారే సెలయేరు, అన్ని వర్ణాల సమాహారమైన పచ్చటి కోన పిలుపు వినగానే, ఒక కొత్త వలపు వికసించినట్టు, హరిలో ఆ ఆనందానుభూతి వల్ల కొత్త కొత్త రాగాలు, భావాలు ఉప్పొంగి వచ్చాయన్న అర్థాన్ని.. మనకు స్ఫురింపజేశారు సిరివెన్నెల.
సిరివెన్నెల చిత్రమే ఓ దృశ్యకావ్యం. కళాతపస్వి తపనకు అదొక మచ్చుతునక. దానికి తోడుగా సిరివెన్నెల గారి సాహిత్యం.. ఆ చిత్రానికి మరింత వన్నెలు కూర్చింది. మంచి సాహిత్యం కోసం వేసి చూస్తున్న కళా హృదయాలకు ఎడారిలో ఒయాసిస్సులా ఎదురొచ్చింది సిరివెన్నెల కలం.
‘సిరివెన్నెల చిత్రంలో రాసిన పాటలన్నింటిలోకీ ఎక్కువ సమయాన్ని తీసుకున్న పాట ఇదే’, అని శాస్త్రిగారు ఒక సందర్భంలో చెప్పారు. ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హోయలు లయలూ ఉన్నాయో, అన్ని వయ్యారాలు సిరివెన్నెల కలానికి కూడా ఉన్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు
Images Courtesy: Internet