హోమ్ టౌన్

18
3

[2024 క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీ తుర్లపాటి నాగేంద్రకుమార్ రచించిన ‘హోమ్ టౌన్’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]సు[/dropcap]మారుగా రాత్రి పదిన్నర గంటలు అయింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు ఆగిన క్యాబ్ నుంచి మురళి, అతని సతీమణి విమల ఒకరి వెనుకగా ఒకరు దిగి జనాన్ని తప్పించుకుంటూ, ప్లాట్‌ఫామ్ వైపు అడుగులు వేశారు. రోడ్డుకిరువైపులా, చీమల బారులా కదులుతున్నాయి వాహనాలు. స్టేషన్ ప్రాంగణమంతా, వచ్చి పోయే, వాహనాలతో చాలా రద్దీగా ఉంది.

ప్లాట్‌ఫామ్ మీద ప్రయాణికులు తమ లగేజీని ఓ కంట గమనించుకుంటూ, గుంపులు గుంపులుగా, ట్రైన్ రాక కోసం వేచి ఉన్నారు. అదే పనిగా, ప్రయాణికుల దృష్టికి ఆనేలా, ప్లాట్‌ఫామ్ పై కప్పుకి, వేలాడదీసి, కదలకుండా, బిగించి ఉన్న టీవీలలో వస్తున్న అడ్వర్టయిజ్మెంట్స్, మైక్‌లో రైళ్ల రాక,పోకల వివరాలు, ప్రయాణికుల మాటలు, ట్రాలీ బాగ్ల చక్రాల చప్పుళ్ళు, అన్నీ కలిసి, రణగొణ ధ్వనిని సృష్టస్తున్నాయి.

మురళి, భార్యతో పాటు, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ, అక్కడి నుంచి వారి గమ్యానికి బస్సులో ప్రయాణం చేయాలి. అంతలో ట్రైన్ వచ్చింది. తమ ఏ.సీ. ఫస్ట్ క్లాస్ కూపేని, వెతుక్కుని ట్రైన్ ఎక్కారు. ఎన్నాళ్లగానో, కూపేలో భార్యతో కలిసి, ప్రయాణించాలన్న, మురళి కోరిక, ఆ రోజు తీరబోతొంది. కూపేలో, స్లయిడింగ్ డోర్ కి, కిటికీకి, ఉదా రంగు  కర్టెన్స్ ఉన్నాయి. టైం పదకొండు దాటుతోంది.

ఓ జర్క్‌తో, ట్రైన్ బయలుదేరింది.

మర్నాటి ప్రోగ్రాం గురించి, కాసేపు ముచ్చటించుకున్నాక, భార్యాభర్తలిరువురూ, నిద్రకి ఉపక్రమించారు. అప్పర్ బెర్త్ మీద, పడుకున్న, మురళికి, చిరకాల కోరిక తీరబోతోంది అన్న ఆలోచనతో నిద్ర రావటం లేదు.

మురళి ఆలోచనలు గతంలోకి దారితీసాయి.

***

తెల్లవారు జాము ఐదు గంటలవుతోంది. ఆగిన మినార్ ఎక్స్‌ప్రెస్‌ కంపార్ట్మెంట్ దిగి, ప్లాట్‌ఫామ్ మీద అడుగుపెట్టాడు మురళి.

‘కళ్యాణ్’ రైల్వే స్టేషన్ చలిగా ఉంది. క్రితం రాత్రంతా, మంచులో తడిసిన, విద్యుదీపాల కాంతి మందకొడిగా ఉంది. లోకల్ ట్రైన్స్ ఆగే ప్లాట్‌ఫామ్‌కి, చేరుకొని, కళ్యాణ్ స్టేషన్‌కి, మరో స్టేషన్ ఆవల ఉన్న ‘ఉల్హాస్ నగర్’లో ఉంటున్న, తన తండ్రి సహోద్యోగి కొడుకు వేణు ఇంటికి వెళ్ళాడు మురళి. వేణుకి, మురళితో పరిచయం లేకపోయినా, సాదరంగా, రిసీవ్ చేసుకున్నాడు. వేణు గాడ్రెజ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అతని భార్య డెలివరీకి పుట్టింటికి వెళ్ళింది. వంటా వార్పూ అతనే చేసుకుంటున్నాడు.

ఫ్రెష్ అయినాక, వేణు అందించిన, ఉప్మా పళ్ళాన్ని, మొహమాటంగా, అందుకున్నాడు, మురళి.

టైం ఏడున్నర గంటలు, కావొస్తోంది. సూట్‌కేసు తెరిచి, బట్టల మాటున జాగ్రత్తగా ఉంచిన ఎన్వలప్ చేతిలోకి తీసుకున్నాడు మురళి. అందులో అతని అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంది. ఆ క్షణంలో, ఓ దివ్యశక్తి అపాయింట్మెంట్ ఆర్డర్ రూపంలో, తన చేతిలో ఉన్నదన్న అనుభూతి కలిగింది మురళికి. వేణు సూచనల మేరకు, ఆఫీసుకి బయలుదేరాడు.

సుమారుగా, అరవై కిలోమీటర్లు, లోకల్ ట్రైన్‌లో వెళ్ళాలి. వేణు ఇంటికి, దగ్గరగా ఉన్న అంబర్ నాథ్ స్టేషన్లో, లోకల్ ట్రైన్ ఎక్కి, దాదర్ స్టేషన్‌లో ట్రైన్ మారి చర్చ్ గేట్ చేరాడు మురళి. అక్కడి నుండి ఓ ఫర్లాంగ్ దూరంలో ఉన్న ఏ.జి. ఆడిట్ ఆఫీసుకి కాలినడకన చేరుకున్నాడు.

ఆఫీస్ గేట్ లోకి, అడుగుపెడుతూ తన పక్కనే, నడుస్తున్న వ్యక్తిని, టైం కిత్నా హువా?, అని అడిగాడు, మురళి. నౌ అని బదులిచ్చాడు ఆ వ్యక్తి.

వడి వడిగా, అడుగులు వేస్తూ, ఆఫీస్ బిల్డింగ్లోకి, వెళ్ళాడు మురళి. తడబడే అడుగులతో, ఆనందంతో ఎగిసిపడే, హృదయంతో, అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ లోకి, అడుగుపెట్టాడు. ఏ.ఓ, అడ్మినిస్ట్రేషన్ సూచనలనుసరించి, జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి, ఆడిటర్‌గా ఉద్యోగంలో చేరాడు. అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ లోనే, పోస్టింగ్ ఇచ్చారు.

పోస్టింగ్ ఆర్డర్ చూస్తుంటే, చిన్ననాటి చందమామ కధలలో, సప్త సముద్రాలు దాటి, అభేద్యమైన మాంత్రికుడి స్థావరంలోని రాక్షస, అదృశ్య, దుష్టశక్తులని, ఎదిరించి, వాటిని అంతంచేసి, మాంత్రికుడిని సంహరించి, మాంత్రికుడు అపహరించిన, రాకుమారిని రక్షించి, ఆమె చేయి అందుకుని, సువిశాల సామ్రాజ్యానికి రాజుగా, పట్టాభిషిక్తుడైన, ఆశావాది, ధీరశాలి అయిన, ఓ సాధారణ యువకుని అనుభూతి, ఎలా ఉంటుందో, అలాంటి ఫీలింగ్ కలిగింది, మురళికి.

***

ఆ మరునాడు తన సీటులో కూర్చుని, ఓ ఫైల్ చూస్తూ ఉండగా, ఏ.ఓ గారి, దగ్గర ఉండే, ప్యూన్ వచ్చి, ఏ.ఓ గారు, రమ్మంటున్నారని, చెప్పాడు.

ఏ.ఓ రూమ్ లోకి వెళ్ళగానే, “రండి, కూర్చోండి” అన్నారు, ఏ.ఓ గారు. మురళి గురించి, అతని తల్లి,తండ్రుల గురించి అడిగి తెలుసుకున్నారు. తరువాత ఆఫీస్ రూల్స్, రెగ్యులేషన్స్ గురించి క్లుప్తంగా వివరించారు. చివరిగా,  అందే జీతభత్యాల గురించి, ప్రభుత్వము అందించే ఇతర సౌకర్యాల గురించి, వివరిస్తూ ఎల్.టి.సి విషయం మాట్లాడుతూ,” మీ హోమ్ టౌన్, ఏది?” అని, అడిగారు.

హోమ్ టౌన్ అన్న మాట వింటూనే, ఓ క్షణం, మురళి హృదయం, చిత్రంగా స్పందించింది. మనసు, వర్ణనకి అందని, అనుభూతికి లోనయింది. తమ స్వంత ఊరి గురించి, తల్లి చెప్పిన విషయం, గుర్తుకు వచ్చింది.

మా హోమ్ టౌన్, రామాపురం, అని, చెప్పబోతున్న, మురళితో, “మీ పేరెంట్స్, హైదరాబాద్‌లో, ఉన్నారు కదా! మీరు, అక్కడి నుంచే, వచ్చారు కదా! హోమ్ టౌన్, హైదరాబాద్ అని, డిక్లేర్ చెయ్యండి. ఓ సంవత్సరం, సర్వీస్ కంప్లీట్ అయినాక, బాచిలర్‌గా ఉన్నన్నాళ్ళు, ఏడాదికోసారి, ఆ తరువాత, రెండేళ్లకొకసారి, మీరు హైదరాబాద్ వెళ్లి, ఎల్.టి.సి క్లెయిమ్ చేసుకోవచ్చు”, అని చెప్పారు ఏ.ఓ గారు. సరే అన్నట్టుగా తల ఊపాడు మురళి.

 తన సెక్షన్‌కి, వచ్చి, సీట్‌లో కూర్చున్నాడు. కొద్దిసేపటి క్రితం విన్న హోమ్ టౌన్ అన్న పదం చుట్టూ అతని ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి. ఇంతలో, పక్క సీట్‌లో, పే బిల్స్ చూసే ఆడిటర్ రామ్ వాడ్కర్, “మురళిజీ, చలో, చాయ్ పీనే జాయింగే” అని పిలిచాడు. అంతటితో అతని  ఆలోచనలకి తెరపడింది.

***

మురళి బొంబాయిలో, ఉద్యోగంలో జాయిన్ అయ్యి, మూడు నెలలవుతోంది. ఓ సారి, హైదరాబాద్ వెళ్ళొచ్చాడు. ఈ మధ్యకాలంలో, మరో ముగ్గురు ఆడిటర్‌లుగా, ఆఫీసులో జాయిన్ అయ్యారు. ఆ ముగ్గురూ, మురళితో కలిసి లంచ్ చేసేవారు.

ఓ రోజు, లంచ్‌లో, వారి మధ్య, ఎల్.టి.సి గురించి, చర్చ జరిగింది. రంజిత్ సింగ్ పంజాబీ. తన స్వంత ఊరు, పఠాన్‌కోట్‌కి ఓ నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న, సూరజ్‌పూర్ జిక్ర అని, ఆ ఊరునే హోమ్ టౌన్‌గా, డిక్లేర్ చేసానని చెప్పాడు. లక్ష్మణ్ తివారి, తమది వారణాసి దగ్గర, గంగానది తీరాన ఉన్న, చౌహానియా అనే గ్రామమని, అక్కడ తమకి పాతిక ఎకరాలకు పైగా, వ్యవసాయ భూమి ఉందని, తను, తమ, చౌహానియా గ్రామాన్ని, హోమ్ టౌన్‌గా డిక్లేర్ చేసానని అన్నాడు. ఇరువురూ, వచ్చే దీపావళి పండుగకి, ఓ ఏడాది సర్వీస్ పూర్తవుతుందని, హోమ్ టౌన్ ఎల్.టి.సి అవైల్ చేసుకుని, మా ఊరువెళ్తాము అన్నారు.

వారి మాటలు వింటున్న మురళిని, అతని స్వంత ఊరు రామాపురం తాలూకు ఆలోచనలు చుట్టుముట్టాయి.

చివరగా, విశ్వనాథన్, తన విషయం చెబుతూ, తన తండ్రి భిలాయ్, స్టీల్ ప్లాంట్‌లో ఇంజినీర్ అని, పుట్టి బుద్ది ఎరిగిన నాటి నుండి, తమ కుటుంబం, భిలాయ్ టౌన్ షిప్‌లో క్వార్టర్స్ లోనే ఉందని, నిజానికి, తమ స్వంత ఊరు తమిళనాడు ఈరోడ్ జిల్లాలో ఉన్న పల్లి పాలయం అని, కానీ, ఆ ఊరు పేరు తప్ప తనకి ఇంకేమి తెలియదని అన్నాడు. ఆ మాటలు చెపుతున్నప్పుడు, అతని కళ్ళలో, కదలాడిన, నిర్లిప్తత తాలూకు భావాన్ని, గమనించాడు, మురళి.

తనకే కాదు, స్వంత ఊరి మీద మమకారం అందరికీ ఉంటుంది అని గ్రహించాడు .

***

ఆ రోజు శుక్రవారం. ఆఫీస్‌లో కొద్దిగా పని ఒత్తిడితో లేట్ అయ్యింది.

శని, ఆదివారాలు సెలవే కాబట్టి, శుక్రవారం సాయంత్రాలు మెరైన్ డ్రైవ్ దగ్గరో గేట్‌వే అఫ్ ఇండియా దగ్గరో కాసేపు గడిపి, తనకి నచ్చిన చోట డిన్నర్ చేసి, రూమ్‌కి వెళ్తాడు మురళి.

ఆ రోజు గేట్‌వే అఫ్ ఇండియా దగ్గర, సిమెంట్ గట్టు మీద కూచుని, సాగరతరంగాలని గమనిస్తున్నాడు.

గేట్‌వే చుట్టూ ఉన్న, విద్యుద్దీపాల కాంతులు, నీటిలో ప్రతిబింబిస్తూ, తళుకు బెళుకులు సృష్టిస్తూ అలలతో పాటు కదులుతున్నాయి.

ఆ దృశ్యాన్ని అబ్బురంగా తిలకిస్తున్న అతని  భుజంపై ఓ వ్యక్తి చేయి వేసి “మురళీ” అంటూ పిలిచాడు. ఉలిక్కిపడి, లేచి నుంచుని, ఆ వ్యక్తి వంక చూసిన అతడు, “రేయ్, రవీ”, అంటూ అతన్ని వాటేసుకున్నాడు.

రవి, మురళి ఇద్దరూ క్లాస్మేట్స్, మంచి స్నేహితులు. నిజామాబాద్‌లో కాలేజి చదువు కలిసి చదివారు. రవి వాళ్ళ ఊరు నిజామాబాద్‌కి, సుమారుగా, నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న, కోటగిరి దగ్గర, ఓ గ్రామం. పేరు ఆమ్రపూర్. రవి కోటగిరిలో ఎస్.ఎస్.సి పాస్ అయ్యాక, నిజామాబాదులో ఓ రూమ్, అద్దెకు తీసుకుని ఉంటూ ఇంటర్, డిగ్రీ చదువులు చదివాడు. ఇద్దరూ కలిసి, రవి రూమ్‌లో, కంబైన్డ్ స్టడీ చేసేవారు.

“నువ్వెంటి! ఇక్కడ” అన్నాడు మురళి.

“ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్‌ల జాబ్ జాయిన్ అయ్యి, త్రీ మంత్స్ అయింది” అన్నాడు రవి. “ఈడ, నువ్వేంజేస్తున్నవ్?” అన్నాడు రవి.

“ఏ.జి ఆడిట్ ఆఫీస్‌లో ఉద్యోగం” అంటూ, చిరునవ్వుతో బదులిచ్చాడు మురళి.

సుమారు మూడేళ్ళ తరువాత, కలుసుకున్నారు. ఇద్దరికీ, చాలా సంతోషంగానూ, ఆనందంగానూ ఉంది. కలిసి డిన్నర్ చేసారు. కాలేజీ రోజుల్ని, గుర్తు చేసుకున్నారు.

“దసరాకి, హైదరాబాద్, వెళ్తున్నావా” అన్నాడు రవి.

“ఆ.. వెళ్తాను” అన్నాడు మురళి.

“నేను కూడా మా ఊరు పోవాల. ఊర్ల, బతుకమ్మ పండుగ మంచిగ చేస్తరు. అమ్మ, అక్క పండుగకు రమ్మని చెప్పిండ్రు. పోకుంటే, మా నాయనమ్మ ఊకోదు. నే రాలె అని ఏడుస్తది” అన్నాడు రవి.

డిన్నర్ అయినాక, వీడ్కోలు చెప్తూ, “నెక్స్ట్ సాటర్డే, మళ్ళీ కలుద్దాం” అన్నాడు మురళి.

“ఓ.కే” అంటూ బదులు చెప్పాడు రవి.

రవికి స్వంత ఊరు ఉంది. అక్కడ ఇల్లు ఉంది, ఆ ఇంట్లో, రవి గురించి బాధపడే, వాళ్ళ నాయనమ్మ ఉంది. మురళికి, తన, స్వంత ఊరు పేరు తప్ప, ఇంకేమి లేదు. ఆ ఊరు పేరు కూడా, అధికారికంగా చెప్పుకోవడానికి, ఆ ఊరిలో, ఎటువంటి బంధాలు, అనుబంధాలు లేవు.

అందుకే, తన, హోమ్ టౌన్ రామాపురం అని, డిక్లేర్ చేయలేకపోయాడు మురళి.

***

మురళి మనసులో, నిజామాబాదు జ్ఞాపకాలు కదలాడుతున్నాయి.

అతడి  తండ్రి, రైల్వే ఉద్యోగి. అతనికి , ఊహ తెలిసే నాటికి, ఆయన, మహారాష్ట్రలో, పూర్ణ రైల్వే జంక్షన్లో, ఉద్యోగం చేసేవారు. మురళి రెండో తరగతిలో ఉండగా, ఆయనకి నిజామాబాదు ట్రాన్స్‌ఫర్ అయింది. ఆ రెండు చోట్ల, వారి నివాసం రైల్వే క్వార్టర్స్ లోనే.

రెండవ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం వరకు,  నిజామాబాదు లోనే చదువుకున్నాడు. అతని  స్నేహితులు, చాలా మంది, రవి లాగానే, ఇతర ఊళ్ళ నుంచి నిజామాబాదు వచ్చి, చదువుకునేవారు. ప్రతి పండగకి, వీలు కుదిరినప్పుడల్లా, వాళ్ళ ఊళ్ళకి, వెళ్లే వాళ్లు. తరచుగా, వాళ్ళ తండ్రులో, అన్నలో, చుట్టాలో, వస్తూ ఉండేవారు. వచ్చినప్పుడల్లా, బియ్యం, పప్పులు, కాయగూరలు, మొక్కజొన్న పొత్తులు, వేరుశెనక్కాయలు లాంటివి, తెచ్చేవారు.

ఓ రోజు స్నేహితులు, వాళ్ళ ఊళ్ళ గురించి ముచ్చటించుకుంటూ ఉంటే, మొదటిసారి మురళికి, తనది ఏ ఊరు! అన్న సందేహం వచ్చింది.

ఇల్లు చేరుతూనే, తల్లి దగ్గరి కెళ్లి, “అమ్మా మనది ఏ ఊరు?” అని అడిగాడు .

ఆవిడ, ఒకింత ఆశ్చర్యంగా, అతని  వంక చూస్తూ, “మన ఊరి పేరు, రామాపురం. ఆ ఊరు, కృష్ణా జిల్లాలో, పామర్రుకి దగ్గర్లో ఉంది. కానీ, ఇప్పుడు అక్కడ మన వాళ్ళు ఎవరూ లేరు, ఆస్తిపాస్తులూ లేవు” అని చెప్పింది.

ఆ మాట వింటూనే నిరుత్సాహంతో తల్లిని ఇంకేమి అడగలేదు మురళి. ఆ రాత్రి, పక్క మీద పడుకున్న అతడికి  నిద్ర రావడం లేదు. చటుక్కున ఏదో గుర్తొచ్చి లైట్ స్విచ్ వేసి, పుస్తకాల సొరుగు నుంచి అట్లాస్ బయటికి తీసి, కృష్ణా జిల్లాలో పామర్రుని, పామర్రు చుట్టుపక్కల రామాపురాన్ని, ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌లో వెతికాడు . రామాపురం అన్న పేరు కంటికి ఆనగానే, ఉద్వేగంతో చలించిపోయాడు.

ఇక, అప్పటి నుంచి, ఎవరడిగినా మా ఊరు రామాపురం అని చెప్పేవాడు .

పందొమ్మిది వందల డెబ్భై ఏడు, నవంబర్, పందొమ్మిదవ తేదీనాడు వచ్చిన తుఫాను – కృష్ణ జిల్లాలో, దివిసీమని ఉప్పెన రూపంలో కబళించింది.

పామర్రు, రామాపురం, దివిసీమకి దగ్గర్లోనే ఉన్నాయని వార్తల్ని, శ్రద్ధగా వినేవాడు, మురళి. అప్పుడే కొత్తగా వస్తున్న ఈనాడు పేపర్‌లో వార్తలు, ఉప్పెన సృష్టించిన విలయం తాలూకు ఫోటోలు చూసేవాడు. వార్తల్లో ఎక్కడా, రామాపురం ఊసు లేకపోతే, అతనికి ఓ రకమైన ఆనందం కలిగేది. ఎన్నడూ చూడని, రామాపురంతో, మురళికి, ఓ అవినాభావ సంబంధం ఏర్పడింది. అతడు  ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్‌లో, ఉండగా, అతని తండ్రికి హైదరాబాద్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యింది. హైదరాబాద్‌లో, ఫైనల్ ఇయర్ చదివాక, ఓ రెండేళ్ల తర్వాత, బొంబాయిలో ఉద్యోగంలో చేరాడు.

***

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి, చార్మినార్ వెళ్లే, ఎనిమిదో నెంబర్, సిటీ బస్సులో డ్రైవర్ సీట్ వెనుక ఆరో వరుసలో, కిటికీ పక్కన ఉన్న సీట్‌లో కూచున్నాడు మురళి. ఉదయం ఎనిమిదిన్నర గంటలవుతోంది. బస్సు, గురుద్వారా, క్లాక్ టవర్ దాటి, పాట్నీసెంటర్లో, ఎడమ వైపు తిరిగి బాటా, బైబిల్ హౌస్, రాణిగంజ్ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకుంది. హుస్సేన్ సాగర్ జలాశయమంతా విస్తరించిన గుర్రపు డెక్క నాచు తాలూకు దుర్గంధం ఘాటుగా  ముక్కుపుటాలకి తాకింది. బస్సు ట్యాంక్ బండ్, సెక్రటేరియట్ దాటగానే, సీట్‌లో నుంచి లేచి, బస్సు దిగటానికి, వెనుక ద్వారం వైపు కదిలాడు . అరణ్య భవన్ స్టాప్‌లో, బస్సు దిగి, రోడ్ దాటాడు. ఎదురుగా, ప్రహారి గోడపై, దీర్ఘచతురస్రంగా, కేటాయించిన, స్థలంలో, నలుపు రంగు గ్రానైట్ పలక తాపడం చేసి, దాని పైన, బంగారు వర్ణంలో ఉన్న లోహంతో తయారు చేసిన అక్షరాలు అమర్చి ఉన్నాయి. ఆ అక్షరాలలో ఉన్న పదాలు ఆ ప్రహారిలోవైపున్న, భవన సముదాయం మహా గణాంకుల కార్యాలయమని, సూచిస్తున్నాయి. తిన్నగా ఏ.జి ఆడిట్, అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ చేరుకుని, జాయినింగ్ రిపోర్ట్‌కి, తన ట్రాన్స్ఫర్ ఆర్డర్, జత చేసి, ఏ.ఓ గారికి ఇచ్చాడు. ఇక, అతడి  హోమ్ టౌన్, ఆఫీస్ టౌన్,  రెండూ, ఒకటే. ఓ పది రోజుల క్రితం, యూనిలేటరల్ ట్రాన్స్‌ఫర్, నియమాలను అనుసరించి,  రిక్వెస్ట్‌ని, ఆమోదిస్తూ, అతన్ని హైదరాబాద్ ఏ.జి. ఆడిట్ ఆఫీస్‌కి, ట్రాన్స్‌ఫర్ చేసారు.

***

జీవితంలో ఏ దశలో ఏం జరగాలో, ఆ దశలో, కాస్త ముందువెనుకలుగా, అది జరిగిపోతుంది. ఇంట్లోవాళ్ళు, మురళి పెళ్లి ప్రయత్నాలు మొదలెట్టారు. అనుకోకుండా, వారు చూసిన మొదటి సంబంధమే బాగా నచ్చింది. సంప్రదింపులకి వచ్చిన , కాబోయే మామగారు, “మీ స్వంత ఊరు ఏది?” అని  అడిగారు. ఓ క్షణం, మౌనం వహించి, “మాది రామాపురం, పామర్రు దగ్గర” అని, చెప్పారు, మురళి నాన్నగారు. తండ్రి ఆ విషయం చెపుతుండగా, ఆయన కళ్ళలో తొంగి చూసిన నిస్సహాయతా భావం, మురళి దృష్టిని దాటిపోలేదు. తనకి ఉన్న, రామాపురం తాలూకు భావాలు, తండ్రికి కూడా ఉన్నాయని అర్థమైంది.

***

మురళికి పెళ్లి అయ్యి, నాలుగేళ్లు అయింది. ఆ రోజు తన కొడుకు విజయ్‌ని, ఎల్.కే.జిలో జాయిన్ చేయటానికి, స్కూల్‌కి, వెళ్లారు. అప్లికేషన్‌లో, ఇతర కాలమ్స్‌తో పాటు, ప్లేస్ అఫ్ బర్త్, పెర్మనెంట్ అడ్రస్, హోమ్ టౌన్, కాలమ్స్ కూడా ఉన్నాయి. హోమ్ టౌన్, కాలమ్ చూస్తూనే,  రామాపురం పేరు, గుర్తుకొచ్చింది. కానీ, అది వ్రాయలేడు కదా! విజయ్ వంక చూస్తూ, తన కొడుకు కూడా, తన లాగా, రామాపురం గురించి, ఆలోచిస్తాడా! అని, అనుకున్నాడు .

ఇల్లు, ఆఫీస్‌లో పని, పిల్లల చదువులు, రొటీన్‌గా సాగిపొతోంది, జీవితం. ఆఫీస్‌లో స్నేహితులు, పండుగలకు, వాళ్ళ ఊరుకి వెళుతున్నామని, చెప్పినప్పుడు, వాళ్ళు హోమ్ టౌన్, ఎల్.టి.సి, అవైల్ చేసుకున్నప్పుడు, అతడి కళ్ళలో ఓ నిరుత్సాహభావం గోచరించేది. వాళ్ళు, వాళ్ళ ఊళ్ళ నుంచి తిరిగి వచ్చి, ఆఫీసులో జాయిన్ అయినప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం, సంతోషం, చురుకుదనం కనిపించేది.

బహుశా, వేలి స్పర్శతో ఎప్పుడో, ఎక్కడో, డేటా బ్యాంకులో నిక్షిప్తమై ఉన్న, వేలిముద్రలతో అనుసంధానం చెంది ఆ మనిషి గుర్తింపు నిర్ధారణ అయినట్టు, తన మూలాలు ఉన్న ప్రదేశంలో అడుగిడితే, అంతర్ముఖంగా, మనిషి మనసు, తన మూలాలతో అనుసంధానం చెంది, ఓ నూతన ఉత్సాహాన్ని సృష్టిస్తుందేమో, అనిపించింది, మురళికి.

***

జీవనయానంలో, ప్రస్తుతంలో ఉన్న ప్రతి క్షణం, గతంలోకి, జారిపోతుంది. అనంతమైన కాలప్రవాహంలో, యుగాలు అంతరించాయి. ఇక, ఓ జీవనకాలం యెంత. క్షణాలు, నిమిషాల్లోకి, నిమిషాలు, గంటల్లోకి, గంటలు, రోజుల్లోకి మారుతూ, దశాబ్దాలు దొర్లిపోయాయి. మురళికి ముప్పై మూడేళ్ల సర్వీస్ పూర్తయింది. అతడి  తండ్రి స్వర్గస్థుడై, మూడేళ్లకు పైగా, అయ్యింది. తల్లి ఒంటరిదై పోయింది. మురళి, అతని భార్య విమల, ఆవిడ బాగోగులని పర్యవేక్షిస్తూ, జాగ్రత్తగా కంటికి పాపలా, చూసుకుంటున్నారు. ఇప్పుడు మురళి, సీనియర్ ఆడిట్ ఆఫీసర్. ప్రమోషన్ వచ్చి, పదమూడేళ్లయ్యింది.

***

కంప్యూటర్ స్క్రీన్ మీద, ఢిల్లీ, హెడ్ క్వార్టర్స్, ఆఫీస్‌కి పంపాల్సిన, డ్రాఫ్ట్ లెటర్ వంక, తదేకంగా చూస్తూ, అందులో, చేయాల్సిన అవసరమైన మార్పుల గురించి ఆలోచిస్తున్నాడు మురళి. ఆ లెటర్, ఓ మేజర్ ఆడిట్ ఆబ్జెక్షన్‌పై, హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ ప్రశ్నలకు, సందేహాలకు, స్పష్టీకరణమైన వివరణకు సంబంధిచినది. ఆ వివరణని సరిగా, ఆమోదయోగ్యంగా లెటర్‌లో ఎలా పొందుపర్చాలా! అని ఆలోచిస్తున్నాడు. కొత్త సందేహాలకు తావు లేకుండా, ప్రత్యుత్తరం తయారుచేయాలన్నది, మురళి ఉద్దేశం. ఆ ఉద్దేశం నెరవేరాలంటే, సరి అయిన, పదప్రయోగ ఆవశ్యకత ఉంది. అతడి మనసు, సరి అయిన పదాన్ని, అన్వేషిస్తోంది. యథాలాపంగా లేచి  కిటికీ వద్దకు వెళ్ళాడు మురళి. అతని  ఆఫీసులో  మురళి రూమ్ రెండో అంతస్తులో ఉంది. కిటికీ గుండా సెక్రటేరియట్, ద్వారకా హోటల్ మధ్య ఉన్న, మెయిన్ రోడ్ మీద, వాహనాలు అటు ఇటు పరుగుతీస్తున్నాయి. ఎదురుగా టెలిఫోన్ భవన్, దాని పక్కగా, బస్ బే, అక్కడ తమ బస్సు నిరీక్షణలో ఉన్న, ప్రయాణికులు, బస్సు బే వెనుక ఉన్న, హోమ్ సైన్స్ కాలేజీ కనిపిస్తున్నాయి.

అంతలో, టేబుల్ మీద ఉన్న సెల్ ఫోన్ మోగింది. టేబుల్ దగ్గరికి వెళ్లి, ఫోన్ చేతిలోకి, తీసుకున్నాడు.  మేనమామ నుంచి కాల్ వస్తోంది. ఎప్పుడో తప్ప, మావయ్య, పెద్దగా మాట్లాడడు. ఏంటో, విషయం!, అనుకున్నాడు. క్షేమ, సమాచారాలు అడిగాక, “ఇదిగో, కళ్యాణ్ మాట్లాడుతాడు” అన్నాడు, మురళి మేనమామ. ఓ క్షణం తర్వాత, కళ్యాణ్ మాట్లాడుతూ, “హలో, బావా.., ఎలా ఉన్నావు? మేము, మా క్లాత్ బిజినెస్, వైండ్ అప్ చేస్తున్నాము, బిజినెస్ మునుపటిలా లేదు. హెవీ కాంపిటీషన్, ఈ మాల్స్, ఆన్లైన్ షాపింగ్ వచ్చాక, మాకు పెద్దగా, డిమాండ్ ఉండటం లేదు. దానికి తోడు, డిజిటల్ పేమెంట్స్, జి.ఎస్.టి., వెసులుబాటు లేదు. ఇప్పుడు, ఆర్గానిక్ ఫుడ్‌కి, చాలా డిమాండ్ ఉంది. అందుకే, రామాపురంలో, ఓ ఇరవై ఎకరాలు పొలం కొని, అక్కడే ఉంటూ ఆర్గానిక్ ఫామింగ్ చేద్దామనుకుంటున్నాము. నెక్స్ట్ వీక్, హైదరాబాద్ వద్దామని, అనుకుంటున్నాను. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్‌లో పని ఉంది. అలాగే, ఆర్గానిక్ సీడ్స్ సప్లై చేసే వాళ్ళని కలవాలి”, అన్నాడు కళ్యాణ్. “ఇంతకీ, ఏ రామాపురం!, అన్నాడు, మురళి. “మన రామాపురమే”, అంటూ, “బావా, వేరే కాల్ వస్తోంది, ఇక ఉంటాను” అన్నాడు కళ్యాణ్. కాల్, కట్ అయింది. మురళికి అంతా కన్ఫ్యూజన్‌గా ఉంది. మన రామాపురం అంటున్నాడు, ఏంటి? ఆసక్తి అణుచుకోలేక, పది నిమిషాలైనాక, మేనమామకి కాల్ చేసాడు. నో రిప్లై వచ్చింది. మరో మారు, ట్రై చేసాడు. కాల్ కనెక్ట్ కాలేదు. నిరుత్సాహపడిన మురళికి, అకస్మాత్తుగా, ఓ ఆలోచన వచ్చింది. అవును! ఈ విషయం, తన తల్లిని అడగొచ్చుకదా!, అనుకున్నాడు.

***

ఇంటి గుమ్మంలో, అడుగుపెడుతూనే, “అమ్మా.., అమ్మా..” అని, పిలుస్తూ, తల్లి బెడ్ రూమ్‌లోకి వెళ్ళాడు, మురళి. “ఏంటిరా! ఏమైంది? అలా కేకలేస్తూ వచ్చావు” అని ఆత్రుతగా అడిగింది మురళి తల్లి. ఇంతలో, “ఏమైంది?” అంటూ, వంటింటి నుంచి కంగారుగా వచ్చింది విమల. వాళ్ళిద్దరి కంగారుని చూసి తన ఆత్రాన్ని అణుచుకుంటూ, “ఏమీ లేదమ్మా” అన్నాడు . అతని వంక వింతగా చూసి, మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది, విమల. పక్కనే ఉన్న కుర్చీని తల్లికి దగ్గరగా లాగి కూర్చున్నాడు .  విమల ఇచ్చిన కాఫీ కప్ అందుకుంటూ, “తాతయ్య వాళ్లది కూడా, మన రామాపురమేనా!” అడిగాడు. “అవును, ఇప్పుడు, ఎందుకు అడుగుతున్నావు?” అన్నది ఆవిడ. “ఏం లేదమ్మా.., సాయంత్రం, మావయ్య కాల్ చేసాడు. కళ్యాణ్, మాట్లాడాడు. మావయ్య వాళ్ళు, విజయవాడలో, బిజినెస్ మానేసి, రామాపురంలో, పొలం కొని, అక్కడే ఉంటూ ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేద్దామని అనుకుంటున్నామని చెప్పాడు. వచ్చేవారం, హైదరాబాద్ వస్తానన్నాడు. సరేగాని, తాతయ్య వాళ్ళది కూడా, రామాపురమే అని, ఎప్పుడూ, చెప్పలేదేంటమ్మా!” అన్నాడు మురళి. “రామాపురం, నాకే, సరిగ్గా తెలీదు. నా చిన్నతనం నుంచి తాతయ్యవాళ్ళు, విజయవాడలోనే ఉన్నారు” అన్నది ఆవిడ. “నీకు తెలిసినంతవరకు చెప్పమ్మా!” అడిగాడు.

మంచం మీద సరిగ్గా  కూర్చుని, తన చేతిగాజులను సవరించుకుంటూ, చెప్పడం, మొదలు పెట్టింది ఆవిడ. ఓ అరగంట పాటు తల్లి చెప్పిన విషయాలు విన్న మురళి, ఆవిడ వైపు ఆరాధనగా చూస్తూ, ఆవిడ చేతిని, స్పృశిస్తూ, “సరే, నేను ఫ్రెష్ అవుతాను”, అంటూ, తన బెడ్ రూమ్ లోకి, వెళ్ళాడు.

***

ఆ రోజు, రాత్రి పక్కమీద వాలి, తల్లి రామాపురం గురించి, తన తండ్రి గురించి, తన పుట్టింటి గురించి, చెప్పిన విషయాలని, తన ఆలోచనలలో, నెమరేసుకోసాగాడు . తల్లికి కూడా, రామాపురం గురించి, ప్రత్యక్షంగా తెలియదు. అమ్మమ్మ వాళ్ళు చెప్పిందే, తనకు చెప్పింది. తన తల్లి తండ్రులు ఇద్దరిదీ రామాపురమే, నాన్నగారి అన్నయ్య అంటే, తన పెదనాన్నగారు, రామాపురంలో, పిల్లలకి చదువు చెప్పేవారు. ఆయన్ని, ఊరు వారందరూ మాస్టారుగారూ అంటూ, ఆయన పట్ల, చాలా గౌరవంగా ఉండేవారు. ఊర్లో, ఏ చిన్న సమస్య వచ్చినా ఊరిపెద్దలు ఆయన సలహా తీసుకునేవారు. నాన్నగారి వాళ్ళకి ఉన్న, కొద్ది పొలం, ఇల్లు అమ్మి, తన అత్తయ్య అంటే నాన్నగారి అక్కయ్య పెళ్లి చేసారు.

నాన్నగారు, బందరులో, వాళ్ళ అక్కయ్య దగ్గరుండి, చదువుకున్నారు. తొమ్మిదేళ్లు నిండకుండానే, అమ్మకి పెళ్లయింది. తాతయ్యవాళ్లకి రామాపురంలో, కట్టెల ఆడితి ఉండేది. అమ్మానాన్నల పెళ్లి రామాపురంలోనే జరిగింది. అమ్మా వాళ్ళ, అన్నయ్య అంటే తన మేనమామ, అమ్మ కంటే, వయసులో, నాలుగేళ్లు పెద్దవాడు. అందుకే, రామాపురంతో తనకి ఉన్న, అటాచ్మెంట్ కారణంగా, ఇప్పుడు, రామాపురానికి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటున్నాడు.

అమ్మ పెళ్లయిన సంవత్సరమే, తాతగారు పట్టణంలో వ్యాపారం బాగుంటుందని పెట్టుబడి కోసం, రామాపురంలో ఉన్న ఆస్తిని అమ్మి విజయవాడ వెళ్లి, అక్కడ వ్యాపారం మొదలుపెట్టారు. ఆ వ్యాపారం, అంచలంచలుగా, వృద్ధి చెందింది. వ్యక్తురాలైన, తన తల్లి కాపురానికి వెళ్లేసరికి, ఆవిడకి పద్నాలుగేళ్ళు. అమ్మ కాపురానికి వెళ్లే ముందే, నాన్నగారికి, రైల్వేలో ఉద్యోగం వచ్చింది. మహారాష్ట్రలో, పూర్ణ అన్నచోట, పోస్టింగ్ ఇచ్చారు. నాన్నగారి చదువయ్యాక, ఉద్యోగం వచ్చేవరకు, రామాపురంలో, ఆయన అన్నగారి దగ్గరే ఉన్నారు. సాంప్రదాయం ప్రకారం, కాపురానికి ముందుగా అత్తవారింటికి వెళ్ళాలి. కానీ నాన్నగారికి ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి, వ్యవధి లేనందువలన, నాన్నగారిని వెంటపెట్టుకుని, వాళ్ళ అన్నయ్య, వదిన, విజయవాడ తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చారు. నాన్నగారు, అమ్మతో పాటుగా, పూర్ణా వెళ్లి ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. అమ్మ పూర్ణ వెళ్లిన, నాలుగేళ్లలోపే అమ్మమ్మ, తాతయ్య స్వర్గస్తులయినారు. విజయవాడకి, చాలా దూరంలో, ఉంది పూర్ణ. ఆ రోజుల్లో, రైలులో, పూర్ణా నుంచి విజయవాడ వెళ్లడానికి, రోజున్నర సమయం పట్టేది. దూరాభారాలు, పిల్లల పెంపకం, వాళ్ల చదువులు, ఆర్థికభారం వగైరా కారణాల వల్ల, తల్లికి విజయవాడతో, క్రమంగా సంబంధం తగ్గిపోయింది. నాన్నగారు ఉద్యోగంలో జాయిన్ అయినాక, ఏడాది తిరగక ముందే, తన పెద్దనాన్నగారు, గుండెపోటుతో కాలంచేసారు. మరో మూడు నెలలలోపే, మనోవ్యాధితో, ఆయన భార్య అంటే తన పెద్దమ్మ స్వర్గస్థురాలయింది.

అమ్మ చెప్పిన, విషయాలని, మననం చేసుకుంటున్న, మురళి, పద్నాలుగేళ్ల వయసులోనే పుట్టింటిని వదిలి, ఎంతో దూరంలో ఉంటూ, పిల్లల్ని పెంచి, వాళ్లని వృద్ధిలోకి, తీసుకురావడానికి, తన తల్లి, ఎన్ని కష్టాలు అనుభవించిందో అనుకున్నాడు.

ఇన్నాళ్లు, రామాపురం తాలూకు విషయాలు తల్లి చెప్పలేదంటే అర్థం ఉంది. ఆవిడ జ్ఞాపకాలలో రామాపురానికి స్థానం లేదు. తండ్రి చెప్పడానికి ఆస్కారం లేదు. తన జనరేషన్, పిల్లలకి, తండ్రి అంటే భయంతో కూడిన గౌరవభావం ఉండేది. తండ్రి ఆజ్ఞలు, సూచనలు పాటించడం తప్ప, మరో విషయం, తండ్రితో మాట్లాడే అవకాశం, ఉండేది కాదు. పిల్లలు కూడా అత్యవసరమైతే తప్ప, తండ్రికి ఎదురు పడేవారు కాదు. తండ్రి వస్తున్నాడు అంటే, ఎక్కడి వాళ్ళక్కడ, స్కూల్ పుస్తకాలు, ముందేసుకుని, నిశ్శబ్దంగా, ఇంట్లో, ఏదో ఓ మూల కూర్చునేవారు. ఇప్పుడంటే, పిల్లలతో తల్లిదండ్రులు, స్నేహంగా ఉంటూ, సాన్నిహిత్యాన్ని పంచుకుంటున్నారు. తండ్రి, కొడుకులు, అన్ని విషయాలు చర్చించుకుంటున్నారు. ఈ మార్పు, ఎంత వరకు సమంజసమో!

***

కళ్యాణ్, మురళితో మాట్లాడి, ఓ నెల రోజులు దాటింది. మధ్యలో, ఓ మూడు రోజులు హైదరాబాద్ వచ్చి, తన పనులు చూసుకుని వెళ్ళాడు, కళ్యాణ్. మావయ్య వాళ్ళు, రామాపురానికి షిఫ్ట్ అయ్యే కార్యక్రమం, యుద్ధప్రాతిపదికగా, సాగుతున్నట్టు తోచింది మురళికి. అప్పట్లో, రామాపురంలో, మురళి తాతయ్య వాళ్ళ, ఇల్లు కొన్న, ఆసామి ఇప్పుడు లేడట. ఆయన కొడుకు ఇల్లు అమ్మేసి, అమెరికాలో ఉన్న, తన కూతురి వద్ద, ఉందామనుకున్నాడట. మేనమామ, ఆ ఇంటిని కొని, మరమ్మత్తులు చేయిస్తున్నాడని తెలిసింది, మురళికి.

మరో మూడు నెలలు గడిచాయి. రామాపురం నుంచి, గృహప్రవేశానికి పిలుపు వచ్చింది. కానీ, ఆ సమయంలో, ఆఫీస్‌లో, ఢిల్లీ హెడ్ క్వార్టర్స్, జారీ చేసిన, హుకుం ప్రకారం, ఆడిట్ విధానాలు, పద్ధతులపై, వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు.  సెలవు దొరకలేదు. తల్లిని, వెంటపెట్టుకొని, గృహప్రవేశానికి వెళ్ళిన, మురళి భార్య విమల, ఒంటరిగా తిరిగి వచ్చింది. మురళి మేనమామ, తన చెల్లెల్ని, కొన్నాళ్లు రామపురంలో ఉండమని, కోరాడు. అన్నగారి కోరిక మేరకు, తనకూ ఇష్టంగానే ఉండటంతో, మురళి తల్లి, రామాపురంలో, ఉండిపోయింది.

***

జనవరి ఒకటో తేదీ ఆఫీస్‌లో  సెక్షన్లో, నూతన సంవత్సరం వేడుకలలో భాగంగా సెక్షన్ని, రంగు కాగితాలతోనూ, బెలూన్లతోనూ, అలంకరించారు. సెక్షన్లో మురళి చేత కేక్ కట్ చేయించారు. ఆ వేడుకలతో, అందరికి, ఆటవిడుపుగా ఉంది. తన రూమ్‌లో, కిటికీ దగ్గర, నిలబడి, రోడ్డువైపు చూస్తున్న, మురళికి, తల్లి గుర్తుకు వచ్చింది.  తల్లి రామాపురానికి వెళ్లి, మూడు నెలలు అయింది.  తల్లి, తన దగ్గర లేక పోవడం, అతని మేనమామ కుటుంబం రామాపురంలో సెటిల్ అవడం, పైగా రామాపురం గురించి తన తండ్రి, తన పెదనాన్నగారి గురించి, పూర్తి వివరాలు, తెలియడంవల్ల, అతని ఆలోచనలలో, రామాపురం, తరచుగా చోటు చేసుకుంటోంది.

ఎవరో పిలిచినట్టుగా తోచి వెనక్కి తిరిగి చూశాడు మురళి. డోర్ దగ్గర దినేష్ నిలబడి ఉన్నాడు.  సెక్షన్లో ఉన్న ఆడిటర్లలో దినేష్, ఒకడు.

“గుడ్ ఆఫ్టర్ నూన్, సర్ ” అంటూ ముందుకు వచ్చాడు దినేష్.

“ఏంటి! ఏం కావాలి?” అని అడిగాడు మురళి.

అతని చేతిలో ఉన్న లీవ్ అప్లికేషన్‌ని టేబుల్ మీద, ఉంచుతూ “లీవ్ కావాలి, సార్” అన్నాడు దినేష్. లీవ్ అప్లికేషన్ చూస్తున్న మురళి కంటిని, పర్పస్ అన్న కాలమ్ ఆకర్షించింది. అక్కడ, టు విజిట్ పేరెంట్స్, యట్ హోమ్ టౌన్ అని వ్రాసి ఉంది. లీవ్ శాంక్షన్ చేసి, అప్లికేషన్‌ని దినేష్‌కి ఇచ్చాడు, మురళి.

దినేష్, లీవ్ అప్లికేషన్‌లో చూసిన పదాలు పదే పదే గుర్తుకురాసాగాయి.

ఓ క్షణం, రామాపురాన్ని, తన హోమ్ టౌన్‌గా, డిక్లేర్ చేయగలనా అన్న ఆలోచన వచ్చింది మురళికి.  సీట్‌కి ఎదురుగా, అతని టేబుల్‌కి, ఆవలి వైపు, గోడవారగా, ఓ అల్మైరా ఉంది. ఆ అల్మైరాలో ఉన్న, అన్ని అరలలో, డిపార్ట్మెంటల్ మాన్యువల్స్, వివిధ సబ్జెక్టులకి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్ పుస్తకాలు, వరుసగా పేర్చి, ఉన్నాయి. అల్మైరాకి ఉన్న, ట్రాన్స్పరెంట్ గ్లాస్ తలుపుల గుండా, పుస్తకాలు కనిపిస్తున్నాయి. యథాలాపంగా, అల్మైరా దగ్గరకి వెళ్లి అల్మైరాలో ఉన్న, స్వామి పబ్లికేషన్స్ వారి ఎల్.టి.సి రూల్స్ బుక్ తీసుకుని, హోమ్ టౌన్ మార్పుకి, సంబందించిన, రూల్స్ చదువసాగాడు.

సాధారణంగా, ప్రభుత్వ ఉద్యోగి ఓ మారు హోమ్ టౌన్‌గా, డిక్లేర్ చేసిన ప్రదేశం, ఉద్యోగ విరమణ వరకు, హోమ్ టౌన్‌గా కొనసాగుతుంది. అసాధారణ పరిస్థితుల్లో, ప్రభుత్వ ఉద్యోగి కోరితే, హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్, హోమ్ టౌన్ మార్పుని, ఆమోదించవచ్చును. హోమ్ టౌన్ మార్పుని, ఆమోదించడానికైనా, తిరస్కరించడానికైనా, నిర్ణయం తీసుకోవడానికి, కొన్ని ప్రమాణాలు వర్తింపజేస్తారు. ‘వివిధ గృహ మరియు సామాజిక బాధ్యతల, నిర్వహణ నేపథ్యంలో, సదరు ఉద్యోగి భౌతిక ఉనికి, తను మార్పు కోరిన ప్రదేశంలో ఉందా? ఉంటే, ఆ ఉద్యోగి, ఆ ప్రదేశాన్ని తరచుగా, గతంలో సందర్శించాడా?, సదరు ఉద్యోగికి, మార్పు కోరిన ప్రదేశంలో, నివాసయోగ్యమైన ఆస్తి ఉందా? లేక, ఉమ్మడి కుటుంబ సభ్యుడిగా, మార్పు కోరిన ప్రదేశంలో, నివాసయోగమైన ఆస్తి కలిగి ఉన్నాడా?, సదరు ఉద్యోగి, సమీప బంధువులు, మార్పు కోరిన ప్రదేశంలో, ఉన్నారా?, సదరు ఉద్యోగి, ఉద్యోగంలో జాయిన్ కాక ముందు, మార్పు కోరిన ప్రదేశంలో, కొద్దీ సంవత్సరాలపాటు నివాసమున్నాడా?’ అన్న, ప్రమాణాల ఆధారంగా, నిర్ణయం తీసుకుంటారు.

రామాపురాన్ని, హోమ్ టౌన్‌గా డిక్లేర్ చేయడానికి, సంబంధిత నిబంధనలని, ప్రమాణాలని, సంతృప్తి పరచగల, రుజువులేవి, మురళి దగ్గర లేవు. ఆ విషయం, మురళికి తెలియక కాదు, ఎంతో కాలంగా, రామాపురంతో, అతని మనసు పెనవేసుకున్న భావాలు  ఆ దిశగా ఆలోచింపచేస్తున్నాయి. ఎంతగా ఆలోచించినా, ప్రయోజనం లేదు అనుకుంటూ, తన ఆలోచనలని వేరే విషయాల వైపు మళ్లించడానికి ప్రయత్నించసాగాడు.

***

మరో మూడు రోజుల తర్వాత మహా శివరాత్రి. శివరాత్రి నాడే, మురళి తండ్రి పుట్టిన రోజు.

ఆ రోజు రాత్రి, డిన్నర్ చేస్తుండగా, “డాడీ, శివరాత్రి రోజే, తాతగారి బర్త్ డే కదా!” అన్నాడు మురళి కొడుకు విజయ్.

ఆ రోజు, తమ ఇంటికి, దగ్గరగా ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్‌లో వారికి విందు భోజనం ఏర్పాటు చేస్తారు మురళి దంపతులు. మురళికి, తండ్రి పట్ల చాలా ప్రేమ, గౌరవం. అంతే కాదు, అతనికి, తండ్రి పట్ల, ఓ ఆరాధనా భావం ఉంది.

డిన్నర్ అయినాక, డాబా మీద, పచార్లు చేస్తున్న, మురళి ఆలోచనలలో, అతని తండ్రి చోటు చేసుకున్నాడు. నిబద్ధత, ప్లానింగ్, ప్రతి విషయాన్ని, మేటిక్యులస్‌గా డీల్ చేయడం అతని తండ్రి ప్రత్యేకతలు. మర్నాడు పొద్దున ఆఫీస్‌కి వెళ్లడానికి, ముందు రోజు రాత్రే ఇస్త్రీ చేసిన డ్రెస్, కర్చీఫ్, బెల్ట్, పోలిష్ చేసిన షూస్, సాక్స్ రెడీగా, ఉంచుకునే వారు. తండ్రి తన వస్తువులు జాగ్రత్తపరుచుకోవడం గుర్తుకువచ్చింది . ఎవరినీ, తన వస్తువులు ముట్టుకోనిచ్చేవారు కాదు. ముఖ్యమైన పేపర్స్, డాకుమెంట్స్ లాంటివి, ఓ సూట్ కేసులో భద్రపరుచుకునే వారు. అతడి  మనసులో మెరుపులా, ఓ ఆలోచన వచ్చింది. చటుక్కున, డాబా దిగి, తల్లి బెడ్ రూమ్‌లో, అటక మీద ఉన్న, సూట్‌కేసుని కిందికి దించాడు . తండ్రి మరణాంతరం, ఆయన వస్తువుల్ని, డిస్పోజ్ చేయడం ఇష్టం లేక, ఆ సూట్‌కేసుని, తల్లి బెడ్ రూమ్‌లో అటక మీద ఉంచాడు .

సూట్‌కేసు తెరిచి, అందులో ఉన్న పుస్తకాలని, డైరీలని ఓ పక్కగా ఉంచాడు. ఇంకా, రెండు మందపాటి ఫైల్స్ ఉన్నాయి. ఒక ఫైల్‌లో, రకరకాల కాగితాలు, డాక్యుమెంట్స్ పద్దతిగా, ఫైల్ చేసి, ఉన్నాయి. ఒక్కో కాగితం తిరగేస్తూ, చూస్తున్నాడు. శాలరీ స్లిప్స్, పి.ఎఫ్. బాలన్స్ స్లిప్స్ , బ్యాంక్ అకౌంట్స్ తాలూకు పాస్ బుక్స్, వాడిన చెక్ బుక్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, వాటర్ బిల్స్, వగైరా ఉన్నాయి.

మరో ఫైల్‌ని, తీసి చూడసాగాడు. అందులో, ఆఫీస్ పేపర్స్ ఉన్నాయి.

ఇంతలో ఓ పింక్ కలర్ ఎన్వలప్, కాగితాల మధ్య నుంచి, ఫైల్ అంచు వైపుగా జారి, మురళి కంటబడింది. ఆసక్తిగా, ఆ ఎన్వలప్ చేతి లోకి, తీసుకొని, ఓపెన్ చేసాడు . ఆ ఎన్వలప్‌లో, రెండు శుభలేఖలు ఉన్నాయి. వాటిని చూస్తూనే, మురళి మనసు సంభ్రమాశ్చర్యాలలో మునిగింది. అవి తన తల్లిదండ్రుల వివాహ ఆహ్వాన పత్రికలు. ఒకటి, ఆడ పెళ్లి వారిది. రెండోది, మగ పెళ్లి వారిది.

వివాహం రామాపురంలో ఉన్న కన్యదాత స్వగృహంలో జరిగింది. శుభలేఖల్లో, వరుని అన్నగారు, స్కూల్ మాస్టర్ అని ఉంది.

రెట్టించిన ఉత్సాహంతో, మిగిలిన పేపర్స్ చూడసాగాడు.

తన తండ్రి తాలూకు ప్రమోషన్, ట్రాన్స్ఫర్, పోస్టింగ్ ఆర్డర్స్, పే ఫిక్సేషన్ మెమోస్, వగైరా ఉన్నాయి. వరుసగా అన్ని పేపర్స్‌ని చూస్తుంటే, మిగిలిన కాగితాలకి, విభిన్నంగా ఉన్న, ఓ రెండు కాగితాల సెట్‌లు దృష్టిని ఆకర్షించాయి. ఆ కాగితాల సెట్లకి, పోస్టల్ సర్వీస్ ద్వారా డెలివరీ అయిన, ఎన్వలప్‌లు, అటాచ్ చేసి ఉన్నాయి. వాటిని చూసిన వెంటనే, ఏదో నిధి తాలూకు రహస్యం తెలిసిన ఫీలింగ్ కలిగింది మురళికి.

వాటిలో ఒకటి, తన తండ్రికి, మద్రాస్, రైల్వే సర్వీస్ కమిషన్ వారు, రిటెన్ టెస్ట్‌కి హాజరవ్వమంటూ పంపిన కాల్ లెటర్. రెండోది, సికింద్రాబాద్, రైల్వే అథారిటీస్ వారు, ఉద్యోగంలో, జాయిన్ అవ్వమంటూ, పంపిన అపాయింట్మెంట్ ఆర్డర్. అటాచ్, చేసి ఉన్న, ఎన్వలప్‌ల మీద, తన తండ్రి పేరు, కేరాఫ్ తన పెదనాన్నగారి పేరు, క్రిందుగా, స్కూల్ మాస్టర్, రామాపురం అని, వ్రాసి ఉంది. పోస్టల్ సర్వీస్, ద్వారా, డెలివరి అయినట్టుగా, తెలియజేసే, డేటెడ్ స్టాంప్ ముద్రలు, ఉన్నాయి. మురళి ఆనందానికి అవధి లేదు.

ఆ ఫైల్‌ని, శుభలేఖలు ఉన్న, ఎన్వలప్‌ని, జాగ్రత్తగా, తన బెడ్ రూమ్, కబోర్డ్‌లో ఉంచి, మంచం మీద వాలాడు. రామాపురం, తన హోమ్ టౌన్ అని, డిక్లేర్ చేసే దిశగా, ఓ ప్రణాళిక,  మనసులో రూపు దిద్దుకుంది.

***

మరునాడు, ఆఫీస్‌కు, వెళ్ళగానే, కళ్యాణ్‌కి, కాల్ చేసాడు.

రిటైర్మెంట్ తర్వాత తను కూడా, రామాపురంలో, ఉండాలనుకుంటున్నాని, తన నిర్ణయాన్ని ఆఫీస్‌కి తెలియజేయాలని, తన బంధువులు, రామాపురంలో ఉన్నారు అని తెలియజేయడానికి, తన తల్లి ఆధార్ కార్డులో అడ్రస్ రామాపురంగా, మార్పించి, ఆవిడ ఆధార్ కార్డుతో పాటు, మేనమామ, కళ్యాణ్‌ల, ఆధార్ కార్డుల కాపీలు, తనకి మెయిల్ చేయమని చెప్పాడు.

ఆ వారాంతంలో, తనకి కావాల్సిన, ఆధార్ కార్డు, ఫోటోలు, మెయిల్ ద్వారా అందుకున్నాడు, మురళి.

***

సోమవారం ఆఫీస్‌కి వెళ్తూనే, కంప్యూటర్ ఆన్ చేసి, తన హోమ్ టౌన్‌ని, హైదరాబాద్ నుండి రామాపురంగా, మార్పు చేయమని, కోరుతూ, రిప్రజెంటేషన్ తయారుచేసాడు .

రిప్రజెంటేషన్‌లో, తన హోమ్ టౌన్, రామాపురంగా, నిర్ధారణ అవ్వడానికి, అవసరమైన, సమాచారం, పొందుపరిచాడు. అలా పొందుపరిచిన, సమాచారానికి, ఆధారాలుగా, తన తండ్రి ఫైల్ నుంచి సేకరించిన, వివాహ ఆహ్వాన పత్రికలు, డాక్యుమెంట్స్ , కళ్యాణ్ నుంచి రిసీవ్ చేసుకున్న, ఆధార్ కార్డులు జత చేశాడు. రిప్రజెంటేషన్‌ని, దానికి జత చేసిన, డాక్యుమెంట్స్‌ని, మరోమారు చెక్ చేసి, మొదటి అంతస్తులో ఉన్న సీనియర్ ఆడిట్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేషన్, రూమ్‌కి వెళ్ళాడు. అడ్మినిస్ట్రేషన్‌లో, సీనియర్ ఆడిట్ ఆఫీసర్‌గా ఉన్న శివ రావు, మురళి, ఇద్దరూ స్నేహితులు. తమ కష్టసుఖాలు ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉంటారు. ఆ ఇద్దరూ, ఆఫీస్ వర్క్‌లో, మేటిక్యులస్, ఎఫిషియంట్ అని సహోద్యోగులు పరిపాటిగా అనుకుంటూ ఉంటారు.

మురళిని చూస్తూనే, “ఏంటి! మురళీ.., సీట్‌లో పని లేదా, ఇటొచ్చావ్!” అన్నాడు శివ రావు.

చిరునవ్వుతో, రిప్రజెంటేషన్‌ని, శివ రావు చేతికందిస్తూ, “తొందరగా పుటప్ చేసేయ్, శివా..” అన్నాడు.

“సరే, నువ్వు అంతగా చెప్పాలా” అన్నాడు, శివ రావు.

రిప్రజెంటేషన్ అడ్మినిస్ట్రేషన్‌లో ఇచ్చిన మరుక్షణం, మురళి ఉద్యోగ పర్వం మొదలయిన నాటి నుంచి, అతని, మనసులో చేరిన, హోమ్ టౌన్ భావనలోని, శూన్యతని ఓ మధురానుభూతి భర్తీ చేసింది.

మరునాడు, మురళి రిప్రజెంటేషన్‌లో పొందుపరచిన, సమాచారం ,  రిప్రజెంటేషన్‌కి జత చేసిన, డాక్యుమెంట్స్‌ని, హోమ్ టౌన్ మార్పుకు నిర్దేశించబడిన నిబంధనలతో, ప్రమాణాలతో సరిపోల్చి, వాస్తవ నిర్ధారణ చేసి, పై అధికారి ఆమోదానికి, పుటప్ చేయడానికి, రిప్రజెంటేషన్‌ని, చదువసాగాడు, శివ రావు.

సర్,

బి. మురళి కృష్ణ, సీనియర్ ఆడిట్ ఆఫీసర్ అయిన నేను, మీ సముఖమునకు, విన్నవించుకునెడిది, ఏమనగా, నా, ఈ రిప్రజెంటేషన్‌లో, దిగువన, పొందుపరచిన, సమాచారమును, పరిగణించి, నా పట్ల, దయ ఉంచి, నాకు ప్రయోజనము కలిగే విధముగా, ఆజ్ఞలు, జారీ చేయగలరని, అభ్యర్దించుచున్నాను.

నా తల్లిదండ్రులిరువురి స్వస్థలం రామాపురం. నా తండ్రిగారు, ఉమ్మడి కుటుంబంలో సభ్యునిగా, తన అన్నగారితో కలసి, రామాపురంలో నివాసముండేవారు. నా పెదతండ్రిగారు, రామాపురంలో, స్కూల్ మాస్టర్‌గా ఉద్యోగం చేసేవారు. నా తల్లి తరపు, తాతగారు కూడా రామాపురం వాస్తవ్యులు. ఆయన టింబర్ వ్యాపారం చేసేవారు. నా తల్లిదండ్రుల వివాహం రామాపురంలో జరిగినది. ఈ విషయముల ధృవీకరణకు, ఈ రిప్రజెంటేషన్‌కు, జతచేసిన, నా తల్లి తండ్రుల వివాహమునకు, సంబంధించిన, ఇరుపక్షముల వారి, వివాహ ఆహ్వాన పత్రికలను పరిగణించవలెనని మనవి చేయుచున్నాను.

నా తండ్రి మరణాంతరం, ఇటీవల, నా తల్లి, తన స్వస్థలమయిన, రామాపురములో, ఆమె అన్నగారి వద్ద, నివసించుటకు తరలి వెళ్ళినది. కావున, భవిష్యత్తులో, నేను గృహ సంబంధమైన, సామాజిక కార్యక్రమములు, నిర్వర్తించుటకు, తరచుగా, రామాపురమునకు, వెళ్ళవలసియుండును. నా సమీప బంధువులయిన, నా మేనమామ మరియు ఆయన కుమారుల, ఉమ్మడి కుటుంబము, రామాపురములో, నివసించుచున్నది. ఈ విషయముల ధృవీకరణకు, ఈ రిప్రజెంటేషన్‌కు జత చేసిన, నా తల్లి, నా మేనమామ మరియు ఆయన కుమారుని ఆధార్ కార్డులను పరిగణించవలెనని మనవి చేయుచున్నాను. ఈ సందర్భములో, ఆధార్ కార్డుల లోని, నా మేనమామ మరియు ఆయన కుమారుని, ఇంటి పేరును, ఈ రిప్రజెంటేషన్‌కు, జత చేసిన, ఇరు పక్షాలవారి, వివాహ ఆహ్వాన పత్రికలో, పేర్కొన్న, కన్యాదాత (నా తల్లి తరపు తాతగారు) ఇంటిపేరుతో, సరిపోల్చి చూసిన, వాస్తవ నిర్ధారణ కాగలదని తెలియజేయుచున్నాను.

నా తండ్రిగారు రైల్వే ఉద్యోగములో చేరక పూర్వం, ఉమ్మడి కుటుంబసభ్యునిగా, తన అన్నగారితో కలసి, తన స్వస్థలమైన, రామాపురంలో, నివాసముండెడివారు. ఆయన, ఉద్యోగరీత్యా, వివిధ ప్రాంతములలో నివసించారు. ఆయన కుమారుడనయిన నేను, ఆయన కుటుంబసభ్యునిగా, ఆయన, ఉద్యోగరీత్యా, ఏ ప్రాంతములలో, నివాసముండెనో, ఆయా ప్రాంతములలో, విద్యను అభ్యసించితిని. ఈ విషయముల ధృవీకరణకు, ఈ రిప్రజెంటేషన్‌కు, జత చేసిన, నా తండ్రి తాలూకు మద్రాస్, రైల్వే సర్వీస్ కమిషన్ వారు, లిఖిత పరీక్షకు, హాజరు కావలెనని, జారీ చేసిన లెటర్, సికింద్రాబాద్, రైల్వే ఆధారిటీస్ వారు జారీ చేసిన, అప్పాయింట్మెంట్ ఆర్డర్, ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్, పోస్టింగ్ ఆర్డర్స్, మరియు నా విద్యాభ్యాసము తాలూకు విద్యాసంస్థలు, జారీ చేసిన, బోనఫైడ్ సర్టిఫికెట్స్ లను, పరిగణించవలెనని, మనవి చేయుచున్నాను.

దురదృష్టవశాత్తు నాకు రామాపురంలో నివాసయోగమైన ఆస్తి లేదు.

నేను సమర్పించిన, వాస్తవముల, ధృవీకరణకు, నిర్ధారణకు జత చేసిన, డాక్యుమెంట్స్‌ను పరిగణించి, నా హోమ్ టౌన్‌ని, రామాపురంగా ఆమోదించి, ఆ మేరకు ఆజ్ఞలు జారీ చేయుటకు ఏర్పాటు చేయుమని అభ్యర్ధించుచున్నాను.

మీ నమ్మక పాత్రుడు

బి. మురళి కృష్ణ.

సీనియర్ ఆడిట్ ఆఫీసర్.

రామాపురం పట్ల, మురళికి ఉన్న, భావాల గురించి, కొంత వరకు, శివ రావుకి, తెలుసు. పలుమార్లు వారి చర్చల్లో, ఈ విషయం, చోటు చేసుకుంది. రిప్రజెంటేషన్ పూర్తిగా చదివి, జత చేసిన డాక్యుమెంట్స్ పరిశీలించాక, మురళి చతురతకి, ముసిముసిగా నవ్వుకున్నాడు, శివ రావు.

మురళికి కాల్ చేసి, “చాలా బావుంది డ్రాఫ్టింగ్” అన్నాడు, శివ రావు.

***

ట్రైన్ గాలిని, చీల్చుకుంటూ, వంతెన పై, పరుగిడుతుంటే, సృష్టింపబడ్డ, ఘ్హస్ స్.., అన్న శబ్దం, రైలు చక్రాల పట్టాల మధ్య రాపిడి, ఒత్తిడి సృష్టించిన శబ్దం, తత్ ఫలితంగా, వంతెనలో సృష్టింపబడ్డ, ప్రకంపనల తాలూకు శబ్దం, ఆ శబ్ద త్రయం, జతగూడి, టట్, టట్లక్.., టట్, టట్లక్.., మంటూ, ఏ.సి. కూపేలో, అప్పర్ బెర్త్‌పై, పడుకున్న, మురళి చెవిని, లీలగా తాకింది. చటుక్కున లేచి, సెల్ ఫోన్‌లో టైం చూసాడు. నాలుగు నలభై దాటుతోంది. బెర్త్ దిగి, కర్టెన్ పక్కకి జరిపి, గ్లాస్ విండో గుండా, చూస్తున్న, మురళికి, ఎదురుగా, వరుస విద్యుదీపాలతో, ప్రకాశం బారేజి, కుడి పక్కగా, ఇంద్రకీలాద్రిపై, దుర్గమ్మ గుడి దీపాలు కనిపించాయి. ఆ దృశ్యాలని, దాటుకుంటూ, ట్రైన్ విజయవాడ స్టేషన్ లోకి వచ్చి, ఆగింది.

మురళి, విమల ట్రైన్ దిగి, తిన్నగా బస్సు స్టాండ్‌కి వెళ్లి, పామర్రు నాన్ స్టాప్ బస్సు ఎక్కారు. విజయవాడ నుంచి రామాపురానికి డైరెక్ట్ బస్సు లేదు. పామర్రు వెళ్లి, అక్కడి నుంచి, మరో, బస్సులో వెళ్ళాలి. కారు తీసుకుని, పామర్రు వస్తానన్నాడు, కళ్యాణ్. వద్దు, మేము బస్సు లోనే వస్తామని చెప్పాడు మురళి.

బందర్ రోడ్‌పై బెంజ్ సర్కిల్ దాటి, పామర్రు దిశగా దూసుకుపోతోంది, బస్సు. దారిలో, ఎదురవుతున్న ఊళ్ళని, రోడ్‌కి, ఇరువైపులా ఉన్న పరిసరాల్ని కుతూహలంతో, ఆసక్తిగా గమనిస్తున్నాడు మురళి. బస్సు పెనమలూరు, ఈడుపుగల్లు, కంకిపాడు, దావులూరు దాటి ఉయ్యూరు వైపు వెళుతోంది. బస్సు ఉయ్యూరు చేరగానే, చిన్నప్పుడు, సోషల్ స్టడీస్ పాఠాల్లో చదువుకున్న ఉయ్యూరు పంచదార ఫ్యాక్టరీ గుర్తొచ్చింది. బస్సు బైపాస్ రోడ్ లోకి మళ్లింది. కురుమద్దాలి దాటిన బస్సు, కొంత దూరం వెళ్ళాక, కుడివైపుకు తిరిగి, లో బ్రిడ్జి గుండా, హై వేని దాటి, పామర్రు వైపు వెళుతోంది. మరో, ఇరవై నిమిషాలలో బస్సు, పామర్రు బస్సు స్టాండ్ చేరుకుంది. తన చిన్నతనంలో ఊహించుకున్న, రామాపురం దృశ్యాలు గుర్తుకొస్తున్నాయి మురళికి.

ఎంక్వయిరీ కౌంటర్‌లో, రామాపురం బస్సు గురించి, వాకబు చేసాడు మురళి.

కౌంటర్‌లో ఉన్న వ్యక్తి, “మొవ్వ, వెళ్లే, బస్సు ఎక్కండి, అది, ఉండ్రాపూడి, అయ్యంకి, రామాపురం మీదుగా, మొవ్వ వెళుతుంది” అని చెప్పాడు.

మరో అర గంటలో, మొవ్వ వెళ్లే, పల్లె వెలుగు బస్సు, రామాపురం వైపుగా, దూసుకుపోసాగింది. కొద్దిసేపట్లో, మురళి ఊహాజనిత జగత్తులో, అతని హృదయంలో, రూపు దిద్దుకున్న, రామాపురం, ప్రత్యక్ష వీక్షణాభాగ్యం, కలగబోతోంది. చుట్టూ పచ్చదనం, అవనిని ఆవరించి ఉంది. బస్సు కిటికీ గుండా, ఆ దృశ్యాన్ని చూస్తున్న, మురళికి, కన్నుల పండుగలా ఉంది.

బస్సు రామాపురం స్టాప్‌లో ఆగింది. రోడ్ వారగా, కారుని ఆపి, ఎదురు చూస్తున్నాడు, కళ్యాణ్. ఫర్లాంగున్నర దూరంలో ఉన్న,  మేనమామ ఇంటికి, చేరుకున్నారు, మురళి, విమలలు. కారు దిగగానే, తాతగారి ఇంటిని, సంభ్రమంగా, చూసాడు, మురళి.

ప్రహరీ గోడ చాలా ఎత్తులో ఉంది. గోడపైన, గాజు పెంకులు అమర్చి, ఉన్నాయి. ఓ చిన్న సైజు, కోట గుమ్మంలా ఉంది, ఇంట్లోకి వెళ్లే, ప్రవేశ ద్వారం. ద్వారానికి ఇరుపక్కలా, ఓ పది అడుగుల ఎత్తులో, సున్నం, ఇసుక, జిగురుతో మలచిన, సింహం బొమ్మలు ఉన్నాయి. లోపలికి ప్రవేశించగానే, సుమారుగా, రెండు వందల గజాల, విస్తీర్ణంలో వాకిలి, పూల మొక్కలు. వాకిలికి, ఓ పక్క, రావి చెట్టు, మరో పక్క, వేపచెట్టు ఉన్నాయి. ఎదురుగా, ఓ మూడు వందల గజాల స్థలంలో, విశాలమైన, నగిషీలు చెక్కిన తలుపులతో, కిటికీలతో ఉంది, ఇల్లు. ఇల్లంతా, మామిడి తోరణాలతో, పూలతో అలంకరించి ఉంది. తన తల్లి, మావయ్య, అత్తయ్య, కళ్యాణ్ భార్య కల్పన, పిల్లలు, ఇంటిల్లిపాది, ఎదురొచ్చారు, కుశల ప్రశ్నలు వేశారు.

మురళి వాళ్ళ స్నానాలు అవీ అయ్యాక, అందరూ ఒక చోట చేరారు. మురళి అత్తయ్య, చేతిలో ఓ చిన్న వెండి పాత్ర, చెంచాతో వచ్చింది. అందరి అరచేతిలో, ఒకరి తరువాత ఒకరికి, ఉగాది పచ్చడి వేసింది. ఆ రోజు, ఉగాది, యుగాది. మురళి జీవితంలో, ఓ నవ్య శకం, ఆరంభమయింది.

ఆ క్షణంలో, మురళి మనసు, ఆనందడోలికలో, ఊగులాడింది. పట్టరాని సంతోషంతో  కళ్ళు చెమర్చాయి. ఎంతో కాలంగా, కలలు కంటున్నాడు, ఆ అద్భుత క్షణాలు వచ్చాయి. తన రామాపురంలో, తను, ఉన్నాడు. ఉగాది పండుగ, జరుపుకుంటున్నాడు. తరువాత బ్రేక్‌ఫాస్ట్‌లో వేడి వేడి గారెలు, పరవాణ్ణము ఆరగించారు.

“పద బావ, ఇల్లు చూద్దువు గాని” అన్నాడు కళ్యాణ్. ఇల్లంతా తిప్పి, చూపించాడు.

ఇంటి పైకప్పు, టేకు కలప కమ్మీలపై అమర్చి ఉంది. రేనోవేట్ చేసినా, ఇంకా దశాబ్దాల నాటి, పాత వాసనలు ఇంట్లో అణువణువునా, తొంగిచూస్తున్నాయి. ఓ గదిలోకి, అడుగిడగానే, ఎదురుగా ఉన్న, పందిరి మంచాన్ని చూసి, ఆశ్చర్యపోయాడు.

ఎత్తుగా ఉన్న మంచం. మంచానికి రెండువైపులా, లతలు, నెమళ్ళ బొమ్మలు నగిషీలు చెక్కి, ఉన్నాయి. మంచానికి, దగ్గరగా వెళ్లి కూర్చోబోయి, ఆగిపోయాడు.

మురళి మనసుని, సంధిగ్ధాన్ని, గ్రహించిన, కళ్యాణ్, “కూర్చో బావ, ఈ మంచం తాతగారిది” అన్నాడు.

అరచేతులు పరుపుపై ఆనించి, మెల్లగా మంచంపై కూర్చున్న, మురళికి, తను, తన తాతగారి సందిట్లో కూచున్న, భావన కలిగింది.

“సరే, నేను ఊరు చూసి వస్తాను” అని బయలుదేరుతుంటే, మేనమామ పిలిచి, కొన్ని సూచనలు ఇచ్చాడు.

ఉత్సాహంతో కూడిన, కుతూహలంతో, వీధుల వెంట నడుస్తూ, రెండు సందుల ఆవల ఉన్న, వీధిలోకి నడిచాడు, మురళి. ఎదురుగా ఉన్న, స్కూల్ బిల్డింగ్ వంక చూస్తూ, భావావేశానికి లోనయ్యాడు.

మేనమామ చెప్పిన విషయం, గుర్తు చేసుకుని, ఆ స్కూల్ బిల్డింగ్ స్థానంలో, ఓ పాకని, ఆ పాకలో పంచె, లాల్చీ ధరించి, చేతిలో బెత్తంతో, పిల్లల చేత, అ, ఆ, ఇ, ఈ.. లు దిద్దిస్తూ, ఎక్కాలు వల్లె వేయిస్తూ, తన పెదనాన్నగారు, నిలబడి ఉన్న, దృశ్యం మురళి కళ్ళ ముందు కదలాడింది.

అక్కడి నుంచి, మామయ్య ఇచ్చిన సూచనలనుసరించి, పక్క వీధిలోకి వెళ్లి, పాతిక అడుగులు ముందుకేసి, ఓ ఇంటి ముందు ఆగాడు మురళి. ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఇల్లు పాతబడి పోయింది. అది తన నాన్నగారి వాళ్ళ, సొంత ఇల్లు. తన మేనత్త పెళ్లి కోసం, అమ్మేసిన ఇల్లు. ఆ ఇంట్లో, తన తండ్రి, పెదనాన్నగారు వాళ్ళు, నడయాడిన దృశ్యాన్ని, ఊహించుకుని  భావోద్వేగానికి లోనయ్యాడు. కళ్ళలో, భావోద్వేగాశ్రువులు పొంగి, చెక్కిళ్ళు తడిసాయి. కళ్ళు మసకబారాయి. చాలాసేపు, ఆ ఇంటి వంక చూస్తూ, నిలబడి పోయాడు. ఎప్పటికో తేరుకుని, భారమైన హృదయంతో, మాటిమాటికీ, వెనక్కి తిరిగి, ఆ ఇంటిని చూస్తూ, మెల్లిగా ముందుకు కదిలాడు.

అక్కడి నుంచి, చెరువు గట్టున ఉన్న, గంగానమ్మ గుడి దగ్గరికి, వచ్చాడు. గుడి ముందు, సుమారుగా వంద గజాల విస్తీర్ణాన్ని ఆవరించి, చుట్టూ ఊడలతో, ఓ జమ్మి చెట్టు ఉంది. నాన్నగారు, తోటి నేస్తాలతో, ఈ చెట్టు కింద ఆటలాడుకున్నారేమో అనుకున్నాడు మురళి.

గుళ్ళోకి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. అక్కడి నుంచి, విష్ణాలయానికి వెళ్ళాడు. తను ఊహించుకున్న, రామాపురం దృశ్యాలని, ప్రత్యక్ష వీక్షణతో, బేరీజు వేసుకుంటూ, చాలాసేపు చెరువు గట్టు మీద, పిల్ల కాలవ వెంట, పొలాల గట్ల మీద , తాటి తోపుల్లో తిరుగుతూ, ఎప్పటికో, మామయ్య ఇల్లు చేరాడు.

“ఊరంతా చూసావా”, అన్న మేనమామ ప్రశ్నకి సంతృప్తితో కూడిన, చిరునవ్వుతో బదులిచ్చాడు.

మర్నాడు, కళ్యాణ్ కారులో వెళ్లి, మోపిదేవిలో, సుబ్రహ్మణ్యస్వామిని, శ్రీకాకుళంలో, శ్రీకాకుళాంధ్ర విష్ణువుని, దర్శించుకున్నారు. ఈ శ్రీకాకుళాంధ్ర విష్ణువు ఆలయంలోనే, ఆ విష్ణు భగవానుని ఆజ్ఞని అనుసరించి, శ్రీ కృష్ణదేవరాయల వారు, ఆముక్తమాల్యద కావ్యం రచించారు. మొవ్వలో, వేణుగోపాలస్వామి దర్శనం చేసుకున్నారు. ఈ మొవ్వలోనే, మహా కవి, వాగ్గేయకారుడైన క్షేత్రయ్య తన ఇష్ట దైవమైన వేణుగోపాలుని స్తుతిస్తూ చేసిన సృజనలు, సాహితి జగత్తులో, క్షేత్రయ్య పదాలుగా నిలిచిపోయాయి.

అదే రోజు సాయంత్రం మురళి, విమలలు హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణమయ్యారు.

విజయవాడ వరకు కారులో డ్రాప్ చేస్తాను, అన్న, కళ్యాణ్ మాటని, సున్నితంగా తిరస్కరిస్తూ, “వద్దులే, మేము బస్సులో వెళ్తాము”, అన్నాడు.

అందరికి, వీడ్కోలు చెప్పి, పల్లె వెలుగు బస్సులో పామర్రు వరకు, మరో బస్సులో విజయవాడ చేరారు. హోటల్ మమతాలో డిన్నర్ ముగించుకుని, రైల్వే స్టేషన్‌కి వచ్చారు.

టైం తొమ్మిది దాటింది. రామాపురంలో, గడిపిన క్షణాలని, తలచుకుంటూ, ఆనంద పారవశ్యంలో మునిగిపోయాడు, మురళి. ఆలోచనల్లో, ఓ గంట దాటిపోయింది. ట్రైన్ వచ్చింది. నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌ లోనే, హైదరాబాద్‌కి వారి తిరుగు ప్రయాణం. ట్రైన్ ఎక్కిన, కాసేపటికి, టి.టి.యి. వచ్చాడు. చెకింగ్ అయినాక, టికెట్స్‌ని, విమల చేతి కందిస్తూ, వీటిని కూడా జాగ్రత్త చెయ్యి, అన్నాడు, మురళి.

తెల్లవారు జామున, ఐదింటికి, హైదరాబాద్‌లో, తమ ఇంటికి, చేరుకున్నారు. ఫ్రెష్ అయ్యి, ఆఫీసులో, తను రామాపురం వెళ్లే ముందు, పెండింగ్ లో ఉన్న, వర్క్ గురించి, ఆలోచించసాగాడు, మురళి. ఆలా, ఆలోచిస్తూ ఉండగా, ఓ ఇరవై రోజుల క్రితం, శివ రావు, ఆఫీసులో తన రూమ్‌కి వచ్చినప్పటి సంఘటన, కళ్ళ ముందు మెదిలింది.

ఆ రోజు తన రూమ్ కిటికీ వద్ద నిలబడి, టెలిఫోన్ భవన్‌ని, రోడ్ మీద ట్రాఫిక్ని చూస్తున్న మురళి, తన వెనుకగా, తలుపు తెరచిన శబ్దాన్ని, అడుగుల చప్పుడుని విని, వెనక్కి తిరిగి చూసాడు. శివ రావు లోనికి, వచ్చాడు. వస్తూనే, సంతోషంగా, నవ్వులు చిందిస్తూ, మురళికి దగ్గరగా వచ్చి, ఆలింగనం చేసుకుంటూ, “కంగ్రాట్యులేషన్స్, మొత్తానికి సాధించావ్” అన్నాడు. తన జేబులో నుంచి, ఓ లెటర్ తీసి, మురళి చేతికి, అందించాడు. ఆతృతగా, ఆ లెటర్ మడతలు విప్పి, చూడగానే, మునుపెప్పడూ ఎరుగని అనందం, ప్రశాంతత, సంతృప్తి మురళి మనసులో, చోటు చేసుకున్నాయి.

ఆ లెటర్‌లో, “ఇటీజ్ టు ఇంటిమేట్ దట్, కాంపిటెంట్ అథారిటీ హాస్ అప్రూవ్డ్ ది చేంజ్ అఫ్ యువర్ హోమ్ టౌన్ ఫ్రమ్ హైదరాబాద్ టు రామాపురం ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్ర ప్రదేశ్” అని వ్రాసి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here